శ్మశాన వాటికలకు కొత్తరూపు | New Burial Grounds in Adilabad | Sakshi
Sakshi News home page

శ్మశాన వాటికలకు కొత్తరూపు

Published Thu, Apr 25 2019 9:42 AM | Last Updated on Thu, Apr 25 2019 9:42 AM

New Burial Grounds in Adilabad - Sakshi

తాంసి మండలం రుయ్యాడిలో ఈజీఎస్‌ నిధులతో నిర్మించిన శ్మశాన వాటిక

బజార్‌హత్నూర్‌(బోథ్‌): ఒకప్పుడు చెట్లు, పుట్టల మధ్య దర్శనమిచ్చే శ్మశాన వాటికలు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. ఉపాధిహామీ పథకం పుణ్యమా అని వీటి రూపురేఖలు మారుతున్నాయి. గతంలో కాటికి కాలు చాచిన వారు సైతం తన అంత్యక్రియలు జరిగే చోటును తలచుకుని తల్లడిల్లిపోయేవారు. జీవితంలో మంచి ఇంట్లో కాలం వెళ్లదీయకున్నా మరణించిన తర్వాత అయినా మూడడుగుల స్థలం దొరుకుతుందా? అని మదనపడే వారు. ఇప్పుడా సమస్యకు తావులేకుండాపోయింది. రాష్ట్ర ప్రభుత్వం శ్మశాన వాటికలను స్వర్గధామాలుగా తీర్చిద్చిద్దేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా 2017లో ఒక్కో శ్మశానవాటిక అభివృద్ధి కోసం రూ.10లక్షలు వెచ్చించాలని ప్రతిపాదించింది. ఇక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ నిధులను సద్వినియోగం చేసుకుంటే ఏళ్ల నాటి  సమస్య తీరనుంది. ఆదిలాబాద్‌ జిల్లాలో 2019 సంవత్సరానికి ఉపాధిహామీ పథకం ద్వారా 154 శ్మశాన వాటికల నిర్మాణానికి రూ.15.53 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వాటిలో 87 శ్మశాన వాటికల నిర్మాణ పనులు జరుగుతుండగా, మిగతా 67 గ్రామపంచాయతీలకు కేటాయించాల్సి ఉంది.

దయనీయంగా గ్రామీణ శ్మశాన వాటికల పరిస్థితి
జిల్లాలోని జైనథ్, బేల, ఉట్నూర్, ఇంద్రవెల్లి, బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ, బజార్‌హత్నూర్, తాంసి, గుడిహత్నూర్, తలమడుగు మండలాల్లోని 95 శాతం గ్రామాల్లో శ్మశాన వాటికల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. కొన్ని శ్మశాన వాటికలు ఆనవాళ్లు కోల్పోయాయి. మరికొన్ని గ్రామాల్లో కబ్జాకు గురవుతున్నాయి. గ్రామాల్లో ఒకరు చనిపోయారంటే ఆ వ్యక్తి అంత్యక్రియలు ఇంకొకరి చావుకు వచ్చేలా ఉన్నాయి. శ్మశాన వాటికలు ముళ్లపొదలు, పిచ్చి మొక్కలతో నిండిపోయి అంత్యక్రియలు జరిపే వీలులేకుండా పోయింది. శ్మశాన వాటికలకు అంతిమయాత్ర తీసుకెళ్లేందుకు కనీసం దారి సౌకర్యం కూడా లేదు. కొన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు లేక చెరువుగట్లు, రహదారుల పక్కన, ఒర్రెల్లో అంత్యక్రియలు చేస్తున్నారు. బజార్‌హత్నూర్‌ మండలం గిర్నూర్, గుడిహత్నూర్‌ మండలంలో మన్నూర్, బోథ్‌ మండలంలో కౌట గ్రామాల్లో ఇప్పటికీ రోడ్డు పక్కనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
 
శ్మశాన వాటికల అభివృద్ధికి  ఈజీఎస్‌ నిధులు
ఆయా గ్రామాల్లో శ్మశాన వాటికలకు 5 గుంటల స్థలం చూపిస్తే ఉపాధిహామీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.10.35 లక్షలు ఖర్చు చేసే వీలు కల్పించింది. అయితే వీటిని అభివృద్ధి చేయాలన్న సంకల్పం స్థానిక సం స్థల ప్రతినిధులకు ఉండాలి. అందుకు రెవె న్యూ అధికారులు సహకరించాలి. శ్మశాన వాటికల భూ విస్తీర్ణం గుర్తించి హద్దులు వేస్తే అభివృద్ధి కోసం ప్రతిపాదనలు రూపొందించవచ్చు. శ్మశాన వాటికల్లో దహనం చేసేందుకు రెండు ప్లాట్‌ఫాంలు, పిచ్చిమొక్కల తొలగింపు, పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా మూత్రశాలలు, మరుగుదొడ్లు, లెవలింగ్, స్టోర్‌రూంతో పాటునీటి వసతి కోసం ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ నిర్మించుకోవచ్చు. శ్మశాన వాటికల్లో హరితహారం పథకంలో మొక్కలు పెంచుకోవచ్చు. దీనంతటికీ స్థానిక సర్పంచ్, గ్రామస్తులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

శ్మశాన వాటికలకు కొత్తరూపు

రోడ్డు పక్కనే అంత్యక్రియలు చేస్తున్నాం 
మా గ్రామంలో శ్మశాన వాటికకు స్థలం లేక అర్‌అండ్‌బీ రోడ్డు పక్కనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం శ్మశాన వాటికకు స్థలం కేటాయించి దహనానికి ప్లాట్‌ఫాం, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ నిర్మించాలి.– గవ్వల సాయిచైతన్య,గిర్నూర్‌ 

నిధులు కేటాయిస్తే నిర్మిస్తాం
దేగామలో 3వేల జనాభాకు ఒకే ఒక శ్మశాన వాటిక ఉంది. కాని అభివృద్ధికి నిధులు లేక పిచ్చిమొక్కలతో నిండి ఉంది. ఇక్కడ దహనానికి ప్లాట్‌ఫాం, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ లేదు. శ్మశాన వాటికలో అడుగువేద్దామంటే ముళ్లపొదలు, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. చేసేదేమి లేక అంత్యక్రియల కోసం కడెం నది ఒడ్డున రోడ్డు పక్కన ఉన్న స్థలాన్ని ఉపయోగిస్తున్నాం. ఈజీఎస్‌ నిధులు మంజూరు చేస్తే శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తాం. – దుర్వ లక్ష్మణ్, సర్పంచ్‌ దేగామ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement