Yerragondapalem
-
టీడీపీలో వెధవలు ఉన్నారు
యర్రగొండపాలెం: టీడీపీలో వెధలు ఉన్నారని ఆపార్టీ తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకర్ల కోటయ్య తీవ్ర విమర్శలు చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం మండల కేంద్రమైన పుల్లల చెరువులో శుక్రవారం నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం సభలో బహిరంగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో టీడీపీ నేతలు కొంతకాలంగా రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు చేసుకుంటున్న నేపథ్యమే ఈ వాఖ్యలకు కారణమన్న వాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గుడూరి ఎరిక్షన్‌బాబును రాష్ట్ర టెక్నాలజీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ మన్నే రవీంద్ర వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆయనకు టికెట్ ఇచ్చినట్లయితే మద్దతు ఇవ్వబోమని అధిష్టానానికి సంకేతాలు కూడా పంపారు. గత నెల 28వ తేదీన పుల్లలచెరువు మండలంలోని చాపలమడుగులో జరిగిన తిరునాళ్ల సందర్భంగా టీడీపీ వర్గీయులు రెండు వర్గాలుగా విడిపోయి రెండు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరువాత రవీంద్ర వర్గం యర్రగొండపాలెం మండలం మురారిపల్లె పంచాయతీలోని వేగినాటి కోటయ్య నగర్లో ఈ నెల 7న బాబు షూరిటీ–భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. అయితే దీనిపై ఎరిక్షన్ బాబుకు సమాచారం ఇవ్వలేదు. కార్యక్రమానికి ముందుగా రవీంద్ర వైద్యశాల నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో బలప్రదర్శన నిర్వహించారు. దీనికి ప్రతిగా ఎరిక్షన్‌బాబు వర్గీయులు ఎస్సీ కాలనీలను టార్గెట్ చేసుకొని టీడీపీ కార్యకర్తల మెళ్లో మళ్లీ పచ్చకండువాలు కప్పి వైఎస్సార్ సీపీ నుంచి చేరినట్లు వార్తలు రాయించుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కాకర్ల కోటయ్య వ్యాఖ్యలు టీడీపీని నవ్వులపాలు చేశాయని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
‘చంద్రబాబు.. కావాలనే జనాన్ని రెచ్చగొట్టారు’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ సీరియస్ కామెంట్స్ చేశారు. దళిత జాతికి చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. దళితులను హింసించిన చరిత్ర చంద్రబాబుది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. యర్రగొండపాలెంలో కావాలనే చంద్రబాబు జనాన్ని రెచ్చగొట్టారు. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మేము శాంతియుతంగా ఆందోళన చేస్తే మాపై దాడి చేయించారు. దళిత జాతిని చంద్రబాబు మోసం చేశారు. కానీ, దళితులపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి భారీగా సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. దీంతో, చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యుల గురించి నాలుక కోస్తామని వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్ దెబ్బకు చంద్రబాబు, నారా లోకేష్ రాష్ట్రంలో చెరోచోటా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్రలు, రాళ్లతో దాడి చేసింది టీడీపీ నేతలే. ప్రజలందరూ చూస్తుండగానే టీడీపీ నేతలు దాడులు చేశారు. చంద్రబాబు.. దళితులకు క్షమాపణ చెప్పి ఎక్కడైనా తిరగొచ్చు. సురేష్ బాబు శాంతియుతంగా నిరసన చేస్తే రాళ్ల దాడి చేస్తారా?. రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
‘దళితులను అవమానించిన మీకు అక్కడ తిరిగే అర్హత ఉందా?’
సాక్షి, ప్రకాశం జిల్లా: దళితులను అవహేళన చేసిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హత ఉందా? అని ప్రశ్నించారు మంత్రి ఆదిమూలపు సురేష్. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? దళితులు ఏమీ పీకలేరు అన్న మీరు ఏ ముఖం పెట్టుకుని అక్కడ పర్యటిస్తారని ఆదిమూలపు నిలదీశారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి మండిపడ్డ ఆదిమూలపు.. పలు ప్రశ్నలు సంధించారు. దళితులను అవహేళన చేసిన బాబూ కొడుకులకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హత ఉందా?, దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా?.. దళితులు ఏమి పీకలేరు. అని మీరు అనలేదా? యర్రగొండపాలెంలో మీ పార్టీ ఇంచార్జి ఎరిక్షన్ బాబును కూడా నెల్లూరు మీటింగ్ లో చంద్రబాబు అవమానించలేదా?, ఏ చెట్టూ లేని చోట ఆముదపు వృక్షం లాంటి ఎరీక్షన్ బాబే అక్కడ మహా వృక్షం అని అనలేదా?, అలాంటి పార్టీలో ఈ దళిత నాయకులు ఎలా కొనసాగుతారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నీ హయాంలో కొత్త జిల్లాల విషయం గుర్తుకురాలేదు. ఇప్పుడు మార్కాపురం జిల్లా చేస్తానంటే ప్రజలు నమ్ముతారా?, జగనన్న కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటంతో పాటు ఒక జిల్లాకు ఎన్టిఆర్ పేరు కూడా పెట్టారు. ఇన్నాళ్లు గుర్తుకురాని ఎన్టిఆర్ పేరు ఇప్పుడు ఎన్నికలు వస్తుంటే చంద్రబాబుకు గుర్తుకు వస్తుందేమిటి?, నీ పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ కడితేనే ఒప్పుకోని నీవు... సభల్లో మాత్రం జై ఎన్టీఆర్ అని అంటావు. నీది రెండు నాల్కల ధోరణి’ అని ధ్వజమెత్తారు మంత్రి ఆదిమూలపు సురేష్. -
మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తప్పిన ప్రమాదం
సాక్షి, ప్రకాశం(యర్రగొండపాలెం): రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక సచివాలయం–2 పరిధిలో శనివారం వీల్‌చైర్‌లో లబ్ధిదారుల గృహాలకు వెళ్లి మాట్లాడారు. కార్యక్రమం పూర్తిచేసుకున్న ఆయన.. ఆ వీధిలో ఉన్న ఒక నాయకుడి ఇంట్లోకి వెళ్లి కుర్చీలో కూర్చున్నారు. ఆ కుర్చీ బలహీనంగా ఉండటంతో ఒక పక్కకు పూర్తిగా ఒరిగిపోయింది. మంత్రి కిందపడే సమయంలో పక్కనే ఉన్న కొంత మంది నాయకులు పట్టుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. మంత్రి ఇటీవల మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న నేపథ్యంలో.. ఈ సంఘటన జరగడంతో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. కుర్చీ నుంచి వరగడం వలన తనకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని మంత్రి తెలిపారు. చదవండి: (నేను విఫలమైన రాజకీయ నాయకుడిని.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు) -
భక్తుల కొంగుబంగారం.. ఇష్ట కామేశ్వరిదేవి
దట్టమైన అభయారణ్యంలో బండరాళ్ల మధ్య కుదుపులతో కూడిన ప్రయాణం. అనుక్షణం భయం, ఉత్కంఠ, ఆహ్లాదం, ఆనందం ఇవన్నీ కలగలపి చేసే యాత్రే ఇష్టకామేశ్వరీదేవి దర్శనయాత్ర. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గంజివారిపల్లె బీట్ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన ఇష్టకామేశ్వరి దేవతను దర్శించుకోవాలంటే కొంచెం సాహసమే.. పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా): భారతదేశం మొత్తం మీద ఆ దేవి రూపాన్ని ఆ ఒక్క క్షేత్రంలో మాత్రమే దర్శించుకోగలం. అందుకే ఆ దేవి దర్శనం ఒక సాహసయాత్ర. దట్టమైన అభయారణ్యంలోని ఓ చిన్న గుహలో వెలసిన జగజ్జనని దర్శనంతో ఆ తల్లి మన ముందు సజీవంగా నిలిచిన అనుభూతినిస్తుంది. ఒకప్పుడు కేవలం కాపాలికులు, సిద్ధులు మాత్రమే సేవించిన మహామహన్విత ఇష్టకామేశ్వరిదేవి నేడు సామాన్య భక్తులు కూడా దర్శించుకోగలుగుతున్నారు. చెంచు గిరిజనుల నివాసాల మధ్య బండరాళ్లను పేర్చి కట్టిన చిన్న మండపానికి ముందు రేకుల షెడ్డుతో సాదాసీదాగా ఉంటుంది ఇష్టకామేశ్వరి దేవీ ఆలయం. జగద్గురువులు ఆదిశంకరాచార్యులతో పాటు ఎంతో మంది సిద్ధులు అమ్మవారిని దర్శించుకుని అక్కడే సాధన చేశారని పురాణాలు చెపుతున్నాయి. ప్రసిద్ధ శ్రీశైల పుణ్యక్షేత్రంలో కొద్దిమందికి మాత్రమే తెలిసిన మహాన్విత కేత్రం ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం. శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి ఆలయం కూడా ఒకటని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఎంత గొప్ప కోరికైనా ఈ అమ్మవారిని కోరుకుంటే తీరుతుందని పురాణాల్లో నానుడి. ఆకట్టుకునే అమ్మవారి స్వరూపం చతుర్భుజాలతో, రెండు చేతులలో తామర మొగ్గలు, మరో చేతిలో శివలింగం, మరో చేతితో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్లుగా ఒక యోగినిలా అర్ధనిమీలిత నేత్రాలతో జ్ఞానముద్రలో ఉన్నట్లు ఎంతో కళాత్మకంగా కనబడుతుంది ఇష్టకామేశ్వరీ అమ్మవారు. భూగర్భంలోని ఓ చిన్న దేవాలయంలో కొలువుతీరి ఉంటుంది ఇష్టకామేశ్వదేవి. కిటికీ మాదిరిగా ఉండే చిన్న ముఖద్వారం ద్వారా మోకాళ్ల మీదుగా ఒక్కరొక్కరుగా లోనికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాలి. అమ్మవారి దర్శనానికి ముందు మార్గమధ్యంలో వెలసి వినాయకుడిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఇష్టకామేశ్వరి అమ్మవారికి పెరుగన్నం, పొంగళిని నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీశైలంలో మల్లికార్జునస్వామి, బ్రమరాంభాదేవి వెలసిన సమయంలోనే ఇష్టకామేశ్వరి అమ్మవారు ఇక్కడ వెలి«శారని స్థల పురాణాలు చెపుతున్నాయి. మానవకాంతను పోలిన అమ్మవారి నుదురు అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరి చేత స్వయంగా బొట్టు పెట్టించటం ఇక్కడ అనవాయితీ. అమ్మవారికి బొట్టు పెట్టేటప్పుడు అమ్మవారి నుదురు రాతి విగ్రహం మాదిరిగా కాకుండా ఒక మానవ కాంత నుదుటిని తాకినట్లుగా మెత్తగా చర్మాన్ని తాకినట్లుగా ఉంటుందని భక్తులు పేర్కొంటున్నారు. భక్తులు ధర్మబద్ధంగా కోరే ఏ కోరికైనా అమ్మవారు తీరుస్తారని ప్రతీతి. మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయని ఆలయ అర్చకులు ఈదన్న పేర్కొంటున్నారు. అమ్మవారికి కొందరు భక్తులు చీర, సారెలను బహూకరిస్తారని అర్చకులు పేర్కొంటున్నారు. సాహసోపేతమైన దర్శనయాత్ర.. నల్లమల అభయారణ్యంలో వెలసిన ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శంచుకోవాలంటే కాస్తంత సాహసం చేయాల్సిందే. ఈ యాత్ర యావత్తూ వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించే టైగర్ రిజర్వు అటవీ ప్రాంతం కావటంతో అటవీశాఖ అధికారుల అనుమతులు తప్పనిసరి. కొంతకాలంగా ఈ యాత్ర అటవీశాఖ అనుమతులతోనే సాగుతుంది. శ్రీశైలం సమీపంలో ఉన్న శిఖరం వద్ద నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. శిఖరం వద్ద అటవీశాఖ అధికారులు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి అలయానికి చేరుకోవటానికి టికెట్లు బుక్ చేసుకుంటారు. 5 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆలయానికి వెళ్లే ప్రతి వ్యక్తికి రూ.1000 చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఒక్కో వాహనంలో కేవలం 8 మంది మాత్రమే వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి. అలా మొత్తంగా రోజుకు 15 జీపులు మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తారు. టికెట్లు తీసుకున్న అరగంట నుండే వాహనాలు ప్రారంభమవుతాయి. ఇలా కష్టసాధ్యమైన యాత్రను చేసే ప్రతి ఒక్కరూ తాము కోరిన కోరికలు నెరవేరాలని కోరుకుంటూ, అవి తీరగానే తమ మొక్కులను తీర్చుకుంటుంటారు. -
ఈ గుడికి వెళ్తే.. సంతానం కలుగుతుందట
పచ్చటి వృక్షాలతో దట్టమైన అడవి, పెద్ద కొండ చరియ పై నుంచి జాలువారే జలపాతం, ప్రకృతి రమణీయత మైమరపించే అందాలకు ఆలవాలంగా నిలుస్తుంది పాలంక క్షేత్రం. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన ఆదిశేషుని ఆకారం వంటి కొండచరియ కింద మూల విరాట్ పాలంకేశ్వరుడితో పాటు వీరభద్రుడు, గణపతి, పంచముఖ బ్రహ్మ, పోతురాజుల ఆలయాలు, పది అడుగుల ఎత్తున్న నాగమయ్య పుట్ట కొలువై ఉన్నాయి. సంతాన ప్రాప్తిని సిద్ధించే స్వామిగా భక్తుల పాలిట కొంగుబంగారంలా పూజలందుకుంటున్నారు. యర్రగొండపాలెం: దట్టమైన నల్లమల అడవిలో, కృష్ణానది ఒడ్డున పాలంక వీరభద్రస్వామి కొలువై ఉన్నాడు. స్వామి కరుణకోసం వేలాది మంది భక్తులు కాలినడకన, ప్రత్యేకవాహనాల్లో తరలివెళ్తారు. ప్రకాశం జిల్లాతో పాటు గుంటూరు, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి భక్తులు పాలంకకు చేరుకుంటారు. సంతాన ప్రాప్తి కోసం భక్తులు నల్లమల అడవుల్లోని పాలంక వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శిస్తారు. ఇక్కడి పెద్ద కొండచరియపై నుంచి పంచలింగాలపై జాలువారే నీటి బిందువుల కోసం సంతానం లేని దంపతులు దోసిళ్లు పడతారు. అలా దోసిళ్లపై నీటి బిందువులు పడిన దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. శ్రీశైల క్షేత్రానికి సమీపంలో వెలసిన పర్వతాల మల్లయ్య పాలుట్ల గిరిజన గూడేనికి పది కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. నల్లమల అందాలకు పరవశించిన పరమశివుడు ముగ్ధుడై పూజలందుకునేందుకు ఇక్కడ వెలిశాడని భక్తుల విశ్వాసం. స్వామిని ఇక్కడ పాలంకేశ్వరుడిగా పిలుస్తారు. శ్రీశైల క్షేత్రానికి సమీపంలో ఉన్న ఈ ఆలయంలో ఆరోగ్య, సౌభాగ్య, సంతాన ప్రదాత వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవార్లు ఇక్కడ కొలువై ఉన్నారు. ‘పర్వతాల మల్లయ్య, పాలంక వీరయ్య’ అంటూ పాడుకునే జానపద గేయాల ద్వారా ఈ క్షేత్రాన్ని శ్రీశైల క్షేత్రంతో పోల్చబడింది. ఏటా ఆషాడ శుద్ధ తొలిఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్సవాలు ప్రారంభమౌతాయి. కొండకోనల్లో ప్రయాణం సాగేదిలా శ్రీకృష్ణదేవరాయల వారి రక్షణ శ్రీశైలం క్షేత్రంతో విజయనగర సామ్రాజ్యధీశుడు శ్రీకృష్ణదేవరాయలకు ఎంత అనుబంధం ఉందో అంతే అనుబంధం పాలంక క్షేత్రంతోనూ ఉంది. రాయలవారు తూర్పు దండయాత్రల సందర్భంగా గజపతులను ఓడించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. అలా కృష్ణానది ఒడ్డున ప్రయాణం సాగిస్తుండగా ప్రజలు దారిదోపిడీ దొంగల నుంచి తమను కాపాడాలని వేడుకున్నారు. అప్పుడు తన సైన్యాధిపతులైన బొడా వెంకటపతినాయుడు, నలగాటి పెద్ద తిమ్మనాయుడులకు ఈ ప్రాంతాన్ని జాగీరులుగా ఇచ్చి నది పక్కన ఆలాటం కోటను నిర్మించారు. అక్కడి నుంచి ఆరు కిలో మీటర్ల దూరంలో పాలంక వీరభద్రుడు, భద్రకాళీ మాతను ప్రతిష్టించి ఆ ప్రాంతానికి రక్షణ బాధ్యతను తన సైన్యాధిపతులకు అప్పగించారని చరిత్ర చెప్తుంది. అహ్లాదంగా కొండకోనల్లో భక్తిరస యాత్ర పాలంక క్షేత్రం యర్రగొండపాలెం మండలంలోని వెంకటాద్రిపాలెం పంచాయతీ పరిధిలోకి వస్తుంది. అక్కడి నుంచి పాలంక చేరుకునేందుకు 42 కిలోమీటర్ల యాత్ర సాగించాలి. దట్టమైన నల్లమల అడవుల్లో ఆకాశాన్ని అంటే కొండల్లో నుంచి సాగే ఈ భక్తిరస యాత్ర ఎంతో అహ్లాదాన్ని కలిగిస్తుంది. విజయనగర సామ్రాజ్యధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు పాలన వైభవనాకి చెరిగిపోని జ్ఞాపకంగా ఈ పాలంక క్షేత్రం నిలుస్తుంది. -
కోర్టు కష్టాలు
సాక్షి, యర్రగొండపాలెం(ప్రకాశం): యర్రగొండపాలెంలో కోర్టు లేకపోవడంతో కక్షిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. వారితో పాటు పోలీసులు కూడా అనేక వ్యయప్రయాసలకోర్చి నిందితులను సుదూర ప్రాంతమైన మార్కాపురం కోర్టులో హాజరుపరిచే పరిస్థితి ఏర్పడింది. పుల్లలచెరువు మండలంలోని మర్రివేముల గ్రామం నుంచి మార్కాపురం కోర్టు దాదాపు 70 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. అదేవిధంగా నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఉన్న శివారుగ్రామాలను దూరప్రాతిపదిక కింద చూసుకుంటే దాదాపు 110కిలోమీటర్ల దూరం ఉంటుంది. నియోజకవర్గంలో అన్ని కేసులు కలుపుకొని 700 వరకు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాల్లో ఉన్నాయి. దీంతో వాయిదాలకు బస్సుల్లో వెళ్లే వారు కోర్టుకు సకాలంలో హాజరుకాలేక పోతున్నారు. అంతేకాకుండా సాయంత్రం వరకు కోర్టు ఆవరణలోనే కేసు వాయిదా పడిన తరువాత తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు బాధితులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉంది. ప్రత్యర్థి వర్గం వారు రాత్రివేళల్లో ఎక్కడ దాడులు జరుపుతారో అన్న భయంతో అనేకమంది మార్కాపురంలోనే బసచేస్తున్నారు. దీనివలన కక్షిదారులు ఎక్కువగా ఖర్చుపెట్టు పెట్టుకోవాల్సి వస్తుంది. జిల్లాలోనే పూర్తిగా వెనకబడిన యర్రగొండపాలెం నియోజకవర్గం గిరిజన ప్రాంతం. గిరిజనులతో పాటు పేదలు ఎక్కువగా ఉండేఈ ప్రాంతంలో కేసులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. వీరు ఖర్చుపెట్టుకొని మార్కాపురం వెళ్లటానికి అప్పులు చేస్తుంటారు. రెట్టింపయిన జనాభా.. గతంలో మార్కాపురం తాలూకాలో యర్రగొండపాలెం ఒక భాగం. అప్పట్లో ఈ ప్రాంతం డిప్యూటీ తహసీల్దార్ పాలనలో ఉండేది. భూములకు సంబంధించిన కేసులను పరిష్కరించేందుకు రెవెన్యూ కోర్టు ఉండేది. ప్రస్తుతం రెవెన్యూ కార్యాలయం ఆవరణలో ఉన్న రేకుల షెడ్డులో కోర్టు నడిచేది. తదనంతరం వైపాలెం నియోజకవర్గంగా ఏర్పడింది. తహసీల్దార్ స్థాయికి ఎదిగింది. జనాభాకూడా రెట్టింపయింది. తదనుగుణంగా కేసులు కూడా పెరుగుతు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని యర్రగొండపాలెంలో కోర్టును ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతం ప్రజలు కోరుతున్నారు. కోర్టు కోసం అర్జీలు పెట్టాం కోర్టు కావాలని అనేక పర్యాయాలు అర్జీలు పెట్టాం. ఈ ప్రాంతంలో ఎక్కువగా కేసులు ఉన్నాయి. కక్షిదారులు కోర్టుకు హాజరుకావటానికి వ్యయప్రయాసాలకోర్చి మార్కాపురం వెళ్లాల్సి వస్తోంది. బాధితులు కోర్టు వాయిదా అయిపోయిన తరువాత తమ గ్రామాలకు వెళ్లటానికి బస్సులులేక అక్కడే బసచేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వైపాలెంలో కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. – టీసీహెచ్ చెన్నయ్య, సీపీఐ సీనియర్ నాయకుడు -
అత్తారింటి ఎదుట కోడలు మౌనదీక్ష
సాక్షి, యర్రగొండపాలెం(ప్రకాశం): తన భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదని, అత్తమామలు ఇంట్లోకి రానివ్వడం లేదని ఓ యువతి తన అత్తారింటి ఎదుట మౌనదీక్షకు కూర్చొంది. ఈ సంఘటన మండలంలోని కొలుకుల ఎస్సీ పాలెంలో శుక్రవారం వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బరిగెల పిలుపు, మరియమ్మలు ప్రేమించుకున్నారు. వారు వివాహం చేసుకోవాలని అనుకుంటున్న తరుణంలో మరియమ్మ తల్లిదండ్రులు ఏసయ్య, దీవెనమ్మలు పెద్దారవీడు మండలం తంగిరాలపల్లె గ్రామానికి చెందిన ఒకరితో కుమార్తెకు వివాహం చేశారు. అయినా పిలుపు తరుచూ తంగిరాలపల్లె వెళ్లి వస్తుండేవాడు. ఈ విషయం గమనించిన భర్త..ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత పిలుపు ఆమెను గుంటూరు తీసుకెళ్లాడు. ఈ వ్యవహారంపై పెద్దారవీడు పోలీసుస్టేషన్లో కేసులు కూడా పెట్టుకున్నారు. పిలుపు, మరియమ్మలకు పోలీసులు దండలు మార్పించి వివాహం చేశారు. పోలీసుస్టేషన్ నుంచి వారిద్దరు స్వగ్రామానికి చేరకుండా పనుల కోసం హనుమాన్ జంక్షన్‌కు చెరకు కోతలకు వెళ్లారు. అక్కడి నుంచి బేల్దారి పనుల కోసం హైదరాబాద్ వెళ్లారు. ఆయా ప్రాంతాల్లో దాదాపు రెండు, మూడు నెలలు పనులు చేసుకున్నారు. దంపతుల మధ్య పొరపొచ్చాలు చోటుచేసుకోవడంతో పిలుపు తన భార్యను స్వగ్రామం కొలుకులలోని ఆమె పుట్టింట్లో వదిలి పెట్టి వెళ్లాడు. పిలుపు 20 రోజుల క్రితం గ్రామానికి చేరాడు. ఈ నేపథ్యంలో మరియమ్మ బంధువులు పెద్ద మనుషులు వారిద్దరినీ కలిపేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పెద్దలతో సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు సలహా ఇచ్చినట్లు తెలిసింది. తిరిగి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరుగుతున్న సమయంలో ఇరు కుటుంబాలకు చెందిన వారు ఘర్షణకు దిగారు. ఇంట్లోకి వెళ్లేందుకు మరియమ్మ ప్రయత్నించగా భర్త అడ్డుకున్నాడు. భర్తతో పాటు అత్తమామలు తనను ఇంట్లోకి రానివ్వడం లేదని మరియమ్మ అక్కడే మౌనదీక్షకు కూర్చుంది. కేసు దర్యాప్తు చేస్తామని ఎస్ఐ ముక్కంటి తెలిపారు. -
జగన్ సీఎం అయ్యాడని శ్రీశైలానికి పాదయాత్ర
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, యర్రగొండపాలెం ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ మంత్రిగా నియమితులైన సందర్భంగా ముగ్గురు యువకులు హైదరాబాదులోని లోటస్‌పాండ్ నుంచి శ్రీశైలం వరకు చేపట్టిన పాదయాత్ర మంగళవారం యర్రగొండపాలెం చేరింది. వీరికి పార్టీ సీనియర్ నాయకుడు ఒంగోలు మూర్తిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జగన్మోహన్రెడ్డి సీఎం, సురేష్ మంత్రి కావాలని లోటస్‌పాండ్‌నుంచి శ్రీశైలానికి పాదయాత్ర చేస్తామని వైపాలేనికి చెందిన యువకులు దగ్గుల కాశిరెడ్డి, అఖిల్‌బాష, అశోక్‌రెడ్డిలు మొక్కుకున్నారు. ఈ సందర్భంగా వారు ఈ నెల 11వ తేదీన పాదయాత్ర ప్రారంభించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కె.ఓబులరెడ్డి, ఎన్.వెంకటరెడ్డి, జి.వెంకటరెడ్డి, ఒ.సుబ్బారెడ్డి, వెంకటస్వామి, రామచంద్రయ్య, రాములునాయక్, జి.రామిరెడ్డి, పి.శ్రీను, వై.రాంబాబు, అంకిరెడ్డి, పెద్దకాపు వెంకటరెడ్డి, జి.రామిరెడ్డి, జయరావులు పాల్గొన్నారు. -
దత్తత పేరుతో ఎన్నారై ఆలీ గ్రామాన్నే మింగేశాడు
ఎర్రావారిపాళెం(చిత్తూరు) : దత్తత ముసుగులో భారీ కుంభకోణానికి తెరలేపారంటూ ఎన్ఆర్ఐ అబ్దుల్ అలీ భూ ఆక్రమణపై రైతులు తిరుగుబాటు చేశారు. బుధవారం ఎర్రావారిపాళెం తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. వారు మాట్లాడుతూ, దత్తత తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటూ ప్రభుత్వ ఫలాలన్నీ బొక్కేశాడంటూ మండిపడ్డారు. గ్రామంలో కక్కూసు బిల్లుల నుంచి రైతులకందే ఉద్యాన నిధుల వరకు కాజేయడంలో అబ్దుల్‌అలీ సిద్ధ హస్తుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్ప్ ఫ్యాక్టరీ నిర్మిస్తానంటూ రైతులను బెదిరించి ఎర్రావారిపాళెం సమీపంలోని మబ్బుతోపు వద్దనున్న రైతుల భూములను ఆక్రమించడానికి పన్నాగం పన్నాడన్నారు. పలుమార్లు ఉన్నతాధికారులకు అబ్దుల్ అలీపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. రైతులకు ట్రైనింగ్ పేరిట ఉద్యానశాఖలోని ఉన్నత స్థాయి అధికారి అండతో నిధులను మింగేశారని చెప్పారు. దీన్‌దార్లపల్లిలో ఇంటిగ్రేటెడ్ ప్యాక్‌హౌస్‌ను రైతుల కోసమంటూ ప్రభుత్వ రాయితీతో నిర్మించుకొని ప్రైవేటు కార్యక్రమాలు, పార్టీ కార్యకలాపాలను నడుపుతూ రైతులను అడ్డదిడ్డంగా బెదిరించ సాగారన్నారు. రైతులకు న్యాయం చేయాలి ఎన్ఆర్ఐ అబ్దుల్‌అలీ బారి నుంచి తమ వ్యవసాయ భూములను తమకు ఇప్పించాలంటూ రైతులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేయాలంటూ అధికారులను డిమాండ్ చేశారు. రైతు సంఘం పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన అబ్దుల్ అలీపై చర్యలు తీసుకొని బాధిత రైతులకు న్యాయం చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. రైతులంతా ఏకమై వందలాదిగా తరలివచ్చారు. అబ్దుల్ అలీ అక్రమంగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీలో తమ భూములు కోల్పోయామంటూ తహసీల్దార్ దైవాదీనంకు విన్నవించారు. -
వెలిగొండ పూర్తే ప్రధాన ధ్యేయం
సాక్షి, ప్రకాశం: వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సాక్షితో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రతి మండల కేంద్రంలో రైతు బజారు ఏర్పాటు చేయిస్తాం. రైతులు పండించిన తమ పంటలను రైతు బజార్లలో అమ్ముకోవచ్చు. దీనివలన రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ప్రజలకు తాజా కూరగాయలు అందుతాయి’ అన్నారు. ప్రతి పంచాయతీ మండల కేంద్రానికి అనుసంధానం ప్రతి పంచాయతీ మండల కేంద్రాలకు అనుసంధానం అయ్యేవిధంగా రోడ్లు అభివృద్ధి చేస్తాం. దీనివలన మండలకేంద్రాలకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 2020 నాటికి వెలిగొండ పూర్తి వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితేనే పశ్చిమ ప్రకాశం సస్యశ్యామలంగా ఉంటుంది. ముఖ్యంగా అన్నిరంగాల్లో పూర్తిగా వెనకబడిన యర్రగొండపాలెం నియోజకవర్గం అభివృద్ధి దిశలో నడుస్తుంది. ఈ ప్రాజెక్టును 2020 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాను. అందుకు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన వెంటనే ప్రాజెక్టుకు పుష్కలంగా నిధులు కేటాయిస్తారు. తన తండ్రి ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తారన్న నమ్మకం నియోజకవర్గ ప్రజల్లో ఉంది. ప్రతి ఇంటికి రక్షిత నీరు అందజేస్తాం నియోజకవర్గంలోని 5మండలాల్లో 84పంచాయతీలు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. కాలంతో పనిలేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సాగర్ కాలువ అందుబాటులో ఉన్నప్పటికి ఫలితం లేకుండా పోయింది. నిధులు పూర్తిగా దుర్వినియోగం చేశారేతప్ప శాశ్వత పరిష్కారం చూపించలేక పోయారు. భవిష్యత్తు కాలంలో అటువంటి పరిస్థితి తలెత్తకుండా ప్రతి ఇంటికి రక్షిత నీరు అందచేయటానికి చర్యలు తీసుకుంటాం. వైపాలేన్ని అభివృద్ధి చేస్తా యర్రగొండపాలెం నియోజకవర్గం జిల్లాలో పూర్తిగా వెనకబడిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు, రైతు కూలీలు ఎక్కువగా వలసలు వెళ్తుంటారు. ఆ వలసలను ఆపాలంటే శాశ్వత ప్రాతిపదిక పనులు కల్పించాలి. అందుకు తగిన వనరులు వెతుక్కోవలసి ఉంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని 2004లో వైఎస్సార్ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించారు. తగిన నిధులు కెటాయించి 70 శాతం పనులు పూర్తిచేశారు. ఆయన అకాల మరణంతో ఈ ప్రాజెక్టు పనులు కుంటుపడ్డాయి. వైఎస్సార్ తరువాత వచ్చిన పాలకులు వెలిగొండ ప్రాజెక్టును ఎరగా చూపి పశ్చిమ ప్రకాశం ప్రజలను మభ్యపెడుతు వచ్చారు. ఓట్ల కోసం ఆ ప్రాజెక్టును ఉపయోగించుకున్నారు. పంచాయతీలతో సంబంధం లేకుండా గిరిజన గూడేల అభివృద్ధి నియోజకవర్గంలోని నల్లమల అడవుల్లో ఎక్కువగా గిరిజనులు నివసిస్తున్నారు. ఆ గూడాలు అభివృద్ధికి నోచుకోలేదు. పాతయుగంనాటి జీవితాలే వారు గడుపుతున్నారు. గిరిజన సమస్యలను పరిష్కరించేందుకు పంచాయతీలతో సంబంధం లేకుండా నిధులు కేటాయించి గూడాలను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది. సాగర్ ఆయకట్టు రైతులకు నీరు అందేవిధంగా చర్యలు సాగర్ ఆయకట్టు రైతులకు సకాలంలో నీరు అందేవిధంగా చర్యలు తీసుకుంటాం. పంటలు వేసిన తరువాత ఆ పంట చేతికి వచ్చేవరకు నీరు సరఫరా అయ్యేందుకు కృషి చేస్తాం. సాగర్ కాలువలు ఆధునీకరణకు నిధులు పుష్కలంగా విడుదల అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటాను. చెరువులు పునరుద్ధరణకు చర్యలు నియోజకవర్గంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. రైతులు తమ పొలాల్లో 800 అడుగులలోతు బోరు డ్రిల్లింగ్ చేసినా నీరు ఉబికి వచ్చే పరిస్థితిలేదు. అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు చెరువులలో నీరు చేరుతున్నప్పటికి ఆ నీరు వృథాగా బయటికి వెళ్తున్నాయి. అందుకు కారణం చెరువు కట్టలు పటిష్టంగా లేకపోవడం, కాలువలు, తూములు శిథిలావస్థకు చేరడమే. చెరువులను పునరుద్ధరించి, చెరువు కట్టలు పటిష్టం చేసినట్లయితే నీటి నిలువలు మెంటుగా ఉంటాయి. భూగర్భ జలాలు పెరుగుతాయి. నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన ధ్యేయం నియోజకవర్గ అభివృద్ధే ప్రధానధ్యేయంగా పెట్టుకున్నాను. నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకొని తక్షణమే పరిష్కరించేవిధంగా కృషి చేస్తాను. ముఖ్యంగా వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటాను. గ్రామాల్లో నీటి సమస్య లేకుండా చేస్తాను. నియోజకవర్గంలో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించి ఉద్యాన పంటలు పండించే రైతులు తమ పంటలను ఇక్కడే గిట్టుబాటు ధరలకు అమ్ముకునే విధంగా చర్యలు తీసుకుంటాను. జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వలన కొంత మేరకు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజి ఏర్పాటు చేస్తాను. ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉండి వారిసమస్యలను పరిష్కరిస్తాను. – టీడీపీ అభ్యర్థి బూదాల అజితారావు ప్రజలచెంతకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇస్తే, నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాను. గ్రామాలకు రోడ్డు సౌకర్యం కూడా లేని దౌర్భాగ్య స్థితిలో ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల చెంతకు చేరవేసేందుకు కృషి చేస్తాను. ప్రధానంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నియోజవర్గంలో పరిశ్రమలు నెలకొల్పే విధంగా చర్యలు తీసుకుంటాను. – కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెడబలిమి వెంకటేశ్వరరావు -
ఎర్రగొండపాలెం ఎన్నికల ప్రచారంలో వైఎస్ విజయమ్మ
-
మన్యంపై ‘రాజ’ముద్ర
సాక్షి, యర్రగొండపాలెం/పుల్లలచెరువు: అభివృద్ధి అనే మాట అక్కడ ఓ బ్రహ్మపదార్థం! పూరిపాకల్లో నివాసముంటూ బిక్కుబిక్కుమని బతకడమే వారికి తెలుసు. కానీ వారి జీవితాల్లో మార్పు తెచ్చారు దివంగత సీఎం వైఎస్సార్. అడవినే నమ్ముకుని దుర్లభమైన బతుకులు వెళ్లదీస్తున్న గిరిజనులకు సంక్షేమ ఫలాలు అందించి.. గిరిజనుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. 2009లో అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి బంగారం పండించే భూములపై గిరిజనులకు హక్కు కల్పించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చారు. శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు పరిధిలోని 5 జిల్లాల్లో నివసిస్తున్న 2,360 మంది గిరిజనులు సాగు చేసుకుంటున్న 7381 ఎకరాల భూములకు పట్టాలు అందజేశారు. ప్రకాశం జిల్లాలో 1,138 మందికి 4428 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 348 మందికి 1034 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 149 మందికి 319 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 63 మందికి 75ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 662 మందికి 1,529 ఎకరాల చొప్పున స్వయంగా వైఎస్సార్ పట్టాలు పంపిణీ చేశారు. పక్కా గృహాలు, రోడ్లు మంజూరు చేశారు. గిరిపుత్రులు ఆ భూముల్లో బంగారు పంటలు పండిస్తూ వారి జీవితాలను సుఖమయం చేసుకుంటున్నారు. తమ జీవితాల్లో వెలుగును నింపిన వైఎస్సార్‌ను తాము ఎన్నటికీ మరువలేమని నల్లమల అడవుల్లో జీవిస్తున్న గిరిజనులు పేర్కొంటున్నారు. వైఎస్సార్ మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తమను విస్మరించాయని, గిరిజనుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో తమకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వారు విమర్శిస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఇబ్బందులు వైఎస్సార్ అటవీ భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకుంటే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క పట్టాకు కూడా బ్యాంకులు రుణాలు మంజూరు చేయలేదని, ప్రభుత్వం రైతులకు అందిచే సబ్సిడీ విత్తనాలు, పురుగు మందులు తమ చెంతకు చేరడం లేదని, ఇదేమిటని ప్రశ్నిస్తే అటవీ భూములకు ప్రభుత్వ రాయితీలు వర్తించబని అధికారులు బదులిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భూముల్లో బోరుబావులు తవ్వించుకునేందుకు కూడా అటవీశాఖాధికారులు అభ్యంతరం చెబుతున్నారని వారు తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన రైతులకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ రాయితీలు అందజేస్తారన్న నమ్మకం తమకు ఉందని పేర్కొన్నారు. రాజన్నను ఎట్టా మరిసిపోతాం తన ఇంట్లో వైఎస్సార్ చిత్రపటంతో అభిమాని వైఎస్సార్ హయాంలో ఎంతో లబ్ధిపొందిన గిరిజనులు నేటికీ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. రాజన్న సేవలకు గుర్తుగా గారపెంట లాంటి గిరిజనగూడేల్లోని ఇళ్లలో వైఎస్సార్ చిత్రపటం కనిపిస్తుంది. గిరిజనగూడేల్లో మౌలిక వసతులు సమకూరింది వైఎస్సార్ హయాంలోనే కావడం గమనార్హం. కారు చీకట్లో నివసించే గిరిజనులు మొట్టమొదటిసారిగా వైఎస్సాఆర్ పాలనలో విద్యుత్ కాంతులను చూశారు. గిరిజన గూడేల్లో సీసీ రోడ్లు వేయించి, అటవీ ఉత్పత్తులపైనా హక్కులు కల్పించారు. ఏడాది పొడువునా ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించి కూలీల కుటుంబాల్లో సంతోషం నింపారు. దీంతో గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. పదో తరగతి పూర్తి చేసుకున్న గిరిజన విద్యార్థులు ఫీజు రీయింబెర్స్‌మెంట్ పథకం ద్వారా కార్పొరేట్ కళాశాలలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించారు. నేడు వివిధ రకాల ఉద్యోగాలు చేసుకుంటూ దివంగత నేతను స్మరించుకుంటున్నారు. దుర్లభమైన జీవితాలను అనుభవించేవాళ్లం మా తాతముత్తాతల కాలం నుంచి అడవులను నమ్ముకుని బతుకుతున్నాం. కట్టెలు కొట్టుకుని టౌనుకు తీసుకెళ్లి అమ్ముకుంటాం. భూముల్లో పంటలు వేసుకుంటే అటవీశాఖాధికారులు నాశనం చేసేవారు. కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. మా బాధలు గుర్తించిన వైఎస్సార్ అటవీ హక్కుల చట్టం తేవడంతో స్వేచ్ఛగా పోలాలు సాగు చేసుకుంటున్నాం. – పాత్లావత్ పెద్దమంత్రూనాయక్, రైతు పంట రుణాలు ఇవ్వడం లేదు అడవుల్లో జీవించే తమకు వైఎస్సార్ భూమి పట్టాలు ఇచ్చారు. ఆ భూముల్లో తాము మంచి పంటలు పండించగలుగుతున్నాం. పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. అధికారులు స్పందించి అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పొందిన భూములకు రుణాలు ఇచ్చేవిధంగా చూడాలి. – యర్రబాలనాయక్, రైతు ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోతే చదువు లేదు నేను బీఎస్సీ బీఈడీ చేశా. ఆనాడు ఫీజురీయింబర్స్‌మెంట్ లేకపోతే నేను కేవలం డిగ్రీతో చదువు ఆపేసి ఉండేవాణ్ని. కానీ వైఎస్సార్ చలవతో బీఈడీ సీటు ఉచితంగా దక్కింది. ఫీజు కట్టకుండానే చదువు పూర్తి చేశా. నా లాంటి వారు ఎందరో ఉచితంగా చదువుకుంటున్నారు. – బొజ్జా శ్రీనివాసరావు, గారపెంట గిరిజన పంచాయతీలు ఎక్కడ? గిరిజనుల అభివృద్ధికి పాటుపడతామని 2014 ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీకూడా నెరవేర్చలేదు. తిరిగి గిరిజనులను మరింతగా మభ్యపెట్టేందుకు జరగబోయో ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి 5 వందలు జనాభా ఉన్న ప్రతి గూడేన్నిను ప్రత్యేక పంచాయతీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అందుకు ఎటువంటి చట్టం చేయలేదు. టీడీపీ పెద్దలు చెప్పే మాటలను గిరిజనులు నమ్మే పరిస్థితుల్లో లేరు. – పాత్లావత్ రాములు నాయక్, ఎంపీటీసీ సభ్యుడు, చెర్లోతండా -
మళ్లీ రోడ్డు పైకి శ్రీరెడ్డి
సాక్షి, ఎర్రగొండపాలెం : టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతూ సంచలనంగా వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. సినీ ప్రముఖులపై విమర్శలు చేస్తూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. గతంలో టాలీవుడ్లో మహిళలపై జరుగుతున్న దారుణాలను ఆమె తీవ్రంగా ఖండించారు. సినీ పరిశ్రమలో మహిళలకు అండగా ఉంటానంటూ ఇటీవల ఆమె ప్రకటించారు. తాజాగా ఆమె మరోసారి రోడ్డుపై నిరనస వ్యక్తం చేశారు. అయితే ఈసారి సినీ పరిశ్రమ గురించి కాకుండా ఉపాధి కూలీలు చేస్తున్న నిరసనకు ఆమె మద్దతు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీరెడ్డి శ్రీశైలం వెళ్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం, గురిజేపల్లి సమీపంలో కొందరు తమకు ఉపాధి పనులు కల్పించడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. అటుగా వెళ్తున్న శ్రీరెడ్డి కారు దిగి, తలకు తలపాగా చుట్టుకొని స్థానికులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఆమెను చూసిన స్థానికులు అవాక్కయ్యారు. శ్రీరెడ్డి ఏంటీ.. ఇలా తమకు మద్దతు ఇవ్వడం ఏంటని విస్తుపోయారు. కాసేపు అక్కడ హడావుడి చేసిన ఆమె, స్థానికులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం తన కారులో అక్కడ నుండి వెళ్లిపోయారు. -
బాబు పెద్ద జాదూ!
యర్రగొండపాలెం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పెద్ద జాదూ అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన ఆయన ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదని చెప్పారు. సీపీఐ నియోజకవర్గ 2వ మహాసభ సందర్భంగా శనివారం స్థానిక షాదీఖానాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. బాబొస్తే జాబొస్తుందని నినాదాలు చేసిన టీడీపీ నాయకులు ఉన్న జాబులను ఊడ కొడుతున్నారని, జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి పచ్చని పల్లెల్లో చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. సర్కారు వైఖరి చూసి అధికార పక్షానికి చెందిన పేదలు, రైతులు సైతం తిరగబడుతున్నారని చెప్పారు. పశ్చిమ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించే పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుంటే జిల్లాలోని టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు చేతులు ముడుచుకొని కూర్చున్నారని విమర్శించారు. మోదీ జంతర్‌మంతర్.. ప్రధాని నరేంద్ర మోదీ జంతర్‌మంతర్ చేసి అధికారంలోకి వచ్చాడని ఆయన మాటలు ఢిల్లీ కోట దాటడం లేదని ముప్పాళ్ల ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత, సెక్యులర్ పార్టీలు కూటమిగా ఏర్పడక పోవడం లాంటి అంశాలు బీజేపీకి కలిసి వచ్చిన అదృష్టంగా పేర్కొన్నారు. దేశంలో 77శాతం ప్రజల ఆస్తి కేవలం 57 కుటుంబాలకు సమానంగా ఉందని ఒక సర్వేలో తేలిందన్నారు. పేదల కష్టార్జితం అంతా బడాబాబులకు చేరుతుందని, కోటీశ్వరుల పక్షాన మోదీ రాజ్యం ఏలుతున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు సంవత్సరానికి 2కోట్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన ఆయన లక్షల్లో కూడా ఇప్పించలేక పోయారని, ఆయన బాటలో రాష్ట్ర పాలన కూడా నడుస్తోందన్నారు. బీజేపీ పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూలిపోయిందని, పత్తి రైతులు నాశనం అవుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మెదపడం లేదని ఆరోపించారు. ముందుగా ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి మాచర్ల రోడ్డులోని షాదీఖానా వరకు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకుడు టీసీహెచ్ చెన్నయ్య, గుర్నాథం, నూర్జహాన్‌లు అధ్యక్షత వర్గంగా వ్యవహరించారు. సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అరుణమ్మ, ఏపీ రైతుసంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కేవీవీ ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి ఎం.ఎల్.నారాయణ, కేవీ కృష్ణగౌడ్, డి.శ్రీనివాస్, ఆయా మండలాల పార్టీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనకు స్థలం పరిశీలన
యర్రగొండపాలెం : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 4వ తేదీన యర్రగొండపాలెం వస్తున్న సందర్భంగా కలెక్టర్ సుజాతశర్మ ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం, మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణం, సీడీపీఓ కార్యాలయాన్ని పరిశీలించారు. జన్మభూమి–మా ఊరు సభలో భాగంగా సీఎం యర్రగొండపాలెం రానున్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, ఎస్పీ డాక్టర్ సీఏం త్రివిక్రమవర్మ, జిల్లా పరిషత్ సీఈఓ బాపిరెడ్డిలతో కలెక్టర్ సుజాతశర్మ సమీక్షించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో వేదిక, మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో హెలీప్యాడ్, పైలాన్ ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు. మార్కాపురం రోడ్లో తూర్పు వైపు ఉన్న భవనాలు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అధికారులతో మండల పరిషత్ కార్యాలయంలో సీఎం పర్యటనకు సంబంధించి కలెక్టర్, ఎస్పీ సమీక్షించారు. వేదిక వద్దకు వచ్చే ప్రజలను దృష్టిలో ఉంచుకుని వాహనాలు పార్కింగ్ చేసేందుకు ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా మైదానాలను ఎస్పీ త్రివిక్రమవర్మ పరిశీలించారు. కలెక్టర్ సుజాతశర్మ వెంట స్థానిక ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మన్నె రవీంద్ర, ఆర్డీఓ కె.చంద్రశేఖరరావు, మార్కాపురం ఓఎస్డీ లావణ్యలక్ష్మి, డీఎస్పీ ఆర్.శ్రీహరిబాబు, సీఐలు డి.మల్లికార్జునరావు, వి. శ్రీరాం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కాంతనా«థ్, ఈఈ మల్లికార్జునరావు, డిప్యూటీ ఈఈ జె.లక్ష్మానాయక్, పంచాయతీరాజ్ ఎస్ఈ చంద్రశేఖరయ్య, ఈఈ జయరామ్దాస్, జేడీఏ మురళీకృష్ణ, ఐసీడీఎస్ పీడీ విశాలాక్షి, సీడీపీఓ వెంకటలక్ష్మమ్మ, ఏడీ వెంకటేష్ ప్రసాద్, ఏపీఆర్ఓ మల్లేష్, తహసీల్దార్ ఎం. రత్నకుమారి, ఎంపీడీఓ టి.హనుమంతురావు, జెడ్పీటీసీ సభ్యుడు ఎం. మంత్రూనాయక్, సర్పంచి సొరకాయల మంగ మ్మ, స్థానిక అధికారులు పాల్గొన్నారు. -
పేకాటరాయుళ్లు అరెస్ట్ : రూ. 25 వేలు స్వాధీనం
ఒంగోలు : ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని పేకాట స్థావరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ సందర్భంగా నలుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 25 వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకుని.... సీజ్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించి.. వారిపై కేసు నమోదు చేశారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
ఎర్రగొండపాలెం (ప్రకాశం) : ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలో రెడీమేడ్ బట్టల షాపు నిర్వహిస్తున్న మస్తాన్ వలీ భార్య పెద పీరమ్మ(30) ఆదివారం ఉదయం హెయిర్ డై తాగి బలవన్మరణానికి యత్నించింది. దీనిని గమనించిన మస్తాన్ వలీ భార్యను స్థానిక ఆస్పత్రికి తరలించాడు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో నర్సరావుపేటలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రాణాలొదిలింది. కాగా మస్తాన్ వలీ పరారీలో ఉన్నాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
విద్యుత్‌శాఖ ఏడీఈ గుట్టురట్టు
యర్రగొండపాలెం : విద్యుత్‌శాఖ ఏడీఈ అవినీతి గుట్టురట్టయింది. బదిలీ అయిన ఏడీఈ.. ఇన్చార్జి ఏడీఈకి బాధ్యతలు అప్పగించిన అనంతరం కూడా కార్యాలయంలోనే ఉండి అవినీతికి పాల్పడటంతో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ సంఘటన సోమవారం యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకెళ్తే... యర్రగొండపాలెం మండలంలోని గుర్రపుశాలకు చెందిన మందా ఇస్సాకు అనే రైతు తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. త్వరగా ఎస్టిమేషన్‌వేసి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరుతూ 15 రోజుల క్రితం విద్యుత్‌శాఖ యర్రగొండపాలెం సబ్‌డివిజన్ అధికారి (ఏడీఈ) ఎస్.శ్రీనివాసరెడ్డిని కలిశాడు. అందుకోసం తనకు రూ.20 వేలు ఇవ్వాలని ఏడీఈ డిమాండ్ చేయడంతో, అంతమొత్తం ఇవ్వలేనని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరకు రూ.13 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ముందుగా రూ.5 వేలు ఇచ్చాడు. మిగిలిన రూ.8 వేలు రెండు వారాల్లో ఇస్తానని చెప్పాడు. అంత డబ్బు ఇచ్చే స్థోమతలేక, ఏడీఈ వేధింపులు భరాయించలేక ఈ నెల 22వ తేదీ ఒంగోలులోని ఏసీబీ అధికారులకు ఇస్సాకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ జిల్లా డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ సత్యనారాయణమూర్తి, ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వరరావు, ఎన్.శివకుమార్‌రెడ్డి, ఎస్సై వెంకటేశ్వరరావు, సిబ్బంది రంగంలోకి దిగారు. సోమవారం యర్రగొండపాలెం చేరుకుని ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఇస్సాకుకు కెమికల్స్ పూసిన 500 రూపాయల నోట్లు 16 (రూ.8 వేలు) ఇచ్చి కార్యాలయంలో ఉన్న ఏడీఈ వద్దకు పంపారు. ఇస్సాకు ఆ నోట్లను ఏడీఈ శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన వెంటనే ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యునిగా డేవిడ్‌రాజు
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యునిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజును ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించినట్లు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. డేవిడ్‌రాజు గతంలో జెడ్పీ చైర్మన్ గా, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఎన్నికల్లో వైపాలెం నుంచి వైఎస్సార్ సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. సామాజిక, రాజకీయ అంశాలపై పట్టుంది. తనపై నమ్మకంతో రెండు పదవులు ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి డేవిడ్‌రాజు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. -
గిరి పుత్రుల ‘రాజన్న’
న్యూస్‌లైన్, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, సమాజానికి దూరంగా.. అడవి తల్లిని నమ్ముకుని అంధకారంతో సావాసం చేస్తూ.. ఒంటిపై కనీసం దుస్తులు కూడా కరువై.. పౌష్టికాహార లోపంతో.. డొక్కలు బయటపడి.. వ్యాధులతో రోజులు లెక్కపెట్టుకొనే గిరిజనుల వెతలు వర్ణనాతీతం. అటవీ ఉత్పత్తులతోనే పొట్ట నింపుకుంటూ దుర్భర జీవితాన్ని గడుపుతున్న గిరిజనుల గురించి వైఎస్‌కు పూర్వం ఏ నాయకుడూ ఆలోచించలేదంటే అతిశయోక్తికాదు. ఆయన సీఎం అయ్యాక చెంచులు ఇతర తెగల సాధికారత కోసం ఆయన విశేష కృషి చేశారు. తమకు చేసిన సేవలకు గుర్తుగా పుల్లల చెరువు మండలం గారపెంటలో వైఎస్ దేవాలయం నిర్మించారంటే ఆయనపై గిరిపుత్రులకున్న ప్రేమాభిమానాలు అర్థం చేసుకోవచ్చు. చెంచుల అభ్యున్నతికి వైఎస్ చేసిన కార్యక్రమాలు - ప్రకాశం జిల్లాలో పెద్దారవీడు, దోర్నాలు, అర్ధవీడు, యర్రగొండపాలెం, పుల్లల చెరువు మండలాలతో పాటు మార్కపురం మండంలోని రెండు గ్రామాలు కలుపుకుని 82 చెంచు గూడేలున్నాయి. వీటన్నింటికీ వైఎస్ హయాంలో మంచినీటి సౌకర్యం, తారురోడ్లకు సుమారు 5-6 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. - భూమి కొనుగోలు పథకానికి *1 కోటి రూపాయలు మంజూరు చేశారు. దీని ద్వారా దాదాపు అన్ని చెంచు గూడేల్లోని గిరిజనులకు భూమి పట్టాలు లభించాయి. - టీబీ వ్యాధిగ్రస్తుల కోసం పౌష్టికాహారం మంజూరు చేశారు. ఆయన అనంతరం ఈ పథకం మూలన పడింది. - ఉపాధి హామీ పథకం కింద చెంచులకు పనులను కల్పించి వారి భూములను సాగులోకి వచ్చేలా చేశారు. - ఉచితంగా పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. - ఉపాధి హామీ పథకం కింద రోజువారీ కూలి ముందుగానే చెల్లించారు. కూలి కింద కొన్ని నెలలపాటు నిత్యావసర వస్తువులు, నగదు చెల్లించే పద్ధతి అమలు చేశారు. - పింఛన్ అనే పదం తెలియని చెంచులకు.. ఆయన హయాంలో పింఛన్ అందేవిధంగా చర్యలు తీసుకున్నారు. - పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి చెంచు మహిళల్లో చైతన్యం తీసుకొని వచ్చారు. ఆర్భాట ప్రకటనలకే పరిమితమైన కిరణ్ - గత ఏడాది అక్టోబరు 9వ తేదీన నాటి సీఎం కిరణ్‌కుమార్ త్రిపురాంతకంలోని కోల్డు స్టోరేజీలో చెంచులతో ముఖాముఖి నిర్వహించగా గిరిజనులు ఉత్సాంగా ఆ సమావేశానికి వెళ్లారు. - రోడ్లు కావాలని వారు అడగడంతో ఆ మేరకు ఆదేశించారు. - పాలుట్లకు వెళ్లే 40 కిలోమీటర్ల మేర మెటల్ రోడ్డు వేయటానికి *39 కోట్లతో ఐటీడీఏ అధికారులతో అంచనాలు తయారు చేశారు. - అయితే అడవిలో రోడ్డు వేయటానికి ఎటువంటి పరిస్థితిలో అనుమతి ఇవ్వమని ఆ శాఖ అధికారులు స్పష్టం చేశారు. - ప్రస్తుతం చెంచులకు కాలిబాట కూడా లేక అల్లాడిపోతున్నారు. - వైఎస్ పంపిణీ చేసిన భూముల్లో కొన్ని చోట్ల వ్యవసాయ బోర్లు లేవు. - ఆర్భాటంగా ఇందిర జల ప్రభ ప్రారంభించారే కానీ బోరు బావుల అనుమతి లభించలేదు. - అలాగే బోడిరెడ్డిపల్లె వద్ద సీఎం కిరణ్ సమావేశం నిర్వహించినప్పుడు గారపెంట వాసులు తాటి భయమ్మ.. వ్యవసాయం చేసుకొనేందుకు ట్రాక్టర్ కావాలని కోరగా.. హామీ ఇచ్చిన కిరణ్‌కుమార్ రెడ్డి ఆ తర్వాత బుట్ట దాఖలు చేశారు. - యర్రగొండపాలెం మండలంలోని బావిపెంట, సుద్దకుంట, పెద్దమ్మతల్లి, బక్కచింతపెంట, నారుతడికల, పొన్నలబయలు, గుట్టలచేను, పాలుట్ల, నెక్కంటి, ఇష్టకామేశ్వరి, మంతనాల, ఆలాటం, బూరుగుండాల, పెద్దదోర్నాల మండలంలోని మర్రిపాలెం, పెద్దచామ, పెద్దారూట్ల, చెరువుగూడెం, బంధంబావి, పనుకోమడుగు, అయ్యనకుంట, పోతన్నగూడేల్లో ఎలాంటి వసతులు లేక వారంతా ఆవేదన చెందుతున్నారు. వైఎస్ మా దేవుడు సానా కాలం భూమి ఏందో మాకు తెలవదు. ఎట్టా వ్యగసాయం చేత్తారో కూడా తెలవదు. అసుంటుది వైఎస్ మా అందరికీ పొలాలిచ్చేడు. రైతులుగా మార్చేడు. గిప్పుడందరం బాగుండాం. ఆయనలాగా మంచి సేసే ఆయన బిడ్డ జగనన్నను బాగా సూసుకుంటాం. - తాటి అంకాలు ఏడుపొత్తంది అడవుల్లో తిరిగేటోళ్లం. బువ్వ కూడా దొరికేదిలే. మా దేవుడు రాజన్న వచ్చాక రోడ్లు గీడ్లూ వచ్చినాయి. ఆ సామి ఇప్పుడు లేడంటే ఏడుపొత్తుంది. ఆయన పోయాక.. ఆయన ఇంటోళ్లను ఏడిపించారు. ఇప్పుడు జగన్‌కు ఓటేసి కసి తీర్చుకుంటాం. - ఉడతల గంగమ్మ -
పడమటి పోరు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లా టీడీపీలో ‘పడమటి పోరు’ పొడిచింది. మార్కాపురం, యర్రగొండపాలెం నేతల మధ్య విభేదాల మంట పుట్టింది. యర్రగొండపాలెం టికెట్టు ఆశిస్తున్న అజిత రావుకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల ‘షరతులు’ విధించడం విభేదాల కుంపటి రగిల్చింది. దీనిపై భగ్గుమన్న అజిత రావు వర్గం పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు విషయాన్ని తీసుకెళ్లింది. లోపాయికారీగా వ్యవహారాన్ని చక్కబెట్టకోవాలన్న పన్నాగం బెడిసికొట్టడంతో కందుల కస్సుమంటున్నారు. వ్యవహారం కాస్తా ‘వర్గ’పోరుగా రూపాంతరం చెందుతుండడం టీడీపీని కలవరపరుస్తోంది. తూర్పుప్రాంత నేతల విభేదాలతో ఇప్పటికే సతమతమవుతున్న టీడీపీకి తాజా ‘పశ్చిమ పోరు’ పుండుమీద కారంలా మారింది. షరతులకు అంగీకరిస్తేనే సహకారమన్న కందుల జిల్లాలో టీడీపీ ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న కందుల నారాయణరెడ్డి రానున్న ఎన్నికల దృష్ట్యా ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. ఎన్నికల వనరుల సమీకరణకు సమాయత్తమయ్యారు. అందుకోసం పశ్చిమ ప్రాంతంలోని నియోజకవర్గాలపై కన్నేశారు. మొదటగా యర్రగొండపాలెం టికెట్టు ఆశిస్తున్న అజితరావు వర్గానికి వర్తమానం పంపారు. రానున్న ఎన్నికల్లో తన సహకారం ఉండాలంటే కొన్ని ‘షరతులు’ వర్తిస్తాయని అసలు విషయాన్ని చల్లగా చెప్పారు. ప్రధానంగా యర్రగొండపాలెం నియోజకవర్గంలో అధికంగా ఉన్న తమ వర్గం మద్దతు కావాలంటే షరతులకు అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పారు. పశ్చిమ ప్రాంతంలో పార్టీ తర ఫున పెద్దరికం తనదేనని, తన వర్గాన్ని అజిత అభ్యర్థిత్వానికి అనుకూలంగా కూడగట్టేందుకు ఆ మాత్రం ఖర్చవుతుందని అజిత రావు కుటుంబ సభ్యులకు కందుల స్పష్టం చేశారు. ససేమిరా అంటున్న అజిత వర్గం కందుల ఎంత సూటిగా ‘అసలు’ విషయాన్ని చెప్పారో... అజిత రావు వర్గం అంతే దీటుగా స్పందించింది. ఇదేమన్నా రాచరికమా... జమీందారీతనమా అన్నింటికీ కప్పం కట్టడానికంటూ కస్సుమంది. ఇటీవలే పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే రీతిలో ‘షరతులకు’ లోబడి తాము ఆర్థికంగా ఇబ్బందులు పడ్డామని వాపోయింది. ఇక ఉపేక్షిస్తే ఎన్నికల నాటికి అసలు కంటే వడ్డీయే ఎక్కువయ్యేలా ఉందని గ్రహించింది. దీంతో విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లింది. తమకు ఉన్న పరపతిని మొత్తం ఉపయోగించి అధికారికంగా ఉన్నత హోదాలో ఉన్న పెద్దల ద్వారా చంద్రబాబు వద్దే పంచాయితీ పెట్టింది. విషయం తీవ్రత గ్రహించిన చంద్రబాబు ఎమ్మెల్యే కందులను సున్నితంగానే మందలించినట్లు తెలుస్తోంది. త్వరలో తాను జిల్లాలో పర్యటించనున్న తరుణంలో ఇలాంటి ఇబ్బందులు ఎందుకు సృష్టిస్తారని అసహనం వ్యక్తం చేశారు. దీంతో కందుల వర్గం ప్రస్తుతానికి కాస్త వెనక్కి తగ్గింది. ఎత్తులు...పై ఎత్తులు ఏమాత్రం రాజకీయ ప్రాబల్యం లేని అజిత రావు అధినేత వద్ద తనను అవమానపరచడాన్ని ఎమ్మెల్యే కందుల జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి తగ్గినట్లు కనిపిస్తున్నా యర్రగొండపాలెం నియోజకవర్గంలో అజిత రావుకు తన తడాఖా చూపించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు అప్పుడే కొందరితో మంతనాలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో తమ వర్గం అజిత రావుకు సహాయనిరాకరణ చేసేలా పావులు కదుపుతున్నారు. కందుల వర్గం వ్యూహాత్మకంగా ఎదురుదాడికి దిగుతుండటంతో అజిత రావు వర్గం బిత్తరపోయింది. అధినేత వద్ద అయితే పెచైయ్యి సాధించింది కానీ నియోజకవర్గంలో కందుల వర్గాన్ని ఎదుర్కోలేక సతమతమవుతోంది. దీంతో కందులకు మార్కాపురంలో పొగ పెట్టాలని భావించింది. మార్కాపురంలో తమ వర్గానికి చెందినవారితో మంతనాలు సాగిస్తూ ఎమ్మెల్యే కందులకు వ్యతిరేకంగా అసమ్మతిని కూడగడుతోంది. ఎమ్మెల్యే కందుల వర్గం యర్రగొండపాలెంలో.. అజిత రావు వర్గం మార్కాపురంలో అసమ్మతి ప్రోత్సహిస్తున్నాయి. వీరి ఆధిపత్య పోరు వర్గపోరుగా రూపాంతరం చెందుతూ... విభేదాల పీటముడి బిగుసుకుంటోంది. రానున్న రోజుల్లో పశ్చిమాన టీడీపీలో ఇంటిపోరు మరింతగా రాజుకోనుందని స్పష్టమవుతోంది.