mgnregs
-
‘ఉపాధి’కి గడ్డు రోజులు?
సాక్షి, హైదరాబాద్: త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివిధ రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలున్న చోట్ల ఈ పథకం సరిగా అమలు కావడం లేదని, చేపట్టిన పనులు సరిగా లేవని, నిధులు పక్కదారిపట్టడమో లేక వినియోగం సరిగా లేకపోవడమో జరుగుతోందన్న అభిప్రాయంతో కేంద్రం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల్లో పటిష్ట అమలు ద్వారా నిర్దేశిత లక్ష్యాల సాధన, కచ్చితమైన ప్రయోజనం కలిగేలా చేయాలన్న ఆలోచనతో ఆయా రాష్ట్రాల్లో పరిశీలనకు ఓ టాస్క్‌ఫోర్స్‌ను కేంద్రం నియమించింది. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం పూర్తి చేసిన టాస్క్‌ఫోర్స్ ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదిక సమర్పించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ పథకంలో భారీగా మార్పులు జరగొచ్చునని, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు చేసే బడ్జెట్ కేటాయింపులు కూడా తగ్గొచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పథకానికి గడ్డురోజులు తప్పవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి నిధులు తగ్గిపోతాయా? కేంద్రం రాష్ట్రానికి రెండేళ్ల క్రితం చేసిన కేటాయింపులతో పోల్చితే 2023–24 బడ్జెట్లో అధిక కేటాయింపులు ఉండక పోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీలకు.. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ద్వారా లైవ్ లొకేషన్లో హాజరు నమోదును కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తప్పనిసరి చేసింది. దీంతో పాటు కూలీలు, వారి కుటుంబాల జాబ్ కార్డులను వారి వారి ఆధార్ నంబర్లతో అథెంటికేషన్ చేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో చేసిన పనికి కూలీ మొత్తం బ్యాంక్ ఖాతా ల్లో పడే అవకాశం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎన్ఎంఎంఎస్ యాప్‌లో కూలీల హాజరు నమోదు క్షేత్రస్థాయిలో ఇబ్బందులెదురవుతున్నాయి. కూలీల జాబ్ కార్డులతో ఆధార్ అథెంటికేషన్ పూర్తికాలేదు. దీంతో నిధులు తగ్గే అవకాశం ఉందంటున్నారు. క్రమంగా తగ్గిపోతున్న కేటాయింపులు.. దేశవ్యాప్తంగా 2022 ఏప్రిల్–డిసెంబర్ల మధ్య 5.56 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద పనులు కోరాయి. అంతకుముందు ఏడాది అవే నెలలతో పోల్చితే కోటి కుటుంబాల మేర తగ్గుదల నమోదైంది. ఈ నేపథ్యంలోనే 2023–24 బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయనేది చర్చనీయాంశమైంది. 2019–20లో రూ.71,687 కోట్లు కేటాయించారు. కానీ కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో 2020–21లో రూ.1.11 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించారు. కానీ 2021–22కు వచ్చేసరికి రూ.98 వేల కోట్లకు, 2022–23లో రూ.73 వేల కోట్లకు దిగజారింది. ఈ నిధులు సరిపోకపోవడంతో సప్లిమెంటరీ గ్రాంట్ల కోసం గత డిసెంబర్లో కేంద్రానికి విజ్ఞప్తులు వెళ్లాయి. ఈ పరిస్థితుల్లోనే 2023–24 బడ్జెట్ పెరుగుతుందా లేదా అన్న సందిగ్థత నెలకొంది. తగ్గించే అవకాశమే ఉంది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ పథకం కింద చేసే ఖర్చును కేంద్రం తగ్గించింది. అందువల్ల వచ్చే ఆర్థిక ఏడాదిలో ఈ పథకానికి చావా రేవా? అన్న సమస్య ఉత్పన్నం కావొచ్చు. ఎన్ఎంఎంఎస్ యాప్ అమల్లోకి తీసుకురావడం, జాబ్‌కార్డులతో ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి వంటి వాటితో కూలీలు ఈ పథకం నుంచి దూరమవుతున్నారు. ఈ ఏడాది ఉపాధి హామీ పథకం కింద వ్యయం తక్కువైనందున, దానిని సాకుగా చూపి బడ్జెట్ కేటాయింపులు తగ్గించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఈ పథకం కింద 2021– 22లో రూ.4 వేల కోట్లు ఖర్చు కాగా, 2022– 23లో రూ.2,087 కోట్ల వ్యయమే చేశారు. ఈ నేపథ్యంలో వివిధ పనుల కోసం ఇవ్వాల్సిన రూ.1,100 కోటను కూడా నిలిపేసింది. వచ్చే బడ్జెట్లో ఈ పథకానికి నిధులు ఎలా ఉంటాయోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. – చక్రధర్ బుద్ధా, డైరెక్టర్, లిబ్టెక్ ఇండియా -
విధుల్లోకి ఫీల్డ్ అసిస్టెంట్లు...కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుల నిరీక్షణ ఫలించింది. రెండున్నరేళ్ల క్రితం 7,561 మంది ఈజీఎస్ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెకు వెళ్లడంతో వారిని విధుల నుంచి తప్పించిన విషయం విదితమే. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో గతంలో వారిని తప్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుంది. ఈనెల 11వ తేదీ నుంచి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు జిల్లా కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తొలిసారిగా 2007 ఫిబ్రవరిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ల విధానాన్ని తీసుకొచ్చింది. ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించి వారికి ఉపాధి హామీ కూలీల మస్టర్ రోల్స్ రాయడం, పనులను పర్యవేక్షించడం, తదితర బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఆ తర్వాత జాబ్ కార్డులున్న వాళ్లలో సాధ్యమైనంత ఎక్కువ మందిని ఉపాధికి వచ్చే విధంగా చూడాలని, తప్పనిసరిగా విధుల్లో ఉండాలని అధికారులు ఆదేశించారు. ఆ తరువాత తమకు జీతాలు సబ్‌ట్రెజరీ ద్వారా ఇవ్వాలని, తమను శాశ్వత ప్రాతిపదికన నియమించాలనే పలు రకాల డిమాండ్లతో విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వం వారి సేవలను రద్దు చేసింది. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ పలుమార్లు ప్రభుత్వానికి వినతులు సమర్పించారు. ఈ అంశాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ బుధవారం సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేస్తూ... తామంతా విధుల్లో చేరతామని ప్రకటించారు. పలుచోట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. -
ఉపాధి పనికి ఆలయ అర్చకుడు
కొడకండ్ల: జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని పురాతన శివాలయం అర్చకుడు పిండిప్రోలు నాగదక్షిణామూర్తి ఉపాధిహామీ పథకం పనుల్లో పాల్గొన్నాడు. ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ పీఆర్సీ ఫిట్మెంట్ 30% కల్పిస్తూ వేతనాలు పెంచిన తెలంగాణ సర్కారు అర్చకులను విస్మరించడాన్ని నిరసిస్తూ ఉపాధి పనులకు వెళ్లినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల గౌరవవేతనంలో రూ. 2 వేల వరకు సామగ్రికి వెచ్చిస్తున్నామని, అదికూడా రెండు, మూడు నెలలకు ఒకసారి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్చకులకు నెలకు రూ.15 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
దినసరి కూలీకి భారీ షాక్.. చివరికి..
రాంచీ: రోజుకు 198 రూపాయలు సంపాదించే కూలీకి జీఎస్టీ డిపార్టుమెంటు భారీ షాకిచ్చింది. అక్షరాలా మూడున్నర కోట్ల మేర పన్ను ఎగవేశారంటూ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో సదరు కూలీ ఇంటికి చేరుకున్న పోలీసులు గురువారం ఆయనను అరెస్టు చేశారు. వివరాలు.. జార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూం జిల్లాలోని రాణీపహారీ గ్రామానికి చెందిన లాడన్ ముర్ము నిరుపేద. తన కుటుంబంతో కలిసి పూరి గుడిసెలో నివసిస్తున్నాడు. జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుడైన అతడు కూలీగా పనిచేస్తూ జీవనం గడుపుతున్నాడు. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబరులో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు ఆయన ఇంటికి వచ్చారు. ఎంఎస్ స్టీల్ కంపెనీ ఎండీ అయిన ముర్ము రూ. 3.5 కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడ్డారని, ఈ మొత్తం చెల్లించకపోతే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. (చదవండి: రూ. 10 లక్షల లంచం: బీజేపీ కౌన్సిలర్ సస్పెండ్) ఈ నేపథ్యంలో పలుమార్లు ఆయనకు నోటీసులు జారీ చేయగా.. కంపెనీ గురించి తనకేమీ తెలియదని, తన వద్ద డబ్బు లేదని సమాధానమిచ్చారు. దీంతో గురువారం ముర్ము ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తుల నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో సాయంత్రం విడిచిపెట్టారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ విషయం గురించి ఎస్ఎస్పీ డాక్టర్ ఎం. తమిల్ వణన్ మాట్లాడుతూ.. ‘‘గతేడాది తాము పంపిన నోటీసులకు బదులివ్వని కారణంగా ఎంఎస్ స్టీలు కంపెనీ ఎండీ లాడన్ ముర్ముపై జీఎస్టీ డిపార్టుమెంటు ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. దీంతో మా బృందం గురువారం ఆయన ఇంటికి చేరుకుంది. ఎంజీఎన్ఆర్ఈఏ పథక లబ్దిదారు అయిన ముర్ము పాన్, ఆధార్ కార్డును ఉపయోగించి కొంతమంది ఉద్దేశపూర్వకంగానే మోసానికి పాల్పడ్డట్లు తెలిసింది. లోతుగా దర్యాప్తు చేస్తున్నాం’’ అని వెల్లడించారు.( చదవండి: అస్తిత్వం కోసం ఆదివాసీల ఆరాటం) ఇక బాధితుడు ముర్ము స్పందిస్తూ.. ‘‘వరుసకు కుమారుడయ్యే బైలా ముర్ము 2018లో నా కో-ఆపరేటివ్ బ్యాంకు పాస్‌బుక్, పాన్, ఆధార్ కార్డు తీసుకున్నాడు. నా అకౌంట్‌ను ప్రభుత్వం ప్రతినెలా రూ. 2 వేలు జమ చేస్తుందని చెప్పాడు. ఈ పత్రాలన్నింటిని తన అల్లుడు సునరం హేంబ్రంకు ఇచ్చినట్లు తెలిసింది. సునరం వీటిని జంషెడ్‌పూర్‌కు చెందిన సుశాంత్ కుమార్ సమాంటోకు ఇచ్చాడట. వాటితో వాళ్లు ఏం చేశారో నాకు తెలియదు. జీఎస్టీ శాఖ నాకు నోటీసులు ఇచ్చింది. దీంతో జంషెడ్‌పూర్‌లోని జీఎస్టీ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చాను. నా పేరు మీద ఉన్న కంపెనీ గురించి, దాని లావాదేవీలతో సంబంధం లేదని చెప్పాను. నేను రోజూవారీ కూలీని. పనిచేస్తేనే ఆరోజు నా కడుపు నిండుతుంది. గతేడాదే నా భార్య చనిపోయింది. నా కొడుకుతో కలిసి గుడిసెలో జీవితం వెళ్లదీస్తున్నా’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. -
కూలీలతో సహ‘వాసం’
కాటారం: ఆయన జిల్లా బాస్.. అంతకుమించి మేజిస్ట్రేట్ కూడా. ఇవన్నీ పక్కన పెట్టి కూలీలతో కలసి పలుగు పట్టారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. కాటారం మండలం గంగారంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపలకుంటలో చేపట్టిన పనులను గురువారం కలెక్టర్ బుల్లెట్‌పై వెళ్లి పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీలతోపాటు పలుగు పట్టి మట్టి తవ్వగా ఇతర అధికారులు తవ్వి న మట్టిని ఎత్తిపోశారు. అనంతరం కూలీలతో ముచ్చటించి వారి బాగోగులు తెలుసుకున్నారు. స్వయంగా కలెక్టర్ తమతో కలసి పనిచేయడం, ఆప్యాయంగా పలకరించడంతో కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. -
ఊరించి..ఉసూరుమనిపించి..!
సాక్షి, బొబ్బిలి రూరల్: నియోజకవర్గంలో ఇంతకు ముందు చేసిన ఉపాధి పథకం కింద చేసిన అభివృద్ధి పనులకు కోట్ల రూపాయల మేర బిల్లులు చెల్లింపులు చేయాల్సి ఉంది. అధికారులు, పాలకులు అదిగో, ఇదిగో అంటూ ఊరించి చివరకు చేతులెత్తేశారు. ఒక వైపు ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపుతున్నారని, మరో వైపు సీఎఫ్ఎంఎస్ ఫ్రీజింగ్ తమను ఆర్థికంగా ముంచేశాయని పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు, 2 నెలలుగా వేతనాలు అందక వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకటనలే మిగిలాయి.. సర్వశిక్షా అభియాన్ పేరిట ప్రహరీలు నిర్మించేందుకు గానూ నిధులకు ఎలాంటి డోకా లేదని ప్రకటనలు గుప్పించారు అధికారులు, పాలకులు. తీరా పనులు చేసిన తర్వాత వాటి బిల్లులు పెండింగ్‌లో ఉంచేయడంతో కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి పథకంలో రోడ్లు పనులు చేయించి కోట్లలో బకాయిలు ఉంచేశారని వారు చెబుతున్నారు. నియోజకవర్గంలో దాదాపు రూ.2.5 కోట్ల మేర బిల్లులు చెల్లింపులు జరగాల్సి ఉంది. అంగన్వాడీ, పంచాయతీ భవనాలు, గ్రామీణ పశువైద్య కేంద్రాలు ఇలా ఏ పనులు చేపట్టినా నిబంధనల పేరిట త్వరగా పూర్తి చేయించి ఆనక చేతులెత్తేశారు. దీంతో పలువురు చేతిలో డబ్బులు లేక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నీరు–చెట్టు పనులకు కూడా పలువురుకి చెల్లింపులు చేయలేదు. రెండు నెలలుగా రాని వేతనాలు.. ఇక ఉపాధి పనులు చేసిన వేతనదారులకు 2 నెలలుగా చెల్లింపులు జరగలేదు. పని చేసినా తమకు వేతనాలు ఇవ్వకపోతే ఎలా అని వేతనదారులు అధికారులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు రూ.కోటి మేర వేతన బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు. రూ. 40 లక్షల వరకు బకాయి.. బొబ్బిలి మండలంలో దాదాపు రూ.40 లక్షల వరకు వేతన బకాయి ఉంది. జనవరి వరకు చెల్లింపులు జరిగాయి. మరో 10 రోజుల్లో చెల్లింపులు జరగొచ్చని భావిస్తున్నాం. – కె.కేశవరావు, ఉపాధి ఏపీఓ, బొబ్బిలి. బకాయి వాస్తవమే.. నియోజకవర్గంలో రోడ్ల బిల్లులు సుమారు రూ.2 కోట్లకు పైగా చెల్లించాల్సిన మాట వాస్తవం. నిధులు ఉన్న మాట వాస్తవమే. కానీ కొన్ని ఆటంకాలు ఉన్నాయి. వాటి వల్ల చెల్లింపులు జరగడం లేదు. సమస్యను ఉన్నతాధికారులకు నివేదించాం. వారి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. – డబ్ల్యూవీవీఎస్ శర్మ, డీఈ, పంచాయతీ రాజ్, బొబ్బిలి. రూ.20 లక్షలు రావాల్సి ఉంది.. గ్రామంలో అనేక పనులు చేశా. వాటి బిల్లులు రూ.20 లక్షలకు పైగా రావాల్సి ఉంది. రోజూ కార్యాలయాలకు వెళ్లడం వచ్చేయడమే జరుగుతుంది. వడ్డీలు పెరిగి పోతున్నాయి. ఇలా అయితే ఎలా కష్టమే. – పాటూరు కృష్ణమూర్తి, ప్రజాప్రతినిధి, కలువరాయి. -
మస్టర్లలో మాయ
అనంతపురం టౌన్: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్)లో అక్రమాలు యథేచ్ఛగా చోటు చేసుకుంటున్నాయి. కూలీలకు పని కల్పించడం పక్కన పెడితే కొందరు సీనియర్ మేట్లు, క్షేత్రసహాయకులు ఈ పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఉపాధి హామీ పథకం అమలు కోసం జిల్లా వ్యాప్తంగా 12 క్లస్టర్లుగా విభజించారు. ప్రతి క్లస్టర్‌కూ ఒక ఏపీడీతోపాటు ప్రతి మండలానికీ ఏపీఓలు, ఎంపీడీఓలు ఉపాధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. మస్టర్లలో నమోదైన కూలీలే క్షేత్రస్థాయిలో పనులు చేస్తున్నారా లేదా అని సరిపోల్చాలి. అయితే అధికారులు క్షేత్రస్థాయిలో ఉపాధి పనుల పరిశీలనకు వెళ్లిన దాఖాలాలే కనిపించడం లేదు. ధర్మవరం క్లస్టర్లో మూడేళ్లుగా బినామీ పేర్లను మస్లర్లలో నమోదు చేసి బిల్లులు డ్రా చేస్తున్నా అధికారులు గుర్తించలేదు. ఒకవేళ వారి దృష్టికి వచ్చినా చేతివాటాలు ప్రదర్శిస్తూ ‘మమ’ అనిపిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. గుంతకల్లు మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి కూలీలు పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్లిన సమయంలో అధికారులు ఉపాధి పనులను పరిశీనకు వెళ్తున్నారంటూ ఇటీవలే ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ♦ కనగానపల్లి మండలం గుంతపల్లికి చెందిన ఓ మహిళకు 12133201516000 140 నంబరుపై ఉపాధి కూలీ జాబ్‌కార్డు ఉంది. ఈమె 2014 నుంచి 2018 మార్చి 22 వరకు దశల వారీగా ఉపాధి పనికి వెళ్లినట్లు నమోదు చేసి రూ.70 వేల వరకు నిధులు డ్రా చేశారు. వాస్తవానికి ఈమె హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సు. అయినా ఈమె ఉపాధి పనులకు వస్తున్నట్లు మస్టర్లలో నమోదైంది. ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి మడకశిర ప్రాంతంలోని ఒక జూనియర్ కళాశాలలో లెక్చరర్. ఈయన పేరిట సైతం మస్టర్లో కూలీగా పేరు మోదు చేసి నిధులు దండుకున్నారు. మండల అధికారులతో క్షేత్ర సహాయకులు కుమ్మక్కై బోగస్ మస్టర్లు సృష్టించి బినామీ కూలీల పేర్లతో నిధులు కొల్లగొడుతున్నట్లు స్పష్టమవుతోంది. ♦ గుంతకల్లు మండలం నాగసముద్రం, కసాపురం, వెంకటాంపల్లి గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి పనుల వద్ద కూలీల వివరాలను ఈ – మస్టర్లలో నమోదు చేయడంలేదు. సాంకేతిక లోపం ఉండడంతో మ్యానువల్ మస్టర్లలోనే వివరాలను నమోదు చేసి అప్డేట్ చేస్తున్నారు. ఇదే అక్కడి ఉపాధి హామీ సిబ్బందికి కలిసివచ్చింది. మ్యానువల్ మస్టర్లను సైతం పని ప్రదేశంలోకి తీసుకురారు. దీంతో 100 మంది కూలీలు పనులకు హాజరైతే మరో 20–30మంది బినామీ కూలీల పేర్లను నమోదు చేసి నిధులను డ్రా చేస్తున్నారు. ఇక్కడ ఏకంగా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారి పేర్లను నమోదు చేసినట్లు తెలుస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం పనులకు హాజరు కాకపోయినా ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు మస్టర్లలో నమోదు చేసి ఉపాధి నిధులు పక్కదారి పట్టించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – జ్యోతిబసు, డ్వామా పీడీ -
మళ్లీ రోడ్డు పైకి శ్రీరెడ్డి
సాక్షి, ఎర్రగొండపాలెం : టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతూ సంచలనంగా వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. సినీ ప్రముఖులపై విమర్శలు చేస్తూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. గతంలో టాలీవుడ్లో మహిళలపై జరుగుతున్న దారుణాలను ఆమె తీవ్రంగా ఖండించారు. సినీ పరిశ్రమలో మహిళలకు అండగా ఉంటానంటూ ఇటీవల ఆమె ప్రకటించారు. తాజాగా ఆమె మరోసారి రోడ్డుపై నిరనస వ్యక్తం చేశారు. అయితే ఈసారి సినీ పరిశ్రమ గురించి కాకుండా ఉపాధి కూలీలు చేస్తున్న నిరసనకు ఆమె మద్దతు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీరెడ్డి శ్రీశైలం వెళ్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం, గురిజేపల్లి సమీపంలో కొందరు తమకు ఉపాధి పనులు కల్పించడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. అటుగా వెళ్తున్న శ్రీరెడ్డి కారు దిగి, తలకు తలపాగా చుట్టుకొని స్థానికులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఆమెను చూసిన స్థానికులు అవాక్కయ్యారు. శ్రీరెడ్డి ఏంటీ.. ఇలా తమకు మద్దతు ఇవ్వడం ఏంటని విస్తుపోయారు. కాసేపు అక్కడ హడావుడి చేసిన ఆమె, స్థానికులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం తన కారులో అక్కడ నుండి వెళ్లిపోయారు. -
బోర్డులపై ‘ఉపాధి’ వివరాలు
భైంసా(ముథోల్) : ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద చేపడుతున్న పనుల్లో పారదర్శకత కోసం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సామాజిక తనిఖీలు పకడ్బందీగా నిర్వహిస్తుండగా, మరింత పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చింది. ఏటా గ్రామసభలు, మండలస్థాయిలో సామాజిక తనిఖీలు, జియో ట్యాగింగ్ చేపడుతోంది. ఇప్పుడు చేసిన పనులు మళ్లీ చేయకుండా వివరాలతో కూడిన బోర్డులను క్షేత్రస్థాయిలోనే ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా గ్రామాలకు ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనుల వివరాలు తెలుపుతూ రాసిన బోర్డులను పంపించింది. ఉన్న ఊళ్లోనే పని కల్పించేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో 1,53,551 జాబ్‌కార్డులను అందించింది. 3,20,829 మంది కూలీలు పని చేశారు. 40లక్షలకుపైగా పని దినాలు పూర్తిచేసిన కూలీలకు వేతనం కింద రూ.63.23కోట్లు చెల్లించారు. చేపడుతున్న అభివృద్ధి పనులు.. ఉపాధిహామీ పథకం కింద వ్యవసాయానికి సంబంధించిన పనులే అధికంగా చేస్తున్నారు. ఇంకుడుగుంతలు, నీటి కుంటలు, సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, గ్రామపంచాయతీ భవనాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పూడిక తొలగింపు, మట్టిరోడ్ల మరమ్మతుతోపాటు హరితహారం కింద మొక్కలు నాటుతున్నారు. ఇందుకు సంబంధించిన పనుల వివరాలు తెలుపుతూ ఇప్పటికే అధికారులు గ్రామాల్లో గోడలు నిర్మించి అందులో వివరాలు నమోదు చేశారు. చాలాచోట్ల బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు సూచిక బోర్డులు.. ఇప్పటివరకు ఇలా బోర్డుల ద్వారా ప్రదర్శించిన అధికారులు ఇక పనులను బట్టి సూచికలను మూడు రకాలుగా ఏర్పాటు చేయనున్నారు. మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, మట్టి పనుల వివరాలపై ఒక్కో బోర్డుకు రూ.350 ఖర్చుచేసి అందులో వివరాలు రాయనున్నారు. ఇలా వివరాలతో రాసిన బోర్డును పనులు జరిగిన ప్రదేశం వద్దనే ఏర్పాటు చేయనున్నారు. చెరువులు, కుంటల్లో పూడికతీత, రహదారుల నిర్మాణం, హరితహారం, నీటి నిల్వ గుంత, ఇంకుడుగుంతలు వంటి పనుల వివరాలు రూ.2వేల వ్యయంతో రాతి పలకంపై రాసి పని జరిగిన ప్రదేశంలో ఏర్పాటు చేయనున్నారు. ఇక గ్రామం మొత్తంలో జరిగిన పనుల వివరాలు ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలందరికీ తెలిసేలా గ్రామ సమాచార బోర్డుల పేరుతో గోడలపై రూ.3వేలు ఖర్చుచేసి రాయించనున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఈప్రక్రియ ప్రారంభమైంది. ఆయా బోర్డుల్లో ఎనిమిది నుంచి పది రకాల సమాచారం రాయిస్తున్నారు. పనిపేరు, గుర్తింపు సంఖ్య, చేసిన ప్రదేశం, అంచనా విలువ, కూలీల వివరాలు, వ్యయం, సామగ్రి వ్యయం, చేసిన పని దినాలు, ప్రారంభం, ముగింపు తేదీ తదితర విషయాలన్నింటినీ ఇందులో పొందుపరుస్తున్నారు. దీంతో చేసిన పనులు మళ్లీ చేసేందుకు వీలుపడదని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఏవైన అనుమానాలుంటే ఫిర్యాదు చేసేందుకు వీలుగా బోర్డుపైనే టోల్‌ఫ్రీ నంబర్లు రాయిస్తున్నారు. రికార్డుల నిర్వహణ బాధ్యత.. ఉపాధిహామీలో పనిచేసే ఫీల్డ్అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు కీలకబాధ్యతలు అప్పగిస్తున్నారు. పనుల గుర్తింపు మస్టర్లు వేయడానికే పరిమితం కాకుండా మరింత బాధ్యతను ఇస్తున్నారు. ఉపాధికి సంబంధించి ఏడు రకాల దస్త్రాల నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. దస్త్రాల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోల పర్యవేక్షణ ఉండనుంది. పనులు, గ్రామసభలు, కూలీలు, ప్రతిపాదనలు, పనుల గుర్తింపు, ఖర్చు, వేతనాలు, చెల్లింపులు, ఫిర్యాదులు తదితర వివరాలన్నింటినీ ఇకపై ఈ సిబ్బంది రికార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ రికార్డుల పర్యవేక్షణ టీఏలు, ఏపీవోలు ఎప్పటికప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతీనెల మూడో బుధవారం గుడ్‌గవర్నెస్ నిర్వహణపై సమావేశం ఏర్పాటుచేసి పనుల నిర్వహణ, రికార్డుల నిర్వహణపై ఈ సమావేశంలో పరిశీలించనున్నారు. ఈ నూతన విధానంతో ఉన్నతాధికారుల పర్యవేక్షణ జరిగినప్పుడు నోటిమాటలతో తప్పుడు లెక్కలు చెప్పే వీలుండదు. రికార్డుల రూపంలో ఉన్న సమాచారాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈ విధానంతో ఉపాధిహామీ పనులు రాబోయే రోజుల్లో మరింత పారదర్శకంగా మారి దుర్వినియోగం, అవినీతిని నివారించే అవకాశం ఉంటుంది. పారదర్శకంగా పనులు ఉపాధిహామీ పథకం అమలుకు జిల్లావ్యాప్తంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. అన్నిచోట్ల పారదర్శకంగానే పనులు నడుస్తున్నాయి. ఉపాధి సిబ్బందిపై నిరంతర పర్యవేక్షణ ఉంది. ఇప్పటికే చేసిన పనులపై గ్రామాల్లో కూడళ్ల వద్ద, బోర్డులపై రాయించడం జరిగింది. ఇక పనుల వివరాలు తెలుపుతూ క్షేత్రస్థాయిలోనూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. – వెంకటేశ్వర్లు, డీఆర్డీవో -
‘ఉపాధి’ పనులపై 76శాతం మందికి సంతృప్తి
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) పనులతో ఎంతో మంచి జరిగిందని ప్రజలు అనుకుంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఉపాధి పథకం పనుల నాణ్యతపై 76% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. తమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఇటీవల చేపట్టిన సర్వేలో కేవలం 0.5శాతం మంది మాత్రం ఉపాధి పనుల్లో నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొంది. గ్రామాల్లో ఉపాధి వనరులను కల్పించటం ద్వారా స్థిరమైన అభివృద్దికి అవసరమైన వనరులను సృష్టించటమే ఉపాధి హామీ పథకం ఉద్దేశం. దీనికోసం గత మూడేళ్లుగా చేపట్టిన అనేక పనులను పూర్తి చేసి, నాణ్యతను పెంచినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. దేశంలో 2016–17 కాలంలో దాదాపు 1.02 కోట్ల పనులను పూర్తి చేసినట్లు పేర్కొంది. -
ఉపాధికి వైకల్యం
= జిల్లాలో 20,377 మంది దివ్యాంగ కూలీలు = 150 రోజుల పని కల్పించింది ముగ్గురికే = వంద రోజులు పూర్తి చేసింది 145 మందే = 365 పంచాయతీల్లో ఏర్పాటు కాని సంఘాలు = క్షేత్రస్థాయిలో అవగాహన లోపమే కారణం అనంతపురం టౌన్ / నల్లమాడ : ఉపాధి హామీ పథకంలో దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఒక్కో దివ్యాంగుడికి ఏడాదికి 150 రోజుల పనిదినాలు కల్పించాలి. ఎక్కువగా నర్సరీల పెంపకం, మొక్కలు నాటడం, నీరు పోయడం, కూలీలకు నీరు అందించడం తదితర పనులు చేయించాలి. వారికి పనులు కల్పించాల్సిన బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్లది. అయితే చాలా మందికి ఈ విషయంపై అవగాహన లేదు. దివ్యాంగులకు కూడా తెలియని పరిస్థితి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రాజకీయ అండతో ఫీల్డ్ అసిస్టెంట్లు కొనసాగుతుండడంతో ఉన్నతాధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో వికలాంగుల శ్రమ శక్తి సంఘాలు (వీఎస్‌ఎస్‌ఎస్) ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా.. ఫీల్డ్ అసిస్టెంట్లు పట్టించుకోవడం లేదు. జిల్లాలో 1003 గ్రామ పంచాయతీల పరిధిలో 3,424 ఆవాస ప్రాంతాలున్నాయి. ఇందులో 638 గ్రామ పంచాయతీల పరిధిలోని 916 ఆవాస ప్రాంతాల్లో మాత్రమే వీఎస్‌ఎస్‌ఎస్‌లు ఏర్పాటయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 365 పంచాయతీల్లో అసలు సంఘాలే ఏర్పాటు చేయలేదు. కొన్ని మండలాల్లో ఇద్దరు, ముగ్గురు దివ్యాంగులు ముందుకు వస్తున్నా వారిని గ్రూపులుగా తయారు చేయడానికి ఫీల్డ్ అసిస్టెంట్లు వెనుకంజ వేస్తున్నారు. కొన్ని చోట్ల చేసిన పనులకు సైతం నెలల తరబడి బిల్లులు మంజూరు కాకపోవడంతో దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు. 150 రోజుల ఉపాధి ముగ్గురికే! జిల్లాలో దివ్యాంగులకు 20,377 జాబ్‌కార్డులు జారీ చేశారు. వీఎస్‌ఎస్‌ఎస్‌లు 1,172 ఉన్నాయి. ఈ ఏడాది 519 సంఘాల్లోని 1,906 మందికి 77,822 పనిదినాలు కల్పించారు. కూలి కింద రూ. 1,37,67,291 చెల్లించారు. సగటున ఒక దివ్యాంగ కూలీకి ఏడాదిలో 41 రోజులు మాత్రమే పని కల్పించారు. ఉపాధి హామీ పథకం కింద ఒక్కో కూలీకి కచ్చితంగా 150 రోజుల పని కల్పించాల్సి ఉండగా.. ఈ ఏడాది ముగ్గురికి మాత్రమే ఆ మేరకు కల్పించారంటే అధికారులు ఏ మేరకు పనులు చూపిస్తున్నారో అర్థమవుతోంది. ఇక వంద రోజుల పని కూడా 145 మందికి మాత్రమే కల్పించారు. ఈ పథకంలో లోటుపాట్లకు క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమన్నది స్పష్టంగా తెలుస్తున్నా.. ఉన్నతాధికారులు మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. కొన్ని మండలాల్లో అతి తక్కువ గ్రూపులను ఏర్పాటు చేశారు. మరికొన్ని మండలాల్లో ఉన్న గ్రూపులకూ పనులు కల్పించడం లేదు. -
అనంతలో ప్రారంభమై.. అంతటా విస్తరించి..
- పేద కూలీలకు పట్టెడన్నం పెట్టిన ఉపాధి హామీ పథకానికి పదేళ్లు - మహానేత వైఎస్సార్ చొరవతో కరువుసీమ అనంతలో ప్రారంభం.. ఆపై దేశమంతటా అమలు - ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ ఎన్‌ఆర్‌ఈజీఏను నీరుకార్చుతోందన్న కాంగ్రెస్ - ఫిబ్రవరి 2న బండ్లపల్లికి రాహుల్ గాంధీ: పీసీసీ చీఫ్ రఘువీరా వెల్లడి 2004.. పదేళ్ల ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడుతూ తెలుగు ప్రజలు మహానేత వైఎస్సార్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అప్పటికి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు. అందులో ప్రధానమైనది రాయలసీమలో ఆకలిచావులు. ఏ ఒక్కరూ ఆకలితో బాధ పడకూడదనే తన ఆశయాన్ని కేంద్రానికి వివరించిన వైఎస్సార్.. ప్రతిష్ఠాత్మక ఉపాధి హామీ పథకాన్ని మొట్టమొదట రాయలసీమలోనే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. 2005, ఫిబ్రవరి 2.. భారతదేశ చరిత్రలో పేరెన్నికగల పథకాల్లో అగ్రభాగాన నిలిచే ఉపాధి హామీ పథకం ప్రారంభమైనరోజు. వైఎస్సార్ అభ్యర్థన మేరకు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీలు అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి(బండమీదపల్లి)లో పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఉపాధిహామీ దేశమంతటా విస్తరించింది. మహానేత కనబర్చిన ప్రత్యేక శ్రద్ధ వల్ల దేశంలోని మిగతా రాష్ట్రాలకంటే ఏపీలోనే పథకం విజయవంతంగా నడిచింది. పేద కూలీలకు పట్టెడన్నం దొరికినట్టైంది. ఏపీలో ఈ పథకం జోరు చూసిన తర్వాతే ఉపాధి హామీని 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే మహానేత అకాలమరణంతో పేదవాడికి కూడుపెట్టే ఈ పథకం క్రమంగా నిర్వీర్యమవుతూవచ్చింది. ప్రస్తుతం అధికారంలోఉన్న టీడీపీ సర్కారు ఉపాధి హామీపై కించిత్ శ్రద్ధయినా చూపకపోవడంతో మళ్లీ అనంతపురం లాంటి కరువు జిల్లాల్లో ఆకలిచావులు నమోదవుతున్నాయి. అటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తీరైతే ఏకంగా ఉపాధి హామీ పథకాన్నే ఎత్తేస్తారేమోననేంత అనుమానాలు రేకెత్తిస్తోంది. ఉపాధి హామీ పథకం ప్రారంభమై పదేళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా బండ్లపల్లికి రానున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంగళవారం మీడియాకు వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఆ పథకాన్ని నేటి ఎన్డీఏ సర్కార్ నీరుగార్చుతున్నదని, భవిష్యత్తులో కూడా ఉపాధి హామీ చట్టం అమలయ్యేందుకు పోరాటాలు చేస్తామని రాహుల్.. కూలీలకు ధైర్యం చెబుతారని రఘువీరా వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 6000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగింపునకు గురైయ్యారని, జాబ్ కార్డులు ఉండీ, పనులు అడిగినవారికి ఉపాధి చూపించడంలేదని ఆ కారణంగా మళ్లీ వసలు ప్రారంభమయ్యాయని, ఒక్క అనంతపురం జిల్లాలోనే 4 లక్షల మంది కూలీలు ఇతర ప్రాంతాలకు వలస పోయారని రఘువీరా చెప్పారు. బండ్లపల్లిలో నిర్వహించే సభకు రాష్ట్రంలోని ప్రతి మండలం నుంచి కూడా కూలీలు తరలిరావాలని పిలుపునిచ్చారు. -
‘ఉపాధి’ కూలీ పెంపు ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు వివిధ అభివృద్ధి పనుల్లో పని చేసే కూలీలకు రోజువారీ వేతనం పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఇస్తున్న రూ. 169 వేతనాన్ని రూ. 180కి పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తాయి. కూలీల వేతనంతో పాటు వివిధ పనులకు సంబంధించిన గ్రామీణ ప్రామాణిక రేట్లు (రూరల్ స్టాండర్డ్ రేట్స్) పెంచుతూ షెడ్యూలును ప్రభుత్వం విడుదల చేసింది. -
‘ఉపాధి’ స్కాంలో సీఐడీ చార్జిషీటు
- రూ.124.9 కోట్ల గోల్మాల్ వ్యవహారం - 53మంది నిందితులపై కేసు - అవకతవకలు రూ.756.9 కోట్లని అంచనా సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అమల్లో భాగం గా రాష్ట్రంలో చోటుచేసుకున్న అక్రమాలపై సీఐడీ శనివారం కర్నూలు కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. రూ.124.9 కోట్ల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ప్రభుత్వాధికారుల సహా 53మందిని నింది తులుగా పేర్కొంది. అయితే రూ. 756.9కోట్ల అవకతవకలు జరిగాయని తమ దర్యాప్తులో గుర్తిం చినట్లు సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్ వెల్లడించారు. తొలుత కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామం పరిధిలో బినామీ పేర్లతో రూ. 44.31 లక్షలు పక్కదారి పట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఎమ్మిగనూరు పోలీసుస్టేషన్లో గత ఏడాది నవంబర్ 29న కేసు నమోదైంది. తర్వాత ఈ కేసు సీఐడీకి బదిలీ అయ్యింది. ఈ ఒక్క గ్రామంలోనే 215 మంది అనర్హులు ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. ఎవరెవరివో బినామీ పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేర్చి భారీగా నిధులు దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో సీఐడీ అధికారులు ఈ పథకంలో జరుగుతున్న అక్రమాలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దర్యాప్తులో 2,15,623 మంది ఉపాధి హామీ పథకంలో అనర్హులుగా ఉన్నట్లు తేలింది. ఆయా కార్డుదారుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. వారికి చెల్లింపుల పేరుతో రూ. 124.9కోట్ల మేర నిధులు దుర్వినియోగమైనట్లు తేలింది. తర్వాత సీఐడీ మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో ఈ స్కాంలో గోల్మాల్ అయిన మొత్తం రూ. 756.9 కోట్లు ఉండవచ్చని సీఐడీ లెక్కతేల్చింది. ఈ కేసులో మొత్తం 53మందిని అరెస్టు చేసింది. వారందరిపై దర్యాప్తు పూర్తి చేసి కర్నూలు జిల్లా కోర్టులో చార్జిషీటు దాఖలు చేసినట్లు అదనపు డీజీ కృష్ణప్రసాద్ తెలిపారు. -
‘ఉపాధి’ వేతనాలు ఆలస్యమైతే.. నష్టపరిహారం బాధ్యత రాష్ట్రాలదే
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కూలీలకు వేతనాల చెల్లింపు ఆలస్యం చేస్తే అందుకు వారికి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకనుగుణంగా జాతీయ ఉపాధి హామీ చట్టంలో సవరణ చేసింది. పక్షం రోజులు ఆలస్యమైతే ఆ బకాయిల్లో నాల్గో వంతు, పక్షం రోజులు దాటితే బకాయిల్లో సగం మొత్తాన్ని నష్టపరిహారంగా చెల్లించాలని పేర్కొంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం నోటిఫికేషన్ జారీ చేశారు. ఉపాధి హామీ చట్టంలోని సెక్షన్ 22(2)(బి) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మొత్తాన్ని భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ వేతనాల చెల్లింపులో బ్యాంకులు, పోస్టాఫీసులు, అధికారులు, క్షేత్రస్థాయి అధికారులు ఎవ్వరు జాప్యం చేసినా ఆ మొతాన్ని వారి నుంచే వసూలు చేసి చెల్లించొచ్చని పేర్కొన్నారు. ఈ నష్టపరిహారాన్ని కూలీల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలని వెల్లడించారు. కూలీల మస్టర్ రోల్ పూర్తిచేసిన పక్షం రోజుల్లోగా వారికి చట్ట ప్రకారం వేతనాలు చెల్లించాలని, లేకుంటే ఆయా కూలీలు నష్టపరిహారం పొందడానికి అర్హులని పేర్కొన్నారు. వారికి ఆ మొత్తం అందేలా పథకం అమలు జిల్లా సమన్వయ అధికారి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.