
సియోల్: దక్షిణ కొరియా సైన్యం శిక్షణలో(Military Drill Excercise) అపశ్రుతి చోటు చేసుకుంది. సొంత పౌరులపైనే యుద్ధ విమానం బాంబులు జారవిడిచింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఆపై పొరపాటున ఈ దాడి జరిగినట్లు చెబుతూ సైన్యం పౌరులను క్షమాపణలు కోరింది.
గురువారం ఉదయం పోచియాన్(Pocheon)లో సైన్యం-వైమానిక దళం సంయుక్తంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించాయి. కేఎఫ్-16 విమానం నుంచి నిర్దేశించిన లక్ష్యంలో ఎంకే-82 బాంబులను జార విడచాల్సి ఉంది. అయితే నిర్దేశిత లక్ష్యంలో కాకుండా.. జనావాసాలపైకి విమానం దూసుకెళ్లింది. మొత్తం ఎనిమిది బాంబులు వేసింది. దీంతో పలువురికి గాయాలుకాగా.. చికిత్స కోసం వాళ్లను ఆస్పత్రికి తరలించారు. వీళ్లలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
జరిగిన ఘటనకు పశ్చాత్తాపం వ్యక్తం చేసిన సైన్యం.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే బాధితులకు పరిహారం అందజేస్తామని, ఘటనపై దర్యాప్తు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. దక్షిణ కొరియా(South Korea) రాజధాని సియోల్‌కు 40 కిలోమీటర్ల దూరంలో పోచియాన్ ఉంది. దీనికి సమీపంలోనే ఉత్తర కొరియా సరిహద్దు ఉంది. త్వరలో అమెరికా-ద.కొ. సైన్యాల సంయుక్త ప్రదర్శన జరగాల్సి ఉంది. అయితే ఇందుకోసం గురువారం నుంచి పోచియాన్‌లో ఇరు దేశాల సైన్యాలు ప్రాక్టీస్ చేస్తాయని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది కూడా.