local peoples
-
గడ్చిరోలిలో మావోయిస్టుల బ్యానర్లను తగులబెట్టి..
సాక్షి, కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకాలోని తాడుగుడ, పెండ్రీ గ్రామాల్లో మావోయిస్టుల ఎరుపురంగు బ్యానర్లు వెలిశాయి. ఆదివారం తెల్లవారు జామున మావోయిస్టులు ఆయా గ్రామాల్లో డిసెంబర్ 2 నుంచి 8 వరకు పీఎల్జీఏ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఆ ఎరుపురంగు బ్యానర్లలో తెలిపారు. దీంతో స్థానికులు తమ గ్రామాలకు మావోయిస్టులు రావద్దని, అభివృద్ధి నిరోధకులని ఆ బ్యానర్లను స్థానికులు తీసు నాలుగు కూడళ్ల వద్ద నిప్పంటించి తగులబెట్టారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు తెలిసింది. దీంతో ఆయా గ్రామాల్లో పోలీసులు కూంబింగ్ తీవ్రం చేశారు. కాగా శనివారం ఏటపల్లి తాలూకా గట్టపల్లి అడవుల్లో రోడ్డు నిర్మాణం జరుగుతుండటంతో అక్కడి 10 జేసీబీలు, 5 ట్రాక్టర్లను మావోయిస్టులు కాల్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో మావోయిస్టులు మెరుపుదాడులకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే యాక్షన్ టీంలు సంచిరిస్తున్నట్లు పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలోని గోదావరి సరిహద్దుల్లో పోలీసులు నిఘాను తీవ్రం చేశారు. -
మళ్లీ రోడ్డు పైకి శ్రీరెడ్డి
సాక్షి, ఎర్రగొండపాలెం : టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతూ సంచలనంగా వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. సినీ ప్రముఖులపై విమర్శలు చేస్తూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. గతంలో టాలీవుడ్లో మహిళలపై జరుగుతున్న దారుణాలను ఆమె తీవ్రంగా ఖండించారు. సినీ పరిశ్రమలో మహిళలకు అండగా ఉంటానంటూ ఇటీవల ఆమె ప్రకటించారు. తాజాగా ఆమె మరోసారి రోడ్డుపై నిరనస వ్యక్తం చేశారు. అయితే ఈసారి సినీ పరిశ్రమ గురించి కాకుండా ఉపాధి కూలీలు చేస్తున్న నిరసనకు ఆమె మద్దతు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీరెడ్డి శ్రీశైలం వెళ్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం, గురిజేపల్లి సమీపంలో కొందరు తమకు ఉపాధి పనులు కల్పించడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. అటుగా వెళ్తున్న శ్రీరెడ్డి కారు దిగి, తలకు తలపాగా చుట్టుకొని స్థానికులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఆమెను చూసిన స్థానికులు అవాక్కయ్యారు. శ్రీరెడ్డి ఏంటీ.. ఇలా తమకు మద్దతు ఇవ్వడం ఏంటని విస్తుపోయారు. కాసేపు అక్కడ హడావుడి చేసిన ఆమె, స్థానికులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం తన కారులో అక్కడ నుండి వెళ్లిపోయారు. -
స్థానికులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి
తుంగతుర్తి : స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న స్థానిక నాయకులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఎంఎస్ఎఫ్ నియోజకవర్గ ఇన్చార్జ్ తడకమల్ల రవికుమార్ కోరారు. శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులో మాట్లాడారు. స్థానికేతరులకు టికెట్ ఇస్తే వారు నియోజకవర్గంపై అవగాహనలేక అభివృద్ధికి కృషి చేయడంలేదని అన్నారు. ఈ సమావేశంలో ఎంఎస్ఎఫ్ నాయకులు కొండగడ్పుల శ్రీకాంత్, రాంబాబు, నరేష్, వెంకటేష్, సురేష్, పరశురాములు, శ్రీను, మహేష్ పాల్గొన్నారు. -
కోతుల వీర విహారం
అచ్చంపేట రూరల్ : అచ్చంపేటలోని వివిధ కాలనీల్లో కోతుల బెడద తీవ్రమైంది. ఒంటరిగా ఉన్న మనుషులపై ప్రత్యక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. వా రంలో 10మందికి పైగా కోతులు దాడి చేసి గాయపర్చాయి. ఆదర్శనగర్ కాలనీ లో చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నాయి. మధ్యాహ్నపాఠశాల నుం చి ఇంటికి తినడానికి వచ్చిన విద్యార్థులపై కోతులు దాడి చేసి గాయపర్చుతున్నాయి. ఆదర్శనగర్ కాలనీలో.. ఈనెల 29న ఆదర్శనగర్ కాలనీలో ఓ విద్యార్థి వెంట పడి కోతులు దాడి చేశాయి. పరుగెత్తుకుంటూ ఓ ఇంట్లోకి వెళ్లినా కోతులు వదల్లేదు. కాళ్లు, చేతులపై దాడి చేశాయి. ఇది చూసిన కాలనీవాసులు భయాందోళనకు గురై ఇంటి నుంచి బయటకు వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లినా కర్రలు చేతిలో పట్టుకుని వస్తున్నారు. ఒకప్పుడు ఇళ్లలోకి వచ్చి ఆహార పదార్థాలు ఎత్తుకెళ్లే కోతులు ప్రస్తుతం దాడులు చేయడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఇంటిలో ఉన్న మహిళలు తలుపులు మూసుకుని ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ సిబ్బందిపై.. అలాగే బుధవారం ఉదయం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న సిబ్బందిపై కోతులు దాడి చేశాయి. సెక్యూరిటీ గార్డు, ఉద్యోగి సుఖ్జీవన్రెడ్డిపై దాడి చేసి గాయపర్చాయి. సుఖ్‌జీవన్‌రెడ్డి చేతులు, చెవులను కొరికివేశాయి. ఎడమ చెవిని కోతి కొరకడంతో చెవి భాగం కింద పడింది. ఆర్టీసీ కార్మికులు కర్రలు చేతిలో పట్టుకుని పనులు చేస్తున్నారు. అందరూ ఒకే దగ్గర కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడు కోతులు దాడులు చేస్తాయో అని భయాందోళనలో కార్మికులు ఉన్నారు. కోతులను పట్టుకునేవాళ్లను పిలిపించాం కాలనీలో కోతులు దాడులు చేస్తున్నాయని ఫిర్యాదులు చాలా వచ్చాయి. కోతులను పట్టుకునే వాళ్లను పిలిపించాం. గురువారం నుంచి కోతులను పట్టుకునే పనిలో వారుంటారు. కాలనీవాసులు భయాందోళనకు గురి కాకుండా కోతులను పట్టుకుని పట్టణానికి దూరంగా వదిలేస్తాం. – నాయిని వెంకటస్వామి, నగరపంచాయతీ కమిషనర్, అచ్చంపేట పట్టించుకోని అధికారులు... కోతుల బెడద నుంచి తప్పించాలని పలుమార్లు నగరపంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. గతంలో ఓసారి కోతులను పట్టుకునే వారిని పిలిపించి పట్టుకుని పట్టణానికి దూరంగా పంపించారని, ప్రస్తుతం అలాంటి చర్యలు నగరపంచాయతీ అధికారులు చేపట్టడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. -
తిరుపతివాసులకు వెంకన్న సులభ దర్శనం
సాక్షి, తిరుమల: తిరుపతివాసులకు శుభవార్త. తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని స్థానికులూ సులభంగా పొందే అవకాశం కలగనుంది. టైంస్లాట్ సర్వదర్శనం విధానాన్ని తిరుపతిలోనూ ప్రారంభించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి లేదా మార్చి నుంచి తిరుమల, తిరుపతిలో శాశ్వత ప్రాతిపదికన టైం స్లాట్ సర్వదర్శనం అమలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో టైం స్లాట్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. తిరుచానూరులోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి మూడోవారం లేదా మార్చి నుండి పూర్తిస్థాయిలో కౌంటర్లు ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ఇదిలా ఉండగా స్థానిక ఆలయాల సందర్శనకు భక్తులు తమ ఆధార్‌కార్డు చూపించి సులభంగా టికెట్లు పొందవచ్చు. కేటాయించిన సమయాన్నిబట్టి శ్రీకాళహస్తి, కాణిపాకం, ఇతర స్థానిక ఆలయాలు సందర్శించే అవకాశం ఉంది. 1999లో రూ.50 సుదర్శన టికెట్ల విధానం సందర్భంలో భక్తులు జిల్లాలోని స్థానిక ఆలయాలు సందర్శించేవారు. -
సినిమాను మించిపోయే దొంగల కథ ఇది..
జూలూరుపాడు: మంగళవారం ఉదయం 10.40 గంటలు.. జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామం.. గాదె లక్ష్మి బడ్డీ కొట్టు.. పల్సర్ బైక్‌పై ఇద్దరు యువకులు వచ్చారు. సిగరెట్ అడిగారు. ఆమె ఇచ్చింది. అగ్గిపెట్టె కావాలన్నారు. కిందికి వంగి అగ్గిపెట్టు తీస్తోంది. సరిగ్గా అదే క్షణంలో.. ఆమె మెడలోని రెండు తులాల బంగారపు గొలుసు(నానుతాడు)ను ఆ ఇద్దరు యువకులు లాక్కున్నారు, వాయువేగంతో మాయమయ్యారు. ఆమె గావుకేకలు వేసింది. తన గొలుసు లాక్కుని వెళుతున్నారంటూ దూరంగా వెళుతున్న బైక్‌ను చూపించింది. చుట్టుపక్కల వాళ్లంతా వెంటనే అప్రమత్తమయ్యారు. బైక్‌లపై వెంటాడారు. సమాచారం అందిన వెంటనే జూలూరుపాడు ఎస్సై ఇళ్ల రాజేష్, చండ్రుగొండ ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యం లో పోలీసులు రంగంలోకి దిగారు. వారు తమ వాహనాల్లో ప్రత్యక్షమయ్యారు. ముందు పల్సర్ బైక్.. వెనుక స్థానికులు, పోలీసుల వాహనాలు..! చేజింగ్ సాగుతోంది..!! సినిమాల్లో విలన్లను హీరో(లు) వెంటాడుతున్నట్టుగా...!!! ⇒ ఆ ఇద్దరు చైన్‌స్నాచర్ల పల్సర్ బైక్.. చండ్రుగొండ వైపు వెళుతోంది. ముందు దొంగల బైక్.. వెనుక పోలీసులు, ఇతరుల వాహనాలు.. కొంతసేపు ఈ చేజింగ్ సాగింది. అనూహ్యంగా, రోడ్డుపై కొంచెం దూరంలో (చండ్రుగొండ) పోలీసుల వాహనం కనిపించింది. ఆ ఇద్దరు దొంగలు తమ బైక్‌ను జూలూరుపాడు వైపు మళ్లించారు. ⇒ చండ్రుగొండ క్రాస్ రోడ్డులోని ఆటో అడ్డా వద్ద అక్కడి స్థానికులు, ఆటో డ్రైవర్లు కలిసి ఆటోలను రోడ్డుకు అడ్డంగా పెట్టారు. ‘ఈ దెబ్బకు దొంగల ఆట కట్టు’ అనుకున్నారు. పక్కన నిలబడి చూస్తున్నారు. ⇒ ఆ పల్సర్ బైక్ వాయువేగంతో దూసుకొస్తోంది... వస్తోంది.. వస్తోంది... వచ్చింది.. వెళ్లింది...! అక్కడున్న వారంతా నిశ్చేష్టులై కొన్ని క్షణాలపాటు అలా చూస్తుండిపోయారు. ⇒ రోడ్డుపై అడ్డుగా ఆటోల మధ్యనున్న కొద్దిపాటి ఖాళీ నుంచి దొంగలు చాలా నేర్చుగా వెళ్లారన్న విషయాన్ని గ్రహించారు, ఆ వెంటనే తేరుకుని వెంబడించారు. ఇంతలో వెనుక నుంచి పోలీసులు, ఇతరుల వాహనాలు వచ్చాయి. ⇒ కొత్తగూడెం వైపుగా దొంగలు పారిపోతున్నారు. సాయిరాం తండా గ్రామం దాటారు. కాకర్ల ఎర్రవాగు చెరువునకు వెళ్లే మట్టి రోడ్డు వైపునకు బైక్ మళ్లింది. కొంతదూరం ప్రయాణించిన తరువాత బైక్‌ను పడేశారు... పారిపోతున్నారు. ⇒ అప్పటికే వెనుకనున్న వాహనాలు దగ్గరికి వచ్చాయి. పారిపోతున్న ఇద్దరిలో ఒకడిని పట్టుకున్నారు. నాలుగు దెబ్బలేశారు. వెనుకగా వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ⇒ మరొకడు కనిపించలేదు. వాడి కోసం వేట మొదలైంది. అందరూ కలిసి పరిసర ప్రాంతాల్లో గాలించారు. దాదాపుగా గంట తర్వాత, దండుమిట్టతండా గ్రామ సమీపంలోగల జామాయిల్ తోటలో రెండో దొంగ కూడా దొరికాడు. ⇒ వీరిద్దరిదీ, కృష్ణా జిల్లా విజయవాడ. ఒకడేమో నాగ, మరొకడేమో మధు. ⇒ ఈ చేజింగ్ అంతా దాదాపుగా రెండు గంటలపాటు సాగింది. చివరికిది సుఖాంతమైంది. ‘‘సినిమాల్లో విలన్లను హీరోలు వెంటాడి పట్టుకున్నట్టుగా మేము (స్థానిక ప్రజలు), పోలీసులం కలిసి దొంగలను పట్టుకున్నాం’’ అంటూ, స్థానికులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ⇒ ముందు రోజు (సోమవారం) రాత్రి రెండు ఆలయాల్లో చోరీలు చేసింది ఈ ఇద్దరే కావచ్చేమో..?! అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. రెండు ఆలయాల్లో చోరీ సంక్రాంతి రోజు (సోమవారం) అర్థరాత్రి. జూలూరుపాడు మండలంలోని కొమ్ముగూడెం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ గర్భగుడిలో చోరీ జరిగింది. తాళం కప్పను కోశారు. అమ్మవారి బంగారు తాళిబొట్టు, ముక్కుపుడక, వెండి గొడుగు దొంగిలించారు. ఆలయం నుంచి దొం గలు బయటకు వెళుతుండడాన్ని సమీపంలోని స్థానికులు గమనించారు. ఆలయ కమిటీకి, పోలీసులకు సమాచారమిచ్చారు, ఎస్సై ఇళ్ల రాజేష్ వచ్చారు. మాయమైన నగల విలువ రూ.50వేలు ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది. జూలూరుపాడులోని శ్రీ కోట మైసమ్మ తల్లి ఆలయంలోకూ ఇదే రోజు రాత్రి చోరీ జరిగింది. తాళం పగలగొట్టారు. అమ్మవారి విగ్రహానికి అలం కరించిన రోల్డ్‌గోల్డ్ నగలు ఎత్తుకెళ్లారు. హుండీ పగలగొట్టారు. ఈ రెండు ఆలయాల్లో చోరీ చేసింది.. పట్టుబడిన ఆ ఇద్దరు చైన్ స్నాచర్లేనా..? ఇది తేలాల్సుంది. -
డూప్‌ల సందడి
జగిత్యాల అర్బన్ : ఈ చిత్రం చూడండి.. అచ్చం సినీ హీరోలు విక్టరీ వెంకటేశ్, దివంగత నాగేశ్వర్రాలా కనిపిస్తున్నారు కదూ.. అవును అట్లే కనిపిస్తున్నారు. విజయనగరంకు చెందిన రవిచంద్రన్ (వెంకటేశ్ డూప్), హైదరాబాద్‌కు చెందిన నగేశ్ (నాగేశ్వర్రావు డూప్) జగిత్యాలలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన కళాశ్రీ అధినేత గుండేటి రాజు, బానుక రవి, అభి డూప్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తిరునహరి, విజయ్, భానుక శ్రీనివాస్, అమూల్య రవి తదితరులు పాల్గొన్నారు.