
ఓపెన్ ఇంటర్ మూల్యాంకనంలో అధికారుల ఇష్టారాజ్యం
ఒక్కొక్కరితో రోజుకు 70 నుంచి 100 జవాబు పత్రాలు దిద్దిస్తున్న వైనం
మచిలీపట్నంలో ఇదీ పరిస్థితి
పెడన: కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఓపెన్ ఇంటర్ మూల్యాంకనం ప్రక్రియ అధికారుల ఇష్టారాజ్యంగా మారింది. అనర్హులతో అడ్డగోలుగా జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తున్నారు. మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలోని బాలికోన్నత పాఠశాలలో ఓపెన్ ఇంటర్ జవాబు పత్రాల మూల్యంకనం ఈ నెల మూడో తేదీన ప్రారంభమైంది. ఇక్కడ సంబంధిత సబ్జెక్టుల్లో అర్హత లేనివారితో మూల్యాంకనం చేయిస్తున్నట్లు తెలిసింది.
మచిలీపట్నంలోని ఒక ప్రైవేటు కళాశాలలో పౌరశాస్త్రం బోధించే అధ్యాపకులతో ఇంగ్లిష్ పరీక్ష జవాబు పత్రాలను దిద్దించినట్లు తెలిసింది. మరికొన్ని జవాబు పత్రాలను సైతం ఇదే తరహాలో మూల్యాంకనం చేయించినట్లు సమాచారం. సాధారణంగా రోజుకు ఒక అధ్యాపకుడు 30 నుంచి 40 మాత్రమే జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలి. ఇక్కడ మాత్రం ఒక్కొక్కరితో రోజుకు 70 నుంచి 100 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తున్నట్లు తెలిసింది. తద్వారా వచ్చే డబ్బులను మూల్యాంకనం చేస్తున్నవారు, అధికారులు పంచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పదో తరగతి మూల్యాంకనంలోనూ ఇదే దుస్థితి
లేడీ యాంప్తిల్ కళాశాలలోనే పదో తరగతి రెగ్యులర్ విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం కూడా చేస్తున్నారు. ఉపాధ్యాయులు రోజుకు 40 జవాబు పత్రాలను మాత్రమే దిద్దాలి. అయితే ఇక్కడ 50 నుంచి 60 పేపర్లను హడావుడిగా దిద్దుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కలెక్టర్ ఆరా తీయడంతో దిద్దుబాటు చర్యలు
అధికారులు ఇష్టారాజ్యంగా ఓపెన్ ఇంటర్, పదో తరగతి జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తున్న విషయాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లింది. ఆయన సంబంధిత అధికారులకు ఫోన్ చేసి జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేవారి జాబితాలను తనకు పంపించాలని ఆదేశించినట్లు సమాచారం.
కలెక్టర్ ఆరా తీయడంతో కేవలం అర్హుల జాబితాలను మాత్రమే పంపించేలా సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల మూడో తేదీ నుంచి ఎవరు ఎన్ని పేపర్లు దిద్దినట్లు సంతకాలు చేశారు? అందులోని వారి పేర్లను, తాజాగా అధికారులు పంపించిన వారిపేర్లను రిజిస్టర్లతో సరిపోల్చితే అధికారుల బండారం బట్టబయలవుతుందని పలువురు అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు.