Psychiatrist
-
యంత్రంలా మారిన మనిషి
అరుణ్‌కుమార్ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. డ్యూటీకి వెళ్లిన తర్వాత నిమిషం కూడా ఖాళీ ఉండేది కాదు. కనీసం టాయిలెట్‌కు వెళ్లేందుకు కూడా సమయం దొరికేది కాదు. దీంతో మానసికంగా ఒత్తిడికి లోనయ్యాడు. క్రమేణా అతని పనిపై ప్రభావం చూపింది. అధిక సమయం కార్యాలయంలోనే ఉంటున్నా తాను చేయాల్సిన పనులను పూర్తి చేయలేక పోతున్నాడు. ఇలా ఎంతో మంది కార్పోరేట్ ఉద్యోగులు పనిచేసే ప్రాంతంలో తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వీటిని తొలిదశలో గుర్తించకపోవడంతో రాను రాను తీవ్రమైన డిప్రెషన్‌కు దారి తీస్తున్నట్లు పేర్కొంటున్నారు.రమేష్ విజయవాడ నగరంలోని ఓ కార్పొరేట్ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన పనితీరును మెచ్చిన యాజమాన్యం ఏడాది కిందట మేనేజర్‌గా పదోన్నతి కల్పించారు. అప్పటి నుంచి కొన్ని టార్గెట్లు అప్పగించి వాటిని రీచ్ అవ్వాలనే ఆదేశాలు ఇచ్చారు. దీంతో తన టీమ్‌తో పనిచేయించేందుకు నిమిషం ఖాళీ లేకుండా బిజీగా ఉండేవారు. ఈ తరుణంలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోను కావడంతో ఆ ప్రభావం పనిపై పడింది. యాజమాన్యం ఇచ్చిన టార్గెట్లు రీచ్ కాలేకపోయాడు. దీంతో డిప్రెషన్‌కు లోనయ్యారు.లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్పొరేట్ ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. తమకు తెలియకుండానే డిప్రెషన్‌కు లోనవుతున్నారు. ఆ ఫలితంగా ఎక్కువ సేపు కార్యాలయంలోనే ఉన్నా ఉత్పాదక శక్తి తగ్గిపోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో మనిషి యంత్రంలా మారిపోయాడు. తాము పనిచేసే సంస్థ ఇచ్చిన, తాము ఎంచుకున్న టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉరుకుల పరుగుల జీవనానికి అలవాటు పడ్డారు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చేదాకా సెల్ఫోన్లలో మాట్లాడటానికే కాలం సరిపోతుంది. నలుగురిలో కలిసి చెప్పుకునే ముచ్చట్లు లేవు, కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేసారి భోజనం చేసే పరిస్థితులు అంతకంటే లేవు. రోజు రోజుకు మానసిక పరిస్థితి దిగజారడం, ఉత్పాదక శక్తి తగ్గిపోతుండటంతో ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పనిచేసే ప్రాంతంలో మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలనే నినాదంతో జరుపుకోనున్నారు.రిలాక్సేషన్‌పై దృష్టి పెట్టాలి....👉 పనిచేసే చోట ఉద్యోగులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా రిలాక్సేషన్‌పై దృష్టి పెట్టాలి👉 ప్రతి రెండు గంటలకు ఒకసారి రిలాక్స్ అయ్యేందుకు సమయం ఇవ్వాలి.👉 పనిలో ఒత్తిడిని ఎదుర్కొనే ఉద్యోగులు వ్యాయామం యోగా, మెడిటేషన్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి.👉 కార్యాలయాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి.👉 కొన్ని చోట్ల టాయిలెట్‌కు వెళ్లెందుకు కూడా సమయం ఉండటం లేదని ఇటీవల సర్వేలు చెప్పాయి. అలాంటి పరిస్థితులు లేకుండా చూడాలి.👉 మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేలా కార్యాలయాల్లో చర్యలు తీసుకోవాలి.👉 పది నిమిషాలు మనస్సుకు రిలాక్సేషన్ ఇస్తే అది ఉత్పాదకత పెరిగేందుకు దోహదపడుతుందనే విషయాన్ని గ్రహించాలి.👉 వారానికి ఒకసారైనా రిలాక్సేషన్ కోసం ఆత్మీయ బంధువులు, మిత్రులను కలవడం ద్వారా మానసిక ఉల్లాసం పెంపొందుతుంది.👉 చేసే పనిని ప్రణాళిక బద్దంగా విభజించి చేసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలిశారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి. ముఖ్యంగా పనిచేసే ప్రాంతంలో మానసిక ఒత్తిళ్లు కారణంగా ఉత్పాదకతపై ప్రభా వం చూపుతుంది. డ్యూటీ సమయంలో ఉద్యోగుల రిలాక్సేషన్‌పై యాజమాన్యాలు దృష్టి పెట్టాలి. పని చేసేటప్పుడు రిలాక్సేషన్ కోసం కొంత సమయం కేటాయించాలి. మనస్సు ప్రశాంతంగా ఉండేలా వాతావరణం కల్పించాలి.–డాక్టర్ పర్వతనేని కృష్ణమోహన్, మానసిక వైద్య నిపుణులుపర్సనల్ లైఫ్‌పై ప్రభావంపనిచేసే చోట ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు పర్సనల్ లైఫ్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఉద్యోగానికి, కుటుంబాన్ని బ్యా లెన్స్ చేసుకోలేక పోతున్నారు. దాంపత్య జీవితంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్లు ఇటీవల సర్వేల్లో తేలింది. ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగులు ఎక్కువగా మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. వారు మనుషుల్లా కాకుండా నిర్దేశించిన పనిని పూర్తి చేసే రోబోల్లా మారుతున్నారు.– డాక్టర్ గర్రే శంకరావు, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ -
చదవమంటే నిద్ర వస్తుందంటాడు..? ఏం చేయాలి?
మా అబ్బాయికి 12 సం‘‘లు. వేదపాఠశాలలో చదువుతున్నాడు. క్లాసులో నిద్రపోతున్నాడని టీచర్ల కంప్లైంట్. బాబు ఇష్టం మీదే వేదపాఠశాలలో చేరాడు. సెలవులకు వచ్చినప్పుడు కూడా సమయం దొరికితే నిద్రపోతున్నాడు. ఎన్నిసార్లు మందలించినా నిద్రపోవడం మానడం లేదు. మా బాబు అతి నిద్ర తగ్గించి, బాగా చదివేటట్లు ఏదైనా సలహా చెబుతారా? – రాజేశ్వరి, తిరుపతివాస్తవానికి పిల్లలకు తమకిష్టంలేని సబ్జెక్టు చదువుతున్నప్పుడు బోర్ కొట్టి నిద్ర రావడం సహజమే! కానీ మీ అబ్బాయి తన ఇష్టంతోనే వేద΄ాఠశాలలో చేరాడంటే, అతని అతి నిద్రకు వేరే ఆరోగ్య కారణాలు ఉండవచ్చు. క్లాసులు లేప్పుడు, సెలవుల్లో కూడా అతిగా నిద్ర΄ోతున్నాడని రాశారు. ఇలాంటి అతి నిద్ర సమస్యను ‘హైపర్ సోమ్నియా’ అంటారు. నార్కొలెప్సి, స్లీప్ ఆప్నియా లాంటి ఆరోగ్య సమస్యలున్నవారు, ఇలా అతిగా నిద్రపోతుంటారు. మీరు బాబును మందలించడం వల్ల పిల్లవాడు ఆత్మవిశ్వాసం కోల్పోయి, సమస్య మరింత పెద్దది అయే ప్రమాదముంది. ఆధునిక వైద్యశాస్త్రంలో అతి నిద్రను తగ్గించేందుకు అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. ఒకసారి అబ్బాయిని సైకియాట్రిస్టుకు చూపించి, తగిన వైద్యం చేయిస్తే, మీ బాబు అతి నిద్రను తగ్గించి, మళ్లీ మామూలుగా చదివేటట్లు చేయవచ్చు.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఇద్దరు బాలికలపై వైద్యుని అసభ్య ప్రవర్తన
మధురవాడ(విశాఖ): ఇద్దరు బాలికల పట్ల అసభ్యంగా ప్రవరించిన మధురవాడ మిథి లా పురి వుడా కాలనీలోని మానసిక ఆస్పత్రికి చెందిన ఓ వైద్యునిపై పీఎంపాలెం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీతమ్మధారలో ఉంటున్న ఓ సివిల్ కాంట్రాక్టర్‌కు ఇద్దరమ్మాయిలు. చిన్న కుమార్తె (15) ఇంటర్ ప్రథమ సంవత్సరం, పెద్ద కుమార్తె (16) రెండో సంవత్సరం చదువుతున్నారు. చిన్న కుమార్తె ప్రతి విషయానికి భయపడుతుండడంతో మానసిక వైద్యునికి చూపించాలని భావించారు.దీంతో మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో ఉంటున్న మానసిక వైద్యుడు సతీష్‌కుమార్‌ను సంప్రదించారు. ఈనెల 8వ తేదీన అసభ్యకర బొమ్మలతో క్లాస్ చెబుతున్న క్రమంలో బాలికల పట్ల సతీష్‌కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో ఈనెల 12వ తేదీన పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఆయనకు విపరీతమైన అనుమానం!
మా పెళ్ళయి పదేళ్ళయింది. ఇద్దరు పిల్లలు. మొదట్లో కొంతకాలం బాగున్నాం కానీ, తర్వాత నుంచి నా భర్తకు అనుమానం జబ్బు పట్టుకుని నన్ను మానసికంగా వేధిస్తున్నాడు. ప్రతివాళ్లతోనూ నాకు సంబంధం అంటగట్టి అనరాని మాటలతో చిత్రవధ చేస్తున్నాడు. సినిమాలకు, ఫంక్షన్లకు వెళ్ళినపుడు ఈ బాధ మరీ ఎక్కువవుతోంది. ఏం చేయాలో అర్థం కావడంలేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. – ఒక సోదరి, తెనాలిమీరనుభవిస్తున్న మానసిక క్షోభను అర్థం చేసుకోగలను. వాస్తవం గాకున్నా... ఎలాంటి ఆధారం లేకున్నా ఇలా భార్యాభర్తలు ఒకరినొకరి శీలాన్ని శంకించే మానసిక రుగ్మతను ‘డెల్యూజనల్ డిజాస్ట్టర్ లేదా కాంజుగల్ ΄ారనోయియా’ అంటారు. మిగతా అన్ని విషయాల్లో వీరు మామూలుగానే ఉంటారు. ఏవేవో ఊహించుకుని ఇలాంటి భ్రమలు– భ్రాంతులకు లోనవుతూ, కేవలం జీవిత భాగస్వామిని మాత్రమే ఇలా అనుమానిస్తూ, వేధిస్తూ ఉంటారు. మానసిక రుగ్మత ఉందంటే ఒప్పుకోరు. మీరు మీ బంధువులు, ఇతర పెద్దల సహకారంతో ఆయన్ని ఏదో ఒక విధంగా ఒప్పించి, వైద్యుల దగ్గరకు వెళ్లగలిగితే, ‘యాంటీ సైకోటిక్స్’అనే మందులు, కౌన్సెలింగ్ ద్వారా చికిత్స చేసి, ఈ అనుమానాల ఊబి నుంచి పూర్తిగా బయటపడేస్తారు. మళ్ళీ మీరు ప్రశాంతంగా, సంతోషంగా జీవితాన్ని గడపగలరు. మా చుట్టాలబ్బాయి చిన్నప్పటినుంచి చదువులో టాప్! రెండు పీహెచ్‌డీలు చేశాడు. ఒక పెద్ద కంపెనీలో మంచి జీతంతో ఆఫర్ కూడా వచ్చింది. అయితే ఇటీవల ఉన్నట్టుండి అతని ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది. ఎవ్వరితోనూ మాట్లాడడు. ఒక్కడూ గదిలో తలుపులు వేసుకుని కూచుంటాడు. రోజుల తరబడి స్నానం చేయడు. తన లో తాను నవ్వుకోవడం... మాట్లాడుకోవడం. మా బంధువులందరూ చదువు ఎక్కువ అవడం వల్ల ఈ పిచ్చి వచ్చిందంటున్నారు. నిజమేనా?– కుమార్, కర్నూలుచదువుకు, తెలివితేటలకు, మానసిక జబ్బు రావడానికీ ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం అ΄ోహ మాత్రమే. ఎక్కువ చదివిన వారందరికీ మెంటల్ రావాలని లేదు. అలాగే తెలివితేటలు లేనివారికి, ఎక్కువ చదువుకోనివారికీ మానసిక జబ్బులు రావని ఏమీ లేదు. మానసిక వ్యాధులకు వారసత్వ కారణాలు కొన్నయితే, పరిస్థితుల ప్రభావం, దిగ్భ్రాంతి కలిగించే సంఘటనలు జరగడం, ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకోవడం, తీవ్రమైన ఒత్తిడులకు గురికావడం వంటివి ఇతర కారణాలు. ఆలస్యం చేయకుండా అతణ్ణి ఒకసారి సైకియాట్రిస్ట్‌కు చూపించమని చెప్పండి. స్కిజోఫ్రినియా అనే మానసిక జబ్బుకు లోను కావడం వల్ల వారికి మీరు పేర్కొన్న లక్షణాలుండే అవకాశం ఉంది. తొలిదశలోనే గుర్తించి, సరయిన చికిత్స చేయిస్తే, తొందరగా కోలుకుని తిరిగి మంచి జీవితాన్ని గడపగలడు.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
అతిగా తినడం కూడా మానసిక వ్యాధే!
సుజిత బీటెక్ విద్యార్థిని. మూడో సంవత్సరానికి 10 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. దాంతో మానసికంగా చాలా ఒత్తిడికి లోనైంది. దాన్నుంచి తప్పించుకోవడానికి చేతికి అందింది తినడం అలవాటు చేసుకుంది. క్రమంగా బరువు పెరిగింది. వద్దనుకున్నా తినడం ఆపుకోలేక పోతోంది. దాంతో మరింత బరువు పెరుగుతోంది. జీరోసైజ్‌లో ఉండే తాను లావుగా మారడం పట్ల గిల్టీగా ఫీలవుతోంది. ఎవరితోనూ మాట్లాడకుండా తన గదికే పరిమితమై బాధపడుతోంది. కూతురి సమస్యను తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు. సైకాలజీ కౌన్సెలర్‌ని కలిశారు. సుజిత తల్లిదండ్రులు చెప్పింది విన్నాక, సుజితతో మాట్లాడాక.. నెగటివ్ ఎమోష్స నుంచి తప్పించుకోవడానికి ఎక్కువ తినడం చిన్నప్పటినుంచీ ఆమెకున్న అలవాటని అర్థమైంది. తిండిపై కంట్రోల్ కోల్పోయాననే విషయం తనను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని, దాన్ని తగ్గించుకునేందుకు మరింత తింటోందని ఆమె మాటల ద్వారా తెలిసింది. క్లినికల్ ఇంటర్వ్యూ, సైకలాజికల్ టెస్ట్స్, సైకో డయాగ్నసిస్ అనంతరం ఆమె బింజ్ ఈటింగ్ డిజార్డర్ (బెడ్)తో బాధపడుతోందని నిర్ధారణైంది. అతిగాతినేఈ వ్యాధి సుజితలా చాలామంది జీవితాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్సను అందించడం అవసరం. అలా గుర్తించి సైకోథెరపీ తీసుకున్న 20 సెషన్లలో తన రుగ్మత నుంచి సుజిత బయటపడింది. లైఫ్ స్టైల్ మార్పులు, సైకోథెరపీతో చెక్ అతిగా తినే వ్యాధికి సైకోథెరపీ అవసరమైనా ఎవరికి వారు తమను తాము నియంత్రించుకోవడం, లైఫ్ స్టయిల్లో మార్పులు చేసుకోవడం ద్వారా కొంతవరకు మెరుగుపరచుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం రక్తంలో చక్కెర స్థాయిని నిలకడగా ఉంచడానికి, బింజ్ చేయాలనే కోరికను తగ్గించడానికి స్నాక్స్, భోజనం విషయంలో ఒక షెడ్యూల్‌ను సిద్ధం చేసుకుని ఫాలో అవ్వడం. భోజన సమయంలో శ్రద్ధను మరల్చే వాటిని నివారించడం, ప్రతి బైట్నూ ఆస్వాదించడం, ఆకలి తగ్గడం, పొట్ట నిండిన సంకేతాలపై దృష్టి పెట్టడం. బింజ్ ఈటింగ్‌ను ట్రిగ్గర్ చేసే పరిస్థితులు, ఎమోష్స, ఆహారాలను గుర్తించి.. వాటిని నివారించడానికి మార్గాలను సిద్ధం చేసుకోవడం. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్థితిని మెరుగుపరస్తుంది, పాజిటివ్ బాడీ ఇమేజ్ను ప్రమోట్ చేస్తుంది. సమస్యను అర్థం చేసుకుని సహాయం అందించగల స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవడం. స్వీయ విమర్శ స్థానంలో తనను తాను అంగీకరించుకోవడం. పైవన్నీ చేశాక కూడా ఎలాంటి ఫలితం కనిపించకపోతే ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను సంప్రదించండి. ఆహారం, తిండికి సంబంధమున్న నెగటివ్ ఆలోచనలను, ప్రవర్తనలను గుర్తించడంలో, మార్చడంలో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన నియంత్రణను ప్రోత్సహిస్తుంది. ఇంటర్ పర్సనల్ రిలేష్సను మెరుగుపరచడం, భావోద్వేగ ఒత్తిడిని తగ్గించడంలో ఇంటర్ పర్సనల్ థెరపీ సహాయపడుతుంది. అతిగా తినే వ్యాధితో ఎదురయ్యే యాంగ్జయిటీ, డిప్రెషన్ లాంటి రుగ్మతలను తగ్గించడానికి మందులు కూడా అవసరం కావచ్చు. · వ్యక్తి అవసరాలను, అభిరుచులను గుర్తించి ఆరోగ్యకరమైన తిండి అలవాట్లను తయారుచేయడంలో న్యూట్రిషనిస్ట్ సహాయపడతారు. రసాయన, మానసిక, సామాజిక కారకాలు... ఈ వ్యాధికి కచ్చితమైన కారణమేమిటో ఇంకా తెలియకపోయినప్పటికీ దాని అభివృద్ధికి దోహదపడే ఆనువంశిక, రసాయన, మానసిక, సామాజిక కారకాలున్నాయి. అతిగా తినే వ్యాధి రావడంలో కుటుంబ చరిత్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.మెదడులో ఆకలి, రివార్డ్‌ను నియంత్రించే రసాయనాల అసమతుల్యత కూడా ఈ వ్యాధికి దారితీయవచ్చు. నిరాశ, ఆందోళన, లో సెల్ఫ్ ఎస్టీమ్, ట్రామా లాంటి మానసిక సమస్యలు కూడా కారణమవుతాయి. తీవ్ర డైటింగ్ లేదా ఆహారంపై నియంత్రణకు తిరుగుబాటుగా కూడా బింజ్ ఈటింగ్‌కు దారితీయవచ్చు. జీరోసైజ్ ఉంటేనే అందమనే సోషల్ ప్రెజర్, ప్రాసెస్డ్ ఫుడ్ అందుబాటులో ఉండటం కూడా అతిగా తినే ప్రమాదాన్ని పెంచుతుంది. గుర్తించడం సులభమే... అతిగా తినే వ్యాధిని ఎవరికి వారు గుర్తించలేకపోయినా కుటుంబ సభ్యులు సులువుగా గుర్తించవచ్చు. ఈ రుగ్మత లక్షణాలు... తక్కువ వ్యవధిలో ఎక్కువ పరిమాణంలో ఆహారం తినడాన్ని నియంత్రించుకో లేకపోవడం. భారీగా తినడానికి సిగ్గుపడి ఎవరికీ తెలియకుండా దాచుకుని తినడం. కడుపు నిండిందని తెలిసినా తినడం ఆపలేకపోవడం. తినే పదార్థాన్ని ఆస్వాదించకుండా అసాధారణవేగంతో తినడం. అతిగా తింటున్న విషయం గుర్తించి తనను తానే అసహ్యించుకోవడం. ఆహారం, తిండిపైనే మనసు నిలపడం వల్ల పనిలో ఏకాగ్రత కోల్పోవడం, మానవ సంబంధాలు నిర్వహించడంలో ఇబ్బంది పడటం. -
ప్రమాదం అంచున మనదేశం
మీరు ఆరోగ్యంగా ఉన్నారా? అని ప్రశ్నిస్తే కొంతమంది తమ ఆరోగ్య సమస్యల గురించి ఏకరువు పెడతారు. మరికొందరు ‘నాకేమండీ, ఏ జబ్బూ లేదు’ అని ధీమాగా చెప్తారు. కానీ ఆరోగ్యంగా ఉండటమంటే జబ్బు లేకపోవడం మాత్రమే కాదు. ఆరోగ్యంగా ఉండటమంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా క్షేమంగా ఉండటమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. అలాగే మానసిక ఆరోగ్యం లేకుండా శారీరక ఆరోగ్యం ఉండదని హెచ్చరిస్తోంది. కానీ మనం శారీరక సమస్యల గురించి మాట్లాడుకున్నంత స్వేచ్ఛగా మానసిక సమస్యలగురించి మాట్లాడుకోం. మానసిక సమస్యల పట్ల సమాజంలో నెలకొన్న అపోహలే అందుకు కారణం. ఒక సైకాలజిస్టునో, సైకియాట్రిస్టునో కలిశారంటే.. పిచ్చి అని ముద్ర వేస్తారేమోననే భయం. ఈ అపోహలను, భయాలను దూరం చేసేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ‘మే’నెలను ‘మెంటల్ హెల్త్ మంత్’గా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మనదేశంలో మానసిక ఆరోగ్యం స్థితిగతులను, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? మానసిక ఆరోగ్యమంటే ఒక వ్యక్తి సైకలాజికల్‌గా, ఎమోషనల్‌గా క్షేమంగా ఉండటం. బాలెన్స్డ్ మైండ్, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని కలిగి ఉండటం. ఆలోచనల్లో, ప్రవర్తనలో, భావోద్వేగాల్లో బ్యాలెన్స్ కోల్పోయినప్పుడు మానసిక అనారోగ్యం వస్తుంది. దీర్ఘకాలికంగా కొనసాగే తీవ్రమైన ఒత్తిడి, జీవసంబంధ కారకాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, ప్రతికూల ఆలోచనలు, ఆర్థిక సమస్యలు, ఒంటరితనం, కుటుంబ కలహాలు వంటి సమస్యలు కూడా మానసిక సమస్యలకు కారణమవుతాయి. దాదాపు 250కి పైగా మానసిక రుగ్మతలు ఉన్నాయి. డిప్రెషన్, యాంగ్జయిటీ, ఫోబియా, ఈటింగ్ డిజార్డర్స్, మానసిక ఒత్తిడి సాధారణ మానసిక రుగ్మతలు. స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, క్లినికల్ డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీ, పర్సనాలిటీ డిజార్డర్స్ అనేవి తీవ్రమైన మానసిక రుగ్మతలు. వీటిలో కొన్నిటికి కౌన్సెలింగ్, సైకోథెరపీ సరిపోగా, మరికొన్నిటికి మందులు అవసరమవుతాయి. కానీ అన్నింటినీ ‘పిచ్చి’ అనే పరిగణించడం వల్ల కనీసం మాట్లాడేందుకు కూడా భయపడుతున్నారు. అపోహలను ఎలా ఎదుర్కోవాలి? మానసిక రుగ్మతలను పరిష్కరించుకోవాలంటే ముందుగా వాటి పట్ల ఉన్న అపోహలను ఎదుర్కోవాలి. అందుకోసం మీడియాతో పాటు మనమందరం కృషి చేయాలి. అందుకోసం ఈ కింది సూచనలు ఉపయోగపడతాయి. మానసిక అనారోగ్యం సర్వసాధారణం. అది మానసిక బలహీనతకు సంకేతం కాదు. గణాంకాలను చూస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. మానసిక రుగ్మత లక్షణాలు కనిపించగానే ఎవరో ఏదో అనుకుంటారని భయపడకుండా వెంటనే చికిత్స తీసుకోండి. మీరూ, మీ సమస్య వేర్వేరు. మీ సమస్యతో మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకోవద్దు. మీకు ‘బైపోలార్ డిజార్డర్’ ఉంటే, ‘నేను బైపోలార్’ అని కాకుండా ‘నాకు బైపోలార్ డిజార్డర్’ ఉంది అని చెప్పండి. మానసిక అనారోగ్యం గురించి అవగాహన లేనివారి నుంచి మీకు వివక్ష ఎదురుకావచ్చు. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. సమస్యను అర్థం చేసుకోలేకపోవడం వారి సమస్యగా పరిగణించండి. మానసిక అనారోగ్యం సిగ్గుపడాల్సిన విషయమేం కాదు. కాబట్టి దాని గురించి మాట్లాడండి. అప్పుడే ప్రజల్లో ఉన్న అపోహలు దూరమవుతాయి. మానసిక అనారోగ్యాల గురించి సరైన వ్యక్తుల నుంచి, సరైన సమాచారాన్ని సేకరించి విస్తృతంగా ప్రచారంలో పెట్టండి. మానసిక రుగ్మత లక్షణాలు నిరంతర ప్రతికూల ఆలోచనలు మరణం లేదా ఆత్మహత్య గురించి ఆలోచించడం ఏకాగ్రత లోపం ఎనర్జీ లెవెల్స్‌లో తీవ్ర మార్పులు ఎక్కువగా ఒంటరిగా గడపాలని కోరుకోవడం నియంత్రించలేని ప్రవర్తన, కోపం, విచారం ఎవరికీ వినిపించని శబ్దాలు వినిపించడం, రూపాలు కనిపించడం ఆత్మహత్యల రాజధానిగా దేశం మన దేశంలో ప్రతి అయిదుగురిలో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో దాదాపు ఆరు నుంచి ఏడు కోట్ల మంది ప్రజలు సాధారణ, తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఒక సంవత్సరంలో 2.6 లక్షల ఆత్మహత్య కేసులతో భారతదేశం ప్రపంచ ఆత్మహత్యల రాజధానిగా మారడం బాధాకరమైన విషయం. భారతదేశంలో ప్రతి లక్ష మందికి సగటు ఆత్మహత్యల రేటు 10.9గా ఉందని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు చెబుతున్నాయి. మానసిక నిపుణుల కొరత దేశవ్యాప్తంగా కేవలం 43 ప్రభుత్వ మానసిక ఆరోగ్య సంస్థలు ఉన్నాయి. 11,500 మంది సైకియాట్రిస్టులు అవసరంకాగా కేవలం 3800 మాత్రమే అందుబాటులో ఉన్నారు. అంటే నాలుగు లక్షల మందికి ఒక సైకియాట్రిస్ట్ మాత్రమే ఉన్నారు. 17,250క్లినికల్ సైకాలజిస్టులు అవసరం కాగా కేవలం 900 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. అలాగే సైకియాట్రిక్ సోషల్ వర్కర్లు, సైకియాట్రిక్ నర్సులు, కౌన్సెలింగ్ సైకాలజిస్టులు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. - సైకాలజిస్ట్ విశేష్ -
సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావం.. అసలేంటి బింజ్ వాచింగ్?
అర్జున్ (21) ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. గత కొద్ది రోజులుగా ఇంట్లో ఒంటరిగా ఉండటంతోపాటు తీవ్ర నిరాశ, ఆందోళనకు లోనవుతున్నాడు. ఇంట్లో ఎవరైనా తనతో మాట్లాడితే వారిని విసుక్కోవడం, కసిరికొట్టడం చేస్తున్నాడు. ఎక్కువ సమయం ఏదొక ఓటీటీలో వెబ్ సిరీస్, సినిమాలు చూస్తూ ఉండిపోతున్నాడు. దీంతో అర్జున్ను అతడి తండ్రి విజయవాడలోని మానసిక వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్లాడు. వైద్యుడు లక్షణాలన్నీ అడిగి తెలుసుకుని రెండు, మూడు సిట్టింగ్‌ల అనంతరం అర్జున్.. ‘బింజ్ వాచింగ్ అడిక్షన్’తో బాధపడుతున్నట్టు తెలిపారు. ‘చదువుపై దృష్టి సారించలేకపోతున్నాను.. తొందరపాటు ఎక్కువగా ఉంటోంది.. ఒంటరిగా ఉండాలనిపిస్తోంది’.. అంటూ రమ్య అనే ఎంబీబీఎస్ విద్యార్థిని మానసిక వైద్యుడిని సంప్రదించింది. ‘నేను అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) సమస్యతో బాధపడుతున్నాను. ఈ సమస్య ఉన్నవారికి ఇచ్చే మిథైల్ఫేనిడేట్ మందును నాకు ఇవ్వండి’ అని డాక్టర్‌ను అడిగింది. తన సమస్యతోపాటు ఏ మందు ఇవ్వాలో కూడా చెప్పేస్తుండటంతో సందేహం వచ్చిన మానసిక వైద్యుడు కొంత లోతుగా ఆమెను పరిశీలించారు. ఈ క్రమంలో రమ్య.. ఏడీహెచ్‌డీ కంటెంట్‌తో వచ్చిన ఇంగ్లిష్ సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావంలో పడ్డట్టు వైద్యుడు గుర్తించారు. ఇలా అర్జున్, రమ్య తరహాలోనే ప్రస్తుతం కొందరు పిల్లలు, యువత, పెద్దలు.. బింజ్ వాచింగ్‌కు బానిసలై బాధపడుతున్నారు. ప్రస్తుత స్ట్రీమింగ్ యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క క్లిక్‌తో ఓటీటీ వేదికగా వివిధ భాషా చిత్రాలను, వెబ్ సిరీస్‌లను చూసే అవకాశం ఉంది. దీనికి తోడు చౌకగా అన్లిమిటెడ్ డేటా లభిస్తుండటంతో కావాల్సినంత వినోదం లభిస్తోంది. ఈ క్రమంలో అతిగా సినిమాలు, వెబ్‌సిరీస్, షోలు చూసే బింజ్ వాచింగ్ అనేది ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. ఇలా పగలు, రాత్రి తేడా లేకుండా ఓటీటీలకు అతుక్కుపోవడం మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, అమరావతి భారతీయులు రోజుకు నాలుగు గంటలకు పైనే బింజ్ వాచింగ్‌కు కేటాయిస్తున్నట్టు జనవరిలో అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తమ వినియోగదారుల్లో 61 శాతం మంది ఒకే సిట్టింగ్‌లో షో, వెబ్ సిరీస్‌లోని ఆరు ఎపిసోడ్లను క్రమం తప్పకుండా చూస్తున్నారని గతేడాది మరో దిగ్గజ ఓటీటీ సంస్థ.. నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. ఇలా ఓటీటీల్లో దేన్నైనా చూడటం ప్రారంభిస్తే ఆపకుండా వరుసగా ఒక సినిమా నుంచి మరో సినిమా, ఒక వెబ్ సిరీస్ నుంచి మరో వెబ్ సిరీస్ చూసేస్తున్నారు. ఇది క్రమంగా అడిక్టివ్ బిహేవియర్ (వ్యసనం)గా మారుతోందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉండే కొరియన్ వెబ్ సిరీస్, సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. దీంతో వారు హింస వైపు ప్రేరేపితులయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బింజ్ ఈటింగ్ కూడా.. సాధారణంగా ఏదైనా సినిమా, షో చూసేటప్పుడు చిరుతిళ్లు తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. ఈ క్రమంలో బింజ్ వాచింగ్ చేసేవారు బింజ్ ఈటింగ్ (ఎంత తింటున్నారో తెలియకుండా) చేసి ఊబకాయం బారినపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు చిప్స్, లేస్, కుర్ కురే వంటి ప్యాక్డ్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవడంతో ఊబకాయంతోపాటు గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా ఎదుర్కొంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. బింజ్ వాచింగ్తో సమస్యలు.. ► ఒంటరిగా ఉండటం పెరుగుతుంది. అతిగా ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు, సినిమాలు చూస్తూ లౌకిక ప్రపంచం నుంచి దూరమవుతారు.. ఇతరులతో సంబంధాలు ఉండవు. ఫలితంగా కుటుంబం, స్నేహితుల నుంచి దూరమయ్యే ప్రమాదం ఉంది. ► వెబ్ సిరీస్‌లు, సినిమాలు చూసే క్రమంలో ఒకేసారి వాటిని పూర్తి చేయాలని అర్ధరాత్రి దాటిపోయినా నిద్రపోవడం లేదు. దీంతో నిద్రలేమి, చిరాకు, విసుగు వంటివి తలెత్తుతున్నాయి. ► మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన పెరుగుతున్నాయి. అతిగా స్క్రీన్‌ను చూడటం వల్ల కంటి చూపు సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయి. ► కొందరైతే వెబ్ సిరీసుల్లో లీనమైపోయి అందులో జరిగినట్టు తమ జీవితంలోనూ మార్పులు రావాలని ఊహించుకుంటూ సమస్యల బారినపడుతున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి.. వేసవి సెలవుల్లో పిల్లలు సెల్ఫోన్లు, ట్యాబ్‌లకు బానిసలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వేసవిలో పిల్లల భవిష్యత్‌కు దోహదపడేలా ఏదైన ఒక ఔట్‌డోర్ గేమ్, ఏదైనా భాషలో వారికి శిక్షణ ఇప్పించాలి. ప్రస్తుతం బింజ్ వాచింగ్ సమస్య అన్ని వయసుల వారిలోనూ ఉంటోంది. గతేడాది 20 మంది వరకు ఎంబీబీఎస్ విద్యార్థులు ఈ సమస్యతో బాధపడుతూ మా వద్దకు వచ్చారు. ఏ అలవాటు మితిమీరినా ముప్పు తప్పదు. – డాక్టర్ ఇండ్ల విశాల్ రెడ్డి, మానసిక వైద్యుడు, విజయవాడ -
సరదా అనుకున్నాం కానీ, అదొక వ్యాధి అనుకోలేదు.. అసలు ఏంటిది?
గత కొన్ని రోజులుగా శ్రీనగర్ కాలనీ నివాసి లలిత (35) ఏదో ఒత్తిడికి గురవుతున్నట్టు కనిపిస్తోంది. ఇంట్లో ఏవో కొన్ని వస్తువులు రహస్యంగా దాస్తోంది. డబ్బులు ధారాళంగా ఖర్చు చేస్తోంది. ఈ విషయాలన్నీ గమనించిన కుటుంబసభ్యులు ఎందుకయినా మంచిదని ఒకరోజున సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. కొన్ని గంటల పాటు పరిశీలించిన వైద్యుడు ఆమె సీబీఎస్డీ అనే వ్యాధికి గురైందని నిర్ధారించారు. అదేమిటీ..తరచూ షాపింగ్ చేస్తుంటే సరదా అనుకున్నాం కానీ అదొక వ్యాధి అనుకోలేదే అని ఆశ్చర్యపోయారు కుటుంబ సభ్యులు. నగరంలో విజృంభిస్తున్న సరికొత్త మానసిక వ్యాధికి లలిత ఓ ఉదాహరణ. సాక్షి, హైదరాబాద్: కంపల్సివ్ బయింగ్ బిహేవియర్ లేదా కంపల్సివ్ బైయింగ్, షాపింగ్ డిజార్డర్ (సీబీఎస్డీ/సీబీడీ)తో బాధపడు తున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఒకప్పుడు మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య ఇప్పుడు అందరినీ వేధిస్తోందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. సీబీఎస్డీ తీవ్రమైన ఒత్తిడితో ముడిపడిన మానసిక ఆరోగ్య పరిస్థితి అని, అనవసరమైన వాటిని కూడా కొనడాన్ని నియంత్రించుకోలేని సమస్య గా మనస్తత్వవేత్తలు పేర్కొంటున్నారు. ఇటీవలే ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్ (కొన్నిప్రత్యేక అలవాట్ల నియంత్రణ లోపాలు)లో ఒకటిగా దీనిని చేర్చింది. ఈ సమస్య ఉన్నవారికి తరచుగా షాపింగ్ చేయాలనే కోరిక కలుగుతుంటుంది. అధిక వ్యయం వల్ల ఉత్పన్నమయ్యే ఆర్థికసమస్యలు, అను బంధాల విచ్ఛిన్నం వంటి ప్రతికూల ఫలితాలున్నప్పటికీ పట్టించుకోకుండా అదేపనిలో నిమగ్నమైపోతారు. ఈ రుగ్మత ఉన్నవారు తమ బడ్జెట్‌పై స్పష్టమైన వైఖరి లేకుండా వారి సాధారణ కార్యకలాపాలను సైతం నిర్లక్ష్యం చేస్తూ కొనడంలోనే నిమగ్నమవుతుంటారు. కరోనా సహా...కారణాలనేకం.. మానసిక, పర్యావరణ, జీవ సంబంధమైన కార ణాలుసహా అనేక అంశాలు కంపల్సివ్ షాపింగ్ ను ప్రేరేపిస్తున్నాయి. పెరిగిన ఇంటర్నెట్, సోషల్ మీడియా, క్రెడిట్ కార్డ్‌లు, ఆన్లైన్ షాపింగ్, ప్రకటనలు, ప్రమోషన్ కార్యక్రమాలు కూడా సీబీఎస్డీకి దోహదపడుతున్నట్లు మనస్తత్వవేత్తలు పేర్కొంటున్నారు. మరోవైపు ఆర్థిక అవగాహన లోపించడం, రుణాలు సులభంగా అందుబాటులోకి రావడం కూడా కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో ప్రతి చిన్న వస్తువును ఆన్లైన్ ద్వారా కొనడం అత్యధికశాతం మందిని ఈ వ్యాధికి చేరువ చేసిందంటున్నారు. కంపల్సివ్ షాపింగ్ కోసం చికిత్స కోరిన వ్యక్తుల్లో దాదాపు 34% మంది ఆన్లైన్ షాపింగ్‌కు అలవాటు పడినవారని జర్మనీలోని హన్నోవర్ మెడి కల్ స్కూల్ పరిశోధకులు తేల్చడం గమనార్హం. భావోద్వేగ పరిస్థితులతో వ్యాధి తీవ్రం.. కంపల్సివ్ షాపింగ్ లింగ భేదాలకు అతీతంగా ఉందని నిపుణులు అంటున్నారు. అయితే సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలకు కాస్త షాపింగ్ ప్రియత్వం ఎక్కువ. అందువల్ల మహిళలే ఎక్కువగా ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ, ఆత్మవిశ్వాస లోపం వంటి ప్రతికూల భావోద్వేగ పరిస్థితులతో వ్యాధి తీవ్రతరం కావొచ్చు. బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ (కొన్ని సమయాల్లో కుంగుబాటు, కొన్ని సమయాల్లో విపరీత ప్రవర్తన), అబ్సెసివ్–కంపల్సివ్ డిజార్డర్ (అతిగా ప్రవర్తించడం) (ఓసీడీ) తదితర ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్‌తో బాధపడుతున్న వ్యక్తులలో కంపల్సివ్ షాపింగ్‌ను వైద్యులు గుర్తిస్తున్నారు. దీనికి మందులు, జీవనశైలి మార్పుల కలయికతో కూడిన సమగ్ర చికిత్స విధానం అవసరమని వైద్యులు అంటున్నారు. వ్యక్తులు ఖర్చు చేసే అలవాటుపై తిరిగి నియంత్రణ సాధించేందుకు ఈ చికిత్స సహాయపడుతుందని చెబుతున్నారు. కంపల్సివ్ షాపింగ్‌తో పోరాడుతున్న వ్యక్తులు శిక్షణ పొందిన మానసిక ఆరోగ్య నిపుణుల నుంచి సహాయం పొందాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ.. సమగ్ర మనోరోగ చికిత్స జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, అభివృద్ధి చెందిన దేశాలలో 5% మంది పెద్దలను కూడా సీబీఎస్డీ ప్రభావితం చేస్తోంది. ప్రతి 20 మందిలో ఒకరు దీని బారిన పడుతున్నారని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ నివేదించింది. వీరిలో ప్రతిముగ్గురి లో ఒకరు ఆన్లైన్ కొనుగోలు వ్యసనంతో బాధ పడుతున్నారు. ‘షాపింగ్‌పై కోరికతో వారు కొనుగోలు చేయగలిగిన దానికంటే ఎక్కువ కొనుగోలు చేస్తారు. మహిళలే కాదు..అందరిలోనూ కని్పస్తోంది గతంలో పార్కిన్సన్స్ లాంటి మెదడు మీద ప్రభావం చూపే వ్యాధుల్లో ఒక లక్షణంగా ఈ సీబీడీని గుర్తించేవాళ్లం. దీన్ని బైపోలార్ డిజార్డర్ అనేవాళ్లం. అయితే ఇటీవలి కాలంలో ఇతరత్రా వ్యాధులు లేకుండానే..సీబీడీకి గురవుతున్నారు. విచిత్రమేమిటంటే అవసరానికో, ఆర్థికంగా బాగుండో కొనేవారిలా కాకుండా ఈ వ్యాధికి గురైన వారు కొన్నవాటితో సంతోషం కూడా పొందరు. కొన్నప్పటికీ అసంతృప్తితో ఉంటారు. అవమానంగా ఫీలవుతారు. దాంతో మళ్లీ కొంటారు. అలా అలా.. మత్తు పదార్థాలకు అలవాటైన వారిలా.. కొంటున్న విషయాన్ని, కొన్న వస్తువుల్ని రహస్యంగా ఉంచుతారు. వీరికి చికిత్సలో భాగంగా కౌన్సెలింగ్ తో పాటు మందులను కూడా వాడాల్సి ఉంటుంది. గతంలో మహిళల్లో ఎక్కువగా చూసేవాళ్లం. ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. –డాక్టర్ చరణ్ తేజ, న్యూరో సైకియాట్రిస్ట్, కిమ్స్ ఆసుపత్రి -
'38 ఏళ్లొచ్చినా గర్ల్‌ఫ్రెండ్ లేదు.. నా కుమారుడి చిప్ దొబ్బింది..!'
బీజింగ్: పిల్లలకు పెళ్లీడు వచ్చిందంటే చాలు తల్లిదండ్రులు హడావిడి చేస్తుంటారు. సంబంధాలు చూసి త్వరగా పెళ్లి చేసేయాలని అనుకుంటారు. ఈ కాలంలో యువత అయితే తల్లిదండ్రులకు పని లేకుండా వారే తమ జీవిత భాగస్వాములను చూసుకుంటున్నారు. అలాంటిది 38 ఏళ్లొచ్చినా తన కొడుకు ఇంకా సింగిల్ గానే ఉంటున్నాడని, ఇప్పటివరకు ఒక్క గర్ల్‌ఫ్రెండ్‌ను కూడా ఇంటికి తీసుకురాలేదని ఓ తల్లి ఆందోళన చెందుతోంది. అంతేకాదు ఇన్నేళ్లు వచ్చినా పెళ్లి మాట ఎత్తకపోవడంతో అతని తలలో ఏదో లోపం ఉన్నట్టుందని ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో కుమారుడ్ని ప్రతి ఏటా మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తోంది. ఈ ఘటన చైనా హెనాన్ రాష్ట్రంలో జరిగింది. 38 ఏళ్లొచ్చినా సింగిల్‌గా ఉంటున్న ఇతని పేరు వాంగ్. ఇతనికి పెళ్లి కావడంలేదని తల్లి దిగులు చెందుతోంది. కుమారుడ్ని మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తే సమస్య తీరుతుందని భావించింది. దీంతో 2020 నుంచి ప్రతి ఏటా చైనా లూనార్ న్యూ ఇయర్ తర్వాత వాంగ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తోంది. ఈసారి షాక్.. అయితే ఈసారి ఫిబ్రవరి 4న ఆస్పత్రికి వెళ్లిన వాంగ్ తల్లికి వైద్యులు షాక్ ఇచ్చారు. అతను బాగానే ఉన్నాడని ఏలాంటి సమస్యా లేదని స్పష్టం చేశారు. అసలు సమస్య ఆమెలోనే ఉందని, కుమారుడికి పెళ్లి కావడం లేదనే దిగులుతో 'మెంటల్ డిజార్డర్' వచ్చిందని చెప్పారు. దీంతో ఆమె అవాక్కయ్యింది. తల్లి కోసమే.. కేవలం తల్లిని బాధపెట్టొద్దనే ఉద్దేశంతోనే తాను ఆస్పత్రికి వెళ్తున్నట్లు వాంగ్ చెప్పాడు. 10 ఏళ్లుగా తాను ఉద్యోగం చేస్తూ తీరక లేకుండా ఉన్నానని, గర్ల్‌ఫ్రెండ్ గురించి ఆలోచనే తనకు రాలేదన్నాడు. సమయం వచ్చినప్పుడు సరైన వ్యక్తి తన జీవితంలోకి వస్తుందేమేనని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అయినా ఇళ్లు కొనేందుకు డౌన్‌పేమెంట్‌కు డబ్బులు కూడా లేని తనను ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందని ప్రశ్నించాడు. తాను సిటీలో 'సూపర్ ఓల్డ్ సింగిల్ మ్యాన్' అంటూ ముసిముసి నవ్వులు నవ్వాడు. చైనా మీడియాలో వాంగ్ కథనం ప్రసారం కాగా.. యువకులు పెద్ద చర్చకు తెరలేపారు. పెళ్లి చేసుకోకపోతే ఈ సమాజం తాము ఏదో పాపం చేసినట్లుగా చూస్తోందని, ఇది సబబేనా అని ఓ నెటిజన్ స్పందించాడు. మరో యువకుడు స్పందిస్తూ అసలు పెళ్లి చేసుకున్న వాళ్లే మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అసహనం వ్యక్తం చేశాడు. చదవండి: అందంగా కన్పించాలని ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ.. ఆ తర్వాత గంటల్లోనే.. -
అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్
కరోనా రాకముందే... అలాగే, దాని గురించి తెలిసిన కొత్తలో దాని కారణంగా చాలామందిలో కొన్ని మానసిక సమస్యలు కనిపించడం వైద్యులు గమనించారు. ఉదాహరణకు... యాంగై్జటీ, డిప్రెషన్ వంటివి కొన్ని. అలాగే ఇప్పుడు రెండో వేవ్ కొనసాగుతూ ఉండగా...ఇందులోనూ తమకు సన్నిహితులూ... కొందరైతే తమ సొంత కుటుంబ సభ్యులను కోల్పోవడంతో మరింత తీవ్రమైన మానసిక సమస్యలను చవిచూశారూ...చూస్తున్నారు. అందులో ప్రధానమైనది ‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్’. దాని గురించి తెలుసుకుందాం. గత ఏడాది మొదటి కరోనా వేవ్ సీజన్లో దాని గురించి పెద్దగా తెలియని పరిస్థితుల్లో చాలామంది తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురయ్యారు. ఇలా ఒత్తిడికి గురైనప్పుడు కొన్ని మానసిక లక్షణాలూ కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు తొందరగానే తగ్గిపోవచ్చు. అలా వచ్చి తగ్గిపోయిన సమస్యలను ‘అక్యూట్ స్ట్రెస్ రియాక్షన్’ అంటారు. మరికొందరిలో అవి తీవ్రమైన ఒత్తిడి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్, పానిక్ డిజార్డర్, ఫోబియా, ఓసీడీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలుగా మారే అవకాశమూ ఉండింది. అప్పుడూ ఇప్పుడు కూడా కరోనా విషయమై బాగా టెన్షన్‌గా ఉండటం, తీవ్రమైన ఆందోళన, విపరీతమైన బెంగ... వ్యాధి వస్తుందా, వస్తే తగ్గుతుందా, లేక మరణానికి దారితీస్తుందా లాంటి సందేహాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇప్పటి రెండో సీజన్లోనూ అలా అవుతున్నారు. దాన్ని కరోనా ఫోబియా గా చెప్పవచ్చు. వాళ్లలో కరోనా లేకపోయినా... లేదా వచ్చి తగ్గిన వారిలోనూ మళ్లీ మళ్లీ ఎన్నోసార్లు పరీక్ష చేయించుకుంటూ ఉంటారు. వారిలో ఆ వ్యాధి లేదనీ... ఒకసారి వచ్చి తగ్గినందున మళ్లీ ఆ వెంటనే సాధారణంగా రాదని చెప్పినా భయం పోదు. ఇలా తమకు దూరంగా ఉన్న రక్తసంబంధీకులు, కావాల్సినవారు ఎలా ఉన్నారో అంటూ ఆందోళన పడవచ్చు. ఇలాంటి ఆందోళన తో టెన్షన్ పడటాన్ని ‘జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ (జీఏడీ)’గా చెప్పవచ్చు. టెన్షన్‌తోపాటు విపరీతంగా భయపడటాన్ని ప్యానిక్ డిజార్డర్‌గా చెప్పవచ్చు. అంటే వీళ్లు కరెన్సీనీ, కూరగాయలనూ, తమ ఇంటిలోని సొంత ఆత్మీయులనూ తాకడానికి కూడా తీవ్రమైన భయాందోళనలకు గురవుతూ ప్యానిక్ అవుతుంటారు. దీన్ని ‘ప్యానిక్ డిజార్డర్’ గా చెప్పవచ్చు. ఇక చేతులకు మళ్లీ మళ్లీ శానిటైజర్ పూసుకోవడం, చేతులు అదేపని గా కడుక్కోవడం చేస్తూ ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్‌కూ లోను కావచ్చు. ఒకసారి చేతులు కడుక్కున్నా లేదా శానిటైజర్ పూసుకున్నా దాదాపు గంటపాటు రక్షణ ఉందని తెలిశాక కూడా ప్రతి ఐదు నిమిషాలకూ ఇలా చేస్తుంటే ఓసీడీగా పేర్కొనవచ్చు. అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అంటే... అంతకు ముందు ఉన్న సాకుకూల స్థితి తొలగిపోయి ఒకేసారి కొత్త పరిస్థితులకు ఎక్స్పోజ్ అయినప్పటుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో, దానికి తగినట్లుగా తమను తాము ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియని అయోమయంలో వ్యక్తులు తీవ్రమైన వ్యాకులతకూ, కుంగుబాటుకు గురియ్యే అవకాశం ఉంది. దాన్నే ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’గా పేర్కొనవచ్చు. లక్షణాలు - అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’ ఉన్నవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే అవే లక్షణాలన్నీ అందరిలోనూ కనిపించకపోవచ్చు. బాగా దగ్గరివారు ఆ లక్షణాలను గమనిస్తూ ఉండటం అవసరం. అవి... ఏదో తెలియని భయం/ఆందోళన/గుబులు/గాభరా ∙గుండెవేగంగా కొట్టుకోవడం/గుండెదడ/గుండెల్లో మంట / గుండె బిగబట్టినట్టుగా ఉండటం/ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ - అకస్మాత్తుగా అంతులేని భయానికీ లోనవ్వడం (ప్యానిక్ అటాక్) , విపరీతంగా చెమటలు పట్టడం, ఛాతీ బిగబట్టినట్టుగా అనిపించడం / ఛాతీలో మంట , శ్వాససరిగా అందకపోవడం లేదా బలంగా ఊపిరి తీసుకోవడం / ఆయాస పడటం - నోరు తడారిపోవడం ఒళ్లు జలదరించడం ∙అయోమయం, కడుపులో గాభరా కడుపులో మంట, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్తూ ఉండటం. చేతులు, కాళ్లు వణకడం, ఒకచోట నిలకడగా ఉండలేకపోవడం. - నిత్యం అలజడిగా ఉండటం, తీవ్రమైన నిద్రలేమి, నిద్రవేళల్లో మార్పులు, వేళకు నిద్రపట్టకపోవడం (ఇర్రెగ్యులర్ స్లీప్ పాట్రన్స్), అకస్మాత్తుగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేవడం ఇక ఆ తర్వాత నిద్రపట్టకపోవడం - ఈ లక్షణాలతో పాటు కొత్త పరిస్థితులకు అడ్జెస్ట్ అయ్యేందుకు పడే ప్రయాసలో డిప్రెషన్‌కు గురైన వారిలో తీవ్రమైన నిరాశ, నిస్పృహ, నెగెటివ్ ఆలోచనలు రావడం, భవిష్యత్తు ఆశాజనకంగా కనిపించకపోవడం వంటి లక్షణాలూ కనిపించడంతో పాటు ఆత్మహత్యకు పాల్పడే లక్షణాలూ (సూసైడల్ టెండెన్సిస్) కూడా కనిపిస్తాయి. ఆత్మహత్యకు చేసుకోవలన్న ఆలోచనలు మాటిమాటికీ వస్తుంటాయి. దీని నుంచి బయటపడటం ఎలా? - మీ ఇతర కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, తెలిసినవారు, మీ శ్రేయోభిలాషులు అనుకున్నవారితో భౌతికంగా కాకపోయినా... వర్చువల్‌గా (అంటే మొబైల్ లేదా ఫేస్‌టైమ్‌తో) వారితో సన్నిహితంగా ఉండండి. వారితో మీ సంతోషదాకయమైన క్షణాలను స్మరిస్తూ... ఆ ఆనందకరమైన సమయాలు మళ్లీ త్వరలోనే వస్తాయనే ఆశాభావంతో కూడిన సంభాషణలు చేయండి. - మీ దగ్గరివారు కూడా కోవిడ్‌ను ఎదుర్కోవడమో, తమకు ఆత్మీయులైనవారిని కోల్పోవడమో చేసి ఉండవచ్చు. వారు ఈ క్రైసిస్‌ను ఎలా ఎదుర్కొన్నారు అనే లాంటి అంశాలను మాట్లాడుతూ... మీరూ ఆ మాటలతో మోటివేట్ అయ్యేలా మీ సంభాషణలు ఉండాలి. వారి నుంచి మీరు స్ఫూర్తి పొందేలాంటి సంభాషణలే వినండి. వారి ధైర్యసాహసాలను మెచ్చుకోండి. వాటిని మీరు మీలోనూ నింపుకోండి. - మీకు ఇష్టమైనవారి ధైర్యసాహసాలను, వారు వారి క్రైసిస్ నుంచి బయటపడ్డ తీరును, వారి మంచి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచండి. దాంతో ఇతరులూ స్ఫూర్తి పొందుతారు. ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఉంచినప్పుడు ఇతరులు వాటిని లైక్ చేస్తే... మీరు వాటిని మళ్లీ మళ్లీ చదువుతున్నప్పుడు మీరూ ఉత్తేజితులవుతారు. ∙ - మీ అనుభవాలను ఉత్తరాలుగా రాసుకోండి. వాటిని మీరు మళ్లీ చదువుకోండి లేదా ఇష్టమైనవారికి పంపండి లేదా మీరే చించివేయండి. - మీకు ఇష్టమైన హాబీలలో నిమగ్నం కావాలి. గతంలో మీరు ప్రదర్శించిన నైపుణ్యాలను మళ్లీ వెలికి తీయాలి. అంటే పెయిటింగ్, డాన్స్ వంటి వాటిలో నిమగ్నమవుతూ... వాటిని ఆస్వాదిస్తూ ఉండాలి. మీరు బాగా ప్రదర్శించిన వాటికి మీకు మీరే బహుమతులు ఇచ్చుకుంటూ మిమ్మల్ని మీరు మోటివేవ్ చేసుకోవడమూ అవసరం. - గతంలో మీరు ప్రదర్శించిన ధైర్యసాహసాలు మాటిమాటికీ తలచుకోవాలి. ‘అప్పుడు వాటిని చేసింది కూడా నేను కదా. మరలాంటప్పుడు నేను ఇప్పుడూ అవే ధైర్యసాహసాలను ప్రదర్శించగలను కదా’ అంటూ ధైర్యం చెప్పుకోవాలి. ∙ఆటలూ, క్రీడలూ వంటివి క్రీడా స్ఫూర్తి పెంచుతూ... ఓటమిని తేలిగ్గా తీసుకునే అడ్జస్ట్మెంట్ బిహేవియర్‌ను వేగవంతం చేయడమే కాకుండా... కొత్త పరిస్థితులకు తేలిగ్గా సర్దుకుపోయే గుణాన్ని పెంపొందిస్తాయి. డిప్రెషన్ నుంచి వేగంగా బయటపడేస్తాయి. - ఇంట్లోనే వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల మెదడులో ఎండార్ఫిన్స్ వంటి సంతోషకరమైన రసాయనాలు వెలువడుతాయి. అవి ఆనందాన్ని పెంచి డిప్రెషన్‌ను అధిగమించేందుకూ తోడ్పడతాయి. ఇవి కూడా చేయండి: రోజూ అన్ని పోషకాలు ఉండే సమతులాహారం, మంచి పౌష్టికాహారం తీసుకోండి. ∙టీవీలో మీకు విపరీతమైన ఆందోళన కలిగించే వార్తలను చూడకండి, వినకండి. ∙మీకు చాలా ఇష్టమైనవారితోనే సమయం గడపండి. ∙ఆహ్లాదకరమైన సంగీతం/పాటలు వినండి. - ఇంట్లోనే మీకు ఇష్టమైన సినిమాలు చూడండి. ముఖ్యంగా హాస్యచిత్రాలు. - బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడంతో పాటు... యోగా, ప్రాణాయామ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. - ఈ పరిస్థితేమీ ప్రమాదకరం కాదంటూ మీకు మీరు ధైర్యం చెప్పుకుంటూ ఉండండి. ఒకవేళ అది సాధ్యపడకపోతే... టెలిఫోన్లోనే మీ కుటుంబ డాక్టర్‌తో లేదా సైకియాట్రిస్ట్‌తో మాట్లాడి, ప్రొఫెషనల్స్ సలహా తీసుకోండి. అలాంటివారిలోనూ మీ పట్ల సహానుభూతితో ఉండేవారినే ఎంచుకుని వారిని సంప్రదించండి. సెకండ్‌వేవ్‌లో కనిపిస్తున్న ప్రధాన మానసిక సమస్య... అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్ మొదటివేవ్‌తో పోలిస్తే ఈసారి సెకండ్ వేవ్‌లో... కుటుంబ సభ్యులూ, తమకు కావాల్సిన సన్నిహితులు, ఆత్మీయులు మరణించడంతో... చాలామంది ఇప్పుడు ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’ మానసిక సమస్యతో బాధపడుతుండటాన్ని చాలామంది సైకియాట్రిస్టులు చూస్తున్నారు. ఈ సమస్య తాలూకు కొన్ని కేస్ స్టడీలు కేస్ స్టడీ 1 : డెబ్బయి ఏళ్ల పెద్దవయసు దంపతులు సొంతకూతుర్ని పోగొట్టుకున్నారు. యూఎస్‌లో ఉండే వారి కుమారుడు ఇక్కడికి వచ్చేసి వాళ్లకు చికిత్స అందిస్తున్నాడు. అతడు తన ఉద్యోగం కోసం యూఎస్‌కు వెళ్లే పరిస్థితి లేదు. కేస్ స్టడీ 2 : మంచి ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్న ఓ యువకుడు ఇటీవల కరోనాతో మరణించాడు. దాంతో 58 ఏళ్ల వయసున్న అతడి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. వీళ్లంతా‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’ గురైనట్లు తేలింది. -
కీలక విషయాలు వెల్లడించిన సుశాంత్ సోదరి
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. బిహార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సుశాంత్ డిప్రెషన్ గురించి తమకు తెలియదంటూ అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. కానీ సుశాంత్ సోదరికి, మాజీ మెనేజర్‌కి మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌తో ఇది అబద్దమని రుజువయ్యింది. ఈ క్రమంలో సుశాంత్ సోదరి మీతు సింగ్ ముంబై పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. సుశాంత్ సింగ్ లోగా ఫీలయ్యేవాడని.. ఈ క్రమంలో 2013లోనే తను సైక్రియాటిస్ట్‌ని కలిశాడని తెలిపారు. మీతు సింగ్, సుశాంత్ చనిపోవడానికి రెండు రోజుల ముందు వరకు తనతోనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘2019, అక్టోబర్‌లో సుశాంత్ తను చాలా లోగా ఫీలవుతున్నట్లు మాతో చెప్పాడు. దాంతో నాతో పాటు మా సోదరి నీతు సింగ్, ప్రియాంక ముంబై వచ్చి తనను కలిశాము. కొద్ది రోజుల పాటు తన ప్లాట్లోనే ఉన్నాం. తనను ఓదార్చం. కెరియర్లో అప్ అండ్ డౌన్స్ వల్ల తను అలా ఫీలవుతున్నట్లు మాతో చెప్పాడు’ అని తెలిపారు మీతు. (చదవండి: 2019లోనే సుశాంత్ సోదరికి తెలుసా?) ఆమె మాట్లాడుతూ.. ‘దాంతో నా సోదరి నీతు, సుశాంత్‌ని ఆమెతో పాటు ఢిల్లీ రమ్మంది. కానీ తను కొద్ది రోజుల తర్వాత వస్తా అన్నాడు. 2019 నవంబర్ నుంచి సుశాంత్ హిందూజ ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ కెర్సీ చౌడా వద్ద ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ ఏడాది మార్చిలో లాక్డౌన్ విధించడంతో ఇంట్లోనే ఉంటూ పుస్తకాలు చదవడం, ఎక్సర్సైజ్, మెడిటేషన్, యోగా చేస్తూ ఉన్నాడు’ అన్నారు. ఇక జూన్ 5న మీతు సింగ్ మరోసారి తన సోదరుడిని కలిసింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ‘నేను ముంబై వచ్చినప్పుడు నా సోదరుడు డల్‌గా ఉన్నట్లు అనిపించింది. ఏమైంది అని అడిగాను. లాక్డౌన్ కారణంగా ఎక్కడికి వెళ్లడానికి లేదు. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అని చెప్పాడు. నన్ను కొద్ది రోజుల పాటు తనతోనే ఉండమన్నాడు. దాంతో నేను ఇక్కడే ఉండి తన కోసం వంట చేస్తూ.. కబుర్లు చెబుతూ గడిపాను. లాక్డౌన్ తర్వాత సౌత్ ఇండియా టూర్ వెళ్దామన్నాడు అని తెలిపారు మీతు సింగ్. (చదవండి: ఈ మందులు వాడు: సుశాంత్ సోదరి) ఆమె మాట్లాడుతూ.. ‘అయితే జూన్ 12న నేను మా ఇంటికి వెళ్లాను. అక్కడ నా కుమార్తె ఒంటరిగా ఉంది. దాంతో వెళ్లాల్సి వచ్చింది. నేను వెళ్లాక తనకు కాల్ చేశాను. మెసేజ్ చేశాను రిప్లై లేదు. తను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మాకు అర్థం కావడం లేదు’ అన్నారు. ఇక మరో సోదరి ప్రియాంక కూడా ఇదే విషయలను వెల్లడించారు. తల్లి చనిపోయిన దగ్గర నుంచి సుశాంత్ చాలా విచారంగా ఉండేవాడని నీతు సింగ్ తెలిపారు. -
మనో బలం మన సొంతం
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ పూర్తిస్థాయిలో ఎత్తేసిన తరువాతే ఎందరిపై ఏయే రూపాల్లో మానసిక ఒత్తిళ్లు పనిచేశాయి?, ఏ మేరకు వారిపై ప్రస్తుత పరిస్థితుల ప్రభావం పడిందనే దానిపై స్పష్టత వస్తుందని సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎంఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు, ఆయా అంశాలపై వివిధ వర్గాల వారు స్పందిస్తున్న తీరు, చూపుతున్న ధైర్యం వంటివి పరిశీలిస్తే ప్రజలపై పెద్దగా మానసిక రుగ్మతల ప్రభావం లేనట్టేనని అభిప్రాయపడ్డారు. చిన్నచిన్న మానసిక సమస్యలు ఎదురైనా కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు సాధారణ చికిత్స అందిస్తే సరిపోతుందని చెప్పారు. ఇంకా లాక్డౌన్ సమయంలో తలెత్తే మానసిక, ఇతర సమస్యలపై ‘సాక్షి’తో డాక్టర్ ఎంఎస్‌రెడ్డి పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే... పేదలపైనే ఎక్కువ ప్రభావం లాక్డౌన్ సమయంలో మానసిక సమస్యల తీరు రకరకాలుగా ఉండొచ్చు. సైకోసిస్, స్కిజోఫోనియా, బైపోలార్ డిజార్డర్స్ వంటివి పెరగకపోవచ్చు. అడ్జస్ట్మెంట్, యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి సాధారణ జబ్బులు పెరగొచ్చు. స్థితిమంతులు, ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి వారిపై కరోనా అనంతరం ఆర్థిక పరిస్థితుల ప్రభావం పెద్దగా పడకున్నా, కిందివర్గాలు, నిరుపేదలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. కరోనా మహమ్మారి ప్రపంచం ముందుకు సరికొత్త రూపంలో రావడంతో దానినెలా ఎదుర్కోవాలో తెలియక, కేవలం అంచనాలు, ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్‌తో ముందుకెళ్లాల్సిందే. మానసిక ప్రశాంతతే మందు సాధారణంగా ఆహారం, ఆశ్రయం, ఉపాధివంటి వాటితో ముడిపడిన అంశాలకు సంబంధించి సమస్యలు ఏర్పడితే అయోమయం, గందరగోళం వంటివి కలుగుతాయి. ఇప్పటివరకు వీటి విషయంలో ఎలాంటి సమస్యల్లేకుండా ఉండి, లాక్డౌన్ వేళ కొత్తగా తలెత్తిన పరిస్థితుల ప్రభావం పడితే ఆదుర్దా చెందడంతో పాటు భవిష్యత్‌పై అనుమానాలు, సందేహాలు నెలకొంటాయి. ఇటువంటి సంక్షోభ సమయంలోనే విచారం, ఒత్తిడి, భయం, కోపం వంటివి కలుగుతుంటాయి. అయితే మానసిక ప్రశాంతతను సాధిస్తూ ఒత్తిళ్లు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు ఆప్తులైన వారితో భావాలు పంచుకుంటూ రోజువారీ జీవితం ఆహ్లాదంగా గడిపేలా చూసుకోవాలి. ‘జాగ్రత్త’మంచిదే! కొంచెం ఒంట్లో నలతగా ఉన్నా, దగ్గు, జలుబు వచ్చినా.. అవి కరోనా లక్షణాలేమోనని సందేహించే పరిస్థితి.. కరోనాకు చికిత్సలేదని, మందులు, వ్యాక్సిన్లు లేవనే భయంతో పాటు తమకు పాజిటివ్ వచ్చి, 28రోజుల హాస్పిటల్ క్వారంటైన్‌కు పంపిస్తే ఎలా అనే ఆందోళన, ఆదుర్దా ఏర్పడటం సహజమే. అతి శుభ్రతతో పాటు అన్నింట్లో అతి జాగ్రత్తలు తీసుకునే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) లక్షణాలున్న వారు ఇటువంటి పరిస్థితుల్లో మరింత అతిగా స్పందించే అవకాశాలున్నాయి. అయితే వీరితో పాటు ఇతరులు కూడా పదేపదే చేతులు కడుక్కుంటూ శుభ్రత పాటించడం, ఆరోగ్యపరంగా, ఇతరత్రా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచి పరిణామమే. ఆర్థికంగా ప్రభావం ఎక్కువే.. ప్రస్తుత పరిస్థితుల ప్రభావం ఆర్థికరంగంపై ఎక్కువగా ఉండొచ్చు. స్వస్థలాలకెళ్లిన వలస కార్మికులు తిరిగి రావడానికి కొంతకాలం పడుతుంది. ఈ ప్రభావం నిర్మాణరంగం, దాని అనుబంధ రంగాలపై ఉంటుంది. ఆటోమొబైల్, ఎంటర్టైన్మెంట్ రంగాలూ తీవ్రంగా ప్రభావితమవుతాయి. చైనా నుంచి వివిధ రంగాలకు చెందిన కంపెనీల పెట్టుబడులను, ఉత్పత్తి కేంద్రాలను భారత్‌కు రప్పించడంలో సఫలమైతే కరోనా అనంతర పరిణామాలను కొంతమేరకైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఆ సత్తా మనకుంది.. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులతో సహా దేశమంతా ఒక్కటిగా నిలిచి లాక్‌డౌన్‌ను విజయవంతంగా పాటించి ఇతర దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే మానసిక స్థైర్యం, ధైర్యం, పట్టుదల భారత్‌కు, ప్రజలకు ఉన్నాయని ఇది చాటుతోంది. ఇంట్లో సర్దుబాటు సమస్యలు ఈ సమయంలో అందరూ ఇళ్లలోనే ఉండటంతో సర్దుబాటు సమస్యలు ఏర్పడుతున్నాయి. భార్యాభర్తల్లో కోపం, చికాకుతో పాటు నిర్లిప్తత వంటివి ఏర్పడడంతో ఇళ్లలో గొడవలకు ఆస్కారం కలుగుతోంది. పుస్తకాలు చదవడం, సంగీతం, నాట్యం వంటి ఇతర అభిరుచులు, వ్యాపకాలు లేని వారు, స్నేహితులు అంతగా లేని వారిలో ఈ సమస్యలు ఎక్కువ. అలాగే, లాక్డౌన్లో మద్యపాన సేవనం పెరిగింది. సిగరెట్లు, గుట్కాలు అలవాటున్న వారు వాటిని తీసుకోవడం మరింత ఎక్కువైనట్టు తెలుస్తోంది. ఇటువంటి వారు ప్రయోజనకర వ్యాపకాలను కల్పించుకోవడం ద్వారా వ్యసనాల నుంచి బయటపడవచ్చు. -
కోలుకున్న కోవిడ్ విజేతా... వెల్కమ్ బ్యాక్
స్వాగతం అందరూ చెబుతారు. పున:స్వాగతం చెప్పడమే అసలైన గొప్పతనం. అంటువ్యాధికి తనామనా భేదం లేదు. మన తప్పు లేకపోయినా అది బాధిస్తుంది. కోవిడ్ నుంచి కోలుకున్నవారు విజేతలు. వారి పట్ల ఆదరంగా ఉండాలి మనం. పలకరించి ధైర్యం చెప్పాలి మనం. భౌతిక దూరమే తప్ప మానసిక దూరం లేదని చెప్పాలి మనం. అందుకే ఇప్పుడు అవసరమైన మాట... ‘వెల్కమ్ బ్యాక్’. రాత్రి పదిన్నర అయి ఉంటుంది. సైకియాట్రిస్ట్ సెల్ మోగింది. ఆ టైమ్‌లో పేషెంట్స్ సాధారణంగా ఫోన్ చేయరు.. ఎంతో అవసరమైతే తప్ప. ‘హలో’అన్నాడు సైకియాట్రిస్ట్. అవతలి వైపు నుంచి మెల్లగా ఏడుపు వినిపిస్తూ ఉంది. ఇలా కొంతమంది స్త్రీలు వొత్తిడి తట్టుకోలేక ఫోన్ చేసి ఏడుస్తుంటారు. ఇక్కడ ఏడుస్తున్నది స్త్రీ కాదు. పురుషుడు. ‘ఎవరు?’ అన్నాడు సైకియాట్రిస్ట్. అవతలివైపు నుంచి కొద్దిగా గొంతు పెగిలించుకునే ప్రయత్నం. ‘డాక్టర్... నా జీవితం ఎప్పటికైనా బాగుపడుతుందంటారా?’ ప్రశ్న చిన్నదే. దాని వెనుక ఉన్న సమస్య చాలా పెద్దది. శరత్ కుమార్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. 45 ఏళ్లుంటాయి. కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉన్నాడు. ఆఫీస్ పని మీద అమెరికా వెళ్లి వస్తుంటాడు. జనవరిలో అలాగే పని మీద వెళ్లాడు. మార్చి 16న అమెరికా నుంచి తిరిగి వచ్చాడు. అప్పటికే కోవిడ్ గురించిన పరీక్షలు, నివారణ చర్యలు మొదలై ఉన్నాయి. ఎయిర్‌పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ సమయానికి శరత్ కుమార్లో ఎటువంటి లక్షణాలు లేవు. అధికారులు హోమ్ క్వారంటైన్ నిబంధన పెట్టి ఇంటికి పంపించారు. మాదాపూర్‌లో ఉన్న ఫ్లాట్‌లో శరత్ కుమార్ తన గదిలో ఉండిపోయాడు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు బి.టెక్ సెకండ్ ఇయర్... కూతురు సీనియర్ ఇంటర్. ముగ్గురూ శరత్ కుమార్ హోమ్ క్వారంటైన్ శ్రద్ధగా జరిగే జాగ్రత్తలు తీసుకున్నారు. శరత్ తన గదిలో ఉంటూ ఫ్రెండ్స్‌తో ఫోన్లు మాట్లాడటం, ఫేస్బుక్లో యాక్టివ్‌గా ఉండటం, వాట్సాప్ చాటింగ్... ఇలా కాలక్షేపం చేస్తున్నాడు. అయితే సరిగ్గా పదోరోజుకు శరత్ కుమార్ ఆరోగ్యం పాడైంది. కోవిడ్ లక్షణాలు కనిపించసాగాయి. అతను అలెర్ట్ అయ్యాడు. కుటుంబం కూడా అలెర్ట్ అయ్యింది. హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. రక్షణ దుస్తులు ధరించిన వైద్య సిబ్బంది వచ్చి శరత్ కుమార్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వారుంటున్నది గేటెడ్ కమ్యూనిటీ. లాక్డౌన్ కారణంగా ఇదంతా అందరి దృష్టిలో పడింది. అందరిలోనూ సహజమైన ఆందోళన కనిపించింది. అంతకన్నా ఆందోళన శరత్ కుమార్ కుటుంబం పడింది. కాని శరత్ మాత్రం తాను ఈ వైరస్‌ను జయించి తిరిగి వస్తానన్నంత ధైర్యంగా అంబులెన్స్‌లో వెళ్లాడు. ∙∙ శరత్ కుమార్‌కు కోవిడ్ 19 పాజిటివ్ వచ్చింది. అతని కుటుంబానికి అదృష్టవశాత్తు నెగెటివ్ వచ్చింది. శరత్ కుమార్‌కు పెద్ద శారీరక సమస్యలు లేవు. రోజూ వాకింగ్, కొద్దిపాటి వ్యాయామాలు చేసే అలవాటు, మంచి ఆహార అలవాట్లు ఉండటం వల్ల కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని ఏప్రిల్ రెండోవారంలో డిశ్చార్జ్ అయ్యాడు. డిశ్చార్జ్ చేసే ముందు రెండుసార్లు పరీక్షలు చేస్తే రెండుసార్లు నెగెటివ్ వచ్చినందున వైద్యులు నిస్సందేహంగా ఇంటికి పంపారు. శరత్ చాలా సంతోషపడ్డాడు. కుటుంబం ఆనందానికి అవధులు లేవు. కాని తక్కిన ప్రపంచమంతా మారిపోయింది. సమస్య వారి నుంచే ఎదురైంది. ∙∙ మొదట ఫ్లాట్స్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్‌లో ఒక చిత్రమైన మౌనం కనిపించింది. శరత్ సభ్యుడిగా ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో కూడా అందరూ పలకరించడం మానేశారు. ఫోన్లు చేస్తే ఎత్తడం లేదు. మెసేజ్‌లకు బదులు లేదు. కరోనా భయంకరమైనదే. దాని నుంచి సురక్షితమైన జాగ్రత్తలు తీసుకోవలసిందే. అయితే అంతమాత్రాన దాని బారిన పడి బాధితుడిగా మారిన వ్యక్తిని తమ ప్రవర్తనతో మరింత బాధించడం అవసరమా? శరత్ కుమార్ భార్యతో గాని పిల్లలతో గాని ఎవరూ మాట్లాడటం లేదు. అసలు వారు ఫ్లాట్ తలుపు తెరిస్తే తప్పుగా చూస్తున్నారు. శరత్ భార్య కూరగాయల కోసం కిందకు దిగితే సూటిపోటి మాటలు అని, అలాంటివి సెక్యూరిటీకి చెబితే తలుపు ముందుకు తెచ్చి పెడతామని, బయటకు రావద్దని ఫ్లాట్స్ అసోసియేషన్ సెక్రటరీ చెప్పాడు. కరోనా నుంచి కోలుకున్నందుకు సంతోషపడాలో ఈ సాంఘిక బహిష్కరణకు బాధపడాలో తెలియని స్థితికి శరత్ కుటుంబం చేరుకుంది. ఆ వొత్తిడితోనే శరత్ సైకియాట్రిస్ట్‌కు కాల్ చేసి దుఃఖాన్ని పంచుకున్నాడు. ∙∙ శరత్ కుమార్ భార్యతో గాని పిల్లలతో గాని ఎవరూ మాట్లాడటం లేదు. అసలు వారు ఫ్లాట్ తలుపు తెరిస్తే తప్పుగా చూస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నందుకు సంతోషపడాలో ఈ సాంఘిక బహిష్కరణకు బాధపడాలో తెలియని స్థితికి శరత్ కుటుంబం చేరుకుంది. ‘చూడండి... ఇందులో మీ తప్పు లేదు. మీ పట్ల దూరం పాటిస్తున్న మీ ఇరుగుపొరుగు వారి తప్పు కూడా వాస్తవంగా చెప్పాలంటే లేదు. ప్రపంచమంతా ప్రతి చిన్నదాన్ని సందేహంగా చూస్తున్న సమయం ఇది. మృత్యువులో కూడా మర్యాద పాటించకుండా నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా ప్రవర్తిస్తున్న రోజులు ఇవి. కాని ఇవి మారుతాయి. మెల్లమెల్లగా అవగాహన పెంచుకుంటారు. కరోనాను ఎదుర్కొనడానికి దానిని జయించి వచ్చిన మీలాంటి వారు స్ఫూర్తి అని మెల్లగా గుర్తిస్తారు. ఎవరితోనైనా ఉండాల్సింది భౌతిక దూరమే... మానసిక దూరం కాదు. మిమ్మల్ని ఫోన్ ద్వారా పలకరించడం వల్ల, మీతో చాట్ చేయడం వల్ల, మీరు మీ ఫ్లాట్ తలుపులు తీయడం వల్ల, మీ వైఫ్ వెళ్లి కూరగాయలు కొనడం వల్ల ఏ ప్రమాదం లేదని అర్థం చేసుకుంటారు. ఇందుకు మీరు కరోనా మీద పోరాట సమయం కంటే అవసరమైన నిబ్బరం చూపించాలి. మీ కుటుంబం అంతా ఒక యూనిట్‌గా ఉండాలి. పరిచితులు మీతో మాట్లాడకపోతే మావంటి డాక్టర్లతో మాట్లాడండి. ధైర్యం పుంజుకోండి. అంతా సర్దుకుంటుంది.. ఓపిక పట్టండి’ అన్నాడు సైకియాట్రిస్ట్, శరత్ కుమార్‌తో ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో. ∙∙ వారం రోజులు గడిచాయి. బాల్కనీలో ఉత్సాహంగా ఆరోగ్యంగా కనిపిస్తున్న శరత్ కుమార్‌ను అందరూ గమనించారు. కుటుంబం కూడా నార్మల్‌గా ఉంటూ కబుర్లు చెప్పుకుంటూ బాల్కనీలో కూచుని కాఫీలు తాగడం కూడా గమనించారు. అది సవాళ్లను ఎదుర్కొని బయటపడిన ఆరోగ్యవంతమైన కుటుంబం. అందుకే ఫ్లాట్స్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్‌లో ఒక పెద్ద వయసు ఆత్మీయుడు ఎవరేమనుకుంటే తనకేంటని ‘వెల్కమ్ బ్యాక్ శరత్ కుమార్’ అని మెసేజ్ పోస్ట్ చేశాడు. మార్పు మెల్లగా మొదలయ్యిందని శరత్ కుమార్‌కు అర్థమైంది. ఆ సాయంత్రం అతడు మరింత ఉత్సాహంగా బాల్కనీలో భార్యతో కబుర్లు చెబుతూ కనిపించాడు. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
రక్షిత్ టెన్త్ అట కదా.. ఇప్పుడేం చేయాలి!
‘మీ అబ్బాయి టెన్త్ అట కదా’... ‘బాగా చదువుతున్నాడా?’... ‘పరీక్షలు బాగా రాసి మీ అమ్మా నాన్నలకు పేరు తేవాలోయ్’... ‘ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి బాబు’... ‘మీ అమ్మా నాన్నల ఆశలన్నీ నీ మీదే’...ఫైనల్ పరీక్షలనే సరికి పలకరింపులతోనే పిల్లలకు సగం స్ట్రెస్ పెంచుతారు చుట్టుపక్కలవాళ్లు. తల్లిదండ్రుల ఆరాటం సరేసరి. పిల్లాడు పరీక్షకే వెళుతున్నది... యుద్ధానికి కాదు. తమ శక్తి మేరకు, సామర్థ్యం మేరకు, సౌకర్యం మేరకు పిల్లలు పరీక్షలు రాసేలా ఉత్సాహపరచాలి తప్ప బెంబేలెత్తించి కాదు. పాల్గొనడానికి నిరాకరించే స్థాయిలో వత్తిడి తేకుండా జాగ్రత్త పడమని చెప్పేదే నేటి కథనం. రక్షిత్ సరిగ్గా చదవడం లేదు. పరీక్షలు గట్టిగా నెల రోజులు ఉన్నాయి. ముందు బాగానే ఉండేవాడు. రోజూ పుస్తకాలు తెరిచేవాడు. ఇప్పుడు చిత్రంగా మారిపోయాడు. స్కూల్లో సిలబస్ అయిపోయిందని ఒకరోజు వెళుతున్నాడు ఒకరోజు వెళ్లడం లేదు. లేట్‌గా నిద్ర లేస్తున్నాడు. పుస్తకం పట్టుకున్నా టీవీ చూస్తున్నాడు. ‘చదువుకో నాన్నా.. అసలే టెన్త్ క్లాస్’ అని తల్లి అంటే ‘నాకు తెలుసులే’ అని కసురుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకు. టెన్త్ మంచి మార్కులతో పాస్ అయితే మంచి కాలేజీలో చేర్పించడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు. కాని రక్షిత్ వాలకం మాత్రం వేరేగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి?. ........................ రక్షిత్ చిన్నప్పటి నుంచి యావరేజ్ స్టూడెంట్. తల్లిదండ్రులకు ఒకే పిల్లాడు కాబట్టి సహజంగానే ఇష్టం, ప్రేమ ఎక్కువ. వాడు బాగా చదవాలని కోరిక కూడా ఉంది. మంచి స్కూల్లో చేర్పించారు. అడిగినవన్నీ ఇప్పించారు. బాగా చదవాలని పదే పదే చెప్పారు. కాని పరీక్షలు వచ్చేసరికి వాడు బాగా కంగారు పడుతుంటాడు. ‘ఇప్పుడు తక్కువ మార్కులు వస్తే ఏం చేస్తారు?’ అడుగుతాడు. ‘ఏం చేస్తామురా. ఈసారి బాగా రాయి అంటాము’ అంటుంది తల్లి. ‘మళ్లీ తక్కువొస్తే?’ ‘ఎందుకొస్తాయి?’ ‘వస్తే..?’ ‘రాకూడదు. మంచి మార్కులు రావాలి’‘అదిగో... నాకు తెలుసు నువ్వు ఇలాగే అంటావని’. మంచి మార్కుల కోసం ఎక్కువ చదువుతాడు నిజమే కాని మంచి మార్కుల ఆరాటంలో పాఠాలు అర్థం చేసుకోడు. అర్థం చేసుకొని గుర్తు పెట్టుకోడు. రుబ్బి రుబ్బి చదివి మర్చిపోతాడు. లేదా వొత్తిడి వల్ల అసలు సమయానికి రాయలేకపోతాడు. చివరకు అత్తెసరు మార్కులు వస్తాయి. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది... ఈ క్లాసులన్నీ ఇలాగే జరిగాయి. కాని ఇప్పుడు పది వచ్చింది. ∙∙ పదికి వచ్చినప్పటి నుంచి ఇరుగు పొరుగువారు, బంధువుల హెచ్చరిక జెండాలు ఎగరడం ఎక్కువైంది. ‘ఏమ్మా... మీ రక్షిత్ గాడిలో పడ్డాడా. ఏరా.. రక్షిత్ బాగా చదువుతున్నావా’ అని ఒకరు... ‘మా పిల్లవాడు చూడు ఎంతమంచి మార్కులు తెచ్చుకుంటున్నాడో... నువ్వూ వాడి తమ్ముడి వరసే కదరా.. నీకెందుకు రావు’ అని ఒకరు ‘ఈ సంవత్సరం మీరు ఎలా చేస్తారో ఏమిటో’ అని వేరొకరు ఒకటే దాడి. తల్లిదండ్రులు ఆ మాటలు విని తమ మాటలు పెంచారు. ‘ఒరే.. ఇంకొకణ్ణి కంటే నిన్ను సరిగ్గా చూసుకోలేమని కనలేదు. నువ్వే మా ఆశవు. మన బంధువుల్లో అందరూ బాగా చదువుతున్నారు. నువ్వు తప్ప. టెన్త్ బాగా చదవాలి’ అని. ఇవన్నీ విని రక్షిత్ చదువుతున్నట్టే కనిపించాడు. కాని సడన్‌గా మారిపోయాడు. స్కూల్‌కు వెళ్లకపోవడం, చదవకపోవడం, టీవీ చూడటం... తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు. సైకియాట్రిస్ట్ దగ్గరకు కౌన్సిలింగ్ కోసం తీసుకెళ్లారు ..................... ‘డాక్టర్.. ఇదీ పరిస్థితి. అసలు ఎగ్జామ్స్ రాయడానికి వెళతాడో లేడో అన్నంత భయంగా ఉంది’ అంది తల్లి రక్షిత్‌ని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొచ్చి. సైకియాట్రిస్ట్ ఆమెను బయటకు పంపించి రక్షిత్‌తో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కాని రక్షిత్ సహకరించలేదు. ‘రక్షిత్.. చూడు.. నేను ఇక్కడ ఉన్నది నీ మనిషిగా. నీకు హెల్ప్ చేయడానికి ఉన్నాడు. మీ అమ్మా నాన్నల మాటలు విని నిన్ను తప్పు పట్టను. నీ మాటలు విని నీ బాధ అర్థం చేసుకుంటాను’ అని ఊరడింపుగా అడిగేసరికి రక్షిత్ చాలా సేపు ఏడ్చాడు. తర్వాత చెప్పాడు... ‘అంకుల్.. నాకు పరీక్షలంటే భయం లేదు కానీ మంచి మార్కులు రాకపోతే అమ్మా నాన్నలు బాధ పడతారని టెన్షన్ పడతాను. ఎంత చదివినా చదివింది మర్చిపోతానేమోనన్న టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు అమ్మానాన్నలతో పాటు మా బంధువులకు, ఫ్రెండ్స్‌కు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. నేను బాగా చదివినా సరిగ్గా రాయలేక ఫెయిల్ అయితే అందరూ మా అమ్మానాన్నలనే అంటారు... వాళ్లు నన్ను సరిగ్గా పెంచలేదని. అందుకని నేను అందరి ముందు సరిగ్గా చదవకుండా నా తప్పు వల్లే ఫెయిల్ అయ్యాను అనిపించుకుంటే నన్ను తిడతారు తప్ప వారిని ఏం అనరు కదా. అందుకని నేను చదవడం లేదు’ అన్నాడు. సైకియాట్రిస్ట్‌కు అంతా అర్థమైంది.. ‘రక్షిత్ ఏ స్టూడెంట్ అయినా మూడు చీౖచీ లను పట్టించుకోకూడదు. othersలోని ఓ.. Openionsలోని ఓ.. Outcomeలోని ఓ. నీ ఇరుగుపొరుగు వాళ్లని, వాళ్ల అభిప్రాయాలని పట్టించుకోకు. వాళ్లు నీకేం అన్నం పెట్టరు. ఫీజు కట్టరు. మీ అమ్మా నాన్నలు ఆశిస్తున్న అవుట్కమ్ని కూడా పట్టించుకోకు. అది నీ చేతుల్లో లేదు. నీ చేతుల్లో ఉన్నదల్లా నువ్వు ఎంత కష్టపడగలవో అంత కష్టపడటం. ఇక మర్చిపోవడం గురించి. ఏదో ధ్యాస లో తల ఒంచుకుని ఒక దారిలో వెళితే మళ్లీ ఆ దారిని గుర్తు పట్టగలవా? లేవు. అదే బాగా గమనిస్తూ ఒకటికి నాలుగు సార్లు ఆ దారిలో తిరిగితే ఎప్పటికీ మర్చిపోవు. శ్రద్ధ పెట్టి నీ పాఠాలు ఒకటికి నాలుగుసార్లు చదివితే ఎందుకు మర్చిపోతావు. మర్చిపోతావేమో అని మైండ్ భయపెడుతూ మరింత బాగా చదివిస్తుంటుంది. ఇది అందరికీ ఉండే భయమే. నువ్వు ఫర్ఫెక్ట్గా ఉన్నావు. పరీక్షలు బాగా రాయి. యావరేజ్ రిజల్ట్స్ వస్తాయా, టాప్ రిజల్ట్స్ వస్తాయా నీకెందుకు? మీ మనసులో నువ్వు గిల్ట్ ఫీలవకుండా కష్టపడటమే నీకు కావలసింది. మీ అమ్మా నాన్నలకు కూడా అది అర్థమయ్యేలా చెబుతాను’ అన్నాడు సైకియాట్రిస్ట్. రక్షిత్‌కి కొంచెం ధైర్యం వచ్చింది. ‘నేను బాగా రాయగలనా?’ అని అడిగాడు. ‘కచ్చితంగా బాగా రాయగలవు. ఇంత వర్రీ అవుతున్నావంటే నీకు చాలా బాధ్యత ఉందని అర్థం. బాధ్యత ఉన్నవాడు ఎలా ఓడిపోతాడు చెప్పు’ అన్నాడు సైకియాట్రిస్ట్. ఆ తర్వాత తల్లిదండ్రులను పిలిపించి కూడా అదే చెప్పాడు. ‘మీ అబ్బాయికి మీ బరువు సరిపోతుంది. ఇరుగుపొరుగువారి బరువు కూడా ఇవ్వకండి. మీ ఇంటి మొక్క ఎంత పెరగగలదో అంత పెరగగలదు. ఊరి చెట్లతో పోటీ పెట్టకండి. మీ మొక్కను సౌకర్యంగా సంరక్షించండి చాలు’ అన్నాడు. పరీక్షలు మరో మూడు వారాల్లో ఉండగా జరిగిన ఈ కౌన్సెలింగ్ రక్షిత్‌కు లాభించింది. అతడు పరీక్షలకు మనస్ఫూర్తిగా సిద్ధం అయ్యాడు. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
భర్త కావాలి
ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకునేది తోడు కోసం. అర్థం చేసుకునే ఆత్మీయుడి కోసం. సౌకర్యంగా ఉంచే సహచరుడి కోసం. ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకునేది మంచి భర్త కోసం. అయితే ఆమె ఊహించుకున్న భర్త, నిజజీవితంలో ఉన్న భర్త వేరువేరు అయితే? ఆమె కోరుకునే భర్త ఎవరు? అమెరికా సంబంధం బాగుంటుంది. అవును. బాగుంటుంది. పెళ్లయ్యాక అమ్మాయి అక్కడ హాయిగా ఉంటుంది. హాయిగా ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్లి ఎంజాయ్ చేసి రావొచ్చు. అవును. చేసి రావొచ్చు. కాని కష్టం వస్తే? వెంటనే వెళ్లి ఓదార్చి రావడం కుదురుతుందా? కుదరదు. ఆమె కాపురంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవడం వీలవుతుందా? వీలవదు. మనం ఇక్కడ. అమ్మాయి అక్కడ. ఏం చేయాలి? అవును. ఏం చేయాలి? ‘ఈ అమ్మాయికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది’ అనుకుంది సంయుక్త తల్లి. ‘అసలు ఈ నిర్ణయం తీసుకోవాలని ఎలా అనిపించింది’ అని కంగారు పడిపోయాడు సంయుక్త తండ్రి. పెళ్లయ్యి సరిగ్గా నెల. నెల రోజులకే ఈ పెళ్లి వద్దని, ఇండియాకు వచ్చేయాలనుకుంటున్నానని సంయుక్త ఆ తల్లిదండ్రుల నెత్తి మీద పిడుగు వేసింది. ‘ఎందుకు?’ అని అడిగారు ఇద్దరూ ‘నాకు అతను నచ్చడం లేదు’ అని చెప్పింది సంయుక్త. ‘భర్తకు భార్య, భార్యకు భర్త ఒకపూటలో అరపూటలో నచ్చేయరు. మెల్లగా కాపురం గడిచేకొద్దీ ఒకరికొకరు అర్థమవుతారు. ప్రేమ పెరుగుతుంది. జీవితం బాగుంటుంది’ అని చెప్పారు ఇద్దరు. ‘రోజులు గడిచేకొద్దీ నాకు అతని మీద విరక్తి పెరుగుతోంది తప్ప ప్రేమ కలగడం లేదు’ అని చెప్పింది సంయుక్త. ‘అయితే ఏమంటావ్?’ అని అడిగారు వాళ్లు. ‘ఏమంటాను.. విడాకులు తీసుకుంటాను అంటాను’ అంది సంయుక్త. సంయుక్త తల్లిదండ్రులు హైదరాబాద్‌లో మంచిస్థితిలో ఉన్నారు. తండ్రికి వ్యాపారాలు ఉన్నాయి. సంయుక్త ఒక్కతే కూతురు. బాగా చదివించారు. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని వారనుకున్నా సంయుక్త పట్టుబట్టి ఉద్యోగం చేస్తానంటే బెంగళూరులో చేయనిచ్చారు. ఆ వెంటనే మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. ఒకే కులం. ఒకే ప్రాంతం. ఒకే ఆర్థిక నేపథ్యం. ‘బాగున్నాడు చేసుకో. ఇప్పుడు కాకపోతే మళ్లీ ముహూర్తాలు దొరికేలా లేవు’ అన్నారు తల్లిదండ్రులు. అతను అమెరికా నుంచి వచ్చాడు. నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య వారం రోజులే ఎడం దొరికింది. తొందర తొందరగానే అన్నీ ముగించాల్సి వచ్చింది. అమెరికా పెళ్లికొడుకుల పెళ్లి ‘సెలవుచీటి’ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పెళ్లికొడుకు అంతే హడావిడి చేసి సంయుక్తను తీసుకొని ఫ్లయిట్ ఎక్కాడు. ‘అమ్మయ్య’ అనుకున్నారు తల్లిదండ్రులు. ‘అంతా బాగానే చేశాం కదా ఈ అమ్మాయి ఇలా ఎందుకు చేస్తోంది’ అని బాధ పడుతున్నారు ఇప్పుడు. అంతా విన్న సైకియాట్రిస్ట్ మొదట సంయుక్త భర్తతో మాట్లాడతానని అతనికి స్కైప్ ద్వారా కాల్ చేసి మాట్లాడాడు. ‘సంయుక్త మంచిదే డాక్టర్. కాని ఎందుకో ఇన్కన్వినియన్స్ ఫీల్ అవుతోంది. నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడటం లేదు. నేను కూడా తనతో హార్ష్‌గా బిహేవ్ చేసింది లేదు. పెద్ద కొట్లాటలు కూడా లేవు. ఆమె మనసులో ఏముందో అర్థం కావడం లేదు. అలాగని సస్పీషియస్‌గా కూడా లేదు. నాకు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడంలేదు. నిశ్చితార్థం అయ్యాక పెళ్లి రోజు వరకూ రోజూ మాట్లాడుకున్నాం. అప్పుడు ప్రత్యేకంగా మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడని అంశాలేమీ కనిపించలేదు. అయితే చనువు, దగ్గరితనం ఏర్పడ్డాకే తను ఫస్ట్‌నైట్ అంది. అందువల్ల ఇండియాలో మా ఫస్ట్‌నైట్ జరగలేదు. పెద్దవాళ్లకు జరిగిందని చెప్పాం. ఇక్కడికి వచ్చాక కూడా జరగలేదు. నెల రోజులుగా నేను దూరంగానే ఉంటున్నాను’ అన్నాడతను. అతని స్టేట్మెంట్ హానెస్ట్‌గా అనిపించింది సైకియాట్రిస్ట్‌కి. ఇప్పుడు సంయుక్తతో మాట్లాడాలని అనుకున్నాడు. రెండు మూడు స్కైప్ కాల్స్ మాట్లాడాక ఓపెన్ అయ్యింది సంయుక్త. ‘డాక్టర్... ఏం చెప్పను. చిన్నప్పటి నుంచి అందరూ నన్ను బొమ్మలాగున్నావ్ బొమ్మలాగున్నావ్ అని అనేవారు. నాన్న అమ్మ కూడా బొమ్మలాగే పెంచారు. చక్కగా ఉన్న అమ్మాయి బయటకు వెళితే ఎవరో తన్నుకుపోతారన్నట్టుగా ఉండేది వాళ్ల పెంపకం. ఏమీ మాట్లాడటానికి లేదు. స్వేచ్ఛగా నచ్చింది చేయడానికి లేదు. చాలా ప్రొటెక్టివ్‌గా పెంచారు. నా బాడీలో ఒక సెన్సర్ పెట్టకపోవడం ఒక్కటే తక్కువ. నాకు ‘నో’ చెప్పడానికి కూడా మొహమాటం చెప్పేంత గారాబంలో ఉంచేశారు. ఇలా కాదని పట్టుబడి బెంగళూరుకి ఉద్యోగానికి వెళ్లాను. అదేదో సినిమాలో పెళ్లికిముందు యూరప్ ట్రిప్‌కు హీరోయిన్ను పంపినట్టు ఎలాగూ మూడు నెలలో పెళ్లి చేసేస్తాం కదా అని మనసులో పెట్టుకొని నన్ను పంపించారు. కాని ఆ మూడునెలల్లో నాకు లోకం తెలిసింది. చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. హాయిగా తిరిగాను. అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమా దోమా అనే మాటలు లేకుండా కూడా ఫ్రెండ్స్‌గా ఉండొచ్చని మాలాంటి వయసులో సరదాగా ఉండొచ్చని అనిపించేది. నాకు పరిచయమైన మా కలీగ్స్, అబ్బాయిలు చాలా బ్రాడ్ మైండెడ్‌గా ఉండేవారు. చాలా ఓపెన్‌గా ఉండేవారు. సినిమా హీరోల అట్రాక్షన్ ఒకటి. నా కాబోయే భర్త హీరోలా ఉండి సరదాగా లిబరల్గా ఉండాలనుకున్నాను. ఆ కల ఇంకా కళ్లలోనే ఉండగానే హడావిడిగా పెళ్లి చేసేశారు. ఇతను చూడటానికి బాగున్నా, మంచివాడే అయినా అచ్చు మా నాన్నలాగే ఉండటం మొదలెట్టాడు. ఇది అమెరికా.. ఇక్కడ నువ్వు అలా చేయుద్దు ఇలా చేయుద్దు... ఎక్కడికీ వెళ్లొద్దు... వీళ్లతో మాట్లాడు.. వాళ్లతో వద్దు.. ఇలాంటి బట్టలు కట్టుకో... అసలు ఇరవైనాలుగ్గంటలు ఇంట్లోనే వంట చేసుకుంటూ ఉండే మొగుడు చాటు భార్యగా ఉండాలని ఇతను కోరుకుంటున్నాడు. ఒక నాన్నతో వేగి వస్తే ఇంకో నాన్నగా ఇతను మారాడు. నాకు నచ్చడం లేదు. మా నాన్నకు ఆరోగ్యం పాడవుతుందని, అమ్మ ఏదో అయిపోతుందని మీరు చెప్పి నన్ను కాపురం చేయమంటే చేస్తాను. కాని సంతోషంగా ఉండను’ అని కుండ బద్దలు కొట్టింది సంయుక్త. ఇదంతా సంయుక్త భర్తకు చెప్పాడు సైకియాట్రిస్ట్. ‘నీకు నచ్చింది ఆమె నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఆశించు’ అని చెప్పాడు అతనికి. సంయుక్తతో మాట్లాడాడు. ‘నీకు నచ్చనిది ఫిఫ్టీ పర్సెంటే చెయ్’ అని చెప్పాడు. ‘మీరు వంద పర్సెంట్ మారక్కర్లేదు. ఫిఫ్టీ పర్సెంట్ అడ్జస్ట్ అవ్వండి’ అని ఇద్దరికీ చెప్పాడు. సంయుక్త కొంచెం కొంచెం అడ్జస్ట్ అవుతోంది. ఆమె భర్త కొంచెం కొంచెం ఆమె రెక్కలను ఎగరనిస్తున్నాడు. పెళ్లి అనేది అందమైన గూడులా ఉండాలి తప్ప పంజరంలా కాదు. అది బంగారందైనా. ఏది చేయనివ్వాలి, ఎంత చేయనివ్వాలి, ఏది మానుకోవాలి, ఎంత మానుకోవాలి ఇద్దరూ తెలుసుకుంటే చాలా ఇబ్బందులు పోయినట్టే. ప్రస్తుతం సంయుక్త, సంయుక్త భర్త ఈ ఫేజ్‌లో ఉన్నారు. కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
అలాగే అత్తయ్యా
ఇంటికి కోడలు వస్తే బాగుంటుంది. ఇంటిని చక్కదిద్దే, ఇంటికి శక్తినిచ్చే కోడలు వస్తే నిజంగా బాగుంటుంది. తప్పును తప్పు అని ఒప్పుని ఒప్పు అని, ఇష్టం ఉన్నది ఇష్టం ఉన్నది అని ఇష్టం లేనిది ఇష్టం లేదు అని చెప్పే కోడలు వస్తే బాగుంటుంది. జవ జీవాలు ఉన్న, చేవ ఉన్న కోడలు వస్తే బాగుంటుంది. వినయ విధేయతలతో పాటు ఆత్మగౌరవం ఉన్న కోడలు వస్తే బాగుంటుంది. అంతే తప్ప మర బొమ్మ వస్తే బాగుంటుందా? అలాగే అత్తయ్యా అని తలాడించే కోడలు వస్తే బాగుంటుందా? ‘జమీల్యా.. ఇదేం పేరు?’ అని అడిగాడతను పరిచయమైన కొత్తలో. కాచిన పాలరంగులో ఉన్న ముఖం మీది వెంట్రుకలను తోసుకుంటూ నవ్వి ‘ఇది మా నాన్న పెట్టిన పేరు. ఏదో రష్యన్ నవలలో హీరోయిన్ అట’ అందా అమ్మాయి. ‘ఇప్పుడు నిన్ను ఇంప్రెస్ చేయాలంటే నేను ఓల్గా నదిలో మూడు మునకలేసి రావాలా?’ నవ్వాడు. ‘గర్జించు రష్యా.. గాండ్రించు రష్యా అని శ్రీశ్రీకు మల్లే కవిత్వం చెప్పాల్సిన పని కూడా లేదులే’ మళ్లీ నవ్వింది. ‘మీ అన్న పేరు స్టాలిన్ కదూ’ ‘పేరుకే స్టాలిన్. వాడు లోకమే తెలియకుండా పెరిగి లోకమే తెలియనివ్వని సాఫ్ట్వేర్ రంగంలో పని చేయడానికని సింగపూర్ వెళ్లిపోయాడ్లే’ ‘సో.. నీ పెళ్లికి మీ అమ్మా నాన్నా ఓకే అంటే సరిపోతుందన్న మాట’ ‘నా సంగతి వొదిలిపెట్టవోయ్. నీ పెళ్లికి ఎవరు ఓకే అంటే సరిపోతుంది?’ ‘మా అమ్మ. నువ్వు ఆమె ఒక్కదాన్ని ఇంప్రెస్ చేస్తే చాలు’ ‘మొదట నువ్వు నన్ను ఇంప్రెస్ చేయి. తర్వాత ఆమెను నేను ఇంప్రెస్ చేసే సంగతి ఆలోచిస్తాను’ జమీల్యా, కృష్ణకాంత్ ప్రేమలో పడ్డారు. కృష్ణకాంత్ అద్భుతమైన కుర్రవాడు. చక్కగా ఉంటాడు. చక్కగా మాట్లాడతాడు. బ్లూకలర్ ట్రౌజర్స్‌లో ఫుల్‌హ్యాండ్స్ వైట్‌షర్ట్ ఇన్ చేశాడంటే చీల్చిన వెదురుబద్దలా తళతళా మెరుస్తాడు. ఇద్దరూ ఒకే ఆఫీస్‌లో ఉద్యోగం. ఆఫీసూ ఇల్లూ తప్ప వేరే ఏమీ తెలియని కృష్ణకాంత్‌ని జమీల్యా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ చూపించింది. ఖాదిర్ అలీబేగ్ థియేటర్ ఫెస్టివల్‌కు తీసుకెళ్లి నాటకాలు చూపించింది. లామకాన్ తీసుకెళ్లింది. ఒకటి రెండు ధర్నాలను కనీసం దూరం నుంచి చూపించింది. ఎప్పుడూ నవ్వుతూ, ధైర్యంగా, చేతనతో ఉండే జమీల్యాను చూస్తే కృష్ణకాంత్‌కు చాలా ఇష్టం. ఎప్పుడూ సహృదయంగా ఆర్ద్రంగా ఉండే కృష్ణకాంత్ అంటే జమీల్యాకు కూడా. కానీ.. కృష్ణకాంత్ ఆ రోజు చాలా డిప్రెస్డ్గా కనిపించాడు జమీల్యాకు. ‘ఏంటి సంగతి?’ అడిగింది. ‘నిన్ను కోల్పోతాననే భయం ఎక్కువైంది’ అన్నాడు. ‘ఎందుకు?’ ‘మా అమ్మ చాదస్తం మనిషి. నాన్న చనిపోయాక నా కోసమే బతికింది. ఆ వొంటరితనంలో పూజలు, పునస్కారాలు అంటూ వేరే ప్రపంచంలోకి వెళ్లిపోయింది. కోడలు కూడా అలాగే ఉండాలని అనుకుంటోంది. దైవకృప ఒక్కటే మనిషిని కాపాడుతుందని ఆమెకు నమ్మకం. నీకు ఇవన్నీ తెలియదు. ఎలా?’ జమీల్యకు కూడా భయం వేసింది. భయం కాబోయే అత్తగారి గురించి కాదు. కృష్ణకాంత్‌ను ఎక్కడ మిస్సవుతుందోనని. ‘నువ్వు నాకు కావాలి’ అంది జమీల్యా. ‘మా అమ్మను దాటితేనే నా దాకా రాగలవు జమీల్యా’ తల వొంచుకుంటూ కంట తడితో అన్నాడు కృష్ణకాంత్. మొదట జమీల్యా పేరు జయలక్ష్మిగా మార్చింది వర్థనమ్మ. ‘మా ఇంట్లో ఈ పేరుతోనే పిలుచుకుంటాం’ అని జమీల్యా అమ్మా నాన్నలకు చెప్పింది. వాళ్లు ఇబ్బందిగా చూసినా జమీల్యా తేలగొట్టేసింది. ‘అలాగే అత్తయ్యా’ అంది. కృష్ణకాంత్ ఇల్లు చాలా బాగుంది. మంచి కాలనీలో ఉంది. ఉన్నది అత్తయ్య, కృష్ణకాంత్, జమీల్యా. హాయిగా చక్కదిద్దుకోవచ్చు అనుకుంది. ‘ఉద్యోగం చేసింది చాల్లే జయ. ఆడదానికి మొగుడి ధ్యాసే ఉండాలిగానీ వేరే గోల ఎందుకు’ అంది వర్థనమ్మ. ఇది చాలా పెద్ద దెబ్బ. ‘ముందు సరే అను. మెల్లగా నచ్చచెబుదాం’ అన్నాడు కృష్ణకాంత్. ‘అలాగే అత్తయ్య’ అంది జయ. జయకు టీ అలవాటంటే వర్థనమ్మ వంక పెట్టింది. కాఫీ అలవాటు చేసుకుంది. లేటుగా లేచే అలవాటు ఉందంటే వర్థనమ్మ వంక పెట్టింది. తొందరగా లేచే అలవాటు చేసుకుంది. పంజాబీ డ్రస్సులు, షార్ట్ హెయిర్ అంటే వర్థనమ్మ వంక పెట్టింది. జడ, పూలు, చీర, బొట్టు.. కొత్త ఆహార్యం వచ్చేసింది. పుస్తకాలు చదువుతుంటే వంక పెట్టింది. వర్థనమ్మతో కలిసి మధ్యాహ్నం సీరియల్స్ చూడటం తప్పనిసరి చేసుకుంది. వారంలో రెండుసార్లు సాయంత్రాలు వర్థనమ్మ కోసం గుడికి వెళ్లడం. ఇంట్లో ఏదో ఒక వ్రతమో పూజో వర్థనమ్మ కోసం చేయడం. స్వాములారు యూ ట్యూబ్‌లో ఏమన్నారో వర్థనమ్మకు చూపించడం... ఒక పెద్ద సీసా వర్థనమ్మ అయితే ఆమె మూసబోసిన చిన్నసీసాలో తాను కుదురుకోవడం మొదలెట్టింది జయ. ‘నేను రెండు మనుషులుగా మారాను కృష్ణ. ఒకటి జయగా. రెండు జమీల్యాగా. జమీల్యా చనిపోవడం నాకు తెలుస్తూ ఉంది’ అని ఒకరోజు బాధపడింది భర్త దగ్గర. కాని ఈ ఇల్లు వీడటం, అతన్ని వీడటం ఆమెకు ఇష్టం లేదు. అవి కావాలంటే వర్థనమ్మను కావాలనుకోవాలి. అనుక్షణం ఆమెను సంతోషపెడుతూ ఉండాలి. అందుకోసం తనను తాను చంపుకుంటూ ఉండాలి. ‘ఏంటి అన్నిసార్లు చేతులు కడుగుతున్నావ్?’ అన్నాడు కృష్ణకాంత్ ఒకరోజు జయను చూస్తూ. ‘కడిగిందే కడుగుతున్నానా?’ ‘అవును’ ‘అత్తయ్యకు పరిశుభ్రత ఎక్కువ కదా. మురికి చేతులు అంటుందని’ అంది జయ. రోజులు గడిచే కొద్దీ జయ పనులు చాదస్తంగా మారాయి. దుప్పట్లు మాటిమాటికి సరి చేయడం, చెప్పులు మాటిమాటికి సర్దడం, పూజగదిలో పటాలు మాటిమాటికి తుడవడం, ఇంటిని మాటిమాటికి చిమ్మడం, రోజుకు మూడుసార్లు స్నానం చేయడం, పదే పదే దేవుడికి దండం పెట్టుకోవడం... ఆమెలో మెల్లగా నెగెటివిటి పెరిగిపోయింది... ఏ తప్పు చేసి అత్తయ్య మనసును నొప్పించి తద్వారా కృష్ణకాంత్‌ను కోల్పోతానో అనే భయంతో ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’లోకి వెళ్లిపోయింది. ‘సముద్రంలోని చేపను బకెట్లో పడేశాను’ అనుకున్నాడు కృష్ణకాంత్ ఒకరోజు. ‘ప్రాబ్లమ్ నీలో, నీ భార్యలో లేదు కృష్ణ. ముందు మీ అమ్మను తీసుకురా’ అన్నాడు సైకియాట్రిస్ట్ కృష్ణతో, జయను చూశాక. జయ కేసంతా విన్నాక ఆమెకు కొద్దిపాటి మందులు అవసరమయ్యాయి. కాని అసలు కౌన్సెలింగ్ వర్థనమ్మకే ఇవ్వాల్సి వచ్చింది. ‘చూడండమ్మా... అత్తయ్యలు కోడళ్లని మార్చుకోవాలనుకోవడం మంచిదే. కాని మీరు మాయం చేసేస్తున్నారు. మిమ్మల్ని, మీ అబ్బాయిని జయ చాలా ప్రేమిస్తూ ఉండటం వల్లే మీ ఆటలు సాగుతున్నాయి. జయ స్థానంలో మీ అమ్మాయిని ఊహించుకోండి. మీరు మీ అమ్మాయిని అత్తగారింటికి పంపాక ఆమె పేరు మార్చేసి, పద్ధతి మార్చేసి, తిండి తిప్పలు మార్చేసి, అలవాట్లు మార్చేసి, ఆఖరుకు ఉద్యోగం కూడా పీకించేస్తే మీరేం చేస్తారు. ఊరుకుంటారా? అసలు మీరు జయను కోడలిగా ఎందుకు చూస్తున్నారు? కూతురిలా చూడొచ్చు కదా. అప్పుడు ఆమె మీలో భాగం అవుతుంది. ఆమె సంతోషం మీ సంతోషం అవుతుంది. ఆమె స్వేచ్ఛ మీకు ఆనందం ఇస్తుంది. మీ అల్లుడు మీ కూతురిని ఎలా చూసుకోవాలనుకుంటాడో మీ అబ్బాయి మీ కోడలిని అలా చూడాలని అనుకోండి. ఆ అమ్మాయి నలిగిపోతోంది. ఆమెను కోడలిగా ఉండనివ్వండి. ఇంకో అత్తగారిలా కాదు’ అన్నాడు. వర్థనమ్మ మొదట తొట్రు పడింది. మెల్లగా ఆమెకు కొడుకు కోడలు పరిస్థితి అర్థమయ్యింది. ఆ మరుసటి రోజు జయ నిద్ర లేచాక వర్థనమ్మ అడిగిన మొదటి ప్రశ్న ‘టీ తాగుతావా జమీల్యా’. కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
కొట్టే మొగుడు
కొందరు కొట్టే ‘చెడ్డ’ మొగుళ్లు ఉంటారు. అన్ని దుర్లక్షణాలుండి కొట్టే చెయ్యి కూడా ఉండేవాళ్లు వీరు. మరికొందరు కొట్టే ‘మంచి’ మొగుళ్లు ఉంటారు. అన్ని మంచి లక్షణాలు ఉండి కొట్టడం ఒక్కటే చెడు లక్షణంగా ఉండేవారు వీరు. వీరు కొడతారని మూడో కంటికి తెలియదు– ఒక్క భార్యకు తప్ప. ఈ కొట్టే మొగుళ్లను ఎలా మార్చడం? ఈ హింసకు వ్యతిరేకంగా ఎలా నిలబడటం? విజయశేఖర్ లెక్చరర్. కాలేజీలో అతని క్లాస్ మిస్సయ్యే స్టూడెంట్ ఉండడు. క్లాస్ కిటకిటలాడాల్సిందే. అంత బాగా నవ్విస్తూ పాఠాలు చెబుతాడు. స్టూడెంట్స్‌ని ‘నాన్నా’ అని పిలుస్తాడు. ‘అది కాదు నాన్నా’ అని చాలా వాత్సల్యంగా వివరిస్తాడు. స్టాఫ్‌రూమ్‌లో అతనంటే అందరికీ గౌరవం. చిన్నా పెద్దా అందరినీ ‘గురువు గారూ’ అని సంబోధిస్తాడు. ఎప్పుడూ నీట్‌గా క్లీన్ షేవ్‌తో హుషారుగా ఉంటాడు. చురుగ్గా కదులుతాడు. బయటి విషయాల పట్ల కూడా చాలా అవగాహన ఉంటుంది. ‘సిఏఏ’, ‘ఎన్ఆర్సి’ లాంటి విషయాల గురించి వివరంగా మాట్లాడతాడు. పుస్తకాలు చదవడం అతని పని. అందరి చేత ‘ఎంత మంచివాడండి’ అని అనిపించుకోవడం అతనికి అలవాటైపోయింది. కాని అతనికి ఇంకో కోణం ఉంది. అది తెలిసిన భార్య ఆ విషయం గుర్తొస్తే ఒణికిపోతూ ఉంటుంది.విజయశేఖర్ పద్మను చూడటానికి వచ్చినప్పుడు ‘నాకు కట్నం అంటే అసహ్యం’ అని అన్నాడు. నిజంగా కట్నం తీసుకోలేదు. పెళ్లిలో పద్మ తరుఫువారి నుంచి చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి. తాను దగ్గరుండి సర్దుబాటు చేశాడు. హనీమూన్‌కు తనే ఢిల్లీ–ఆగ్రా ట్రిప్ ప్లాన్ చేసి సొంత ఖర్చులతో తీసుకెళ్లాడు. బంగారంలాగా చూసుకున్నాడు. హైదరాబాద్‌లో కాపురం పెట్టినప్పుడు ఫ్లాట్ బాగుండేలా జాగ్రత్త తీసుకున్నాడు. పని మనిషిని పెట్టాడు. పద్మ ఇవన్నీ చూసి చాలా సంతోషపడింది. ఎంత మంచి భర్త దొరికాడు అని అనుకుంది. రెండు మూడు నెలలు గడిచాయి. ఆ రోజు కాలేజీ నుంచి విజయ శేఖర్ వచ్చాడు. ఎప్పటి లాగే పద్మ కాఫీ తీసుకెళ్లి ఇచ్చింది. ‘ఏమిటిలా ఉంది?’ అన్నాడు విజయశేఖర్. అలా అంటున్నప్పుడు అతని ముఖం కొత్తగా అనిపించింది. ‘ఏం.. బాగలేదా?’ సౌమ్యంగా అడిగింది. విజయశేఖర్ రెప్పపాటు కాలంలో లేచి నిలబడ్డాడు. ఏం జరుగుతుందో ఊహించే లోపలే లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు. పద్మ దిమ్మెరపోయింది. బిక్కచచ్చిపోయింది. చాలా అనూహ్యమైనదేదో జరిగినట్టుగా కొయ్యబారిపోయింది. ఆమె తేరుకునేలోపలే పిడికిలి బిగించాడు. బలం కొద్దీ కొట్టాడు. ప్రాణాలు లుంగచుట్టుకుపోయాయి. అసలు ఒక మనిషి ఇంకో మనిషిని అలా కొట్టొచ్చని నమ్మలేనంతగా కొట్టి బయటకు వెళ్లిపోయాడు. పద్మ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది. జ్వరం వచ్చేసింది. ఆ రాత్రి అతడు తిరిగి ఇంటికొస్తే వొణికిపోయింది. కాని అతను చాలా మామూలుగా ఉన్నాడు. ‘సారీ’ చెప్పాడు. ‘జ్వరం వచ్చిందా?’ అని టాబ్లెట్ ఇచ్చాడు. ‘ఏం వండకులే’ అని బజారుకు వెళ్లి ఇడ్లీ తెచ్చిచ్చాడు. తినేదాకా ఊరుకోలేదు కూడా. ఇంతకు ముందు మనిషి ఈ మనిషి ఒకడే అంటే నమ్మడం కష్టం. ఆ రోజున పద్మకు అనిపించింది తన భర్తలో ఒక వేరే మనిషి ఉన్నాడని.. ఆ మనిషి తనకు శత్రువు అని. పద్మకు కొడుకు పుట్టాడు. వాడికి ఎనిమిదేళ్లు వచ్చాయి. ఈ ఎనిమిదేళ్లలో పద్మ చాలా సంతోషంగా ఉంది. చాలా భయభ్రాంతంగా కూడా ఉంది. విజయశేఖర్ ఆమెనూ కొడుకునూ చాలా బాగా చూసుకుంటాడు. వాళ్ల కోసం కానుకలు తెస్తాడు. షికార్లకు తిప్పుతాడు. కాని హటాత్తుగా ఒక రాత్రి ఆమె ‘అలా సిగరెట్లు తాగవద్దండి’ అన్నందుకు చావబాదుతాడు. ‘పూలు తెస్తే బాగుండేదండీ’ అంటే కొడతాడు. ‘పక్కింటి వాళ్లు పెళ్లికి పిలిచారు. వెళ్లాలా’ అని అడిగితే చెయ్యెత్తుతాడు. అలా ఎందుకు జరుగుతుందో ఊహకు కూడా అందని విషయం. ఆమె మెల్లమెల్లగా అతడి లోపలి మనిషిని అన్వేషించడం మొదలెట్టింది. కొన్ని కారణాలు తెలిశాయి. వాటిని రిపేర్ చేయాలి. కాని తాను చెప్తే వింటాడా? ఒకరోజు భర్తతో భయపడుతూనే అడిగింది ‘బాబును ఒకసారి సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళదామండీ. వాడికి చదువు మీద ఫోకస్ ఉండటం లేదు. అటెన్షన్ డైవర్షన్ ఉందేమో సందేహంగా ఉంది. ఇప్పుడు తీసుకెళ్లకపోతే ప్రమాదమేమో‘ అని. బాబు బిహేవియర్ అతను కూడా గమనించాడు కాబట్టి ‘నువ్వు తీసుకెళ్లు’ అన్నాడు. అదే పదివేలు అనుకొని బాబును తీసుకొని సైకియాట్రిస్ట్ దగ్గరకు వచ్చింది. బాబుది పెద్ద సమస్య కాదని సరి చేయవచ్చని సైకియాట్రిస్ట్ చెప్పాక తన సమస్య చెప్పుకుంది. ‘డాక్టర్ నన్ను కాపాడండి. అన్నీ ఉన్నా ఇంటి మధ్య అశుద్ధం పడి ఉన్నట్టు నాకు అన్నీ ఉన్నా నా భర్తలో ఉన్న ఈ చెడుగుణం వల్ల నరకం చూస్తున్నాను. ఆయనకు సంఘం పెద్ద బలహీనత. సంఘం పట్ల చాలా మొహమాటం. సంఘం ఏమనుకుంటుందో అని భయం. అందరితో మంచిగా ఉండాలనుకుంటారు. వాళ్లను హర్ట్ చేయవద్దనుకుంటారుగానీ వాళ్లు హర్ట్ చేస్తే వారిని ఏమీ అనలేక నా మీద ప్రతాపం చూపుతున్నారని నాకు అనిపిస్తోంది. మంచితనం కోసం డాంబికానికి పోయి చాలామందికి అప్పులిస్తారు. వాళ్లు తిరిగివ్వరు. ఈయన అడగరు. ‘మీ డబ్బులు ఎక్కడికీ పోవండీ’ అని చాలామంది ఎగ్గొట్టారు. అయినా మారడు. ఇస్తూనే ఉంటాడు. అదంతా ఏదోరోజు పేరబడి నన్ను కొడతాడు. ఆయన అందరితో బాగుండటానికి నాతో చెడుగా ఉంటున్నాడని నాకర్థమవుతోంది. ఏం చేయమంటారు? సైకియాట్రిస్ట్‌కు చూపించుకోండి అన్నా కొడతాడని మీతో చెబుతున్నాను. అతనికి నేరుగా కాకుండా ఇన్‌డైరెక్టుగా వైద్యం చేయండి’ అంది పద్మ కళ్లనీళ్లతో. ‘సరే.. బాబు గురించి మాట్లాడాలని పిలిచానని తీసుకురండి’ అన్నాడు సైకియాట్రిస్ట్. వారం తర్వాత పద్మ, విజయశేఖర్ వచ్చారు. సైకియాట్రిస్ట్ బాబు గురించి చాలా సేపు మాట్లాడాక ‘పద్మగారూ మీరు బయటికెళ్లండి. ఒక నిమిషం మీ భర్తతో మాట్లాడాలి’ అని ఆమెను బయటకు పంపించాడు. విజయశేఖర్ డాక్టర్ వైపు ఎందుకూ అన్నట్టు చూశాడు. ‘విజయశేఖర్గారూ.. మీకు గాంధీజీ గారి గురించి తెలుసా?’ అన్నాడు డాక్టర్. విజయశేఖర్ తలూపాడు. ‘ఆయన మన దేశానికి జాతిపిత. కాని ఆయనకు కూడా వ్యతిరేకులు ఉన్నారు. ఆయనను కూడా చెడ్డవారనుకున్నవారున్నారు. అలా అనుకొని కాల్చి చంపారు. నెహ్రూకు వంకలు పెట్టేవారు, మదర్ థెరిసాలో లోపాలు వెతికేవారు, అందరూ సూపర్‌స్టార్ అనుకునే హీరో పోస్టర్ మీద పేడ కొట్టేవారు.. ఇలా ప్రతిఒక్కరినీ ఒప్పుకోని వారు ఒకరో ఇద్దరో ఉంటారు. అంతెందుకు దేవుడు లేడని తిట్టే నాస్తికులు ఉంటారు. అంటే మీరెంత మంచిగా ఉన్నా మీరు నచ్చని వాళ్లు కొందరు ఉంటారు. నచ్చడం నచ్చకపోవడం ప్రతిఒక్కరి గురించి సమానంగా ఉంటుంది. మీరెందుకు అందరినీ ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారు? ఎదుటివారిలో మీకు నచ్చనివి మీరు నిశ్శబ్దంగా భరిస్తున్నారు. మంచితనంతో ఉండటం వేరు. చేతగాని తనంతో ఉండటం వేరు. మీ క్లాస్‌లో అల్లరి చేసే పిల్లాణ్ణి, మీ అప్పు ఎగ్గొట్టే కొలీగ్ని, మీ పై కామెంట్ చేసే దారినపోయేవాడిని వాడి భాషలో మీరు జవాబు చెప్పడం నేర్చుకోండి. లేదంటే మీరిప్పుడు మీ ఆవిడను బాక్సింగ్ బ్యాగ్‌లా ట్రీట్ చేయడం అలాగే కొనసాగుతుంది. చూడండి... మీ అబ్బాయి పెద్దవాడవుతున్నాడు. వాడి ముందు మీరు మీ భార్యను కొడుకుతుంటే వాడి చిన్న మనసులో ఎంతటి భయంకరమైన ముద్ర పడుతుందో ఊహించారా? అసలైన మంచితనం ఏమిటంటే మన కుటుంబ సభ్యుల పట్ల మనం ప్రకటించేది. వాళ్లతో మొదట మంచిగా ఉండండి. బయట మంచిగా ఉండేవాళ్లతో మాత్రమే మంచిగా ఉండండి. అదే మీరు తెలుసుకోవాల్సింది’ అన్నాడు. విజయశేఖర్‌కు అంతా అర్థమైంది. భార్య తన హింసను తట్టుకోలేకే పిల్లాడి మిషతో ఇక్కడకు తీసుకొచ్చినట్టు అర్థం చేసుకున్నాడు. ‘కొంచెం హెల్ప్ చేయండి డాక్టర్ మారుతాను’ అన్నాడు తల వొంచుకుని. విజయశేఖర్‌కు మరో రెండుమూడు సిట్టింగ్‌లు అయ్యాయి. విజయశేఖర్ ఇప్పుడు మంచి భర్త. మంచి తండ్రి. బయట మంచివాళ్లకు మంచివాడు. చెడ్డవాళ్లకు చెడ్డవాడు. కాలేజ్‌లో అతని ఇమేజ్ అలాగే కొనసాగుతోంది. కాకుంటే ‘సారుతో జాగ్రత్త’ అని కూడా అనుకుంటున్నారు. అది చాలు విజయశేఖర్‌కు. కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
అర్థం కాని కొడుకు
భార్య చనిపోతే ఆ భర్తకు భార్యను వెతుకుతుంది సమాజం. అయితే ఆ భార్య అతని కొడుకుకు తల్లి కాగలదా? ఆ కొడుకు ఆమెను తల్లిగా స్వీకరిస్తాడా? చాలా సున్నితమైన అంశాలు. సదుద్దేశాలతో ఇటువంటి వివాహాల్లో ప్రవేశించే స్త్రీలకు మనోవ్యధ మిగిలితే? ఏం చేయాలి? ఆమెను చూస్తే సైకియాట్రిస్ట్‌కు ఆందోళనగా అనిపించింది. చాలాఏళ్లుగా మనోవ్యధ భరించి భరించి పూర్తిగా కుంగిపోయిన స్త్రీలా ఉందామె. ఆమెకు జీవితం మీద ఆశ లేదు. జీవితంలో సంతోషం ఉంటుందనీ తెలియదు. చూపించిన ప్రేమ, ఆప్యాయతలకు ఫలితం ఇంత చేదుగా ఉంటుందని ఊహించక కుదేలై ఉంది. ‘నేనొక దురదృష్టవంతురాలైన మారుతల్లిని డాక్టర్’ అందామె. సమత వయసు ఇప్పుడు 28 సంవత్సరాలు. కాని ఇంకో పది ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది. జుట్టు పలుచబడింది. కళ్ల కింద నీడలు. పలుచబడ్డ శరీరం. మెల్లగా ఉన్న కదలికలు. కాని పదేళ్ల క్రితం ఆమె ఇలా లేదు. ఎంతో ఉత్సాహంగా ఉండేది. సాటి మనుషుల పట్ల దయగా ఉండేది. తోటి మనుషుల ఆనందంలో తుళ్లిపడేది. ఆ సమయంలో ఆమె వయసు 18 సంవత్సరాలు. హైదరాబాద్‌లో బిటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుండేది. చదువు గురించిన ఆలోచనలు తప్ప జీవితపు ఆలోచనలు లేవు. కాని ఆ ఆలోచనలు చేయాల్సి వచ్చింది. ఒకరోజు ఆమె తండ్రి గుంటూరు నుంచి కలవడానికి హాస్టల్‌కు వచ్చాడు. ‘ఎలా చదువుతున్నావమ్మా?’ ‘బాగా చదువుతున్నాను నాన్నా’ తండ్రి కాసేపు ఆలోచనలో ఉన్నవాడిలా కనిపించాడు. ‘రోహిత్ గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తున్నావా అమ్మా’ రోహిత్ పేరు తలువగానే సమత మనసు బెంగతో నిండిపోయింది. రోహిత్ ఆమె అక్క కొడుకు. ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు. సమత అక్క భాను రెండేళ్ల క్రితం కేన్సర్‌తో కన్నుమూసింది. ఆమె బావ సుధీర్ జంషడ్‌పూర్‌లో పని చేస్తున్నాడు. చాలా మంచివాడు. భార్య చనిపోయాక చాలా నిబ్బరంగా పిల్లవాడిని చూసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. రెండేళ్ల కాలం అతనిలో చాలా మార్పే తెచ్చింది. ఒంటరి జీవితం, చిన్న పిల్లవాడు... అతన్ని గంభీరంగా మార్చాయి. ఎప్పుడైనా గుంటూరు వచ్చినా రెండు మూడు రోజులు ఉండి వెళ్లిపోయేవాడు. ఆ రెండు మూడు రోజుల్లో రోహిత్ ఏ ప్రవర్తనలో ఉండాలో తెలియక కొత్తగా ఉండేవాడు. ‘మీ బావను ఇంకో పెళ్లి చేసుకోమంటే చేసుకోవడం లేదమ్మా’ అన్నాడు తండ్రి. సమత ఈ సంభాషణ ఎక్కడకు వెళుతోందో అర్థం చేసుకుంది. ‘నీ ఆలోచన ఏమిటమ్మా?’ అడిగాడు. ‘నాన్నా... బావ మంచివాడు. రోహిత్ మన పిల్లవాడు. నాకు వారిద్దరంటే జాలి, ప్రేమ ఉన్నాయి. కానీ...’ ‘కానీ అంటే లాభం లేదమ్మా. నువ్వు పెద్దమనసు చేసుకోవాలి. వేరే స్త్రీ అయితే రోహిత్‌కు పూర్తిగా తల్లిప్రేమ చూపించకపోవచ్చు. నువ్వైతే నీ అక్క కొడుకే కాబట్టి నీ పిల్లాడిగా చూసుకుంటావు’ సమత మౌనంగా ఉండిపోయింది. ‘మావయ్యా... అలాంటి ఆలోచనలు చేయొద్దు. సమత చిన్నపిల్ల. చాలా భవిష్యత్తు ఉంది. నేను పెళ్లి చేసుకోలేను’ అన్నాడు ఫోన్లో సుధీర్. ‘లేదు బాబూ... ఇలా ఎక్కువ రోజులు ఉంటే నీ ఆరోగ్యానికే ప్రమాదం. బాబు ఎదుగుదలకు కష్టం’ అన్నాడు సమత తండ్రి. ‘ఈ పెళ్లి సమతకు ఇష్టమేనా?’ ‘తనకు పూర్తి సమ్మతమే’ అన్నాడు తండ్రి. పెళ్లి జరిగిపోయింది. సుధీర్‌ది పెద్ద ఉద్యోగం. మనిషి యావరేజ్‌గా ఉంటాడు. పెళ్లి చేసుకోవడమే లేట్‌గా చేసుకున్నాడు. వీటన్నింటి కారణాన అతనికీ సమతకు దాదాపు 14 ఏళ్ల గ్యాప్ ఉంది. ఇంత గ్యాప్ ఉన్నప్పటికీ ఎంతో సహృదయంతో తన కోసం, పిల్లాడి కోసం సమత చేసిన త్యాగానికి అతడి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. సమతను ఎంతో బాగా చూసుకోవడం మొదలెట్టాడు. అంతవరకూ రోహిత్‌ను నిమిషం కూడా వదలకుండా అంటిపెట్టుకుని ఉండే అతడు కొంచెం రిలాక్స్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే రోహిత్ బాధ్యత పూర్తిగా సమతకే అప్పజెప్పాడు. కాని అప్పుడు మొదలైంది చిక్కు. రోహిత్ ప్రవర్తనలో సడన్‌గా మార్పు మొదలైంది. అల్లరి పెంచాడు. మాట వినకుండా మొండికేయడం మొదలెట్టాడు. స్కూల్లో కూడా పాఠాలు సరిగ్గా వినకుండా అటెన్షన్ పెట్టకుండా నానా యాగీ చేస్తున్నాడని కంప్లయింట్లు వచ్చాయి. సుధీర్‌కు ఇవి చిన్న సమస్యలుగా కనిపించాయి. కాని రోహిత్‌ను చూసుకోవాల్సిన సమతను ఇవి టెన్షన్ పెట్టసాగాయి. గతంలో రోహిత్ సమతను ‘పిన్నీ’ అని పిలిచేవాడు. ఇప్పుడు ‘అమ్మా’ అని పిలవమంటే ఒక్కోసారి పిలుస్తున్నాడు. ఒక్కోసారి పిలవడం లేదు. తండ్రి దగ్గరకు వెళ్లి పడుకుంటాడు. సమతతో ‘నువ్వు వేరే గదిలో పడుకో’ అని హటం చేస్తాడు. చేసేది లేక ఆమె తన గదిలో పడుకుంటుంది. ముగ్గురూ ఒకే బెడ్ మీద పడుకోవడం రోహిత్‌కు ఇష్టం లేదు. సమత ఎంతో ప్రేమ చూపడానికి దగ్గర కావడానికి ప్రయత్నించింది. కాని రోహిత్ కాలేదు. ఈలోపు సమతకు రెండుసార్లు అబార్షన్ అయ్యింది. దానివల్ల సుధీర్ ఆమె మీద ఇంకా కన్సర్న్ పెట్టి బాగా చూసుకుంటూ పరోక్షంగా రోహిత్ మనసులో ఆమె పట్ల దూరం పెంచాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ రోహిత్ దూరమయ్యాడు తప్ప చేరువకాలేదు. ఇంటర్ వయసుకు వచ్చేసరికి వాడు పూర్తిగా తల్లికి ఎదురు తిరగడం, లెక్కలేనట్టుగా వ్యవహరించడం, బాధించడం ఎక్కువ చేశాడు. సుధీర్ నిస్సహాయత వాణ్ణి ఇంకా రెచ్చిపోయేలా చేసింది. ఇప్పుడు ఆ ఇంట్లో సుధీర్, రోహిత్ బాగానే ఉన్నారు. కాని సమత పూర్తిగా నలిగిపోయింది. ‘నేను చేసిన పాపం ఏమిటి? మంచికిపోతే చెడు ఎదురయ్యింది. నేనే నా చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నానా’ అనే భావంతో పూర్తి డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఆమెలో వచ్చిన మార్పు వాళ్లిద్దరూ గమనించినా ఎలా పరిష్కరించాలో తెలియక కొనసాగనిచ్చారు. చివరకు సమత తండ్రి దీనికి ముగింపు పలకడానికి వాళ్ల ముగ్గురినీ హైదరాబాద్‌లో సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకు వచ్చాడు. అంతా విన్న సైకియాట్రిస్ట్ ‘అయితే మొదట మాట్లాడిల్సింది మీతో కాదు. మీ అబ్బాయితో. మీకు సరైన మెడిసిన్ ఆ అబ్బాయే అని నాకు అర్థమవుతోంది’ అన్నాడు. బయట ఉన్న రోహిత్‌ను పిలిస్తే మొదట లోపలికి రావడానికి కూడా వాడు అంగీకరించలేదు. బతిమాలి ఒంటరిగా కూచోబెట్టి రోహిత్‌తో మాట్లాడాడు డాక్టర్. ‘చూడు రోహిత్. మీ అమ్మకు డబ్బు ఉంది. మీ నాన్నను పెళ్లి చేసుకునే సమయంలో ఆమె మంచి వయసులో ఉంది. ఎంతో మంచి సంబంధం చేసుకుని ఈసరికి ఏ అమెరికాలోనో ఉండేది. కాని నీ కోసం ఒంటరి అయిపోయిన తన అక్క కొడుకు కోసం తల్లిలా మారడానికి మీ ఇంటికి వచ్చింది. మీ నాన్న దానిని అర్థం చేసుకున్నాడు. నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. ఆమె నీకు ఏం అపకారం చేసింది? ఎందుకు వేధిస్తున్నావు? నీకు ఇష్టం లేకపోతే చెప్పు... ఆమె విడాకులు తీసుకుంటుంది. మీకు దూరంగా వెళ్లిపోతుంది. సరేనా?’ ఆ మాటకు రోహిత్ చటుక్కున తలెత్తి చూశాడు. నిర్లక్ష్యంగా ఉన్న కళ్లల్లో పశ్చాత్తాపం కనిపడింది. ‘లేదు డాక్టర్. నాకు మా పిన్నంటే ఇష్టమే. కాని నాకు ఎనిమిదేళ్లు వచ్చేవరకూ అడ్డు చెప్పేవారే లేరు. అమ్మ చనిపోవడంతో గారం పెంచేసి కొండ మీద కోతిని తెమ్మన్నా మా నాన్న తెచ్చిచ్చేవాడు. కాని పిన్ని వచ్చి నన్ను క్రమశిక్షణలో పెట్టబోయింది. అది నా మంచి కోసమే. కాని ఆమె నన్ను కంట్రోల్లో పెట్టడానికి వచ్చిన విలన్‌గా ఆ వయసులో నాకు అనిపించింది. అందుకే ఆమెను వ్యతిరేకించాను. అది అలాగే అలవాటైపోయింది. ఆమెకు సరండర్ కావడానికి ఇగో అడ్డుపడుతుంది. కాని అమ్మ పరిస్థితి చూసి నాకు నిజంగానే దుఃఖంగా ఉంది. నేను చాలా తప్పు చేశాను’ పదిహేడేళ్ల కుర్రావాడి మాటల్లో నిజాయితీ. మైక్ ఆన్ చేసి పక్క గదిలో ఉన్న సమతకు ఈ మాటలు వినిపించేలా చేయడంతో సమత పెద్దగా ఏడుస్తూ బయటకు వచ్చింది. ‘నాన్నా... రోహిత్’ అని కొడుకును అల్లుకుపోయింది. సమత ఎనిమిదేళ్ల పిల్లవాడికి తల్లి కావాలని వచ్చింది. కాని వాడికి పదిహేడేళ్లు వచ్చాకే నిజంగా తల్లి అయ్యింది. ఇక ఆమె జీవితానికి ఢోకా లేదు. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
కలత ఘటనల నుంచి కోలుకొని సాగిపోవాలి ముందుకు
స్పందించడం మంచిదే. ఆరోగ్యకరమైన స్పందన ఉండాల్సిందే. కాని అతి స్పందన అవసరం లేదు. సమాజంలో జరుగుతున్న దారుణమైన ఘటనలకు అతిగా స్పందించి, అవి మనకే జరిగితే అని పదేపదే ఆలోచిస్తూ వ్యాకుల పడితే ప్రమాదం. ఈ దశను దాటాలి. భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథం ఉండాలి. కలత ఘటనల నుంచి ముందుకు సాగాలి. అలా సాగమని చెప్పేదే ఈ కథనం. సృజనను సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వచ్చారు. ఆమెకు నలభై ఏళ్లుంటాయి. మనిషి కలతగా ఉంది. కన్నీరుగా ఉంది. ఉలికిపాటుగా ఉంది. అపనమ్మకంగా ఉంది. తనకేదో ప్రమాదం రాబోతున్నట్టుగా ఉంది. ‘ఏమిటి సంగతి?’ అని అడిగాడు సైకియాట్రిస్ట్ ఆమెను తీసుకొచ్చిన భర్తని. ‘వారం రోజులుగా తన పరిస్థితి బాగోలేదు డాక్టర్. ఒళ్లు హటాత్తుగా చల్లబడిపోతూ ఉంటుంది. అర్ధరాత్రి లేచి కూచుంటోంది. ఎప్పుడూ పక్కన మనిషి ఉండాలంటుంది. మాటిమాటికి వెళ్లి మా అమ్మాయి ఉన్న తలుపు తెరిచి అమ్మాయి లోపల ఉందా లేదా అని చూసి వస్తుంటుంది. దేనిమీదా ధ్యాస లేదు. ఎప్పుడూ టీవీ చూస్తూ ఉలికులికిపడుతుంటుంది. ఏమిటి నీ భయం అంటే ఏమీ చెప్పదు. మాకేం చేయాలో అర్థం కాక మీ దగ్గరకు తీసుకొచ్చాము’ అన్నాడు భర్త. ఆయన హైస్కూల్ టీచర్‌గా పని చేస్తున్నాడు. ‘మీ అమ్మాయి వయసెంతా?’ అని అడిగాడు సైకియాట్రిస్ట్. ‘21 సంవత్సరాలు’ ‘ఏం చేస్తుంటుంది?’ ‘కొత్తగా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరింది. షిఫ్ట్లుంటాయి. క్యాబ్ వచ్చి పికప్ చేసుకుంటుంది. ఇవాళ లీవ్ పెట్టి తోడొచ్చి బయట కూచొని ఉంది. తనకేం ప్రాబ్లం లేదు. తను బాగుంది. ఈమే’... అని ఆగాడు. ‘సరే.. మీరెళ్లండి.. మాట్లాడతాను’ అని చెప్పి పంపించాడు. అతను వెళ్లాక సృజనను అడిగాడు – ‘చెప్పండమ్మా.. ఎందుకిలా ఉన్నారు?’ ‘ఏమో డాక్టర్... నాకు భయంగా ఉంటోంది. నిద్రపోతే నలుగురు మనుషులు నా కూతురిని చుట్టుముట్టినట్టుగా అనిపిస్తోంది. లాక్కెళుతున్నట్టుగా కనపడుతుంది. ఒకటే భయం. నిద్ర లేచేస్తాను’ ‘ఎందుకలాంటి కలలొస్తున్నాయి?’ ‘ఈ మధ్య జరిగిన ఘటనను టీవీలో పదేపదే చూశాను. చాలా బాధ కలిగింది. పాపం ఆ అమ్మాయిని తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశారు. ఆ తల్లిదండ్రుల దుఃఖం చూడలేకపోయాను. అలా టీవీ చూస్తూ ఉంటే సడన్‌గా నాకు ఏమిటోగా అనిపించింది. ఆ తల్లి స్థానంలో నేనున్నట్టుగా, ఆ అమ్మాయి స్థానంలో నా కూతురు ఉన్నట్టుగా అనిపించడం మొదలెట్టింది. అంతే. నా ఒళ్లంతా చెమటలు పట్టాయి. కన్ను తెరిచినా మూసినా అలాంటి నరకం నా కూతురికి ఎదురైతే నేనేం కావాలి అన్నదే నా భయం’ అందామె. ‘మీరు మీ బాల్యంలోగాని టీనేజ్లోగాని ఇలాగే ఏ విషయానికైనా కలత పడ్డారా?’ ‘పడ్డాను డాక్టర్. నేను ఎవరి కష్టాన్నీ గట్టిగా చూళ్లేను. ఒకవేళ చూస్తే ఆ కష్టం నాకే వచ్చినట్టు బాధ పడి ఇబ్బంది తెచ్చుకుంటాను’ అందామె. డాక్టర్ ఆమెకు మంచినీళ్లిచ్చాడు. ‘చూడండమ్మా... మీకు పెద్ద జబ్బేమీ లేదు. కొంచెం సున్నితంగా ఉన్నారు. పెను ఘటనలు చూసినప్పుడు అవి నాలుగు రకాల మనుషుల మీద ప్రభావం చూపిస్తాయి. సెన్సిబుల్ పర్సనాలిటీస్, డిపెండెంట్ పర్సనాలిటీస్, యాంగ్జియస్ పర్సనాలిటీస్, డిప్రెసివ్ పర్సనాలిటీస్... ఈ నాలుగు రకాల్లో మీరు ఏదో ఒక రకం అయి ఉండాలి. ‘దిశ’లాంటి ఘటనలు జరిగినప్పుడు పౌరులుగా మనం స్పందించాలి. మార్పు జరగాలని ఆశించాలి. అది కరెక్ట్. కాని తీవ్రంగా దాని గురించే ఆలోచిస్తూ అనుక్షణం అదే బుర్రలో నింపుకోవడం సరికాదు. ఫస్ట్ మీరు రిలాక్స్ కండి. ఊహించని చెడు ఘటనలు, ప్రమాదాలు, వైపరీత్యాలు అనాదిగా జరుగుతున్నాయి అని గుర్తు చేసుకోండి. మనం ఎంత ప్రయత్నం చేయాలి, ఎంత జాగ్రత్తలో ఉండాలి, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామా లేదా చెక్ చేసుకొని ముందుకు సాగిపోవాలి. అంతే తప్ప అక్కడే ఆగిపోకూడదు’ అని బెల్ నొక్కాడు. భర్త, కూతురు లోపలికి వచ్చారు. ‘చూడండి.. ముందు మీ భార్యను మాట్లాడనివ్వాలి. ఆమె చెప్పేది మీరు పదే పదే వినాలి. ఆమె దేనికి భయపడుతోందో దానికి వెంటిలేషన్ ఇవ్వాలి. కసరొద్దు. ఆపు అనొద్దు. అదంతా మాట్లాడి మాట్లాడి ఖాళీ అయిపోవాలి. అప్పుడు మీరు ఆమెకు ధైర్యం మాటలు మాట్లాడాలి. ఆమెను నార్మల్‌గా ఉంచాలి. పాజిటివ్ విషయాలను చూపించాలి. పాటలు వినిపించాలి. ఆమెకు ఏదైనా వ్యాపకం ఉంటే అందులో బిజీగా ఉంచాలి. ఒకటి రెండు మందులు రాస్తాను అవి కూడా సాయం చేస్తాయి.’ అన్నాడు డాక్టర్. ఆ తర్వాత సృజనతో మళ్లీ అన్నాడు. ‘సృజనగారూ... రాక్షసులు ఎప్పుడూ ఉన్నారు. కాని వారి సంఖ్య చాలా తక్కువ. మరి దేవతలు? ముక్కోటిమంది ఉన్నారని మర్చిపోకండి. ఎందుకు చెప్తున్నానంటే చెడు కంటే ఎప్పుడూ మంచి శాతమే ఎక్కువగా ఉంటుంది. మంచి తనను తాను కాపాడుకుంటుంది. మీకూ మీ అమ్మాయికి ఎప్పుడూ ఏమీ కాదని మనస్ఫూర్తిగా అనుకోండి. ఇప్పటికే మీ అమ్మాయి తన హ్యాండ్‌బ్యాగ్‌లో పెప్పర్ స్ప్రే పెట్టుకొని తిరుగుతోంది. తన ఫోన్ డిస్ప్లేలో పోలీస్ నంబర్‌ను క్విక్ డయల్‌గా పెట్టుకుని ఉంది. ఇంకేం భయం చెప్పండి’ అని నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆమె మెల్లమెల్లగా తేరుకోవడం కనిపించింది. ఎవరైనా చేయాల్సింది అదే. తేరుకుని ముందుకు సాగడం. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
అమ్మ నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే
అమ్మ ఏడుస్తుంది. ఎవరైనా తెలిసినవారు ఎదురుపడితే ఏడుస్తుంది. ఎవరైనా అయినవారు పలకరిస్తే ఏడుస్తుంది. ఎవరైనా బాధలో ఉంటే ఏడుస్తుంది. ఎక్కడైనా శుభకార్యం జరుగుతున్నా ఏడుస్తుంది. అమ్మకు ఏడుపు ఆగదు. 62 సంవత్సరాల అమ్మ ఏడుస్తూనే ఉంది. ఆమెకు కావలసింది ఏమిటి? ఆదరించే ఒక గుండె. వినే శ్రద్ధ ఉన్న రెండు చెవులు. అప్పటికి ఇద్దరు కంటి డాక్టర్లు పరీక్షించి కంటిలో లోపం ఏమీ లేదని చెప్పారు. కన్నీళ్లు కారడం కంటి జబ్బు వల్ల కాదన్నారు. అవి లోపలి నుంచి వస్తున్నాయని, మనసు నుంచి వస్తున్నాయని, చూడబోతే ఆమె లోపల ఒక కన్నీటి సరోవరమే ఉన్నట్టుగా అనిపిస్తోందని డాక్టర్లు అన్నారు. ఇది కంటి డాక్టర్లు చూసే సమస్య కాదు. మరెవరు చూడాలి? అమెరికాలో సంధ్యమ్మ రెండు నెలలు ఇద్దరు కొడుకుల దగ్గర ఉండొచ్చింది. అక్కడకు వెళ్లిన రోజు నుంచి ఆమె ఊరికూరికే ఏడుస్తోంది. కొడుకులను చూస్తే ఏడుపు. కోడళ్లను చూస్తే ఏడుపు. బుజ్జి మనవడు, మనవరాళ్లను చూస్తే కూడా ఏడుపు. అక్కడ వారాంతంలో తెలిసినవారు రావడమో తెలిసినవారి ఫంక్షన్లకు వెళ్లడమో చేసేవారు కోడళ్లు. తోడుగా ఈమెను తీసుకెళ్లేవారు. అక్కడకు వెళ్లగానే ఎవరితో ఒకరితో మాట్లాడుతూ ఆమె ఏడుపు మొదలెట్టేది. ఇది కోడళ్లకు ఇబ్బంది అయ్యి ఈమె వల్ల మాకు చెడ్డపేరొస్తోంది అని మెల్లగా పంపించేసేందుకు సిద్ధమయ్యారు. ఇది గమనించిన సంధ్యమ్మ అమెరికాలోనే ఉన్న పెళ్లికాని మూడోకొడుకు దగ్గరకు వెళ్లింది అతడు బాగా సంపాదిస్తున్నాడు. చిన్న వయసులోనే పెద్ద భవంతి కూడా కొన్నాడు. అక్కడకు వెళ్లి ఆమె ఏడుస్తుంటే విసుక్కోవడం మొదలెట్టాడు. ‘నీకేం తక్కువని ఇక్కడ. చూడు ఎంత పెద్ద ఇల్లుందో. టీవీ చూడు. యూ ట్యూబ్‌లో భక్తి పాటలు విను. సినిమాలు చూడు. నాతో షికారుకు రా. కాని ఏడవకు. ఎందుకేడుస్తావ్ అలా? ఇంకా ఎన్నేళ్లని బతుకుతావ్ నువ్వు. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండు’ అని అతనికి తోచిన పద్ధతిలో మాట్లాడటం మొదలుపెట్టాడు. కాని ఆమెకు ఏడుపు ఆగేది కాదు. ఆగదు కూడా. మెల్లగా ఆమె ఇండియా వచ్చేసింది. సొంత ఇంట్లో పనిమనిషిని పెట్టుకొని ఒక్కత్తే ఉంటోంది. ఆమెకు ఇద్దరు సోదరులు. ఇద్దరూ చనిపోయారు. భర్త చనిపోయి సంవత్సరం. కొడుకులు ముగ్గురూ అమెరికాలో. ఆమెకు ప్రస్తుతం తోడు ఉన్నది కన్నీరు. కన్నీరు. కన్నీరు.‘ఏమ్మా.. ఎలా ఉన్నావ్?’ అని అడిగాడు సైకియాట్రిస్ట్. ఆ చిన్న ప్రశ్నకు, ఆ ఒక్క ప్రశ్నకు ఆమెకు ఏడుపు తన్నుకురాబోయింది. ‘ఆగమ్మా. ఆగు. నా ప్రశ్నకు నువ్వు ఏడవకుండా సమాధానం చెప్పగలిగితే మనం ఈ సమస్యను సగం అధిగమించినట్టు’ అన్నాడు సైకియాట్రిస్ట్. సంధ్యమ్మ కొంచెం సంభాళించుకోవడానికి ప్రయత్నించింది. ‘ఏం చెప్పను డాక్టర్... నా ప్రమేయం లేకుండానే నాకు ఏడుపు వస్తోంది’ అందామె. ‘ఏం పర్లేదమ్మా. నీకు ఈ సమస్య. మరొకరికి మరో సమస్య. సమస్య లేకుండా ఎవరూ ఉండరు. మనం ప్రయత్నించి, డాక్టర్ సాయం తీసుకుని, అయినవారి సాయం తీసుకుని వాటి నుంచి బయటపడాలి’ ‘నాకెవరూ లేరు డాక్టర్’ అందామె గంభీరంగా. ‘అదేంటమ్మా’ ‘అవును. పెళ్లయినప్పుడు ఎవరూ లేరు. పిల్లలు పుట్టాక ఎవరూ లేరు. భర్త ఉండగా ఎవరూ లేరు. భర్త లేనప్పుడూ ఎవరూ లేరు. నాకెవరూ లేరు’ అందామె. మెల్లగా ఆమె తన కథను డాక్టర్‌కు చెప్పడం మొదలుపెట్టింది. సంధ్యమ్మది పెద్దలు కుదిర్చిన పెళ్లి. భర్త ఆర్ అండ్ బిలో ఇంజనీరు. కాని అతనిది ముక్కుసూటి వ్యవహారం. ఉద్యోగానికి సంబంధించిన కొన్ని లోపాయికరమైన వ్యవహారాలు తెలిసేవి కావు. మనసులో ఏదీ దాచుకోడు. ఎవరు తనవాళ్లో ఎవరు శత్రువులో తెలియక పై ఆఫీసర్ల గురించి ఏదో ఒక మాట అనేసేవాడు. దాంతో అతడికి ఉద్యోగంలో నిత్యం సమస్యలు ఉండేవి. ఒక్కోసారి ట్రాన్స్ఫర్లు, ఒక్కోసారి తనే లాంగ్లీవ్లు. బంధువులదగ్గర సంధ్యమ్మకు ఇదంతా తలకొట్టేసే పనిగా ఉండేది. పైగా ప్రతిసారీ ముగ్గురు పిల్లలను వేసుకొని ట్రాన్స్ఫర్ల మీద ఊర్లు తిరగాలంటే చాలా కష్టం. వాళ్ల చదువు, పెంపకం ఆమెకు కష్టంగా ఉండేది. ఏమైనా అతనికి హితవు చెప్పబోతే చాలా కర్కశంగా ఎదురు తిరిగేవాడు. అసలు ఆమె మాటే అతని దగ్గర చెల్లుబాటయ్యేది కాదు. ఒకరోజు రెండు రోజులు కాదు... అతడు మరణించేవరకు ఆమెకు అదే శిక్ష. పిల్లలు వాళ్ల లోకంలో వాళ్లు ఉండేవారు. ఆమెకు తన బాధలు ఎవరితోనైనా చెప్పుకోవాలని ఉండేది. వినడానికి ఎవరూ ఉండేవారు కాదు. చెప్పాలన్నా మళ్లీ భర్తకు తెలిస్తే ఏమవుతుందోనని ఆ భయం. అలాగే నిన్న మొన్నటి వరకూ కృశించింది. ఎంతగా అంటే భర్త మరణించాక దుఃఖం కలగడంతోపాటు కొంత రిలీఫ్‌గా కూడా అనిపించేంత. కాని ఆ తర్వాతే ఆమె సమస్య మొదలయ్యింది. దారిలో ఏ కొత్త జంట స్కూటర్ మీద వెళుతున్నా తన పెళ్లయ్యాక అలా వెళ్లలేదే అని ఏడుపు. ఎవరు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నా తన భర్తతో అలా చెప్పుకోలేదే అని ఏడుపు. పిల్లలు ఆడుకుంటుంటే తన పిల్లల ఆటపాటలు చూసేంత తీరిక తనకు లేకపోయాయని ఏడుపు. శుభకార్యాలకు వెళితే తాను సరిగ్గా ఏ శుభకార్యంలోనూ హాయిగా గడపలేదని గుర్తుకొచ్చి ఏడుపు. రాను రాను సంతోషానుభూతికి విషాదానుభూతికి తేడా తెలియని స్థితికి ఆమె చేరుకుంది. ఒక మనిషికి అసలైన విషాదం మాట్లాడే గొంతు లేకపోవడం కాదు. ఎదురుగా వినే రెండు చెవులు లేకపోవడం అని ఆమెను చూస్తే సైకియాట్రిస్ట్‌కు అనిపించింది. ఇదే బాధ కొంచెం అటు ఇటుగా ఇవాళ చాలామంది స్త్రీలు అనుభవిస్తున్నారని అనిపించింది. ‘చూడమ్మా. నీ కష్టం అర్థమైంది. నీ కష్టానికి మందు ఏమిటంటే నువ్వు చెప్పడం నేను వినడం. ఎంత చెప్పుకుంటావో చెప్పు. రోజూ వచ్చి నువ్వు పడ్డ కష్టాలన్నీ చెప్పు’ అని అన్నాడు సైకియాట్రిస్ట్. ఆమె నాలుగు వారాల పాటు అప్పుడప్పుడు వచ్చి డాక్టర్‌తో ఒక గంట కూచుని మాట్లాడి వెళ్లేది. తనలో బాగా గుచ్చుకుపోయిన అనుభవాలు చెబుతూ చెబుతూ వాటి ఉచ్చు నుంచి మెల్లగా బయటపడటం మొదలుపెట్టింది. ఇక ఆమెకు కావలసింది రోజూ మాట్లాడే మనుషులు. వినే మనుషులు. ‘చూడమ్మా. నీ పిల్లల గురించి నేనేం చెప్పలేను. కాని నీలాంటి స్థితిలో ఉన్న మనుషులు ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్‌లు ఉన్నాయి. వారితో గడపడం నీకు కొంత లాభించవచ్చు. లేదా నీ కాలనీలో నీ వంటి మనుషులతో స్నేహం చేసి రోజూ మీరంతా ఒకచోట కలుస్తుంటే మరింత లాభం చేకూర్చవచ్చు. అసలు నీ మాటలు అందరూ ఎందుకు వినాలి.. అందరి మాటలు నువ్వు విని నీ అనుభవంతో సలహాలు ఇవ్వొచ్చు కదా అనుకుంటే నువ్వే అందరికీ ఆప్తురాలివైపోతావ్. అందరూ నీ కోసం ఎదురు చూసే దానివిలా మారిపోతావ్. నువ్వు రోగిగా కాదు ఉండాల్సింది. డాక్టర్‌గా. నీ కోసం నువ్వు బతికే నలుగురి కోసం బతికే డాక్టర్‌గా’ అన్నాడతను. ఆ సలహా పని చేసింది. సంధ్యమ్మ ఇప్పుడు కొంచెం బిజీగా ఉంటోంది. ఎదుటివారి మాటలు వింటోంది. నవ్వే విషయాలకు నిజంగా నవ్వుతోంది. నిజంగా ఏడ్వాల్సిన విషయాలకు కూడా దిటవు ప్రదర్శిస్తోంది. సంధ్యమ్మ గతం నుంచి వర్తమానం నుంచి కూడా విముక్తం అయ్యి జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకోగలిగింది. – కథనం: సాక్షి ఫీచర్స్ డెస్క్ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
ఏ జన్మలో ఏం పాపం చేశానో డాక్టర్...
బయటి వ్యక్తుల ఫిర్యాదుల పై తీర్పులు సులభం. కుటుంబ సభ్యుల మధ్య స్పర్థ రేగితే ఏమిటి చేయడం? తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ ఎప్పుడూ ఉండేదే. కాని తల్లి తన కొడుకునే ప్రధాన శత్రువు అని అనుకుంటోంది. ఇద్దర్నీ కూచోబెట్టి మాట్లాడాల్సిన తండ్రి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాడు. సైకియాట్రిస్ట్ ఈ తగాదాను తీర్చాల్సి వచ్చింది. చాలా పెద్ద పెద్ద అరుపులు వినవస్తున్నాయి. టేబుల్ మీద ఉండాల్సిన గ్లాస్ నేల మీద ఠాప్పున తగిలి వంద గిరికీలు తిరిగింది. తలుపు ధబ్బున మూసుకుపోయింది. తలుపు మూసుకున్న కొడుకు లోపలి నుంచి పెద్దపెద్దగా తిడుతున్నాడు తల్లిని. పరుషమైన మాటలు ఉన్నాయి అందులో. తల్లి తగ్గలేదు. తలుపు దగ్గర చేరి బిగ్గరగా వాదన చేస్తోంది. ‘నీకేం తక్కువ చేశామని ఇలా చేస్తున్నావురా గాడిద. మంచి కాలేజ్‌లో చేర్పించాము. అడిగింది ఇచ్చాము. కోరింది చేస్తున్నాము. చదివి బాగు పడరా అంటే మమ్మల్ని ఏడ్పించుకుని తింటున్నావేమిరా మూర్ఖుడా. నువ్విలా చేస్తే భయపడి ఊరుకుంటానని అనుకుంటున్నావేమో. నా సంగతి నీకు తెలియదు. నిన్ను ఎలా దారికి తేవాలో నాకు తెలుసు’ బుసలు కొడుతోంది. తండ్రి డ్రాయింగ్ ఏరియాలో నిలబడి ఆ తల్లీ కొడుకుల సంవాదాన్ని విసుగ్గా, నిస్సహాయంగా, ఉద్వేగంగా చూస్తున్నాడు. దేదీప్య్ బి.టెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కాని చదవడం లేదు. సరిగ్గా చదవడం లేదని తల్లి ఫిర్యాదు. క్లాసులకు వెళ్లడం లేదు. వెళ్లినా ఏం చెబుతున్నారో పట్టించుకోవడం లేదు. ఎక్కువగా ఇంట్లోనే ఉంటున్నాడు. అతనికి గది ఉంది. అందులో ల్యాప్ టాప్ చూస్తూ ఉంటాడు. ఇరవై నాలుగ్గంటలూ చెవులకు హెడ్‌ఫోన్స్ ఉంటాయి. ఏదైనా మాట్లాడాలన్నా పిలిచినా రెండు మూడు సార్లు అరిస్తే తప్ప హెడ్‌ఫోన్స్ తీసి వినడు. లేదంటే ఫోన్ చూస్తుంటాడు. ఎక్కువగా గదిలోనే డోర్ లాక్ చేసుకుని ఉంటాడు. తల్లి సురేఖకు ఇది ఆందోళనగా ఉంది. ఆమెకు కొడుకు భవిష్యత్తు మీద కొన్ని ఆలోచనలు ఉన్నాయి. రాబోయే నాలుగైదేళ్లలో ఆమె అతణ్ణి అమెరికాలో చూడదలుచుకుంది. తమ కాలనీలో ఉన్న చాలామంది తల్లులు ఇదే ఆలోచన చేస్తున్నారు. అయితే దేదీప్య్ అలాంటి గోల్‌తో ఉన్నట్టు కనిపించడం లేదు. అసలు ఏ గోల్ లేనట్టుగా ఉంటున్నాడు. అదొక్కటే కాదు... దేదీప్య్ తమ్ముడు వికాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నాడు. వాడి మీద అన్న ప్రభావం ఎలా ఉంటుందనే ఆమె ఇంకా ఆందోళనగా ఉంది. కొరుకుడు పడని ఈ కొడుకు తన జీవితానికి అతి పెద్ద శత్రువు అని ఆమె అనుకోవడం మొదలుపెట్టింది. తల్లి, తండ్రి, కొడుకు ముగ్గురూ సైకియాట్రిస్ట్ ఎదురుగా ఉన్నారు. తల్లి కొడుకు ముందే కొడుకు గురించి సైకియాట్రిస్ట్‌కు చెప్పింది– ‘ఏ జన్మలో ఏం పాపం చేశానో డాక్టర్... వీడు ఇలా తయారయ్యాడు. ఏ మాటా వినడం లేదు. ఏం చెప్పినా తప్పంటున్నాడు. ఎంతో తెలివైన పిల్లాడు. బాగా చదివేవాడు. క్లాస్ టాపర్‌గా వచ్చేవాడు. ఇప్పుడిలా తయారయ్యాడు. వీణ్ణేం చేయమంటారో చెప్పండి’ అంది. తండ్రి ఏం మాట్లాడలేదు. ఈ వ్యవహారంలో వేలు పెడితే కొడుకు నుంచి భార్య నుంచి ఎటువంటి చర్య ఎదుర్కొనాల్సి వస్తోందో అన్నట్టుగా ఉన్నాడు. ‘ఏం.. దేదీప్య్ ఏంటి నీ సమస్య’ అని అడిగాడు డాక్టర్. తల్లిదండ్రులను బయటకు పంపించి దేదీప్య్ మాట్లాడాడు. దేదీప్య్ ముందు నుంచి కూడా ఇంటెలిజెంట్ స్టూడెంట్. చదువంటే ఆసక్తి బాగా ఉంది. తల్లిదండ్రులంటే ఇష్టం. ప్రేమ. తండ్రికి వ్యాపారం ఉంది. కుటుంబం కోసం కష్టపడటం తన విధి అనుకుంటాడు. పిల్లలను సరిగ్గా చదివించి పెద్దవాళ్లను చేయడం తన బాధ్యత అని తల్లి అనుకుంది. అయితే దేదీప్య్కు ముందునుంచి నలుగురితో కలిసే అలవాటు లేదు. పెద్దగా ఫ్రెండ్స్ లేరు. ఒక్కడే చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్ చూసేవాడు. పుస్తకాలు చదివేవాడు. ఇంట్లోనే ఉండేవాడు. చాలాసార్లు క్లాస్ పుస్తకాలు ముందేసుకునేవాడు.తల్లి ఇది మంచి విషయంగా అనుకుంది. దేదీప్య్ ఆడుకోవడం లేదనీ, ఫ్రెండ్స్‌తో కలవడం లేదని, అందరూ పిల్లలు ఎదుర్కొనే అనుభవాలు ఎదుర్కొనడం లేదనీ ఆమె అనుకోలేదు. టైమ్ వేస్ట్ కాకుండా చదువుకుంటున్నాడు అనుకుంది. ఇంకా ఇంకా చదివేలా అతణ్ణి కట్టడి చేయడం మొదలుపెట్టింది. ఆ కట్టడికి తగినట్టుగా మార్కులు, ర్యాంకులు టెన్త్‌లో ఇంటర్లో ఎంసెట్‌లో వచ్చేసరికి తన మార్గం సరైనది అనుకుంది. దేదీప్య్ కూడా తానేం చేస్తున్నాడో తనెలా ఉంటున్నాడో చెక్ చేసుకోకుండానే ముందుకు వెళ్లాడు. అయితే బి.టెక్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి అతనికి సడన్‌గా మెలకువ వచ్చినట్టయ్యింది. చుట్టూ లోకం ఒకలా ఉంది. తను ఒకలా ఉన్నాడు. తన తోటి స్టూడెంట్స్ చాలా యాక్టివిటీల్లో ఉన్నారు. గ్రూపులుగా క్రియేటివ్ పనులు చేస్తున్నారు. వాళ్లకు చాలా అప్డేట్స్ ఉన్నాయి. యూ ట్యూబ్‌లు, నెట్‌ఫ్లిక్స్‌లు, అమెజాన్లు.. వాటిలో వస్తున్న కంటెంట్ గురించి మాట్లాడుతున్నారు. ట్రిప్స్ తిరుగుతున్నారు. చదువు కూడా చేస్తున్నారు. తన సహజ స్వభావం రీత్యా, బిడియం రీత్యా వారెవ్వరితోనూ కలవకపోయే సరికి వారు తనను దాటుకొని చాలా దూరం వెళ్లిపోయారని అనిపించి సడన్‌గా దేదీప్య్కు డిప్రెషన్ వచ్చింది. దానికి కారణం తల్లి అని అతడికి అనిపించడం మొదలుపెట్టింది. తనతో స్థిమితంగా ఒక గంట కూచుని మాట్లాడని తండ్రి మీద మరింత కోపం వచ్చింది. అంతా కలిసి తన కొంపముంచారని అనుకోవడం మొదలుపెట్టాడు. తల్లి ఏం చెప్తే దానికి వ్యతిరేకం చేసి బాధించాలని నిర్ణయించుకున్నాడు. దానికి తగినట్టుగా ఇంట్లో ప్రవర్తించసాగాడు. తండ్రి ఇదంతా ఏమీ అర్థం చేసుకోలేదు. అతను ఇల్లు చేరగానే కొడుకు మీద తల్లి ఫిర్యాదు చేసేది. అతడు మోటుగా కొడుకు చేతిలోని ఫోన్‌నో ల్యాప్‌టాప్‌నో లాగేసి దాచేసేవాడు. అదే విరుగుడు అనుకునేవాడు. దాంతో కొడుకు ఇంకా మొండిగా తయారయ్యాడు. అన్నింటి కంటే ఆశ్చర్యం ఏమిటంటే తానిలా తయారయ్యానని తానే బాధ పడుతున్నాడు. ఈ బాధలో సాయం చేయాల్సిన తల్లిదండ్రులు దూరంగా ఉన్నారని, తన మనసును అందుకోలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నాడు. ముగ్గురిలోనా తీవ్రమైన దూరం ఉంది. ఒకరికొకరు అర్థం కావడం లేదు. చేసుకోవడం లేదు. ఇప్పటి సమస్యకంతా ఇదే కారణం. అంతా విన్న సైకియాట్రిస్ట్ తిరిగి ముగ్గురినీ కూచోబెట్టి మాట్లాడాడు. విడి విడి వ్యక్తులుగా ఉన్న ఆ ముగ్గురూ ముందు ఒక కుటుంబం కావలసిన అవసరం గురించి మాట్లాడాడు. కొడుకును అర్థం చేసుకోవాల్సిన పద్ధతిని, కొడుకు విషయంలో జరిగిపోయిన నిర్లక్ష్యాన్ని వివరించాడు. అలాగే కొడుకును తల్లిదండ్రులకు ఉండే ఆందోళనను అర్థం చేసుకోమని చెప్పాడు. ‘మీ నాన్న కష్టపడేది, మీ అమ్మ తాపత్రయ పడేది నీ కోసమే కదా’ అని చెప్పాడు. ‘వాళ్లు నా గురించి నాతోపాటుగా ఆలోచిస్తే మంచిది డాక్టర్. వాళ్లకై వాళ్లు ఆలోచిస్తే కాదు’ అని దేదీప్య్ అన్నాడు.‘ఇది మీ ఒక్క ఇంట్లోనే కాదు. చాలా ఇళ్లల్లో జరుగుతోంది. ఒక్కోచోట తండ్రి, ఒక్కోచోట తల్లి తమ పిల్లల నుంచి ఇలాంటి శతృత్వం తెచ్చుకుంటున్నారు. వర్తమానంలో అవసరమైన స్పేస్‌ను తీసుకోకుండా భవిష్యత్తు కోసం అంతా ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. రేపటి గురించి ఆలోచన మంచిదే. కాని దాని కోసం ఇవాళ్టి సాధారణ జీవితాన్ని లాస్ కావాల్సిన అవసరం లేదు’ అని చెప్పాడు.పైకి నేరుగా కనిపించని ఈ జటిలమైన సమస్య కేవలం మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల సగం పరిష్కారం అయ్యింది. మిగిలిన సగం పరిష్కారం కోసం ఆ విడివిడి సభ్యులు ఒక కుటుంబంగా ప్రయత్నిస్తున్నారు. విజయం కూడా సాధిస్తారు. – కథనం: సాక్షి ఫీచర్స్ డెస్క్ ఇన్పుట్స్ బై సీనియర్ సైకియాట్రిస్ట్ -
‘నీకే కాదు.. పెళ్లికే తగనివాణ్ని’
ప్రేమించాడు. పెళ్లయ్యాక ఫస్ట్ నైటే తొలి ముద్దు అన్నాడు. అమ్మాయి ఆనందంలో తేలిపోయింది. ‘తగినవాడు’ అనుకుంది. కానీ లాస్ట్ మినిట్‌లో ‘నేను తగనివాణ్ణి’ అన్నాడు. ‘నీకే కాదు.. పెళ్లికే తగనివాణ్ని’ అన్నాడు. అమ్మాయి షాక్ తింది. అది పట్టించుకోలేదు అతను. ‘‘ప్లీజ్.. నువ్వే మన పెళ్లి చెడగొట్టాలి’’ అన్నాడు! రిసార్ట్ అన్నారు గానీ అది రిసార్ట్‌లా లేదు. బీచ్ ఒడ్డున నాసి రకం షెడ్లు వేసి రూముల్లాగా చేశారు. రెండు మూడు కుర్రాళ్ల టీములు – వైజాగ్ వాళ్లట – పార్టీ చేసుకోవడానికి స్టే చేసి ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన హైదరాబాద్ కుర్రాళ్ల టీములో ఒకరిద్దరు ఉత్సాహంగా ఉన్నా ఒకరిద్దరు బెరుగ్గా ఉన్నారు. ‘రాత్రికి ఉంటుంది మజా’ అన్నాడు హైదరాబాద్ టీమ్‌లోని ఒక కుర్రాడు. ‘జాగ్రత్త... పోలీసులు సడన్‌గా రావచ్చు. మీ మంచికే చెప్తున్నాను’ అన్నాడు బీర్లు తెచ్చి పెట్టిన బోయ్. రాత్రయ్యింది. రిసార్ట్‌లో మసక చీకటి అలుముకుంది. అక్కడక్కడ రూముల్లో సందడి వినిపిస్తూ ఉంది. హైదరాబాద్ టీములోని కుర్రాళ్లు వాళ్లలోని ఒకతన్ని గదిలోనే వదిలి మిగిలినవాళ్లంతా బయటకు వచ్చేశారు. ‘ఎంజాయ్ మామా’ అని కేరింతలు కొట్టారు వాళ్లందరూ. గదిలో ఉన్న కుర్రాడు తన ఎదురుగా వచ్చి కూచున్న ఆమె వైపు క్యూరియస్‌గా చూశాడు. లేడీ సైకియాట్రిస్ట్ రూములో ఆ అమ్మాయి, ఆ అమ్మాయి తల్లీ కూచుని ఉన్నారు. అమ్మాయి కళ్ల కింద చారలు ఉన్నాయి. ఏడెనిమిది రోజులుగా తిండి తింటున్నట్టుగా లేదు. ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టుగా ఉంది. ‘నా ఖర్మ డాక్టర్. మూడు రోజుల్లో పెళ్లి. ఎలా తయారయ్యిందో చూడండి’ అంది తల్లి సైకియాట్రిస్ట్‌తో. ‘ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారా?’ అడిగింది సైకియాట్రిస్ట్.‘లేదండీ. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే. ఆఫీసులో కలీగ్స్. ప్రేమించుకున్నారు. వాళ్లకై వాళ్లొచ్చి అడిగితేనే పెద్దలం ఓకే అన్నాం’ ‘ఏమ్మా... ఏంటి ప్రాబ్లమ్’ అడిగింది సైకియాట్రిస్ట్. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. ‘మీరు బయట కూచోండి. నేను కనుక్కుంటాను’ అంది సైకియాట్రిస్ట్. ‘నువ్వు ఈ కాలం అబ్బాయివి కావు’ అంది మాన్విత శిరీష్‌తో. ‘నేను ఈ కాలం అబ్బాయినే’ ఉడుక్కుంటూ అన్నాడు శిరీష్. ‘నీ మొహం. సర్పంటైన్ పబ్ హైదరాబాద్‌లో ఎక్కడ ఉందో చెప్పు?’ ‘తెలీదు. నీకు తెలుసా?’ కంగారుగా అడిగాడు. ‘తెలీదు. వెళ్లలేదు. కంగారు పడకు. నా ఫ్రెండ్స్ ఎవరో వెళితే దాని గురించి తెలిసింది. అందులో రాక్ మ్యూజిక్‌లూ పాప్ మ్యూజిక్‌లూ ఉండవు. ఎంచక్కా ఒక తబలా ఒక హార్మోనియం పెట్టుకొని ఎంకి పాటలు పాడతారు. బీరులోకి అరటికాయ బజ్జీలు ఇస్తారట’ నవ్వింది. ‘ఏమో... అదంతా నాకు తెలియదు. ఆఫీసవగానే నేరుగా ఇంటికెళ్లిపోతాను’ ‘వెళ్లి జబర్దస్త్ చూస్తావు. అంతేగా?’ ‘అరె.. నీకెలా తెలుసు?’ ‘సుబ్బారావ్... అందుకే నువ్వంటే నాకిష్టం’ శిరీష్ బుగ్గను పిండింది మాన్విత. ఒక శాటర్ డే మాన్వితను కారులో లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళుతూ శిరీష్ మాన్వితతో చెప్పాడు– ‘నేను ఇంటర్ చదివే రోజుల్లో ఎంసెట్‌లో ర్యాంక్ కోసం సాయంత్రాలు డాబా మీదకు వెళ్లి చదువుకునేవాణ్ణి. రాత్రి ఎనిమిదీ ఎనిమిదిన్నర టైములో పక్కింటామె పనంతా ముగించి స్నానానికి వెళ్లేది. వాళ్లది ఓపెన్ టాప్ బాత్రూమ్. నేను సరిగ్గా నిలబడితే పూర్తిగా కనిపిస్తుంది. కాని నేను ఒక్కసారి కూడా చూడలేదు. చూడకూడదు అనుకున్నాను. బి.టెక్ చేస్తున్నప్పుడు మా బేచ్మేట్ ఒకమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పింది. కాని ఆ అమ్మాయి పట్ల నాకేమీ ఫీలింగ్స్ లేవు. సారీ అన్నాను. అయితే ఒక ముద్దన్నా పెట్టు అంది. పెట్టను అన్నాను. నేను పెట్టే ముద్దు నేను చేసుకోబోయే అమ్మాయికే పెట్టాలి అనుకున్నాను. ఇప్పుడు ఈ కారులో నువ్వూ నేనూ తప్ప ఎవరూ లేరు. ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోవచ్చు. కాని మన పెళ్లయ్యాక నువ్వు పాల గ్లాసు తీసుకొని వచ్చాక కొత్త పెళ్లి కూతురిగా ఉన్నప్పుడు నిన్ను తొలిసారి ముద్దు పెట్టుకున్న మెమొరీ లైఫ్‌లాంగ్ బాగుంటుంది కదా’... మాన్విత కళ్లల్లో ఎందుకో అతని పట్ల విపరీతంగా ఆరాధన పెరిగి తడి ఉబికింది. ‘సుబ్బారావ్... సుబ్బారావ్’ తలలోకి వేళ్లు దూర్చి అల్లరిగా జుట్టును చెదరగొట్టింది. ‘తర్వాత?’ అడిగింది సైకియాట్రిస్ట్. ‘అతను పెళ్లి చేసుకోను అంటున్నాడు’ ‘అదేంటి?’ ‘నన్నే పెళ్లి చెడగొట్టమంటున్నాడు. నాతో మాట్లాడటం లేదు. నా ఫోన్ ఎత్తడం లేదు. మూడ్రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఏం ఎరగనట్టు ఇవాళ ఆఫీసుకు కూడా వెళ్లాడు’ ‘విచిత్రంగా ఉంది’ ‘నాకు చచ్చిపోవాలని ఉంది’ ‘రేయ్ మామా... అసలే ఆ అమ్మాయి స్పీడు. నువ్వేమో పప్పు. ఫస్ట్‌నైట్ తెల్లముఖం వేశావంటే తర్వాత మా పరువు పోతుంది’ అన్నారు శిరీష్ ఫ్రెండ్స్. ‘అలా ఏమీ ఉండదు. మన తాత ముత్తాలంతా ప్రాక్టీసు చేసే పెళ్లిళ్లు చేసుకున్నారా? నేచరే అన్నీ నేర్పుతుంది’‘చెట్లు కొట్టేసి, కొండలు తవ్వి రోడ్లు వేసేశాక ఇంకా నేచర్ ఎక్కడుంది? అదేం నేర్పుతుంది’ జోక్ చేశాడో ఫ్రెండు. ‘మగాడు కొన్ని తెలియడం వల్ల చెడిపోతాడు. కొన్ని తెలియకపోతే చెడిపోతాడు’మొత్తానికి అందరూ శిరీష్‌ని బెదరగొట్టి రిసార్ట్ ప్రోగ్రామ్ పెట్టారు.‘అది శిరీష్ చేసిన తప్పు డాక్టర్. అక్కడ అతను ఫెయిల్ అయ్యాడు. ఏమీ చేయలేకపోయాడు. అది చాలా దెబ్బ కొట్టింది అతని కాన్ఫిడెన్స్ మీద. కాని అతడు ఎంత మంచివాడంటే వెంటనే హైదరాబాద్ వచ్చి జరిగింది నాతో చెప్పి పెళ్లి చేసుకోలేనని డిక్లేర్ చేశాడు. ఇక మీదట ఎవర్నీ చేసుకోనని కూడా చెప్పేశాడు. ఇరవై నాలుగ్గంటలూ కెరీర్ మీద దృష్టి పెడతాడట. అదే జీవితం అనుకుంటాడట’ మాన్విత ఏడ్చింది. ‘ఆపు. అనవసరంగా ఏడుస్తున్నావు. లేచి బయటికెళ్లి ఇప్పుడు మీ అమ్మను పంపు. రేపు ఆ సుబ్బారావ్ను పంపు’ అంది సైకియాట్రిస్ట్. తల్లికి జరిగిందంతా చెప్పి కూతురుకు ఎలా ధైర్యం చెప్పాలో సలహా ఇచ్చింది సైకియాట్రిస్ట్. మరుసటి రోజు సైకియాట్రిస్ట్ ఎదురుగా కూచుని ఉన్నాడు శిరీష్. ‘చూడు శిరీష్.. ఇంత సంస్కారం ఉండి డిస్టర్బెన్స్ తెచ్చుకున్నావ్. ఇంటర్‌కోర్స్ అనేది ఆహ్లాదకరమైన వాతావరణంలో, సంపూర్ణ అంగీకారం, పరిచయం, ప్రేమ ఉన్న మనుషుల మధ్య అవరోధాలు లేకుండా జరుగుతుంది. లేదంటే నీలా జరుగుతుంది. నీకున్న జబ్బును పెర్ఫార్మెన్స్ యాంగ్జయిటీ అంటారు. కొత్త వాతావరణం, ఎవరో తెలియని స్త్రీ, రోగ భయం, పోలీసుల భయం... వీటిన్నింటి వల్ల నువ్వు ఫెయిలయ్యావు తప్ప నీలో లోపం ఉండి కాదు. ఇక మీదట ఎప్పుడూ ఇలా చేయకు. ధైర్యంగా ఉండు. సరేనా’ అంది.అప్పటి వరకూ కుంగిపోయి ఉన్న శిరీష్‌లో ఆ మాటలతో వెలుగు వచ్చింది. ‘థ్యాంక్యూ డాక్టర్. మరి మెడిసిన్లు ఏమైనా వాడాలా?’ అడిగాడు. ‘అవును. వాడాలి’ అని ఆమె ప్రిస్క్రిప్షన్ మీద రాసి ఇచ్చింది. చూశాడు.‘పెళ్లి’ అని ఉంది. శిరీష్, మాన్విత పెళ్లి చేసుకున్నారు. వాళ్లు సంతోషంగా ఉన్నారనడానికి ఫేస్బుక్లో అప్లోడ్ అవుతున్న హనీమూన్ ట్రిప్ ఫొటోలే సాక్ష్యం. – కథనం: సాక్షి ఫీచర్స్ డెస్క్ -
మేనత్త పోలిక చిక్కింది
మేనమామ పోలిక అదృష్టం. మరి మేనత్త పోలిక? మహాభాగ్యం. బంధుత్వాలు బలంగా ఉండాలనే పెద్దలు ఇలా సెలవిచ్చారు.కాని పిల్లలకు అలా అర్థం కాకపోవచ్చు. ఆ మెలకువను చెప్పే కథనం ఇది. మీ ఫ్యామిలీకి ఉపయోగపడే మేలుకొలుపు. గోరుచిక్కుళ్లు, మునక్కాడలు, పొట్లకాయలు మాత్రమే ప్రకృతికి సమ్మతం కాదు. సొరకాయలు, గుమ్మడికాయలు, దోసకాయలు కూడా ఉంటాయి. లలితంగా కోమలంగా ఉండే సన్నజాజులు, విరజాజులు మాత్రమే ప్రకృతి పూయదు. కలువలు, తామరలు, పొద్దు తిరుగుడు పూలు కూడా ఉంటాయి. ఉన్నదంతా ప్రకృతికి అపురూపమే. ఉన్నదే అందం. వచ్చిందే ఆనందం. ...... అమ్మాయికి పదహారేళ్లు. తక్కువ బరువు ఉంది. ఉండాల్సినంత బరువు లేదు. బలహీనంగా ఉంది. తిండి తినడం లేదు. ముద్ద పట్టడం లేదు. ఎటో చూస్తోంది. ఏమిటోగా ఉంటోంది. తల్లిదండ్రులకు ఏమీ అర్థం కాక సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొచ్చారు. ‘ఏమిటి సమస్య?’ సైకియాట్రిస్ట్ అడిగింది. ‘అసలు అన్నం తినడం లేదు డాక్టర్’ అంది తల్లి. ‘సరే మీరు బయట కూర్చోండి’ అని తల్లిదండ్రులను బయటకు పంపించింది. తర్వాత అమ్మాయి వైపు చూసింది. చక్కటి ముఖం. అందమైన కళ్లు. చాలా చక్కటి నాసిక. చెంపలు. పెదాలు. కాని ఆ ముఖంలో వెలుతురు లేదు. ఆ వయసులో ఉండాల్సిన తేజస్సు లేదు. ఆనందం కనిపించడం లేదు. ‘ఏమ్మా... ఏమైనా ప్రేమలో పడ్డావా’ అడిగింది సైకియాట్రిస్ట్. తల అడ్డంగా ఊపింది. ‘మార్కులు తీసుకు రమ్మని... రాత్రికి రాత్రి సుందర్ పిచయ్ అయిపోవాలని వేధిస్తున్నారా?’ ‘లేదు’ అని అంది ఆ అమ్మాయి. ‘ప్రేమించకపోతే యాసిడ్ పోస్తామని ఎవరైనా బెదిరిస్తున్నారా?’ ‘ఊహూ’ ‘మరి?’ ‘నేను మా మేనత్తలా ఉంటానట’ ‘ఉంటే?’ ‘అలా ఉండటం నాకిష్టం లేదు’ ‘ఏం?’ ‘అలా ఉంటే నేను చచ్చిపోతాను’... ‘అవును.. నేను మా మేనత్తలా ఉంటే చచ్చిపోతాను... చచ్చిపోతాను’ ఆ అమ్మాయి ఏడవడం మొదలుపెట్టింది. ..... నాగసుందరి ఆ అమ్మాయి పేరు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. దానికి ముందు టెన్త్, ఆ ముందు నైన్త్ చాలా హుషారుగా చదవాలనుకుంది. కాని కొంచెం బొద్దుగా తయారవడం మొదలెట్టింది. కొంచెం లావుగా తయారవడం మొదలెట్టింది. రెండేళ్లలో పది కిలోల బరువు పెరిగింది. బట్ట కొంటే ఎక్కువ కొనాల్సి వచ్చేది. రెడీమేడ్ కొనాలంటే చాలాసేపు వెతకాల్సొచ్చేది. కొత్త చెప్పులు తొందరగా అణిగిపోయేవి. తండ్రి స్కూటర్ మీద ఎక్కించుకునేటప్పుడు ఆ స్కూటర్ కుయ్యోమని మూలిగినట్టుగా ఆ అమ్మాయికి అనిపించేది. వారూ వీరూ ఇంటికి పోచుకోలు కబుర్లు చెప్పడానికి వచ్చినప్పుడు ‘అమ్మాయి.. బొద్దుగా తయారవుతోందండీ... ఈ వయసులోనే కంట్రోల్ చేయాలి... లేకుంటే తర్వాత చాలా కష్టమవుతుంది’ అనేవారు. ‘అది తన తప్పు కాదండీ. మేనత్త పోలిక. ఆమె కూడా ఇలా బొద్దుగా ఉండేది కదా. జీన్సు. ఎక్కడికి పోతాయి’ అనేది. స్కూల్లో పిల్లలు ఏడిపించేవారు. బోండాం బోండాం అనేవారు. క్లాస్ టీచర్ స్నాక్స్ టైమ్‌లో రెండు ప్లేట్లు పెట్టేది. అవన్నీ నాగసుందరి సరదాగానే తీసుకునేది. కాని ఇంటికి వచ్చినప్పుడు అమ్మ వాళ్లతో వీళ్లతో మాట్లాడేటప్పుడు ‘మా అమ్మాయిది మేనత్త పోలిక’ అన్నప్పుడు మాత్రం వణుకు వచ్చేది. ...... ‘కొంచెం లావుగా ఉన్నావని, మేనత్తలా ఉన్నావని ఎవరైనా అంటే భయపడతావా? దిగులు పడతావా? ఇందులో భయపడటానికి ఏముంది?’ అంది సైకియాట్రిస్ట్. ‘అది కాదు డాక్టర్’ అని ఆ అమ్మాయి తల వొంచుకుంది. ‘పర్లేదు చెప్పు’ ‘మా మేనత్తకు లావు తగ్గలేదు. ఎన్నేళ్లున్నా పెళ్లి కాలేదు. ఒక రోజు ఆమె నాకీ లావు ఇష్టం లేదు అని చచ్చిపోయింది’ సైకియాట్రిస్ట్ ఒక్క క్షణం ఆ తీవ్రతను గ్రహించింది. ‘నాకు మా అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం. నేను పెద్దయ్యి వాళ్లను బాగా చూసుకోవాలి. లావుగా ఉంటూ పెళ్లి అవకుండా వాళ్లను దిగులుతో చంపకూడదు. నేను చచ్చిపోకూడదు’ అంది వెచ్చటి కన్నీళ్లతో. సైకియాట్రిస్ట్ ఆ అమ్మాయినే చూస్తూ కూచుంది. ..... నాగసుందరిని అనేక పరీక్షలు చేసిన మీదట ఆ అమ్మాయి పరిస్థితి సున్నితంగా ఉందని సైకియాట్రిస్ట్‌కు అర్థమైంది. అస్సలు అన్నం తినడం లేదు. తినడానికి రోజుల తరబడి సంశయిస్తోంది. ఆ లంకణాలను భరించలేక ఒక్కోసారి విపరీతంగా తినేస్తోంది. ఉండాల్సిన బరువు కన్నా తగ్గినా అద్దం ముందు నిలుచుంటే ఆ అమ్మాయికి తనను తాను చాలా లావుగా కనిపిస్తోంది. అంటే ఇంకా సన్నబడాలని తీవ్రంగా తిండిని కంట్రోల్ చేస్తోంది. ఇది ‘అనెరెక్సియా నెర్వోజా’ అనే డిజార్డర్. ఇది ఒక మోస్త్తరు వరకూ ఉంటే హాని ఉండదు. శ్రుతి మించితే ప్రాణాలకు కూడా ప్రమాదం. .... సైకియాట్రిస్ట్ తల్లిదండ్రులను కూచోబెట్టింది.‘చూడండి. పిల్లల మనసులో ఏముందో వారికి ఎటువంటి భయాలు ఏర్పడుతున్నాయో మనం ఎటువంటి భయాలు కల్పిస్తున్నామో సొసైటీ వాళ్లను ఎంత అపోహలో నెడుతోందో ఎప్పటికప్పుడు మనం పట్టించుకోవాలి. బిజీలో ఇవాళ్టి తల్లిదండ్రులు ఏమీ గమనించక తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకోవాలని చూస్తున్నారు. మీ అమ్మాయికి మేనత్త పోలిక వచ్చింది. వస్తే తప్పేంటి? లావుగా ఉండటంలో ఏ తప్పూ లేదు. అది మరీ అవసరానికి మించిన లావు అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుని అదుపు చేసుకుంటే సరిపోతుందని చెప్పాలి. లావుగా ఉండటం పాపం సన్నగా ఉండటం వరం అని నూరిపోస్తున్నాం. మన క్యాలెండర్లలో బక్క చిక్కిన లక్ష్మీదేవిని ఎప్పుడైనా చూశామా? ఆరోగ్యకరమైన దేహమే ఐశ్వర్యం. ప్రకృతి ఇచ్చిన శరీరం ఆరోగ్యంగా ఉంటే లావైనా సన్నమైనా తెలుపైనా నలుపైనా ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పాలి. ఆ అమ్మాయి మేనత్తలో ఆత్మవిశ్వాసం నింపి ఉంటే ఆమెను ఏదో ఒక ఉద్యోగంలో వ్యాపకంలో పెట్టి ఉంటే ఎవరో ఒకరు ఇష్టపడేవారు దొరికి ఉండేవారు. లేదా ఆమె ఆ వ్యాపకాల్లో సంతృప్తి పడేది. శరీరం పరమావధి పెళ్లి మాత్రమే అనీ ఆ పెళ్లికి శరీరం సుందరంగా ఉండాలని నూరిపోస్తున్నాం. మామిడి చెట్లే ఉండాలి ద్రాక్ష గుత్తులే కాయాలి అనుకుంటే వేప చెట్టు ఉండేది కాదు. దాని చేదు కూడా కలిస్తేనే తీపి చేదు సమానమై సృష్టి సమతూకంతో ఉంటుంది. అన్ని విధాల రూపాలు, దేహాలు, రంగులు ఇవన్నీ ప్రకృతి తన కోసం అల్లుకున్న నేత. దానిని అర్థం చేయించాలి మన పిల్లలకు. ఆ అమ్మాయి మేనత్తలో కూడా ఏవో పాజిటివ్ విషయాలు ఉండే ఉంటాయి. వాటిని చెప్పండి మీ అమ్మాయికి. తనలోని పాజిటివ్ విషయాలు అర్థం చేయించండి. మీ అమ్మాయి టెన్త్‌లో టాపర్. బుద్ధి కూడా గొప్ప సౌందర్యం అని చెప్పండి’ అంది సైకియాట్రిస్ట్. ఆ తర్వాత సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, న్యూట్రీషనిస్ట్లు కలిసి ఒక టీమ్‌లా మారి నాగసుందరిని ట్రీట్ చేశారు.నాగసుందరి ఇప్పుడు నాగసుందరిలా ఉంది. బాగా చదువుకుంటోంది. సన్నగా ఉందా లావుగా ఉందా అని లోకం చూడవచ్చు. కాని అద్దం ముందు నిలుచున్న ప్రతిసారీ ఇది నేను... నేను నాకు చాలా ఇష్టం అనుకుని బుగ్గ మీద ఒక చిట్టి ముద్దు పెట్టుకుంటోంది.తనను తాను స్వీకరించడమే కదా అసలైన విజయం. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ -
సైకియాట్రిస్ట్ ఝాన్సీ రాజ్ ఆత్మహత్య
టెక్సాస్ : అమెరికాలో సైకియాట్రిస్ట్‌గా పేరొందిన ప్రవాస తెలుగు మహిళ డాక్టర్ ఝాన్సీ రాజ్ ఆత్మహత్య చేసుకున్నారు. టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌లో నివసించే ఝాన్సీ తన కారును స్వయంగా డ్రైవ్ చేస్తూ సరస్సులోకి దింపి బలవన్మరణానికి పాల్పడ్డారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఝాన్సీ నిత్యం చురుకుగా, ధైర్యంగా ఉండేవారు. ఆమె ఎందుకు ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకున్నారనేది వెల్లడి కాలేదు. ఝాన్సీ ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో 1976లో వైద్య విద్యను అభ్యసించారు. అమెరికాలో ఆమె 43 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ ప్రముఖ సైకియాట్రిస్ట్‌గా గుర్తింపు పొందారు. -
బావా బావా కన్నీరు
పెళ్లి చేసుకున్నాక బావా మరదళ్లలా ఉంటే బాగుంటుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్న బావ అన్నల్లో ఒకడిలాగా అనిపించవచ్చు. అలాంటి బావను ఎలా పెళ్లి చేసుకోవాలి? మేనత్త పోరు వల్లో, మేనమామ గోడు వల్లో అమ్మాయి జీవితం మోడు కాకూడదు. బలవంతం చేస్తే... బాబా బావా పన్నీరు కాస్తా... బావా బావా కన్నీరు అవుతుంది. సైకియాట్రిస్ట్ దగ్గర తల్లిదండ్రులు కూచుని ఉన్నారు. ‘చెప్పండి’ అంది సైకియాట్రిస్ట్. ‘బయట మా అమ్మాయి కూచుని ఉంది. మీరు కొంచెం కౌన్సెలింగ్ ఇవ్వాలి’ అన్నారు వాళ్లు. ‘దేని గురించి?’ ‘పెళ్లి చేసుకోను అంటోంది’ ‘ఎప్పటికీ ఎవరినీ చేసుకోనంటోందా?’ ‘కాదు... ఒక సంబంధం చూశాం. ఆ అబ్బాయిని చేసుకోను అని అంటోంది’ సైకియాట్రిస్ట్ కళ్లద్దాలు తీసి చేతిలో పట్టుకుంది. ‘చూడండి. ఇది మానసిక వైద్యం చేసే విభాగం. అమ్మాయి పెళ్లి వద్దంటోంది... ఫలానా చీర కట్టుకోనంటోంది... ఫలానా కాలేజీలో చేరనంటోంది అంటే మేము చేసేది ఏమీ లేదు. ఇది మీరు సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్. మీ అమ్మాయిని అడిగి ఆ సంబంధం కాదంటే ఇంకో సంబంధం చేయండి’ ‘అదికాదండీ.. మీరొక్కసారి మాట్లాడితే... అది మంచి సంబంధం... అందుకని’ బతిమిలాడారు. ‘సరే’ అందామె. ఆ అమ్మాయికి 21 ఏళ్లు. చామనఛాయలో చక్కటి కను ముక్కుతో ఉంది. స్థిరంగా ఉన్నట్లు కనిపించేందుకు ప్రయత్నిస్తోంది. కళ్లలో ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ‘చెప్పమ్మా... పెళ్లి ఎందుకు చేసుకోవద్దనుకుంటున్నావు’ అడిగింది సైకియాట్రిస్ట్. ‘చేసుకోను అని చెప్పట్లేదు డాక్టర్. ఇప్పుడే వద్దు. రెండేళ్ల తర్వాత చేసుకుంటాను అంటున్నాను. అబ్బాయి గురించి నాకేం వ్యతిరేకత లేదు కాని నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు’ అందా అమ్మాయి. ‘ఎవరినైనా ప్రేమించావా?’ ‘అయ్యో! అలాంటిదేమీ లేదండీ’ ‘మరి ఈ మాత్రం దానికి ఎందుకు అందరూ వర్రీ అవుతున్నారు. నువ్వూ... మీ అమ్మా నాన్నలూ’ అమ్మాయి సడన్‌గా ఏడ్వడం మొదలుపెట్టింది. ‘అయ్యో. ఏడవకమ్మా’ సైకియాట్రిస్ట్ నాప్కిన్ తీసిచ్చింది. ‘ఆ అబ్బాయి మా మేనత్త కొడుకే డాక్టర్. చిన్నప్పటి నుంచి చూసినవాడే. అతన్ని పెళ్లి చేసుకోమని ఇంట్లోవాళ్లు అంటున్నారు. నాకైతే ఇప్పటికిప్పుడు నా మైండ్ సిద్ధంగా లేదు. అంతే కాదు అతడి మీద పెళ్లి చేసుకునేంత మనసు పోవడం లేదు. అదీగాక మేనరికం వల్ల పిల్లలు సరిగా పుట్టరు అని అంటారు కదా. ఆ సందేహం కూడా ఉంది. ఇవన్నీ నేను చెప్తుంటే మా వాళ్లు’... మళ్లీ ఏడ్వడం మొదలుపెట్టింది. సైకియాట్రిస్ట్‌కు ఇదంతా స్ట్రేంజ్‌గా అనిపించింది. చాలా సాధారణ సమస్య. అమ్మాయి మేనరికం వద్దంటోంది. ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. అదీ ఇప్పుడు కాదనుకుంటోంది. ఇందులో సమస్య ఏమిటో అర్థం కావడం లేదు. ‘సమస్య ఉంది డాక్టర్. మా ఇంట్లో అందరూ నన్ను టార్చర్ పెడుతున్నారు’ ‘అంటే?’ అంది సైకియాట్రిస్ట్. ‘మా అమ్మకు డయాబెటిస్ ఉంది. ఆమె రెండు వారాలుగా మందులు మానేసింది. మా అన్నయ్య ఆ సంగతి చెప్పి నీ వల్ల అమ్మ మందులు మానేసింది... ఆమె చచ్చిపోతుంది... ఒకవేళ చచ్చిపోతే నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని టెన్షన్ పెడుతున్నాడు. మా నాన్న నాతో మాట్లాడకుండా సాధిస్తున్నాడు. మా అమ్మ చచ్చిపోతుందేమోనని నిజంగానే నాకు భయంగా ఉంది. ఆమె చచ్చిపోయేలోపు నాకే ఆత్మహత్య చేసుకోవాలని ఉంది’ అంది తల వొంచుకుని దుఃఖిస్తూ. ఆ అమ్మాయికి ఒక మేనత్త కొడుకు ఉన్నాడు. అతడు బాగా చదువుకున్నాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. మేనత్తకు తన తమ్ముడంటే అభిమానం. తమ్ముడి కూతురంటే వాత్సల్యం. అమ్మాయి తండ్రికి కూడా తన చెల్లెలి కుటుంబంతో వియ్యమందడం సంతోషం. ఈ పెళ్లి జరిగితే రక్తసంబంధం తర్వాతి తరానికి కొనసాగుతుందని పెద్దల ఆలోచన. ఈ పెళ్లి జరక్కపోతే స్థితిమంతులైన చెల్లెలి కుటుంబంతో తేడా ఎక్కడ వస్తుందో వాళ్లు ఎక్కడ దూరమైపోతారో అని తండ్రి, తల్లి, అన్న ఆందోళన చెందుతున్నారు. కాని అమ్మాయికి మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు. అన్ని విధాలా చెప్పి చూశారు. చివరకు బెదిరింపులకు దిగారు. కుటుంబ పరువు ఏం కాను అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వొత్తిడికి ఆ అమ్మాయి కిందా మీదా అయిపోతూ ఉంది. చచ్చిపోవాలని లోలోపల అనుకుంటూ ఉంది. ఇదీ కేసు. సైకియాట్రిస్ట్‌కు మొత్తం అర్థమైంది. ‘సరేనమ్మా. నువ్వెళ్లు. రేపు మీ అమ్మను నాన్నను అన్నయ్యను రమ్మన్నానని చెప్పు’ అంది. ఆ చిన్న ఆశతో డాక్టర్ వైపు చూసి లేచి బయటకెళ్లిపోయింది. మరుసటి రోజు తల్లి, తండ్రి, అన్నయ్య సైకియాట్రిస్ట్ ఎదురుగా కూచుని ఉన్నారు. ‘అది కాదు డాక్టర్. మా నిర్ణయంలో తప్పేముంది చెప్పండి’ అన్నాడు తండ్రి. ‘సార్. మీరు బాగా రెడీ అయ్యి ఆఫీసుకు బయల్దేరుదామని బయటికొస్తే పైనుంచి మీ షర్ట్ మీద పక్షి రెట్ట పడితే మీరు ఆ షర్ట్‌తోనే వెళతారా? మార్చుకొని వెళతారా?’ ‘మార్చుకుని వెళతాను’ ‘కాసేపటి వ్యవహారానికే షర్ట్ మారిస్తే జీవితాంతం ఇష్టం లేని బరువును ఆ అమ్మాయి ఎందుకు మోయాలనుకుంటున్నారు?’ అతను దెబ్బ తిన్నట్టుగా చూశాడు. ‘కాపురం చేయాల్సింది ఆ అమ్మాయి. అతనితో జీవితాన్ని పంచుకోవాల్సింది ఆ అమ్మాయి. ఇరవైనాలుగ్గంటలూ అతడు ఎదురుగా ఉంటే చూస్తూ స్వీకరించాల్సింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి అది ఇష్టం లేనప్పుడు ఎందుకు బలవంతం చేస్తారు? ప్రతి ఒక్కరికీ నిర్ణయం తీసుకునే హక్కు, ఎదుటివారికి ఆ నిర్ణయాన్ని గౌరవించే బాధ్యత ఉందని ఎందుకు భావిస్తున్నారు? పైగా కుటుంబ మర్యాద బంధాల కొనసాగింపు అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆడపిల్ల మాత్రమే కుటుంబ మర్యాద కాపాడాలా? ఆడపిల్ల పెళ్లి ఇష్టం లేదన్నా లేదంటే నచ్చినవాణ్ణి చేసుకున్నా కుటుంబ మర్యాద పోయిందని ఎందుకు రాద్ధాంతం చేస్తారు. ఆడపిల్ల భుజాల మీద మాత్రమే కుటుంబ మర్యాద ఎందుకు ఉంది? ఆమె నిర్ణయానికి మంచి చెడులకు అతీతమైన మర్యాదను మీ కుటుంబానికి మీరు సంపాదించి పెట్టలేదా? ఇక బంధాల కొనసాగింపు. మీరు, మీ చెల్లెలు ఈ పెళ్లితో మాత్రమే బలపడతారా? ఈ పెళ్లి జరక్కపోతే విడిపోయేంత బలహీనమైన అన్నాచెల్లెళ్ల అనుబంధమా మీది. అంత బలహీనమైనదైతే దాని కోసం బాధపడటం అనవసరం ఏమో కదా! మీరు చేస్తున్న వొత్తిడి వల్ల మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందామని ఆలోచిస్తోంది. అదే జరిగితే సమస్యకు పరిష్కారం జరిగిందని సంతోషపడతారా?’ తల్లిదండ్రులు, అన్న అదిరిపోయారు. ‘మాకు తెలియదు డాక్టర్. ఏదో అమ్మాయికి మంచి జరుగుతుందని తాపత్రయపడ్డాం’ ‘ఆమ్మాయికి ఏది ఇష్టమో అది చేస్తే మంచి. నచ్చనిది చేస్తే చెడు. అది గ్రహించండి ముందు’ అంది లేడీ సైకియాట్రిస్ట్. తండ్రి తల పంకించాడు. ‘ఇది మాకు కొంచెం కష్టమే. అయినా అమ్మాయి కంటే ఏదీ ఎక్కువ కాదు. నా చెల్లెలికి మేనల్లుడికి నేను సర్ది చెప్పుకుంటాను. వాళ్లు కూడా మూర్ఖంగా ఉంటారని అనుకోను. ఎనీ హౌ థ్యాంక్యూ డాక్టర్’ ముగ్గురూ లేచి నిలబడ్డారు. వాళ్లు వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ రాలేదు. ఆ అమ్మాయి మీద వొత్తిడి పెట్టి పెళ్లి చేసి ఉండరనే సైకియాట్రిస్ట్ నమ్మకం. ఆ నమ్మకమే నిజమవ్వాలని కోరుకుందాం. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్