
బెంగళూరు: దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రావు బెయిల్ అర్జీపై తీర్పును బెంగళూరులోని ఆర్థిక నేరాల విభాగం ప్రత్యేక కోర్టు 14వ తేదీకి రిజర్వు చేసింది. ఇక రన్యా బంగారం దందాలో కొత్త కొత్త సంగతులు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా ఈ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు ఆమెను కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణ సందర్భంగా ఆమె పలు విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. విచారణలో రన్యా రావు..‘దుబాయ్ నుంచి ఇంతకుముందు ఎప్పుడూ బంగారాన్ని అక్రమంగా తీసుకురాలేదు. స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి. ఎవరికీ కనబడకుండా బంగారాన్ని ఎలా దాచాలన్నది యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నా’ అంటూ అధికారులకు చెప్పినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసులో రాష్ట్ర పోలీసులు అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై సీఐడీ దర్యాప్తునకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వును కర్ణాటక ప్రభుత్వం బుధవారం ఉపసంహరించుకుంది. అయితే, కర్ణాటక ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా నేతృత్వంలో రన్యా రావు తండ్రి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కె రామచంద్రరావు పాత్రపై దర్యాప్తు కొనసాగుతుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
తరుణ్ మాస్టర్ మైండ్
దుబాయ్‌లో బంగారం కొనుగోలు చేయడం, తిరిగి రావడం ఎలా అనే అన్ని వివరాలను నటి రన్య స్నేహితుడు, పారిశ్రామికవేత్త కుమారుడు తరుణ్‌రాజు మార్గదర్శకం చేసినట్లు డీఆర్‌ఐ అధికారుల విచారణలో వెలుగుచూసింది. పట్టుబడిన తరుణ్‌రాజును విచారిస్తున్నారు. దుబాయ్‌కు వెళ్లే రన్యాతో నిరంతరం సంప్రదించేవాడు. అతడు చెప్పినట్లు ఆమె నడుచుకునేది. విదేశాల నుంచి బంగారం తీసుకొచ్చే కొరియర్‌గా ఆమెను వాడుకున్నాడని డీఆర్‌ఐ భావిస్తోంది. ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ జరిపారు. కొన్నేళ్లుగా రన్యారావుతో తరుణ్‌రాజు ఆత్మీయంగా ఉంటున్నాడు. అతనికి దుబాయ్‌లో కొందరు పారిశ్రామికవేత్తలు బాగా తెలుసు. భారీగా ధన సంపాదన ఆశతో బంగారం స్మగ్లింగ్‌లో నిమగ్నమయ్యాడు. అతనిని ఐదురోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇందులో రన్యా స్నేహితుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
సమగ్ర విచారణ జరగాలి: మంత్రి లక్ష్మి
నటి రన్యా రావు బంగారం కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని మహిళా శిశు సంక్షేమ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ తెలిపారు. ఈ కేసులో ఓ ప్రముఖ మంత్రి హస్తం ఉందనే ఆరోపణలపై బుధవారం విధానసౌధలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. కేసు పూర్తి స్థాయిలో విచారణ జరగాలన్నారు. గ్యారంటీ పథకాలను కమిటీల గొడవపై స్పందిస్తూ ఆ కమిటీలను రద్దుచేయాలని ప్రతిపక్షాలు చేపట్టిన ధర్నాకు అర్థం లేదన్నారు. తమ పథకాలను పోలిన స్కీములను అమలు చేసిన కొన్ని బీజేపీ ప్రభుత్వాలు రెండు నెలల తరువాత రద్దు చేశాయని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment