సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లా టీడీపీలో ‘పడమటి పోరు’ పొడిచింది. మార్కాపురం, యర్రగొండపాలెం నేతల మధ్య విభేదాల మంట పుట్టింది. యర్రగొండపాలెం టికెట్టు ఆశిస్తున్న అజిత రావుకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల ‘షరతులు’ విధించడం విభేదాల కుంపటి రగిల్చింది. దీనిపై భగ్గుమన్న అజిత రావు వర్గం పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు విషయాన్ని తీసుకెళ్లింది. లోపాయికారీగా వ్యవహారాన్ని చక్కబెట్టకోవాలన్న పన్నాగం బెడిసికొట్టడంతో కందుల కస్సుమంటున్నారు. వ్యవహారం కాస్తా ‘వర్గ’పోరుగా రూపాంతరం చెందుతుండడం టీడీపీని కలవరపరుస్తోంది. తూర్పుప్రాంత నేతల విభేదాలతో ఇప్పటికే సతమతమవుతున్న టీడీపీకి తాజా ‘పశ్చిమ పోరు’ పుండుమీద కారంలా మారింది.
షరతులకు అంగీకరిస్తేనే సహకారమన్న కందుల జిల్లాలో టీడీపీ ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న కందుల నారాయణరెడ్డి రానున్న ఎన్నికల దృష్ట్యా ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. ఎన్నికల వనరుల సమీకరణకు సమాయత్తమయ్యారు. అందుకోసం పశ్చిమ ప్రాంతంలోని నియోజకవర్గాలపై కన్నేశారు. మొదటగా యర్రగొండపాలెం టికెట్టు ఆశిస్తున్న అజితరావు వర్గానికి వర్తమానం పంపారు. రానున్న ఎన్నికల్లో తన సహకారం ఉండాలంటే కొన్ని ‘షరతులు’ వర్తిస్తాయని అసలు విషయాన్ని చల్లగా చెప్పారు. ప్రధానంగా యర్రగొండపాలెం నియోజకవర్గంలో అధికంగా ఉన్న తమ వర్గం మద్దతు కావాలంటే షరతులకు అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పారు. పశ్చిమ ప్రాంతంలో పార్టీ తర ఫున పెద్దరికం తనదేనని, తన వర్గాన్ని అజిత అభ్యర్థిత్వానికి అనుకూలంగా కూడగట్టేందుకు ఆ మాత్రం ఖర్చవుతుందని అజిత రావు కుటుంబ సభ్యులకు కందుల స్పష్టం చేశారు.
ససేమిరా అంటున్న అజిత వర్గం
కందుల ఎంత సూటిగా ‘అసలు’ విషయాన్ని చెప్పారో... అజిత రావు వర్గం అంతే దీటుగా స్పందించింది. ఇదేమన్నా రాచరికమా... జమీందారీతనమా అన్నింటికీ కప్పం కట్టడానికంటూ కస్సుమంది. ఇటీవలే పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే రీతిలో ‘షరతులకు’ లోబడి తాము ఆర్థికంగా ఇబ్బందులు పడ్డామని వాపోయింది. ఇక ఉపేక్షిస్తే ఎన్నికల నాటికి అసలు కంటే వడ్డీయే ఎక్కువయ్యేలా ఉందని గ్రహించింది. దీంతో విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లింది. తమకు ఉన్న పరపతిని మొత్తం ఉపయోగించి అధికారికంగా ఉన్నత హోదాలో ఉన్న పెద్దల ద్వారా చంద్రబాబు వద్దే పంచాయితీ పెట్టింది. విషయం తీవ్రత గ్రహించిన చంద్రబాబు ఎమ్మెల్యే కందులను సున్నితంగానే మందలించినట్లు తెలుస్తోంది. త్వరలో తాను జిల్లాలో పర్యటించనున్న తరుణంలో ఇలాంటి ఇబ్బందులు ఎందుకు సృష్టిస్తారని అసహనం వ్యక్తం చేశారు. దీంతో కందుల వర్గం ప్రస్తుతానికి కాస్త వెనక్కి తగ్గింది.
ఎత్తులు...పై ఎత్తులు
ఏమాత్రం రాజకీయ ప్రాబల్యం లేని అజిత రావు అధినేత వద్ద తనను అవమానపరచడాన్ని ఎమ్మెల్యే కందుల జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి తగ్గినట్లు కనిపిస్తున్నా యర్రగొండపాలెం నియోజకవర్గంలో అజిత రావుకు తన తడాఖా చూపించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు అప్పుడే కొందరితో మంతనాలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో తమ వర్గం అజిత రావుకు సహాయనిరాకరణ చేసేలా పావులు కదుపుతున్నారు. కందుల వర్గం వ్యూహాత్మకంగా ఎదురుదాడికి దిగుతుండటంతో అజిత రావు వర్గం బిత్తరపోయింది. అధినేత వద్ద అయితే పెచైయ్యి సాధించింది కానీ నియోజకవర్గంలో కందుల వర్గాన్ని ఎదుర్కోలేక సతమతమవుతోంది. దీంతో కందులకు మార్కాపురంలో పొగ పెట్టాలని భావించింది. మార్కాపురంలో తమ వర్గానికి చెందినవారితో మంతనాలు సాగిస్తూ ఎమ్మెల్యే కందులకు వ్యతిరేకంగా అసమ్మతిని కూడగడుతోంది. ఎమ్మెల్యే కందుల వర్గం యర్రగొండపాలెంలో.. అజిత రావు వర్గం మార్కాపురంలో అసమ్మతి ప్రోత్సహిస్తున్నాయి. వీరి ఆధిపత్య పోరు వర్గపోరుగా రూపాంతరం చెందుతూ... విభేదాల పీటముడి బిగుసుకుంటోంది. రానున్న రోజుల్లో పశ్చిమాన టీడీపీలో ఇంటిపోరు మరింతగా రాజుకోనుందని స్పష్టమవుతోంది.
పడమటి పోరు
Published Fri, Nov 15 2013 5:29 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement