
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) పనులతో ఎంతో మంచి జరిగిందని ప్రజలు అనుకుంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఉపాధి పథకం పనుల నాణ్యతపై 76% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది.
తమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఇటీవల చేపట్టిన సర్వేలో కేవలం 0.5శాతం మంది మాత్రం ఉపాధి పనుల్లో నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొంది. గ్రామాల్లో ఉపాధి వనరులను కల్పించటం ద్వారా స్థిరమైన అభివృద్దికి అవసరమైన వనరులను సృష్టించటమే ఉపాధి హామీ పథకం ఉద్దేశం. దీనికోసం గత మూడేళ్లుగా చేపట్టిన అనేక పనులను పూర్తి చేసి, నాణ్యతను పెంచినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. దేశంలో 2016–17 కాలంలో దాదాపు 1.02 కోట్ల పనులను పూర్తి చేసినట్లు పేర్కొంది.