
సాక్షి, ప్రకాశం: ఏపీలో కూటమి సర్కార్‌లో నేతల మధ్య కుంపటి రాజుకుంది. తాజాగా జనసేన మహిళా కార్పోరేటర్‌పై టీడీపీ కార్యకర్త దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలోనే టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని కార్పోరేటర్ కామెంట్స్ చేయడం గమనార్హం.
వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలో కూటమి నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఒంగోలు నగర 32వ డివిజన్ కార్పొరేటర్‌పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్త తోటకూర కృష్ణమూర్తి.. అర్థరాత్రి జనసేన కార్పోరేటర్ కృష్ణలత దంపతులను మాట్లాడాలని ఇంట్లో నుంచి బయటకు పిలిచారు. అనంతరం, కృష్ణలత దంపతులపై కృష్ణమూర్తి సహా ఆరో ఆరుగురు టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ క్రమంలో వారికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం.
అనంతరం, కృష్ణలత దంపతులు మాట్లాడారు. ఈ సందర్బంగా.. టీడీపీ కార్యకర్త కృష్ణమూర్తి తమతో మాట్లాడాలని ఇంట్లో నుంచి పిలిచి మాపై దాడి చేశారని అన్నారు. తన భర్తను కొట్టారని కృష్ణలత తెలిపారు. అలాగే, తనకు, తన భర్త వెంకటేష్‌కు ప్రాణహాని ఉందన్నారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటున్నామన్నారు.
