‘ఉపాధి’ స్కాంలో సీఐడీ చార్జిషీటు
- రూ.124.9 కోట్ల గోల్‌మాల్ వ్యవహారం
- 53మంది నిందితులపై కేసు
- అవకతవకలు రూ.756.9 కోట్లని అంచనా
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) అమల్లో భాగం గా రాష్ట్రంలో చోటుచేసుకున్న అక్రమాలపై సీఐడీ శనివారం కర్నూలు కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. రూ.124.9 కోట్ల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ప్రభుత్వాధికారుల సహా 53మందిని నింది తులుగా పేర్కొంది. అయితే రూ. 756.9కోట్ల అవకతవకలు జరిగాయని తమ దర్యాప్తులో గుర్తిం చినట్లు సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్ వెల్లడించారు. తొలుత కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామం పరిధిలో బినామీ పేర్లతో రూ. 44.31 లక్షలు పక్కదారి పట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఎమ్మిగనూరు పోలీసుస్టేషన్‌లో గత ఏడాది నవంబర్ 29న కేసు నమోదైంది. తర్వాత ఈ కేసు సీఐడీకి బదిలీ అయ్యింది.
ఈ ఒక్క గ్రామంలోనే 215 మంది అనర్హులు ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. ఎవరెవరివో బినామీ పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేర్చి భారీగా నిధులు దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో సీఐడీ అధికారులు ఈ పథకంలో జరుగుతున్న అక్రమాలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దర్యాప్తులో 2,15,623 మంది ఉపాధి హామీ పథకంలో అనర్హులుగా ఉన్నట్లు తేలింది.
ఆయా కార్డుదారుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. వారికి చెల్లింపుల పేరుతో రూ. 124.9కోట్ల మేర నిధులు దుర్వినియోగమైనట్లు తేలింది. తర్వాత సీఐడీ మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో ఈ స్కాంలో గోల్‌మాల్ అయిన మొత్తం రూ. 756.9 కోట్లు ఉండవచ్చని సీఐడీ లెక్కతేల్చింది. ఈ కేసులో మొత్తం 53మందిని అరెస్టు చేసింది. వారందరిపై దర్యాప్తు పూర్తి చేసి కర్నూలు జిల్లా కోర్టులో చార్జిషీటు దాఖలు చేసినట్లు అదనపు డీజీ కృష్ణప్రసాద్ తెలిపారు.