
సాక్షి,కాకినాడ జిల్లా: పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తమ నాయకుడు ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ చెప్పబట్టే పవన్‌కు ఓటేశామంటూ జనసేన ఇన్ ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌పై వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మర్రెడ్డి శ్రీనివాస్‌పై వాగ్వాదానికి దిగారు. దీంతో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.
బుధవారం పిఠాపురంలో జనసేన శ్రేణుల్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. గొల్లప్రోలు మండలం చెందూర్తిలో ఆర్వో ప్లాంట్ ఆవిష్కరణకు జనసేన ఇన్‌ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ వచ్చారు. అయితే, ఈ కార్యక్రమానికి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మకు ఆహ్వానం అందలేదు. ఇదే అంశంపై వర్మ అనుచరులు మర్రెడ్డి శ్రీనివాస్‌ను నిలదీశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని మర్రెడ్డి కార్యక్రమం మధ్యలోనే తిరిగి వెళ్ళిపోయారు.
వెళ్లే సమయంలో టీడీపీ,జనసేన శ్రేణులు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. వర్మ చెప్పబట్టే పవన్‌కు ఓటు వేశామని వర్మ అనుచరులు,టీడీపీ కార్యకర్తలు తన మనసులో మాటను భయటపెట్టారు. వారికి పోటీగా జనసేన శ్రేణులు రావడంతో వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు నెట్టుకున్నారు.

నాగబాబు ఏమన్నారంటే?
మార్చి 14న పిఠాపురం చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించింది. ఆ సభలో నాగబాబు ..పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను ఉద్దేశిస్తూ పరోక్షంగా మాట్లాడారు. ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపులో ప్రధానంగా రెండు ఫ్యాక్టర్స్ పని చేశాయి. ఒకటి జనసేన ప్రెసిడెంట్ పవన్ కల్యాణ్. రెండు జనసైనికులు, పిఠాపురం ఓటర్లు’ మరెవరైనా పవన్ గెలుపులో తమ పాత్ర ఉందని అనుకుంటే అది వారి ఖర్మ’ అని నాగబాబు నొక్కి మరీ చెప్పారు.
నాగబాబుకు వర్మ కౌంటర్‌గా
ఆ వ్యాఖ్యలపై వర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సభ జరిగిన తర్వాత వర్మ సైతం సోషల్ మీడియా వేదికగా జనసేనకు కౌంటర్ వేస్తూ పోస్టులు పెడుతూ వచ్చారు. ఈ తరుణంలో వర్మ అభిమానులు పిఠాపురం జనసేన ఇన్‌ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చాంశనీయంగా మారింది.