టీమిండియా ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్(Varun Aaron) రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు శుక్రవారం తెలిపాడు. గత ఇరవై ఏళ్లుగా ఆట కోసమే జీవించానని.. ఇకపై క్రికెట్‌కు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించాడు.
గాయాలు వేధిస్తున్నా
‘‘ఫాస్ట్ బౌలింగే ఊపిరిగా బతికాను. ఇరవై ఏళ్లుగా నా ఆశ, శ్వాస అంతా క్రికెటే. ఆట పట్ల కృతజ్ఞత కలిగి ఉన్న నేను.. ఈరోజు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఆ దేవుడు, నా కుటుంబం, స్నేహితులు, సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, అభిమానుల ప్రోత్సాహం వల్లే ఈ ప్రయాణం కొనసాగింది.
గాయాలు వేధిస్తున్నా తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు శారీరకంగా, మానసికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించగలిగాను. నా ఫిజియోలు, ట్రైనర్లు, కోచ్‌లతో పాటు జాతీయ క్రికెట్ అకాడమీ వల్లే ఇదంతా సాధ్యమైంది.
ఆటే నాకు అన్నీ ఇచ్చింది
నా కెరీర్‌ను ఇన్నాళ్లు కొనసాగించేలా తోడ్పడిన భారత క్రికెట్ నియంత్రణ మండలి, జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్కు కృతజ్ఞతలు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ఆస్వాదించవచ్చని తెలుసు. అయితే, నా జీవితంలోని ప్రతీ చిన్న ఆనందానికి ఆటే కారణం. ఆటే నాకు అన్నీ ఇచ్చింది.
నా ఫస్ట్ లవ్ ఫాస్ట్ బౌలింగ్. అందుకే నేనిక మైదానంలో అడుగుపెట్టకపోయినా.. క్రికెట్‌లో భాగంగానే ఉంటాను. ఎందుకంటే.. నేను అందులో ఓ భాగం కాబట్టి..’’ అంటూ వరుణ్ ఆరోన్ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు.
గంటకు 153 కిలోమీటర్ల వేగంతో
కాగా సింగ్‌భూమ్‌కు చెందిన వరుణ్ ఆరోన్ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్. దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)- 2010- 11 సందర్భంగా వరుణ్ తొలిసారి వెలుగులోకి వచ్చాడు. గుజరాత్‌తో జరిగిన ఫైనల్లో ఈ జార్ఖండ్ పేసర్.. గంటకు 153 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి.. తన స్పీడ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఈ క్రమంలో.. 2011లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వరుణ్ ఆరోన్.. తొమ్మిది టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 18, 11 వికెట్లు తీశాడు. చివరగా 2015లో సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో పాల్గొన వరుణ్ ఆరోన్.. ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
ఐపీఎల్‌లోనూ..
ఇక గాయాల బెడద కారణంగా గతేడాది ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకొన్న వరుణ్ ఆరోన్.. తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో ఐదు వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహించిన ఈ స్పీడ్‌స్టర్.. 2022లో చివరగా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పుణెలో జరిగిన మ్యాచ్ అతడి ఐపీఎల్ కెరీర్‌లో ఆఖరిది. ఇక క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తంగా 52 మ్యాచ్‌లు ఆడిన 35 ఏళ్ల వరుణ్ ఆరోన్.. 44 వికెట్లు పడగొట్టాడు.
స్కూల్ ఫ్రెండ్‌తో పెళ్లి
వరుణ్ ఆరోన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 2016లో రాగిణితో అతడి వివాహం జరిగింది. కోర్టు మ్యారేజీ చేసుకున్న వీళ్లిద్దరు స్కూల్ ఫ్రెండ్స్.
చదవండి: ‘గంభీర్ నా కుటుంబాన్ని అసభ్యంగా తిట్టాడు.. గంగూలీని కూడా..’
Comments
Please login to add a commentAdd a comment