ఆగని వేట! | Pinakadimi dude shooting in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆగని వేట!

Published Thu, Apr 2 2015 1:11 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Pinakadimi dude shooting in Hyderabad

హైదరాబాద్‌లో పినకడిమి వాసిపై కాల్పులు
నిందితులకు కలిసొచ్చిన పోలీసు వైఫల్యం
పోలీసుల సహకారంపై బలపడుతున్న అనుమానాలు

 
 విజయవాడ సిటీ : పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామ ప్రతీకార దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. గత సెప్టెంబర్‌లో ఉంగుటూరు మండలం పెదఆవుటపల్లి జాతీయ రహదారిపై తండ్రీ కొడుకులను కాల్చి చంపిన నిందితులు.. వీరి సమీప బంధువుపై బుధవారం ఉదయం హైదరాబాద్‌లో కాల్పులు జరిపారు. ట్రిపుల్ మర్డర్ తర్వాత అజ్ఞాతంలో ఉన్న నిందితులు మరోసారి కాల్పులకు తెగబడటం నగర పోలీసుల వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. మూడు హత్యల వెనుక పశ్చిమ గోదావరి పోలీసుల వైఫల్యం ఉంటే.. బుధవారం నాటి ఘటన నగర పోలీసుల వైఫల్యంగానే చెప్పొచ్చు. గత ఏడాది ఏప్రిల్ 7న పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన ఏలూరు జెకె ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ కేసులో ప్రధాన నిందితుడు తూరపాటి నాగరాజు పెదవేగి పోలీసుల కస్టడీ నుంచి పరారై హైదరాబాద్ సరూర్‌నగర్‌లో అజ్ఞాత జీవితం గడుపుతున్నాడు. దుర్గారావు హత్య కేసులో నిందితులుగా ఉన్న గంధం మారయ్య, ఇతని సోదరుడు పగిడి మారయ్యతో పాటు తండ్రి గంధం నాగేశ్వరరావు సెప్టెంబర్ 24న పెదఆవుటపల్లి జాతీయ రహదారిపై జరిగిన తుపాకీ కాల్పుల్లో మృతి చెందారు. మూడు హత్యలకు లండన్‌లో ఉంటున్న భూతం గోవింద్‌ను ప్రధాన సూత్రధారిగా పేర్కొన్న పోలీసులు..ఇతని సోదరుడు భూతం శ్రీనివాసరావు సహా పలువురిని నిందితులుగా చేర్చారు. లండన్ నుంచి సుపారీ తీసుకొని ఢిల్లీకి చెందిన కిరాయి షూటర్లు తండ్రీ కొడుకులను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు. ఢిల్లీ పోలీసుల సాయంతో షూటర్లను అక్టోబర్ 8 న అరెస్టు చేసిన పోలీసులు, నిందితులకు సహకరించిన మరికొందరిని కూడా అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు ఇప్పటి వరకు పట్టుబడలేదు. పోలీసులు కూడా షూటర్లు, ఇతర నిందితులను అరెస్టు చేసి ప్రధాన నిందితుల పట్టివేతలో ఉదాసీనంగా వ్యవహరించినట్టు తూరపాటి నాగరాజుపై జరిగిన కాల్పులే నిదర్శనం. సరూర్‌నగర్‌లో ఉంటున్న నాగరాజు బయటకు వెళ్లి మోటారు సైకిల్‌పై ఇంటికి వెళుతుండగా  మరో మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు కాల్పులు జరిపారు. నిందితులు మూడు రౌండ్లు కాల్పులు జరపగా రెండు బుల్లెట్ గాయాలకు లోనైన నాగరాజు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 
ఇదీ జరిగింది

పినకడిమికి చెందిన తూరపాటి నాగరాజు కుమారుడైన శివకృష్ణ 2006లో భూతం గోవింద్ కుమార్తె ఉమాదేవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పట్లో వీరి పెళ్లిని భూతం సోదరులు తీవ్రంగా వ్యతిరేకించారు. 2009లో భర్త, అత్తమామలపై ఉమాదేవి పెదవేగి పోలీసు స్టేషన్‌లో వేధింపుల కేసు పెట్టారు. ఆ తర్వాత జరిగిన సర్పంచి ఎన్నికలు ఆ రెండు కుటుంబాల మధ్య వైరాన్ని మరింత పెంచాయి. నాగరాజుకు వ్యతిరేకంగా భూతం సోదరులు బలపరిచిన వ్యక్తి సర్పంచిగా గెలుపొందారు. అప్పటి నుంచి నాగరాజు భూతం సోదరులపై ప్రతీకారంతో రగిలిపోయాడు. ఇందులో భాగంగా జేకే ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు 2014 ఏప్రిల్ 7న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నాగరాజు పోలీసుల అదుపు నుంచి తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇతనికి బావ గంధం నాగేశ్వరరావు, మేనళ్లుల్లు పగిడి మారయ్య, మారయ్య ఆర్థికంగా సహకరిస్తున్నారనే అనుమానంపై ఏలూరు కోర్టు వాయిదాకు వెళుతుండగా పెద అవుటుపల్లి గ్రామం వద్ద హతమార్చారు.

 పోలీసుల సహకారం?

తొలి నుంచి కూడా ప్రత్యర్థులను హతమార్చడంలో భూతం సోదరులకు పోలీసుల సహకారం ఉందనే  ఆరోపణలు ఉన్నాయి. దుర్గారావు హత్యలో ప్రధాన నిందితుడైన నాగరాజు పరారీకి పోలీసులే కారణమని చెబుతున్నారు. ఆ తర్వాత కోర్టు వాయిదాకు వచ్చిన గంధం కుటుంబీకులకు అనధికారిక ఎస్కార్టు ఏర్పాటు చేసి నిందితులకు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై ఓ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్య తీసుకున్నారు. తండ్రీ కొడుకుల హత్యకు సంబంధించి ప్రధాన నిందితులను పట్టుకోవడంలో కమిషనరేట్ పోలీసుల వైఫల్యమే నిందితులకు సహకరించిందని చెబుతున్నారు. హత్యలు జరిగిన కొద్ది రోజులు హడావుడి చేసిన పోలీసులు..ఆపై మిన్నుకుండిపోయారు.  ఢిల్లీ షూటర్లను, స్థానికంగా ఉన్న కొందరు నిందితులను మాత్రమే పోలీసులు పట్టుకోగలిగారు. అంతే తప్ప విదేశాల్లో ఉండి ప్రత్యర్థులను హతమార్చేందుకు ఆర్థిక సాయం చేస్తున్న గోవింద్‌ను రప్పించడంలోనూ, ఇక్కడే ఉంటూ కిరాయి హంతకులను సమకూర్చుతున్న భూతం శ్రీనివాసరావును పట్టుకోవడంలోను కమిషనరేట్ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement