దిక్కెవరు!
కన్న కొడుకు బలవన్మరణం... అనాథలైన చిన్నారులు వృద్ధాప్యంలో మీదపడ్డ కుటుంబ భారం
దౌల్తాబాద్: మూడో బిడ్డకు జన్మనిచ్చి కోడలు మరణించింది. అప్పుల బాధలు... జీవితం భారమై... కన్న కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ముగ్గురు పసివాళ్లను అనాథలను చేసి తల్లిదండ్రులు వెళ్లిపోతే... ఆ భారం వృద్ధాప్యంతో బతుకీడుస్తున్న వృద్ధురాలిపై పడింది. తినడానికి తిండి లేక... ఉండటానికి సరైన ఇల్లు లేక... భారంగా నెట్టుకొస్తున్న ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. ఓ పక్క కొడుకు మరణంతో... గుండె పగులుతుంటే... మరోపక్క మీదపడిన చిన్నారుల బాధ్యత... కదలలేని ఈ వయసులో మాకు దిక్కెవరంటూ రోదిస్తున్న ఆ అవ్వను చూసి అక్కడున్నవారి కళ్లు చెమర్చుతున్నాయి.
దౌల్తాబాద్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం కనిపించిన హృదయవిదారక ఘటన ఇది. లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మచ్చ సుజాత, స్వామి దంపతులు. ఓ పూరింట్లో నివాసముంటూ కూలీనాలీ చేసి కుటుంబాన్ని పోషించారు. మూడో కాన్పులో సుజాత మరణించింది. ముందు రెండు కాన్పులూ ఆడపిల్లలు. వృద్ధురాలైన తల్లి దుర్గమ్మ, ముగ్గురు పిల్లలను పోషించడం స్వామికి ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో సాయం అందించాలంటూ సీఎం కేసీఆర్‌ను మే 24న కలిసి విన్నవించాడు.
సీఎం ఆదేశాలతో ఇద్దరు ఆడపిల్లలను అధికారులు గజ్వేల్‌లోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో చేర్పించారు. అయినా నాలుగు నెలల పసివాడు, వయసు మీదపడ్డ తల్లి పోషణ భారమైన స్వామి గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వృద్ధురాలైన తల్లి దుర్గమ్మపైనే ఇప్పుడు ముగ్గురు బిడ్డల భారమూ పడింది. కొడుకు మరణంతో విలపిస్తూ... పిల్లలతో ఎలా సంసారాన్ని నెట్టుకురావాలో దిక్కుతోచక శుక్రవారం ఆమె కన్నీటి పర్యంతమైంది. ఆమెను ఓదార్చడం చుట్టుపక్కలవారి తరం కాలేదు.
రూ.30 వేలు తక్షణ సాయం
ఈ సంఘటనతో చలించిన మంత్రి హరీష్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డిలు ఆ కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని గడా అధికారి హన్మంతరావు, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షులు, సర్పంచ్ రణం శ్రీనివాస్‌గౌడ్‌లకు సూచించారు. దీంతో వెంటనే గ్రామానికి వెళ్లి రూ.30 వేలు తక్షణ సాయం అందించారు. భూమి కొనుగోలు చేసి పంపిణీ చేయాల్సిందిగా దౌల్తాబాద్ తహశీల్దార్‌కు ఆదేశాలిచ్చామని హన్మంతరావు చెప్పారు. అలాగే ఆడపిల్లలకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దుర్గమ్మకు కూడా రూ.లక్ష ఇస్తామన్నారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు.