ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీగా కోడి పందేల బరులు
బేరం పెట్టి రేటు నిర్ణయించిన కూటమి నేతలు
సినీతారలతో పబ్లిసిటీ చేయిస్తున్న నిర్వాహకులు
రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు
పలు హైటెక్ జూద క్రీడలకూ ఏర్పాట్లు
ఏరులై పారనున్న డబ్బు, మద్యం
తెలుగింటి పెద్ద పండుగ సంక్రాంతికి సర్వం సిద్ధమైంది. సంబరాల ముసుగులో జూద క్రీడలు విచ్చలవిడిగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో కోడి పందేల కోసం బరులు ముస్తాబవుతున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధులే భారీగా కమీషన్లు తీసుకుంటూ ‘కోట్లాట’కు సహకరిస్తున్నారని సమాచారం.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో జూదాలు, కోడిపందేల వంటి వాటిపై నిషేధం ఉన్నా.. సంక్రాంత్రి సంబరాల పేరుతో పెద్ద సంఖ్యలో హైటెక్ జూదానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సువిశాల ప్రాంగణాల్లో సకల హంగులతో బరులను తీర్చి దిద్దుతున్నారు సినీతారలతో పబ్లిసిటీ చేయిస్తున్న నిర్వాహకులు. వీవీఐపీలకు ప్రత్యేకంగా ఏసీ, కూలర్లు, ఎల్ఈడీ స్కీన్ల వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. క్యాసినో, పేకాట, గుండాట వంటి పలు రకాల జూద క్రీడలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో సరాసరిన పదికి పైగా బరులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బరి స్థాయిని బట్టి రూ.30లక్షలు నుంచి రూ. 2కోట్ల వరకు టీడీపీ ప్రజా ప్రతినిధులకు డబ్బులు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని సమాచారం. గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో బరి ఏర్పాటు చేసుకోవాలంటే నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి రెండుకోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడతోపాటు పరిసర ప్రాంతాలు రామవరప్పాడు, ఎనికేపాడు ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాల పేరుతో బరులు ఏర్పాటు చేస్తున్నారు.
కొరవడిన పర్యవేక్షణ..
కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని అధికారులు చెబుతున్నా.. ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించటం లేదు. పేపరు ప్రకటనలు తప్ప ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదు. పోలీసు ఉన్నతాధికారులకు సైతం ముడుపులు ముడుతుండటంతో బరుల వైపు కన్నెత్తి చూడరనే భావన నెలకొంది.
ఈ గ్రామాల్లో భారీ ఏర్పాట్లు..
⇒ గుడివాడ నియోజకవర్గంలోని గుడివాడ మండలం బొమ్ములూరు, వలివర్తిపాడు, నందివాడ మండలం పోలుకొండ, రుద్రపాక, తమిరిశ, గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు, భీమవరం, కూరాడ, పెంజెండ్ర (డోకిపర్రు), ప్రాంతాల్లో బరులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు దోచుకునేందుకు రెడీ అయ్యారు. రూ. 70 లక్షలు నుంచి రూ. 1.50 కోట్ల వరకూ బరి అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.
⇒ పెడన నియోజకవర్గంలోని పెడన మండలం తోటమూల, పల్లోటి హైసూ్కల్ వెనుక, కొంకేపూడి జాతీయ రహదారి పక్కన బరులు ఏర్పాటు చేశారు. బంటుమిల్లిలో పెద్ద తుమ్మిడి, ఆర్తమూరు, కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం, పల్లెపాలెం, గూడూరు మండలం పెడన –గూడూరు అడ్డరోడ్డు వద్ద, పోసినవారిపాలెంలో బరులు రెడీ అయ్యాయి. ఒక్కో బరి రూ. 30 లక్షలు నుంచి రూ. 50 లక్షలు వరకూ అమ్మకాలు జరిగాయి.
⇒ పామర్రు మండలంలోని కొత్త పెద్దమద్దాలి, పెద పారుపూడి మండలం యలమర్రు, పమిడిముక్కల మండలంలో కపిలేశ్వరపురం, హనుమంతపురం, తోట్లవల్లూరు మండలంలో తోట్లవల్లూరు, వల్లూరుపాలెం, గరికపర్రు, కుమ్మమూరు, మొవ్వ మండలంలోని కోసూరు, భట్లపెనుమర్రు గ్రామాల్లో బరులు నిర్వహిస్తున్నారు. రూ. 30 లక్షలు వరకూ బరులు విక్రయిస్తున్నారు.
⇒ అవనిగడ్డ మండలంలోని అవనిగడ్డ, పులిగడ్డ, కోడూరు, నాగాయలంక, టి.కొత్తపాలెం, గణపేశ్వరం, మోపిదేవి మండలంలో రావివారిపాలెం, మోపిదేవి వార్పు, చల్లపల్లిలో నడకుదురు, రామానగర్, ఘంటసాల మండలం లంకపల్లి, శ్రీకాకుళం ప్రాంతాల్లో బరులు రెడీ అయ్యాయి. భారీ సెట్టింగులతో ఏర్పాట్లు చేస్తున్నారు.
⇒ మచిలీపట్నం పరిధిలో గల మంగినపూడి బీచ్ రోడ్డులో మూడు బరులు ఏర్పాటు చేశారు. గుండాట, కోతముక్క, కోడిపందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
⇒ గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం అంపాపురం, కె.సీతారామపురం, ఉంగుటూరు మండలం నందమూరు, గన్నవరం మండలం సూరంపల్లి, విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు, రామవరప్పాడు, అంబాపురం గ్రామాల్లో సంక్రాంతి బరులు సిద్ధం చేస్తున్నారు. అంపాపురంలో క్యాసినోకు ఏర్పాట్లు చేస్తునట్లు సమాచారం.
పుంజులు సై..
పందేల బరిలో తగ్గేదేలే అన్నట్లు కోడిపుంజులు సై అంటూ సిద్ధం అయ్యాయి. గతంలో మాదిరి కాకుండా ఇప్పటికే బహిరంగానే మద్యం, పేకాట శిబిరాలకు ప్రభుత్వం డోర్లు తెరిచింది. ఆ జోష్తో పెద్ద ఎత్తున ఈ ఏడాది కోడి పందేలు, క్యాసినో, గుండాట, పేకాట, మద్యం దుకాణాలు, వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసేందుకు ఆశావాహులు పోటీ పడుతున్నారు. సరదాగా సొంత ఊర్లకు పండుగకు వచ్చే వారి జేబులు ఖాళీ అయ్యే అవకాశాలున్నాయి. సాంకేతికతను ఉపయోగించి ఎంట్రీ ఫీజు రూ.5వేలుగా నిర్ణయించి, పెద్ద ఎత్తున అన్ని హంగులతో బరులను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రచించారు. నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని, ప్రజా ప్రతినిధులు భరోసా ఇచ్చి, వారి నుంచి కోట్ల రూపాయలు దండుకొనేలా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు ముందుగానే పందెం ఒప్పందాలు, కోతముక్కకు వచ్చే జూదరులకు హోటల్ రూమ్స్ బుకింగ్ జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment