పెట్రోల్ మీదపడి తీవ్రంగా గాయపడిన చిన్నారులు
సాక్షి, కర్నూలు: కిరాణా కొట్టు యజమాని నిర్లక్ష్యం ముగ్గురు చిన్నారులను తీవ్ర గాయాలపాలు జేసింది. అసలే అక్రమంగా పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్న అతను కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడంతో తినుబండారాల కోసమని వచ్చిన ముగ్గురు చిన్నారులకు ముప్పు తెచ్చింది. చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పెద్ద గుమ్మడాపురం గ్రామానికి చెందిన తెలుగు రమణయ్య కిరాణం దుకాణంతో పాటు అందులోనే అనుమతుల్లేకుండా పెట్రోలు, డీజిల్ విక్రయాలు చేస్తున్నాడు. సోమవారం రాత్రి గ్రామంలో కరెంట్ లేకపోవడంతో కొవ్వొత్తి వెలుతురులో దుకాణం నిర్వహిస్తున్నాడు. ఓ వ్యక్తికి డబ్బాలో ఉన్న పెట్రోల్ పోస్తుండగా కొవ్వొత్తి కిందపడి మంటలు చెలరేగాయి.
అదే సమయంలో తినుబండారాల కోసం చిన్నారులు ధనుశ్రీ (8), స్వాతి(9), రాఘవేంద్ర(12) వచ్చి కొట్టు బయట నిలబడి ఉన్నారు. మంటలు వ్యాపించిన పెట్రోల్ క్యాన్‌ను కొట్టు నిర్వాహకుడు బయటకు విసిరి వేయడంతో చిన్నారులపై పెట్రోల్ పడి మంటలు అంటుకున్నాయి. స్థానికులు వెంటనే మంటలు ఆర్పి అంబులెన్స్‌లో ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వైద్యులు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. వీరితో పాటు సంజీవుడు అనే వ్యక్తి కూడా గాయపడ్డాడు. ధనుశ్రీ, స్వాతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిరాణం కొట్టు యజమాని తెలుగు రమణయ్యపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment