యర్రగొండపాలెం: టీడీపీలో వెధలు ఉన్నారని ఆపార్టీ తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకర్ల కోటయ్య తీవ్ర విమర్శలు చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం మండల కేంద్రమైన పుల్లల చెరువులో శుక్రవారం నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం సభలో బహిరంగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో టీడీపీ నేతలు కొంతకాలంగా రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు చేసుకుంటున్న నేపథ్యమే ఈ వాఖ్యలకు కారణమన్న వాఖ్యలు వినిపిస్తున్నాయి.
పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్‌బాబును రాష్ట్ర టెక్నాలజీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ మన్నే రవీంద్ర వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆయనకు టికెట్ ఇచ్చినట్లయితే మద్దతు ఇవ్వబోమని అధిష్టానానికి సంకేతాలు కూడా పంపారు. గత నెల 28వ తేదీన పుల్లలచెరువు మండలంలోని చాపలమడుగులో జరిగిన తిరునాళ్ల సందర్భంగా టీడీపీ వర్గీయులు రెండు వర్గాలుగా విడిపోయి రెండు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరువాత రవీంద్ర వర్గం యర్రగొండపాలెం మండలం మురారిపల్లె పంచాయతీలోని వేగినాటి కోటయ్య నగర్‌లో ఈ నెల 7న బాబు షూరిటీ–భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. అయితే దీనిపై ఎరిక్షన్ బాబుకు సమాచారం ఇవ్వలేదు. కార్యక్రమానికి ముందుగా రవీంద్ర వైద్యశాల నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో బలప్రదర్శన నిర్వహించారు. దీనికి ప్రతిగా ఎరిక్షన్‌బాబు వర్గీయులు ఎస్సీ కాలనీలను టార్గెట్ చేసుకొని టీడీపీ కార్యకర్తల మెళ్లో మళ్లీ పచ్చకండువాలు కప్పి వైఎస్సార్ సీపీ నుంచి చేరినట్లు వార్తలు రాయించుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కాకర్ల కోటయ్య వ్యాఖ్యలు టీడీపీని నవ్వులపాలు చేశాయని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment