అనంతపురం టౌన్: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్)లో అక్రమాలు యథేచ్ఛగా చోటు చేసుకుంటున్నాయి. కూలీలకు పని కల్పించడం పక్కన పెడితే కొందరు సీనియర్ మేట్లు, క్షేత్రసహాయకులు ఈ పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఉపాధి హామీ పథకం అమలు కోసం జిల్లా వ్యాప్తంగా 12 క్లస్టర్లుగా విభజించారు. ప్రతి క్లస్టర్‌కూ ఒక ఏపీడీతోపాటు ప్రతి మండలానికీ ఏపీఓలు, ఎంపీడీఓలు ఉపాధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంది.
మస్టర్లలో నమోదైన కూలీలే క్షేత్రస్థాయిలో పనులు చేస్తున్నారా లేదా అని సరిపోల్చాలి. అయితే అధికారులు క్షేత్రస్థాయిలో ఉపాధి పనుల పరిశీలనకు వెళ్లిన దాఖాలాలే కనిపించడం లేదు. ధర్మవరం క్లస్టర్‌లో మూడేళ్లుగా బినామీ పేర్లను మస్లర్లలో నమోదు చేసి బిల్లులు డ్రా చేస్తున్నా అధికారులు గుర్తించలేదు. ఒకవేళ వారి దృష్టికి వచ్చినా చేతివాటాలు ప్రదర్శిస్తూ ‘మమ’ అనిపిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. గుంతకల్లు మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి కూలీలు పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్లిన సమయంలో అధికారులు ఉపాధి పనులను పరిశీనకు వెళ్తున్నారంటూ ఇటీవలే ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
♦ కనగానపల్లి మండలం గుంతపల్లికి చెందిన ఓ మహిళకు 12133201516000 140 నంబరుపై ఉపాధి కూలీ జాబ్‌కార్డు ఉంది. ఈమె 2014 నుంచి 2018 మార్చి 22 వరకు దశల వారీగా ఉపాధి పనికి వెళ్లినట్లు నమోదు చేసి రూ.70 వేల వరకు నిధులు డ్రా చేశారు. వాస్తవానికి ఈమె హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సు. అయినా ఈమె ఉపాధి పనులకు వస్తున్నట్లు మస్టర్లలో నమోదైంది. ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి మడకశిర ప్రాంతంలోని ఒక జూనియర్ కళాశాలలో లెక్చరర్. ఈయన పేరిట సైతం మస్టర్‌లో కూలీగా పేరు మోదు చేసి నిధులు దండుకున్నారు. మండల అధికారులతో క్షేత్ర సహాయకులు కుమ్మక్కై బోగస్ మస్టర్లు సృష్టించి బినామీ కూలీల పేర్లతో నిధులు కొల్లగొడుతున్నట్లు స్పష్టమవుతోంది.
♦ గుంతకల్లు మండలం నాగసముద్రం, కసాపురం, వెంకటాంపల్లి గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి పనుల వద్ద కూలీల వివరాలను ఈ – మస్టర్లలో నమోదు చేయడంలేదు. సాంకేతిక లోపం ఉండడంతో మ్యానువల్ మస్టర్లలోనే వివరాలను నమోదు చేసి అప్‌డేట్ చేస్తున్నారు. ఇదే అక్కడి ఉపాధి హామీ సిబ్బందికి కలిసివచ్చింది. మ్యానువల్ మస్టర్లను సైతం పని ప్రదేశంలోకి తీసుకురారు. దీంతో 100 మంది కూలీలు పనులకు హాజరైతే మరో 20–30మంది బినామీ కూలీల పేర్లను నమోదు చేసి నిధులను డ్రా చేస్తున్నారు. ఇక్కడ ఏకంగా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారి పేర్లను నమోదు చేసినట్లు తెలుస్తోంది.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
పనులకు హాజరు కాకపోయినా ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు మస్టర్లలో నమోదు చేసి ఉపాధి నిధులు పక్కదారి పట్టించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – జ్యోతిబసు, డ్వామా పీడీ
Comments
Please login to add a commentAdd a comment