భైంసా(ముథోల్) : ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద చేపడుతున్న పనుల్లో పారదర్శకత కోసం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సామాజిక తనిఖీలు పకడ్బందీగా నిర్వహిస్తుండగా, మరింత పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చింది. ఏటా గ్రామసభలు, మండలస్థాయిలో సామాజిక తనిఖీలు, జియో ట్యాగింగ్ చేపడుతోంది. ఇప్పుడు చేసిన పనులు మళ్లీ చేయకుండా వివరాలతో కూడిన బోర్డులను క్షేత్రస్థాయిలోనే ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా గ్రామాలకు ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనుల వివరాలు తెలుపుతూ రాసిన బోర్డులను పంపించింది. ఉన్న ఊళ్లోనే పని కల్పించేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో 1,53,551 జాబ్‌కార్డులను అందించింది. 3,20,829 మంది కూలీలు పని చేశారు. 40లక్షలకుపైగా పని దినాలు పూర్తిచేసిన కూలీలకు వేతనం కింద రూ.63.23కోట్లు చెల్లించారు.
చేపడుతున్న అభివృద్ధి పనులు..
ఉపాధిహామీ పథకం కింద వ్యవసాయానికి సంబంధించిన పనులే అధికంగా చేస్తున్నారు. ఇంకుడుగుంతలు, నీటి కుంటలు, సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, గ్రామపంచాయతీ భవనాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పూడిక తొలగింపు, మట్టిరోడ్ల మరమ్మతుతోపాటు హరితహారం కింద మొక్కలు నాటుతున్నారు. ఇందుకు సంబంధించిన పనుల వివరాలు తెలుపుతూ ఇప్పటికే అధికారులు గ్రామాల్లో గోడలు నిర్మించి అందులో వివరాలు నమోదు చేశారు. చాలాచోట్ల బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
ఇప్పుడు సూచిక బోర్డులు..
ఇప్పటివరకు ఇలా బోర్డుల ద్వారా ప్రదర్శించిన అధికారులు ఇక పనులను బట్టి సూచికలను మూడు రకాలుగా ఏర్పాటు చేయనున్నారు. మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, మట్టి పనుల వివరాలపై ఒక్కో బోర్డుకు రూ.350 ఖర్చుచేసి అందులో వివరాలు రాయనున్నారు. ఇలా వివరాలతో రాసిన బోర్డును పనులు జరిగిన ప్రదేశం వద్దనే ఏర్పాటు చేయనున్నారు. చెరువులు, కుంటల్లో పూడికతీత, రహదారుల నిర్మాణం, హరితహారం, నీటి నిల్వ గుంత, ఇంకుడుగుంతలు వంటి పనుల వివరాలు రూ.2వేల వ్యయంతో రాతి పలకంపై రాసి పని జరిగిన ప్రదేశంలో ఏర్పాటు చేయనున్నారు. ఇక గ్రామం మొత్తంలో జరిగిన పనుల వివరాలు ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలందరికీ తెలిసేలా గ్రామ సమాచార బోర్డుల పేరుతో గోడలపై రూ.3వేలు ఖర్చుచేసి రాయించనున్నారు.
ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఈప్రక్రియ ప్రారంభమైంది. ఆయా బోర్డుల్లో ఎనిమిది నుంచి పది రకాల సమాచారం రాయిస్తున్నారు. పనిపేరు, గుర్తింపు సంఖ్య, చేసిన ప్రదేశం, అంచనా విలువ, కూలీల వివరాలు, వ్యయం, సామగ్రి వ్యయం, చేసిన పని దినాలు, ప్రారంభం, ముగింపు తేదీ తదితర విషయాలన్నింటినీ ఇందులో పొందుపరుస్తున్నారు. దీంతో చేసిన పనులు మళ్లీ చేసేందుకు వీలుపడదని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఏవైన అనుమానాలుంటే ఫిర్యాదు చేసేందుకు వీలుగా బోర్డుపైనే టోల్‌ఫ్రీ నంబర్లు రాయిస్తున్నారు.
రికార్డుల నిర్వహణ బాధ్యత..
ఉపాధిహామీలో పనిచేసే ఫీల్డ్‌అసిస్టెంట్‌లు, టెక్నికల్ అసిస్టెంట్‌లకు కీలకబాధ్యతలు అప్పగిస్తున్నారు. పనుల గుర్తింపు మస్టర్‌లు వేయడానికే పరిమితం కాకుండా మరింత బాధ్యతను ఇస్తున్నారు. ఉపాధికి సంబంధించి ఏడు రకాల దస్త్రాల నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. దస్త్రాల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోల పర్యవేక్షణ ఉండనుంది. పనులు, గ్రామసభలు, కూలీలు, ప్రతిపాదనలు, పనుల గుర్తింపు, ఖర్చు, వేతనాలు, చెల్లింపులు, ఫిర్యాదులు తదితర వివరాలన్నింటినీ ఇకపై ఈ సిబ్బంది రికార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.
ఈ రికార్డుల పర్యవేక్షణ టీఏలు, ఏపీవోలు ఎప్పటికప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతీనెల మూడో బుధవారం గుడ్‌గవర్నెస్ నిర్వహణపై సమావేశం ఏర్పాటుచేసి పనుల నిర్వహణ, రికార్డుల నిర్వహణపై ఈ సమావేశంలో పరిశీలించనున్నారు. ఈ నూతన విధానంతో ఉన్నతాధికారుల పర్యవేక్షణ జరిగినప్పుడు నోటిమాటలతో తప్పుడు లెక్కలు చెప్పే వీలుండదు. రికార్డుల రూపంలో ఉన్న సమాచారాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈ విధానంతో ఉపాధిహామీ పనులు రాబోయే రోజుల్లో మరింత పారదర్శకంగా మారి దుర్వినియోగం, అవినీతిని నివారించే అవకాశం ఉంటుంది.
పారదర్శకంగా పనులు
ఉపాధిహామీ పథకం అమలుకు జిల్లావ్యాప్తంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. అన్నిచోట్ల పారదర్శకంగానే పనులు నడుస్తున్నాయి. ఉపాధి సిబ్బందిపై నిరంతర పర్యవేక్షణ ఉంది. ఇప్పటికే చేసిన పనులపై గ్రామాల్లో కూడళ్ల వద్ద, బోర్డులపై రాయించడం జరిగింది. ఇక పనుల వివరాలు తెలుపుతూ క్షేత్రస్థాయిలోనూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం.
– వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో
Comments
Please login to add a commentAdd a comment