
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరిగిన మహాకుంభమేళా(Mahakumbh Mela)కు కోట్లాది మంది జనం తరలివచ్చారు. ఫలితంగా యూపీ సర్కారుకు లెక్కలేనంత ఆదాయం సమకూరింది. కుంభమేళాకు వచ్చేందుకు జనం ప్రధానంగా రైళ్లను ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను కూడా నడిపింది.
నెలన్నర పాటు జరిగిన మహా కుంభమేళాలో ప్రయాగ్‌రాజ్(Prayagraj) లోని ఎనిమిది రైల్వే స్టేషన్ల నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లిన రైళ్ల ద్వారా రైల్వేశాఖకు టిక్కెట్ల విక్రయాల రూపంలో దాదాపు రూ.200 కోట్లు సమకూరాయి. నార్త్ సెంట్రల్ రైల్వే జోన్‌లోని ప్రయాగ్‌రాజ్ డివిజన్‌కు చెందిన డీఆర్‌ఎం హిమాన్షు బదోనీ, సీనియర్ డీసీఎం హిమాన్షు శుక్లా తెలిపిన వివరాల ప్రకారం మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని నార్త్ సెంట్రల్ రైల్వే జోన్‌లోని నాలుగు రైల్వే స్టేషన్లలో రూ.159.20 కోట్ల విలువైన టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అలాగే ఉత్తర రైల్వేలోని లక్నో డివిజన్‌లోని మూడు రైల్వే స్టేషన్ల నుండి రూ.21.79 కోట్ల విలువైన టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈశాన్య రైల్వేలోని వారణాసి డివిజన్‌లోని రెండు రైల్వే స్టేషన్ల నుండి రూ.6 కోట్ల విలువైన టిక్కెట్లను విక్రయించడం ద్వారా రైల్వేలు అధిక ఆదాయాన్ని ఆర్జించాయి. 2019 కుంభమేళాలో రైల్వేశాఖ 86 కోట్ల రూపాయల విలువైన టిక్కెట్లను విక్రయించింది.
మహాకుంభమేళాకు ఊహించనంత సంఖ్యలో భక్తులు తరలి వచ్చారని, అయితే రైల్వేశాఖ(Railways) గత మూడేళ్లుగా ముందస్తు చర్యలు చేపట్టిన కారణంగా ఎక్కడా ఎటువంటి సమస్య రాలేదని డిఆర్‌ఎం హిమాన్షు బదోనీ తెలిపారు. ఇదిలావుండగా రైల్వేశాఖ 2031లో జరగబోయే కుంభమేళా కోసం ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం మూడు రకాల ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయోధ్య, వారణాసి, మీర్జాపూర్, చిత్రకూట్‌లను కలుపుతూ రైళ్లను నడపాలని అధికారులు యోచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Hit and Run: కారు బీభత్సం.. నలుగురు మృతి
Comments
Please login to add a commentAdd a comment