Three childrens
-
చిన్నారుల ప్రాణం మీదకు తెచ్చిన నిర్లక్ష్యం
సాక్షి, కర్నూలు: కిరాణా కొట్టు యజమాని నిర్లక్ష్యం ముగ్గురు చిన్నారులను తీవ్ర గాయాలపాలు జేసింది. అసలే అక్రమంగా పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్న అతను కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడంతో తినుబండారాల కోసమని వచ్చిన ముగ్గురు చిన్నారులకు ముప్పు తెచ్చింది. చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పెద్ద గుమ్మడాపురం గ్రామానికి చెందిన తెలుగు రమణయ్య కిరాణం దుకాణంతో పాటు అందులోనే అనుమతుల్లేకుండా పెట్రోలు, డీజిల్ విక్రయాలు చేస్తున్నాడు. సోమవారం రాత్రి గ్రామంలో కరెంట్ లేకపోవడంతో కొవ్వొత్తి వెలుతురులో దుకాణం నిర్వహిస్తున్నాడు. ఓ వ్యక్తికి డబ్బాలో ఉన్న పెట్రోల్ పోస్తుండగా కొవ్వొత్తి కిందపడి మంటలు చెలరేగాయి. అదే సమయంలో తినుబండారాల కోసం చిన్నారులు ధనుశ్రీ (8), స్వాతి(9), రాఘవేంద్ర(12) వచ్చి కొట్టు బయట నిలబడి ఉన్నారు. మంటలు వ్యాపించిన పెట్రోల్ క్యాన్‌ను కొట్టు నిర్వాహకుడు బయటకు విసిరి వేయడంతో చిన్నారులపై పెట్రోల్ పడి మంటలు అంటుకున్నాయి. స్థానికులు వెంటనే మంటలు ఆర్పి అంబులెన్స్‌లో ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వైద్యులు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. వీరితో పాటు సంజీవుడు అనే వ్యక్తి కూడా గాయపడ్డాడు. ధనుశ్రీ, స్వాతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిరాణం కొట్టు యజమాని తెలుగు రమణయ్యపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. -
ముగ్గురు పిల్లల గండం!
సాక్షి, చీమకుర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నాయకుల ఆశలను ముగ్గురు పిల్లల గండం వెంటాడుతూనే ఉంది. స్థానిక సంస్థల్లో మూడంచెల వ్యవస్థలైన సర్పంచ్‌లు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లతో పాటు మున్సిపాలిటీల్లో పోటీచేసే అభ్యర్థులకు ముగ్గురు పిల్లల ఆటంకం అడ్డుగా మారిందనే ఆందోళన కొన్నేళ్లుగా పోటీ చేయాలనుకుంటున్న నాయకులకు ఇబ్బందిగా మారింది. 1995 మే 29వ తేదీ తర్వాత నుంచి ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక సంస్థలకు పోటీ చేసేందుకు అనర్హులు. అదే 1995 మే 29కి ముందు ముగ్గురు పిల్లలు కాదుగదా ఎంత మంది ఉన్నా పట్టింపు లేదు. అందుకే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు 1995 మే డెడ్‌లైన్‌గా మారిందనే ఆవేదన పోటీల్లో ఉండే ఔత్సాహికుల్లో వ్యక్తమవుతోంది. ఒక వేళ పోటీ చేయాలనుకున్న వారికి డెడ్‌లైన్ తర్వాత ముగ్గురు పిల్లలు ఉన్నా వారిలో ఒకరు అనుకోకుండా చనిపోతే మళ్లీ వారు పోటీకి అర్హులే. ఇద్దరు పిల్లలు ఉండి పోటీ చేసే సమయానికి భార్య గర్భిణిగా ఉన్నా భర్త అయినా, భార్య అయినా పోటీచేయవచ్చు. స్థానిక సంస్థలపై మక్కువ తీరక కొంతమంది అత్యుత్సాహం చూపించి తమ ముగ్గురు పిల్లల్లో ఒకరిని బంధువులకు దత్తత ఇచ్చినట్లుగా చూపి తమకు ఇద్దరు పిల్లలే అని చెప్తుంటారు. కానీ దత్తత ఇచ్చినా దత్తత బిడ్డను కూడా మూడో బిడ్డగానే పరిగణించి పోటీకి అనర్హులుగానే అధికారులు పరిగణిస్తారు. మరికొంత మంది తమకు పుట్టిన ముగ్గురు పిల్లల్లో తెలివిగా ఒక బిడ్డను వేరే బంధువుల ఇంటి పేరుతో పేరు మార్చి వేరే వారి లెక్కలో పెంచుతారు. అప్పుడు అలా ఇంటి పేరు మార్చిన తర్వాత అధార్ కార్డు, రేషన్‌కార్డులో తమ మూడో బిడ్డను వేరే ఇంటి పేరుతో చూపించి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వివాదాస్పద సంఘటనలు కోర్టుకు వెళ్లి తేల్చుకునే సరికి అడ్డదారిలో తమ బిడ్డ ఇంటి పేరు మార్చి గెలిచిన వ్యక్తి పదవీ కాలం కూడా పూర్తి కావస్తుందనే నమ్మకంతో బరితెగించి ఇలా అడ్డదారుల్లో పోటీకి దిగుతుంటారనే విమర్శలు కొంతమందిలో వ్యక్తం అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం పూర్తయి దాదాపు 6 నెలలు పైనే అయింది. మరో నెల రోజుల్లో మండల పరిషత్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీల అభ్యర్థుల పదవీకాలం పూర్తి కావస్తుంది. ఇప్పటికే చీమకుర్తి మండలంలో 23 పంచాయతీల్లో సర్పంచ్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. సంతనూతలపాడు నియోజకవర్గంలో దాదాపు 85 సర్పంచ్ పదవులు ఖాళీగా ఉన్నాయి. మరో నెల వ్యవధిలో 60 ఎంపీటీసీ సభ్యులు, నలుగురు ఎంపీపీలు, నలుగురు జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలంతో పాటు చీమకుర్తి నగర పంచాయతీలో 20 మంది కౌన్సిలర్ల పదవీకాలం పూర్తికా వస్తోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు పిల్లల గండం స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల్లో మళ్లీ చర్చకు తావిస్తోంది. కొత్తగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జగన్మోహన్రెడ్డి సీఎంగా కొలువుదీరిన నేపథ్యంలో గతంలో 1995లో ఆ నాటి ప్రభుత్వం పెట్టిన జీవోను అలాగే ఉంచుతారా? లేక కొత్త ప్రభుత్వం చేస్తున్న పలు సంస్కరణల నేపథ్యంలో ముగ్గురు పిల్లల గండం జీవోను తొలగిస్తారా..? అనే ఆసక్తికరమైన చర్చ చోటామోటా నాయకుల్లో జరుగుతుంది. రేషన్ డీలర్లు పోటీకి అర్హులే కొన్ని గ్రామాల్లో రేషన్ షాపుల డీలర్లుగా ఉన్న వారు ఎలా పోటీ చేస్తారంటూ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అలజడి రేగింది. ముగ్గురు పిల్లల జీవో ప్రకారం రేషన్ షాపుల డీలర్లు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ షాపులకు రాజీనామా చేయకుండానే పోటీ చేయవచ్చు. అంగన్వాడీ సిబ్బంది, నీటి వినియోగదారుల సంఘాల సభ్యులు పోటీ చేసేందుకు అనర్హులుగా చట్టం చెబుతోంది. స్వచ్ఛంద సంస్థలు, మత సంస్థల చైర్మన్లు, మతిస్థిమితం లేని వ్యక్తులు పోటీకి అనర్హులు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటే వారిపై విధించిన శిక్షాకాలం ఐదేళ్ల లోపు వారు పోటీ చేసేందుకు అనర్హులు. కోర్టు విధించి శిక్షలపై స్టే, బెయిల్ తెచ్చుకున్నా పోటీకి అనర్హులే. ఉద్యోగులు పోటీ చేయాలంటే తమ ఉద్యోగాలకు రాజీనామా చేసిన తర్వాత.. దాన్ని అమోదించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. స్వగ్రామంలో ఓటు ఉంటేనే పోటీకి అర్హులు ముగ్గురు పిల్లల గండాలను అధిగమించి ఆసక్తి కలిగిన అభ్యర్థులెవరైనా పోటీ చేయాలంటే తప్పనిసరిగా వారు పోటీ చేసే పంచాయతీలో ఓటరుగా తమ పేరు నమోదై ఉండాలి. పోటీ చేయడంతో పాటు పోటీ చేసిన వారిని ప్రతిపాదించాలన్నా కూడా ప్రతిపాదించే వారికి కూడా ఓటు హక్కు అదే గ్రామ పంచాయతీలో ఉండాలి. పోటీ చేసే ముందు ముగ్గురు పిల్లల పరిస్థితిని చూసుకోవడమే కాకుండా ఓటరుగా తమ పేరు నమోదై ఉందా..? క్రిమినల్ కేసుల్లో ఎలాంటి చిక్కులు లేకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తేనే స్థానిక సంస్థల్లోలో పోటీచేసేందుకు అర్హులుగా నిలుస్తారు. పోటీ చేసిన అభ్యర్థిపై విజయం సాధించాలంటే విజయ మొక్కటే కాదు ముందుగా ముగ్గురు పిల్లల గండంతో పాటు ఓటు హక్కు, క్రిమినల్ కేసుల గొడవలన్నీ లేకుండా చూసుకుంటేనే స్థానిక సంస్థలకు రారాజులవతారని విశ్లేషకులు తమ అభిప్రారం వ్యక్తం చేస్తున్నారు. -
నేనే చంపాను.. కాదు నేనే చంపాను!
న్యూఢిల్లీ: దేశరాజధానిలో మద్యం తాగి భార్యను రోజూ వేధిస్తున్న వీరేందర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. గురువారం కూడా మద్యం తాగి వచ్చి గొడవచేయటంతో భార్య మిథిలేశ్, ముగ్గురు పిల్లలు కత్తితో తండ్రిపై దాడిచేశారు. దీంతో వీరేందర్ అక్కడిక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులకు వింత పరిస్థితి ఎదురైంది. వీరేందర్‌ను హత్యచేసింది నేనంటే నేనేనంటూ ముగ్గురు పిల్లలు, భార్య పోలీసుల ముందుకు వచ్చారు. అయితే.. స్థానికుల సమాచారం, బంధువుల విచారణ ఆధారంగా.. పెద్ద కుమారుడిని అరెస్టు చేశారు. -
దిక్కెవరు!
కన్న కొడుకు బలవన్మరణం... అనాథలైన చిన్నారులు వృద్ధాప్యంలో మీదపడ్డ కుటుంబ భారం దౌల్తాబాద్: మూడో బిడ్డకు జన్మనిచ్చి కోడలు మరణించింది. అప్పుల బాధలు... జీవితం భారమై... కన్న కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ముగ్గురు పసివాళ్లను అనాథలను చేసి తల్లిదండ్రులు వెళ్లిపోతే... ఆ భారం వృద్ధాప్యంతో బతుకీడుస్తున్న వృద్ధురాలిపై పడింది. తినడానికి తిండి లేక... ఉండటానికి సరైన ఇల్లు లేక... భారంగా నెట్టుకొస్తున్న ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. ఓ పక్క కొడుకు మరణంతో... గుండె పగులుతుంటే... మరోపక్క మీదపడిన చిన్నారుల బాధ్యత... కదలలేని ఈ వయసులో మాకు దిక్కెవరంటూ రోదిస్తున్న ఆ అవ్వను చూసి అక్కడున్నవారి కళ్లు చెమర్చుతున్నాయి. దౌల్తాబాద్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం కనిపించిన హృదయవిదారక ఘటన ఇది. లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మచ్చ సుజాత, స్వామి దంపతులు. ఓ పూరింట్లో నివాసముంటూ కూలీనాలీ చేసి కుటుంబాన్ని పోషించారు. మూడో కాన్పులో సుజాత మరణించింది. ముందు రెండు కాన్పులూ ఆడపిల్లలు. వృద్ధురాలైన తల్లి దుర్గమ్మ, ముగ్గురు పిల్లలను పోషించడం స్వామికి ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో సాయం అందించాలంటూ సీఎం కేసీఆర్‌ను మే 24న కలిసి విన్నవించాడు. సీఎం ఆదేశాలతో ఇద్దరు ఆడపిల్లలను అధికారులు గజ్వేల్‌లోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో చేర్పించారు. అయినా నాలుగు నెలల పసివాడు, వయసు మీదపడ్డ తల్లి పోషణ భారమైన స్వామి గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వృద్ధురాలైన తల్లి దుర్గమ్మపైనే ఇప్పుడు ముగ్గురు బిడ్డల భారమూ పడింది. కొడుకు మరణంతో విలపిస్తూ... పిల్లలతో ఎలా సంసారాన్ని నెట్టుకురావాలో దిక్కుతోచక శుక్రవారం ఆమె కన్నీటి పర్యంతమైంది. ఆమెను ఓదార్చడం చుట్టుపక్కలవారి తరం కాలేదు. రూ.30 వేలు తక్షణ సాయం ఈ సంఘటనతో చలించిన మంత్రి హరీష్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డిలు ఆ కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని గడా అధికారి హన్మంతరావు, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు, సర్పంచ్ రణం శ్రీనివాస్‌గౌడ్‌లకు సూచించారు. దీంతో వెంటనే గ్రామానికి వెళ్లి రూ.30 వేలు తక్షణ సాయం అందించారు. భూమి కొనుగోలు చేసి పంపిణీ చేయాల్సిందిగా దౌల్తాబాద్ తహశీల్దార్‌కు ఆదేశాలిచ్చామని హన్మంతరావు చెప్పారు. అలాగే ఆడపిల్లలకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దుర్గమ్మకు కూడా రూ.లక్ష ఇస్తామన్నారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు.