బీజింగ్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన చైనా–తైవాన్ మధ్య అగ్గి రాజేస్తోంది. పెలోసీ తమ మాట లెక్కచేయకుండా తైవాన్‌లో పర్యటించడం పట్ల డ్రాగన్ మండిపడుతోంది. తైవాన్‌కు బుద్ధి చెప్పడం తథ్యమంటూ సైనిక విన్యాసాలు సైతం ప్రారంభించింది. తమపై నేరుగా దాడులకు దిగాలన్న కుట్రతోనే చైనా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోందని తైవాన్ ఆరోపించింది.
చైనా యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు ఇప్పటికే తైవాన్ అఖాతంలోని మీడియన్ లైన్‌ను దాటేసి ముందుకు దూసుకొచ్చాయి. ఈ పరిణామం పట్ల తైవాన్ ఆందోళన వ్యక్తం చేసింది. తైవాన్ జాతీయ రక్షణ శాఖ శనివారం కీలక ప్రకటన జారీ చేసింది. చైనా చర్యలకు ప్రతిస్పందనగా తమ ల్యాండ్–బేస్డ్ మిస్సైల్ వ్యవస్థలను యాక్టివేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. తమ వైమానిక, నావికా దళాలు పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేస్తాయని ప్రకటించింది.
ఒకవేళ చైనా దాడికి దిగితే ప్రతీకార దాడులు తప్పవని తైవాన్ రక్షణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ముందస్తు ప్రణాళిక ప్రకారమే సముద్రంలో, గగనతలంలో సైనిక విన్యాసాలు కొనసాగిస్తున్నట్లు చైనా శనివారం పేర్కొంది. సైనిక సామర్థ్యాలను పరీక్షించుకొనేందుకు ఉత్తర, తూర్పు, నైరుతి తైవాన్‌లో మిలటరీ ఎక్సర్‌సైజ్ చేపట్టినట్లు పేర్కొంది. తైవాన్ విషయంలో సంక్షోభం మరింత ముదిరేలా చేయొద్దని అమెరికాను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment