ఇంటికి కోడలు వస్తే బాగుంటుంది. ఇంటిని చక్కదిద్దే, ఇంటికి శక్తినిచ్చే కోడలు వస్తే నిజంగా బాగుంటుంది. తప్పును తప్పు అని ఒప్పుని ఒప్పు అని, ఇష్టం ఉన్నది ఇష్టం ఉన్నది అని ఇష్టం లేనిది ఇష్టం లేదు అని చెప్పే కోడలు వస్తే బాగుంటుంది. జవ జీవాలు ఉన్న, చేవ ఉన్న కోడలు వస్తే బాగుంటుంది. వినయ విధేయతలతో పాటు ఆత్మగౌరవం ఉన్న కోడలు వస్తే బాగుంటుంది. అంతే తప్ప మర బొమ్మ వస్తే బాగుంటుందా? అలాగే అత్తయ్యా అని తలాడించే కోడలు వస్తే బాగుంటుందా?
‘జమీల్యా.. ఇదేం పేరు?’ అని అడిగాడతను పరిచయమైన కొత్తలో. కాచిన పాలరంగులో ఉన్న ముఖం మీది వెంట్రుకలను తోసుకుంటూ నవ్వి ‘ఇది మా నాన్న పెట్టిన పేరు. ఏదో రష్యన్ నవలలో హీరోయిన్ అట’ అందా అమ్మాయి. ‘ఇప్పుడు నిన్ను ఇంప్రెస్ చేయాలంటే నేను ఓల్గా నదిలో మూడు మునకలేసి రావాలా?’ నవ్వాడు. ‘గర్జించు రష్యా.. గాండ్రించు రష్యా అని శ్రీశ్రీకు మల్లే కవిత్వం చెప్పాల్సిన పని కూడా లేదులే’ మళ్లీ నవ్వింది. ‘మీ అన్న పేరు స్టాలిన్ కదూ’ ‘పేరుకే స్టాలిన్. వాడు లోకమే తెలియకుండా పెరిగి లోకమే తెలియనివ్వని సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేయడానికని సింగపూర్ వెళ్లిపోయాడ్లే’ ‘సో.. నీ పెళ్లికి మీ అమ్మా నాన్నా ఓకే అంటే సరిపోతుందన్న మాట’ ‘నా సంగతి వొదిలిపెట్టవోయ్. నీ పెళ్లికి ఎవరు ఓకే అంటే సరిపోతుంది?’ ‘మా అమ్మ. నువ్వు ఆమె ఒక్కదాన్ని ఇంప్రెస్ చేస్తే చాలు’ ‘మొదట నువ్వు నన్ను ఇంప్రెస్ చేయి. తర్వాత ఆమెను నేను ఇంప్రెస్ చేసే సంగతి ఆలోచిస్తాను’ జమీల్యా, కృష్ణకాంత్ ప్రేమలో పడ్డారు.
కృష్ణకాంత్ అద్భుతమైన కుర్రవాడు. చక్కగా ఉంటాడు. చక్కగా మాట్లాడతాడు. బ్లూకలర్ ట్రౌజర్స్‌లో ఫుల్‌హ్యాండ్స్ వైట్‌షర్ట్ ఇన్ చేశాడంటే చీల్చిన వెదురుబద్దలా తళతళా మెరుస్తాడు. ఇద్దరూ ఒకే ఆఫీస్‌లో ఉద్యోగం. ఆఫీసూ ఇల్లూ తప్ప వేరే ఏమీ తెలియని కృష్ణకాంత్‌ని జమీల్యా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ చూపించింది. ఖాదిర్ అలీబేగ్ థియేటర్ ఫెస్టివల్‌కు తీసుకెళ్లి నాటకాలు చూపించింది. లామకాన్ తీసుకెళ్లింది. ఒకటి రెండు ధర్నాలను కనీసం దూరం నుంచి చూపించింది. ఎప్పుడూ నవ్వుతూ, ధైర్యంగా, చేతనతో ఉండే జమీల్యాను చూస్తే కృష్ణకాంత్‌కు చాలా ఇష్టం. ఎప్పుడూ సహృదయంగా ఆర్ద్రంగా ఉండే కృష్ణకాంత్ అంటే జమీల్యాకు కూడా. కానీ.. కృష్ణకాంత్ ఆ రోజు చాలా డిప్రెస్డ్‌గా కనిపించాడు జమీల్యాకు. ‘ఏంటి సంగతి?’ అడిగింది. ‘నిన్ను కోల్పోతాననే భయం ఎక్కువైంది’ అన్నాడు. ‘ఎందుకు?’ ‘మా అమ్మ చాదస్తం మనిషి. నాన్న చనిపోయాక నా కోసమే బతికింది.
ఆ వొంటరితనంలో పూజలు, పునస్కారాలు అంటూ వేరే ప్రపంచంలోకి వెళ్లిపోయింది. కోడలు కూడా అలాగే ఉండాలని అనుకుంటోంది. దైవకృప ఒక్కటే మనిషిని కాపాడుతుందని ఆమెకు నమ్మకం. నీకు ఇవన్నీ తెలియదు. ఎలా?’ జమీల్యకు కూడా భయం వేసింది. భయం కాబోయే అత్తగారి గురించి కాదు. కృష్ణకాంత్‌ను ఎక్కడ మిస్సవుతుందోనని. ‘నువ్వు నాకు కావాలి’ అంది జమీల్యా. ‘మా అమ్మను దాటితేనే నా దాకా రాగలవు జమీల్యా’ తల వొంచుకుంటూ కంట తడితో అన్నాడు కృష్ణకాంత్. మొదట జమీల్యా పేరు జయలక్ష్మిగా మార్చింది వర్థనమ్మ. ‘మా ఇంట్లో ఈ పేరుతోనే పిలుచుకుంటాం’ అని జమీల్యా అమ్మా నాన్నలకు చెప్పింది. వాళ్లు ఇబ్బందిగా చూసినా జమీల్యా తేలగొట్టేసింది. ‘అలాగే అత్తయ్యా’ అంది. కృష్ణకాంత్ ఇల్లు చాలా బాగుంది. మంచి కాలనీలో ఉంది. ఉన్నది అత్తయ్య, కృష్ణకాంత్, జమీల్యా. హాయిగా చక్కదిద్దుకోవచ్చు అనుకుంది. ‘ఉద్యోగం చేసింది చాల్లే జయ. ఆడదానికి మొగుడి ధ్యాసే ఉండాలిగానీ వేరే గోల ఎందుకు’ అంది వర్థనమ్మ.
ఇది చాలా పెద్ద దెబ్బ. ‘ముందు సరే అను. మెల్లగా నచ్చచెబుదాం’ అన్నాడు కృష్ణకాంత్. ‘అలాగే అత్తయ్య’ అంది జయ. జయకు టీ అలవాటంటే వర్థనమ్మ వంక పెట్టింది. కాఫీ అలవాటు చేసుకుంది. లేటుగా లేచే అలవాటు ఉందంటే వర్థనమ్మ వంక పెట్టింది. తొందరగా లేచే అలవాటు చేసుకుంది. పంజాబీ డ్రస్సులు, షార్ట్ హెయిర్ అంటే వర్థనమ్మ వంక పెట్టింది. జడ, పూలు, చీర, బొట్టు.. కొత్త ఆహార్యం వచ్చేసింది. పుస్తకాలు చదువుతుంటే వంక పెట్టింది. వర్థనమ్మతో కలిసి మధ్యాహ్నం సీరియల్స్ చూడటం తప్పనిసరి చేసుకుంది. వారంలో రెండుసార్లు సాయంత్రాలు వర్థనమ్మ కోసం గుడికి వెళ్లడం. ఇంట్లో ఏదో ఒక వ్రతమో పూజో వర్థనమ్మ కోసం చేయడం. స్వాములారు యూ ట్యూబ్‌లో ఏమన్నారో వర్థనమ్మకు చూపించడం... ఒక పెద్ద సీసా వర్థనమ్మ అయితే ఆమె మూసబోసిన చిన్నసీసాలో తాను కుదురుకోవడం మొదలెట్టింది జయ. ‘నేను రెండు మనుషులుగా మారాను కృష్ణ. ఒకటి జయగా. రెండు జమీల్యాగా. జమీల్యా చనిపోవడం నాకు తెలుస్తూ ఉంది’ అని ఒకరోజు బాధపడింది భర్త దగ్గర.
కాని ఈ ఇల్లు వీడటం, అతన్ని వీడటం ఆమెకు ఇష్టం లేదు. అవి కావాలంటే వర్థనమ్మను కావాలనుకోవాలి. అనుక్షణం ఆమెను సంతోషపెడుతూ ఉండాలి. అందుకోసం తనను తాను చంపుకుంటూ ఉండాలి. ‘ఏంటి అన్నిసార్లు చేతులు కడుగుతున్నావ్?’ అన్నాడు కృష్ణకాంత్ ఒకరోజు జయను చూస్తూ. ‘కడిగిందే కడుగుతున్నానా?’ ‘అవును’ ‘అత్తయ్యకు పరిశుభ్రత ఎక్కువ కదా. మురికి చేతులు అంటుందని’ అంది జయ. రోజులు గడిచే కొద్దీ జయ పనులు చాదస్తంగా మారాయి. దుప్పట్లు మాటిమాటికి సరి చేయడం, చెప్పులు మాటిమాటికి సర్దడం, పూజగదిలో పటాలు మాటిమాటికి తుడవడం, ఇంటిని మాటిమాటికి చిమ్మడం, రోజుకు మూడుసార్లు స్నానం చేయడం, పదే పదే దేవుడికి దండం పెట్టుకోవడం... ఆమెలో మెల్లగా నెగెటివిటి పెరిగిపోయింది... ఏ తప్పు చేసి అత్తయ్య మనసును నొప్పించి తద్వారా కృష్ణకాంత్‌ను కోల్పోతానో అనే భయంతో ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’లోకి వెళ్లిపోయింది.
‘సముద్రంలోని చేపను బకెట్‌లో పడేశాను’ అనుకున్నాడు కృష్ణకాంత్ ఒకరోజు. ‘ప్రాబ్లమ్ నీలో, నీ భార్యలో లేదు కృష్ణ. ముందు మీ అమ్మను తీసుకురా’ అన్నాడు సైకియాట్రిస్ట్ కృష్ణతో, జయను చూశాక. జయ కేసంతా విన్నాక ఆమెకు కొద్దిపాటి మందులు అవసరమయ్యాయి. కాని అసలు కౌన్సెలింగ్ వర్థనమ్మకే ఇవ్వాల్సి వచ్చింది. ‘చూడండమ్మా... అత్తయ్యలు కోడళ్లని మార్చుకోవాలనుకోవడం మంచిదే. కాని మీరు మాయం చేసేస్తున్నారు. మిమ్మల్ని, మీ అబ్బాయిని జయ చాలా ప్రేమిస్తూ ఉండటం వల్లే మీ ఆటలు సాగుతున్నాయి. జయ స్థానంలో మీ అమ్మాయిని ఊహించుకోండి. మీరు మీ అమ్మాయిని అత్తగారింటికి పంపాక ఆమె పేరు మార్చేసి, పద్ధతి మార్చేసి, తిండి తిప్పలు మార్చేసి, అలవాట్లు మార్చేసి, ఆఖరుకు ఉద్యోగం కూడా పీకించేస్తే మీరేం చేస్తారు.
ఊరుకుంటారా? అసలు మీరు జయను కోడలిగా ఎందుకు చూస్తున్నారు? కూతురిలా చూడొచ్చు కదా. అప్పుడు ఆమె మీలో భాగం అవుతుంది. ఆమె సంతోషం మీ సంతోషం అవుతుంది. ఆమె స్వేచ్ఛ మీకు ఆనందం ఇస్తుంది. మీ అల్లుడు మీ కూతురిని ఎలా చూసుకోవాలనుకుంటాడో మీ అబ్బాయి మీ కోడలిని అలా చూడాలని అనుకోండి. ఆ అమ్మాయి నలిగిపోతోంది. ఆమెను కోడలిగా ఉండనివ్వండి. ఇంకో అత్తగారిలా కాదు’ అన్నాడు. వర్థనమ్మ మొదట తొట్రు పడింది. మెల్లగా ఆమెకు కొడుకు కోడలు పరిస్థితి అర్థమయ్యింది. ఆ మరుసటి రోజు జయ నిద్ర లేచాక వర్థనమ్మ అడిగిన మొదటి ప్రశ్న ‘టీ తాగుతావా జమీల్యా’.
కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి,
సైకియాట్రిస్ట్
Comments
Please login to add a commentAdd a comment