
గుంటూరు, సాక్షి: ఏపీలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారాయన. గతంతో వైఎస్సార్‌సీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయన.. ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు.
మా హయాంలో.. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. రూ.21 వేల నుంచి రూ. 27 వేల దాకా వచ్చేది. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం. వైఎస్సార్‌సీపీ హయాంలో రైతే రాజు. కానీ, కూటమి ప్రభుత్వం రైతును దగా చేసింది. ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం సాయం ఇవ్వలేదు. రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్థితి నెలకొంది. గతంలో కల్తీ విత్తనాలు అమ్మితే భయపడేవారు. ఇప్పుడు సర్కారే దగ్గరుండి కల్తీ విత్తనాలు అమ్మిస్తోంది. ప్రైవేటు డీలర్లు 500 ఎక్కువ ధరకు ఎరువులు అమ్ముతున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు లభించడం లేదు.

మిర్చి రైతుల(Mirchi Farmers) అవస్థలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రైతులు పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి. మిర్చి పంటకు కనీసం రూ.11 వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఈ ఏడాది దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. రైతులను దళారీలకు అమ్మేసే పరిస్థితి కనిపిస్తోంది. ఎరువులను బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి వచ్చింది.
.. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. గుంటూరు మిర్చియార్డుకు కావాలి. రైతుల కష్టాలు తెలుసుకోవాలి. వాళ్లకు అండగా నిలబడాలి. లేకుంటే.. రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ(YSRCP) ఉద్యమిస్తుందని వైఎస్ జగన్ హెచ్చరించారు.

నినాదాలతో జగన్ ప్రసంగానికి అంతరాయం
జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. మిర్చి యార్డ్ బయటకు వచ్చిన వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతుండగా .. సీఎం అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. దీంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో వినిపించకుండా పోయింది. ఆపై పక్కకు వచ్చిన ప్రజల నినాదాల నడుమే మీడియాతో బిగ్గరగా మాట్లాడాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment