military exercise
-
సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం
లేహ్/రాచర్ల: సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంకుతో నదిని దాటుతుండగా హఠాత్తుగా వరద పోటెత్తడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి(జేసీఓ) ముత్తముల రామకృష్ణారెడ్డి సహా ఐదుగురు జవాన్లు మృత్యువాత పడ్డారు. తూర్పు లద్దాఖ్‌లో భారత్–చైనా సరిహద్దు వాస్తవా«దీన రేఖ(ఎల్ఏసీ) సమీపంలోని షియోక్ నదిలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సైనికాధికారులు వెల్లడించారు. లేహ్ నుంచి 148 కిలోమీటర్ల దూరంలోని మందిర్ మోర్హ్ వద్ద భారత సైన్యం విన్యాసాలు చేపట్టింది. ఈ విన్యాసాల్లో భాగంగా జవాన్లు యుద్ధ ట్యాంకులు నడుపుతూ షియోక్ నదిని దాటుతుండగా, టి–72 ట్యాంకు నదిలో ఇరుక్కుపోయింది. ఇంతలో ఎగువ ప్రాంతం నుంచి ఆకస్మికంగా వరద పోటెత్తింది. నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. క్షణాల వ్యవధిలోనే టి–72 ట్యాంకు నీట మునిగిపోయింది. యుద్ధ ట్యాంకుపై ఉన్న ఐదుగురు సైనికులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగినప్పటికీ నదిలో వరద ఉధృతి అధికంగా ఉండడంతో జవాన్లను రక్షించలేకపోయాయి. నదిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఐదుగురు జవాన్లు తూర్పు లద్దాఖ్ దౌలత్ బేగ్ ఓల్డీ మిలటరీ బేస్‌లోని 52 ఆర్మర్డ్ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. విన్యాసాల్లో పాల్గొంటూ దుదృష్టవశాత్తూ మరణించారు. ఈ సైనిక శిబిరం చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో∙ఉంది. ఎగువ ప్రాంతాల్లో మంచు కరిగిపోవడం వల్లే షియోక్ నదిలో వరద ప్రవాహం హఠాత్తుగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. దేశ రక్షణపరంగా వ్యూహాత్మకంగా కీలకమైన దెప్సాంగ్ ప్రాంతంలో ఈ నది ప్రవహిస్తోంది. పదవీ విరమణకు ఆరు నెలల ముందు మృత్యువాత తూర్పు లద్దాఖ్‌లో సైనిక విన్యాసాల్లో ప్రాణాలు కోల్పోయిన ముత్తముల రామకృష్ణారెడ్డి(47) స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లె. ఆయన భారత సైన్యంలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో రామకృష్ణారెడ్డి పదవీ విరమణ చేయాల్సి ఉందని గ్రామస్థులు తెలిపారు. ఆయనకు భార్య ఉమాదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల చదువుల కోసం ఉమాదేవి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. రామకృష్ణారెడ్డి మృతదేహం ఆదివారం సాయంత్రం కాలువపల్లెకు చేరుకోనున్నట్లు స్థానికులు చెప్పారు. రామకృష్ణారెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆయన భార్య ఉమాదేవి, కుమారులు కాలువపల్లెకు బయలుదేరారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాజ్‌నాథ్ సింగ్ వాస్తవా«దీన రేఖ సమీపంలో ఐదుగురు సైనికులు మరణించడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, ప్రియాంక సంతాపం ప్రకటించారు. -
G20 Summit: సరిహద్దుల్లో భారీ సైనిక విన్యాసాలు
న్యూఢిల్లీ: చైనా, పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) త్రిశూల్ పేరిట భారీ సైనిక విన్యాసాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 4 నుంచి 14వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. త్రిశూల్‌లో భాగంగా రఫేల్ వంటి యుద్ధ విమానాలను, ఎస్–400, ఎంఆర్‌సామ్, స్పైడర్ వంటి గగనతల రక్షణ వ్యవస్థలను ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దించనుంది. దీంతోపాటు, లద్దాఖ్‌లో ఆర్మీ విభాగాలు వేరుగా విన్యాసాలు చేపడతాయి. దేశ ఉత్తర సరిహద్దులతోపాటు ఢిల్లీలో, ఢిల్లీ వెలుపల ఐఏఎఫ్ పలు రక్షణ వ్యవస్థలను మోహరించనుంది. జీ20 సదస్సుకు సమగ్ర గగనతల రక్షణను కల్పించడమే త్రిశూల్ ఉద్దేశమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా, లద్దాఖ్‌లో ఆర్మీ విభాగాలు ప్రత్యేక విన్యాసాలు నిర్వహిస్తాయి. పారా ట్రూపర్లు, పర్వత ప్రాంత యుద్ధ విద్యలో ఆరితేరిన విభాగాలు సైతం ఇందులో పాల్గొంటాయి. త్వరలో జరిగే జీ20 శిఖరాగ్రానికి 20 మందికి పైగా ప్రపంచ దేశాల నేతలు రానున్న దృష్ట్యా దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్న వేళ ఈ విన్యాసాలు జరుగుతుండటం గమనార్హం. -
ఆ్రస్టేలియాలో కూలిన అమెరికా నేవీ విమానం
కేన్బెర్రా: ఆ్రస్టేలియాలో జరుగుతున్న సైనిక విన్యాసాల్లో అమెరికాకు చెందిన నౌకా దళ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు నేవీ సభ్యులు మరణించారు. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలతో కలిసి ఆ్రస్టేలియాలోని మెలి్వలె ద్వీపంలో విన్యాసాల్లో శిక్షణ ఇస్తుండగా ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో విమానంలో 23 మంది ఉండగా ముగ్గురు మరణించారు. 20 మంది గాయపడ్డారు. వారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉంది. -
విద్వేషమే విడదీసింది! కొరియన్ యుద్ధానికి కారణమెవరు? చివరకు మిగిలింది!
ఉత్తర కొరియా. ప్రపంచంలో దూర్త దేశాల్లో ఒకటిగా అగ్రరాజ్యం అమెరికాతోపాటు యూరప్ దేశాలు గుర్తించిన దేశం. అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయకుండా వరుస క్షిపణి ప్రయోగాలతో దూకుడు ప్రదర్శిస్తోంది. యథేచ్ఛగా ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. అణ్వాయుధాలకూ పదును పెడుతోంది. తమవైపు కన్నెత్తి చూస్తే ఖబడ్దార్ అంటూ ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరిస్తున్నారు. అమెరికా–దక్షిణ కొరియా కూటమి సంయుక్తంగా సైనిక విన్యాసాలపై మండిపడుతున్నారు. తాజాగా 48 గంటల వ్యవధిలో రెండుసార్లు క్షిపణి ప్రయోగాలు జరిపారు! ఉభయ కొరియాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండటం ప్రపంచ దేశాలను ఆందోళన పరుస్తోంది. వీటి మధ్య ఇంతటి విద్వేషానికి కారణమేమిటి...? ఉత్తర, దక్షిణ కొరియాల శత్రుత్వానిది దశాబ్దాల చరిత్ర. స్వతంత్ర దేశమైన ఉమ్మడి కొరియా ద్వీపకల్పాన్ని 1910లో జపాన్ ఆక్రమించుకుంది. 1945 దాకా నిరంకుశ పాలనలో కొరియా మగ్గిపోయింది. జపాన్ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టింది. కమ్యూనిస్టు నేత కిమ్ ఇల్–సంగ్ కొరియా విముక్తి కోసం మంచూరియా నుంచి జపాన్ సైన్యంపై గెరిల్లా యుద్ధం చేశారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధం చివర్లో జపాన్ అధీనంలో ఉన్న కొరియాలోకి సోవియట్ సేనలు అడుగుపెట్టాయి. 38వ ప్యారలెల్ లైన్ దాకా దూసుకొచ్చాయి. దాని దిగువ ప్రాంతాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంది. అలా కొరియా విభజనకు బీజం పడింది. 1945లో ప్యారలెల్ లైన్‌కు ఎగువన తమ అధీనంలోని కొరియా ప్రాంతంలో పాంగ్యాంగ్ రాజధానిగా సోవియట్ సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే ఉత్తర కొరియా. దిగువ ప్రాంతంలో అమెరికా సైనిక ప్రభుత్వాన్ని నెలకొల్పింది. అదే దక్షిణ కొరియా! ప్రచ్ఛన్నయుద్ధం చిచ్చు కొరియాకు స్వాతంత్య్రం ఇవ్వడానికి ఉమ్మడి వేదిక ఏర్పాటు చేయాలని సోవియట్ యూనియన్, మిత్రదేశాలు భావించాయి. ప్రపంచాధిపత్యం కోసం అమెరికాతో సాగిన ప్రచ్ఛన్న యుద్ధంలో ఉత్తర కొరియా మద్దతు కోసం అక్కడి కమ్యూనిస్టులను సోవియట్ ప్రోత్సహించింది. దాని అండతో కిమ్ ఇల్ సంగ్ పెద్ద నేతగా అవతరించాడు. 1948లో ప్రధానిగా పీఠమెక్కాడు. అనంతరం సోవియట్ సేనలు ఉత్తర కొరియాను వీడాయి. మరోవైపు దక్షిణ కొరియాలో అమెరికా సైన్యం కమ్యూనిస్టులను కఠినంగా అణచివేసింది. అమెరికాలో చదివిన కమ్యూనిస్టు వ్యతిరేకి సైంగ్ మాన్ రీ కి మద్దతిచ్చింది. 1948లో జరిగిన ఎన్నికల్లో సైంగ్‌మాన్ రీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1949లో అమెరికా సైన్యం దక్షిణ కొరియా వీడింది. అక్కడి నుంచి ఇరు కొరియాల మధ్య కొట్లాటకు బీజం పడింది. కొరియా ద్వీపకల్పం మొత్తాన్ని తామే పాలిస్తున్నామని, ఉభయ ప్రభుత్వాలు వాదించడం మొదలుపెట్టాయి. కిమ్ ఇల్ సంగ్ నాటి సోవియట్, చైనాల్లోని కమ్యూనిస్టు పాలకులు స్టాలిన్, మావోల మద్దతు కోరారు. ఇటు సైంగ్ మాన్ రీ కూడా ఉత్తర కొరియాను జయించాలన్న ఆకాంక్షలను దాచుకోలేదు. ఇది కొరియన్ యుద్ధానికి దారితీసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మీకేం వీటో పవర్ ఇవ్వలేదు’.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కి 100 కిలోమీటర్ల దూరంలో భారత్- అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న 18వ విడత ‘యుద్ధ అభ్యాస్’ సైనిక ప్రదర్శనను చైనా వ్యతిరేకించటాన్ని తిప్పికొట్టింది భారత్. ఇలాంటి విషయంలో మూడో దేశానికి తాము ‘వీటో’ అధికారం ఇవ్వలేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్-అమెరికా ప్రతిపాదనకు చైనా ‘వీటో’ పవర్ ఉపయోగించి అడ్డుకున్న విషయాన్ని సూచిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ఔలి ప్రాంతంలో భారత్-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘యుద్ధ అభ్యాస్’ మిలిటరీ ప్రదర్శనను బుధవారం వ్యతిరేకించింది చైనా విదేశాంగ శాఖ. భారత్-చైనా మధ్య 1993,1996లో జరిగిన సరిహద్దు నిర్వహణ ఒప్పందాన్ని ఉల్లంఘస్తున్నట్లు పేర్కొంది. దానికి కౌంటర్ ఇచ్చారు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి. 1993, 96 ఒప్పందాలు ఈ మిలిటరీ ప్రదర్శనకు వర్తించవని స్పష్టం చేశారు. 2020, మేలో చైనా బలగాలు చేసిన ఉల్లంఘనలను గుర్తు చేసుకోవాలన్నారు. సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించటం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయటం ద్వారా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇదీ చదవండి: వీడియో: గుజరాత్ భారీ రోడ్‌షో మధ్యలో ఆగిన ప్రధాని మోదీ కాన్వాయ్! ఎందుకంటే.. -
శత్రు డ్రోన్లను చీల్చి చెండాడే ‘గద్దలు’.. ఆర్మీ నయా అస్త్రం
న్యూఢిల్లీ: సైనికల బలగాల కన్నుగప్పి దేశంలోకి ఆయుధాలు, మాదకద్రవ్యాలను డ్రోన్ల ద్వారా చేరవేస్తున్నాయి శత్రు దేశాలు. డ్రోన్ల ద్వారానే దాడులకు పాల్పడుతున్న సంఘటనలూ ఇటీవల వెలుగు చూశాయి. ఈ క్రమంలో శత్రు డ్రోన్లను నివారించేందుకు కొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది భారత సైన్యం. తొలిసారి శత్రు డ్రోన్లను ధ్వంసం చేసేందుకు గద్దలకు శిక్షణ ఇస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ఔలీలో అమెరికా, భారత్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న యుద్ధ అభ్యాస్ ప్రదర్శనలో ఈ అస్త్రాన్ని భారత సైన్యం ప్రదర్శించింది. ఈ సైనిక ప్రదర్శన సందర్భంగా ‘అర్జున్’ అనే గద్ద శత్రు దేశాల డ్రోన్లను ఏ విధంగా నాశనం చేస్తుందనే విషయాన్ని చూపించారు. శత్రు దేశాలకు చెందిన డ్రోన్లు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, ధ్వంసం చేసేందుకు గద్దతో పాటు ఓ శునకానికి సైతం శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో డ్రోన్ శబ్దం వినబడగానే సైన్యాన్ని శునకం అప్రమత్తం చేసింది. అలాగే.. డ్రోన్ ఎక్కడి నుంచి వెళ్తుందనే విషయాన్ని గద్ద గుర్తించింది. ఇలాంటి పక్షులను శత్రు డ్రోన్లను గుర్తించి, ధ్వంసం చేసేందుకు ఉపయోగించటం ఇదే తొలిసారి. అయితే, సైనికపరమైన చర్యల కోసం గద్దలు, శునకాలను వినియోగిస్తున్నట్లు భారత సైన్యం తెలిపింది. పంజాబ్, జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దుల గుండా దేశంలోకి ప్రవేశించే డ్రోన్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ ప్రక్రియ దోహదబడుతుందని పేర్కొంది. Here comes India's first anti #drone Kite (a bird) which can destroy a quadcopter in air. #IndianArmy #YUDHABHYAS22 pic.twitter.com/OByAwWuJop — Haresh 🇮🇳 (@HARESHRJADAV3) November 29, 2022 ఇదీ చదవండి: ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన ఖర్గే.. బీజేపీ ఆగ్రహం -
రంగంలోకి యూఎస్ సూపర్సోనిక్ బాంబర్లు
సియోల్: వరుస క్షిపణి పరీక్షలతో ఉద్రిక్తతలు పెంచుతున్న ఉత్తరకొరియాకు అమెరికా హెచ్చరికలు పంపింది. దక్షిణకొరియాలో జరుపుతున్న సంయుక్త సైనిక విన్యాసాల చివరి రోజు శనివారం అధునాతన సూపర్సోనిక్ బాంబర్ బీ–1బీ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. 2017 డిసెంబర్ తర్వాత వీటిని విమానాలను కొరియా ద్వీపకల్ప విన్యాసాల్లో వాడటం ఇదే తొలిసారి. వారం వ్యవధిలో ఉత్తర కొరియా పరీక్షల పేరిట ఏకంగా 30కి పైగా క్షిపణులు ప్రయోగించడంతో దక్షిణ కొరియా, జపాన్, అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. అందుకే ఈసారి విన్యాసాల్లో ఎఫ్–35 అగ్రశ్రేణి యుద్ధవిమానంసహా దాదాపు 240 యుద్ధ విమానాలతో తమ సత్తా ఏమిటో ఉ.కొరియాకు చూపే ప్రయత్నంచేశాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అగ్రదేశాల మధ్య బేధాభిప్రాయలు పొడచూపడంతో ఇదే అదనుగా భావించి ఉ.కొరియా క్షిపణి పరీక్షలను ఒక్కసారిగా పెంచేసింది. శనివారం సైతం నాలుగు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. విన్యాసాల పేరిట తమ భూభాగాల దురాక్రమణకు ప్రయత్నిస్తే శక్తివంతమైన సమాధానం ఇస్తామని అమెరికా, ద.కొరియాలనుద్దేశిస్తూ ఉ.కొరియా హెచ్చరించడం గమనార్హం. -
విషాదం.. యుద్ధ ట్యాంకర్ పేలి ఇద్దరు సైనికులు మృతి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీలో విషాదం జరిగింది. సైనికులు ఏటా నిర్వహించే ఫీల్డ్ ఫైరింగ్ ఎక్సర్సైజ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఝాన్సీ సమీపంలోని బబినా కంటోన్మెంట్ ప్రాంతంలో విన్యాసాలు నిర్వహించే సమయంలో టీ-90 యుద్ధ ట్యాంకర్ బ్యారెల్ పేలింది. మూడో తరానికి చెందిన ఈ ట్యాంకర్‌ను రష్యా తయారు చేసింది ఈ దర్ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీవ్ర గాయాలైనప్పటికీ అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. . పేలుడు జరిగిన సమయంలో ట్యాంకర్లో ముగ్గురు సైనికులు ఉన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. కమాండర్, గన్నర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడని పేర్కొన్నాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు సైనికాధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుధవారం అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో తవాంగ్‌లో సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ మరునాడే ఝాన్సీలో మరో ప్రమాదం జరిగి ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. చదవండి: వందే భారత్ రైలు ప్రమాదం.. గేదెల యజమానులపై కేసు -
చల్లారని తైవాన్–చైనా ఉద్రిక్తత
బీజింగ్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనతో తైవాన్ వైపు గుడ్లురిమి చూస్తున్న చైనా వారమైనా తన పంథాను మార్చుకోలేదు. తైవాన్ చుట్టూతా సముద్ర జలాల్లో సైనిక విన్యాసాలు కొనసాగిస్తూ ద్వీప ఆక్రమణ భయాలను పెంచేస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఆదివారమే ముగియాల్సిన సైనిక యుద్ధ క్రీడలను ఇంకా కొనసాగిస్తోంది. తైవాన్ జలసంధి వెంట లైవ్ ఫైర్ డ్రిల్స్ పేరిట చైనా నావిక, వాయు సేన దళాలు సంయుక్త విన్యాసాలు కొనసాగిస్తున్నాయని చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ తెలిపింది. గత ఐదు రోజులుగా వేర్వేరు సామర్థ్యాలున్న క్షిపణులను చైనా ప్రయోగించింది. యుద్ధ విమానాలు, డ్రోన్లను తీరం వెంట, గగనతలంలో చక్కర్లు కొట్టించింది. తైవాన్ స్పందనను చైనా విశ్లేషిస్తోందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. -
దాడి చేస్తే బుద్ధి చెబుతాం
బీజింగ్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన చైనా–తైవాన్ మధ్య అగ్గి రాజేస్తోంది. పెలోసీ తమ మాట లెక్కచేయకుండా తైవాన్‌లో పర్యటించడం పట్ల డ్రాగన్ మండిపడుతోంది. తైవాన్‌కు బుద్ధి చెప్పడం తథ్యమంటూ సైనిక విన్యాసాలు సైతం ప్రారంభించింది. తమపై నేరుగా దాడులకు దిగాలన్న కుట్రతోనే చైనా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోందని తైవాన్ ఆరోపించింది. చైనా యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు ఇప్పటికే తైవాన్ అఖాతంలోని మీడియన్ లైన్‌ను దాటేసి ముందుకు దూసుకొచ్చాయి. ఈ పరిణామం పట్ల తైవాన్ ఆందోళన వ్యక్తం చేసింది. తైవాన్ జాతీయ రక్షణ శాఖ శనివారం కీలక ప్రకటన జారీ చేసింది. చైనా చర్యలకు ప్రతిస్పందనగా తమ ల్యాండ్–బేస్డ్ మిస్సైల్ వ్యవస్థలను యాక్టివేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. తమ వైమానిక, నావికా దళాలు పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేస్తాయని ప్రకటించింది. ఒకవేళ చైనా దాడికి దిగితే ప్రతీకార దాడులు తప్పవని తైవాన్ రక్షణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ముందస్తు ప్రణాళిక ప్రకారమే సముద్రంలో, గగనతలంలో సైనిక విన్యాసాలు కొనసాగిస్తున్నట్లు చైనా శనివారం పేర్కొంది. సైనిక సామర్థ్యాలను పరీక్షించుకొనేందుకు ఉత్తర, తూర్పు, నైరుతి తైవాన్‌లో మిలటరీ ఎక్సర్సైజ్ చేపట్టినట్లు పేర్కొంది. తైవాన్ విషయంలో సంక్షోభం మరింత ముదిరేలా చేయొద్దని అమెరికాను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ హెచ్చరించారు. -
Taiwan News: అమెరికా చైనా మధ్య... తైవాన్ తకరారు.. ఏమిటీ వివాదం?
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఓవైపు ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న నేపథ్యంలో చైనా, తైవాన్ మధ్య తారస్థాయికి చేరుతున్న ఉద్రిక్తతలు కలవరపరుస్తున్నాయి. ఇది చివరికి చైనా–అమెరికా ఘర్షణగా మారుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తైవాన్ ద్వీపం పూర్తిగా తనదేనని ముందునుంచీ చెబుతూ వస్తున్న చైనా ఈ మధ్య దూకుడు పెంచుతోంది. దాన్ని తనలో కలిపేసుకునేందుకు అవసరమైతే బలప్రయోగానికీ వెనకాడేది లేదని హెచ్చరికలు చేస్తోంది. అదే జరిగితే తైవాన్‌కు రక్షణగా నిలుస్తామన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన ఉద్రిక్తతలను మరింతగా పెంచింది. ఏమిటీ వివాదం? చైనా, తైవాన్ మధ్య వివాదం ఇప్పటిది కాదు. 1949లో చైనాలో అంతర్యుద్ధం ముగిసి మావో నేతృత్వంలో కమ్యూనిస్టులు విజయం సాధించారు. దాంతో నాటి దేశ పాలకుడు, మావో ప్రత్యర్థి చియాంగ్‌కై షేక్ దేశం విడిచి తైవాన్‌లో తలదాచుకున్నాడు. అప్పటి నుంచీ తైవాన్ దాదాపుగా స్వతంత్రంగానే కొనసాగుతూ వస్తోంది. దాదాపు 2.3 కోట్ల జనాభా ఉన్న తైవాన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వ పాలనలో ఉంది. చైనా మాత్రం 70 ఏళ్లుగా తైవాన్ను మాతృదేశానికి ద్రోహం తలపెట్టిన భూభాగంగా పరిగణిస్తూ వస్తోంది. దాన్ని చైనాలో భాగంగానే గుర్తించాలంటూ ప్రపంచ దేశాలన్నింటిపైనా నిత్యం ఒత్తిడి తెస్తుంటుంది. తైవాన్ దౌత్య కార్యాలయానికి అనుమతిచ్చినందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశమైన లిథువేనియాతో వాణిజ్య సంబంధాలను చైనా పూర్తిగా తెంచేసుకుంది! కేవలం 16 దేశాలు మాత్రమే తైవాన్‌తో అధికారికంగా దౌత్య సంబంధాలు నెరుపుతున్నాయి. అత్యధిక దేశాలు అనధికారికంగా సంబంధాలు కొనసాగిస్తున్నాయి. తైవాన్ అంతర్జాతీయ హోదాపై ఒక స్పష్టతంటూ లేదనే చెప్పాలి. అమెరికాకేం సంబంధం? చైనాలో విప్లవం నేపథ్యంలో 1970ల దాకా 30 ఏళ్ల పాటు తైవాన్ ప్రభుత్వాన్నే చైనా మొత్తానికీ ప్రతినిధిగా అమెరికా గుర్తిస్తూ వచ్చింది. కానీ 1979లో చైనాతో అమెరికాకు దౌత్య తదితర సంబంధాలు ఏర్పాటయ్యాయి. దాంతో తైవాన్‌తో దౌత్య తదితర బంధాలకు, రక్షణ ఒప్పందాలకు అమెరికా అధికారికంగా స్వస్తి పలికింది. కానీ అనధికారంగా మాత్రం తైవాన్‌తో సంబంధాలను విస్తృతంగా కొనసాగిస్తూనే వస్తోంది. చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా ఆత్మరక్షణ కోసం తైవాన్‌కు ఆయుధ విక్రయాలను కూడా కొనసాగిస్తోంది. ఈ ప్రాంతంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అమెరికా యుద్ధ నౌకలు తైవాన్ జలసంధి గుండా తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను కాపాడటమే తమ లక్ష్యమని అమెరికా పైకి చెబుతూ ఉంటుంది. అందుకోసం చైనా, తైవాన్ మధ్య యథాతథ స్థితి కొనసాగాలన్నది అమెరికా వాదన. డొనాల్డ్ ట్రంప్ హయాంలో తైవాన్‌తో సైనిక బంధాన్ని అమెరికా మరింతగా పెంచుకుంది. ఏకంగా 1,800 కోట్ల డాలర్లకు పైగా విలువైన ఆయుధాలను విక్రయించింది. బైడెన్ కూడా ఈ ధోరణిని మరింతగా కొనసాగిస్తున్నారు. చైనా దాడికి దిగేనా? తైవాన్ను విలీనం చేసుకునేందుకు బలప్రయోగానికి వెనకాడేది లేదని చైనా పదేపదే చెబుతూనే ఉంది. 2049కల్లా ‘అత్యంత శక్తిమంతమైన చైనా’ కలను నిజం చేసేందుకు తైవాన్ విలీనం తప్పనిసరని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటించారు కూడా. చైనా ఫైటర్ జెట్లు, బాంబర్లు, నిఘా విమానాలు నిత్యం తైవాన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. ఇవన్నీ త్వరలోనే సైనిక ఘర్షణకు దారి తీయొచ్చంటున్నారు. పెరుగుతున్న ‘స్వాతంత్య్రాభిలాష’ మరోవైపు తైవాన్‌లో పూర్తి ‘స్వాంతంత్య్రాభిలాష’ నానాటికీ పెరిగిపోతోంది. 2016లో సై ఇంగ్ వెన్ అధ్యక్షుడయ్యాక ఈ ధోరణి మరింత వేగం పుంజుకుంది. చైనా, తైవాన్ మధ్య 1992లో కుదిరిన ‘ఒకే చైనా’ రాజకీయ ఒప్పందాన్ని అర్థం లేనిదిగా వెన్ కొట్టిపారేస్తుంటారు. తాజాగా యుద్ధ నౌకలో పర్యటించి ఉద్రిక్తతలను మరింతగా పెంచారామె. స్వీయ రక్షణకు ఎంత దూరమైనా వెళ్తామనే ప్రకటనలతో వేడి పెంచారు కూడా. అసలు ఒకే చైనా నిర్వచనంపైనే ఇరు వర్గాలు భిన్న వాదన విన్పిస్తుంటాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాక్.. మరో దుస్సాహసం
భారతదేశంతో సరిహద్దుల వెంబడి పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. సరిహద్దుల వెంబడి సైనిక విన్యాసాలు చేస్తోంది. తమ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నాయన్న విషయాన్ని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ సమీక్షిస్తున్నారు. పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలోని భావల్పూర్ సమీపంలో సరిహద్దును ఆనుకుని ఈ విన్యాసాలు చేస్తున్నారు. వీటికి పాక్ ప్రధాని ముఖ్య అతిథిగా హాజరైనట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ కూడా హాజరయ్యారు. హెలికాప్టర్ గన్‌షిప్‌లు, పదాతి దళాలు కూడా ఇందులో పాల్గొటున్నాయి. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏదైనా అవాంఛిత పరిస్థితి వస్తే తమ సైన్యం దాన్ని ఎదుర్కోడానికి ఎంతవరకు సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఈ సైనిక విన్యాసాలు సూచిస్తాయని పాక్ భద్రతా అధికారులు చెబుతున్నారు. తమ సహనాన్ని బలహీనతగా భారతదేశం భావించకూడదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంతకుముందు వ్యాఖ్యానించారు. తమపై దాడి జరిగితే కాపాడుకోగల సామర్థ్యం ఉందన్నారు. అయితే.. భారత దాడుల్లో తమ సైనికులు ఏడుగురు చనిపోయారని మాత్రం పాక్ ఇటీవలే అంగీకరించింది.