
న్యూఢిల్లీ:‘మహా కుంభమేళా(Maha Kumbh Mela) పరిపూర్ణమయ్యింది. ఏకత్వాన్ని చాటే ఈ మహాయజ్ఞం సుపంపన్నమయ్యింది. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళా 140 కోట్ల దేశ ప్రజల ఆధ్యాత్మిక చింతనకు ఆలంబనగా నిలిచింది. ఇంతటి భారీ కార్యక్రమంలో తాము భక్తులకు సేవలు అందించడంలో విఫలమైతే క్షమాపణలు’ అని ప్రధాని మోదీ మహాకుంభ్ ముగిసిన సందర్భంగా తన బ్లాగ్‌లో రాశారు.
ఐక్యతకు ప్రతీక
మహాకుంభ్‌కు సంబంధించి మోదీ(PM Modi) ఈ బ్లాగ్‌లో పలు విషయాలు ప్రస్తావించారు. 2024, జనవరి 22న తాను అయోధ్యలోని రామాలయం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో దేవుని భక్తితో కూడిన దేశభక్తి గురించి మాట్లాడానని బ్లాగ్ మొదట్లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాకు దేవుళ్లు, దేవతలు తరలివచ్చారు. సాధువులు, మహాత్ములు, పిల్లలు, వృద్ధులు, మహిళలు, పురుషులా ఇలా అందరూ కలసివచ్చారు. కుంభమేళా నేపధ్యంలో దేశంలోని చైతన్యశక్తిని మనమంతా చూశాం. ఈ మహా కుంభమేళా ఐక్యతకు ప్రతీక. ఈ పండుగ 140 కోట్ల దేశవాసుల నమ్మకానికి ఆలంబనగా నిలిచిందని ప్రధాని పేర్కొన్నారు.
ఆశ్చర్యపోయిన ప్రపంచం
గత 45 రోజులుగా ప్రతిరోజూ, దేశంలోని ప్రతి మూల నుండి లక్షలాది మంది సంగమతీరం వైపు ఎలా కదులుతున్నారో చూశాను. గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తున్నప్పుడు ప్రతి భక్తునిలోనూ ఉత్సాహం శక్తి, విశ్వాసం తొణికిసలాడింది. ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జరిగిన ఈ మహా కుంభమేళా ఆధునిక యుగంలోని విధాన నిపుణులకు ఒక కొత్త అధ్యయన అంశంగా మారింది. యావత్ ప్రపంచంలో ఇంత పెద్ద ఉత్సవం ఎక్కడా జరగనే లేదు. దీనికి సమానమైన ఉదాహరణ మరొకటి లేదు. ఒకే నది ఒడ్డున, త్రివేణి సంగమం తీరంలో కోట్లాది మంది స్నానం చేయడాన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఈ కోట్లాది మందికి అధికారిక ఆహ్వానం లేదు.. ముందస్తు సమాచారం కూడా లేదు. అయినా మహా కుంభమేళాకు తరలివచ్చారు. పవిత్ర సంగమంలో స్నానం చేసి గంగామాత ఆశీర్వాదాలు అందుకున్నారు. వీటికి సంబంధించిన దృశ్యాలను ఎప్పటికీ మరిచిపోలేను. సంతృప్తితో నిండిన ఆ భక్తుల ముఖాలే నిత్యం కనిపిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.
కొత్త రికార్డులు
మహా కుంభమేళాలో స్నానం చేసేందుకు ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నవారి సంఖ్య కొత్త రికార్డులను సృష్టించింది. కుంభమేళా నుండి తిరిగి వెళ్లినవారు వారితో పాటు ఈ పుణ్య జలాలను తమ ప్రాంతాలకు తీసుకువెళ్లి, లక్షలాది మంది చేత కుంభస్నానం చేయించారు. ఇది గత కొన్ని దశాబ్దాలలో ఇంతకు ముందెన్నడూ జరగని ఉదంతం. ప్రయాగ్‌రాజ్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. అధికారులు మునుపటి కుంభమేళా అనుభవాల ఆధారంగా నూతన ప్రణాళికను రూపొందించారు. అమెరికా జనాభా(US population)కు దాదాపు రెట్టింపు జనాభా ఈ ఐక్యతా కుంభమేళాలో పాల్గొని స్నానాలు చేశారు.
దేశంలోని ప్రతీ భక్తుడూ భాగస్వామి
ఈ మహా కుంభమేళా భారతదేశ జాతీయ చైతన్యాన్ని బలోపేతం చేసింది. 144 ఏళ్ల తర్వాత జరిగిన ఈ మహా కుంభమేళా భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఇది అభివృద్ధి చెందిన భారతదేశం అందించిన సందేశంగా నిలిచింది. దేశంలోని ప్రతి భక్తుడు ఈ మహా యాగంలో భాగస్వామి అయ్యాడు. భారతదేశం అందించిన ఈ మరపురాని దృశ్యం కోట్లాది మందిలో ఆధ్మాత్మికతను పెంపొందించింది. నాడు బాలుడి రూపంలో శ్రీకృష్ణుడు తన తల్లి యశోదకు తన నోటిలో విశ్వాన్ని చూపించాడు. అదేవిధంగా ఈ మహా కుంభ్ ప్రపంచానికి భారతీయులు అపార శక్తి రూపాన్ని చూపింది.

ఉత్తరప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు
ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులభం కాదు. అయితే నేను గంగా, యమున, సరస్వతి మాతలను ప్రార్థించాను. పూజలలో ఏదైనా లోపం ఉంటే, క్షమించమని కోరాను. భక్తులకు సేవ చేయడంలో విఫలమైతే, క్షమాపణలను కోరుతున్నాను. ఈ ఐక్యతా మహా కుంభమేళాలో కోట్లాది మందికి సేవ చేసే భాగ్యం భక్తి ద్వారానే సమకూరింది. పారిశుధ్య కార్మికులు, పోలీసులు, నావికులు, డ్రైవర్లు.. ప్రతి ఒక్కరూ ఈ మహా కుంభ్‌ను విజయవంతం చేయడానికి నిరంతరం సేవలు అందించారు. ప్రయాగ్‌రాజ్ ప్రజలు ఈ 45 రోజుల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులను ఆదరించారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహా కుంభమేళా దృశ్యాలను చూసినప్పుడు నా మనసులో మెదిలిన భావాలు మరింత బలపడ్డాయి. దేశ ఉజ్వల భవిష్యత్తుపై నా నమ్మకం అనేక రెట్లు పెరిగిందని ప్రధాని మోదీ ఈ బ్లాగ్‌లో రాశారు.
ఇది కూడా చదవండి: శివరాత్రి వేళ.. ‘మౌని అమావాస్య’ బాధితులు ఏమన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment