
పొగ తాగడం కేవలం ఆరోగ్యానికే కాదు.. ఆస్తికీ హానికరమన్న విషయాన్ని రాష్ట్ర అగ్నిమాపక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏటా రాష్ట్రంలో జరుగుతున్న అగ్నిప్రమాదాల్లో అత్యధికం కేర్‌లెస్ స్మోకింగ్‌గా పిలిచే ఆర్పకుండా కాల్చి పారేసిన చుట్ట, బీడీ, సిగరెట్‌ల వల్లే జరిగాయి. 2023 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,404 అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
వీటిలో అత్యధికంగా 6,653 (43.19 శాతం) దుర్ఘటనలు ఈ కేర్‌లెస్ స్మోకింగ్‌తో జరిగాయి. వేసవి కాలంతోపాటు ఎండలూ జోరందుకోవడంతో తమ విభాగాన్ని అగ్నిమాపకశాఖ డీజీ వై.నాగిరెడ్డి అప్రమత్తం చేశారు. జూన్ మొదటివారం వరకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఆయన సిద్ధం చేశారు. - సాక్షి, హైదరాబాద్
అర్బన్ ఏరియాల్లో విద్యుత్ వల్లే...
కేర్‌లెస్ స్మోకింగ్ వల్ల ఎక్కువగా అగ్ని ప్రమాదాలు రూరల్, సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో జరిగే ఫైర్ యాక్సిడెంట్స్‌కు విద్యుత్ సంబంధిత అంశాలే కారణమవుతున్నాయి.
» ఇళ్లలో జరిగే అగ్ని ప్రమాదాలకు విద్యుత్ సంబంధిత అంశాలతోపాటు చిన్నపాటి నిర్లక్ష్యాలు కారణమవుతున్నాయి. అత్యధిక ఉదంతాల్లో వంటగది, అందులో ఉండే గ్యాస్ అగ్ని ప్రమాదాలకు కారణం కాగా.. చాలా తక్కువ సందర్భాల్లో పూజ గది సైతం అగ్నికి ఆజ్యం పోస్తోందని అధికారులు తమ అధ్యయనంలో గుర్తించారు.
» వాటర్ హీటర్లు, గీజర్లు వంటి ఉపకరణాల నిర్వహణలో ఉన్న నిర్లక్ష్యంతో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
» రాష్ట్రంలో జరుగుతున్న అగ్నిప్రమాదాల్లో ఎక్కువ బహిరంగ ప్రదేశాల్లో నిల్వ చేసిన వస్తువులు, చెత్త వల్లే చోటు చేసుకుంటున్నాయని అగ్నిమాపక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వేసవి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం
అగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా అవగాహన కల్పించడానికి పెద్దపీట వేస్తూనే..ఏదైనా ఉదంతం జరిగినప్పుడు వీలైనంత త్వరగా ఘటనాస్థలికి చేరుకొని, ఆస్తి నష్టాన్ని తగ్గించడం, ప్రాణనష్టం లేకుండా చేయడం
లక్ష్యంగా అధికారులు నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా జూన్ మొదటి వారం వరకు అత్యవసరమైతే తప్ప అధికారులు, సిబ్బందికి సెలవులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.
అగ్నిమాపక శకటాలతోపాటు ఉపకరణాలు, యంత్రాలకు మరమ్మతులు లేకుండా చూస్తున్నారు. ప్రైవేట్ కార్యక్రమాల కోసం ఫైర్ వాహనాల తరలింపును నియంత్రిస్తున్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఆస్పత్రులు, హైరైజ్ బిల్డింగ్స్ తదితరాల్లో ఫైర్ ఆడిట్ నిర్వహిస్తున్నారు.
అగ్నిమాపక శకటాలకు జీపీఎస్ ఏర్పాటు
ఇప్పటికే అగ్నిమాపక శకటాలకు జీపీఎస్ పరిజ్ఞానం ఏర్పాటు చేశారు. దీనివల్ల అవి ఏ ప్రాంతంలో ఉన్నాయో ఎప్పటికప్పుడు ఫైర్ కంట్రోల్ రూమ్‌లోని సిబ్బందికి తెలుస్తుంది. ఓ చోట అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం అందిన వెంటనే.. అది ఏ ఫైర్‌స్టేషన్ పరిధిలో ఉందో అక్కడి ఫైరింజన్లను తొలుత అప్రమత్తం చేస్తున్నారు. దీంతోపాటు జీపీఎస్ పరిజ్ఞానం ఆధారంగా ప్రమాదం జరిగిన చోటుకు సమీపంలో ఉన్న ఫైరిజన్లను అక్కడకు మళ్లించనున్నారు. మరోపక్క ఫైరింజన్ల రాకపోకల్లో గ్రీన్‌చానల్ ఇచ్చేలా ట్రాఫిక్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు.
రాష్ట్రంలో అత్యధిక అగ్నిప్రమాదాలకు కారణం ఇవే
2023–2025 జనవరి 11 మధ్య 15,404 ఉదంతాలు
వీటిలో కేర్‌లెస్ స్మోకింగ్ కారణంగా జరిగినవి 6,653 ఘటనలు
ఈ విషయం స్పష్టం చేస్తున్న అగ్నిమాపకశాఖ గణాంకాలు
వేసవి నేపథ్యంలో ప్రత్యేకచర్యలు తీసుకుంటున్న అధికారులు

ఈ అంశాలను గమనించుకోండి
వేసవి నేపథ్యంలో అగ్నిప్రమాదాల బారినపడకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ కొన్ని అంశాలను గమనించాలి. గ్యాస్, విద్యుత్ ఉపకరణాలతోపాటు విద్యుత్ సరఫరా వ్యవస్థను పరిశీలించాలి. తమ వద్ద ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాలు పనిచేస్తున్నాయా? లేదా? చూడాలి.
ఫైర్ ఎస్టింగ్విషర్‌లో ఉండే ఉపకరణాలను సరిచూసుకోవాలి. అవసరమైన వాటికి మరమ్మతులు చేయించాలి. ఇవేవీ లేని ప్రాంతాల్లో కనీసం నీళ్ల డ్రమ్ములైనా అందుబాటులో ఉంచుకోవాలి. పిల్లలు అగ్నికారకమైన వాటిలో ఆడుకోకుండా చూసుకోవాలి. – వై.నాగిరెడ్డి, డైరెక్టర్ జనరల్, అగ్నిమాపక శాఖ