రాంచీ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా కొంత మంది ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. కలియుగం నుంచి కంప్యూటర్ యుగం వరకు మానవుడు ఎంతగానో వైజ్ఞానిక అభివృద్ధి సాధించినా.. సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించలేకపోతున్నారు. మూఢనమ్మకంతో తాజాగా ఓ మహిళ తన నాలుకనే కోసుకుంది. తప్పిపోయిన కోడలు సురక్షితంగా తిరిగి రావాలంటూ శివుడికి నాలుకను సమర్పించింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్సావన్ జిల్లాలోని ఎన్‌ఐటీ క్యాంపస్‌లో ఆదివారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌ఐటీ క్యాంపస్‌కు చెందిన లక్ష్మీ నిరాలా కోడలు జ్యోతి ఆగస్ట్ 14న తన బిడ్డతో కలిసి తప్పిపోయింది. అప్పటి నుంచి లక్ష్మీ శివుడి గుడి ముందు కూర్చొని ప్రార్థిస్తూ ఉంది. తన కోడలు సురక్షితం తిరిగి ఇంటికి రావాలని తన నాలుకను కత్తిరించుకుంది. శివుడికి నాలుకను సమర్పిస్తే కోడలు తిరిగి వస్తుందని ఎవరో చెప్పుడంతో ఆమె అలా చేసిందని లక్ష్మి భర్త నందూలాల్ నిరాల చెప్పారు. నాలుక కత్తిరించుకున్న అనంతరం రక్తస్రావం అవుతున్నప్పటికీ ఆమె ఆస్పత్రికి వెళ్లడానికి నిరాకరించారు. ఇరుగుపొరుగు వాళ్లు నచ్చజెప్పి ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నాలుక పూర్తిగా తెగడంతో మాట్లాడలేకపోతున్నారని వైద్యులు పేర్కొన్నారు. అలాగే తప్పిపోయిన జ్యోతి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment