
గుంటూరు, సాక్షి: లాభాల బాటలో నడిచిన ఫైబర్ నెట్‌ను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని, ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారని ఫైబర్ నెట్ కార్పోరేషన్(FiberNet Corporation) మాజీ ఛైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఫైబర్ నెట్ ని లాభాల బాటలోకి తెచ్చాం. అలాంటి సంస్థని నాశనం చేసేందుకు కుట్ర పన్నారు. 2014-19లో చంద్రబాబు ఫైబర్ నెట్‌లో భారీగా అవినీతి చేశారు. అందుకే దానిపై మా హయాంలో విచారణ జరిపించాం. చంద్రబాబు అక్రమాలు, అవినీతిని సీఐడీ నిరూపించింది
చంద్రబాబు, యనమల రామకృష్ణుడు సంతకాలతోనే అవినీతి చేశారు. ఫైబర్ నెట్ లో ఇచ్చిన ప్రతి కాంట్రాక్టులోనూ చంద్రబాబు అవినీతి చేశారు. ఆ అవినీతిని జగన్ గుర్తించి విచారణ జరిపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో కూడా చంద్రబాబు అవినీతి(Chandrababu Corruption) చేసి అరెస్టు అయ్యారు. ఇప్పుడు.. తన మీద ఉన్న కేసులను చంద్రబాబు మాఫీ చేయించుకుంటున్నారు. అందులో భాగంగానే ఫైబర్ నెట్ ని నిర్వీర్యం చేస్తున్నారు. సంస్థను పూర్తిగా క్లోజ్ చేసేలా కుట్ర పన్నారు
వైఎస్ జగన్ ప్రోత్సాహంతో మా హయాంలో రూ.190లకే ఇంటర్నెట్ ఇచ్చాం. సిగ్నల్ ప్రాబ్లం లేకుండా చర్యలు చేపట్టాం. ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో కనెక్షన్లు ఇచ్చాం. అందుకే మా హయాంలో ఫైబర్ నెట్ లాభాల బాట పట్టి ఆదాయం పెరిగింది. ఏడాదికి 1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాం. కానీ.. చంద్రబాబు కుట్రతో ఫైబర్ నెట్ ని క్లోజ్ చేయబోతున్నారు.

మా హయాంలో 20 లక్షల బాక్సులను కేంద్రం నుండి ఉచితంగా వచ్చేలా మేము ఏర్పాటు చేశాం. వాటిని ఈ ప్రభుత్వం తీసుకువచ్చి ఫైబర్ నెట్ కి ఆదాయం పెంచాలి. అంతేగానీ సంస్థలను నాశనం చేయవద్దు. తనమీద ఉన్న కేసుని తప్పించుకోవటానికి చంద్రబాబు దీన్ని నిర్వీర్యం చేస్తున్నారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే కేసును ఎదుర్కోవాలి.
రైతుల కోసం మిర్చి యార్డుకు వెళ్లిన జగన్ పై కేసు పెట్టారు. మరి మ్యూజికల్ నైట్ లో పాల్గొన్న చంద్రబాబు మీద ఎందుకు పెట్టలేదు?. ఎలక్షన్ కమిషన్ న్యాయబద్ధంగా వ్యవహరించాలి. మీడియా సంస్థలను తమ చెప్పు చేతల్లో ఉంచుకుని ఈ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment