Open Intermediate
-
ఓపెన్‌స్కూల్ పిలుస్తోంది
సాక్షి, ధర్మపురి(కరీంనగర్) : వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారికి తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం మళ్లీ చదువుకునే అవకాశం కల్పిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో పాఠశాల విద్యను మధ్యలో మానేసిన వారు ఓపెన్స్కూల్లో చదువుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞానం, వృత్తి విద్యా సంబంధమైన కోర్సులను ప్రవేశపెట్టింది. 14 ఏళ్లు నిండిన వారందరికీ దూరవిద్య ద్వారా పదో తరగతి, ఇంటర్ చదువుకునే వెసులుబాటు కల్పించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 42 ఓపెన్ స్కూళ్లు ఉన్నాయి. విద్యపై మక్కువ, ఉన్నత విద్యను అభ్యసించాలనే అభిలాష ఉన్న వారికి ఓపెన్ స్కూళ్లు ఒక వరంగా మారాయి. ప్రతినెలా రెండో శనివారం, ప్రతీ ఆదివారం విద్యార్థులకు పాఠాలను బోధిస్తారు. వీటిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఈనెల31తో గడువు ముగియనుంది. అపరాధ రుసుంతో మాత్రం నవంబర్ 10 వరకు అవకాశం ఉంది. వయో పరిమితి ► పదో తరగతిలో ప్రవేశానికి 2019, ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. ► ఇంటర్మీడియట్ ప్రవేశానికి 2019, ఆగస్టు 31 నాటికి 15 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమతి లేదు. బోధనా విషయాలు పదో తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్లో బోధన విషయాలను మూడు గ్రూపులుగా విభజించారు. ► గ్రూపు ఏ భాషలు ► గ్రూపు బీ మొయిన్ సబ్జెక్టులు ► (భాషేతర విషయాలు) ► గ్రూపు సీ వృత్తి విద్యా కోర్సులు ► అభ్యాసకులే స్వయంగా బోధనా విషయాలు (సబ్జెక్టులను) ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంటుంది. మండలంలో నిర్ధేశించిన అధ్యయన కేంద్రాల్లో ఉన్నత పాఠశాలలు/జూనియర్ కళాశాలల్లో సంప్రదించాలి. బోధనా మార్పులు ► పదో తరగతిలో తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ మాద్యమాల్లో ఉంటుంది.ఇంటర్లో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. కోర్సుల కాలపరిమతి ఓపెన్ స్కూల్లో నమోదైన విద్యా సంవత్సరం చివరిలో (మార్చి/ఏప్రిల్) పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ అన్ని పరీక్షలు (5 లేక 6 సబ్జెక్టులు) రాసేందుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన నాటి నుంచి ఇంటర్ తుది పరీక్షకు కనీసం రెండేళ్లు అంతరం ఉండాలి. ప్రవేశ రుసుం పదో తరగతికి రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100 (అందరికీ) అడ్మిషన్ ఫీజు: జనరల్ కేటగిరీ పురుషులకు రూ.1000 ఇతరులకు: అంటే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలకు, దివ్యాంగులకు రూ.600. ఇంటర్మీడియట్ రిజిస్ట్రేషన్ ఫీజు: 200 (అందరికీ) అడ్మిషన్ ఫీజు: జనరల్ కేటగిరీ పురుషులకు: రూ.1,100 ఇతరులు: అంటే మహిళ లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలకు, దివ్యాంగులకు రూ.800. పరీక్ష ఫీజు పదో తరగతికి: ప్రతీ సబ్జెక్టుకు రూ.100, ప్రాక్టికల్ కలిగిన ప్రతీ సబ్జెక్టుకు అదనంగా రూ.50. ఇంటర్మీడియట్: ప్రతీ సబ్జెక్టుకు రూ.150, ప్రాక్టికల్ కలిగిన ప్రతీ సబ్జెక్టుకు రూ.100. నోట్: (దివ్యాంగులకు మెడికల్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా పరీక్ష ఫీజులో రాయితీ ఉంటుంది). క్రెడిట్ అక్యుమలేషన్ అభ్యాసకులు ఒకేసారి అన్ని సబ్జెక్టుల్లో హాజరు కావాలనే నిబంధన లేదు. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో కానీ వారి సౌలభ్యాన్ని బట్టి హాజరు కావచ్చు. నిర్ణీత 5 ఏళ్లలో ఎప్పుడైనా వారు కోర్సులో (పదో తరగతి/ఇంటర్మీడియట్) నిర్ధేశించిన సబ్జెక్టులు ఉత్తీర్ణలవుతారో అప్పుడు పాస్ సర్టిఫికెట్ మార్కుల మెమో ఇస్తారు. సద్వినియోగం చేసుకోవాలి చదువును మధ్యలో ఆపేసిన వారికి ఓపెన్ స్కూల్ ద్వారా చదువు కొనసాగించే అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలి. చిన్న, చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి భవిష్యత్‌లో పదోన్నతి పొందేందుకు ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. – వెంకటేశ్వర్లు, డీఈవో, జగిత్యాల -
ఓపెన్ ఎస్సెస్సీలో 43.39 శాతం ఉత్తీర్ణత
- ఇంటర్మీడియెట్‌లో 49.69 శాతం.. - రెండింటిలోనూ బాలికల హవా సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో గత మార్చి/ఏప్రిల్ నెలల్లో నిర్వహించిన ఓపెన్ ఎస్సెస్సీ, ఓపెన్ ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను మంగళవారం సచివాలయంలో విడుదల చేశారు. ఓపెన్ ఎస్సెస్సీ పరీక్షల్లో 43.39% మంది, ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో 49.69% మంది ఉత్తీర్ణులయ్యారు. పది రోజుల్లోగా మెమోలను సంబంధిత విద్యా సంస్థలకు పంపిస్తారు. అలాగే విద్యార్థుల మార్కుల జాబితాలను వెబ్సైట్లో (telanganaopenschool.org) అందుబాటులో ఉంచుతారు. మెమోల్లో ఏమైనా పొరపాట్లు దొర్లితే ఈనెల 9లోగా ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్, జవాబు పత్రాల జిరాక్స్ కాపీ కోసం 4 నుంచి 13వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. రీ కౌంటింగ్ కోసం సబ్జెక్టుకు రూ.100, రీ వెరిఫికేషన్, జవాబు పత్రాల జిరాక్స్ కాపీ కోసం రూ.1,000 చొప్పున ఏపీ ఆన్లైన్/మీసేవా కేంద్రాల్లో చెల్లించాలి. మరిన్ని వివరాలకు 9030889097 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు. బాలికల హవా: ఓపెన్ ఎస్సెస్సీ, ఓపెన్ ఇంటర్లో బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. ఓపెన్ ఎస్సెస్సీలో 14,864 మంది బాలికలు పరీక్షలకు హాజరు కాగా 7,168 మంది (48.22 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 36,335 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా, 15,046 మంది (41.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు. సంఖ్య పరంగా మాత్రం బాలురు ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్లో 17,377 మంది బాలికలు పరీక్షలకు హాజరు కాగా, 9,328 మంది (53.68 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 35,137 మంది పరీక్షలకు హాజరు కాగా 16,767 మంది (47.72 శాతం) ఉత్తీర్ణులయ్యారు. -
‘ఓపెన్’గా చదువుకోండిలా
చదువు మధ్యలో ఆపేసినా.. ఇతర పనుల కారణంగా ఇంటి వద్దే ఉండి చదువుకోవాలనుకున్నా.. ఓపెన్ స్కూల్‌తో సాధ్యమే.. పదో తరగతి... ఓపెన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రభుత్వం 1991వ సంవత్సరంలో ప్రారంభించింది. 2008-09 విద్యా సంవత్సరంలో ఈ స్కీము ద్వారా నూతనంగా పదో తరగతి కోర్సును ప్రవేశపెట్టింది. ఇది నియత పాఠశాలలో పదోతరగతికి సమానం. ఇంటర్మీడియట్... ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్‌లో ఉత్తీర్ణులైన వారితోపాటు నియత పాఠశాలలో పదోతరగతి పూర్తి చేసి వివిధ కారణాలతో ఇంటర్మీడియట్ చదువుకోలేని విద్యార్థులకు సార్వత్రిక విధానంలో కూడా ఇంటర్మీడియట్ కోర్సు అందించాలనే ఉద్దేశంతో ఓపెన్ ఇంటర్మీడియట్ కోర్సును ప్రారంభించింది. ప్రత్యేకతలు... ►సార్వత్రిక దూర విద్యా విధానం ►స్వేచ్ఛాయుత విద్యా విధానం ►అధ్యయన కేంద్రాల్లో సెలవు రోజుల్లో మాత్రమే తరగతుల నిర్వహణ. ►ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ లేక ఓపెన్ స్కూల్ ప్రత్యేకంగా రూపొందించిన స్వయం అధ్యయన సామగ్రి పంపిణీ. ►అభ్యాసకులు వృత్తి విద్యా సబ్జెక్టును గ్రూప్ (సి) నుంచి ఒక ఐచ్ఛిక సబ్జెక్టుగా ఎంచుకునే అవకాశం. కనీస ప్రవేశ వయస్సు/అర్హత ►టెన్త్‌లో చేరేందుకు కనీస వయస్సు 14 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. ►ఇంటర్మీడియెట్‌కు కనీస వయస్సు 15 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితి లేదు. ►టెన్త్ కోర్సుకు కనీస విద్యా నైపుణ్యాలు కలిగి ఉండాలి. ►ఇంటర్మీడియట్ కోర్సుకు గుర్తింపు పొందిన ఏదైనా బోర్డు నుంచి పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. భాషలు.. ► టెన్త్ తెలుగు ,ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, ఒరియా భాషల్లో... ► ఇంటర్మీడియట్ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో.. బోధనా విషయాలు... ►టెన్త్/ఇంటర్మీడియట్-ఓపెన్ స్కూల్లో బోధనా విషయాలను మూడు గ్రూపులుగా విభజిస్తారు. ►గ్రూపు(ఎ) భాషలు, గ్రూపు(బి) మెయిన్ సబ్జెక్టులు, గ్రూపు(సి) వృత్తి విద్యా కోర్సులు ► అభ్యాసకులే స్వయంగా బోధన విషయాలను ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది. కోర్సుల కాలపరిమితి ఓపెన్ స్కూల్లో నమోదైన విద్యా సంవత్సరం చివరిలో (ఏప్రిల్/ మే)లో పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్లో అన్ని పరీక్షలు (5 లేక 6 సబ్జెక్టులు) రాయడానికి టెన్త్ ఉత్తీర్ణత సాధించిన నాటి నుంచి ఇంటర్మీడియట్ తుది పరీక్షల వరకు కనీసం రెండు సంవత్స రాల కాల వ్యవధి ఉండాలి. అభ్యాసకులకు తరగతులు... ఓపెన్ స్టడీ సెంటర్లో సెలవు రోజులతోపాటు రెండో శనివారం, ప్రతి ఆదివారాల్లో అభ్యాసకులకు 30 కాంట్రాక్ట్ తరగతులు, నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్ ఉన్న సబ్జెక్టులకు అదనంగా 48 రోజులు తరగతులు నిర్వహిస్తారు. టెన్త్ ప్రవేశ రుసుం ►పదో తరగతి: రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100(అందరికీ) ►అడ్మిషన్ ఫీజు: జనరల్ కేటగిరి పురుషులు రూ.1000. ►ఇతరులు: స్త్రీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఎక్స్‌సర్వీస్‌మెన్ పిల్లలకు, వికలాంగులకు రూ.600. ఇంటర్‌కు... ►రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 200(అందరికీ) ►అడ్మిషన్ ఫీజు: జనరల్ కేటగిరి పురుషులకు రూ.1,100. ► ఇతరులు: స్త్రీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఎక్స్‌సర్వీస్‌మెన్ పిల్లలు, వికలాంగులకు రూ.800. దరఖాస్తు ఎక్కడ పొందాలి? ఓపెన్ స్కూల్ అప్లికేషన్ ఫారం, ప్రాస్పెక్టస్‌ను నిర్ణీత తేదీల్లో ప్రతి మండలంలోని స్టడీ సెంటర్లలో, విద్యాధికారి కార్యాలయంలో పొందవచ్చు. ఎక్కడ సమర్పించాలి? మీ సేవ కేంద్రంలో నిర్ణీత ఫీజు చెల్లించాలి. స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ ధ్రువీకరించిన అప్లికేషన్, సంబంధిత పత్రాలను మీసేవలో ఆన్లైన్ చేయడం ద్వారా ఓపెన్ స్కూల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు.. మండల, జిల్లా విద్యాధికారుల వద్ద నుంచి పొందవచ్చు.