ముగ్గురు పిల్లల గండం! | More Than Two Children Disqualifying In Local Body Elections | Sakshi
Sakshi News home page

ముగ్గురు పిల్లల గండం!

Published Sat, Jun 15 2019 10:16 AM | Last Updated on Sat, Jun 15 2019 10:17 AM

More Than Two Children Disqualifying In Local Body Elections - Sakshi

స్థానిక సంస్థల ఎన్నికల ఓట్లను లెక్కిస్తున్న అధికారులు (ఫైల్‌)

సాక్షి, చీమకుర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నాయకుల ఆశలను ముగ్గురు పిల్లల గండం వెంటాడుతూనే ఉంది. స్థానిక సంస్థల్లో మూడంచెల వ్యవస్థలైన సర్పంచ్‌లు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లతో పాటు మున్సిపాలిటీల్లో పోటీచేసే అభ్యర్థులకు ముగ్గురు పిల్లల ఆటంకం అడ్డుగా మారిందనే ఆందోళన కొన్నేళ్లుగా పోటీ చేయాలనుకుంటున్న నాయకులకు ఇబ్బందిగా మారింది. 1995 మే 29వ తేదీ తర్వాత నుంచి ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక సంస్థలకు పోటీ చేసేందుకు అనర్హులు. అదే 1995 మే 29కి ముందు ముగ్గురు పిల్లలు కాదుగదా ఎంత మంది ఉన్నా పట్టింపు లేదు. అందుకే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు 1995 మే డెడ్‌లైన్‌గా మారిందనే ఆవేదన పోటీల్లో ఉండే ఔత్సాహికుల్లో  వ్యక్తమవుతోంది.

ఒక వేళ పోటీ చేయాలనుకున్న వారికి డెడ్‌లైన్‌ తర్వాత ముగ్గురు పిల్లలు ఉన్నా వారిలో ఒకరు అనుకోకుండా చనిపోతే మళ్లీ వారు పోటీకి అర్హులే. ఇద్దరు పిల్లలు ఉండి పోటీ చేసే సమయానికి భార్య గర్భిణిగా ఉన్నా భర్త అయినా, భార్య అయినా పోటీచేయవచ్చు. స్థానిక సంస్థలపై మక్కువ తీరక కొంతమంది అత్యుత్సాహం చూపించి తమ ముగ్గురు పిల్లల్లో ఒకరిని బంధువులకు దత్తత ఇచ్చినట్లుగా చూపి తమకు ఇద్దరు పిల్లలే అని చెప్తుంటారు. కానీ దత్తత ఇచ్చినా దత్తత బిడ్డను కూడా మూడో బిడ్డగానే పరిగణించి పోటీకి అనర్హులుగానే అధికారులు పరిగణిస్తారు. మరికొంత మంది తమకు పుట్టిన ముగ్గురు పిల్లల్లో తెలివిగా ఒక బిడ్డను వేరే బంధువుల ఇంటి పేరుతో పేరు మార్చి వేరే వారి లెక్కలో పెంచుతారు. అప్పుడు అలా ఇంటి పేరు మార్చిన తర్వాత అధార్‌ కార్డు, రేషన్‌కార్డులో తమ మూడో బిడ్డను వేరే ఇంటి పేరుతో చూపించి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఇలాంటి వివాదాస్పద సంఘటనలు కోర్టుకు వెళ్లి తేల్చుకునే సరికి అడ్డదారిలో తమ బిడ్డ ఇంటి పేరు మార్చి గెలిచిన వ్యక్తి పదవీ కాలం కూడా పూర్తి కావస్తుందనే నమ్మకంతో బరితెగించి ఇలా అడ్డదారుల్లో పోటీకి దిగుతుంటారనే విమర్శలు కొంతమందిలో వ్యక్తం అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తయి దాదాపు 6 నెలలు పైనే అయింది. మరో నెల రోజుల్లో మండల పరిషత్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీల అభ్యర్థుల పదవీకాలం పూర్తి కావస్తుంది. ఇప్పటికే చీమకుర్తి మండలంలో 23 పంచాయతీల్లో సర్పంచ్‌ల పదవులు ఖాళీగా ఉన్నాయి. సంతనూతలపాడు నియోజకవర్గంలో దాదాపు 85 సర్పంచ్‌ పదవులు ఖాళీగా ఉన్నాయి. మరో నెల వ్యవధిలో 60 ఎంపీటీసీ సభ్యులు, నలుగురు ఎంపీపీలు, నలుగురు జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలంతో పాటు చీమకుర్తి నగర పంచాయతీలో 20 మంది కౌన్సిలర్‌ల పదవీకాలం పూర్తికా వస్తోంది.

ఈ నేపథ్యంలో ముగ్గురు పిల్లల గండం స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల్లో మళ్లీ చర్చకు తావిస్తోంది. కొత్తగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా కొలువుదీరిన నేపథ్యంలో గతంలో 1995లో ఆ నాటి ప్రభుత్వం పెట్టిన జీవోను అలాగే ఉంచుతారా? లేక కొత్త ప్రభుత్వం చేస్తున్న పలు సంస్కరణల నేపథ్యంలో ముగ్గురు పిల్లల గండం జీవోను తొలగిస్తారా..? అనే ఆసక్తికరమైన చర్చ చోటామోటా నాయకుల్లో జరుగుతుంది.
 
రేషన్‌ డీలర్లు పోటీకి అర్హులే
కొన్ని గ్రామాల్లో రేషన్‌ షాపుల డీలర్లుగా ఉన్న వారు ఎలా పోటీ చేస్తారంటూ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అలజడి రేగింది. ముగ్గురు పిల్లల జీవో ప్రకారం రేషన్‌ షాపుల డీలర్లు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ షాపులకు రాజీనామా చేయకుండానే పోటీ చేయవచ్చు. అంగన్‌వాడీ సిబ్బంది, నీటి వినియోగదారుల సంఘాల సభ్యులు పోటీ చేసేందుకు అనర్హులుగా చట్టం చెబుతోంది. స్వచ్ఛంద సంస్థలు, మత సంస్థల చైర్మన్‌లు, మతిస్థిమితం లేని వ్యక్తులు పోటీకి అనర్హులు. క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కుంటే వారిపై విధించిన శిక్షాకాలం ఐదేళ్ల లోపు వారు పోటీ చేసేందుకు అనర్హులు. కోర్టు విధించి శిక్షలపై స్టే, బెయిల్‌ తెచ్చుకున్నా పోటీకి అనర్హులే. ఉద్యోగులు పోటీ చేయాలంటే తమ ఉద్యోగాలకు రాజీనామా చేసిన తర్వాత.. దాన్ని అమోదించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది.
  
స్వగ్రామంలో ఓటు ఉంటేనే పోటీకి అర్హులు
ముగ్గురు పిల్లల గండాలను అధిగమించి ఆసక్తి కలిగిన అభ్యర్థులెవరైనా పోటీ చేయాలంటే తప్పనిసరిగా వారు పోటీ చేసే పంచాయతీలో ఓటరుగా తమ పేరు నమోదై ఉండాలి. పోటీ చేయడంతో పాటు పోటీ చేసిన వారిని ప్రతిపాదించాలన్నా కూడా ప్రతిపాదించే వారికి కూడా ఓటు హక్కు అదే గ్రామ పంచాయతీలో ఉండాలి. పోటీ చేసే ముందు ముగ్గురు పిల్లల పరిస్థితిని చూసుకోవడమే కాకుండా ఓటరుగా తమ పేరు నమోదై ఉందా..? క్రిమినల్‌ కేసుల్లో ఎలాంటి చిక్కులు లేకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తేనే స్థానిక సంస్థల్లోలో పోటీచేసేందుకు అర్హులుగా నిలుస్తారు. పోటీ చేసిన అభ్యర్థిపై విజయం సాధించాలంటే విజయ మొక్కటే కాదు ముందుగా ముగ్గురు పిల్లల గండంతో పాటు ఓటు హక్కు, క్రిమినల్‌ కేసుల గొడవలన్నీ లేకుండా చూసుకుంటేనే స్థానిక సంస్థలకు రారాజులవతారని విశ్లేషకులు తమ అభిప్రారం వ్యక్తం చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement