
అహ్మదాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సబర్మతి ఆశ్రమంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఉన్నట్లుండి ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటిన ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. వేడి కారణంగా డీహైడ్రేషన్‌తో ఆయన అస్వస్థతకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
#WATCH | Ahmedabad, Gujarat: Congress leader P Chidambaram fell unconscious due to heat at Sabarmati Ashram and was taken to a hospital. pic.twitter.com/CeMYLk1C25
— ANI (@ANI) April 8, 2025
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అయిన చిదంబరం 79 ఏళ్ల వయసులోనూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు. కేంద్రంలోని బీజేపీపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా.. తమిళనాడు రామేశ్వరంలో పాంబన్ వంతెనను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన బడ్జెట్ వ్యాఖ్యలకూ ఆయన కౌంటర్ ఇచ్చారు.
‘‘ప్రధాని సహా కేంద్రమంత్రులు 2004-14తో పోలిస్తే.. 2014-24 మధ్య కాలంలో తమిళనాడుకు అధికంగా నిధులు ఇచ్చామని పదే పదే చెబుతున్నారు. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం గతంలో కంటే ఏడు రెట్లు నిధులు పెంచామని ప్రధాని చెప్పారు. ఫస్టియర్ ఎకానమీ విద్యార్థిని అడగండి. ‘ఎకానమీ మ్యాట్రిక్’ ఎప్పుడూ గతేడాది కంటే ఎక్కువగానే ఉంటుందని చెబుతారు. జీడీపీ గతంలో కంటే ఇప్పుడు పెరిగింది. కేంద్ర బడ్జెట్ మొత్తం మునుపటి కంటే పెరుగుతుంది. ప్రభుత్వ మొత్తం ఖర్చూలూ అంతే. మీ వయసు కూడా గతేడాది కంటే పెరిగింది. అంకెల పరంగా ఆ సంఖ్య పెద్దగానే కనిపించి ఉండొచ్చు. కానీ, జీడీపీ పరంగా లేదా మొత్తం వ్యయ నిష్పత్తి పరంగా అది ఎక్కువగా ఉందా?’’ అని ప్రశ్నించారు.