రాత్రి వేళ అపార్ట్‌మెంట్‌లో చొరబడి హల్‌చల్
ఓ కుటుంబంపై మూకుమ్మడి దాడి
కేసు స్వీకరించేందుకు ముఖం చాటేసిన పోలీసులు
ఎస్పీని కలిసి ఘటన వివరించిన బాధితులు
సాక్షి నెట్‌వర్క్: తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్మార్గానికి తెగబడ్డారు. భార్యాభర్తల గొడవ విషయంలో తల దూర్చి కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. కేసు కోర్టులో ఉన్నప్పటికీ రాత్రివేళ అపార్ట్‌మెంట్‌లోని ఇంట్లోకి చొరబడి మూకుమ్మడిగా దాడి చేశారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉందంటూ హల్‌చల్ చేస్తూ దాడికి పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నంలో కలెక్టరేట్ వెనుక ఉన్న అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ఓ కుటుంబంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేసిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది.
నగరంలో రామానాయుడుపేటకు చెందిన టీడీపీ నాయకుడు వాడపల్లి మహేష్ కుమార్తెకు గాంధీనగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న నూకల బాబూరావు కుమారుడికి కొంతకాలం క్రితం వివాహం జరిగింది. వివాహమైన కొంతకాలానికి భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఇరు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. ఈ వివాదంపై కోర్టులో కేసు నడు స్తోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి టీడీపీ నాయకుడు వాడపల్లి మహేష్ కుటుంబ సభ్యులు, కొంతమంది టీడీపీ డివిజన్ ఇన్‌చార్జ్‌లు, నాయకులతో కలిసి బాబూరావు ఇంటిపై మూకుమ్మడి దాడి చేశారు. బాబూరావు కుటుంబ సభ్యులను దుర్భాషలాడటంతో పాటు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీ దొరకకూడదని సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.
అయినప్పటికీ కొన్ని సీసీ కెమెరాల్లో నాయకులు అపార్ట్‌మెంట్‌లో ప్రవేశించటం, బయటకు వెళ్లటం మాత్రం రికార్డు అయింది. ఘటన అనంతరం బాబూరావు చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలు స్తోంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించకపోవటంతో బుధవారం ఉదయం అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వారంతా ఎస్పీ ఆర్.గంగాధరరావును కలిసి జరిగిన సంఘటనను వివరించినట్లు సమాచారం. అయితే ఈ కేసును చిలకలపూడి సీఐకు రిఫర్ చేసినట్లు తెలిసింది. ఈ ఫిర్యాదులో పోలీసులు నాయకుల పేర్లు తప్పించి ఒకరిద్దరి పేర్లు నమోదు చేస్తామని బాధితులకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనపై చిలకల పూడి సీఐ అబ్దుల్ నబీని ‘సాక్షి’ వివరణ కోరగా బాధితులు ఘటన విషయం చెప్పారని, అయితే ఇంతవరకు ఫిర్యాదు అందలేదని, అందిన వెంటనే కేసు నమోదు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment