జనం గుండెల్లో జగన్.. కూటమి గుండెల్లో రైళ్లు | KSR Comment: Kutami Prabhutvam Fear With Jagan Mass Craze | Sakshi
Sakshi News home page

జనం గుండెల్లో జగన్.. కూటమి గుండెల్లో రైళ్లు

Published Thu, Feb 20 2025 1:15 PM | Last Updated on Thu, Feb 20 2025 1:27 PM

KSR Comment: Kutami Prabhutvam Fear With Jagan Mass Craze

వైస్సార్‌సీపీ అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి ఎక్కడకు వెళుతున్నా.. ఆయనను చూడడానికి ,మద్దతు ఇవ్వడానికి తరలివస్తున్న జనతరంగాలను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఎనిమిది నెలలకే ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇంతగా ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటోందా? అనే ప్రశ్న సహజంగానే కలగనమానదు. కృష్ణా, గుంటూరు జిల్లాలను తమ గుండెకాయగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంటుంది. అలాంటి జిల్లాలలో  ఒక సునామీలా వచ్చిన ప్రజలు.. జగన్‌కు జేజేలు కొట్టడం టీడీపీ కూటమి ప్రభుత్వంలో రైళ్లు పరిగెత్తిస్తుందేమో!. 

తప్పుడు కేసులో   విజయవాడ జైలులో ఉన్న  మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని  జగన్ పరామర్శించారు. ఆ మరుసటి రోజు గుంటూరు మార్కెట్‌ యార్డులో గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న రైతాంగం కష్టాలను ఆయన విన్నారు. ప్రత్యేక రవాణా ఏర్పాట్లు ఏమీ లేకుండానే ప్రజలు వారంతట వారే జగన్‌ కోసం వస్తున్న  తీరును గమనిస్తే.. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ప్రజలలో వెల్లువెత్తుతున్న నిరసనే అని స్పష్టమవుతోంది.  కూటమి సర్కార్ అమలు చేస్తున్న రెడ్ బుక్ పిచ్చికుక్క రాజ్యాంగంపై ప్రజల తిరుగుబాటా? అనే భావన కలుగుతోంది. 

గుంటూరులో పోలీసులు  సరైన  భద్రత కల్పించకపోయినా, జగన్ ప్రజల మధ్యనుంచే  రైతుల వద్దకు వెళ్లి వారి బాధల గాధలు విన్నారు. విజయవాడలో  జగన్  మీడియాతో చెప్పిన  విషయాలు చూస్తే ఆయనలో ధైర్యం ఏ స్థాయిలో ఉందో కనిపిస్తుంది. ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురిచేసినా వెనక్కి తగ్గేది లేదని జగన్ నిర్ణయించుకున్నారని అనిపిస్తోంది. అలాగే పార్టీ క్యాడర్ లో కాని, లీడర్లలోకాని జగన్ నాయకత్వం పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది. చచ్చేంతవరకు జగన్ తోనే అని మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలే  ఇందుకు నిదర్శనం. 

ఒక రకంగా.. ఇందుకు లోకేష్ పిచ్చి రెడ్ బుక్, చంద్రబాబు అబద్దాల సూపర్ సిక్స్, పవన్‌ కల్యాణ్‌ ఫెయిల్‌ కావడం.. ఇలా అన్ని కలిసి జగన్ పై ప్రజలలో మరింత ఆదరణ పెంచాయనిపిస్తోంది.  వంశీని పలకరించి బయటకు వచ్చాక జగన్ మాట్లాడుతూ కూటమి సర్కార్ పైన, పోలీసు యంత్రాంగం పైన తీవ్ర  స్థాయిలో విమర్శలు కురిపించారు. కమ్మ సామాజికవర్గంలో నాయకులుగా ఎదుగుతున్న కొడాలి నాని, వంశీ, దేవినేని అవినాశ్,  శంకరరావు ,బ్రహ్మనాయుడు వంటి వారిని అణచివేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయంగా తమకు పోటీ వస్తారనుకునేవారిని దెబ్బతీయడానికి  చంద్రబాబు  ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారన్నది వాస్తవం. గతంలో కూడా ఇలాంటి అనుభవాలు లేకపోలేదు. 

👉చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు 1986 ప్రాంతంలో మంత్రిగా ఉండేవారు. అప్పట్లో చంద్రబాబు కర్షక పరిషత్ ఛైర్మన్ గా ఉండేవారు. వీరిద్దరూ కలిసి జిల్లాలో ఏదైనా సభలో పాల్గొన్నప్పుడు ముద్దు కృష్ణమకు ఎవరైనా ప్రాధాన్యత ఇస్తే చంద్రబాబు సహించేవారు కాదట. ఈ విషయాన్ని ముద్దే చెప్పేవారు. 

👉అంతెందుకు.. ఎన్.టి.రామారావును పదవి నుంచి దించేసినప్పుడు తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. తీరా పని పూర్తి అయి తాను ముఖ్యమంత్రి అవ్వగానే దగ్గుబాటికి మొండిచేయి చూపించి ఆయన పార్టీలోనే ఉండలేని స్థితి కల్పించారు. 

👉జూనియర్ ఎన్.టి.ఆర్.ను 2009 లో ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు.  తదుపరి ఆయన లోకేష్‌కు పోటీ అవుతారని తలచి పక్కనబెట్టేశారు. ఇలా.. చంద్రబాబు ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. 

కమ్మ సామాజికవర్గాన్ని తన రాజకీయం కోసం పూర్తిగా వాడుకుంటారు. అదే టైంలో తన సామాజిక వర్గంలో ఎవరికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా.. పేరు రాకుండా  జాగ్రత్తపడతారు. టీడీపీలో ఇప్పుడు ఎందరో సీనియర్లు ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి,  దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర తదితరుల పరిస్థితే ఇందుకు నిదర్శనం.  ఇక.. పయ్యావుల కేశవ్ కు  మంత్రి పదవి ఇచ్చినా ఆయనకు ఉన్న అధికారాలు అంతంతమాత్రమే అని చెప్పాలి. ఇది ఒక కోణం అయితే వంశీ కేసును  ప్రస్తావించి  ప్రభుత్వాన్ని జగన్  ఎండగట్టారు. 

వంశీపై ఏ రకంగా తప్పుడు కేసు పెట్టారో  ఆయన సాక్ష్యాధారాలతో సహా వివరించారు.గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో సత్యవర్దన్ అనే వ్యక్తి పదో తేదీన కోర్టులో తనకు ఫిర్యాదుకు సంబంధం లేదని చెబితే.. ఆ మరుసటి రోజు వంశీ అతనిని కిడ్నాప్ చేశారని పోలీసులు కేసుపెట్టారట. దీనికి మంత్రి కొల్లు  రవీంద్ర  ఎక్కడో ఒక లిఫ్ట్ లో వీరిద్దరు ఉన్న ఏదో వీడియోని చూపించి మభ్య పెట్టే యత్నం చేసినట్లుగా ఉంది. వంశీని జగన్ కలవడం, అక్కడకు  వేలాదిగా అభిమానులు తరలిరావడం తో రెడ్ బుక్ బాధితులందరికి నైతిక స్థైర్యం ఇచ్చినట్లయింది.  

ఈ సందర్భంగా పోలీసులను ఆయన తప్పు  పట్టిన తీరుపై కొందరు ఆక్షేపణ చెబుతున్నారు. విశేషం ఏమిటంటే గత కొద్ది రోజులుగా హైకోర్టు కూడా ఆయా కేసులలో విచారణ చేస్తూ ఏపీ  పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది.  కేసు పెట్టడం, లోపల వేయడం, కొట్టడం తప్ప ఏమైనా చేస్తున్నారా? అని పోలీసు అధికారులను ప్రశ్నించిన తీరుకు  నిజంగా ఆ శాఖ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది.  జగన్ ప్రభుత్వ టైమ్ లో చంద్రబాబు,లోకేష్ లు  అప్పటి  ప్రభుత్వంలోని వారిపైనే  కాకుండా, పోలీసు అధికారులపై కూడా ఇష్టం వచ్చినట్లు దూషణలు  చేసేవారు. రెడ్ బుక్ లో పేరు రాసుకున్నామని.. వారి సంగతి చూస్తామని బెదిరించేవారు. అయినా అప్పట్లో పోలీసు అదికారుల సంఘం కాని, ఐపీఎస్ అధికారుల సంఘం వారుకాని తప్పు పట్టలేదు. పుంగనూరు వద్ద ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోయేలా టిడిపి వారు దాడి చేశారు. అయినా ఆ ఘటనపై పోలీస్ సంఘం గట్టిగా స్పందించలేదు. 

ఆ తర్వాత ఈ ఎనిమిది నెలల్లో పోలీసుల కళ్లెదుటే టీడీపీ కార్యకర్తలు  విధ్వంసాలకు పాల్పడుతుంటే..  కర్రలు,కత్తులతో దాడులు చూస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర  పోషిస్తున్న  ఘట్టాలను చూసినవారంతా పోలీసు శాఖ అసమర్ధతను చూసి అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది.  అంతదాకా ఎందుకు?.. తునిలో కౌన్సిలర్లను టీడీపీవారు వెంబడిస్తే పోలీసులు ఏమి చేస్తున్నారు?. తిరుపతిలో బస్ లో వెళుతున్న కార్పొరేటర్లపై దాడి చేసి కొంతమందిని బలవంతంగా కిడ్నాప్ చేస్తే  పోలీసులు చేష్టలుడిగి నిలబడిపోయారే!. కేంద్ర  మాజీ మంత్రి  సుబ్రహ్మణ్యస్వామి ఈ అంశాలను ప్రస్తావించి ఢిల్లీలో సీబీఐకి కూడా ఫిర్యాదు చేశారు. 

మరో వైపు వేధింపులకు గురైన వైఎస్సార్‌సీపీ పైనే ఎదురు కేసులు  పెట్టడానికి ఏ రాజ్యాంగం అవకాశం ఇస్తుంది? అందుకే వారు ఖాకీ   బట్టలు తీసేసి.. పచ్చ  బట్టలు వేసుకుంటున్నారని, తాము అధికారంలోకి రాగానే వాటిని తీయించివేస్తామని  జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించవలసి వచ్చింది. 

గతంలో పోలీసులు అకృత్యాలకు పాల్పడితే..  జనంలో  తిరగుబాటు వస్తుండేది. 1978-83 మధ్య హైదరాబాద్ లో రమీజాబి అనే మహిళ పోలీస్ స్టేషన్‌లో మానభంగానికి గురై మరణిస్తే, ఆ విషయం తెలిసిన రాష్ట్ర ప్రజలంతా భగ్గుమన్నారు.  రోజుల తరబడి కర్ఫ్యూ పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. అలాగే గుంటూరు జిల్లాలో  షకీలా అనే మహిళ కూడా పోలీస్ స్టేషన్ లో మరణించినప్పుడు కూడా ప్రజలు తీవ్రంగా స్పందించారు. గన్నవరంలో అప్పట్లో ఒక మహిళను హింసించారన్న సమాచారంతో ప్రజలు  పోలీస్ స్టేషన్ లోకి చొరబడ్డారు. ఆ మహిళను  పోలీసులు స్టేషన్ బయట ఉన్న వంటగదిలో దాచిన విషయం కూడా కనిపెట్టారు. ఆ రోజుల్లో  ప్రజలలో ఉన్న చైతన్యంతో పోల్చితే  ఇప్పుడు ఆ స్థాయిలో ప్రజలు  స్పందిస్తున్నట్లు  లేదు. 

అలాగని వారిలో నిరసన లేదని కాదు.కాని మారిన రాజకీయాలు,ఇతర కారణాలు ప్రభావితం చూపుతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక నాయకుడు జనం తరపున ముందుకు  వస్తే  ఎలా తిరుగుబాటుకు సిద్దం అవుతారో జగన్ పర్యటనలు తెలియచేస్తున్నాయి. గుంటూరు మిర్చియార్డులో గిట్టుబాటు ధరలు రాక ఆవేదనలో ఉన్న  రైతులను  పరామర్శకు జగన్ వెళితే  అక్కడ పోలీసులు  సహకరించకుండా ప్రభుత్వం జాగ్రత్తపడింది. పైగా కేసులు కూడా పెట్టారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని చెబుతున్నారు. అసలు అక్కడ వైఎస్సార్‌సీపీనే పోటీలో లేదు. ఎన్నికల ప్రచారం చేయలేదు. ర్యాలీలు తీయలేదు. మీటింగులు పెట్టలేదు. కేవలం మిర్చి యార్డులో రైతుల వద్దకు వెళితే ఏ రకంగా కోడ్ కు ఇబ్బంది కలిగిందో చంద్రబాబు పోలీసులే చెప్పాలి. 

రైతులు ఎన్ని కష్టాలలో ఉన్నా ఎవరూ పలకరించకూడదా?. జగన్ టూర్ చేయబట్టే  కదా? కనీసం చంద్రబాబు కేంద్రానికి మిర్చి ధరల పతనంపై లేఖ రాశారు. కాని అది కంటితుడుపు చర్య. రాష్ట్రప్రభుత్వం మిర్చి కొనుగోలుకు ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోకుండా ఈ లేఖల వల్ల ఏమి జరుగుతుందో  తెలియదు.గుంటూరు యార్డుకు వెళ్లినప్పుడు జగన్‌కు పోలీసులు  ఎందుకు భద్రత కల్పించలేదు?అది వారి వైఫల్యం కాదా! పోలీసులు ఈ విధంగా చేయవచ్చా? అనేదానికి ఆ శాఖ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి. 

ప్రతిపక్ష  పార్టీవారు వినతిపత్రం ఇవ్వడానికి వెళితే కలవకుండా వెళ్లిపోయిన డీజీపీ నాయకత్వంలో ఇంతకన్నా భిన్నమైన పరి్స్థితిని ఆశించడం తప్పవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పలువురు ఐపీఎస్‌లకు పోస్టింగ్ లు ఇవ్వకుండా వేధిస్తున్నప్పటికీ నోరు మెదపలేని స్థితిలో పోలీసు అధికారుల సంఘాలు ఉన్నాయి. రైతుల సమస్యలకన్నా టీడీపీ భజనే తమకు ముఖ్యమన్నట్లుగా ఎల్లో మీడియా వ్యవహరించడం దురదృష్టకరం. 

సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం  జనంలో పెల్లుబుకుతున్న అసమ్మతిని తొక్కిపెట్టాలని చూస్తోంది. అయినా అణచేకొద్ది పైకి లేచి తిరగబడతామని ప్రజలు బ్యారికేడ్లు తోసేసి మరీ జగన్ పర్యటనలో పాల్గొన్నారు. కొసమెరుపు ఏమిటంటే ఒక పదేళ్ల వయసున్న  బాలిక జగన్ ను  కలవడానికి పడిన  తాపత్రయం, ఆ బాలికను ఆ జనంలో తనవద్దకు తీసుకుని ఆశీర్వదించిన తీరు మొత్తం టూర్ లో హైలైట్ గా మారింది.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement