
లక్నో: గృహ హింస చట్టం కింద రక్షణ కోరే అవకాశం కుటుంబంలోని ప్రతీ స్త్రీకి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు తన తాజా తీర్పులో స్పష్టం చేసింది. కేవలం అది కోడలకు మాత్రమే నిర్దేశించిన చట్టం మాత్రమే కాదని, అత్తకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని తెలిపింది. తనకు కోడలు పెట్టే గృహ హింస నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
అది కేవలం కోడళ్లకు మాత్రమే ఉద్దేశించిన చట్టం మాత్రమే కాదని, కుటుంబంలో ఎవరైనా స్త్రీ దీనికి అర్హులేనని పేర్కొంది. జస్టిస్ అలోక్ మాథుర్ నేతృత్వంలోని హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. గృహ హింస ఫిర్యాదులో తన అత్త దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి మేజిస్ట్రేట్ జారీ చేసిన సమన్లను కోడలు, ఆమె తరుఫు బంధువులు సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లారు. ఇకడ కోడలు పిటిషన్‌ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు.. మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును జస్టిస్ అలోక్ మాథుర్ నేతృత్వంలోని హైకోర్టు సమర్ధించింది.
అది కేవలం కోడళ్ల చట్టమంటూ హైకోర్టుకు..
ఆ చట్టం అనేది కేవలం కోడళ్లకి మాత్రమే ఉద్దేశించబడినదంటూ హైకోర్టుకు వెళ్లింది కోడలు. గృహ హింస చట్టం అనేది కోడళ్లకు మాత్రమే చేయబడిదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మేజిస్ట్రేట్ తీర్పును సవాల్ చేసింది. దీన్ని కొట్టివేసేన హైకోర్టు,..గృహ హింసకు గురయ్యే ప్రతీ మహిళకి ఈ చట్టం వర్తిస్తుందని తెలిపింది. ఇది కేవలం కోడళ్లకి మాత్రమే చేయబడిన చట్టం కాదని చురకలంటించింది. డీసీ(డొమస్టిక్ వయెలెన్స్) చట్టంలోని సెక్షన్ 12 కింద కుటుంబంలోని ఏ స్త్రీ అయినా రక్షణ కోరవచ్చని తెలిపింది.
ఇంతకీ కేసు ఏంటంటే..!
యూపీ రాష్ట్రానికి చెందిన గరిమా అనే మహిళ సుధా మిశ్రాను వేధింపులకు గురి చేయడంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. రాయబేరీలోని సొంత ఇంటి నుంచి వెళ్లిపోదామని భర్తపై గరిమా పదే పదే ఒత్తిడి తెచ్చింది. దాన్ని తన కొడుకు తిరస్కరించడంతో తనపై కోడలు వేధింపులు అధికమైనట్లు అత్త సుధా మిశ్రా పేర్కొంది.. అదే సమయంలో తన ఇంటి నుంచి కోడలు గరిమా, ఆమె తరఫు బంధులతో కలిసి బలవంతంగా డబ్బును, బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు ఆమె తెలిపింది. దీనిపై గృహ హింస చట్టం కింద కోర్టును ఆశ్రయించింది.