Daughter-in-law
-
రోడ్డెక్కిన అత్తాకోడళ్లు.. చూసి తీరాల్సిందే!
అత్తాకోడళ్లంటే శత్రువులు అనే భావన చాలామందిలో స్థిరపడిపోయింది. వీరి మధ్య జరిగే వివాదాలను టీవీ సీరియళ్లలో ఆసక్తికరంగా చూపిస్తుంటారు. చిన్నపాటి విషయానికే కొందరు అత్తాకోడళ్లు తెగ తిట్టేసుకుంటారని, కొట్టేసుకుంటారనే ఆరోపణలు వినిపిస్తుంటాయ. తాజాగా అత్తాకోడళ్లకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది.మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో రోడ్డున పడిన అత్తాకోడళ్ల ఉదంతం చోటుచేసుకుంది. సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోలో అత్తాకోడళ్లు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని, కొట్టుకున్న దృశ్యం కనిపిస్తుంది. ఒకరిపై మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పరస్పరం తిట్టుకోవడంతో పాటు దుస్తులు చించుకునే వరకూ వెళ్లడాన్ని ఈ వీడియోలొ చూడవచ్చు. వారి కుటుంబ సభ్యులు అత్తాకోడళ్లను విడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఏ మాత్రం ఫలితం ఉండదు. Kalesh b/w Mother-in-Law and Daughter-in-Law Outside Court, Nashik MHpic.twitter.com/QAjcpr6sYu— Ghar Ke Kalesh (@gharkekalesh) February 21, 2025ఈ అత్తాకోడళ్లు(Daughter-in-laws) యద్ధంలో ముందుగా అత్త తన కోడలి జుట్టు పట్టుకుని కింద పడేస్తుంది. అయితే కోడలు తాను ఏం తక్కువ తిన్నానంటూ అత్తపై దాడికి దిగుతుంది. ఈ వీడియోలో నల్ల చీర కట్టుకున్న ఒక మహిళ అత్తా కోడళ్ల యుద్దానికి ఆజ్యం పోస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ దృశ్యం కుటుంబ కలహాలకు మించిన రేంజ్లో ఉంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేశాక పరిస్థితి అదుపులోకి వచ్చిందని సమాచారం. ఇది కూడా చదవండి: Mahashivratri: మహాశివరాత్రి ఎలా మొదలయ్యిందంటే.. -
కోడలికి హెచ్ఐవీ ఇంజక్షన్
హరిద్వార్: అడిగినంత కట్నం ఇవ్వలేదని కోడలికి ఏకంగా హెచ్ఐవీ సోకిన ఇంజెక్షన్ ఇచ్చిన అత్తామామల అమానుషత్వమిది. ఉత్తరాఖండ్‌లో హరిద్వార్‌లోని జస్వవాలాలో ఈ దారుణం జరిగింది. నాతిరామ్ సైనీ కుమారుడు అభిõÙక్కు రెండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోనాల్ సైనీతో పెళ్లయింది. కట్నంగా రూ.15 లక్షల నగదు, కారు ఇచ్చారు. కొంతకాలానికే అత్తమామలు స్కారి్పయో కారు, రూ.25 లక్షలు డిమాండ్ చేయడం ప్రారంభించారు. యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో కోడలిని ఇంటి నుంచి గెంటేశారు. గ్రామంలో పంచాయతీ పెట్టి తిరిగి అత్తారింటికి పంపించారు. శారీరకంగా, మానసికంగా హింసించడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్తే హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. భర్తకు మాత్రం నెగిటివ్ వచ్చింది. షాక్‌కు గురైన యువతి తల్లిదండ్రులు అత్తామామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టించుకోకపోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు భర్త, అత్తమామ, ఇతర కుటుంబీకులపై వరకట్న వేధింపులు, దాడి, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
మహిళల మీద రేప్ కేసు?
న్యూఢిల్లీ: అత్యాచార సంఘటనల్లో మహిళలే బాధితులుగా ఉంటారు. మరి వారి మీద రేప్ కేసు పెట్టొచ్చా? దీనిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రేప్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఒక 61 ఏళ్ల మహిళ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సదరు మహిళపై కోడలు రేప్ కేసు పెట్టింది. కేసును జస్టిస్ హృషికేశ్, జస్టిస్ సంజయ్‌ల ధర్మాసనం విచారించింది. చట్టప్రకారం మహిళలపై ఇలా రేప్ కేసు పెట్టలేరని ఆమె తరఫు న్యాయవాది గుర్తు చేశారు. ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువర్చిందని గుర్తుచేశారు. దీంతో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందన తెలిపాలని ఆదేశించింది. -
పీఎంకే ఎమ్మెల్యేపై వరకట్నం కేసు
సాక్షి, చైన్నె: పీఎంకే ఎమ్మెల్యే సదాశివం కుటుంబంపై వరకట్నం కేసు నమోదైంది. తనను కొద్దిరోజులుగా వేధిస్తున్నట్లు కోడలు ఇచ్చిన ఫిర్యాదుతో సూరమంగలం మహిళా పోలీసులు మంగళవారం రంగంలోకి దిగారు. వివరాలు.. సేలం జిల్లా మేట్టూరు పీఎంకే ఎమ్మెల్యేగా సదా శివం వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు శంకర్‌కు 2019లో సర్కారు కొల్లపట్టికి చెందిన మనోలియాతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఏడాదిన్నర బిడ్డ ఉంది. ఈ పరిస్థితుల్లో తన భర్త శంకర్, మామ సదాశివం, అత్త బేబి, ఆడపడుచు కలైవాణి వరకట్నం కోసం తీవ్రంగా వేధిస్తున్నట్లు మనోలియా ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబంపై ఆరు సెక్షన్లతో కేసు నమోదైంది. కాగా విచారణకు రావాలని ఎమెల్యేకు మంగళవారం మహిళా పోలీసు స్టేషన్ అధికారులు సమన్లు జారీ చేశారు. -
ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిన అత్త.. భర్త కోసం భార్య పోరాటం
తెనాలి రూరల్(గుంటూరు జిల్లా): కట్నం ఇవ్వడం ఆలస్యమైందని తన భర్తతో కాపురం చేయనివ్వకుండా అత్తింటి వారు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఒక వివాహిత అత్తింటి ముందు ధర్నాకు దిగింది. తన భర్త విడాకుల నోటీసు పంపాడని, తనకు భర్త కావాలని డిమాండ్ చేస్తోంది. ఆమె కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన దాసరి ప్రేమస్వరూపకు పట్టణ ఐతానగర్ జయప్రకాష్‌నగర్‌కు చెందిన తోటకూర పవన్‌తో 2014లో వివాహమైంది. వివాహం సందర్భంగా రూ.5 లక్షలు కట్నం ఇస్తామని ప్రేమస్వరూప పుట్టింటి వారు అంగీకరించారు. చదవండి: ఉమెన్స్ బ్యూటీ పార్లర్.. ఆమె డాబూ దర్పం చూసి.. చివరికి లబోదిబో.. పెళ్లి అయినా కట్నం డబ్బులు ఇవ్వకపోవడంతో కేవలం ఆరు నెలలకే పుట్టింటికి పంపారని, అప్పటి నుంచి తన భర్తతో కాపురం చేయనీయకుండ అత్త, మామ, ఆడపడుచు అడ్డుకుంటున్నారని ప్రేమస్వరూప ఆరోపించింది. తన భర్త నుంచి విడాకుల నోటీసు రావడంతో, తాము కట్నం డబ్బులు ఇవ్వడానికి శనివారం సాయంత్రం రాగా, తన అత్త ఇంట్లోకి రానివ్వకుండా తాళం వేసి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని, భర్తతో కలసి ఉండేలా చూడాలని ప్రాధేయపడుతోంది. సమాచారమందుకున్న టూ టౌన్ పోలీసులు పవన్ ఇంటికి వచ్చి బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు తన కుటుంబసభ్యులు, బంధువులతో కలసి పవన్ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపింది. అయితే ప్రేమస్వరూప గతంలో ఆమె అత్తింటి వారిపై 498ఏ కేసు పెట్టిందని, ప్రస్తుతం కోర్టులో కేసులు నడుస్తున్నాయని, బాధితురాలు, ఆమె తరఫు వారితో మాట్లాడుతున్నామని సీఐ బి.కోటేశ్వరరావు తెలిపారు. -
అన్నం పెట్టడం లేదని కొడుకుతో చెప్పిన తల్లి.. కోడలు క్షణికావేశంలో..
అనంతపురం క్రైం: అత్త తిట్లు భరించలేక ఓ కోడలు నిప్పంటించుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. నగరంలోని మున్నానగర్‌కు చెందిన ఫైనాన్స్ వ్యాపారి పోతులయ్య, బోయ లక్ష్మి దంపతులు. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ముగ్గురు సంతానం. ఈ నెల 6న సాయంత్రం అత్తాకోడలి మధ్య వాగ్వాదం జరిగింది. తనను పట్టించుకోవడం లేదని, అన్నం సక్రమంగా పెట్టడం లేదంటూ కొడుకు పోతులయ్యతో ఈశ్వరమ్మ చెప్పి కోడలిని దూషించింది. కాసేపటికే పోతులయ్య బయటకు వెళ్లగా, ఇంట్లో అత్త, పిల్లలుండగానే లక్ష్మి క్షణికావేశంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈశ్వరమ్మ అరుపులతో చుట్టుపక్కల వారు చేరుకుని మంటలార్పారు. అనంతరం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ గౌస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (చదవండి: Custard Apple: ప్రాణం తీసిన సీతాఫలం) -
ప్రియుడి మోజులో పడి: చెల్లెకు సహకరించిన అన్న, బావ
మదనపల్లె టౌన్ : మామ హత్య కేసులో కోడలు, ఆమెకు అండగా నిలచిన సోదరుడు, బావను అరెస్ట్ చేసినట్లు శుక్రవారం టూటౌన్ సీఐ నరసింహులు, ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. వారి కథనం.. కురబలకోట మండలం, తెట్టు గ్రామం, ఎస్సీ కాలనీకి చెందిన వేణుగోపాలు పెయింట్ పనులు చేస్తూ తన భార్య తులసమ్మను ఉన్నత చదువులు చదివించాడు. ఆపై, ఆమెకు స్థానిక బర్మావీధిలోని 9వ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరాక ఆమె తీరు మారింది. తరచూ ఫోన్లో ఎవరితోనే ఆమె మాట్లాడుతుండడంతో వేణుగోపాలు అనుమానించాడు. ఈ నెల 2న ఆమె కార్యాలయం వద్ద ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో వేణుగోపాలు ఆ ఫోన్ లాక్కుని పరిశీలించాడు. ఆమె ప్రియునితో మాట్లాడుతోందని తెలుసుకుని తనతండ్రితోపాటు తులసమ్మ తల్లిదండ్రులు, బావకు సమాచారం ఇచ్చాడు. ఈ వ్యవహారమేమిటో తేల్చాలని అక్కడే పంచాయితీ పెట్టాడు. ఇందుకోసం వచ్చిన వేణుగోపాలు తండ్రి బి.ఓబులేసు (64)పై తులసమ్మ (30), ఆమె సోదరుడు రెడ్డెప్ప (43), ఇసుకనూతిపల్లెకు చెందిన ఆమె బావ ఆదెప్ప (45) దాడిచేసి కొట్టారు. దాడిలో ఓబులేసు మృతిచెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్టు చేశారు. -
తిరుగుబోతు భర్త.. కీచక మామ: బాత్రూమ్లో సీసీ కెమెరాలు
గుంటూరు ఈస్ట్: తిరుగుబోతు భర్త.. కీచక మామల నుంచి తన కుమార్తెకు రక్షణ కల్పించాలని ఓ మహిళ పోలీసులను వేడుకుంది. అర్బన్ ఎస్పీ సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వచ్చిన ఓ మహిళ తన గోడు వెల్లబోసుకుంది. వారు తెలిపిన వివరాలు.. డొంకరోడ్డుకు చెందిన ఎలినేని సందీప్ మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. 2016 సంవత్సరంలో శ్రీనగర్‌కు చెందిన స్వాతితో వివాహం అయింది. సందీప్ టిక్‌టాక్ ద్వారా పరిచయం అయిన అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని జల్సాగా తిరిగేవాడు. స్నేహితురాలు అంటూ ఓ మహిళను తరచూ ఇంటికి తీసుకువచ్చేవాడు. సందీప్ తల్లి పద్మావతి కూడా అతనికే వత్తాసు పలికింది. 2017 సంవత్సరంలో ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేసే పద్మావతి అనారోగ్యంతో మృతి చెందింది. కంభంపాడులో నివసించే సందీప్ తండ్రి శ్రీనివాసరావు తరచూ మా ఇంటికి వచ్చి స్వాతితో అసభ్యంగా ప్రవర్తించే వాడు. భర్తకు చెబితే తండ్రినే వెనుకేసుకుని వచ్చాడు. పద్మావతి ఉద్యోగం కుమారుడికి రావాలంటే శ్రీనివాసరావు ఎన్‌ఓసిపై సంతకం చేయాలి. ఈ కారణంగా తన తండ్రికి సహకరించమంటూ నా భర్త ప్రోత్సహించాడు. మామ శ్రీనివాసరావు బాత్రూమ్లో రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టాడు. కుమారుడిని ఇతర మహిళలతో తిరగకుండా బుద్ది చెప్పాలని, నాకు న్యాయం చేయాలని నా మామను కోరితే నాతో ఉండు నీకు న్యాయం చేస్తానంటూ దుర్మార్గంగా ప్రవర్తించాడు. అనంతర కాలంలో స్వాతికి, ఆమె కుమార్తెకు సరిగా తిండి పెట్టలేదు. మామ లైంగిక దాడికి యత్నించగా ఆమె ఎదురుతిరిగి ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తింది. నువ్వు లొంగక పోతే నీ కుమార్తె (2 సంవత్సరాల పాప) తో కోరిక తీర్చుకుంటానని పాపను లాక్కుని బెదిరించాడు. శారీరకంగా చిత్రహింసలు పెట్టాడు. 2018 డిసెంబర్లో బంధువుల సహాయంతో శ్రీనగర్‌లోని పుట్టింటికి చేరింది. ఒకరోజు భర్త ఇంటి ముందు ఉన్నాను బయటకు రమ్మంటే వెళ్లింది. కొందరు వ్యక్తులు ఆమెపై రాళ్లు విసిరారు. ఫిర్యాదు చేసేందుకు వస్తున్నానని తెలిసి చంపుతామని బెదిరించారు. నాకు, నా కుమార్తెకు ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాలని కోరింది. -
భర్త పోయి మూడేళ్లు: ఆస్తి కోసం ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్..
లక్నో: ఏడేళ్ల పాటు అన్యోన్యంగా సాగిన జీవితం. హఠాత్తుగా భర్త మరణించడంతో పిల్లలతో ఆమె ఒంటరైంది. అయితే భర్త మృతిచెందిన అనంతరం వేరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. కొన్నాళ్లకు ఆమె తన భర్తకు సంబంధించిన ఆస్తిపై కన్నుపడింది. న్యాయంగా అడగాల్సి ఉండగా.. అడగకుండా లాక్కోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి మామను హతమార్చింది. కిరాయి హంతకులను మాట్లాడి మామను అంతమొందించిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మావనా పోలీస్‌స్టేషన్ పరిధిలోని తాటిన గ్రామానికి చెందిన సత్పాల్ కుమారుడు సంజీవ్‌కు పాలి గ్రామానికి చెందిన శాలినితో 2014లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే 2018లో భర్త సంజీవ్ మరణించాడు. దీంతో భార్య శాలిని పుట్టింపటికి వచ్చేసి ఉంటోంది. ఈ క్రమంలో ఆమె తన చిన్ననాటి స్నేహితుడు విపిన్‌తో వివాహేతర సంబంధం కొనసాగింది. కొన్ని రోజులకు తన భర్తకు సంబంధించిన ఆస్తిపై మనసు పడింది. ఈ విషయమై మామ సత్పాల్తో వివాదం కొనసాగుతోంది. మామ నుంచి ఎలాగైనా ఆస్తి కొట్టేయాలని ప్లాన్ వేసింది. ఈ విషయాన్ని తన ప్రియుడు విపిన్‌కు చెప్పింది. మామ సత్పాల్ను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. సత్పాల్ను హతమార్చేందుకు ఓ కిరాయి ముఠాను సంప్రదించారు. వారితో ఒప్పందం కుదుర్చుకుని కొంత ముందస్తుగా డబ్బులు చెల్లించారు. సత్పాల్ హత్యకు రెక్కీ నిర్వహించి ముహూర్తం కూడా నిర్ణయించారు. అందులో భాగంగా జూన్ 29వ తేదీన పొలం నుంచి తిరిగివస్తున్న సత్పాల్ను ముఠా వెంబడించి తుపాకీతో కాల్చి అతి దారుణంగా హతమార్చింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా కోడలి ఉదంతం వెలుగులోకి వచ్చింది. సత్పాల్ హత్యకు శాలిని తండ్రి భోపాల్ సింగ్, సోదరుడు లలిత్ కూడా సహకరించారు. వీరితో పాటు ప్రియుడు విపిన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హంతక ముఠా ఆచూకీ మాత్రం లభించలేదు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మీరట్ జిల్లాలో కలకలం సృష్టించిన ఈ ఘటనను పోలీసులు 20 రోజుల వ్యవధిలో చేధించడం విశేషం. -
కోడలి కోసం నాలుక కోసుకున్న అత్త
రాంచీ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా కొంత మంది ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. కలియుగం నుంచి కంప్యూటర్ యుగం వరకు మానవుడు ఎంతగానో వైజ్ఞానిక అభివృద్ధి సాధించినా.. సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించలేకపోతున్నారు. మూఢనమ్మకంతో తాజాగా ఓ మహిళ తన నాలుకనే కోసుకుంది. తప్పిపోయిన కోడలు సురక్షితంగా తిరిగి రావాలంటూ శివుడికి నాలుకను సమర్పించింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్సావన్ జిల్లాలోని ఎన్ఐటీ క్యాంపస్‌లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ఐటీ క్యాంపస్‌కు చెందిన లక్ష్మీ నిరాలా కోడలు జ్యోతి ఆగస్ట్ 14న తన బిడ్డతో కలిసి తప్పిపోయింది. అప్పటి నుంచి లక్ష్మీ శివుడి గుడి ముందు కూర్చొని ప్రార్థిస్తూ ఉంది. తన కోడలు సురక్షితం తిరిగి ఇంటికి రావాలని తన నాలుకను కత్తిరించుకుంది. శివుడికి నాలుకను సమర్పిస్తే కోడలు తిరిగి వస్తుందని ఎవరో చెప్పుడంతో ఆమె అలా చేసిందని లక్ష్మి భర్త నందూలాల్ నిరాల చెప్పారు. నాలుక కత్తిరించుకున్న అనంతరం రక్తస్రావం అవుతున్నప్పటికీ ఆమె ఆస్పత్రికి వెళ్లడానికి నిరాకరించారు. ఇరుగుపొరుగు వాళ్లు నచ్చజెప్పి ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నాలుక పూర్తిగా తెగడంతో మాట్లాడలేకపోతున్నారని వైద్యులు పేర్కొన్నారు. అలాగే తప్పిపోయిన జ్యోతి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
అలాగే అత్తయ్యా
ఇంటికి కోడలు వస్తే బాగుంటుంది. ఇంటిని చక్కదిద్దే, ఇంటికి శక్తినిచ్చే కోడలు వస్తే నిజంగా బాగుంటుంది. తప్పును తప్పు అని ఒప్పుని ఒప్పు అని, ఇష్టం ఉన్నది ఇష్టం ఉన్నది అని ఇష్టం లేనిది ఇష్టం లేదు అని చెప్పే కోడలు వస్తే బాగుంటుంది. జవ జీవాలు ఉన్న, చేవ ఉన్న కోడలు వస్తే బాగుంటుంది. వినయ విధేయతలతో పాటు ఆత్మగౌరవం ఉన్న కోడలు వస్తే బాగుంటుంది. అంతే తప్ప మర బొమ్మ వస్తే బాగుంటుందా? అలాగే అత్తయ్యా అని తలాడించే కోడలు వస్తే బాగుంటుందా? ‘జమీల్యా.. ఇదేం పేరు?’ అని అడిగాడతను పరిచయమైన కొత్తలో. కాచిన పాలరంగులో ఉన్న ముఖం మీది వెంట్రుకలను తోసుకుంటూ నవ్వి ‘ఇది మా నాన్న పెట్టిన పేరు. ఏదో రష్యన్ నవలలో హీరోయిన్ అట’ అందా అమ్మాయి. ‘ఇప్పుడు నిన్ను ఇంప్రెస్ చేయాలంటే నేను ఓల్గా నదిలో మూడు మునకలేసి రావాలా?’ నవ్వాడు. ‘గర్జించు రష్యా.. గాండ్రించు రష్యా అని శ్రీశ్రీకు మల్లే కవిత్వం చెప్పాల్సిన పని కూడా లేదులే’ మళ్లీ నవ్వింది. ‘మీ అన్న పేరు స్టాలిన్ కదూ’ ‘పేరుకే స్టాలిన్. వాడు లోకమే తెలియకుండా పెరిగి లోకమే తెలియనివ్వని సాఫ్ట్వేర్ రంగంలో పని చేయడానికని సింగపూర్ వెళ్లిపోయాడ్లే’ ‘సో.. నీ పెళ్లికి మీ అమ్మా నాన్నా ఓకే అంటే సరిపోతుందన్న మాట’ ‘నా సంగతి వొదిలిపెట్టవోయ్. నీ పెళ్లికి ఎవరు ఓకే అంటే సరిపోతుంది?’ ‘మా అమ్మ. నువ్వు ఆమె ఒక్కదాన్ని ఇంప్రెస్ చేస్తే చాలు’ ‘మొదట నువ్వు నన్ను ఇంప్రెస్ చేయి. తర్వాత ఆమెను నేను ఇంప్రెస్ చేసే సంగతి ఆలోచిస్తాను’ జమీల్యా, కృష్ణకాంత్ ప్రేమలో పడ్డారు. కృష్ణకాంత్ అద్భుతమైన కుర్రవాడు. చక్కగా ఉంటాడు. చక్కగా మాట్లాడతాడు. బ్లూకలర్ ట్రౌజర్స్‌లో ఫుల్‌హ్యాండ్స్ వైట్‌షర్ట్ ఇన్ చేశాడంటే చీల్చిన వెదురుబద్దలా తళతళా మెరుస్తాడు. ఇద్దరూ ఒకే ఆఫీస్‌లో ఉద్యోగం. ఆఫీసూ ఇల్లూ తప్ప వేరే ఏమీ తెలియని కృష్ణకాంత్‌ని జమీల్యా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ చూపించింది. ఖాదిర్ అలీబేగ్ థియేటర్ ఫెస్టివల్‌కు తీసుకెళ్లి నాటకాలు చూపించింది. లామకాన్ తీసుకెళ్లింది. ఒకటి రెండు ధర్నాలను కనీసం దూరం నుంచి చూపించింది. ఎప్పుడూ నవ్వుతూ, ధైర్యంగా, చేతనతో ఉండే జమీల్యాను చూస్తే కృష్ణకాంత్‌కు చాలా ఇష్టం. ఎప్పుడూ సహృదయంగా ఆర్ద్రంగా ఉండే కృష్ణకాంత్ అంటే జమీల్యాకు కూడా. కానీ.. కృష్ణకాంత్ ఆ రోజు చాలా డిప్రెస్డ్గా కనిపించాడు జమీల్యాకు. ‘ఏంటి సంగతి?’ అడిగింది. ‘నిన్ను కోల్పోతాననే భయం ఎక్కువైంది’ అన్నాడు. ‘ఎందుకు?’ ‘మా అమ్మ చాదస్తం మనిషి. నాన్న చనిపోయాక నా కోసమే బతికింది. ఆ వొంటరితనంలో పూజలు, పునస్కారాలు అంటూ వేరే ప్రపంచంలోకి వెళ్లిపోయింది. కోడలు కూడా అలాగే ఉండాలని అనుకుంటోంది. దైవకృప ఒక్కటే మనిషిని కాపాడుతుందని ఆమెకు నమ్మకం. నీకు ఇవన్నీ తెలియదు. ఎలా?’ జమీల్యకు కూడా భయం వేసింది. భయం కాబోయే అత్తగారి గురించి కాదు. కృష్ణకాంత్‌ను ఎక్కడ మిస్సవుతుందోనని. ‘నువ్వు నాకు కావాలి’ అంది జమీల్యా. ‘మా అమ్మను దాటితేనే నా దాకా రాగలవు జమీల్యా’ తల వొంచుకుంటూ కంట తడితో అన్నాడు కృష్ణకాంత్. మొదట జమీల్యా పేరు జయలక్ష్మిగా మార్చింది వర్థనమ్మ. ‘మా ఇంట్లో ఈ పేరుతోనే పిలుచుకుంటాం’ అని జమీల్యా అమ్మా నాన్నలకు చెప్పింది. వాళ్లు ఇబ్బందిగా చూసినా జమీల్యా తేలగొట్టేసింది. ‘అలాగే అత్తయ్యా’ అంది. కృష్ణకాంత్ ఇల్లు చాలా బాగుంది. మంచి కాలనీలో ఉంది. ఉన్నది అత్తయ్య, కృష్ణకాంత్, జమీల్యా. హాయిగా చక్కదిద్దుకోవచ్చు అనుకుంది. ‘ఉద్యోగం చేసింది చాల్లే జయ. ఆడదానికి మొగుడి ధ్యాసే ఉండాలిగానీ వేరే గోల ఎందుకు’ అంది వర్థనమ్మ. ఇది చాలా పెద్ద దెబ్బ. ‘ముందు సరే అను. మెల్లగా నచ్చచెబుదాం’ అన్నాడు కృష్ణకాంత్. ‘అలాగే అత్తయ్య’ అంది జయ. జయకు టీ అలవాటంటే వర్థనమ్మ వంక పెట్టింది. కాఫీ అలవాటు చేసుకుంది. లేటుగా లేచే అలవాటు ఉందంటే వర్థనమ్మ వంక పెట్టింది. తొందరగా లేచే అలవాటు చేసుకుంది. పంజాబీ డ్రస్సులు, షార్ట్ హెయిర్ అంటే వర్థనమ్మ వంక పెట్టింది. జడ, పూలు, చీర, బొట్టు.. కొత్త ఆహార్యం వచ్చేసింది. పుస్తకాలు చదువుతుంటే వంక పెట్టింది. వర్థనమ్మతో కలిసి మధ్యాహ్నం సీరియల్స్ చూడటం తప్పనిసరి చేసుకుంది. వారంలో రెండుసార్లు సాయంత్రాలు వర్థనమ్మ కోసం గుడికి వెళ్లడం. ఇంట్లో ఏదో ఒక వ్రతమో పూజో వర్థనమ్మ కోసం చేయడం. స్వాములారు యూ ట్యూబ్‌లో ఏమన్నారో వర్థనమ్మకు చూపించడం... ఒక పెద్ద సీసా వర్థనమ్మ అయితే ఆమె మూసబోసిన చిన్నసీసాలో తాను కుదురుకోవడం మొదలెట్టింది జయ. ‘నేను రెండు మనుషులుగా మారాను కృష్ణ. ఒకటి జయగా. రెండు జమీల్యాగా. జమీల్యా చనిపోవడం నాకు తెలుస్తూ ఉంది’ అని ఒకరోజు బాధపడింది భర్త దగ్గర. కాని ఈ ఇల్లు వీడటం, అతన్ని వీడటం ఆమెకు ఇష్టం లేదు. అవి కావాలంటే వర్థనమ్మను కావాలనుకోవాలి. అనుక్షణం ఆమెను సంతోషపెడుతూ ఉండాలి. అందుకోసం తనను తాను చంపుకుంటూ ఉండాలి. ‘ఏంటి అన్నిసార్లు చేతులు కడుగుతున్నావ్?’ అన్నాడు కృష్ణకాంత్ ఒకరోజు జయను చూస్తూ. ‘కడిగిందే కడుగుతున్నానా?’ ‘అవును’ ‘అత్తయ్యకు పరిశుభ్రత ఎక్కువ కదా. మురికి చేతులు అంటుందని’ అంది జయ. రోజులు గడిచే కొద్దీ జయ పనులు చాదస్తంగా మారాయి. దుప్పట్లు మాటిమాటికి సరి చేయడం, చెప్పులు మాటిమాటికి సర్దడం, పూజగదిలో పటాలు మాటిమాటికి తుడవడం, ఇంటిని మాటిమాటికి చిమ్మడం, రోజుకు మూడుసార్లు స్నానం చేయడం, పదే పదే దేవుడికి దండం పెట్టుకోవడం... ఆమెలో మెల్లగా నెగెటివిటి పెరిగిపోయింది... ఏ తప్పు చేసి అత్తయ్య మనసును నొప్పించి తద్వారా కృష్ణకాంత్‌ను కోల్పోతానో అనే భయంతో ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’లోకి వెళ్లిపోయింది. ‘సముద్రంలోని చేపను బకెట్లో పడేశాను’ అనుకున్నాడు కృష్ణకాంత్ ఒకరోజు. ‘ప్రాబ్లమ్ నీలో, నీ భార్యలో లేదు కృష్ణ. ముందు మీ అమ్మను తీసుకురా’ అన్నాడు సైకియాట్రిస్ట్ కృష్ణతో, జయను చూశాక. జయ కేసంతా విన్నాక ఆమెకు కొద్దిపాటి మందులు అవసరమయ్యాయి. కాని అసలు కౌన్సెలింగ్ వర్థనమ్మకే ఇవ్వాల్సి వచ్చింది. ‘చూడండమ్మా... అత్తయ్యలు కోడళ్లని మార్చుకోవాలనుకోవడం మంచిదే. కాని మీరు మాయం చేసేస్తున్నారు. మిమ్మల్ని, మీ అబ్బాయిని జయ చాలా ప్రేమిస్తూ ఉండటం వల్లే మీ ఆటలు సాగుతున్నాయి. జయ స్థానంలో మీ అమ్మాయిని ఊహించుకోండి. మీరు మీ అమ్మాయిని అత్తగారింటికి పంపాక ఆమె పేరు మార్చేసి, పద్ధతి మార్చేసి, తిండి తిప్పలు మార్చేసి, అలవాట్లు మార్చేసి, ఆఖరుకు ఉద్యోగం కూడా పీకించేస్తే మీరేం చేస్తారు. ఊరుకుంటారా? అసలు మీరు జయను కోడలిగా ఎందుకు చూస్తున్నారు? కూతురిలా చూడొచ్చు కదా. అప్పుడు ఆమె మీలో భాగం అవుతుంది. ఆమె సంతోషం మీ సంతోషం అవుతుంది. ఆమె స్వేచ్ఛ మీకు ఆనందం ఇస్తుంది. మీ అల్లుడు మీ కూతురిని ఎలా చూసుకోవాలనుకుంటాడో మీ అబ్బాయి మీ కోడలిని అలా చూడాలని అనుకోండి. ఆ అమ్మాయి నలిగిపోతోంది. ఆమెను కోడలిగా ఉండనివ్వండి. ఇంకో అత్తగారిలా కాదు’ అన్నాడు. వర్థనమ్మ మొదట తొట్రు పడింది. మెల్లగా ఆమెకు కొడుకు కోడలు పరిస్థితి అర్థమయ్యింది. ఆ మరుసటి రోజు జయ నిద్ర లేచాక వర్థనమ్మ అడిగిన మొదటి ప్రశ్న ‘టీ తాగుతావా జమీల్యా’. కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
ఇది ఆదర్శవంతమైన అత్త కథ
భువనేశ్వర్ : ఈ రోజుల్లో అత్తాకోడళ్లు ఎప్పుడూ పాము ముంగీసల్లా కలహించుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. అత్త వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డ కోడళ్లు చాలా మంది ఉన్నారు. ఒక కుటుంబంలో అత్తా కోడళ్ల మధ్య కలహాలు పక్కింట ముచ్చటగా మారడం సర్వసాధారణంగా కనబడుతోంది. తానూ ఒకప్పుడు కోడలినే అన్న విషయం మరిచి అందరిని వదులుకొని వచ్చిన ఓ ఇంటి ఆడపిల్లను కనికరం లేకుండా కష్ట పెడుతుంటారు అత్తలు. అత్తలు అంటే ఇలానే హింసిస్తారు అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఏర్పడింది. కానీ ఆ అభిప్రాయానికి చరమగీతం పాడుతూ... అత్తలో కూడా అమ్మ దాగి ఉంటుందని నిరూపించింది ఓ మహిళ. తల్లిలా మారి వితంతు కోడలికి మరో పెళ్లి చేసి అత్తలకు ఆదర్శంగా నిలిచింది. తన కుమారుడి అకాల మరణంతో ఒంటరిగా మారిన కోడలికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. పుట్టెడు దుఃఖంలోనూ ఓ ఇంటి ఆడపిల్ల గురించి పెద్ద మనసుతో ఆలోచించి నలుగురికి ఆదర్శంగా నిలిచారు ఒడిశాలోని అంగుల్ జిల్లా గోబరా గ్రామానికి చెందిన ప్రతిమా బెహరా. ఆమె ఆ గ్రామానికి ఒకప్పటి సర్పంచు కూడా. ఫిబ్రవరిలో పెళ్లి.. జూలైలో మృతి ప్రతిమ పెద్దకొడుకు రష్మీరంజన్, తురంగ గ్రామానికి చెందిన లిల్లీ బెహర్‌కు గత ఫిబ్రవరిలో అంగరంగా వైభవంగా వివాహం జరిగింది. కూతురిని సంతోషంగా అత్తింటికి పంపించారు లిల్లీ తల్లిదండ్రులు. తనకు మంచి భర్త దొరికాడని లిల్లి.. అందమైన భార్య దొరికిందని రష్మిరంజన్ ఆనందంగా తమ వైవివాహిక జీవితాన్ని గడుపుతున్నారు. ఇంతలోనే విధి వారి దాంపత్యాన్ని చూసి ఓర్వలేకపోయింది. పెళ్లయిన అయిదు నెలల్లోనే వారి ఆనందాలను బొగ్గు గని మింగేసింది. గత జూలైలో బొగ్గు గని ప్రమాదంలో రష్మిరంజన్ మృతి చెందాడు. దీంతో ప్రతిమ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. చెట్టంత కొడుకు పోయాడని ప్రతిమ.. భర్త ఇక లేడు అన్న విషయం లిల్లీ జీర్ణించుకోలేకపోయారు. కనీసం కోడలు జీవితం అయినా బాగుండాలని.. పోయిన కొడుకు ఎలాగో తిరిగి రాలేదు.. కనీసం తన కోడలి జీవితం అయినా బాగు చేయాలని ఆలోచించుకుంది ప్రతిమ. ఎవరు ఏమైనా అనుకున్న సరే తన కోడలికి మరో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. తన బంధువు కొడుకు సంగ్రామ్ బెహరాకు లిల్లీని ఇచ్చి వివాహం చేస్తానని, ఇందుకు ఒప్పకోవాల్సిందిగా ఆయన తల్లిదండ్రులను కోరింది. దీనికి సంగ్రామ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు కూడా ఓకే చెప్పారు. దీంతో వితంతువైన లిల్లీ పెళ్లిని ఈ నెల11న ఓ దేవాలయంలో ఘనంగా చేశారు. లిల్లీకి తల్లిగా మారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి చేశారు ప్రతిమ. ‘నా కొడుకు ఎలాగో తిరిగిరాడనే విషయం నాకు తెలుసు. నా కొడుకు లేని లోటును ఎవరూ తీర్చలేరు. ఈ కష్టాన్ని నా కోడలు పడొద్దు. తనకు ఇప్పుడు కేవలం 20 ఏళ్లే. ఒంటరిగా ఎన్ని ఏళ్లు అని జీవిస్తుంది. తన జీవితం అయినా బాగుండాలి అని మరో పెళ్లి చేశాను. తన జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను’ అని ప్రతిమా పేర్కొంది. కాగా ప్రతిమా చేసిన పనికి సామాజిక కార్యకర్త సుభాశ్రీ దాస్‌తో పాటు మరో పలువురు ప్రశంసిస్తున్నారు. అమ్మలా మారి అత్తలకు ఆదర్శంగా నిలిచిందని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
ఏడ దాగున్నాడో బావ?
వీడనిబంధం అనుకుంటాం. ముందు వెనుకలుగా వీడి వచ్చేస్తాం! మొదట ఆమె అయ్యారు. తర్వాత ఆయన అయ్యారు. ఆ సంగతి ఆమెకు తెలీదు. ‘ఏడ దాగున్నాడో బావ?’ అని నింగి నుంచి వెతుక్కుంటోంటే.. ఆ ఇంటి కోడలు.. మనసుకు హత్తుకునేలా అక్షరీకరించిన అత్తగారి అంతరంగ ఆవిష్కరణ ఇది. అగ్నిహోత్రావధాని గారి కాఫీ మగ్గు, హిందూ పేపరు, ఏష్ ట్రే, కళ్లజోడు, డెంచరు, మందులు, దువ్వెన, చెప్పులు అన్ని అక్కడే ఉన్నాయి. ‘మరి నా బావ కానరాడే?’ అని నలు దిశలా ఆత్రంగా వెదుకుతున్నాయి శేషమ్మ కళ్లు.ఏవండీ ఎక్కడున్నారు? సత్యశ్రీతో కూర్చుని టీవీ గానీ చూస్తున్నారా? మీరిద్దరి మాటలూ పొద్దుటి నుండీ వినబడలేదు. సడీ చప్పుడూ లేదు. వంటింట్లో కుక్కర్ మోతా లేదు. నానయ్య ‘హలో డాడ్, గుడ్‌మార్నింగ్’ అంటూ మెట్లు ఎక్కిన చప్పుడు కానీ, కాఫీ తాగండి నాన్గారు అన్నట్టుగా కూడా వినపడలేదు. ఏమిటీ భయంకర నిశబ్దం? ఎక్కడికి వెళ్లి వుంటారందరూ?మొన్నామధ్యన కాలిలో రాడ్ వేసినప్పటి నుంచీ ఏదో వొక నలత. అన్నం సహించట్లేదని మారాము చేస్తున్నారు. ‘తినకపోతే ఎలా బాబూ? వేళపట్టున గుప్పెడు మెతుకులు తినక పోతే ఎలా? అంటూ మీ పక్కన నేనుంటే మందలించి పెట్టేదాన్ని. మరి నన్ను ఈ ఫొటో ఫ్రేమ్‌లో రెండేళ్ల నాడే బంధింప చేసాడు ఆ పైవాడు. ఊర మిరపకాయలు, ఆవ పచ్చడి, పెరుగ్గారెలు, పండుమిరపకాయ పచ్చడి, సున్ని పొడి, పేరునెయ్యి అన్ని వేసి గోరుముద్దలు చేసిపెడ్దును. హుం. అనారు గింజలూ, కమలా పళ్లు, బత్తాయి రసం తేనెలో కలిపి ఇస్తే ఇష్టంగా తాగుతారని సత్యశ్రీకి తెలుసు. మరి మీరు తాగుతున్నారా? తమరికి ఇష్టమైన ద్రవంతో సరిపెట్టుకోకుండా పళ్ల రసం తాగండి అని ఎప్పుడూ చెప్పేదాన్ని. ‘అబ్బా తినండి, తాగండీ అని ఒకటే నస పెట్టబాకమ్మడూ’ అని మీరు కసిరినా పట్టువదలని విక్రమార్కురాలిలా పంతం గెలిచేదాన్ని! మీకు ఫుడ్ పెట్టేదాన్ని! పేంపర్ చేసేదాన్ని! మరి నేను వెళ్లిపోతే ఎలా మేనేజ్ చేస్తారో అన్న ఆలోచన గుబులు రేకెత్తించేది. మీకు భోజనం పెడ్తున్నప్పుడూ, ఆ పనీ ఈ పనీ చేసుకుంటున్నప్పుడూ, క్షీరసాగర శయన, వినరో భాగ్యము, శివశివ అనరాదా, శ్రీరామ నీనామ, నారాయణతే, సీతమ్మ మా అమ్మ అంటూ మిమ్మల్ని, ఆ దేవుడుని నా తోబుట్టువుల్నీ తల్చుకుంటూ హాపీగా కాలక్షేపం చేసిన ఎన్నెన్నో సందర్భాలు నెమరేసుకుంటూ ఉంటానండి. ఆ మధుర జ్ఞాపకాలే నాకు బోలెడంత సంతోషాన్ని ఇస్తాయి. ఒక్క క్షణం మీరు కళ్లెదురుగుండా లేకపోతే ఓ.. ఒకటే టెన్షను వస్తుంది బాబూ. శారీరకంగా అంతులేని అనంతలోకాలకి నేవెళ్లినా నా మనస్సెన్నడూ మీ గురించే ఆలోచిస్తుందండీ. ‘అమ్మడూ, నన్ను వదిలేసి వెళ్లిపోయావు, అరవై ఏళ్ల పైన కలసి కాపురం చేసాం’ అని మీరు అంటుంటే బాధగా ఉంటుంది. అయినా తప్పదు. విధిరాతకి అందరం తలవంచాల్సిందే! నా టైము అయిపోయింది. దట్సాల్!మీరు ఆఫీసుకి వెళ్లే రోజుల్లో ప్రొద్దుట బైబై , సాయంత్రం హాయ్ చెబుతూ హాయిగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఎన్నో ఏళ్ల హాయి బాయిలకు ద ఎండ్ కూడా కచ్చితంగా ఉంటుందని ఊహించలేదప్పుడు. కానీ రెండేళ్ల క్రితం నేను చెప్పింది పర్మినెంట్ గా బైబై! కళ్ల నీరొద్దండీ!అవును కానీ, నా మాట మీకు గుర్తుందా? ‘ముందొకరు వెనకొకరు, అంతే లైఫ్ అంటుండేదాన్ని. చూడండి నేనే ఫస్ట్! ‘ఆల్వేస్ స్మైలింగ్, మై గర్ల్‌ఫ్రెండ్ అని నన్ను మీ ఆఫీస్ వారికి పరిచయం చేయడం నేను మర్చిపోలేను. ఫొటోలో ఎలాఉన్నానో చెప్పనే లేదు మీరు. అలానే స్మైల్ చేస్తున్నానా? నన్ను రెప్పార్పకుండా ప్రేమతో మీరు చూసే చూపే దానికి సమాధానం. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మీరు నాలా కాకుండా వందేళ్లు హాపీగా ఉండాలి. బోరు కొడితే నాతో కబుర్లు చెప్పండి. అయినా రెండింటి వరకూ పేపరు చదవటం తెమలదాయె! సరే కానీ, ఆ కళ్లజోడుని మీరు బద్ధకించకుండా లేచి టేబుల్ మీద పెట్టండి. దిండు పక్కన పెడితే కిందపడుతుంది.ఏంటీ ఏమై ఉంటుంది? ఏమిటీ ఎవ్వరూ లేరు.. ఎవరూ మాట్లాడరూ?ఓహ్! నేను ఇప్పుడు కవరేజ్ ఏరియాలో లేను కదా! ప్రపంచంలోని జైంట్ టెలికాం కంపెనీ వారు కూడా నన్ను నెట్వర్క్ లోకి తీసుకురాలేరు. గగనాంతర తరంగాలలో నెట్వర్కింగ్ ఉంటుంది కానీ గగనంలో కలిసి పోయిన ప్రాణులు అవుటాఫ్ నెట్వర్క్! ఊపిరితోనే బంధాలు, అనుబంధాలు. ఏడ దాగున్నావొ బావా? – సత్యశ్రీ నండూరి -
అత్తా? అమ్మా?
ఎంతైనా అత్తగారు అత్తగారే. కోడలు పిల్ల కోడలు పిల్లే. ఇద్దరూ తల్లీకూతుళ్లలా ఉండడం సాధ్యమేనా?సాధ్యమే. అదీ అత్తగారి వల్లనే సాధ్యం. ఒకింటికి కోడలిగా వెళ్లి.. తర్వాత అత్తయింది కనుక ఒకప్పటికి అత్త అయ్యే కోడలికి తనే నేర్పించుకోవాలి. కొడుక్కి పెళ్లయిపోగానే అత్తగారైపోయిన ‘అమ్మ’లోఅమ్మతనాన్ని ఎవరైనా అకస్మాత్తుగా ఎత్తుకుపోతారా?అమ్మ అమ్మే. అత్తయ్యాక కూడా అమ్మే. అత్తమ్మే. బార్లో అందరూ వెళ్లిపోయారు అతను తప్ప.మూసేసే టైమ్ అయ్యింది.లైట్లు కూడా ఆఫ్ చేసేస్తున్నారు.వెయిటర్‌కు అతడు తెలుసు. రెండు మూడు వారాలకు ఒకసారి వచ్చి సరదాగా ఒక బీర్ తాగేసి పోతుంటాడు. ఈసారి సరదా కోసం వచ్చినట్టు లేదు. చాలా తాగాడు. ఇంటికి వెళ్లకుండా కదలక మెదలక ఉన్నాడు.వెయిటర్‌కు ఇలాంటి వాళ్లు తెలుసు.అనునయంగా లేపి, బయటకు తీసుకొచ్చి ఆటో ఎక్కిస్తూ అడిగాడు– ‘వైఫ్ ప్రాబ్లమా సార్’.అతడు ఆటోలో కూలబడ్డాడు.‘అదైనా బాగుండేది. కాని ఇది అమ్మ ప్రాబ్లమ్. మా అమ్మతో ప్రాబ్లమ్’ అని, ఎంతిస్తున్నాడో కూడా చూసుకోకుండా టిప్పు కుక్కి కళ్లు మూసుకున్నాడు.తెల్లారింది. తల్లి వెళ్లి మెయిన్ డోర్ తెరిచింది. గుమ్మంలో పాలప్యాకెట్లు పడి ఉన్నాయి. పేపర్ కూడా. వాటిని చూడగానే ఆమెకు కోపం వచ్చింది.‘ఈ పిల్ల ఉదయాన్నే లేచి వీటిని తీయవచ్చు కదా’ అనుకుంది. కొడుక్కి కొత్తగా పెళ్లయ్యిందని కాపురం మొదలయ్యి ఆరు నెలలు అయ్యిందని కోడలు తొందరగా లేవ వలసిన పని లేదని మార్నింగ్ కాఫీ పెట్టి తానే నిద్ర లేపుతానని ఈ తల్లే కొత్తల్లో చెప్పింది. కాని ఇప్పుడు ఎందుకో ఆమెకు కోపం వస్తోంది.వెళ్లి ముందు వెనుకా చూసుకోకుండా కొడుకు కోడలు ఉండే బెడ్రూమ్ తలుపును బాదింది.‘అమ్మాయ్ సరళా. ఇంకా ఏంటా మొద్దు నిద్ర లే’ అని అరిచింది.నిద్రలో ఉన్న సరళా ఉలిక్కి పడి లేచింది. రాత్రి తాగి బతుకు జీవుడా అని నిద్రపోయిన కొడుకూ అదిరిపడి లేచాడు.రోజు మొదలైంది అని ఇద్దరూ అనుకున్నారు.‘వస్తున్నా అత్తయ్యా’ కోడలు బయటకు పరిగెత్తింది నైటీ సరి చేసుకుంటూ.‘అబ్బాయికి బాక్స్ కట్టావా’‘కట్టాను అత్తయ్యా’‘ఏం కట్టావ్?’ ‘చామగడ్డల పులుసు. పప్పు. అరటి కాయ తాలింపు’...‘నీ తలకాయ తాలింపు చేయకపోయావా. వాడు అరటికాయ తినడని తెలియదా?’‘నాకు మీరు చెప్పలేదు అత్తయ్యా’‘పర్లేదులేమ్మా. తింటాలే’‘నువ్వు నోర్మూయరా... అప్పుడే తందానా అనడం మొదలెట్టావా’కొడుకూ కోడలూ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఉక్రోషంగా ఉంది. ఏం చేయాలో తోచనట్టుగా ఉంది. తిరగబడ్డానికి వీలు లేకుండా ఉంది.ఎదురుగా ఉన్నది శతృవు కాదు.సొంత తల్లి. ఆమెకు అత్త.సుజాతమ్మకు ఆ వీధిలో చాలా మంచిదని పేరు. ఒకరికి కష్టం వస్తే పరిగెత్తుకొని వస్తుందని పేరు. మంచీ చెడ్డ చెబుతుందని పేరు. అందరి ఇళ్లల్లో తల్లో నాలుక అని పేరు. ఆమెను అభిమానించని ఇల్లు ఆ వీధిలో లేదు. పెళ్లిళ్లలో శుభకార్యాలలో ఆమె పెత్తనమే ఎక్కడైనా. అలాంటిది ఆమె ఇంట్లో కూడా శుభకార్యమే జరిగింది. కొడుకు పెళ్లే జరిగింది. అది శుభప్రదంగా ఉంటుందని తమ ఇళ్లల్లో లాగా చికాకులు చిర్రుబుర్రులతో సాగదని అందరూ అనుకున్నారు. సుజాతమ్మ కోడలిని బాగా చూసుకుంటుందని అనుకున్నారు. భర్త చనిపోయాక ఎన్నో కష్టాలు పడి ఇంటిని నిలబెట్టుకున్న సుజాతమ్మ ఇన్నాళ్లకు ఆడతోడు దొరికి కాసింత తెరిపిన పడుతుందని అనుకున్నారు. ప్రస్తుతం బయట అందరి అభిప్రాయమూ అదే. ఆమె మీద ఎవరికి ఏ చాడీ చెప్పినా నమ్మరు.కాని ఇంట్లో జరుగుతున్నది వేరు.సుజాతమ్మ ఇప్పుడు ఒక రాక్షసి.‘ఏమండీ... ఇలాగైతే నా వల్ల కాదు. నేను మా పుట్టింటికి వెళ్లిపోతాను’ అంది సరళ.‘అదేమిటి అలా అంటావు. ఓపిక పట్టు. అంతా సర్దుకుంటుంది’ అన్నాడు భార్గవ్ హతాశుడవుతూ.‘సర్దుకునే సూచన కనిపించడం లేదండీ. ఇది ఇంకా పెరిగేలా ఉంది. నేను ఆల్రెడీ మా పెద్దవాళ్లకు ఫోన్ చేశాను. రేపు వస్తారు’‘నిజమా’ గుడ్లు తేలేశాడు.మరునాడు సుజాతమ్మ కూడా గుడ్లు తేలేయక తప్పలేదు. ‘మీరు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారండీ’ కొంచెం మర్యాద పాటిస్తూ అన్నాడు సరళ తండ్రి.‘ఇబ్బందా.. పీక్కు తింటోంది’ కోపం పట్టలేక అంది సరళ తల్లి.‘మాకేం కూటికి గతిలేదనుకోవద్దు. విడాకులిప్పించి దర్జాగా ఇంకో పెళ్లి చేస్తాం’ సరళ తల్లి కోపంతో బుసలు కొడుతోంది.సుజాతమ్మ ఒణికిపోయింది.‘సరళంటే నాకు ఇష్టం. నేనేదో చిన్న మాట అంటున్నాను తప్ప ఆ పిల్ల ఇంత బాధ పడుతుందని నాక్కూడా తెలియదు. మా వాడు విడాకులు తీసుకుంటే నాకేం సంతోషం. నాకేం లాభం. అయ్యో.. వద్దే వద్దు’ అంది ఎలాగోలా శక్తి తెచ్చుకుని.‘లేదండీ... మీ మైండ్ ఖరాబయ్యింది. మీకు కౌన్సెలింగ్ అవసరం’ అని తేల్చాడు అనుభవజ్ఞుడైన సరళ తండ్రి.వేరే మార్గం లేక తల వొంచుకుని అంగీకరించింది సుజాతమ్మ.సుజాతమ్మ కథ ఇది. ఆమెకు యాభై సంవత్సరాలు. పద్దెనిమిదేళ్లకే పెళ్లయ్యింది. ముప్పై ఏళ్లకే భర్త చనిపోయాడు. ఆమెకు పెద్దగా బంధుగణం లేదు. జీవితాన్ని ఎలా గడపాలో తెలియదు. ఒక్కగానొక్క కొడుకు. వాడే లోకంగా బతికింది. వాడి కోసమే జీవించింది. జీవితంలో కొంతమంది మగవాళ్లు ఆమెకు తారసపడ్డారు. కోరుకున్నారు. మరోపెళ్లిని ప్రస్తావించారు. కాని ఆమె కొడుకు కోసం తన సంతోషాలన్నింటినీ త్యాగం చేసింది. వీధిలో వాళ్లే తన బంధువులనుకుంది. కొడుకును ప్రయోజకుణ్ణి చేసింది. అతడికి పెళ్లి చేసింది. కాని పెళ్లయ్యి రెండు మూడు నెలలు గడిచిన తర్వాత కోడలు నచ్చకపోవడం మొదలైంది. ఆమెను తిట్టడం మొదలెట్టింది. బాధ పెట్టడం సూటిపోటి మాటలు అనడం... ఇలా ఎందుకు చేస్తున్నదో ఆమెకే తెలియదు. ఆమె తనను తాను అర్థం చేసుకోవాల్సి ఉంది.‘మీ కోడలు మీ కొడుకును మీకు ఎక్కడ కాకుండా చేస్తుందోనని మీ భయం కదా’ లేడీ సైకియాట్రిస్ట్ అడిగింది.సుజాతమ్మ ఏం మాట్లాడలేదు. మౌనంగా తల ఊపింది. ‘కొంత కాలం మీరు మీ కోడలిని అభిమానించారు. కాని మీ కొడుకు కోడలు ఏకాంతంగా ఉన్నా, కలిసి సినిమాకు వెళ్లినా, డిన్నర్‌కు వెళ్లినా మీ కొడుకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడేమో, క్రమంగా మిమ్మల్ని వదులుకుంటాడేమో, మీ ప్రాధాన్యం తగ్గిపోతుందేమో అని మీకు అనిపించి ఏం చేయాలో తెలియక మీ కోడలిని బాధ పెట్టడం మొదలెట్టారు’ అంది సైకియాట్రిస్ట్.మళ్లీ అడిగింది.‘మీకు కొడుకు పుట్టినప్పుడు మీ భర్త ఉండగా మీరు వారిద్దరినీ సమానంగా ప్రేమించారా? ఒక్కరినే ప్రేమించారా?’సుజాతమ్మ తలెత్తి చూసి ‘ఇద్దరినీ ప్రేమించాను’ అంది.‘మీ కొడుకు కూడా అలాగే చేయగలడు అని మీరు ఎందుకు అనుకోవడం లేదు. మీ కొడుకు మిమ్మల్ని, మీ కోడలిని కూడా ఏక కాలంలో ప్రేమగా చూసుకోవచ్చు కదా. ఎవరూ ఏ ఒక్కరికీ సొంతం కాదు. అందరూ అందరికీ చెందినప్పుడే కుటుంబం నడుస్తుంది. సాధారణంగా ఏమవుతుందంటే మీ కొడుకు స్థానంలో మీకు కూతురు ఉంటే ఆ కూతురు ఏదో ఒకనాటికి అత్తారింటికి వెళ్లిపోతుందని మీరు ప్రిపేర్డ్‌గా ఉండేవారు. కొడుకు అయ్యే సరికి అతనితోనే జీవితాంతం ఉండాలనుకుని, అలా ఉండటానికి ఎక్కడ అడ్డంకులు వస్తాయో అని ఉలిక్కి పడుతున్నారు. మీ కొడుక్కే కాదు ఏ కొడుక్కైనా తల్లంటే ప్రేమ ఇష్టం ఉంటాయి. వాళ్లను ప్రేమించకుండా మానేయరు. కాని కోడలు వచ్చేసరికి మీలాగే చాలామంది అత్తగార్లు ఇన్సెక్యూర్ అయ్యి ఇంటిని ఇబ్బందుల్లోకి నెడతారు. మీ కోడలు మంచి అవగాహన ఉన్న అమ్మాయి. ఆమెను నమ్మండి. మీ అబ్బాయిని నమ్మండి. వారు మిమ్మల్ని బాగా చూసుకుంటారు’ అంది లేడీ సైకియాట్రిస్ట్.సుజాతమ్మకు ఆ కౌన్సెలింగ్ చాలా ఉపయోగపడింది.ఆమె వెంటనే కోడలిని పిలిచి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరింది.కొద్దిపాటి అవగాహన, అవసరమైన చర్చలు కుటుంబ సభ్యుల మధ్య సాగితే ప్రతి ఇల్లు సౌకర్యవంతమైన అనుబంధాలతో కొనసాగుతుంది.నాలుగైదు రోజుల తర్వాత సుజాతమ్మ తెల్లవారుతూనే లేచింది.గుమ్మంలో పాలప్యాకెట్లు, పేపర్ పడి ఉన్నాయి.వాటిని చేతిలోకి తీసుకుని కాఫీ పెట్టడానికి వెనుదిరుగుతుండగానే.. కోడలు ఎదురొచ్చింది!‘ఇటివ్వండత్తయ్యా.. కాఫీ పెట్టుకొస్తాను’ అంది. ఆ తర్వాత ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతున్న దృశ్యం అప్పుడే నిద్ర లేచి హాల్లోకి వస్తున్న కొడుక్కి కనిపించింది. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ మీ కొడుక్కే కాదు ఏ కొడుక్కైనా తల్లంటే ప్రేమ ఇష్టం ఉంటాయి. వాళ్లను ప్రేమించకుండా మానేయరు. కాని కోడలు వచ్చేసరికి మీలాగే చాలామంది అత్తగార్లు ఇన్సెక్యూర్ అయ్యి ఇంటిని ఇబ్బందుల్లోకి నెడతారు. -
అమ్మ నా 'కోడలా'!
ఆమె ఆ ఇంటి పెద్దకోడలు..ఏ దుర్భుద్ధి పుట్టిందో ఏమో.. అత్తగారింట్లోనే చోరీకి ప్లాన్ వేసింది. దీనికి తనకు పరిచయమున్న వ్యక్తి సహాయాన్ని కోరింది. తన అత్తగారు ఊరెళ్లారనే సమాచారం తెలుసుకుని పక్కా ప్లానింగ్‌తో అతడిని రంగంలోకి దించింది. ఇంటి తాళాలు అతడికి ఇచ్చింది. ఇంకేముంది ఇంట్లో ఉన్న వెండి, బంగారం, ఇతర వస్తువులను చోరీ చేసేశారు... కట్ చేస్తే.. తొమ్మిది నెలల అనంతరం చోరీకి పాల్పడిన నిందితులు పోలీసులకు చిక్కారు. ఈ చోరీకి ప్లాన్ వేసింది కోడలేనని తెలిసి అత్తింటివారు అవాక్కయ్యారు. రాయవరం (మండపేట):ఓ చోరీ కేసును తొమ్మిది నెలల అనంతరం పోలీసులు చేధించారు. రాజమహేంద్రవరంలో పరిచయమైన వ్యక్తులతో తమ ఇంట్లోని వస్తువులను, స్వయానా ఇంటి కోడలే చోరీ చేయించినట్టు తెలుసుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ప్రస్తుతం తొమ్మిదో నెల నిండు గర్భిణిగా ఉన్న కోడలితో సహా మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన చందంగా ఉన్న ఈ చోరీ ఘటన వెనుక ఉన్న వాస్తవాలను పోలీసులు గురువారం రాయవరంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాయవరంలోని శివాలయం సమీపంలో నూలు నాగభూషణం, పరంజ్యోతి దంపతుల ఇంటిలో 2017 జూన్ 27వ తేదీ రాత్రి చోరీ జరిగింది. ఆ రోజు పరంజ్యోతి చిన్న కుమారుడు ఏసురాజుతో కలిసి కాతేరులోని మనవరాలి బర్త్‌డే ఫంక్షన్‌కు వెళ్లారు. పరంజ్యోతి పెద్దకుమారుడు వెంకటేశ్వరరావు, అతడి భార్య వీరలక్ష్మి గ్రామంలోనే వేరే ఇంట్లో నివసిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాళ్ల మండలం మాలవానితిప్పకు చెందిన ఉద్దర్రాజు మహేష్ 2011లో రాజమహేంద్రవరంలోని ఓ హోటల్లో సూపర్వైజర్గా పనిచేసేవాడు. ఆ సమయంలో రామచంద్రపురంలో నివసించే వీరలక్ష్మితో అతడికి పరిచయం ఏర్పడింది. 2013లో వీరలక్ష్మి రాయవరం గ్రామానికి చెందిన నూలు వెంకటేశ్వరరావును ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి వీరలక్ష్మి మహేష్‌లు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. అత్తగారు ఊరెళుతుందని తెలిసి.. అత్తగారు నాలుగు రోజులు ఊరిలో ఉండడం లేదన్న విషయాన్ని పూర్వపు స్నేహితుడైన ఉద్దర్రాజు మహేష్‌కు వీరలక్ష్మి తెలిపింది. ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు, ఇతర విలువైన వస్తువులు దొంగిలిస్తే చెరిసగం పంచుకుందామంటూ పథకం వేసింది. మహేష్ తన స్నేహితుడైన కె.గంగవరం మండలం అద్దంపల్లికి చెందిన వెన్నా నాగరాజును వెంటబెట్టుకుని రాయవరం వచ్చాడు. అప్పటికే పూర్తి సమాచారాన్ని వీరలక్ష్మి మహేష్‌కు ఇవ్వడంతో సులువుగానే ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళాలను సైతం అతడికి ఇవ్వడంతో ఇంట్లో ఉన్న 2.350 కేజీల వెండి వస్తువులు, 26 గ్రాముల బంగారు వస్తువులు, 21 అంగుళాల ఎల్ఈడీ టీవీ, హోమ్ థియేటర్‌ను చోరీ చేశారు. చోరీ ఘటనపై గతేడాది జూన్ 28న ఏఎస్సై కేవీవీ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. అవాక్కయిన పోలీసులు, కుటుంబ సభ్యులు.. మండలంలోని మాచవరం వంతెన వద్ద అనుమానాస్పదంగా ఉన్న మహేష్, నాగరాజులను పోలీసులు పట్టుకున్నారు. వీరిని విచారించగా 2017 జూన్ 27 రాత్రి నూలు వీరలక్ష్మి సహాయంతో చేసిన చోరీ విషయాన్ని బయట పెట్టారు. దీంతో వీరలక్ష్మిని కూడా అరెస్ట్ చేసినట్టు ఎస్సై వెలుగుల సురేష్ తెలిపారు. స్వయానా ఇంటి కోడలే తన పూర్వపు స్నేహితుడితో అత్తగారింట్లో చోరీ చేయించిన విషయం వెలుగు చూడడంతో పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. అనపర్తి సీఐ పాలా శ్రీనివాస్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి అనపర్తి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తున్నట్టు ఎస్సై తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏఎస్సై కేవీవీ సత్యనారాయణ, సిబ్బంది పి.రాజు, వి.చినరాజు, వి.శ్యామల, కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
విడాకులు కోరిన ట్రంప్ కోడలు
న్యూయార్క్: వరుస వివాదాలతో ఇబ్బందులు పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో కలకలం చెలరేగింది. ఆయన పెద్దకొడుకు ట్రంప్ జూనియర్ భార్య వనెస్సా హేడన్ ట్రంప్ (40).. తనకు తక్షణమే విడాకులు మంజూరు చేయాల్సిందిగా కోరుతూ మన్‌హట్టన్‌లోని కోర్టును ఆశ్రయించారు. జూనియర్ ట్రంప్ కుటుంబాన్ని అస్సలు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ ఆమె పిటిషన్‌వేశారు. 2005 నవంబర్‌లో జూనియర్ ట్రంప్‌ను వనెస్సా పెళ్లాడారు. వీరికి ఐదుగురు సంతానం. చర్చించుకుని విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు భార్యాభర్తలిద్దరూ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. -
కర్రతో కొట్టి చంపింది
లక్నో: తన పాలిట కీచకుడిగా మారిన మామను కోడలు కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ పిలిభిత్ జిల్లాలోని మధోతండా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం తన కొడుకు పనికి వెళ్లిన సమయంలో కోడలిపై మామ అత్యాచారం చేశాడు. తర్వాత రోజు మరోసారి అకృత్యానికి ఒడిగట్టడంతో బాధితురాలు భర్త సహాయంతో మామను కర్రతో కొట్టి చంపింది. తర్వాత వీరిద్దరూ స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. మృతుడి పెద్ద కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య నాలుగేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులు తెలిపారు. -
ఆ ఇంట్లో కోడలే కొరివి పెట్టాలి
కోడలు ఇంటికొచ్చేది ఇంటి దీపం వెలిగించడానికి... కోడలు కళను తెస్తుందని, సిరిని తెస్తుందని భావిస్తారు. కోడలు కాలు పెట్టిన వేళా విశేషం అని ఏదైనా మంచి జరిగితే చెప్పుకుంటారు. భర్తకు భార్యగా పిల్లలకు తల్లిగా ఉండే కోడలు అత్తామామలకు తల కొరివి పెట్టాల్సి వస్తే? ఇలాంటి ఆచారం ఎక్కడా లేదు. కాని ఆ ఊరిలో ఆ ఇంట్లో ఉంది. గత ఏడెనిమిది తరాలుగా అలాగే జరుగుతోంది. హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రి చనిపోతే పెద్దకొడుకు, తల్లి చనిపోతే చిన్న కొడుకు తలకొరివి పెడతారు. కొడుకులు లేని చోట అన్నదమ్ముల కొడుకులు కొరివి పెడుతుంటారు. కాని ‘ఆకుల’ వారి కుటుంబంలో మాత్రం ‘కోడళ్లే’ అత్తామామలకు తలకొరివి పెడుతారు. ఇది ఏడెనిమిది తరాలుగా వస్తున్న సంప్రదాయం. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి గ్రామంలో గౌడ కులానికి చెందిన ‘ఆకుల’ వారి వంశవృక్షంలో 24 కుటుంబాలు ఉన్నాయి. వారి ఇళ్లలో తండ్రి చనిపోతే పెద్ద కొడుకుకు బదులు పెద్ద కోడలు, తల్లి చనిపోతే చిన్న కొడుక్కు బదులు చిన్న కోడలు తలకొరివి పెడతారు. అంతిమసంస్కారాలతో పాటు శ్రాద్ధకర్మలు కూడా కోడళ్లే చేయాల్సి ఉంటుంది. ఆ కార్యక్రమాలు చేసే చోటుకి కొడుకులను అనుమతించరు. తండ్రి చనిపోయాడని బాధపడే కొడుకులు తండ్రి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అందరిలాగే కార్యక్రమంలో పాల్గొంటారు తప్ప అంతిమ సంస్కారాలు మాత్రం చేసే అవకాశం ఉండదు. ఈ ఆచారం ఎక్కడిది? ఆకుల వారి వంశంలో ఏడెనిమిది తరాల క్రితం తండ్రి చనిపోయినపుడు కొడుకు కొరివి పెట్టాడు. అనుకోకుండా కొడుకు చనిపోయాడు. వయసులో ఉన్న కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం ఆందోళనకు గురైంది. తండ్రికి కొరివి పెట్టిన కొంతకాలానికే కొడుకు చనిపోవడాన్ని ఏదో కీడుగా భావించిన కుటుంబ సభ్యులు తరువాత ఎవరు చనిపోయినా కొడుకులతో అంతిమ సంస్కారం, శ్రాద్ధకర్మలు చేయించకూడదని నిర్ణయించుకున్నారట. అప్పటినుంచి వారి ఇళ్లలో ఎవరు చనిపోయినా కోడళ్లే కొరివి పెట్టే పద్ధ్దతి కొనసాగుతోంది. అదృష్టంగా భావిస్తారు... ఇల్లన్నాక అత్తాకోడళ్ల మధ్య ఏవో చిన్న చిన్న పేచీలు ఉండనే ఉంటాయి. కాని ఆకుల వారి కుటుంబంలో అత్తలు కోడళ్లని బాగా చూసుకుంటారనే పేరు ఉంది. కోడళ్లకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే అత్తామామలు చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సింది వారే కదా. అలా అని కోడళ్లు అత్తామామలను చిన్నచూపు చూడరు. ఎంతో అభిమానంగా చూసుకుంటారు. వారికి చివరి కర్మలు నిర్వహించాల్సి రావడం తమ అదృష్టంగా భావిస్తారు. ఒకవేళ పురుష సంతానం లేక కూతుళ్లే ఉన్నట్టయితే ఆకుల వారి కుటుంబంలో అన్నదమ్ముల కోడళ్లు అంతిమ సంస్కారం నిర్వహిస్తారు. ఎక్కడా కనిపించని కోడలు కొరివి పెట్టే సంప్రదాయం ఆ కుటుంబంలో నిరంతరంగా కొనసాగుతోంది. వారి ఇళ్లలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల యాత్ర వెళుతుంటే గ్రామస్తులంతా ఇప్పటికీ ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. మా అత్త చితికి నేనే అగ్గిపెట్టిన... నాకు ఇప్పుడు తొంబై ఏండ్లు ఉన్నయి. యాబై ఏండ్ల కిందట మా అత్త సచ్చిపోయింది. అప్పుడు నేను మా అత్తకు అగ్గిపెట్టిన. మా ఇండ్లళ్ల ఏడెనిమిది తరాల సంది గిట్లనే నడుస్తుంది. కోడండ్లే కొడుకుల లెక్క అన్ని చేస్తరు. అత్త, మామలకు అగ్గిపెట్టుడు అదృష్టమే. ఎవల ఇండ్లల్ల అయినా కొడుకులు పెడుతరు. మా ఇండ్లల్ల మాత్రమే కోడండ్లు అగ్గిపెడుతరు. – ఆకుల లింగవ్వ మా మామ చనిపోతే నేనే చేసిన... మా మామ చనిపోయినపుడు అన్నీ నా చేతుల మీదుగానే చేయించిండ్రు. ఎనకట అగ్గివట్టిన కొడుకు చనిపోయిండ్రని కోడండ్లతోని చేయించుడు మొదలుపెట్టిండ్రు. అప్పటి నుంచి అదే సంప్రదాయం నడుస్తుంది. మేం అట్లనే నడుసుకుంటున్నం. ముందు ముందు గూడ మా పిల్లలు అట్లనే నడుసుకుంటరు. చావు దగ్గరి నుంచి దినాలు, మాసికాలు, యాడాది దినం కూడా కోడండ్ల చేతుల మీదుగనే నడుస్తయి. – ఆకుల దేవేంద్రవ్వ అత్త, మామ ఇద్దరికీ నేనే అగ్గివట్టిన... మా అత్త సచ్చిపోయినపుడు, మా మామ సచ్చిపోయినపుడు నేనే అగ్గివట్టిన. కోడలు సేవ చేసుడే కాదు. అగ్గివట్టుడు, కర్మ చేసుడు అదృష్టం అనుకుంటం. కొడుకులు ఏ పని ముట్టద్దు. అన్ని పనులు కోడండ్ల చేతులతోనే చేయిస్తం. మా ఇండ్లల్ల కోడండ్లకు మంచి గౌరవం ఉంటది. చాన మంది మేనళ్లను చేసుకున్నం. మా ఇంట్ల మూడు తరాలు మేనోళ్లే ఉన్నరు. – ఆకుల పెద్ద గంగవ్వ మా మామకు నేనే చేసిన... నాకు పెళ్లయిన కొత్తల కోడండ్లు అగ్గిపెడుతరని చూసి ఆశ్చర్యమనిపించింది. ఎక్కడా లేని సంప్రదాయం ఈడనే చూసిన. మొదట్ల ఇదేం సంప్రదాయమో అనుకున్న. కొడుకుతో కోడలు సమానం అన్న భావన నాకు అర్థమైంది. – ఆకుల అనసూయ – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి -
మరుగుదొడ్డి కట్టనీయలేదని మామపై కోడలి ఫిర్యాదు
చిత్తూరు, పూతలపట్టు : మరుగుదొడ్డి కట్టనీయకుండా మామ అడ్డుకుంటున్నాడని ఓ కోడలు ఆదివారం పోలీసులకు ఫిర్యా దు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని పేటఅగ్రహారం దళితవాడకు చెందిన ఎర్రయ్య కుమారుడు బాబయ్య 20 ఏళ్ల క్రితం పీలేరుకు చెందిన విజయకుమారిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో బాబయ్య ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి విజయకుమారి తన కుమార్తెతో పాటు పూరిగుడిసెలో ఉంటూ కూలి చేసుకుని జీవనం సాగి స్తోంది. ప్రస్తుతం మరుగుదొడ్డి ఉంటేనే సంక్షేమ పథకాలైన పింఛను, రేషన్ బియ్యం, ఇతర సౌకర్యాలు అందిస్తామని అధికారులు తెలిపారు. రెండు నెలలుగా పింఛను కూడా ఇవ్వడం లేదు. తీరా మరుగుదొడ్డి నిర్మించుకోబోతే మామ ఎర్రయ్య అడ్డుపడ్డాడు. దీంతో ఆమె మనోవేదనకు గురై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిబ్బంది ద్వారా గ్రామంలో విచారించిన ఎస్ఐ మురళీమోహన్ ఎర్రయ్యను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు అడ్డుపడొద్దని హెచ్చరించి పంపారు. -
కవరింగ్ కోడలు
‘కవర్ ఇవ్వు అర్జంట్’ అంటూ హడావుడిగా లోపలికి వచ్చాడు శ్రీనివాస్. ‘దేనికి?’ అడిగాను. ‘ప్రశ్నలు కాదు. కవర్ కావాలి’ అనేసరికి తప్పదన్నట్టు ఓ వెడల్పాటి బట్టల కవర్ వెతికి ఇచ్చాను. దాంట్లో తెగిపోయిన చెప్పులు వేసుకొని వెళ్లిపోయాడు కుట్టించుకురావడానికి. ముందే చెబితే పాత కవర్ తీసిస్తా కదా, మంచి కవర్.. ఎందుకని అడిగితే చెప్పడానికేంటో.. విసుక్కుంటూ వంటకు కావల్సిన కూరగాయలు తరిగే పనిలో పడ్డాను. ఉదయం ‘డ్రెస్ స్టిచ్చింగ్కి ఇచ్చి రావాలి కవర్ ఇవ్వు’ అంటే తీసిచ్చాను. కూరగాయలు తీసుకురావడానికి కవర్ అడిగితే ఇచ్చా. ఇంట్లో చేసిన ఫలహారాలు బంధువులకు ఇచ్చిరావాలి అంటే కవర్ వెతికిచ్చా. ఇప్పుడు పాత చెప్పులకు కూడా మంచి కవర్ కావాలి.. నేనేమైనా కవర్లు అమ్ముకునే షాప్ పెట్టానా? అడిగిన ప్రతిసారీ కవర్, అందులోనూ మంచి కవర్ ఇవ్వడానికి.. తిట్టుకుంటూనే కుకర్ విజిల్ మోగకుండా అవస్థ పడుతుంటే దాన్నో మొట్టికాయ వేశాను! అది చెయ్యికి చుర్రుమని వేడిగా చురక అంటించింది. ‘అమ్మా, రెడీ అయ్యావా! ఆటో తీసుకొస్తా, నాకు టైమ్ అయిపోతోంది’ హడావుడిగా తయారవుతూనే తల్లిని కేకేశాడు శ్రీనివాస్. ‘ఒరేయ్, మొన్న నువ్వు ఊరెళ్లేటప్పుడు పెద్ద కవరొకటి ఇచ్చాను కదా! అదిటివ్వు. బట్టలు సర్దుకోవాలి’.. ఆఫీసుకెళ్లడానికి లంచ్‌బాక్స్ బ్యాగ్‌లో పెట్టుకుంటూ టైమ్ చూస్తున్న నేను‘ పెద్ద కవర్’ అనే మాట అత్తగారి నోట వినగానే ఉలిక్కిపడ్డాను. ప్రశాంతంగా ఉన్న ఇంటిలో వాయుగుండం ఏర్పడబోతున్న సంకేతాలు అందుతున్నాయి. ‘ఆ కవరే ఉందా, ఐరన్ షాప్‌కి దాంట్లోనే బట్టలు పెట్టిచ్చాను. వాడు సాయంత్రానికి గానీ తీసుకురాడు...’ అంతే ఫాస్ట్‌గా చెప్పేశాడు శ్రీనివాస్. ‘ఏదైనా ఇస్తే.. తిరిగిచ్చే అలవాటు లేదురా నీకు. మొన్న పాపం ఆ సీతమ్మ ఇంటికి వెళ్లినప్పుడు ఇచ్చింది, పే..ద్ద కవర్.. ఎన్ని బట్టలు పట్టేవో..’ అల్మారా తలుపు దఢేల్న మూసుకున్న సౌండ్. ఆవిడకు కోపం వచ్చుంటుందని అర్థమైంది. ‘ఇంకా నయం ఆవిడ బంగారం పెట్టింది. అది నేను దోచేశాను అనలే..’ అన్నాడు శ్రీనివాస్ మాట పడనివాడిలా! ‘అవున్రా.. నేను బంగారమే కావాలని దాచుకొని ఉండుంటే ఈ రోజుకి మీరిలా ఉండేవారా!’ గదిలో నుండే ఆవిడ కంఠం స్థాయి పెంచి అంది. ‘అవును మరి.. మీ నాయిన కిలో బంగారంబెట్టె. మేమంతా కరగదీసుకుని తినేస్తిం..’ పేపర్ చదువుతున్న మామగారు అత్తగారి మాటకు ఎక్కడో కనెక్ట్ అయ్యి వెంటనే కౌంటర్ ఇచ్చేశారు. కవర్‌తో మొదలైన ఘాటు కనకం దాకా ప్రయాణిస్తూ.. అదెటు వెళుతుందో.. ! డబ్బులు తీసుకుని ఇవ్వలేదంటే ఒక అర్థం ఉంది. కవర్ తీసుకొని ఇవ్వకపోతే కూడా కోపం వస్తుందా?! ఏంటో వీళ్ల కవర్ల గోల. వీళ్లను కవర్ చేయలేక నా తల ప్రాణం తోకకొచ్చేట్టుంది. త్వరగా ఈ వ్యవహారాన్ని బ్యాగ్‌లో చుట్టేయాలి అనుకుంటూ... ‘ఈ బ్యాగ్‌లో పెట్టుకెళ్లండి అత్తయ్య. చిన్న బ్యాగ్. మొన్న శిల్పారామంలో తెచ్చా. బాగుంటుంది కూడా!’ కలంకారీ బ్యాగ్ ఆమె ముందు పెడుతూ సర్దిచెబుతున్నట్టు కాస్తంత హోప్‌తో చెప్పా! ‘ఒక్కరోజు వెళ్లి రావడానికి మూటెందుకు?’ అని దీర్ఘం తీసింది. ‘అల్లుడు ఊరెళ్లాడు, రాత్రికి తోడుగా ఉందువుగానీ రా’ అని కూతురు ఫోన్ చేసిందట. అందుకే ఈ అకస్మాత్తు ప్రయాణం. ఈవిడ కవర్కే ఫిక్స్ అయిపోయింది. ఇక మన మాట వినదు.. నాకీ కవర్ల వెతుకులాట తప్పదు. టైమ్ అయిపోతోందని హెచ్చరిస్తున్న గడియారం నా వైపు జాలిగా చూస్తున్నట్టు అనిపించింది. ‘‘నేనే ఫాస్ట్ చూడు’ అని గడియారం వైపు ఓ లుక్కేసి బీరువా వైపు పరుగులాంటి నడకతో వెళ్లాను. బట్టల షాపింగ్ చేసినప్పుడు వాటిని కవర్లలో పెట్టి ఇస్తుంటారు షాప్‌వాళ్లు. (ఇప్పుడు వాటి ఖరీదు కూడా జత చేస్తున్నారు) అవసరం ఉంటుంది కదా అని వాటిని బీరువా అట్టడుగున ఉన్న రాక్‌లో జాగ్రత్త చేసి ఉంచుతుంటాను. ఓ మోస్తరు కవర్లు ఉంటే బెడ్ కింద చేర్చుతుంటాను. ప్రతి ఇంట్లోనూ కవర్ల అవసరం ఏదో టైమ్‌లో ఉంటూనే ఉంటుంది. కానీ, మా ఇంట్లో మాత్రం కవర్ల కోసమే అప్పుడప్పుడు చిన్న చిన్న యుద్ధాలూ జరుగుతుంటాయి. వాటిని కట్టడి చేయడానికి నేను డబ్బులు పోగేసుకున్నట్టు కవర్లు పోగేస్తుంటాను. నిన్నటికి నిన్న.. ‘మున్సిపల్ ఆఫీసులో పని ఉంది ఈ కాగితాలన్నీ పట్టుకెళ్లాలి. ఓ మంచి కవర్ చూసివ్వమ్మా..’ అన్న మామగారికి ఓ మోస్తరు బాగున్న కవర్ తీసిచ్చా. ‘ఈ రెండూ రోలింగ్ చేసిన చీరలు. బ్యాగులో పెడితే ముడతలు పడతాయిగానీ ఓ కవర్ ఇవ్వు’ అన్న అత్తగారికి ఇంకాస్త బాగున్న కవర్ వెతికి మరీ ఇచ్చాను. ‘నానమ్మ కొబ్బరికాయ, అరటిపళ్లు తీసుకురమ్మంది, కవరివ్వమ్మా’ అన్న నా కూతురికి బలంగా ఉన్న కవర్ ఇచ్చాను. ఏం అవసరం ముంచుకొచ్చిందో అడక్కుండానే కనిపించిన కవర్ని నాలుగు మడతలు వేసి జేబులో పెట్టుకొని వెళ్లిపోయాడు నా కుమారరత్నం. ప్లాస్టిక్ కవర్ వాడకం అంత మంచిది కాదని అప్పటికీ కలంకారీ, ఖాదీ క్లాత్‌తో కుట్టిన సంచులు నాలుగైదు తెచ్చిపెట్టాను. ఇంట్లో ఎవరు కవర్ అడిగినా ఆ బ్యాగ్‌లను ముందు పెడుతున్నాను. కానీ, ఒక్కరూ వాటిని ముట్టుకోవడం లేదు. ఏదో ఒక కారణం చెప్పి వాటిని విజయవంతంగా వెనక్కి నెడుతున్నారు. అలా ఆలోచిస్తూనే.. ర్యాక్ వెతికితే ముడతలు పడిన మరీ పెద్దగా లేని కవర్ ఒకటి దొరికింది. బీరువా ర్యాక్ ఏమీ అక్షయపాత్ర కాదుగా.. తీసిన కొద్దీ కవర్లు రావడానికి. ఈ కవర్ ఇస్తే మళ్లీ గోడకు కొట్టిన బంతిలా ఇక్కడికే రావాలి, ఎలా.. అనుకుంటూ దిక్కులు చూస్తుంటే పైన అరలో పట్టుచీరను లోపల దాచుకొని రాజసం ఒలకబోస్తున్న కవరొకటి కనిపించింది. పిచ్చిమొద్దు.. ఎంత బాగుందో.. చాలా రోజుల నుంచి నా దగ్గరే ఉంది. పోయినసారి పండక్కి అమ్మవాళ్లు బట్టలు పెట్టారు. వాటితోనే ఆ కవర్ వచ్చింది. ఈవిడ పట్టుచీర అడిగినా బాధ ఉండేది కాదేమో.. అనుకుంటూ చీర బయట పెట్టి.. ఆ కవర్నొకసారి కళ్లనిండుగా చూసుకున్నాను! నెలాఖరుకి చివరి నోటు ఖర్చయిపోతే కలిగే బాధలా ఉంది. ఆ చిట్ట చివరి కవర్.. తీసుకెళ్లి అత్తగారి చేతికిచ్చాను. ‘ఏంటీ ఎక్కడికో రెడీ అయినట్టున్నావ్..!’ అప్పటి వరకు టీవీ రిమోట్‌ని నొక్కీ నొక్కీ అలసిపోయి రూమ్‌లోకి వచ్చిన శ్రీనివాస్ ఆశ్చర్యం మార్క్ ఫేస్‌తో ‘సండే ఎక్కడికి’ అన్నట్టు చూశాడు. ‘మీరూ రెడీ అవండి. షాపింగ్‌కి వెళుతున్నాం. డ్రెస్సులు కొనాలి’ అన్నాను చీర కొంగుకు పిన్ను పెట్టుకుంటూ.. ‘ఇప్పుడెందుకు షాపింగ్? నీ బర్త్ డే నా?’ అన్నాడు. నిరసనగా ఓ చూపు చూశాను! ‘పోయిన నెలలో బర్త్ డే రోజున కనీసం గుర్తు తెచ్చుకొని విష్ కూడా చేయనందుకే కదా! నాలుగు రోజులు మాటల్లేనిది? అప్పుడే మర్చిపోయినట్టున్నాడు. కాదన్నట్టు తల అడ్డంగా ఊపాను. ‘పండగ టైమ్ ఇంకో నెల ఉందిగా, అప్పుడు కొందాంలే!’ మంచం మీద వాలిపోతూ అన్నాడు. ‘కాదు, ఇప్పుడే వెళుతున్నాం. రేపట్నుంచి నాకు కుదరదు. మీకు ఓ పది, మీ అమ్మగారికి ఓ ఐదు, నాన్నగారికి నాలుగు, చిన్నుగాడికి ఓ ఐదు,...’ ‘ఏంటీ డ్రెస్సులే..?!’ ఉన్నఫళంగా లేచి కూర్చుంటూ అడిగాడు. ‘మంచి కవర్లు కావాలి. అన్నీ అయిపోయాయి మరి. రేపటి నుంచి మీ అందరికీ కవర్లు నేనెక్కడ సప్లై చేసేది? ఇంట్లో కవర్ల కోసం జరిగే కత్తియుద్ధాలు ఎక్కడ ఆపేది. రంగు, హంగు ఉన్న కవర్లు కావాలంటే కాస్త బ్రాండెడ్ షోరూమ్స్‌కి వెళ్ళాలి. క్రెడిట్ కార్డ్ తీసుకొని త్వరగా రండి..’ అంటూ బ్యాగ్ భుజానికేసుకొని బయటకు నడిచాను. ఈయన వెనకాల వస్తారా..?! షాపింగ్‌కి. లేకపోతే.. ‘కవర్ అడగనులే.. కలంకారీ బ్యాగ్ చాలు’ అని కవరింగ్ ఇవ్వడానికి వస్తారా? వస్తే కొత్త కవర్లతో పాటు కొత్త బట్టలూ వస్తాయి. రాకపోతే కలంకారీ, ఖాదీ బ్యాగులు కళకళల్లాడుతూ వీళ్లతో పాటు తిరుగుతాయి అనుకుంటే భలే ఖుషీగా అనిపించింది. ‘మంచి కవర్లు కావాలి. అన్నీ అయిపోయాయి మరి. రేపటి నుంచి మీ అందరికీ కవర్లు నెనెక్కడ సప్లై చేసేది? ఇంట్లో కవర్ల కోసం జరిగే కత్తియుద్దాలు ఎక్కడ ఆపేది. రంగు, హంగు ఉన్న కవర్లు కావాలంటే కాస్త బ్రాండెడ్ షోరూమ్స్‌కి వెళ్ళాలి. క్రెడిట్ కార్డ్ తీసుకొని త్వరగా రండి..’ అంటూ బ్యాగ్ భుజానికేసుకొని బయటకు నడిచాను. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
చోరీలకు పాల్పడుతున్న అత్త, కోడలు అరెస్ట్
వేలూరు: జోలార్‌పేట– కాట్పాడి మధ్య రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న అత్త, కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు. జోలార్‌పేట– కాట్పాడి రైలు మార్గంలో తరచూ ప్రయాణికుల వద్ద బంగారు, నగదు చోరీ కావడంలో ప్రయాణికులు జోలార్‌పేట, కాట్పాడి రైల్వేస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో రైల్యే పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. అదే విధంగా చోరీలు జరిగిన సమయంలో కాట్పాడి రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ సమయంలో ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో పోలీసులు ప్రయాణికుల తరహాల్లో వారి కోసం ప్రత్యేక నిఘా ఉంచారు. దీంతో గురువారం ఉదయం కాట్పాడి రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాలో ఉన్న ఇద్దరు మహిళలు ఉండడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. విచారణలో వేలూరు సాయినాథపురానికి చెందిన బాలన్ భార్య పగలమ్మాల్, ఈమె కోడలు ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా అరగొండ గ్రామానికి చెందిన రాజేంద్రన్ భార్య అలిమేలు అని తెలిసింది. వీరిద్దరూ కలిసి బృందావన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో 22 సవర్ల బంగారు నగలు చోరీ చేసినట్లు నేరం అంగీకరించారు. అలిమేలుకు చిత్తూరులో రెండు సొంత ఇళ్లు ఉన్నట్లు తెలిసింది. ముంబైలో అత్త, కోడలు కలిసి రెండు సొంత ఇళ్లు కొనుగోలు చేసినట్టు, చోరీ చేసిన నగలు తాకట్టు పెట్టి నగదు సంపాదించినట్లు తెలిసింది. వీరిద్దరూ చోరీ చేసిన నగలతో ఇళ్ల కొనుగోలు చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. దీంతో అలిమేలు, పగలమ్మాల్ను అరెస్ట్ చేశారు. -
అత్త ఆరళ్లపై వివాహిత నిరసన
ఆరిలోవ(విశాఖ తూర్పు): అత్త ఇంట్లోకి రానీయకపోవడంతో ఓ కోడలు నిరసనకు దిగింది. వివాహమై రెండేళ్లు గడిచినా గడప తొక్కనీయకపోవడంతో ఒంటరి పోరాటం చేస్తోంది. బాధితురాలు రాధ తెలిపిన వివరాలు ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం తాలాడ గ్రామానికి చెందిన రాధకు విశాఖలో మూడో వార్డు వివేకానందనగర్ ఆరో వీధికి చెందిన కనకల సురేష్‌తో 2015లో వివాహమైంది. సురేష్ బీఎస్ఎఫ్ ఉద్యోగి. వివాహ సమయంలో రూ.10 లక్షలు కట్నంతో పాటు ఇతర కానుకలు ఇచ్చారు. వివాహమైన ఏడాదిలో రాధ ఆషాఢానికి కన్నవారి ఇంటికి వెళ్లి తిరిగి అత్తంటికి వచ్చింది. కొద్ది రోజులకు రాధ తల్లికి అనారోగ్యం చేసినట్లు కబురు వచ్చింది. అయినా అత్త కనకల అప్పలకొండ ఆమెను పంపించలేదు. దీంతో భర్త సురేష్ సహాయంతో రాధ కన్నవారి ఇంటికి వెళ్లింది. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న అత్త.. కోడలు ఎప్పుడు ఇంటికి వచ్చినా బయటకు పంపించేస్తుంది. కొద్ది నెలల కిందట అనారోగ్యంతో రాధ తల్లి మరణించింది. దీంతో కన్నవారి ఇంట్లో కూడా ఆమెను చూసుకొనేవారు కరువయ్యారు. అసోంలో బీఎస్ఎఫ్లో పనిచేస్తున్న సురేష్ ఇటీవల ఇంటికి వచ్చాడన్న విషయం తెలుసుకొన్న రాధ శనివారం తన మేనమామను తీసుకొని వచ్చింది. ఆమెను మళ్లీ అత్త ఇంట్లోకి రానీయలేదు. దీంతో రాధ సోమవారం మధ్యాహ్నం ఐదుగురు బంధువులను తీసుకొని వచ్చింది. అయినా అత్త కనికరించలేదు. ఆమె తీసుకొచ్చిన బ్యాగును బయటకు విసిరేసి, రాధను గేటు బయటకు నెట్టేసింది. సురేష్ బయటకు వెళ్లిపోయాడు. దీంతో రాధ బంధువులు తిరిగి ఊరెళ్లిపోయారు. ఆమె మాత్రం ఇంటి ముందే బ్యాగు పట్టుకొని గేటు వద్ద ఒంటరిగా నిరసన తెలుపుతుంది. స్థానికులు స్పందించి రాత్రి భోజనం పెట్టారు. ఓ మహిళ తన ఇంట్లో పడుకోవడానికి చోటిచ్చింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన భర్త ఉద్యోగానికి ఎక్కడ ప్రమాదం వస్తుందోనని ఆమె భయపడుతోంది. అయినా ఆ అత్తకు జాలి కలగలేదు. ఓ పక్క కన్నవారింట్లో తల్లిని కోల్పోయింది. మరో పక్క మెట్టింట్లో అత్త బయటకు గెంటేసింది. దీంతో రాధ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇదేమని అడిగిన స్థానికులపై అప్పలకొండ దుర్భాషలాడుతోంది. దీంతో ఆమె పరిస్థితిని చూస్తున్న స్థానికులు జాలి చూపడం తప్ప, ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. -
మా కోడలు ఆస్పత్రిలో ఉంది.. డబ్బు ఇవ్వండి సారూ..
‘మా కోడలు ఆస్పత్రిలో ఉంది సారూ.. మందుగోలీలకు డబ్బులు కావా’లంటూ ఓ వృద్ధుడు బ్యాంకుకు వచ్చి మొరపెట్టుకున్నాడు. కానీ అప్పటికే సమయం అరుుపోరుుందంటూ అధికారులు నిరాకరించడంతో.. కంటతడి పెడుతూ వెనుదిరిగాడు. మెదక్ మండలం పాతూరుకు చెందిన సిద్ధయ్య కోడలు ఆదివారం మెదక్ పట్టణంలోని ఓ ఆస్పత్రిలో డెలివరీ అరుుంది. ఆమెకు వెంటనే మందులు తీసుకురావాలంటూ వైద్యులు సూచించారు. దాంతో సిద్దయ్య దగ్గరున్న పెద్ద నోట్లను తీసుకుని పట్టణంలోని ఎస్బీహెచ్ బ్రాంచికి వచ్చాడు. తనకు డబ్బులివ్వాలని అధికారుల కాళ్లావేళ్లాపడ్డాడు. కానీ అప్పటికే సమయం ముగిసిపోరుుందంటూ అధికారులు తాళం వేసుకుని వెళ్లిపోయారు. -
కోడలు పిల్లా... జాగ్రత్త!
లీగల్ స్టోరీస్ అత్త లేని కోడలు ఉత్తమురాలు. కోడలు లేని అత్త గుణవంతురాలు.. అని ఓ కవి సెలవిచ్చారు. ఇక ఇవేమీ కుదరవు! అత్తమామల్ని సరిగా చూసుకోకపోతే భర్త తన భార్యపై కోర్టుకు వెళ్లొచ్చు. విడాకులు కోరవచ్చు. ఉమ్మడి కుటుంబాలు వర్ధిల్లాలని అత్తమామలు కొడుకు, కోడళ్లతో కలిసి ఉండాలని పిల్లలకు పెద్దల అండదండలు ఉండాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఓ సందేశం ఉంది. చట్టం మంచే చేస్తుంది. అయితే ఈ చట్టాన్ని ఒక కోడలే కాకుండా.. అత్తమామలు, భర్త అర్థం చేసుకుంటే ఉమ్మడి కుటుంబాలు విడిపోకుండా ఉంటాయి. ‘మా నాన్నకు బాలేదని మా అమ్మ నీకు ఫోన్ చేసిన విషయం నాకెందుకు చెప్పలేదు’ కోపంతో అన్నాడు శ్రీకర్. ‘మర్చిపోయాను’ నిర్లక్ష్యంగా సమాధానం అరుణ దగ్గర్నుంచి.‘మర్చిపోయావా? అదేం సమాధానం? నీకసలు బుద్ధుందా? మా నాన్నకేమన్నా అయుంటే?’ శ్రీకర్ కోపం ఆవేశంగా మారింది. ‘ఏం కాలేదు కదా.. ఎందుకంత గొంతు చించుకుంటారు?’ ‘నువ్వసలు మనిషివేనా?’ అంటూ పెరిగిన ఆవేశంతో భార్య మీదికి చేయి లేపాడు శ్రీకర్. ‘కొడ్తారా? కొట్టండి.. మీ అమ్మానాన్నల కోసం పెళ్లాన్ని కొట్టే స్థాయికి వచ్చారు? కొట్టండి.. అరే.. వయసు మళ్లిన మనిషి.. అందుట్లోనూ బీపీ, షుగర్.. సుస్తీతో కళ్లు తిరిగి పడిపోయారు.. దానికి మీ అమ్మగారు.. అనుభవం ఉన్న పెద్దమనిషి.. కంగారు పడి మీ సెల్‌కి ఫోన్ చేశారు.. నైట్ షిఫ్ట్ చేసి అలసి అప్పుడే నిద్రపోయిన మిమ్మల్నెందుకు డిస్టర్బ్ చేయడమని.. ‘ఇప్పుడే పడుకున్నారు నేను చెప్తాలెండి లేచాక’ అన్నా.. పని హడావిడిలో పడి మరిచిపోయి చెప్పలేదు. నేను చెప్పలేదు సరే... కాల్ మీ ఫోన్‌కే వచ్చింది కదా.. ఆన్సర్ చేసినట్టుంది కదా.. అది చెక్ చేసుకొని అమ్మ నుంచి ఫోన్ ఎందుకు వచ్చిందో అని మీరెందుకు వాకబు చేసుకోలేదు. చిన్నదానికి రాద్ధాంతం చేసి కోడలు మంచిది కాదు అని నిరూపించాలని ఆ పెద్దావిడ.. ఆవిడకు వత్తాసు మీరు... కొట్టండి’ అంటూ కళ్ల నీళ్లొత్తుకొంది అరుణ. ‘మా అమ్మ ఫోన్ చేసిన విషయం నాకు చెప్పక పోగా మా అమ్మనే మాటలంటున్నావా? పైగా నువ్వెందుకు చూసుకోలేదంటూ తప్పంతా నా మీదకు తోస్తూ నంగనాచిలా ఏడుస్తావా? నిన్నుకొట్టడం కాదు.. నీలాంటి దాన్ని ఇన్నాళ్లు భరించినందుకు నన్ను నేను కొట్టుకోవాలి.. ఛీ.. ’ అంటూ బెడ్రూమ్లోకి వెళ్లిపోయాడు శ్రీకర్. ‘అవును.. ఛీ నే.. మీ నాన్నకు బాలేదన్న విషయం చెప్పలేదని అన్నేసి మాటలంటున్నారు? నాకు లేరా తల్లిదండ్రులు? నా వాళ్ల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? మా అమ్మకు బాలేదని మావాళ్లు ఫోన్ చేస్తే నన్ను పంపించారా చూడ్డానికి? మీకో న్యాయం.. నాకో న్యాయమా? అవున్లే ఎంతయినా మగాళ్లు... మొగుళ్లు! మీ వాళ్లను మా నెత్తిమీద పెట్టుకొని మోయాలి.. మావాళ్లను మాత్రం పాతాళానికి తొక్కుతారు. మమ్మల్ని గయ్యాళులుగా చూపిస్తారు.. ’ అంటూ బెడ్రూమ్లో ఉన్న భర్తకు వినిపించేలా అరిచింది అరుణ. ‘నిజంగా గయ్యాళివే.. నరకం చూపిస్తున్నావ్’ అని సణుక్కుంటూ బయటకు వెళ్లిపోయాడు శ్రీకర్. పేదింటి పిల్ల అని... మర్యాదస్తుల కుటుంబం అని... అరుణ వాళ్లది పేద కుటుంబం. డిగ్రీ వరకు చదువుకుంది. ఎవరో బంధువుల ద్వారా ఆ సంబంధం వచ్చింది. పెళ్లి చూపుల్లో వాళ్ల మర్యాద, ఆ నెమ్మదితనం చూసి ముచ్చట పడ్డారు శ్రీకర్ తల్లిదండ్రులు. ఒక్కగానొక్క కొడుకు. చక్కటి ఉద్యోగం. ఉన్నంతలో బాగానే ఉన్నారు. దేనికీ కొదవ లేదు. కట్నకానుకల కన్నా మర్యాదే ముఖ్యమనుకున్నారు. అదీగాక.. వంక పెట్టడానికి వీల్లేకుండా ఉంది అమ్మాయి. మొదటి చూపులోనే శ్రీకర్ సహా ఇంటిల్లిపాదికీ నచ్చింది. పెళ్లికి ఓకే చెప్పేశారు. మూడు నెలల్లోనే... పెళ్లాయ్యాక మూడు నెలల వరకు అంతా సవ్యంగానే సాగింది. శ్రీకర్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు. వాళ్ల అమ్మానాన్నల కోసం పూజ గది, వాళ్ల గది ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. అక్కడ మొదలైంది అరుణ గొడవ. అత్తామామలతో కలిసి ఉండడం ఆమెకు సుతరామూ ఇష్టం లేదు. ‘తర్వాత ఎలాగూ వాళ్లను చూసుకోక తప్పదు. ఇప్పటి నుంచే మనతో ఎందుకు వాళ్లు?’ అన్నది. ‘ఎందుకు ఏంటి? వాళ్లు నా తల్లిదండ్రులు.. ఇప్పుడైనా ఎప్పుడైనా నాతో కాక ఎవరితో ఉంటారు?’ అన్నాడు కాజువల్‌గానే. ‘కొత్తగా పెళ్లయిన వాళ్లం కదా.. కొన్నాళ్లు మనిద్దరమే ఉందాం...’ గోముగా అడిగింది. ‘మనిద్దరికీ వాళ్లేం అడ్డుకాదు. వాళ్లకూ తెలుసు... మనం న్యూలీ మ్యారీడ్ కపుల్’ అని.. అంతే గారంగా ఆన్సర్ చేశాడు శ్రీకర్. సహనం నశించింది అరుణలో. ‘మీ నాన్న మంచి హోదాలో రిటైర్డ్ అయ్యారు. పెద్దమొత్తంలోనే పెన్షన్ తీసుకుంటున్నాడు. అంతగా కావాలనుకుంటే మీరూ నెలనెలా ఇంత డబ్బివ్వండి.. అంతేకాని వాళ్లు మాత్రం మనతో ఉండొద్దు కొత్తింట్లో ’ అసహనం, చిరాకుతో స్పష్టం చేసింది. అవాక్కయ్యాడు శ్రీకర్. అన్నం మాని అలిగింది. ఆ అలకను, కోపాన్ని అత్తమామలూ గ్రహించేలా చేసింది. పెద్దవాళ్లు అర్థం చేసుకున్నారు కొడుకు ఇబ్బందిని. ఒకరోజు... ‘ఒరేయ్.. మేం మా పాతింటికే వెళ్లిపోతాంరా.. ఇక్కడంతా కొత్తకొత్తగా... బెరుకు బెరుకుగా ఉంది. అక్కడయితే ఏళ్ల తరబడి ఉన్నవాళ్లం కదా.. కాలక్షేపం బాగా అవుతుంది. వద్దనొద్దు నాన్నా.. ’ అని కొడుకు ముందరి కాళ్లకు బంధం వేసి పాతింటికి వెళ్లిపోయారు శ్రీకర్ తల్లిదండ్రులు. వారానికి ఒక్కరోజు తల్లిదండ్రులను కలవడానికి వెళ్లేవాడు. ఆ ఒక్కసారి వెళ్లడమూ అరుణకు ఇష్టం ఉండేది కాదు. అప్పుడప్పుడు డబ్బు సర్దుతున్నా నచ్చేది కాదు. అరుణ అలకలు, అరుపులు, కోపానికి భయపడి పండుగలు, పబ్బాలు, నోములు, వ్రతాలు దేనికీ వెళ్లవాడు కాదు తల్లిదండ్రుల దగ్గరకు. చివరకు వాళ్లు ఎంతో పెద్ద కష్టం వస్తేకాని కొడుకుకు చెప్పేవారు కాదు. చివరకు తమకు కొడుకు పుట్టినా ఆ శుభవార్తను చెప్పనివ్వలేదు అరుణ! దూరపు బంధువుల ద్వారా తెలుసుకున్నారు వాళ్లు. కొడుకు ఫస్ట్ బర్త్‌డేకి భార్యకు తెలియకుండా అమ్మానాన్నను పిలిచాడు. ఆ ఫంక్షన్లోనే పెద్ద గొడవ చేసి వాళ్లను అవమానించి పంపించేసింది. భార్య, తల్లిదండ్రుల బంధాన్ని బ్యాలెన్స్ చేయలేక మనశ్శాంతిని కోల్పోయి బతకలేక అరుణకు తలవంచాడు శ్రీకర్. తల్లిదండ్రులకు మొత్తానికే దూరమయ్యాడు. తర్వాత కొన్నాళ్లకు... శ్రీకర్ వాళ్ల నాన్నగారు బీపీ, షుగర్ ఎక్కువై ఆసుపత్రి పాలైతే భయపడి వాళ్లమ్మ ఫోన్ చేసింది. అదే ప్రస్తుతం శ్రీకర్‌కు, అరుణకు మధ్య చిచ్చు రగిలించింది. నిజంగానే తన తండ్రికి ఏమన్నా అయివుంటే? ఊళ్లోనే చెట్టంత కొడుకు ఉండీ తండ్రిని కాపాడుకోలేని అసమర్థుడిగా మిగిలిపోయేవాడు. తనను ఈ స్థాయికి తేవడానికి అమ్మానాన్న ఎంత కష్టపడ్డారో కళ్లముందు కదిలింది. కళ్లలో నీళ్లను తెప్పించింది. తన క్షేమం, సుఖం కోసం వాళ్ల జీవితాన్నే అర్పించిన తల్లిదండ్రులను భార్య కోసం.. వదులుకున్నాడు. క్షమించరాని నేరం. ఇక అమ్మానాన్నలను అలా ఒంటరిగా వదిలేయకూడదు. ఆరునూరైనా.. అరుణ తనను వదిలేసినా సరే అమ్మానాన్నతోనే కలిసిఉండాలి అని నిశ్చయానికి వచ్చాడు శ్రీకర్. తిరిగి రాకపోతే అక్కర్లేదు... ‘రేపు అమ్మానాన్న ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడే మనతోనే ఉంటారు ఎప్పటికీ’ అన్నాడు స్థిరమైన స్వరంతో శ్రీకర్. ‘అయితే నేనుండను. బాబును తీసుకొని మా అమ్మావాళ్లింటికి వెళ్లిపోతాను’ అంతే స్థిరంగా బదులు ఇచ్చింది అరుణ. ‘బాబును తీసుకొనా? ఆ హక్కు నీకు లేదు’ అన్నాడు. ఆ మాటతో పెద్ద యుద్ధమే అయింది. నిజంగానే అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది అరుణ. బతిమాలి భార్యను ఇంటికి తెచ్చుకోవాలనుకోలేదు శ్రీకర్. తనే గ్రహించి రావాలి అని ఆశించాడు. నాలుగు నెలలయినా జరగలేదు. లాయర్ సలహా తీసుకున్నాడు శ్రీకర్. రెస్టిట్యూషన్ ఆఫ్ కన్ జుగల్ రైట్స్‌కి వేసుకున్నాడు. తనను అత్తామామా చాలా హింసిస్తున్నారని ఆ ఇంట్లో వాళ్లుంటే కాపురానికి వెళ్లనని చెప్పింది తెగేసింది అరుణ. కాని అత్తామామ ఆమెను ఇబ్బంది పెడ్తున్నట్టుగా సాక్ష్యాధారాలు లేకపోగా అరుణ వల్లే వాళ్లు ఇబ్బంది పడ్తున్నట్టుగా రుజువైంది. ఆ వయసులో ఆ పెద్దవాళ్లు అనాథల్లా ఎలా బతుకుతారు? వాళ్లకు కొడుకు అండ కావాలని, కొడుకు భార్యగా కోడలు వాళ్ల బాధ్యతను తీసుకోవాలని అరుణకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా ససేమీరా అంది అరుణ. భార్య ప్రవర్తనతో విసిగిపోయిన శ్రీకర్ విడాకులు కోరాడు. ఇంకో మాట లేకుండా కోర్ట్ విడాకులు మంజూరు చేసింది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు! ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఇటీవల సుప్రీం కోర్టు ఓ తీర్పునిచ్చింది. 1955 హిందూ వివాహ చట్టం, సెక్షన్ 13 .. విడాకుల కోసం చెప్తున్న అనేక కారణాలలో మానసిక హింస ఒకటి. జంటలో ఎవరైనా ఒకరు మిగిలిన వారిని మానసిక వేధింపులకు గురిచేస్తే విడాకులు తీసుకోవచ్చు. అందులో భాగంగానే అత్తామామల నుంచి భర్తను వేరుచేయాలని చూసినా, ఆ కారణంతో భర్తను హింసిస్తున్నా .. ఆ భర్త ఆ భార్యకు విడాకులు ఇవ్వచ్చొని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ‘తల్లిదండ్రులను చూసుకోవడం కొడుకు బాధ్యత. అందుకు భార్య అడ్డుపడుతుంటే ఆమెకు విడాకులు ఇవ్వచ్చు. విడికాపురం పెట్టాలని భర్తను వేధింపులకు గురిచేయడం మన సంస్కృతికి విరుద్ధం’అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇ. పార్వతి, అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
చెక్‌బౌన్స్ కేసులో టీడీపీ ఎంపీ కోడలు ఆరెస్ట్
-
కోడలిపై దాడి కేసులో అత్త అరెస్ట్
-
పూడ్చేందుకు జాగా లేక...
-
కోడల్ని కాల్చి చంపేసింది!
జార్జియాః అమెరికా జార్జియాలో దారుణం చోటు చేసుకుంది. తన కొడుకును విడాకులు కోరినందుకు ఏకంగా ఓ అత్తగారు కోడల్ని కాల్చి చంపేసింది. కొద్దిరోజులుగా ఇంటి గొడవలు కారణంగా కోడలు.. తన ఇద్దరు పిల్లలతోపాటు పుట్టింటికి వెళ్ళిపోయింది. తల్లితండ్రులతో కలసిఉంటున్న ఆమెను కాపురానికి తీసుకొచ్చే వంకతో వెళ్ళిన అత్త.. మనవలు చూస్తుండగానే కోడల్ని కాల్చి చంపేసింది. సౌత్ జార్జియా మెక్ రియోకు చెందిన 68 ఏళ్ళ ఎలిజబెత్ వాల్.. వాయువ్య అట్లాంటా పౌడర్ స్ప్రింగ్స్ లో నివసిస్తున్నతన 35 ఏళ్ళ కోడలు.. జెన్నావాల్ ను తుపాకీతో కాల్చి చంపింది. కొడుకుతో గొడవలు పడి కొద్దిరోజులుగా పుట్టింట్లోనే ఉంటున్నజెన్నాను కాపురానికి తెచ్చేందుకు వెళ్ళిన ఎలిజబెత్.. అక్కడే ఉన్న మనవళ్ళను ముందుగా బయటకు పంపించి, ఇంట్లోనే ఉన్న కోడల్ని మాత్రం షూట్ చేసి, హత్య చేసినట్లు జైల్ రికార్డులు చెప్తున్నాయి. కోడల్ని చంపడంతోపాటు, పిల్లల ఎదుటే హింసకు పాల్పడినందుకు గాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎలిజబెత్ వాల్ పై పలు కేసులు నమోదు చేశారు. అయితే ఆమెకు సంబంధించిన మిగిలిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. బాధితురాలు కాబ్ కౌంటీ కెంప్ ఎలిమెంటరీ స్కూల్లో కిండర్‌గార్టెన్ లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. స్కూల్ వెబ్ సైట్ లోని వివరాలను బట్టి ఆమె.. జార్జియా కెన్నెసా హారిసన్ హై లోను, జార్జియా యూనివర్శిటీలోను చదివి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె...కాబ్ కౌంటీలోని మరో రెండు స్కూళ్ళలో కూడ చదివినట్లు వెబ్ సైట్ లోని వివరాలు చెప్తున్నాయి. -
'వైఫ్ స్వాపింగ్' ఒప్పుకోనందుకు..!
అత్తింటి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు బాధితురాలు ప్రముఖ వ్యాపారవేత్త త్రైలోక్య నాథ మిశ్రా కోడలు భువనేశ్వర్: అత్తింటి వారి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్త త్రైలోక్యనాథ మిశ్రా కోడలు లోపముద్ర మిశ్రా పోలీసులను ఆశ్రయించారు. మంగళ వారం రాత్రి తన ప్రాణానికి ముప్పు ఉందని బెదిరించారని స్థానిక బర్గడ్ పోలీసు ఠాణాలో బుధవారం ఉదయం ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని అపహరిస్తామని అత్త, మామ బెదిరించారని పేర్కొన్నారు. పెళ్లయిన కొత్తలో హానీ మూన్ నేపథ్యంలో విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ వైఫ్ స్వాపింగ్ (భార్యల బదిలీ) కాలక్షేపానికి ఆమె నిరాకరించడంతో వైవాహిక జీవితం తొలి దశలోనే తనపట్ల భర్త అమానుషంగా వ్యవహరించినట్లు ఆలస్యంగా వెలుగులోకి తెచ్చారు. పెద్దింటి కోడలిగా సమాజంలో గౌరవం కాపాడుకుంటు పుట్టింటికి అగౌరవం కలగకుండా జాగ్రత్తపడేందుకు చాల కాలం ఓపికతో వ్యవహరించడంతో రోజు రోజుకు వేధింపులు తీవ్రంగా మారాయి తప్ప పరిస్థితులు కుదుటపడనట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల కిందట వేధింపుల గురించి స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీంతో తనను హత్య చేస్తామని అత్తింటి వారు బెదిరించారని పేర్కొన్నారు. 2006 సంవత్సరం జనవరి నెల 27వ తేదీన పారిశ్రామికవేత్త త్రైలోక్యనాథ మిశ్రా కుమారుడు సవ్యసాచి మిశ్రాతో ఆమెకి వివాహం జరిగింది. భర్త వేధింపులకు అత్త ఆశా మంజరి మిశ్రా, మామ త్రైలోక్యనాథ మిశ్రా పరోక్షంగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించినట్లు బహిరంగపరిచారు. ఈ మేరకు స్థానిక మహిళా ఠాణాలో ఆమె ఫిర్యాదు దాఖలు చేశారు. ఫలితం శూన్యం కావడంతో ఈసారి స్థానిక బర్గడ్ ఠాణాలో మరో ఫిర్యాదు దాఖలు చేశారు. పోలీసుల నిర్వీర్యతపట్ల నగర డీసీపీ సత్యబ్రొతొ భొయి స్పందించారు. లోపముద్ర ఆరోపణల నేపథ్యంలో తక్షణమే చర్యలు చేపడతామని ఆయన బుధ వారం మీడియాకు తెలియజేశారు. మహిళా ఠాణా పోలీసుల నిర్వీర్యత ఖాతరు చేయకుండా నగర పోలీసు కమిషనరేటు ఆధ్వర్యంలో కౌన్సిలింగుకు అభ్యర్థించి చేసిన ప్రయత్నాలు కూడ ఫలించనట్లు ఆమె విచారం వ్యక్తం చేశారు. -
అత్తగారి కండిషన్స్
గుణవధు కాబోయే అత్తగారొకరు తమ కుటుంబంలోకి కోడలుగా రావలసిన అమ్మాయికి ఉండాల్సిన గుణగణాలను ఏకరువు పెడుతూ, వ్యంగ్యంగా సాగే వీడియో ఇంటర్నెట్లో ఇప్పుడు ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. 12 అంతర్జాతీయ అవార్డులతో 2012లో సంచలనం సృష్టించిన కార్లే రే జెప్సన్ ఆల్బమ్ ‘కిస్’లోని ‘కాల్ మీ మేబీ’ పాటకు పేరడీగా మద్రాసు ఐ.ఐ.టి. విద్యార్థులు.. ‘బీ అవర్ పొండాట్టి’ పేరుతో ఈ వీడియోను రూపొందించారు. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో కుర్చీపై కూర్చున్న ఓ మహిళ తన కుమారుడికి కావలసిన వధువు లోని లక్షణాల కోసం పెద్ద చిట్టానే విప్పింది. -
ఎస్సైపై కోడలి ఫిర్యాదు
హైదరాబాద్: కొడుకు నుంచి విడిపోవాలని వేధిస్తున్నారంటూ ఓ ఉన్నతాధికారిపై ఫిర్యాదు చేసింది కోడలు. పోలీస్ శాఖలో రిజర్వ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న ఆ అధికారి పేరు మంచు మోషేస్ బాబు. గత కొంత కాలంగా అత్తమామలు తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ బాధిత కోడలు సోమవారం రాత్రి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసింది. నిందితులపై సెక్షన్ 498ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు.. ఆ అధికారిని అదుపులోకి తీసుకునేందుకు మాత్రం వెనకాడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది. -
రాజయ్య కోడలు మరణం; అన్ని కోణాల్లో దర్యాప్తు
-
వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై కసరత్తు
-
వితంతు కోడళ్లూ భరణానికి అర్హులే
లీగల్ కౌన్సెలింగ్ నేను నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మాకు ఒక బాబు పుట్టాడు. వాడికి ఏడాది అయినా గడిచిందో లేదో దురదృష్టవశాత్తూ మా వారు ఓ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటినుంచి నేనూ, బాబూ అనాథలమైనాము. ఇప్పుడు బాబుకు మూడేళ్లు. మాది కులాంతర వివాహం కావడంతో నాకు పుట్టినింటి నుంచి ఏ అండా లేదు. అత్తింటి వారేమో మా కొడుకే పోయాక మీకూ మాకూ ఇక సంబంధం ఏమిటని నన్ను ఈసడించుకుంటున్నారు. నేను డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. ఉద్యోగం వస్తుందన్న ఆశ లేదు. అటు పుట్టింటి అండాలేక, అత్తింటి ఆదరణా లేక చాలా ఇబ్బందిపడుతున్నాను. మా అత్తమామలు ధనవంతులు. ఏ బాధ్యతలూ లేనివారు. నాకు ఆస్తికోసం వారితో పోట్లాడటం ఇష్టం లేదు. మా ఇద్దరికీ నెలవారీ ఖర్చులకు సరిపడా మెయింటెనెన్స్ ఇస్తే చాలు. నాకు ఏదైనా ఆధారం దొరికాక అది కూడా అక్కరలేదు. నన్ను ఏం చేయమంటారు? కోడలిని పోషించవలసిన బాధ్యత అత్తమామలకు లేదా? - ఒక సోదరి, హైదరాబాద్ మీ పరిస్థితి దయనీయం. మీ ఆత్మగౌరవం హర్షణీయం. వితంతువైన కోడలు అత్తమామలనుంచి మెయింటెనెన్స్ పొందవచ్చు. మీరే కాదు, మీ బాబు కూడా. మీరు ఆశ్రయించవలసిన చట్టం ది హిందూ అడాప్షన్ అండ్ మెయిన్టెనెన్స్ యాక్ట్ 1956. ఈ చట్ట ప్రకారం తనను తాను పోషించుకోలేని, పోషణకు ఏ ఆధారమూ, ఆస్తిపాస్తులూ, ఆదాయమూ లేని వితంతువైన కోడలు మామగారి నుంచి సెక్షన్ 19ను అనుసరించి మెయింటెనెన్స్‌ను పొందవచ్చు. మీరు వెంటనే కోర్టును ఆశ్రయించండి. మీ వారికి రావలసిన ఆస్తిని కూడా మీ మామగారు ఇవ్వలేదు. కనుక ఈ పిటిషన్ వేసిన తర్వాత ఆయనే స్వచ్ఛందంగా ఆస్తి ఇచ్చే అవకాశం కూడా ఉంది. నేను నా భర్తపై 498-ఎ కేస్ వేశాను. అది కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈలోగా నా భర్త, మా ఇరు కుటుంబాల వారు మాట్లాడుకుని, కేస్ కాంప్రమైజ్ అవ్వాలని, దానికి గాను అతను 15 లక్షలు శాశ్వత మనోవర్తి ఇచ్చేలా, ఇరువురూ కంసెంట్ విడాకులు తీసుకునేలా నిర్ణయించారు. నా సమస్యేమిటంటే విడాకుల పిటిషన్ దాఖలు చేసేనాడు 10 లక్షలు డి.డి. ఇస్తామని, విడాకులు మంజూరు చేసేనాడు మిగతా 5 లక్షలు ఇస్తామని అంటున్నారు. నాకేమో మోసపోతానని భయంగా ఉంది. ఏం చేయమంటారు? - సౌమ్య, విశాఖపట్నం మీరు చెప్పిన విషయాలు పిటిషన్లో రాసుకోవాలి. భయపడే అవసరం లేదు. మొదటి విడత డబ్బులు ఎలాగూ ఇచ్చేస్తారు. రెండో మొత్తం మీకు ముట్టిన తర్వాతనే ముట్టిందని జడ్జిగారు నిర్ధారించుకున్న తర్వాతనే మీకు విడాకులు వస్తాయి. మీకు మొత్తం సొమ్ము ముట్టకుండా విడాకులు రావు. ఒకవేళ మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎటూ క్రిమినల్ కేసు ఉండనే ఉంది. ముందు విడాకుల కేసు, తర్వాత క్రిమినల్ కేసు ఉండేలా చూసుకోండి. అప్పుడే మీరు క్రిమినల్ కేస్ కాంప్రమైజ్ కావచ్చు. నా పేరు మంగ్లీ. నా మాజీ భర్త పేరు జామియా. మేము ఒక ట్రైబల్ తండాకు చెందినవారం. మాకు ఒక పాప ఉంది. కొన్ని కారణాల వల్ల మేమిరివురము మా తండా పెద్దల కుల పంచాయతీ ద్వారా విడాకులు తీసుకున్నాము. తర్వాత నేను మారు మనువు చేసుకున్నాను. నేను మా తండాలోనే అంగన్వాడీ వర్కర్‌గా పనిచేస్తున్నాను. పాప కూడా నా దగ్గరే ఉంది. నా భర్త బస్‌డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఒక రోజు నా మాజీ భర్త పాపను చూసి వెళ్తానని అడిగితే అంగన్వాడి స్కూల్ దగ్గరకు రమ్మని చెప్పి పాపను చూపించి పంపించాను. అది తెలిసిన నా భర్త నన్ను అనుమానించి, చిత్రహింసలపాల్జేసి అసలు మా వివాహం చెల్లదని, రద్దు చేయవలసిందిగా ప్రకటించమని కోర్టును ఆశ్రయించాడు. నేనసలు మొదటి భర్త నుండి విడాకులు తీసుకోలేదని అతని వాదన. నేను అతనికి అన్నీ చెప్పే వివాహం చేసుకున్నాను. నాకు సలహా ఇవ్వండి. - మంగ్లీ, ఆదిలాబాద్ అతని వాదనలో నిజం లేదు. మీ రెండవ వివాహం చెల్లుతుంది. ఎందుకంటే మీరు మొదటి భర్త నుండి తీసుకున్నది ‘కస్టమరీ డైవర్స్’ అంటే కొన్ని ‘గుర్తించబడిన కులాలకు/తెగలకు’ వారి ఆచారాలను, సంప్రదాయాలను తరతరాలుగా వస్తున్న పద్ధతులను అనుసరించి కులపెద్దల సమక్షంలో విడాకులు తీసుకునే కట్టుబాటు ఉంటుంది. వీరి వివాహ పద్ధతులు, సంప్రదాయాలు ఆచారాలు భిన్నంగా ఉంటాయి. సెక్షన్ 29 (2) హిందూ వివాహ చట్టం కుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల ప్రకారం వివాహాన్ని రద్దు చేసుకోవడానికి ఉన్న హక్కును మార్పు చేయదు. ఆచారాల ప్రకారం విడాకులు తీసుకునే పద్ధతి అమలులో ఉంటే చట్టం దానిని రక్షిస్తుంది అని అర్థం. కనుక మీరు మీవారి పిటిషన్‌ను అడ్డుకోవచ్చు. మీ వర్షన్‌కు ఫేవర్‌గా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్వారు లోయ పద్మజ వర్సెస్ లోయ వీర వెంకట గోవిందరాజులు కేస్‌లో తీర్పునిచ్చారు. 1999 (6) ఎఎల్డి 413 (డిబి). మా పెళ్లయ్యి పాతికేళ్లయింది. మా పిల్లలిద్దరూ అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మా వారు బ్యాంక్‌మేనేజర్. ఇటీవలే వి.ఆర్.ఎస్ తీసుకున్నారు. నా సమస్యేమిటంటే, పెళ్లయినప్పటినుంచి ఇన్ని సంవత్సరాల వరకు నేను మా వారిని, పిల్లలను ఎంతో శ్రద్ధగా చూసుకున్నాను. కుటుంబం కోసం నా ఆరోగ్యాన్ని, వ్యక్తిగత ఆనందాన్ని కూడా లెక్క చేయకుండా అవిశ్రాంతంగా పని చేశాను. నేను చేసిన పనులను మా వారు ఏనాడూ గుర్తించక పోగా ఎప్పుడూ ఏదో ఒక దానికి దెప్పి పొడిచేవారు. నన్ను ఒక మనిషిగా కూడా గుర్తించేవారు కాదు. పిల్లల కోసమే నేను ఆయన పెట్టిన హింసలను ఇన్నాళ్లూ ఓపిగ్గా భరించాను. అయితే ఇటీవల కాలంలో ఆయన నేను ముసలిదాన్నయ్యాననీ, తనేమో ఇంకా ఫిట్‌గా ఉన్నాననీ, ఈ వయసులో కూడా అమ్మాయిలు తనంటే పడి చస్తున్నారనీ నన్ను తీవ్రమైన మానసిక వేదనకి గురి చేస్తున్నారు. నేనది సహించలేకపోతున్నాను. ఆయన ఉనికి కూడా భరించలేకపోతున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి. - ఎ. సావిత్రి, విజయవాడ ఈ వయసులో మిమ్మల్ని ఆయన మీద కేసు పెట్టమని కానీ, విడాకులివ్వమని కానీ నేను మీకు సలహా ఇవ్వలేను. కానీ మీకు ఒక పరిష్కారం సూచించగలను. మీరు మొట్టమొదట మీ వారి ఉనికిని భరించలేకపోతున్నారు. ఒక ఇంట్లో ఆయనతో కలిసి ఉండలేకపోతున్నారు. అతని మానసిక వేధింపుల నుంచి తప్పించుకుని ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు పై కారణాలన్నీ వివరిస్తూ, ఫ్యామిలీ కోర్టులో జుడీషియల్ సెపరేషన్ కోరుతూ పిటిషన్ వేయండి. సెక్షన్ 10, హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం దీనిని విడాకులు లేకుండా విడిపోవడం అంటారు. కోర్టువారు విచారణ తర్వాత విడివిడిగా జీవించడానికి మీకు డిక్రీ ఇస్తారు. ఇందువల్ల మీ వివాహ బంధం రద్దు కాదు. ఆస్తిహక్కులకు ఏ ముప్పూ వాటిల్లదు. కేవలం శారీరక సంబంధాలు మాత్రం రద్దవుతాయి. ఇద్దరూ కలిసి జీవించే హక్కు తాత్కాలికంగా రద్దవుతుంది. అయితే ఒకే ఇంట్లో నివసించకుండా మీరు విడివిడిగా జీవించవలసి ఉంటుంది. ఈ సెక్షన్‌లోని అంతరార్థం ఏమిటంటే పునరాలోచించుకుని లోటుపాట్లను సవరించుకుని మరలా కలిసి జీవించడానికి అవకాశం ఇవ్వడం. మీ భర్త తన ప్రవర్తనను మార్చుకుని, మిమ్మల్ని సక్రమంగా చూస్తానని మీకు నమ్మకం కలిగిస్తే, మీరు మరలా అతనితో మీ వివాహ బంధాన్ని కలుపుకుని కలిసి కాపురం చేయవచ్చు. ప్రయత్నించి చూడండి. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ -
దిక్కెవరు!
కన్న కొడుకు బలవన్మరణం... అనాథలైన చిన్నారులు వృద్ధాప్యంలో మీదపడ్డ కుటుంబ భారం దౌల్తాబాద్: మూడో బిడ్డకు జన్మనిచ్చి కోడలు మరణించింది. అప్పుల బాధలు... జీవితం భారమై... కన్న కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ముగ్గురు పసివాళ్లను అనాథలను చేసి తల్లిదండ్రులు వెళ్లిపోతే... ఆ భారం వృద్ధాప్యంతో బతుకీడుస్తున్న వృద్ధురాలిపై పడింది. తినడానికి తిండి లేక... ఉండటానికి సరైన ఇల్లు లేక... భారంగా నెట్టుకొస్తున్న ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. ఓ పక్క కొడుకు మరణంతో... గుండె పగులుతుంటే... మరోపక్క మీదపడిన చిన్నారుల బాధ్యత... కదలలేని ఈ వయసులో మాకు దిక్కెవరంటూ రోదిస్తున్న ఆ అవ్వను చూసి అక్కడున్నవారి కళ్లు చెమర్చుతున్నాయి. దౌల్తాబాద్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం కనిపించిన హృదయవిదారక ఘటన ఇది. లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మచ్చ సుజాత, స్వామి దంపతులు. ఓ పూరింట్లో నివాసముంటూ కూలీనాలీ చేసి కుటుంబాన్ని పోషించారు. మూడో కాన్పులో సుజాత మరణించింది. ముందు రెండు కాన్పులూ ఆడపిల్లలు. వృద్ధురాలైన తల్లి దుర్గమ్మ, ముగ్గురు పిల్లలను పోషించడం స్వామికి ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో సాయం అందించాలంటూ సీఎం కేసీఆర్‌ను మే 24న కలిసి విన్నవించాడు. సీఎం ఆదేశాలతో ఇద్దరు ఆడపిల్లలను అధికారులు గజ్వేల్‌లోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో చేర్పించారు. అయినా నాలుగు నెలల పసివాడు, వయసు మీదపడ్డ తల్లి పోషణ భారమైన స్వామి గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వృద్ధురాలైన తల్లి దుర్గమ్మపైనే ఇప్పుడు ముగ్గురు బిడ్డల భారమూ పడింది. కొడుకు మరణంతో విలపిస్తూ... పిల్లలతో ఎలా సంసారాన్ని నెట్టుకురావాలో దిక్కుతోచక శుక్రవారం ఆమె కన్నీటి పర్యంతమైంది. ఆమెను ఓదార్చడం చుట్టుపక్కలవారి తరం కాలేదు. రూ.30 వేలు తక్షణ సాయం ఈ సంఘటనతో చలించిన మంత్రి హరీష్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డిలు ఆ కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని గడా అధికారి హన్మంతరావు, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు, సర్పంచ్ రణం శ్రీనివాస్‌గౌడ్‌లకు సూచించారు. దీంతో వెంటనే గ్రామానికి వెళ్లి రూ.30 వేలు తక్షణ సాయం అందించారు. భూమి కొనుగోలు చేసి పంపిణీ చేయాల్సిందిగా దౌల్తాబాద్ తహశీల్దార్‌కు ఆదేశాలిచ్చామని హన్మంతరావు చెప్పారు. అలాగే ఆడపిల్లలకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దుర్గమ్మకు కూడా రూ.లక్ష ఇస్తామన్నారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. -
అమ్మ ఇవ్వనంది.. అత్త ఆదుకుంది!
కోడలికి కిడ్నీ దానం చేసిన అత్త న్యూఢిల్లీ: అత్తలందరూ కఠిన హృదయులు కాదని ఆమె నిరూపించింది. ఆపదలో ఉన్న కోడలిని అమ్మకంటే మిన్నగా ఆదుకుని ప్రాణం పోసింది! తొలుత కిడ్నీ ఇస్తానన్న ఆ కోడలి అమ్మ ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గగా, అత్త నేనున్నానంటూ ముందుకొచ్చి కిడ్నీ దానం చేసింది. మనసు కదిలించే ఈ ఉదంతం ఢిల్లీలో చోటుచేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన కవిత (36) కిడ్నీ పాడవడంతో బీఎల్కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరింది. కిడ్నీ మార్చాలని వైద్యులు నిర్ణయించారు. కవిత పుట్టింటి, మెట్టినింటి వారికి అదొక సవాలైంది. చివరికి ఆమె తల్లి కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకుంది. సర్జరీకి ఏర్పాట్లు చేశారు. అయితే ఆఖరు నిమిషంలో కవిత తల్లి కిడ్నీ ఇవ్వడానికి నిరాకరించింది. ఏం చేయాలో డాక్టర్లకు పాలుపోలేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా కవిత అత్త విమల(65) ‘నేను కిడ్నీ ఇస్తాను’ అంటూ ముందుకొచ్చింది. ఆశ్చర్యం నుంచి తేరుకున్న డాక్టర్లు విమలకు పరీక్షలు జరిపారు. ఆమె కిడ్నీ కవితకు సరిపోతుందని నిర్ధారించారు. గత నెల 23న విమల కిడ్నీని కవితకు అమర్చారు. సర్జరీ విజయవంతం అయిందని, అత్తాకోడళ్లు కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. -
కోడలు, భార్య.. వారి తల్లిదండ్రులను చంపాడు
బెల్గ్రేడ్: కుమారుడికి పెళ్లయిన మరుసటి రోజే కొత్త కోడల్ని చంపేశాడు. భార్యనూ కాల్చేశాడు. కోడలు, భార్యల తల్లిదండ్రులను చంపాడు. అనంతరం ఆయనా కాల్చుకుని చనిపోయాడు. సెర్బియాలో ఈ విషాదకర సంఘటన జరిగింది. బెల్గ్రేడ్కు 185 కిలో మీటర్ల దూరంలోని మార్టొనోస్ గ్రామంలో రడె సెఫెర్ (55) అనే వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. -
కోడలిపై ఏసీపీ అత్యాచారం
న్యూఢిల్లీ: కోడలిపై అత్యాచారం చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)పై కేసు నమోదు చేసినట్లు దక్షిణ ఢిల్లీలోని వసంతకుంజ్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. అయితే సదరు ఉన్నతాధికారి పేరు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. బాధితురాలి పేరు బహిర్గతం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితుడు ఉత్తర ఢిల్లీలోని కీలక ప్రాంతంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. కాగా గత ఏడాది మేలో మామ ఏసీపీ బెదిరించి తనపై అత్యాచారం చేశారని... ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదించారని... దాంతో తాను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైయానని బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. ఏసీపీని ఇంకా అరెస్ట్ చేయలేదని పోలీసులు వివరించారు. -
తన చీర కట్టుకోబోయిన కోడలి గొంతు కోసి చంపిన అత్త
బెంగళూరు : చీరకు సంబంధించిన వివాదం ఓ నిండు ప్రాణం తీసింది. చీర కట్టుకునే దగ్గర మాటా మాటా పెరిగి ఓ అత్త కోడలి గొంతు కోసి హత్య చేసింది. ఈ దారుణ ఘటన ఉడిపి జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కుందాపుర తాలూకా బైందూరు సమీపంలోని మొగలి గ్రామంలో అత్తా కోడళ్లు చంద్రావతి (55), నాగరత్న (30) నివాసముంటున్నారు. ఈ రోజు ఉదయం నాగరత్న భర్త పని మీద బయటకు వెళ్లాడు. ఆ సమయంలో నాగరత్న చంద్రావతి చీరను కట్టుకోడానికి యత్నించింది. అందుకు అత్త అభ్యంతరం చెప్పింది. నాగరత్న వినలేదు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన చంద్రావతి కోడలిని కిందకు పడేసి, ఆమెపై కూర్చొని కత్తితో గొంతు కోసేసింది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో నాగరత్న క్షణాల్లో మరణిచింది. అనంతరం చంద్రావతి పారిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న చంద్రావతి కోసం గాలిస్తున్నారు. -
మామకు తలకొరివి పెట్టిన కోడలు
వెల్దుర్తి, న్యూస్‌లైన్: కుటుంబంలో మగవారు లేకపోవడంతో ఓ కోడలు మామకు తలకొరివి పెట్టి దహన సంస్కారాలు చేసింది. ఈ ఘటన శుక్రవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నెల్లూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రావుల సాయిలు(50) గుండెపోటుతో గురువారం రాత్రి మృతిచెందాడు. సాయిలు భార్య లక్షి నాలుగేళ్ల క్రితం మృతిచెందగా, ఉన్న ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు రెండేళ్ల క్రితం, మరో కుమారుడు ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఇద్దరు కోడళ్లు మాత్రమే ఉండగా, శుక్రవారం జరిగిన అంత్యక్రియల్లో పెద్ద కోడలు మణెమ్మ తలకొరివి పెట్టింది. -
అత్తా కోడలు.. దొంగనోట్ల చెలామణిలో దిట్టలు
ఎర్రగుంట్ల(వైఎస్ఆర్ జిల్లా), న్యూస్‌లైన్:జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన లక్ష్మీదేవి, సుమలత ఇద్దరూ అత్తాకోడలు. పనీపాట లేకుండా ఇంటి పట్టున ఉండే వీరిని బడా దొంగలు పావులుగా వాడుకున్నారు. చిల్లర డబ్బులకు కక్కుర్తి పడిన మహిళలిద్దరూ దొంగనోట్లు మార్పిడి చేస్తూ చివరకు పోలీసులకు చిక్కిపోయారు. ఇందుకు సంబంధించిన వివ రాలను ఎస్ఐ భానుమూర్తి విలేకరులకు ఆదివారం తెలిపారు. దొంగనోట్లను ఎలా మార్పిడి చేసేవారంటే... అసలు నోటును పోలి ఉండే రూ.500 దొంగనోటను తీసుకుని వివిధ ప్రాంతాల్లోని చిల్లర దుకాణాలకు వెళ్తారు. రూ.వందలోపు విలువ చేసే సరుకులను తీసుకుని తమ వద్దనున్న రూ.500 నోటు ఇస్తారు. మిగిలిన రూ.400 ఇవ్వగానే క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోతారు. కొన్నాళ్లపాటు అటువైపు తిరిగి చూడరు. ఇంకో ప్రాంతానికి వెళ్తారు. అక్కడా ఇదే తంతు. దొరికింది ఇలా... యథాప్రకారం ఆదివారం కూడా పైన పేర్కొన్న అత్తాకోడలు ఎర్రగుంట్లకు వచ్చారు. పలు దుకాణాల్లో వస్తువులు కొని దొంగనోట్లను మార్చేశారు. యాపారం బాగుందనుకుని వేంపల్లెకు వెళ్లే మార్గంలోని వెంకటసుబ్బయ్య చిల్లర దుకాణానికీ వెళ్లారు. అక్కడ రూ.వంద విలువ చేసే వస్తువులు కొని రూ.500 నోటు అంటగట్టారు. మిగిలిన రూ.400 తీసుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా కనుమరుగయ్యారు. అదే సదరు వ్యాపారి అదే నోటును మరో వినియోగదారుడికి ఇస్తూ నిశితంగా పరిశీలించగా ఆ నోటు నకిలీదిగా గుర్తించారు. వచ్చిన వినియోగదారులు కూడా నకిలీ నోటేనంటూ తేల్చారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దుకాణాదారుడు వెంకటసుబ్బయ్య కొందరిని వెంటబెట్టుకుని తనకు నకిలీ నోటు అంటగట్టిన మహిళల కోసం వెతికారు. నడివూరులో వారిద్దరూ ఉండగా పట్టుకుని నిలదీశారు. వారి బ్యాగును పరిశీలించగా మరికొన్ని నకి లీ నోట్లు ఉండడాన్ని కనుగొన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి పోలీసులు ఎస్ఐ భానుమూర్తి, ఏఎస్ఐ చంద్రశేఖర్ తమ సిబ్బందిని వెంటబెట్టుకుని అక్కడికి చేరుకున్నారు. మహిళలిద్దరినీ తమ వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ విచారణ చేశారు. పెద్దమొడియం మండలం పాలురు గ్రామానికి చెందిన షామీర్ అనే వ్యక్తి తమకు ఈ నోట్లు ఇచ్చినట్లు వారు విలువైన సమాచారం ఇచ్చారు. కమిషన్ పద్ధతిన దొంగనోట్లను తాము మార్చుతున్నట్లు మహిళలిద్దరూ అంగీకరించారు. అయితే వారు చెప్పిన షామీర్ అనే వ్యక్తికి సంబంధించిన సమాచారం నిజమా, కాదా అనే విషయాలపై దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు.