యర్రగొండపాలెం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పెద్ద జాదూ అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన ఆయన ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదని చెప్పారు. సీపీఐ నియోజకవర్గ 2వ మహాసభ సందర్భంగా శనివారం స్థానిక షాదీఖానాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. బాబొస్తే జాబొస్తుందని నినాదాలు చేసిన టీడీపీ నాయకులు ఉన్న జాబులను ఊడ కొడుతున్నారని, జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి పచ్చని పల్లెల్లో చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. సర్కారు వైఖరి చూసి అధికార పక్షానికి చెందిన పేదలు, రైతులు సైతం తిరగబడుతున్నారని చెప్పారు. పశ్చిమ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించే పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుంటే జిల్లాలోని టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు చేతులు ముడుచుకొని కూర్చున్నారని విమర్శించారు.
మోదీ జంతర్‌మంతర్..
ప్రధాని నరేంద్ర మోదీ జంతర్‌మంతర్ చేసి అధికారంలోకి వచ్చాడని ఆయన మాటలు ఢిల్లీ కోట దాటడం లేదని ముప్పాళ్ల ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత, సెక్యులర్ పార్టీలు కూటమిగా ఏర్పడక పోవడం లాంటి అంశాలు బీజేపీకి కలిసి వచ్చిన అదృష్టంగా పేర్కొన్నారు. దేశంలో 77శాతం ప్రజల ఆస్తి కేవలం 57 కుటుంబాలకు సమానంగా ఉందని ఒక సర్వేలో తేలిందన్నారు. పేదల కష్టార్జితం అంతా బడాబాబులకు చేరుతుందని, కోటీశ్వరుల పక్షాన మోదీ రాజ్యం ఏలుతున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు సంవత్సరానికి 2కోట్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన ఆయన లక్షల్లో కూడా ఇప్పించలేక పోయారని, ఆయన బాటలో రాష్ట్ర పాలన కూడా నడుస్తోందన్నారు.
బీజేపీ పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూలిపోయిందని, పత్తి రైతులు నాశనం అవుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మెదపడం లేదని ఆరోపించారు. ముందుగా ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి మాచర్ల రోడ్డులోని షాదీఖానా వరకు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకుడు టీసీహెచ్ చెన్నయ్య, గుర్నాథం, నూర్జహాన్‌లు అధ్యక్షత వర్గంగా వ్యవహరించారు. సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అరుణమ్మ, ఏపీ రైతుసంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కేవీవీ ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి ఎం.ఎల్.నారాయణ, కేవీ కృష్ణగౌడ్, డి.శ్రీనివాస్, ఆయా మండలాల పార్టీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment