Retaliatory attacks
-
ఇజ్రాయెల్‌పై యుద్ధమే
నహారియా (ఇజ్రాయెల్): ఇజ్రాయెల్‌పై ఇక యుద్ధమేనని హెజ్బొల్లా ప్రకటించింది! విజయం సాధించేదాకా పోరు కొనసాగుతుందని పేర్కొంది. అన్నట్టుగానే ఇజ్రాయెల్‌పై భారీ ప్రతీకార దాడులకు దిగింది. ఆదివారం వేకువ నుంచే 100కు పైగా రాకెట్లను ఇజ్రాయెల్‌లోని సుదూర లక్ష్యాలపైకి ప్రయోగించినట్టు హెజ్బొల్లా ఉప నాయకుడు నయీమ్ కస్సెమ్ ప్రకటించారు. ‘మేమూ మనుషులమే. మాకెంత బాధ కలిగించారో మీరూ అంతే స్థాయిలో బాధపడతారు’’ అని హెచ్చరించారు. శుక్రవారం బీరుట్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్ ఇబ్రహీం అకీల్ సహా 45 మంది చనిపోవడం తెలిసిందే. ‘‘మేమేంటో యుద్ధక్షేత్రంలో రుజువు చేసుకుంటాం. మీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాం. మీరు అనుకున్న లక్ష్యాలను సాధించలేరు’ అని ఆదివారం అకీల్ అంత్యక్రియల సందర్భంగా ఇజ్రాయెల్‌ను నయీమ్ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఉత్తర భాగంలోని ప్రజలు వలసపోక తప్పదని హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతం ముందస్తు సైరన్లతో మారుమోగింది. వేలాదిగా జనం బాంబు షెల్టర్లలోకి పరుగులు తీశారు. దాడుల్లో నలుగురు గాయపడ్డారని ఇజ్రాయెల్ పేర్కొంది. హెజ్బొల్లా రాకెట్లు ఇంతకు ముందెన్నడూ ఇంత దూరం వరకు రాలేదంది. హైఫాకు దగ్గర్లోని రమత్ డేవిడ్ ఎయిర్‌బేస్‌పైకి ఫాది 1, ఫాది 2 క్షిపణులను ప్రయోగించినట్లు హెజ్బొల్లా ప్రకటించుకుంది. హెజ్బొల్లా ఈ రకం ఆయుధాలను ప్రయోగించడం ఇదే మొదటిసారి. హెజ్బొల్లా యుద్ధ ప్రకటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. ‘‘వాళ్లిప్పటికీ గుణపాఠం నేర్చుకున్నట్టు లేదు. త్వరలోనే నేర్చుకుంటారు’’ అని వ్యాఖ్యానించారు. అల్ జజీరా కార్యాలయం మూసివేత ఇలా ఉండగా, ఇజ్రాయెల్ బలగాలు ఆదివారం ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్ ప్రాంతం రమల్లాలో ఉన్న అల్ జజీరా శాటిలైట్ న్యూస్ నెట్వర్క్ కార్యాలయాలపై దాడులు జరిపాయి. బలగాలు తమ కార్యాలయాల్లోకి ప్రవేశించడాన్ని ఆ చానెల్ అరబిక్ విభాగం ప్రత్యక్ష ప్రసారం చేసింది. అల్ జజీరా కార్యాలయాలను 45రోజులపాటు మూసివేయాలని హుకుం జారీ చేసింది. అక్కడి సిబ్బందిని తక్షణమే ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. హమాస్, హెజ్బొల్లాలకు అధికార ప్రతినిధిగా అల్ జజీరా మారిపోయిందని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. -
ఇరాన్‌పై పాక్ ప్రతీకార దాడి
ఇస్లామాబాద్: ఇరాన్ బుధవారం జరిపిన దాడులకు గురువారం పాక్ ప్రతీకారం తీర్చుకుంది. సరిహద్దులకు సమీపంలోని ఇరాన్ సియెస్తాన్–బలోచిస్తాన్ ప్రావిన్స్‌లో దాడులు జరిపింది. ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా రాకెట్లు, డ్రోన్లతో చేపట్టిన ‘ప్రెసిషన్ మిలటరీ స్ట్రయిక్స్’లో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్లకు చెందిన 9 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం ఉందని పాక్ ఆర్మీ వెల్లడించింది. ఈ ఘటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్‌కు తమ నిరసన తెలిపినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. పాక్ దాడుల్లో ఇరానేతర జాతీయులైన ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు చనిపోయినట్లు అధికార వార్తా సంస్థ ఇర్నా పేర్కొంది. పాక్ కేంద్రంగా పనిచేస్తూ తమ దేశంలో ఉగ్రదాడులకు తెగబడుతున్న జైష్ అల్–అదిల్ ఉగ్రసంస్థ స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణి దాడులతో బుధవారం విరుచుకుపడింది. ఈ దాడులకు నిరసనగా పాక్ తమ దేశంలోని ఇరాన్ రాయబారిని బహిష్కరించడంతోపాటు ఇరాన్‌లోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ భూభాగంపై ఇరాన్ దాడులను భారత్ సమర్థించింది. ఉగ్రవాదాన్ని అంతమొందించాలన్న తమ వైఖరిలో మార్పు లేదని స్పష్టం చేసింది. ఇది ఆ రెండు దేశాలకు సంబంధించిన విషయమే అయినప్పటికీ, దేశాలు తమ ఆత్మరక్షణ కోసం తీసుకునే చర్యలను భారత్ అర్థం చేసుకుందని పేర్కొంది. -
Israel-Hamas War: అదే గాజా.. అదే దీన గాథ!
దెయిర్ అల్ బలాహా/ఖాన్ యూనిస్ (గాజా): అదే కల్లోలం. అవే దారుణ దృశ్యాలు. అందరి కంటా నిస్సహాయంగా నీటి ధారలు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల ధాటికి గాజాలో మానవీయ సంక్షోభం తీవ్రతరమవుతోంది. ముఖ్యంగా ఆస్పత్రుల్లో ఎటు చూసినా మరణమృదంగం ప్రతిధ్వనిస్తోంది. గాజాలోని దాదాపు అన్ని ఆస్పత్రులనూ ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టి రోజుల తరబడి దిగ్బంధించడం తెలిసిందే. దాంతో కరెంటుతో పాటు కనీస సౌకర్యాలన్నీ దూరమై అవి నరకం చవిచూస్తున్నాయి. ఐసీయూలు, ఇంక్యుబేటర్లకు కూడా కరెంటు, ఆక్సిజన్ రోజులు దాటింది. వాటిల్లోని రోగులు, నవజాత శిశువులు నిస్సహాయంగా మృత్యువు కోసం ఎదురు చూస్తున్నారు! ఇప్పటిదాకా అరచేతులు అడ్డుపెట్టి అతి కష్టమ్మీద వారి ప్రాణాలు నిలుపుతూ వచ్చిన వైద్యులు కూడా క్రమంగా చేతులెత్తేస్తున్నారు. గాజాలో అతి పెద్దదైన అల్ షిఫాతో పాటు అన్ని ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి! షిఫా ఇంకెంతమాత్రమూ ఆస్పత్రిగా మిగల్లేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనోం గేబ్రెయేసస్ వాపోయారు. ‘‘ఈ దారుణంపై ప్రపంచం మౌనం వీడాల్సిన సమయమిది. కాల్పుల విరమణ తక్షణావసరం’’ అని పిలుపునిచ్చారు. చిన్నారులను కాపాడేందుకు... ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ నవజాత శిశువులను కాపాడుకునేందుకు అల్ షిఫా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది శాయశక్తులా ప్రయత్నిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తున్నాయి. ఆక్సిజన్ సరఫరా తదితరాలన్నీ నిలిచిపోవడంతో చిన్నారులను ఇంక్యుబేటర్ల నుంచి తీసుకెళ్లి సిల్వర్ ఫాయిల్ తదితరాల్లో చుట్టబెట్టిన మంచాలపై ఒక్కచోటే పడుకోబెడుతున్నారు. పక్కన వేడినీటిని ఉంచి శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంధన రగడ ఇంక్యుబేటర్లను నడిపి చిన్నారులను కాపాడేందుకు అల్ షిఫా ఆస్పత్రికి 300 లీటర్ల ఇంధనం అందజేస్తే హమాస్ ఉగ్రవాదులు అడ్డుకున్నారని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది. కానీ అరగంటకు కూడా చాలని ఆ సాయంతో ఏం ప్రయోజనమని పాలస్తీనా ఆరోగ్య శాఖ మండిపడింది. ఇది క్రూర పరిహాసమంటూ దుయ్యబట్టింది. అల్ రంటిసి, అల్ నస్ర్ ఉత్తర గాజాలోని ఈ ఆస్పత్రుల నుంచి రోగులు తదితరులను హుటాహుటిన ఖాళీ చేయిస్తున్నారు. శుక్రవారానికే కొద్దిమంది రోగులు, వైద్య సిబ్బంది మినహా ఇవి దాదాపుగా ఖాళీ అయిపోయాయి. అయితే వాటిలో సాధారణ పౌరులు వందలాదిగా తలదాచుకుంటున్నారు. ఇజ్రాయెల్ సైన్యం వీటిని పూర్తిగా తమ అదుపులోకి తీసుకుని వారందరినీ అక్కడినుంచి పంపించేస్తోంది. అల్ స్వెయిదీ లోపల కొద్ది మంది రోగులు, వైద్య సిబ్బంది ఉన్నారు. 500 మందికి పైగా శరణార్థులు తలదాచుకుంటున్నారు. శనివారం నాటి రాకెట్ దాడి ఆస్పత్రిని దాదాపుగా నేలమట్టం చేసింది. ఆదివారం రాత్రికల్లా ఇజ్రాయెల్ సైనికులు ఆస్పత్రిలోకి ప్రవేశించారు. ఇంకా మిగిలిన ఉన్న వారందరినీ ఖాళీ చేయించి బుల్డోజర్లతో ఆస్పత్రిని నేలమట్టం చేయించారు. అల్ షిఫా 700 పడకలతో గాజాలోనే అతి పెద్ద ఆస్పత్రి. కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ సైన్యం పూర్తిస్థాయిలో చుట్టుముట్టింది. దాంతో వైద్య సేవలన్నీ నిలిచిపోయాయి. కరెంటు లేదు. ఇంధనం, ఆహార సరఫరాలు తదితరాలన్నీ నిండుకున్నాయి. ఇక్కడ తలదాచుకున్న శరణార్థుల్లో అత్యధికులు పారిపోయారు. ఇంకో 2,500 మందికి పైగా ఆస్పత్రిలో ఉన్నట్టు సమాచారం. కానీ 20 వేలకు పైగా అక్కడ చిక్కుబడ్డట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ చెబుతోంది. 600 మందికి పైగా రోగులు, 500 మంది దాకా వైద్యులు, సిబ్బంది ఉన్నారు. వందలాది శవాలు ఆస్పత్రి ప్రాంగణంలో పడున్నట్టు చెబుతున్నారు! ఆది, సోమవారాల్లోనే 35 మంది రోగులు, ఐదుగురు చిన్నారులు చనిపోయినట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 36 మంది చిన్నారులు ఏ క్షణమైనా తుది శ్వాస విడిచేలా ఉన్నట్టు వైద్య వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. అల్ ఖుద్స్ గాజాలో రెండో అతి పెద్ద ఆస్పత్రి. 500 మందికి పైగా రోగులు, 15 వేలకు పైగా శరణార్థులున్నారు. వీరిలో అత్యధికులు మహిళలే. ఆదివారానికే ఆస్పత్రిలో సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. ఆహార నిల్వలన్నీ నిండుకున్నాయి. పరిసరాల్లోనే గాక ఆస్పత్రిపైకి కూడా భారీగా కాల్పులు జరుగుతున్నాయి. దాంతో ఇక్కడి ఐసీయూ వార్డు రోగులు ఒకట్రెండు రోజుల్లో నిస్సహాయంగా మృత్యువాత పడేలా ఉన్నారు! 6,000 మందికి పైగా శరణార్థులను ఇక్కణ్నుంచి దక్షిణాదికి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అల్ అక్సా ఇక్కడ కూడా వందల సంఖ్యలో రోగులు, వైద్య సిబ్బంది, శరణార్థులున్నారు. రోగుల, ముఖ్యంగా 100 మందికి పైగా ఉన్న నవజాత శిశువుల సామూహిక మరణాలకు ఇంకెంతో సమయం పట్టదని సిబ్బంది చెబుతున్నారు. తూటాలు తరచూ ఆస్పత్రి లోనికి దూసుకొస్తున్నాయంటున్నారు. ఆస్పత్రిని సైన్యం చుట్టుముట్టింది. -
దాడి చేస్తే బుద్ధి చెబుతాం
బీజింగ్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన చైనా–తైవాన్ మధ్య అగ్గి రాజేస్తోంది. పెలోసీ తమ మాట లెక్కచేయకుండా తైవాన్‌లో పర్యటించడం పట్ల డ్రాగన్ మండిపడుతోంది. తైవాన్‌కు బుద్ధి చెప్పడం తథ్యమంటూ సైనిక విన్యాసాలు సైతం ప్రారంభించింది. తమపై నేరుగా దాడులకు దిగాలన్న కుట్రతోనే చైనా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోందని తైవాన్ ఆరోపించింది. చైనా యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు ఇప్పటికే తైవాన్ అఖాతంలోని మీడియన్ లైన్‌ను దాటేసి ముందుకు దూసుకొచ్చాయి. ఈ పరిణామం పట్ల తైవాన్ ఆందోళన వ్యక్తం చేసింది. తైవాన్ జాతీయ రక్షణ శాఖ శనివారం కీలక ప్రకటన జారీ చేసింది. చైనా చర్యలకు ప్రతిస్పందనగా తమ ల్యాండ్–బేస్డ్ మిస్సైల్ వ్యవస్థలను యాక్టివేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. తమ వైమానిక, నావికా దళాలు పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేస్తాయని ప్రకటించింది. ఒకవేళ చైనా దాడికి దిగితే ప్రతీకార దాడులు తప్పవని తైవాన్ రక్షణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ముందస్తు ప్రణాళిక ప్రకారమే సముద్రంలో, గగనతలంలో సైనిక విన్యాసాలు కొనసాగిస్తున్నట్లు చైనా శనివారం పేర్కొంది. సైనిక సామర్థ్యాలను పరీక్షించుకొనేందుకు ఉత్తర, తూర్పు, నైరుతి తైవాన్‌లో మిలటరీ ఎక్సర్సైజ్ చేపట్టినట్లు పేర్కొంది. తైవాన్ విషయంలో సంక్షోభం మరింత ముదిరేలా చేయొద్దని అమెరికాను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ హెచ్చరించారు. -
ఆగని వేట!
హైదరాబాద్‌లో పినకడిమి వాసిపై కాల్పులు నిందితులకు కలిసొచ్చిన పోలీసు వైఫల్యం పోలీసుల సహకారంపై బలపడుతున్న అనుమానాలు విజయవాడ సిటీ : పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామ ప్రతీకార దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. గత సెప్టెంబర్‌లో ఉంగుటూరు మండలం పెదఆవుటపల్లి జాతీయ రహదారిపై తండ్రీ కొడుకులను కాల్చి చంపిన నిందితులు.. వీరి సమీప బంధువుపై బుధవారం ఉదయం హైదరాబాద్‌లో కాల్పులు జరిపారు. ట్రిపుల్ మర్డర్ తర్వాత అజ్ఞాతంలో ఉన్న నిందితులు మరోసారి కాల్పులకు తెగబడటం నగర పోలీసుల వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. మూడు హత్యల వెనుక పశ్చిమ గోదావరి పోలీసుల వైఫల్యం ఉంటే.. బుధవారం నాటి ఘటన నగర పోలీసుల వైఫల్యంగానే చెప్పొచ్చు. గత ఏడాది ఏప్రిల్ 7న పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన ఏలూరు జెకె ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ కేసులో ప్రధాన నిందితుడు తూరపాటి నాగరాజు పెదవేగి పోలీసుల కస్టడీ నుంచి పరారై హైదరాబాద్ సరూర్‌నగర్‌లో అజ్ఞాత జీవితం గడుపుతున్నాడు. దుర్గారావు హత్య కేసులో నిందితులుగా ఉన్న గంధం మారయ్య, ఇతని సోదరుడు పగిడి మారయ్యతో పాటు తండ్రి గంధం నాగేశ్వరరావు సెప్టెంబర్ 24న పెదఆవుటపల్లి జాతీయ రహదారిపై జరిగిన తుపాకీ కాల్పుల్లో మృతి చెందారు. మూడు హత్యలకు లండన్‌లో ఉంటున్న భూతం గోవింద్‌ను ప్రధాన సూత్రధారిగా పేర్కొన్న పోలీసులు..ఇతని సోదరుడు భూతం శ్రీనివాసరావు సహా పలువురిని నిందితులుగా చేర్చారు. లండన్ నుంచి సుపారీ తీసుకొని ఢిల్లీకి చెందిన కిరాయి షూటర్లు తండ్రీ కొడుకులను పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. ఢిల్లీ పోలీసుల సాయంతో షూటర్లను అక్టోబర్ 8 న అరెస్టు చేసిన పోలీసులు, నిందితులకు సహకరించిన మరికొందరిని కూడా అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు ఇప్పటి వరకు పట్టుబడలేదు. పోలీసులు కూడా షూటర్లు, ఇతర నిందితులను అరెస్టు చేసి ప్రధాన నిందితుల పట్టివేతలో ఉదాసీనంగా వ్యవహరించినట్టు తూరపాటి నాగరాజుపై జరిగిన కాల్పులే నిదర్శనం. సరూర్‌నగర్‌లో ఉంటున్న నాగరాజు బయటకు వెళ్లి మోటారు సైకిల్‌పై ఇంటికి వెళుతుండగా మరో మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు కాల్పులు జరిపారు. నిందితులు మూడు రౌండ్లు కాల్పులు జరపగా రెండు బుల్లెట్ గాయాలకు లోనైన నాగరాజు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదీ జరిగింది పినకడిమికి చెందిన తూరపాటి నాగరాజు కుమారుడైన శివకృష్ణ 2006లో భూతం గోవింద్ కుమార్తె ఉమాదేవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పట్లో వీరి పెళ్లిని భూతం సోదరులు తీవ్రంగా వ్యతిరేకించారు. 2009లో భర్త, అత్తమామలపై ఉమాదేవి పెదవేగి పోలీసు స్టేషన్లో వేధింపుల కేసు పెట్టారు. ఆ తర్వాత జరిగిన సర్పంచి ఎన్నికలు ఆ రెండు కుటుంబాల మధ్య వైరాన్ని మరింత పెంచాయి. నాగరాజుకు వ్యతిరేకంగా భూతం సోదరులు బలపరిచిన వ్యక్తి సర్పంచిగా గెలుపొందారు. అప్పటి నుంచి నాగరాజు భూతం సోదరులపై ప్రతీకారంతో రగిలిపోయాడు. ఇందులో భాగంగా జేకే ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు 2014 ఏప్రిల్ 7న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నాగరాజు పోలీసుల అదుపు నుంచి తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇతనికి బావ గంధం నాగేశ్వరరావు, మేనళ్లుల్లు పగిడి మారయ్య, మారయ్య ఆర్థికంగా సహకరిస్తున్నారనే అనుమానంపై ఏలూరు కోర్టు వాయిదాకు వెళుతుండగా పెద అవుటుపల్లి గ్రామం వద్ద హతమార్చారు. పోలీసుల సహకారం? తొలి నుంచి కూడా ప్రత్యర్థులను హతమార్చడంలో భూతం సోదరులకు పోలీసుల సహకారం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దుర్గారావు హత్యలో ప్రధాన నిందితుడైన నాగరాజు పరారీకి పోలీసులే కారణమని చెబుతున్నారు. ఆ తర్వాత కోర్టు వాయిదాకు వచ్చిన గంధం కుటుంబీకులకు అనధికారిక ఎస్కార్టు ఏర్పాటు చేసి నిందితులకు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై ఓ ఇన్స్పెక్టర్తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్య తీసుకున్నారు. తండ్రీ కొడుకుల హత్యకు సంబంధించి ప్రధాన నిందితులను పట్టుకోవడంలో కమిషనరేట్ పోలీసుల వైఫల్యమే నిందితులకు సహకరించిందని చెబుతున్నారు. హత్యలు జరిగిన కొద్ది రోజులు హడావుడి చేసిన పోలీసులు..ఆపై మిన్నుకుండిపోయారు. ఢిల్లీ షూటర్లను, స్థానికంగా ఉన్న కొందరు నిందితులను మాత్రమే పోలీసులు పట్టుకోగలిగారు. అంతే తప్ప విదేశాల్లో ఉండి ప్రత్యర్థులను హతమార్చేందుకు ఆర్థిక సాయం చేస్తున్న గోవింద్‌ను రప్పించడంలోనూ, ఇక్కడే ఉంటూ కిరాయి హంతకులను సమకూర్చుతున్న భూతం శ్రీనివాసరావును పట్టుకోవడంలోను కమిషనరేట్ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు.