యంత్రంలా మారిన మనిషి
మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
ఒత్తిళ్లతో పనిపై దృష్టి పెట్టలేకపోతున్న వైనం
ఫలితంగా ప్రొడక్టవిటీ తగ్గుతున్నట్లు నిపుణులు వెల్లడి
పని ప్రదేశంలో మానసిక ఆరోగ్యంపై దృష్టి అవసరం
అరుణ్‌కుమార్ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. డ్యూటీకి వెళ్లిన తర్వాత నిమిషం కూడా ఖాళీ ఉండేది కాదు. కనీసం టాయిలెట్‌కు వెళ్లేందుకు కూడా సమయం దొరికేది కాదు. దీంతో మానసికంగా ఒత్తిడికి లోనయ్యాడు. క్రమేణా అతని పనిపై ప్రభావం చూపింది. అధిక సమయం కార్యాలయంలోనే ఉంటున్నా తాను చేయాల్సిన పనులను పూర్తి చేయలేక పోతున్నాడు. ఇలా ఎంతో మంది కార్పోరేట్ ఉద్యోగులు పనిచేసే ప్రాంతంలో తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వీటిని తొలిదశలో గుర్తించకపోవడంతో రాను రాను తీవ్రమైన డిప్రెషన్‌కు దారి తీస్తున్నట్లు పేర్కొంటున్నారు.
రమేష్ విజయవాడ నగరంలోని ఓ కార్పొరేట్ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన పనితీరును మెచ్చిన యాజమాన్యం ఏడాది కిందట మేనేజర్‌గా పదోన్నతి కల్పించారు. అప్పటి నుంచి కొన్ని టార్గెట్‌లు అప్పగించి వాటిని రీచ్ అవ్వాలనే ఆదేశాలు ఇచ్చారు. దీంతో తన టీమ్‌తో పనిచేయించేందుకు నిమిషం ఖాళీ లేకుండా బిజీగా ఉండేవారు. ఈ తరుణంలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోను కావడంతో ఆ ప్రభావం పనిపై పడింది. యాజమాన్యం ఇచ్చిన టార్గెట్‌లు రీచ్ కాలేకపోయాడు. దీంతో డిప్రెషన్‌కు లోనయ్యారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్పొరేట్ ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. తమకు తెలియకుండానే డిప్రెషన్‌కు లోనవుతున్నారు. ఆ ఫలితంగా ఎక్కువ సేపు కార్యాలయంలోనే ఉన్నా ఉత్పాదక శక్తి తగ్గిపోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో మనిషి యంత్రంలా మారిపోయాడు. తాము పనిచేసే సంస్థ ఇచ్చిన, తాము ఎంచుకున్న టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉరుకుల పరుగుల జీవనానికి అలవాటు పడ్డారు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చేదాకా సెల్‌ఫోన్‌లలో మాట్లాడటానికే కాలం సరిపోతుంది. నలుగురిలో కలిసి చెప్పుకునే ముచ్చట్లు లేవు, కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేసారి భోజనం చేసే పరిస్థితులు అంతకంటే లేవు. రోజు రోజుకు మానసిక పరిస్థితి దిగజారడం, ఉత్పాదక శక్తి తగ్గిపోతుండటంతో ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పనిచేసే ప్రాంతంలో మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలనే నినాదంతో జరుపుకోనున్నారు.
రిలాక్సేషన్‌పై దృష్టి పెట్టాలి....
👉 పనిచేసే చోట ఉద్యోగులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా రిలాక్సేషన్‌పై దృష్టి పెట్టాలి
👉 ప్రతి రెండు గంటలకు ఒకసారి రిలాక్స్ అయ్యేందుకు సమయం ఇవ్వాలి.
👉 పనిలో ఒత్తిడిని ఎదుర్కొనే ఉద్యోగులు వ్యాయామం యోగా, మెడిటేషన్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
👉 కార్యాలయాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి.
👉 కొన్ని చోట్ల టాయిలెట్‌కు వెళ్లెందుకు కూడా సమయం ఉండటం లేదని ఇటీవల సర్వేలు చెప్పాయి. అలాంటి పరిస్థితులు లేకుండా చూడాలి.
👉 మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేలా కార్యాలయాల్లో చర్యలు తీసుకోవాలి.
👉 పది నిమిషాలు మనస్సుకు రిలాక్సేషన్ ఇస్తే అది ఉత్పాదకత పెరిగేందుకు దోహదపడుతుందనే విషయాన్ని గ్రహించాలి.
👉 వారానికి ఒకసారైనా రిలాక్సేషన్ కోసం ఆత్మీయ బంధువులు, మిత్రులను కలవడం ద్వారా మానసిక ఉల్లాసం పెంపొందుతుంది.
👉 చేసే పనిని ప్రణాళిక బద్దంగా విభజించి చేసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
శారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి. ముఖ్యంగా పనిచేసే ప్రాంతంలో మానసిక ఒత్తిళ్లు కారణంగా ఉత్పాదకతపై ప్రభా వం చూపుతుంది. డ్యూటీ సమయంలో ఉద్యోగుల రిలాక్సేషన్‌పై యాజమాన్యాలు దృష్టి పెట్టాలి. పని చేసేటప్పుడు రిలాక్సేషన్ కోసం కొంత సమయం కేటాయించాలి. మనస్సు ప్రశాంతంగా ఉండేలా వాతావరణం కల్పించాలి.
–డాక్టర్ పర్వతనేని కృష్ణమోహన్, మానసిక వైద్య నిపుణులు
పర్సనల్ లైఫ్‌పై ప్రభావం
పనిచేసే చోట ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు పర్సనల్ లైఫ్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఉద్యోగానికి, కుటుంబాన్ని బ్యా లెన్స్ చేసుకోలేక పోతున్నారు. దాంపత్య జీవితంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్లు ఇటీవల సర్వేల్లో తేలింది. ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగులు ఎక్కువగా మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. వారు మనుషుల్లా కాకుండా నిర్దేశించిన పనిని పూర్తి చేసే రోబోల్లా మారుతున్నారు.
– డాక్టర్ గర్రే శంకరావు, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment