సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుల నిరీక్షణ ఫలించింది. రెండున్నరేళ్ల క్రితం 7,561 మంది ఈజీఎస్ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెకు వెళ్లడంతో వారిని విధుల నుంచి తప్పించిన విషయం విదితమే. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
దీంతో గతంలో వారిని తప్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుంది. ఈనెల 11వ తేదీ నుంచి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు జిల్లా కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తొలిసారిగా 2007 ఫిబ్రవరిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ల విధానాన్ని తీసుకొచ్చింది. ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించి వారికి ఉపాధి హామీ కూలీల మస్టర్ రోల్స్ రాయడం, పనులను పర్యవేక్షించడం, తదితర బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
ఆ తర్వాత జాబ్ కార్డులున్న వాళ్లలో సాధ్యమైనంత ఎక్కువ మందిని ఉపాధికి వచ్చే విధంగా చూడాలని, తప్పనిసరిగా విధుల్లో ఉండాలని అధికారులు ఆదేశించారు. ఆ తరువాత తమకు జీతాలు సబ్‌ట్రెజరీ ద్వారా ఇవ్వాలని, తమను శాశ్వత ప్రాతిపదికన నియమించాలనే పలు రకాల డిమాండ్లతో విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వం వారి సేవలను రద్దు చేసింది.
తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ పలుమార్లు ప్రభుత్వానికి వినతులు సమర్పించారు. ఈ అంశాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ బుధవారం సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేస్తూ... తామంతా విధుల్లో చేరతామని ప్రకటించారు. పలుచోట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment