
మాంద్యం ప్రభావం భారత్‌పై లేదు: చిదంబరం
న్యూఢిల్లీ: దేశ సమగ్ర ఆర్ధికాభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం ప్రకటించారు. లోక్సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన చదివి వినిపించారు. మన ఆర్ధిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. అయితే ప్రపంచ ఆర్ధిక మాంద్యం భారత్‌పై పెద్దగా ప్రభావం చూపలేదని ఆయన చెప్పారు. మన ఆర్థిక మూలాలు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయన్నారు. గత ఆర్ధిక సంవత్సరం ఆర్థిక ద్రవ్యలోటు తగ్గిందని వెల్లడించారు. ఎగుమతులు స్వల్పంగా పెరిగాయన్నారు.
ఆహార ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తున్నా తగ్గుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉత్పత్తి రంగంలో తగ్గుదల ఆందోళన కలిగిస్తోందన్నారు. దిగుమతులు తగ్గించడంలో సఫలమయ్యామని తెలిపారు. గత దశాబ్దితో అంచనాల కంటే ఎక్కువగా ఉద్యోగ కల్పన జరిగిందని చిదంబరం తెలిపారు. యూపీఏ సగటు వృద్ధిరేటు సూచికలు ఎన్డీఏ హయాం కంటే మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు. ఆధార్కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికి 57 కోట్ల మంది ఆధార్ లోకి వచ్చారని తెలిపారు.