
మహాకుంభమేళా.. ప్రపంచాన్నంతటినీ ఆకట్టుకుంటున్న మహోత్సవం. దీనిలో పలు అద్భుతాలు, వింతలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఉదంతం ఎంతో ఆసక్తిగొలుపుతోంది. 15 ఏళ్ల క్రితం కనుమరుగైన ఒక వ్యక్తి అత్యంత విచిత్ర పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఈ కథనం జార్ఖండ్‌లోని కోడర్మా జిల్లాకు చెందిన ప్రకాష్ మహతోకు సంబంధించినది.
ఆ సమయంలో ప్రకాష్.. కోడర్మా మునిసిపల్ కార్పొరేషన్(Koderma Municipal Corporation)లో పనిచేసేవాడు. 2010లో ఒక రోజున డ్యూటీకి వెళ్లిన ప్రకాష్ ఇంటికి తిరిగి రాలేదు. మానసిక పరిస్థితి సరిగా లేనందున ఇంటికి వెళ్లే దారిని మరచిపోయాడు. ప్రకాష్ కుటుంబసభ్యులు తమకు తెలిసిన అన్నిచోట్లా వెదికినా ఫలితం లేకపోయింది. వారి ఫిర్యాదుతో పోలీసులు ఎంత గాలించినా ప్రకాష్ ఆచూకీ తెలియరాలేదు.
అయితే 15 ఏళ్ల తరువాత తాజాగా ప్రకాష్ మహతోను బీహార్‌లోని రాణిగంజ్(Raniganj in Bihar) ప్రాంతంలో హోటల్‌లో పనిచేస్తుండగా పోలీసులు గుర్తించారు. ఆ హోటల్ యజమాని సుమిత్ అతనికి పహల్వాన్ అని పేరుపెట్టాడు. చాలాకాలంగా ప్రకాష్ అదే హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఇటీవల హోటల్‌లో కుంభమేళా ప్రస్తావన వచ్చింది. దీంతో ప్రకాష్ తాను కుంభమేళాకు వెళ్లాలని అనుకుంటున్నానని, అదే దారిలో తమ ఇల్లు ఉందని హోటల్ యజమాని సుమిత్‌కు చెప్పాడు. దీంతో సుమిత్ ఈ విషయాన్ని కోడర్మా పోలీసులకు ఫోనులో తెలియజేశాడు. వారు ప్రకాష్ అతనేనని నిర్థారించాక ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.
దీంతో ఎంతో ఆనందంతో ప్రకాష్ భార్య గీతాదేవి, కుమారుడు సుజల్, కుమార్తె రాణీ తదితరులు రాణిగంజ్ చేరుకున్నారు. భర్తను చూసిన గీతాదేవి, తండ్రిని చూసిన సుజల్, రాణి ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఇంతకాలం గీతాదేవి కూలిపనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. 15 ఏళ్ల తరువాత ఇంటిపెద్ద కనిపిస్తాడని, వారెవరూ ఊహించలేదు. వారంతా కోడర్మాలోని తమ ఇంటికి చేరుకుని, ఇదంతా కుంభమేళా మహత్మ్యమేనని అందరికీ చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Todays History: ఫిబ్రవరి 10న ఏం జరిగింది? 2013 కుంభమేళాతో లింకేంటి?