
సాక్షి,విజయవాడ: హెల్మెట్ ధరించకపోవడం వల్ల గత ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు 1720 మంది వాహనదారులు మరణించినట్లు ఏపీ హైకోర్టు వెల్లడించింది. రాష్ట్రంలో హెల్మెట్ వాడకం తప్పనిసరిగా అమలు చేయాలని దాఖలైన పిల్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతేడాది కేవలం ఎడునెలల కాలంలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల 1720 మంది మరణించినట్లు తెలిపింది. అయితే, ప్రతి జిల్లాలో ఎంత మృతి చెందారు అనే వివరాలు కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఏ జిల్లాల్లో హెల్మెట్ ఫైన్స్ తక్కువగా విధించారో అక్కడ అధికారులకు నోటీసు ఇవ్వాలని డీజీపీకి హైకోర్టు సూచించింది. హెల్మెట్ ధరించనందుకు గాను రూ.3.82కోట్ల జరిమానా విధించినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే ఈ జరిమానా విధించి, వసూలు చేసిన మొత్తంలో కొంత అవగాహన కార్యక్రమాలు, ప్రకటనల కోసం కేటాయించాలని సీఎస్‌కు సూచించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14770 సీసీ కెమెరాలు, మోటార్ వెహికిల్ చట్టం పాటించని వారిని గుర్తించటానికి ఆ నిధుల్ని ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించింది. ఇదే అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తూ విచారణను వాయిదా వేసింది.