
గురిజేపల్లిలో ఉపాధి కూలీలకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించిన శ్రీరెడ్డి
సాక్షి, ఎర్రగొండపాలెం : టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతూ సంచలనంగా వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. సినీ ప్రముఖులపై విమర్శలు చేస్తూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. గతంలో టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న దారుణాలను ఆమె తీవ్రంగా ఖండించారు. సినీ పరిశ్రమలో మహిళలకు అండగా ఉంటానంటూ ఇటీవల ఆమె ప్రకటించారు. తాజాగా ఆమె మరోసారి రోడ్డుపై నిరనస వ్యక్తం చేశారు. అయితే ఈసారి సినీ పరిశ్రమ గురించి కాకుండా ఉపాధి కూలీలు చేస్తున్న నిరసనకు ఆమె మద్దతు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీరెడ్డి శ్రీశైలం వెళ్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం, గురిజేపల్లి సమీపంలో కొందరు తమకు ఉపాధి పనులు కల్పించడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. అటుగా వెళ్తున్న శ్రీరెడ్డి కారు దిగి, తలకు తలపాగా చుట్టుకొని స్థానికులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఆమెను చూసిన స్థానికులు అవాక్కయ్యారు. శ్రీరెడ్డి ఏంటీ.. ఇలా తమకు మద్దతు ఇవ్వడం ఏంటని విస్తుపోయారు. కాసేపు అక్కడ హడావుడి చేసిన ఆమె, స్థానికులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం తన కారులో అక్కడ నుండి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment