
పీఎంకే ఎమ్మెల్యే సదాశివం కుటుంబంపై వరకట్నం కేసు నమోదైంది. తనను కొద్దిరోజులుగా వేధిస్తున్నట్లు కోడలు ఇచ్చిన ఫిర్యాదుతో సూరమంగలం
సాక్షి, చైన్నె: పీఎంకే ఎమ్మెల్యే సదాశివం కుటుంబంపై వరకట్నం కేసు నమోదైంది. తనను కొద్దిరోజులుగా వేధిస్తున్నట్లు కోడలు ఇచ్చిన ఫిర్యాదుతో సూరమంగలం మహిళా పోలీసులు మంగళవారం రంగంలోకి దిగారు. వివరాలు.. సేలం జిల్లా మేట్టూరు పీఎంకే ఎమ్మెల్యేగా సదా శివం వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు శంకర్‌కు 2019లో సర్కారు కొల్లపట్టికి చెందిన మనోలియాతో వివాహం జరిగింది.
ఈ దంపతులకు ఏడాదిన్నర బిడ్డ ఉంది. ఈ పరిస్థితుల్లో తన భర్త శంకర్, మామ సదాశివం, అత్త బేబి, ఆడపడుచు కలైవాణి వరకట్నం కోసం తీవ్రంగా వేధిస్తున్నట్లు మనోలియా ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబంపై ఆరు సెక్షన్లతో కేసు నమోదైంది. కాగా విచారణకు రావాలని ఎమెల్యేకు మంగళవారం మహిళా పోలీసు స్టేషన్ అధికారులు సమన్లు జారీ చేశారు.