Cigarette
-
సిగరెట్ కాల్చిన మలేసియా మంత్రికి రూ.95 వేల జరిమానా
కౌలాలంపూర్: కేంద్ర మంత్రి. అందులోనూ కీలకమైన విదేశాంగ శాఖ మంత్రి. బహిరంగంగా సిగరెట్ తాగి ప్రజలకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారని నెటిజన్లు మంత్రి మొహమ్మద్ హసన్‌పై ఆన్లైన్లో విమర్శల వరద పారించారు. ఇంతకీ ఆ మంత్రి చేసిన ఘోర నేరం ఏంటంటే బహిరంగంగా సిగరెట్ కాల్చడం. భారత్‌లోలాగే మలేసియాలోనూ బహిరంగంగా ధూమపానంపై నిషేధం అమల్లో ఉంది. బహిరంగంగా సిగరెట్ కాల్చే పొగరాయుళ్లపై జరిమానాల విధించడం, శిక్షించడం భారత్‌లో ఏ స్థాయిలో అమలవుతోందో భారతీయ పౌరులందరికీ బాగా తెలుసు. ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంట్ ప్రాంగణంలో గతంలో పార్లమెంట్ సభ్యులు ఒకరిద్దరు బహిరంగంగా సిగరెట్ గుప్పుగుప్పుమని కాల్చినా జరిమానా వేసిన పాపానపోలేదు. కానీ మలేసియా ప్రభుత్వం మాత్రం సదరు మంత్రికి జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అక్కడి చట్టాల ప్రకారం బహిరంగ ధూమపాన నేరానికి కనీసం 5,000 రింగెట్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.95,000 జరిమానా విధిస్తారు. తప్పుకు శిక్షగా జరిమానా కట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి హసన్ చెప్పారు. హోటల్ వంటి జనసమ్మర్థ ప్రాంతాల్లో సిగరెట్ కాల్చడం నేరం. అందుకు బేషరతు క్షమాపణ చెబుతున్నట్లు ఆయన చెప్పారు. నెగేరీ సెంబిలాన్ రాష్ట్రంలోని ఒక హోటల్లో ఆరుబయట కూర్చొని స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ సిగరెట్ కాల్చుతున్న ఫొటో ఒకటి వైరల్‌గా మారడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే తప్పును తెల్సుకున్న మంత్రి స్వయంగా ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సంప్రతించి తనకు జరిమానా విధించాలని కోరినట్లు తెలుస్తోంది. తానేం చట్టానికి అతీతుడిని కాదని, మంత్రి స్వయంగా జరిమానా విధించాలని వేడుకున్నారని ఆరోగ్య మంత్రి జుల్కెఫీ అహ్మద్ వెల్లడించారు. వంటశాలలు, రెస్టారెంట్లలో ధూమపానంపై నిషేధం 2019 ఏడాది నుంచి అమల్లో ఉంది. 2024 అక్టోబర్ నుంచి మరింత కఠినమైన నియమనిబంధనలను అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా మంత్రిపైనే విమర్శలు రావడం గమనార్హం. సెరెంబన్ జిల్లా ఆరోగ్య కార్యాలయం నుంచి సదరు నోటీస్‌ను బుధవారం అందుకున్నానని మంత్రి అహ్మద్ వెల్లడించారు. ‘‘ఈ అంశం నిజంగా చర్చనీయాంశమై ఆందోళన కల్గించి ఉంటే సారీ చెప్పేందుకు నేను సిద్ధం. ఆరోగ్య శాఖ ఎంత జరిమానా విధించినా నేను కట్టేస్తా. నాపై మరీ పెద్దమొత్తాలను జరిమానాగా మోపబోరని భావిస్తున్నా’’అని బుధవారం ఒక పత్రికా సమావేశంలో వ్యాఖ్యానించారు. -
Delhi: నాలుగు సిగరెట్లకు సమానమైన పొగను పీలుస్తూ..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో తల్లడిల్లిపోతోంది. అక్కడి ప్రజలు సవ్యంగా ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీని చుట్టుముట్టిన కలుషిత గాలి జనాన్ని అనారోగ్యం బారిన పడేలా చేస్తోంది.నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత తీవ్ర స్థాయిలో ఉంది. ఇక్కడి ప్రజలు నాలుగు సిగరెట్లకు సమానమైన పొగను పీలుస్తున్నారని, ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నదని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్) వైద్యులు చెబుతున్నారు. జిమ్స్ ఆస్పత్రికి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ వస్తున్న రోగుల సంఖ్య పెరిగిందన్నారు.చెడు గాలి మరింతగా శరీరంలోనికి చొరబడకుండా ఉండేందుకు మాస్క్‌ని ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో ఊపిరితిత్తులకు హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు కలుషిత గాలికి తీవ్రంగా ప్రభావితమవుతున్నారన్నారు. చెడు గాలి కారణంగా గొంతు, శ్వాసకోశ సమస్యలు వచ్చిన వారు కొన్ని సూచనలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఉదయం దట్టంగా పొగమంచు ఉన్నప్పుడు వాకింగ్‌కు వెళ్లకపోవడమే ఉత్తమమని, ఉదయాన్నే గోరు వెచ్చటి నీరు తాగాలని సూచించారు. దుమ్ము, ధూళితో కూడిన ప్రదేశాలకు వెళ్లడాన్ని నివారించాలని, అలాగే నిర్మాణ పనులు చేపట్టకపోవడం మంచిదని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మరింత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: Medical College Fire: చిన్నారుల మృతి హృదయవిదారకం: ప్రధాని మోదీ -
సిగరెట్ తాగుతూ దొరికిపోయిన విష్ణుప్రియ.. వీడియో వైరల్
అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా సిగరెట్ తాగుతుంటారు. బిగ్‌బాస్ హౌస్‌లోనూ అంతే! ఈ సీజన్లో పృథ్వీ, నిఖిల్ దమ్ముకొడుతుంటారు. నాలుగువారాలపాటు చీఫ్‌గా కొనసాగిన నిఖిల్ అయితే ఒత్తిడి తట్టుకోలేక ప్యాకెట్ల మీద ప్యాకెట్లను సునాయాసంగా కాల్చేశాడు. ఈ వ్యసనం నుంచి అతడిని బయటపడేసేందుకు సోనియా బాగానే ప్రయత్నించింది. అమ్మాయిలు కూడా..సిగరెట్ మానేస్తే ఏదడిగినా ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ క్లిప్పింగ్ తెగ వైరలయింది. అయితే బయటకు వచ్చిన సోనియా ఈ విషయంపై కాస్త సీరియస్ అయింది. నిఖిల్ సిగరెట్ తాగడాన్నే చూపించారు కానీ హౌస్‌లో చాలామంది తాగుతారు. అమ్మాయిలు కూడా స్మోక్ చేస్తున్నారు. కానీ, వాళ్లను చూపించట్లేదు. ఒక లేడీ కంటెస్టెంట్ అయితే ఒత్తిడి తట్టుకోలేక సిగరెట్ తాగుతా అంటే.. నేనే మంచిది కాదని చెప్పి మరీ ఆపేశాను. ఆ అమ్మాయి ఎవరనేది మాత్రం చెప్పను అనేసింది.వీడియో వైరల్అప్పటినుంచి మొదలైంది అసలు రచ్చ.. హౌస్‌లో దమ్ము లాగే లేడీస్ ఎవరబ్బా అని ఆరా తీస్తున్నారు. కిర్రాక్ సీత కావచ్చని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇంతలో విష్ణుప్రియ సిగరెట్ తాగిన వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది. విష్ణుప్రియ దమ్ము కొడుతుందని శేఖర్ బాషా సైతం ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. అమ్మాయిలు తాగితే తప్పేం లేదని కాకపోతే ఎవరైనా సరే ఈ అలవాటుకు దూరంగా ఉండటమే మంచిదన్నాడు. ఇకపోతే వీడియో చూసిన విష్ణు ఫ్యాన్స్.. ఆమె సిగరెట్ తాగితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. View this post on Instagram A post shared by BigbossaaMajaakaa (@bigbossaamajaaka)#VishnuPriya smoking 🚬 in the corner 👀?#BiggBossTelugu8 pic.twitter.com/bnW62aYQZ5— BIG BOSS S8 (@Mrunalqueen) October 8, 2024 మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సిగరెట్ సగం దమ్ములాగి వదిలేస్తున్నారా? అయితే ..!
సిగరెట్ అస్సలు ముట్టనివాళ్లతో పోలిస్తే... సగం సగం లేదా ఒకటి, రెండు ఫప్స్ తీసుకునే వారిలో 64 శాతం మందికి మామూలుగా పోగాకుతో కలిగే ముప్పులన్నీ వస్తుంటాయని హెచ్చరిస్తున్నారు యూఎస్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెందిన అధ్యయనవేత్తలు. ఆ అధ్యయనంలోని వివరాల ప్రకారం కొద్ది కొద్దిగా పఫ్ పీల్చినప్పటికీ వాళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ముప్పు ఇతర ఆరోగ్యకరమైన వ్యక్తుల కంటే 12 రెట్లు ఎక్కువని తేలింది.అంతేకాకుండా కొద్దిపాటి మోతాదులోనైనా పోగ పీల్చేవాళ్లలో ఎంఫసిమా వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే ముప్పు రెండున్నర రెట్లు అధికమని తేలింది. యాభై తొమ్మిది నుంచి ఎనభై రెండేళ్ల వరకు వయసున్న మొత్తం మూడు లక్షల మందిపై ఓ అధ్యయనం నిర్వహించాక వాటి ఫలితాలను బట్టి ఈ అంశాలు వెల్లడయ్యాయి. -
సిగరెట్ తాగుతూ పీఎస్ ఎదుట రీల్స్ చేసినందుకు..
హైదరాబాద్: పోలీస్ స్టేషన్ ఎదుట సిగరెట్ తాగుతూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తికి న్యాయస్థానం 8 రోజుల జైలు శిక్ష విధించింది. రాంగోపాల్‌పేట్ ఇన్స్పెక్టర్ లింగేశ్వర్ కథనం ప్రకారం పాటిగడ్డ ఎన్బీటీనగర్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి వంశీకృష్ణ (25) ఈ నెల 17న రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ ఎదుట సిగరెట్ తాగుతూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని గమనించిన రాంగోపాల్‌పేట్ పోలీసులు అతనిపై ఈ పెట్టీ కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుచగా సికింద్రాబాద్ 16వ ప్రత్యేక మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ అతడికి 8 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. -
రూ.3.61 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు స్వాదీనం
సాక్షి, అమరావతి: అక్రమంగా రవాణా చేస్తున్న రూ.3.61కోట్ల విలువైన 72.30లక్షల విదేశీ సిగరెట్లను కేంద్ర జీఎస్టీ(సీజీఎస్టీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గుంటూరు సీజీఎస్టీ కమిషనరేట్ అధికారులు ఈ నెల 5, 6 తేదీల్లో కోల్కత్తా–చెన్నై జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. నెల్లూరు సమీపంలో 33.30 లక్షల విదేశీ సిగరెట్లను తరలిస్తున్న ఓ వాహనాన్ని, బాపట్ల జిల్లా సంతమాగులూరు సమీపంలో 39 లక్షల విదేశీ సిగరెట్లను తరలిస్తున్న మరో వాహనాన్ని గుర్తించారు. ఆ విదేశీ సిగరెట్ల ప్యాకెట్లపై తయారీ కంపెనీ వివరాలు, ఎక్సై్పరీ తేదీ, ఇతర వివరాలు ఏవీ లేవు. వాటిని తరలిస్తున్న వాహనాల డ్రైవర్లు ఆ విదేశీ సిగరెట్లను దిగుమతి చేసుకున్నట్టు తగిన పత్రాలు గానీ పన్ను చెల్లించిన రశీదులను గానీ చూపించలేకపోయారు. దాంతో మొత్తం రూ.3.61కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు జప్తు చేసి కేసు నమోదు చేశారు. గుంటూరు సీజీఎస్టీ కమిషనరేట్ అధికారులు మూడు నెలల్లో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.4.88కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
సిగరెట్ తాగి పడేయడంతో.. వందే భారత్ రైలు నుంచి పొగలు
మనుబోలు(శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళుతున్న వందే భారత్ రైల్లోంచి హఠాత్తుగా పొగలు రావడంతో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద రైలును 30 నిమిషాలు ఆపివేసిన ఘటన బుధవారం జరిగింది. సాయంత్రం ఐదు గంటల సమయంలో రైలు మనుబోలు స్టేషన్ సమీపంలోకి వస్తుండగా ఓ బోగిలో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన అధికారులు రైలును స్టేషన్లో నిలిపివేశారు. ఒక్కసారిగా రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురై కిందకు దిగేశారు. 3వ భోగీ బాత్రూం నుంచి పొగలు వస్తున్నాయని తెలుసుకుని సిబ్బంది వెళ్లి పరిశీలించారు. ఎవరో సిగరెట్ తాగి పడేయడంతో ప్లాస్టిక్ వస్తువులకు అంటుకుని పొగలు వచ్చినట్లు గుర్తించారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆ పని చేసి ఉంటాడని అనుమానిస్తూ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అరగంట తర్వాత రైలు బయలుదేరింది. చదవండి: మహిళలపై కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన -
ట్రెండ్, స్టైల్ కోసమే స్మో‘కింగ్’.. దేశంలోనే 5 స్థానంలో రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో పొగాకు వాడకం ప్రధానమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పలుమార్లు తెలిపినప్పటికీ ఈ సంస్కృతిని నివారించడంలో వెనుకబడుతూన్నామని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేఖ దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థలు, సామాజిక సంఘాలు పొగాకుకు వ్యతిరేఖంగా పోరాడాలని, దీని పైన మరింత ప్రచారం అవసరమని నినదిస్తున్నాయి. దేశంలో ప్రతి రోజూ 3669 మంది పొగాకుతో మరణిస్తున్నారు. పొగతాగడంలో దేశంతో పాటు రాష్ట్రం కూడా ముందంజలో ఉంది. గత సంవత్సరం తెలంగాణాలో బహిరంగ ప్రదేశాల్లో పొగతాగిన వారిపైన నమోదైన 28 వేల కేసులతో దేశంలోనే ఐదవ స్థానంలో ఉంది. ఆధునిక జీవన విధానం పెరిగిన హైదరాబాద్ నగరంలో ఈ ధూమపానం మరింత ఎక్కువగా ఉంది. కేరళ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు తగ్గే ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రంలో మాత్రం ప్రతీ ఏటా పెరుతుండటం ఆందోళనపరుస్తుంది. గతంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన విషయం ఏంటంటే.. అధిక ధూమపానం జన సంచారం ఉన్న ప్రాంతాల్లో కాకుండా స్కూల్, కాలేజ్, పబ్స్ ఇతర రహాస్య ప్రదేశాల్లో జరుగుతుందని, 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో 38 శాతం, మహిళల్లో 9 శాతం పొగాకును వాడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక తెలుపుతుంది. పొగాకుకు టీనేజ్ పిల్లలు ఎక్కువగా అలవాటు పడుతుండగా, ఈ అలవాటే డగ్స్ వ్యసనానికి పునాదిగా మారుతందని మానసిక-ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ట్రెండ్, స్టైల్ కోసమే యువత ఈ స్మోకింగ్‌కు అలవాటు పడటం విశేషం. ఈ పొగాకు పదార్థాలైన బీడి, చుట్టా, సిగరెట్స్, ఖైనీ, జర్దా తదితారలాను వాడటంతో కేన్సర్, హార్ట్ఎటాక్ వంటి ప్రాణాంతక వ్యాధులకు చేరువైతున్నారు, అంతేకాకుండా ఈ వ్యసనాలే అసాంఘీక కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ మహమ్మారిని నివారిస్తూనే, వ్యసనానికి బానిసలైన వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చే మార్గాలపైన దృష్టి సారించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. న్యూరో మాడ్యులేషన్ ఉత్తమ పరిష్కారం.. స్మోకింగ్‌కు వ్యతిరేకంగా అవగాహాన కల్పిస్తూనే ఇప్పటికే బానిసైన వారిని మామూలు స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికోసం సైక్రియాటిస్టులను, నికోటిన్ ఉండే మెడిసిన్‌ను వాడుతున్నారు. అయితే ప్రస్తుతం న్యూరో మాడ్యులేషన్ అనే అధునాతన సాంకేతిక చికిత్సా విధానం అందుబాటులో ఉంది. ఈ న్యూరో మాడ్యులేషన్ విధానంలో కేవలం స్మోకింగ్ డిజార్డర్లను తగ్గించడానికి మాత్రమే రెండేళ్ల క్రితం ఎఫ్‌డీఐ అనుమతి లభించింది. ఈ స్టిమ్యులేషన్ విధానంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పొగాకు వ్యసనం నాడీ వ్యవస్థ, మొదడు పనితీరు పైన ప్రభావం చూపిస్తుంది. న్యూరో మాడ్యులేషన్లో భాగంగా డీప్ టీఎమ్మెస్ సాంకేతికత మొదడులోని ఇస్సులా పైన మ్యాగ్నెటిక్ వేవ్స్‌ను పంపించి దాని పనితీరును సవరిస్తుంది. దీని వలన వ్యసనానికి మెల్లిమెల్లిగా దూరమవుతారు. డిప్రెషన్, ఓసీడి సమస్యలకు ఈ ప్రక్రియ పరిష్కారంగా మారింది. దక్షిణాదిన ఈ న్యూరో మాడ్యులేషన్ థెరపీని మేము మాత్రమే అందిస్తున్నాం. -ప్రముఖ వైద్యులు ఎమ్మెస్ రెడ్డి, ఆశా న్యూరో మాడ్యులేషన్ క్లినిక్, గచ్చిబౌలి. -
మార్కెట్‌కు బడ్జెట్ బూస్ట్, కానీ ఈ షేర్లు మాత్రం ఢమాల్!
సాక్షి,ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అమృతకాల బడ్జెట్ స్టాక్‌మార్కెట్‌కు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా ఆరంభంలోనే 500 పాయింట్లు ఎగిసిన సూచీలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దాదాపు 1200 పాయింట్లు ఎగిసాయి. టాక్స్ షాక్ తగిలిన రంగాలు తప్ప అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1112 పాయింట్ల లాభంతో 60661 వద్ద, నిఫ్టీ 266 పాయింట్ల లాభంతో17928 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ అండ్ టి, హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ లాంటివి టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిగరెట్లపై పన్నులు పెంచుతున్నట్లు ప్రకటించడంతో గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా, ఐటీసీ లిమిటెడ్‌తో సహా సిగరెట్ కంపెనీల షేర్లు బుధవారం 5 శాతం కుప్పకూలాయి. గాడ్ఫ్రే ఫిలిప్స్ 5శాతం, గోల్డెన్ టొబాకో 4 శాతం, అయితే 6 శాతం నష్టపోయిన ఐటీసీ షేర్లు తేరుకొన్నాయి. ఇంకా ఎన్‌టిసి ఇండస్ట్రీస్ 1.4 శాతం, విఎస్టి ఇండస్ట్రీస్ 0.35 శాతం నష్టాలతో కొనాసగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 11 శాతం (YoY) కంటే ఎక్కువ పెంచాలని ప్రతిపాదించారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 18 లక్షల కోట్ల నుండి రూ.20 లక్షల కోట్లకు పెంచాలనే ప్రతిపాదన దాదాపు 11 శాతం ఎక్కువ అని, గోద్రెజ్ ఆగ్రోవెట్, బ్రిటానియా, టాటా కన్స్యూమర్స్ షేర్ స్టాక్‌లకు జోష్‌నిస్తుందని స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం. -
పొగరాయుళ్లకు కేంద్రం షాక్! ఇక సిగరెట్లు అలా లభించడం కష్టమే?
పొగరాయుళ్లకు కేంద్రం షాకివ్వనుంది. రానున్న రోజుల్లో విడిగా సిగరెట్ల అమ్మకాల్ని బ్యాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని అరికట్టేలా సింగిల్ సిగరెట్ల అమ్మకాల్ని బ్యాన్ చేయాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. వదులుగా ఉన్న సిగరెట్ల అమ్మకాలు పొగాకు నియంత్రణపై చేస్తున్న ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నాయని కమిటీ సభ్యులు వాదించారు. దీంతో పాటు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌లలో స్మోకింగ్ జోన్లను తొలగించాలని కమిటీ సిఫార్స్ చేసింది. స్టాండింగ్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తే, పార్లమెంట్ త్వరలో సింగిల్ సిగరెట్ల అమ్మకాల్ని నిషేధించవచ్చు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు 3 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇ-సిగరెట్ల అమ్మకం, వాడకాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. జీఎస్టీ అమలు తర్వాత కూడా పొగాకు ఉత్పత్తులపై పన్నులో పెద్దగా పెరుగుదల లేదని స్టాండింగ్ కమిటీ గుర్తించింది. మద్యం, పొగాకు ఉత్పత్తుల వినియోగం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని కమిటీ హైలైట్ చేసింది.తాజా పన్ను శ్లాబుల ప్రకారం..బీడీలపై 22 శాతం, సిగరెట్లపై 53 శాతం, పొగలేని పొగాకుపై 64 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. మరోవైపు, పొగాకు ఉత్పత్తులపై 75శాతం జీఎస్టీ విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది. ఏడాదికి 3.5లక్షల మందికి మరణం పలు నివేదికల ప్రకారం, మన దేశంలో స్మోకింగ్ కారణంగా ఏడాదికి 3.5 లక్షల మంది మరణిస్తున్నట్లు తేలింది. 2018 లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ నిర్వహించిన ఒక సర్వేలో ధూమపానం చేసే వారిలో 46 శాతం మంది నిరక్షరాస్యులు, 16 శాతం మంది కాలేజీ విద్యార్ధులు ఉన్నారు. ఫౌండేషన్ ఫర్ స్మోక్ ఫ్రీ వరల్డ్ నివేదిక ప్రకారం.. భారత్‌లో ప్రతి సంవత్సరం సుమారు 6.6 కోట్ల మంది సిగరెట్లు తాగుతుండగా, 26 కోట్లకు పైగా ఇతర పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. పొగాకు వాడకం వల్ల భారతదేశంలో సుమారు 21శాతం మందికి క్యాన్సర్ సోకుతున్నట్లు ఓ అధ్యయనం వెలుగులోకి తెచ్చింది. -
సిగరెట్.. గుండెనూ కాల్చేస్తుంది
సాక్షి, అమరావతి: గుప్పెడంత గుండె శరీరం మొత్తానికి నిరంతరాయంగా రక్తం సరఫరా చేస్తుంటుంది. అంతటి కీలకమైన గుండెకు ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాలు, మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి జబ్బులు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. మరీ ముఖ్యంగా ధూమపానం గుండె ఆరోగ్యంపై అత్యధిక ప్రభావం చూపుతోందని కర్నూలు జీజీహెచ్ వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, కార్డియాలజీ వైద్యనిపుణుడు వినోద్ బైపాస్ సర్జరీ కేసులపై పరిశీలన జరిపారు. 2016 ఆగస్టు నుంచి 2021 డిసెంబర్ మధ్య కర్నూలు జీజీహెచ్‌లో నిర్వహించిన 108 బైపాస్ సర్జరీ కేసులను అనలైజ్ చేశారు. ఈ కేసుల్లో గుండె జబ్బు బాధితుల కనిష్ట వయసు 35, గరిష్ట వయసు 85 సంవత్సరాలు కాగా.. మొత్తం కేసుల్లో పురుషులు 90 మంది.. మహిళలు 18 మందిఉన్నారు. అధిక కేసులకు ధూమపానమే కారణం మెడికల్ అనలైజేషన్ ప్రొటోకాల్ ప్రకారం వివిధ కోణాల్లో పరిశీలన జరపగా.. 108 బైపాస్ సర్జరీ కేసుల్లో 60 మందిలో ధూమపానమే ప్రధాన కారణంగా నిర్ధారించారు. ధూమపానం అనంతరం రెండో స్థానంలో మద్యపానం ఉంది. 36 మందిలో మద్యపానం గుండె జబ్బుకు కారణంగా తేలింది. 28 మందిలో రక్తపోటు, 19 మందిలో మధుమేహం చరిత్రను గుర్తించారు. ధూమపానం ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్‌గా ఉన్న వ్యక్తులు యుక్త వయసు నుంచే ఆ వ్యసనానికి అలవాటుపడి ఉన్నట్టుగా నిర్ధారించారు. సుదీర్ఘకాలం పొగతాగడం వల్ల రక్తనాళాలపై తీవ్ర ప్రభావం పడి బైపాస్ సర్జరీలకు దారి తీసింది. రక్తనాళాలకు హాని ధూమపానం గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం. ధూమపానం చేసినప్పుడు పీల్చే రసాయనాలు గుండె, రక్త నాళాలకు హాని కలిగిస్తాయి. దీంతో అథెరోస్క్లెరోసిస్ లేదా ధమనులలో ఫలకం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం కొంతమందికి, ముఖ్యంగా గర్భనిరోధక మాత్రలు ఉపయోగించే స్త్రీలకు, మధుమేహం ఉన్నవారికి మరింత ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక రక్తపోటు, అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలకు దారితీసి గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఈ క్రమంలో ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. రక్తపోటు, మధుమేహం వంటి జీవన శైలి జబ్బుల బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, గుండె, ఊపిరి తిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు, కర్నూలు -
సిగరెట్ ప్యాక్ కాదు.. ప్రతి సిగరెట్ పైనా హెచ్చరిక!
సిగరెట్ బాక్సుల మీద ఆరోగ్యానికి హానికరం హెచ్చరికలు ఫొటోలతో సహా ఉండేవి. కానీ, ఆ సందేశాలు ప్రజల్లో అంతగా చైతన్యం తీసుకురాలేకపోయాయి. పోగరాయళ్లు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. అందుకే సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక సందేశం చేరువయ్యేలా కెనడా ఒక సరికొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ప్రపంచంలోనే ఈ తరహా ప్రయత్నం మొదటిది కావడం విశేషం. ఇంతవరకు పొగాకు లేదా సిగరెట్ ఉత్పత్తుల పై గ్రాఫిక్ ఫోటోతో కూడిన వార్నింగ్ సందేశాలు ఉండేవి. సిగరెట్ కంపెనీలు వాటిని అనుసరిస్తూ.. ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశాయి. అయితే పోను పోను ప్రజల్లో అంత ప్రభావాన్ని చూపించలేకపోయాయి. కెనడా దేశం ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారాన్ని కనిపెట్టింది. ఇంతవరకు ప్యాకెట్లపైనే హెచ్చరికలు ఇస్తున్నాం. అలా కాకుండా ప్రతి సిగరెట్ట్ పైన ఈ సందేశం ఉంటే...గుప్పు గుప్పు మని పీల్చే ప్రతి సిగరెట్ ఎంత విషమో అర్థమవుతుందని అంటోంది కెనడా ఆరోగ్య మంత్రిత్వశాఖ. ఈ విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు కెనడా మానసిక ఆరోగ్య మంత్రి కరోలిన్ బెన్నెట్ తెలిపారు. అంతేకాదు ఇలాంటి కొత్త విధానాన్ని తీసుకువచ్చిన తొలిదేశం కెనడానే అని చెప్పారు. దీనివల్ల ప్రజల్లో చైతన్యం రావడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఈ సందేశాలు చేరువవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2023 నాటికల్లా ఈ ప్రతిపాదన అమలులోకి తెచ్చేందుకు కెనడా ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోందన్నారు. ఈ మేరకు కెనడియన్ క్యాన్సర్ సొసైటీకి చెందిన సీనియర్ పాలసీ విశ్లేషకుడు రాబ్ కన్నింగ్‌హామ్ మాట్లాడుతూ...ప్రతి సిగరెట్లపై ముంద్రించే హెచ్చరిక ప్రతి వ్యక్తికి చేరువయ్యేలా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది. ఇంతవరకు మరే ఏ ఇతర దేశం దేశం ఇలాంటి నిబంధనలను అమలు చేయలేదు. ఇది విస్మరించలేని హెచ్చరిక అని అన్నారు. ఈ సరికొత్త విధానాన్ని ఇంటర్నేషనల్ టుబాకో కంట్రోల్ పాలసీ ఎవాల్యుయేషన్ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ జియోఫ్రీ ఫాంగ్ ప్రశంసించారు. తాజా గణాంకాల ప్రకారం కెనడాలో 10 శాతం మంది ధూమపానం చేస్తున్నారని, 2035 కల్లా ఆ సంఖ్యను తగ్గించేందుకే కెనడా ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. (చదవండి: కొత్త చరిత్ర సృష్టించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్–2) -
ఒక సిగరెట్ మీ జీవితకాలాన్ని ఎంత తగ్గిస్తుందో తెలుసా!
సాక్షి, విజయనగరంఫోర్ట్: ధూమపానం కారణంగా గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. గుండెపోటుకు గురైన ప్రతి ముగ్గురులో ఒకరు ధూమపానం కారణంగానే ప్రమాదకర పరిస్థితికి చేరుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సిగరెట్, చుట్టు తాగడం ఫ్యాషన్ మారి ఒకరి నుంచి మరొకరు అలవాటు చేసుకుంటున్నారు. జిల్లాలో పొగతాగే వారు 30 శాతం వరకు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక సిగరెట్ కాలిస్తే జీవితకాలం నిమిషం తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ధూమపానం చేసే వారితో పాటు పక్కనున్న వారు కూడా వ్యాధుల బారిన పడుతున్నారు. గతంలో నిరాక్షరాస్యులు, గ్రామీణులు ఎక్కువుగా సిగరెట్, చుట్టలు తాగేవారు. కాని నేడు పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ పొగ తాగుతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా వ్యసనానికి బానిస కావడం ఆందోళన కలిగించే విషయం. పొగ తాగుతున్న వారిలో 8 శాతం మంది యువత ఉండడం గమనార్హం. ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి.. సిగరెట్, చుట్ట తాగడం వల్ల ప్రాణంతకమైన క్యాన్సర్ వ్యాపించే అవకాశం ఉంది. గొంతు, నోరు, ఊపరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు క్రానిక్ బ్రాంక్లైటీస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఏడాదికి జిల్లాలో క్యాన్సర్ బారిన 2 నుంచి 5 శాతం మంది పడుతున్నారు. ఇన్ఫెక్షన్స్తో మరో పది శాతం మంది ఇబ్బంది పడుతున్నారు. గుర్తించకపోవడంతో ప్రమాదం.. గొంతు, నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందుగా గుర్తించకపోవడం వల్ల చాలా మంది మృత్యువాత పడుతున్నారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే కొంత వరకు ప్రయోజనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఏడాదికి రూ.1.20 కోట్లు అన్ని రకాల వర్గాల వారికి సిగరెట్లు, చుట్టలు అంటుబాటులో ఉన్నాయి. జిల్లాలో ఏడాదికి 1.20 కోట్ల వరకు ధూమపానానికి ఖర్చు చేస్తున్నారు. జీవితకాలం తగ్గిపోతుంది.. సిగరెట్లు తాగడం వల్ల జీవితకాలం తగ్గిపోతుంది. సాధారణంగా 70 ఏళ్లు జీవించేవారు 60 నుంచి 65 ఏళ్లకే మరణిస్తారు. చిన్న వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఊపరితిత్తులు, గొంతు, అన్నవాహిక, మూత్రాశ్రయం, లివర్ పాడవుతాయి. – వి. విజయ్, పలమనాలజిస్ట్, విజయనగరం -
షాకింగ్: సిగరెట్ వల్లే ఆ ఘోర విమాన ప్రమాదం!
EgyptAir Flight 804 Mishap Details: ఆరేళ్ల కిందట జరిగిన ఓ విమాన ప్రమాదం గురించి దిగ్భ్రాంతి కలిగించే విషయం ఒకటి తెలిసింది. అనేక అనుమానాల నడుమ దాదాపుగా చిక్కుముడి వీడింది. మొత్తం 66 మంది ప్రయాణికులతో 37వేల అడుగులో వెళ్తూ.. సముద్రంలో కూలిన ఈజిప్ట్ ఎయిర్ విమాన ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈజిప్ట్ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఫ్రెంచ్ ఏవియేషన్ నిపుణులు.. ప్రమాదానికి ఒక సిగరెట్ కారణమని తేల్చారు. పైలట్ సిగరెట్ అంటించడం వల్ల కాక్‌పిట్‌లో మంటలు చెలరేగాయని, ఫలితంగా విమానం కుప్పకూలిందని నిర్ధారించారు. దర్యాప్తునకు సంబంధించి 134 పేజీల నివేదికను పారిస్‌లోని అప్పీల్ కోర్టులో గత నెల సమర్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలతో ‘న్యూయార్క్ పోస్ట్’ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించడంతో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తొలుత ఈ విమాన ప్రమాదాన్ని ఉగ్రవాద దాడిగా ఈజిప్ట్ ప్రకటించింది. కానీ, ఏ ఉగ్రసంస్థ కూడా దానిని తామే చేసినట్లు నిర్ధారించలేదు. ఈ తరుణంలో విమానంలోని లోపమే కారణమని ఇంతకాలం అనుకున్నారు. అయితే.. ఆ విమానం 2003 నుంచే సర్వీసుల్లోకి అడుగుపెట్టింది. అంటే కేవలం 13 ఏళ్ల సర్వీసు మాత్రమే పూర్తి చేసుకుంది. సాధారణంగా ఆ విమానం లైఫ్ 30 నుంచి 40 ఏళ్ల ఉంటుంది. ఈ నేపథ్యంలో అనుమానాలు.. విస్తృతస్థాయి దర్యాప్తు వైపు అడుగులు వేయించాయి. కాక్‌పిట్‌లో పైలట్ సిగరెట్ వెలిగించగానే అత్యవసర మాస్క్ నుంచి ఆక్సిజన్ లీకై కాక్‌పిట్‌లో మంటలు చెలరేగాయి. ఫలితంగా విమానం కుప్పకూలిందని దర్యాప్తు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. కాక్‌పిట్‌లో మంటలు అంటుకున్న సమయంలో సిబ్బంది భయంతో అరుస్తున్న శబ్దాలు మాస్క్‌కు ఉన్న మైక్రోఫోన్లో రికార్డయ్యాయి. ఇక పైలెట్ సిగరెట్ పొగ పీల్చినట్లు రికార్డయిన శబ్దాల గురించి ఇటాలియన్ పత్రిక కార్రియర్ డెల్లా సెరా కూడా ఓ కథనం ప్రచురించింది. ప్రమాదానికి గురైన ఈజిప్ట్ ఎయిర్ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్-ఎ320, 2016 మే 19న తేదీన పారిస్ నుంచి ఈజిప్ట్ రాజధాని కైరోకు బయలుదేరింది. గ్రీక్ ద్వీపాలకు 130 నాటికల్ మైళ్ల దూరలో రాడార్ నుంచి విమానం అదృశ్యమైంది. ఆ తర్వాత కాసేపటికే క్రెటె ద్వీపం సమీపంలో తూర్పు మధ్యధరా సముద్రంలో కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 40 మంది ఈజిఫ్ట్ పౌరులు, 15 మంది ఫ్రెంచ్ పౌరులు సిబ్బంది సహా మొత్తం 66 మంది ఉండగా, అంతా ప్రాణాలు కోల్పోయారు. చదవండి: పాక్-అఫ్గన్.. డామిట్ కథ అడ్డం తిరిగింది! -
గ్రౌండ్‌లోనే సిగరెట్ కాల్చిన అఫ్గన్ క్రికెటర్.. ఫ్యాన్స్ ఆగ్రహం
అఫ్గనిస్తాన్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్ గ్రౌండ్లో సిగరెట్ కాలుస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో అతని ప్రవర్తనపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022)లో భాగంగా ఫిబ్రవరి 4న మినిస్టర్ గ్రూఫ్ ఢాకా, కొమిల్లా విక్టోరియన్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇది చోటుచేసుకుంది. మ్యాచ్ కొద్దినిమిషాల్లో ప్రారంభం అవుతుందనగా.. మైదానంలోకి వచ్చిన మహ్మద్ షెహజాద్ సిగరెట్ కాల్చాడు. అతని నోటి నుంచి సిగరెట్ పొగను వదలడం కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. ఇది చూసిన షెహజాద్ జట్టు కోయ్ మిజానుర్ రెహ్మన్, తమీమ్ ఇక్బాల్‌లు వెంటనే గ్రౌండ్‌కు వచ్చి షెహజాద్‌ను డ్రెస్సింగ్‌రూమ్‌కు తరలించారు. చదవండి: PSL 2022: ఇంత దరిద్రమైన ఎంట్రీ ఎప్పుడు చూడలేదు.. అఫ్రిదిపై ట్రోల్స్ వర్షం కాగా షెహజాద్ చర్యపై బీసీబీ చీఫ్ మ్యాచ్ రిఫరీ తీవ్రంగా మండిపడ్డారు. నిబంధనల ప్రకారం గ్రౌండ్లో స్మోక్ చేయడం నిషేధం. ఆ రూల్ మరిచి షెహజాద్ గ్రౌండ్‌లోనే సిగరెట్ కాల్చడం తప్పు. ఒకవేళ షెహజాద్‌కు ఈ విషయం తెలియకపోతే.. మ్యాచ్ అఫీషియల్స్ అతనికి సమాచారం అందించాల్సింది. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీబీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.20 కింద నిబంధనలు ఉల్లఘించిన కారణంగా షెహజాద్‌కు పెనాల్టీతో పాటు డీమెరిట్ పాయింట్స్ ఇచ్చారు. దీనిపై స్పందించిన మహ్మద్ షెహజాద్ తన ప్రవర్తనపై క్షమాపణ కోరాడు. తాను చేసింది తప్పేనని.. ఫైన్ కట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. ఫ్యాన్స్ నాపై కోపం వ్యక్తం చేయడంలో అర్థం ఉందని పేర్కొన్నాడు. If Shah Rukh Khan could be banned for 5 years due to smoking in the gallery, Or Lankan players could be banned for smoking, not even in the stadium. Then surely this rubbish cricketer from Afghanistan (Mohammad Shahzad) should be banned for a lifetime in the BPL! @BCBtigers @ICC pic.twitter.com/R5jGtCutlY — Foysal Sawon (@foysal_sawon) February 4, 2022 -
పొగాకు వినియోగంలో వారే అధికం.. షాకింగ్ విషయాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పొగాకు ఉత్పత్తుల వినియోగంలో ప్రపంచస్థాయిలో అమ్మాయిలు అబ్బాయిలను మించిపోయారు. పాఠశాల స్థాయిలో ఇది ఎక్కువగా ఉంది. 15 ఏళ్లలోపు విద్యార్థులు వివిధ రూపాల్లో పొగాకు వినియోగానికి ఆకర్షితులవుతున్నారు. తోటి విద్యార్థులను చూసి సరదాగా మొదలుపెట్టినవారు ఆ తరువాత వ్యసనంగా మార్చుకుంటున్నారు. యువత టొబాకో వినియోగంపై గ్లోబల్ యూత్ టొబాకో నిర్వహించిన సర్వే ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచస్థాయిలో పొగాకు వినియోగంలో అబ్బాయిలు 22శాతం ఉంటే... అమ్మాయిలు 24శాతం. అంటే రెండు శాతం ఎక్కువగా అమ్మాయిలు పొగాకు ఉత్పత్తులను ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నారు. ధూమపానంలో కూడా అమ్మాయిలదే పైచేయి. మొత్తంగా 2.3శాతం విద్యార్థుల్లో– అమ్మాయిలు 2.7%, అబ్బాయిలు 1.9% పొగ తాగుతున్నారు. 12 శాతం విద్యార్థులు (13% అమ్మాయిలు, 12% అబ్బాయిలు) వివిధ పొగాకు ఉత్పత్తులను (స్మోక్లెస్ టొబాకో) ఉపయోగిస్తున్నారు. భారత్‌లో మేలు.. యువత పొగాకు వినియోగ పర్యవేక్షణకు ‘గ్లోబల్ టొబాకో సర్వేలెన్స్ సిస్టమ్’ప్రమాణాలకు అనుగుణంగా దేశంలో గ్లోబల్ యూత్ టొబాకో సర్వే–4 నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపిఎస్) దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి స్కూళ్లలో (550 ప్రభుత్వ, 450 ప్రైవేట్ పాఠశాలలు)ని దాదాపు లక్ష మంది (80 వేలకు పైగా 13–15 ఏళ్ల వయసున్న) విద్యార్థులపై సర్వే నిర్వహించింది. జాతీయస్థాయిలో 2003తో (16.9 శాతంతో) పోల్చితే దేశంలో ఈ వయసు పిల్లల్లో పొగాకు వినియోగం 2019లో 8.5 శాతానికి తగ్గినట్టుగా ఈ సర్వే వెల్లడించింది. మొత్తంగా చూస్తే... భారత్‌లో అబ్బాయిలు–9.6%, అమ్మాయిలు–7.4% పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. వీరిలో 7.3% (అబ్బాయిలు–8.3%, అమ్మాయిలు–6.2%) పొగాకు పొగరూపంలో పీలుస్తున్నారు. 2.6% మంది సిగరెట్ల రూపంలో పొగ తాగుతున్నారు. 2.1% మంది బీడీల రూపంలో పొగ పీలుస్తున్నారు. 4.1% (అబ్బాయిలు–4.6%,అమ్మాయిలు–3.4 %) పొగలేని పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తున్నారు. సరదాగా మొదలై వ్యసనంగా... ‘వివిధ రూపాల్లో పొగాకు వినియోగం మొదట్లో తోటి విద్యార్థుల ›ప్రోద్బలం, ఒత్తిళ్లతో సరదాగా మొదలవుతుంది. ఇది అలవాటయ్యాక ఇతరుల నుంచి తప్పించుకుని రహస్యంగా స్మోకింగ్ కొనసాగిస్తారు. ఆ తర్వాత ఇతరుల ఎదుట ధైర్యంగా పొగతాగగలుగుతారు. ఈ అలవాటును తల్లిదండ్రులు ముందే నివారించాలి. మొదలుపెట్టినవారిని మానిపించేందుకు ప్రయత్నించాలి’అని అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ సెక్రటరీ జనరల్ డా.అభిషేక్ శుక్లా చెబుతున్నారు. అత్యల్ప పొగాకు వినియోగంలో టాప్–10 రాష్ట్రాలు... ► హిమచల్‌ప్రదేశ్–1.1శాతం ► కర్ణాటక–1.2 ►గోవా–2.1 ► దాద్రా, నగరహవేలి–2.4 ►ఆంధ్రప్రదేశ్–2.6 ► చంఢీగఢ్–3.0 ► కేరళ–3.2 ►హరియాణ–3.8 ►మధ్యప్రదేశ్–3.9 ► రాజస్థాన్–4.1 తెలంగాణ–5.2 శాతంతో 17వ స్థానంలో నిలిచింది. అత్యధిక పొగాకు వినియోగంలో టాప్–10 రాష్ట్రాలు... ► మిజోరామ్–57.9 శాతం ►అరుణాచల్‌ప్రదేశ్–57.9 ► నాగాలాండ్–42.6 ► మేఘాలయా–33.6 ►సిక్కిం–24.8 ►యూపీ–22.9 ► మణిపూర్–19.5 ► ఉత్తరాఖండ్–18.5 ► అస్సాం–11.9 ►జమ్మూ,కశ్మీర్–లఢాక్–11.2 పొగ తాగుతున్న ప్రదేశాలు ►ఇళ్ల దగ్గర–23.5 శాతం ►స్కూళ్ల వద్ద–19.5 ►స్నేహితుల ఇళ్ల వద్ద–16.7 ►ఫంక్షన్లు, కార్యక్రమాల్లో–8.7 ►బహిరంగప్రదేశాల్లో–12.2 ► ఇతరచోట్ల–19.4 శాతం -
విమానంలో సిగరెట్ తాగిన యువతి
-
ఆమిర్ ఖాన్ కూతురు సిగరెట్ తాగుతుందా?
Aamir Khan’s Daughter Ira Khan: మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముంది అంటారా? మరేం లేదు, ఇరా ఖాన్ తన కుక్కపిల్లను కాళ్ల మీద పడుకోబెట్టుకుని ఉంది. ఆమె పక్కనే ఓ వస్తువుంది, కానీ అది బ్లర్ అయి ఉంది. అయితే బ్లర్ చేసినప్పటికీ అదేంటో పసిగట్టారు నెటిజన్లు. కచ్చితంగా అది సిగరెట్ బాక్స్ లేదా లైటర్ అయ్యుంటుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇరా ఖాన్ సిగరెట్ తరచూ తాగుతుందని, ఇంతకీ ఏ బ్రాండ్ సిగరెట్ తాగుతుందో? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అక్కడ సిగరెట్‌తో పాటు లైటర్ కూడా ఉందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే కొద్దిమంది మాత్రం ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను కూడా విమర్శిస్తున్నారు. 'సెలబ్రిటీల పిల్లలు ఎందుకు సరిగా బట్టలు వేసుకోరు', 'ఆమె ప్యాంటు వేసుకోవడం మర్చిపోయినట్లుంది' అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
స్కూళ్ల సమీపంలోని సిగరెట్, పాన్ షాపులు క్లోజ్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల చుట్టూ కలుషిత వాతావరణం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ స్కూల్‌కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్లు అమ్మే షాపులు ఉండకూడదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్ల సమీపంలోని పరిస్థితులను ఇకపై ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తారు. ఒక్కో ఏఎన్ఎంకు రెండు, మూడు పాఠశాలల బాధ్యతలు అప్పగించనున్నారు. ఏఎన్ఎం వెళ్లి స్కూలు సమీపంలోని పరిస్థితులను పరిశీలించాల్సి ఉంటుంది. దీనికోసం ఒక ప్రత్యేక యాప్‌ను తయారు చేశారు. ఈ యాప్ ద్వారా అక్కడి ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. ఎవరైనా సిగరెట్, గుట్కా వంటి షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే స్కూల్ సమీపంలో ఎవరైనా స్మోకింగ్ చేసినా కూడా చర్యలుంటాయి. మద్యం షాపులైతే ఆ పరిసరాల్లో అసలే కనిపించకూడదు. ప్రతి స్కూల్‌నూ పర్యవేక్షణ కోసం మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ అనంతరం వీటిని ఆన్లైన్ పోర్టల్‌కు అనుసంధానిస్తారు. చెడు అలవాట్ల ప్రభావం చిన్నపిల్లలపై పడకూడదని ఈ చర్యలు చేపట్టారు. అలాగే స్కూల్ ఆవరణలో స్మోకింగ్ వల్ల వచ్చే అనర్థాలను సూచించే బోర్డులను ఏర్పాటు చేస్తారు. టీచర్లు ఎవరైనా స్కూల్ ఆవరణలో స్మోకింగ్ చేస్తే.. వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటారు. త్వరలో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. -
రోజుకు 20 నుంచి 30 సిగరెట్లు తాగేవాడిని: నటుడు
50 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఫిట్‌గా ఉంటూ యంగ్ హీరోలకే సవాళ్లు విసిరే నటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఆ లిస్టులో బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ ముందు వరుసలో ఉంటాడు. తాజాగా అతడు తనకు గతంలో ఉన్న చెడు అలవాటు గురించి వెల్లడించాడు. "పొగాకు ప్రతి యేటా ప్రపంచంలోని ఎనభై లక్షల మంది ప్రాణాలను హరిస్తోంది. మే 31న జరుపుకునే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నాకు ఎప్పుడూ ఒకటి గుర్తు చేస్తూ ఉంటుంది" "32 ఏళ్ల వయసులో కెప్టెన్ వ్యోమ్ సిరీస్ చేస్తున్నప్పుడు సిగరెట్లు తాగడం బాగా అలవాటైంది. రోజుకు 20 నుంచి 30 సిగరెట్లు కాల్చేవాడిని. చాలా తక్కువ కాలంలోనే పొగాకుకు బానిసనయ్యాను. కానీ అదృష్టవవాత్తూ దానివల్ల నాకు ఎటువంటి మేలు జరగదని తెలుసుకుని పొగ తాగడం మానేసాను" అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిన అతడు సిగరెట్‌ను ముక్కలు చేసిన వీడియోను రిలీజ్ చేశాడు. ఇది చూసిన అభిమానులు ఒకప్పుడు పొగాకుకు బానిసగా మారి దాన్ని త్యజించడం అంటే అంత మామూలు విషయం కాదని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) చదవండి: సెల్ఫీ అడిగిన మహిళతో పుషప్‌లు.. నటుడిపై నెటిజన్లు ఫైర్ -
World No Tobacco Day 2021: దమ్ము కొడితే.. దుమ్ములోకే..
సాక్షి, నిర్మల్: ఆధునిక కాలంలో ధూమపానం ఒక ఫ్యాషన్‌గా మారింది. ఆడా మగ తేడా లేకుండా నేటి యువత మత్తుకు బానిస అవుతున్నట్లు వైద్యశాఖ లెక్కలు చెబుతున్నాయి పొగాకుతో పాటు మరికొన్ని మత్తుపదార్థాలు కలిపి ధూమ పానం చేస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో ఊపిరితిత్తుల సమస్యలు, ఉబ్బసం గ్యాస్ట్రిక్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాక్షి కథనం. 1987 నుంచి... ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో 1987 నుంచి ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా పాటిస్తున్నారు. పొగాకు అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.నేడు పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ఆకు చుట్ట నుండి గుట్కా వరకు.. నాలుగు దశాబ్దాల క్రితం పొగాకు ఎండబెట్టి శుభ్రపరిచి దానిని పాయలుగా విడదీసి ఎండిన ఆకుల్లో చుట్టి గ్రామీణ ప్రాంతాల్లో పురుషులు అక్కడక్కడ మహిళలు పీలుస్తుండేవారు. కాలక్రమంలో పొగాకు చుట్టాల స్థానంలోకి బీడీలు చేరాయి. ఆతర్వాత ఫ్యాషన్‌గా సిగరెట్లు తేలాయి. పొగాకు అలవాటు మనిషి జీవన కాలాన్ని తగ్గిస్తుంది. ఒక సిగరెట్ తాగడం వల్ల 11 నిమిషాల ఆయుష్షు తగ్గుతుంది. పొగ తాగే వాళ్ళు ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులకు వ్యాధులు సోకే అవకాశం లేకపోలేదు. -
రైళ్లలో సిగరెట్ తాగితే భారీ జరిమానా
-
ఆ ఒక్కటీ.. ఒక్కటంటే కూడా ప్రమాదకరమే!
చాలా మంది సిగరెట్ మానేసే ప్రక్రియలో రోజుకు ఒక్కటే తాగుతుంటామని, అలా క్రమంగా తగ్గిస్తామని అనుకుంటుంటారు. అయితే రోజుకు ఒక్క సిగరెట్ మాత్రమే కాదు... సగం సిగరెట్ అయినా అది ప్రమాదకరమే అంటున్నారు యూఎస్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన నిపుణులు. ఆ సంస్థలోని క్యాన్సర్ ఎపిడెమియాలజీ అండ్ జెనెటిక్స్ విభాగానికి చెందిన మాకీ ఇన్యోయ్ చోయ్ అనే శాస్త్రవేత్త చెబుతున్న దాని ప్రకారం సగం సిగరెట్ కూడా చాలా ప్రమాదకారి అంటున్నారామె. ఆ అధ్యయనవేత్త ఆధ్వర్యంలో 59 నుంచి 82 ఏళ్ల వయసులో ఉన్న దాదాపు మూడు లక్షల మందిపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాల గురించి ఆమె మాట్లాడుతూ ‘‘కొంతమంది తమ అలవాటు మానలేక సిగరెట్ వెలిగించి, సగం సిగరెట్ అంటూ ఒకటి రెండు పఫ్స్ తీసుకుంటారు. అయితే అసలు సిగరెట్ తాగని వాళ్లతో పోల్చినప్పుడు ఇలా ఒకటి, రెండు పఫ్స్ తీసుకునే 64 శాతం మందికి పొగాకుతో కలిగే ముప్పులన్నీ వస్తుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే రిస్కు సాధారణ ప్రజల్లో కంటే 12 రెట్లు ఎక్కువని వివరించారు. అలాగే పొగాకు అలవాటు లేని సాధారణ వ్యక్తితో పోలిస్తే సిగరెట్ తాగేవాళ్లలో ఎంఫసిమా వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే రిస్క్ సైతం రెండున్నర రెట్లు ఎక్కువని చెబుతున్నారు. -
సిగరెట్ సూసైడ్లను ప్రేరేపిస్తుందా?
సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారిలో ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక (సూయిసైడల్ టెండెన్సీస్) చాలా ఎక్కువగా పెరిగే అవకాశాలున్నాయంటూ హెచ్చరిస్తున్నారు అమెరికాకు చెందిన పరిశోధకులు. మోకాలికీ, బోడిగుండుకీ ముడివేస్తున్నట్లు అనిపిస్తున్నా ఇది ప్రత్యక్ష అధ్యయనంలో పరోక్షంగా తేలిన వాస్తవమంటున్నారు. యూఎస్‌లో ఆత్మహత్యలపై పరిశోధన చేస్తున్న కొందరు నిపుణులు చెబుతున్న ఫలితాల ప్రకారం... సిగరెట్ అలవాటును తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల తర్వాత పొగతాగే అలవాటు గణనీయంగా తగ్గడంతోపాటు దాంతో విచిత్రంగా ఆత్మహత్యలు కూడా 15 శాతం తగ్గాయని వివరించారు. అయితే దీనికి ఆత్మహత్యలకూ సిగరెట్ అలవాటుకూ ఎలా ముడిపెడతారన్న అడిగినప్పుడు వారు మరో దృష్టాంతం చూపారు. సిగరెట్లపై టాక్సులు తగ్గించిన అక్కడి కొన్ని రాష్ట్రాలలో ఆత్మహత్యల శాతం 6 శాతం పెరిగాయని గణాంకాలు చూపారు. డ్రగ్స్ అలవాటు ఉన్నవారిలో సూసైడల్ టెండెన్సీస్ పెరిగినట్లే... నికోటిక్‌కు బానిసలైన వారిలోనూ యాంగై్జటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెరుగుతాయనీ, డిప్రెషన్ ఉన్నవారికి ఆత్మహత్యావాంఛ ఒక లక్షణమని చెబుతూ ఈ పరిశోధన ఫలితాలను ‘నికోటిక్ అండ్ టొబాకో రీసెర్చ్’ అనే జర్నల్‌లో ప్రచురించారు. -
సరె సర్లే ఎన్నెన్నో అనుకుంటాం..
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఏడాది నుంచి సిగరెట్ ముట్టనే ముట్టను.. మందు మొహమే చూడను.. చికెన్ మానేస్తా.. మటన్ మానేస్తా.. ఎక్సర్సైజ్ చేసేస్తా.. మంచోడిగా మారిపోతా.. ఇలా కొత్త ఏడాది వచ్చినప్పుడల్లా చాలా అనుకుంటాం.. మనసులో ఒట్టు పెట్టేసుకుంటాం.. అయితే.. ఈ కొత్త ఏడాదులు వచ్చిపోతూనే ఉంటాయి.. ఒట్లు తీసి గట్ల మీద పెట్టేస్తునే ఉంటాం.. ఇక ఈ ఏడాది సంగతి చెప్పనక్కర్లేదు.. అనుకున్నదానికంతా రివర్స్ అయింది. మరికొన్ని రోజుల్లో 2021 వచ్చేస్తోంది.. మన దగ్గర మొదలైందో లేదో గానీ.. అమెరికావోళ్లు మాత్రం అప్పుడే అది చేయాలి ఇది చేయాలి అని ప్రతిజ్ఞలు మొదలుపెట్టేశారు. ఎక్కువగా ఈ ఏడాది ఇంట్లోనే ఉండటం.. సోషల్ డిస్టెన్స్.. దీనికితోడు జంక్ ఫుడ్ వంటివి బాగా లాగించేసి.. బొజ్జలు పెంచిన నేపథ్యంలో కొత్త సంవత్సరంలో దాన్ని తగ్గించే దిశగానే అలా చేస్తాం.. ఇలా చేస్తాం అని అనుకున్నారట..కొందరు రెండు మూడు గోల్స్ పెట్టుకున్నారంట.. దీనికి సంబంధించిన వివరాలను స్టాటిస్టా గ్లోబల్ కన్జ్యూమర్ సర్వే వెల్లడించింది. 1. ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తాం 2. హెల్దీఫుడ్తింటాం.. 3. బంధుమిత్రులతో ఎక్కువ సమయం గడుపుతాం.. 4. బరువును తగ్గిస్తాం 5.పొదుపుగా జీవిస్తాం 6. సోషల్ మీడియాను చూడటం తగ్గిస్తాం.. 7. ఉద్యోగంలో సామర్థ్యాన్ని పెంచుకుంటాం 8. జాబ్‌లో పని ఒత్తిడిని తగ్గించుకుంటాం.. 9. సిగరెట్ మానేస్తాం 10. మందు తగ్గిస్తాం ఇంతకీ మీరేమనుకుంటున్నారు.. ఒకవేళ అనుకున్నా.. చేసే అలవాటు మీకుందా.. లేకుంటే.. ఎప్పట్లాగే.. ఇదే డైలాగ్ కొడతారా.. : సరె సర్లే చాలా అనుకుంటాం.. ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తాం -
దమ్ము కొడుతున్న 'జెస్సీ' హీరోయిన్
-
దమ్ము కొడుతున్న 'జెస్సీ' హీరోయిన్
నాటకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అషిమా నర్వాల్. 'జెస్సీ' చిత్రంతో ప్రేక్షకుల మదిని దోచుకున్న ఈ అమ్మడు తర్వాత తమిళ సినిమాలు చేస్తూ బిజీగా మారారు. అయితే ఇప్పుడు కొత్తగా నటిస్తున్న ఓ చిత్రంలో తన పాత్ర కోసం దమ్ము కొట్టడం నేర్చుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ విల్ ట్రబుల్స్ యూ, ఐయామ్ నాట్ ద ట్రబుల్.. ఐయామ్ ద ట్రూత్" అని ఆవేశంతో చెప్పాల్సిన బాలయ్య డైలాగ్‌ను కూల్‌గా సిగరెట్ తాగుతూ చెప్పారు. (చదవండి: తాప్సీకి మాల్దీవులు స్పెషల్ ట్రిప్!) కొసమెరుపు ఏంటంటే సిగరెట్ తాగడం హానికరమని క్యాప్షన్ ద్వారా హెచ్చరిక జారీ చేశారు. అయితే తన కొత్త సినిమా కోసమే సిగరెట్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల హైదరాబాద్ వీధుల్లో షికార్లు కొట్టడం కూడా ప్రమాదమేనని పేర్కొన్నారు. ఇక మనమందరం భూమిని ఇబ్బందిపెడుతున్నామని, అందుకే భూమాత మనల్ని తిరిగి ఇబ్బంది పెడుతోందని, నిజానికి భూమి అసలు సమస్య కాదని, అదే అసలు సిసలైన నిజమని బాలయ్య డైలాగ్ తరహాలో చెప్పారు. అయితే ఇది హైదరాబాద్ వరదల గురించే పరోక్షంగా ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. (చదవండి: ప్రభాస్ మూవీకి బిగ్‌బీ అంత తీసుకుంటున్నాడా?) -
సిగరెట్.. చుట్టూ వందల కోట్ల వ్యాపారం
సాక్షి, సిటీబ్యూరో: సిగరెట్..చుట్టూ ఇప్పుడు రూ.వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది. విదేశాల్లో తయారైన కొన్ని బ్రాండ్లను ఢిల్లీ మీదుగా గుట్టుగా నగరానికి తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ స్మగ్లింగ్ దందా లాక్డౌన్ తదనంతర పరిణామాలతో పెరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగర వ్యాప్తంగా నిఘా ముమ్మరం చేశారు. ఫలితంగా శనివారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు రూ.12.6 లక్షల సరుకుతో చంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ అహ్మద్ చిక్కాడు. ఈ విదేశీ సిగరెట్ల దందాపై దృష్టి పెట్టిన పోలీసు విభాగం లోతుగా ఆరా తీస్తోంది. తయారీ మొత్తం ఆయా దేశాల్లోనే... హైదరాబాద్ నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో కొన్ని బ్రాండ్లే ఎక్కువగా ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ గుర్తించింది. సాధారణ సిగరెట్లకు భిన్నమైన ఫ్లేవర్స్ కలిగి ఉండే డజరమ్ బ్లాక్, గుడాన్ గరమ్, మాల్బరో, డన్హిల్, ఎస్సా, విన్, ప్యారిస్ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు వివిధ రూపాల్లో వస్తున్నట్లు గుర్తించింది. ఇవి తయారవుతున్నది ఇండోనేషియా, చైనా, మలేషియా,స్విడ్జర్లాండ్, సౌత్ కొరియాల్లో అయినప్పటికీ అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకోవట్లేదు. దుబాయ్ మీదుగానే ఢిల్లీ, ముంబై, చెన్నైలకు చేరి అట్నుంచి సిటీకి వస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. మహ్మద్ అహ్మద్‌కు సైతం ఢిల్లీలోని సదర్ బజార్ నుంచి రైల్వే కార్గోలో వచ్చిన విషయం ఇప్పటికే గుర్తించారు. అధికారుల కళ్ళు గప్పేందుకు ఈ అక్రమ రవాణా సిగరెట్ల పేరుతో కాకుండా వివిధ వస్తువులంటూ జరుగుతోందని నిర్థారిస్తున్నారు. ఓసారి ఓడలు, మరోసారి విమానాలు... సిటీకి సిగరెట్ల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న నగరానికి చెందిన ఓ ముఠాపై గతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు డేగకన్ను వేశారు. ఈ గ్యాంగ్ ఓసారి విదేశీ సిగరెట్లను సముద్ర మార్గంలో కంటైనర్ల ద్వారా తీసుకువచ్చింది. పిల్లలకు వినియోగించే డైపర్లని చెప్తూ కంటైనర్ ముందు వరుసల్లో వాటినే పెట్టి, వెనుక సిగరెట్లను నింపి తీసుకువచ్చింది. మూసాపేటలో ఉన్న ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోకు ఇవి చేరుకోవడంతో ఉప్పందిన డీఆర్ఐ అధికారులు దాడి చేసి రూ.7.5 కోట్ల విలువైన రెండు కంటైనర్లను పట్టుకుని నిందితుల్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత పంథా మార్చిన అదే గ్యాంగ్ ఇంజనీరింగ్ వస్తువులు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ పేరుతో విమాన మార్గంలో తీసుకువచ్చింది. శంషాబాద్‌లోని ఎయిర్‌కార్గోలో ఉండగా దాడి చేసి రూ.51 లక్షల వలువైనవి స్వాధీనం చేసుకుని ముఠాను అరెస్టు చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇలాంటి గ్యాంగ్స్ మరోసారి రెచ్చిపోతున్నట్లు టాస్క్‌ఫోర్స్ అనుమానిస్తోంది. ఒకటికి ఒకటిన్నర డ్యూటీ... ఆరోగ్యానికి హానికరమైన, స్థానికంగా ఉండే వ్యాపారులను నష్టాన్ని తీసుకువచ్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుల్లో ఉండే సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్ ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీనే రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ డ్యూ టీని ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠా భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతోందని డీఆర్ఐ దర్యాప్తులో తేలింది. సిటీలో ఉన్న హోల్‌సేలర్లతో సంబంధాలు పెట్టుకున్న ఈ గ్యాంగ్ వారి ద్వారా మార్కెట్లోని వెదజల్లుతోంది. ఆరోగ్యానికీ చేటనే అనుమానం... ఈ రకంగా అక్రమ రవాణా ద్వారా నగరంలోకి వస్తున్న సిగరెట్ల కారణంగా ‘పన్ను పోటు’తో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటు ఉందని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుల దర్యాప్తు నేపథ్యంలో క్షేత్రస్థాయిలోనూ పరిశీలన చేసి వ్యాపార లావాదేవీలను గుర్తించాలని నిర్ణయించారు. ఇలా చేయడం ద్వారా మూలాలు కనుగొనడానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు. విదేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా వెలుగులోకి రాలేదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్ హెల్త్ ఆఫీసర్లు పరీక్షించి సర్టిఫై చేస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకపోడంతో విపణిలోకి వెళ్ళిపోతున్నాయని వివరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి ఎనలేని హాని చేస్తాయిని పోలీసులుహెచ్చరిస్తున్నారు. -
యువతకు గాలమేస్తున్నారు..
న్యూఢిల్లీ: పొగాకు లాబీ కన్ను ఇప్పుడు యువతపై పడింది. వారిని ఎలాగైనా పొగాకుకు బానిసలుగా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ సిగరెట్లలో యువతకు నచ్చే రుచి, వాసనలు చేర్చడం ఈ ప్రయత్నాల్లో భాగమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గుర్తించింది. పీచు మిఠాయి, బబుల్గమ్, చెర్రీ పండ్ల రుచి వాసనలతో పొగాకు ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ఆరోగ్యానికి చేసే హానిని కాదని.. యువత పొగాకును ఎక్కువగా వినియోగిస్తుందని పరిశ్రమ వర్గాల అంచనా. అంతేకాదు.... యూఎస్బీ డ్రైవ్, ఐస్‌క్యాండీ వంటి ఆకారాల్లో పొగాకు ఉత్పత్తులను సిద్ధం చేసి మరీ యువతకు గాలమేస్తున్నారు. (కరోనాకు ధూమపానం మంచిదేనట!) శుద్ధమైనవి, తక్కువ హాని చేసేవన్న లేబుళ్లు తగిలించడం వెనుక కూడా పరిశ్రమ హస్తం ఉందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. చాలా దేశాల్లో టెలివిజన్, ప్రింట్, సామాజిక మాధ్యమాల్లో పొగాకు ప్రకటనలివ్వడంపై నిషేధం ఉన్న నేపథ్యంలో కంపెనీలు యూటూబర్లు, ఇతర సామాజిక మాధ్యమ ఇన్‌ఫ్లుయెన్షర్లు (ప్రభావం చూపగలవారు)తో పరోక్షంగా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్నట్లు, తద్వారా 18 ఏళ్ల లోపు వయసు వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. (ఊపిరాడటం లేదు..!!) యువత ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల అమ్మకం చేపట్టడం, తినుబండారాలు, కూల్‌డ్రింక్స్ అమ్మే చోట పొగాకు ఉత్పత్తుల ప్రచారం, సిగరెట్లు విడిగా అమ్మడం, పొగాకు ఉత్పత్తుల నియంత్రణకు ప్రభుత్వాలు చేసే అన్ని రకాల ప్రయత్నాలపై కొర్రీలు వేస్తూ వాటి అమలును జాప్యం చేయడం వంటివి ఈ ప్రయత్నాల్లో భాగంగానే చూడాలి. ఈ ఎత్తుగడలన్నింటినీ చిత్తు చేసే లక్ష్యంతోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది ‘నో టొబాకో డే’ ఇతివృత్తంగా కార్యక్రమాలను అమలు చేస్తోంది. కంపెనీల కుటిలయత్నాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ‘రహస్యం బట్టబయలు’ అన్న శీర్షికతో ప్రచార సామగ్రిని సిద్ధం చేసింది. ఆదాయానికి.. అలవాట్లకు లింకు ధూమపానం అలవాటయ్యేందుకు వ్యక్తులు, దేశాల ఆదాయానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ధనిక దేశాల్లో పొగతాగే వాళ్లు ఎక్కువగా ఉండటం దీనికి నిదర్శనం. అయితే అలవాట్లు మారేందుకు ఎక్కువ సమయం ఏమీ పట్టడం లేదు. 2000 సంవత్సరంలో యునైటెడ్ కింగ్డమ్లో దాదాపు 38 శాతం మంది పొగరాయుళ్లు ఉండగా... తాజా లెక్కల ప్రకారం ఇప్పుడు ఇది 22 శాతానికి తగ్గిపోయింది. ఇలాంటి హెచ్చుతగ్గులు చాలాదేశాల్లో కనిపిస్తాయి. ధూమపానం మానేస్తే... పొగ తాగడం వల్ల రకరకాల రసాయనాలు శరీరంలోకి చేరతాయి. వీటిల్లో చాలావరకూ రక్తంలోని ఆక్సిజన్‌ను హరించేవే. పొగతాగడం మానేసిన తరువాత కొంత కాలానికే రక్తంలో ఆక్సిజన్ మోతాదు పెరిగిపోతుంది. ఫలితంగా మరింత శక్తి, ఉత్సాహం లభిస్తాయి. అలాగే ఆహారపు రుచి తెలిసేలా చేసే టేస్ట్ బడ్స్ మళ్లీ చురుకుగా పనిచేయడం మొదలవుతుంది. దీంతో తినే తిండి రుచి, వాసనలు స్పష్టంగా తెలుస్తాయి. పొగాకు కారణంగా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన గార, రసాయనాలు క్రమేపీ తగ్గిపోయి ఊపిరి పీల్చుకోవడం భారంగా అనిపించదు. అంతేకాదు.. పోషకాలు అందడం ఎక్కువ కావడం వల్ల చర్మంపైని ముడుతలు తగ్గుతాయి. -
వైరల్: సిగరెట్‌తో రాకెట్ల ప్రయోగం
-
సిగరెట్‌తో రాకెట్ల లాంచింగ్..
గాల్లో ఎగిరే రాకెట్ పయనం నేల మీద నుంచే ప్రారంభమవుతుంది. అది ఇస్రోలోనైనా, ఇంటి ముందు వాకిట్లో అయినా! అయితే ఓ పెద్దాయన మాత్రం రాకెట్‌ను పంపించేందుకు కొత్త విధానాన్ని కనుగొన్నాడు. కానీ దీన్ని ఎవరూ ప్రయత్నించద్దని కోరుతున్నాడు. అదేంటని తికమకపడకుండా ముందుగా ఈ వార్త చదివేయండి.. అటవీ అధికారి సుశాంత్ నందా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ఓ వ్యక్తి నడిరోడ్డుపై నిలబడుతూ ఓ సాహసానికి పూనుకున్నాడు. దర్జాగా సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు. ఓ చేతిలో రాకెట్లతో నిలబడ్డాడు. (అవార్డు విన్నింగ్ లెవల్లో నటించింది) ఇంకేముందీ.. ఎవరూ ఆ దారి గుండా రావడం లేదని నిశ్చయించుకున్నాక అసలు పని ప్రారంభించాడు. ఒక్కో రాకెట్‌ను కుడి చేతులోకి తీసుకుని దాని చివరను నోట్లో ఉన్న సిగరెట్‌కు అంటించి గాల్లోకి పంపాడు. ఏ మాత్రం తొణుకు బెణుకూ లేకుండా సునాయాసంగా రాకెట్లను అంతరిక్షంలోకి కాకపోయినా ఆకాశంలోకి పంపాడు. సుమారు పది రాకెట్లను కేవలం పద్దెనిమిది సెకండ్లలో గాల్లోకి పంపాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. "అదిరిందయ్యా నీ ప్రయోగం" అంటూ కొందరు అదుర్స్ అని కామెంట్లు చేస్తుండగా, మరికొందరు మాత్రం "కొంచెం తేడా వచ్చినా ప్రాణాలకే ప్రమాదం" అని మండిపడుతున్నారు. కాగా ఇది పాత వీడియో అయినప్పటికీ మరోసారి వైరల్ అవుతోంది. (బర్త్‌డే గిఫ్ట్.. సర్ప్రైజ్ సూపర్!!) -
కోర్టులో గంజాయి సిగరెట్ కాల్చాడు..
-
వైరల్ : జడ్జీ కళ్ల ముందే గంజా సిగరెట్ తాగాడు
టేనస్సీ : కోర్టు ఆవరణలో జడ్జీ ముందే ఓ వ్యక్తి గంజాయి సిగరెట్ (గంజా సిగరెట్)ను తాగిన ఘటన అమెరికాలోని టేనస్సీ నగరంలో చోటు చేసుకుంది. కోర్టు ధిక్కారణ కేసు కింద అతనికి 10 రోజులు జైలు శిక్ష కూడా విధించబడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విరాల్లోకి వెళితే.. టేనస్సీ నగరానికి చెందిన స్పెన్సర్ బోస్టన్ అనే ఓ 20 ఏళ్ల యువకుడు గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఇటీవల అతన్ని టెనస్సీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అతను తన వాదనలు వినిపిస్తూ.. గంజాయి విక్రయాన్ని చట్ట బద్ధం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కోర్టు బోనులోనే నిలబడి జేబులో నుంచి సిగరెట్ తీసి కాల్చాడు. అందరికి గంజాయి సిగరెట్ చూపిస్తూ.. ఇది తీసుకోవడం తప్పు కాదు.. బహిరంగంగా గంజాయి తీసుకునే అర్హత ప్రతి ఒక్కరికి ఉందంటూ గట్టిగా అరిచాడు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, కోర్టు ఆవరణలో.. న్యాయమూర్తి ముందే సిగరెట్ కాల్చిన బోస్టన్‌కు కోర్టు ధిక్కారణ కేసు కింది 10 రోజులు జైలు శిక్ష విధించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 14కు వాయిదా వేసింది. నిందితుడు స్పెన్సర్ బోస్టన్ -
సిగరెట్లూ ఎగిరొస్తున్నాయ్!
సాక్షి, సిటీబ్యూరో: బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు... మాదకద్రవ్యాలు, ఇవి మాత్రమే కాదు సిగరెట్లు సైతం పెద్ద ఎత్తున సిటీకి అక్రమ రవాణా అవుతున్నాయి. ఈ తరహా స్మగ్లింగ్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడటంతో పాటు ప్రజారోగ్యానికి చేటని అధికారులు చెబుతున్నారు. నగరానికి అక్రమంగా వచ్చి చేరిన సిగరెట్లను హోల్‌సేల్‌గా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.12 లక్షల విలువైన, పది బ్రాండ్లకు చెందిన 16,380 విదేశీ సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విక్రయంపై నిషేధం కొనసాగుతోందని టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి శుక్రవారం వెల్లడించారు. నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో 23 బ్రాండ్లకు చెందినవి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారణ సిగరెట్లకు భిన్నమైన ఫ్లేవర్స్ కలిగి ఉండే బ్లాక్, గరమ్‌లతో పాటు ఎస్సీ, మోండ్ తదితర బ్రాండ్లకు చెందిన సిగరెట్లు వివిధ రూపాల్లో వస్తున్నట్లు తెలిపారు. ఇండోనేషియాలో తయారవుతున్న ఈ సిగరెట్లు అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకోవట్లేదు. దుబాయ్ మీదుగా ఢిల్లీకి వచ్చి... ఆపై నగరానికి వస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. కస్టమ్స్ సహా వివిధ విభాగాల కళ్లు గప్పేందుకు సిగరెట్ల పేరుతో కాకుండా వివిధ వస్తువుల పేరుతో ఈ అక్రమ రవాణా జరుగుతుందన్నారు. ఈ సిగరెట్లను బేగంబజార్‌కు చెందిన వికాస్ కుమార్, కలరామ్మాలి అనే వ్యక్తులు తమ వద్ద స్టాక్ చేసుకుంటున్నారు. పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా సరఫరా చేస్తూ హోల్‌సేల్‌గా నగర వ్యాప్తంగా ఉన్న రిటైలర్లకు విక్రయిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన వీరు 2016లో వ్యాపార నిమిత్తం సిటీకి వలస వచ్చారు. ప్రారంభంలో వక్కలు, స్వీట్ మసాలాలు, పాన్ షాపు ఉత్పత్తులు విక్రయించారు. ఈ వ్యాపారంలో ఎక్కువ లాభాలు లేకపోవడంతో ఢిల్లీకి చెందిన వ్యక్తులతో ఒప్పందాలు చేసుకుని విదేశీ సిగరెట్ల దందా మొదలెట్టారు. వీరి వ్యవహారాలపై సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థక్రుద్దీన్‌లు తమ బృందంతో శుక్రవారం వీరి సంస్థపై దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.12 లక్షల విలువైన నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను షాహినాయత్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. ఆరోగ్యానికి హానికరమైన, స్థానిక వ్యాపారులను నష్టాన్ని తీసుకువచ్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుల్లో ఉండే సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీ రూ.15 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ డ్యూటీని ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠాలు భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయని టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీలో ఉన్న ప్రధాన సూత్రధారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకునే ఇలాంటి గ్యాంగ్‌లు వాటిని మార్కెట్లోకి తరలిస్తున్నాయి. ఈ అక్రమ రవాణా ద్వారా నగరంలోకి వస్తున్న సిగరెట్ల కారణంగా ‘పన్ను పోటు’తో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటు ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇండోనేషియా సహా మరికొన్ని దేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా వెలుగులోకి రాలేదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్ హెల్త్ ఆఫీసర్లు పరీక్షించి సర్టిఫై చేస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకపోడంతో విపణిలోకి వెళ్లిపోతున్నాయని వివరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి ఎనలేని హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు ఈ అక్రమ సిగరెట్లపై హెచ్చరిక బొమ్మలు కూడా ఉండవని, ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు. -
ఇండోనేషియా టు హైదరాబాద్ వయా దుబాయ్
సాక్షి, సిటీబ్యూరో: బంగారం... ఎలక్ట్రానిక్ వస్తువులు... మాదకద్రవ్యాలు మాత్రమే కాదు సిగరెట్ల సైతం పెద్ద ఎత్తున నగరానికి అక్రమ రవాణా అవుతున్నాయి. ఈ తరహా స్మగ్లింగ్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడటంతో పాటు ప్రజారోగ్యానికి చేటని అధికారులు పేర్కొంటున్నారు. నగరానికి అక్రమంగా వచ్చిన సిగరెట్లను హోల్‌సేల్‌గా విక్రయిస్తున్న వ్యక్తిని తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ.6 లక్షల విలువైన 3300 విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విక్రయంపై నిషేధం కొనసాగుతోందని టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ మంగళవారం వెల్లడించారు. నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో 23 బ్రాండ్లకు చెందినవిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారణ సిగరెట్లకు భిన్నమైన ఫ్లేవర్స్ కలిగి ఉండే బ్లాక్, గరమ్‌లతో పాటు ఎస్సీ, మోండ్, మల్‌బొరొ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు వివిధ రూపాల్లో వస్తున్నట్లు తెలిపారు. ఇండోనేషియాలో తయారవుతున్న ఈ సిగరెట్లు అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకోవట్లేదు. దుబాయ్ మీదుగానే సిటీకి వస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కస్టమ్స్ సహా వివిధ విభాగాల కళ్లు గప్పేందుకు సిగరెట్ల పేరుతో కాకుండా వివిధ వస్తువుల పేరుతో అక్రమ రవాణా జరుగుతోందని వారు పేర్కొన్నారు. ఇలా నగరానికి వచ్చిన సిగరెట్లను సంతోష్ దవే అనే వ్యక్తి తన వద్ద స్టాక్ చేసుకుని హోల్‌సేల్‌గా రిటైలర్లకు విక్రయిస్తున్నాడు. అఫ్జల్‌గంజ్‌కు చెందిన ఇతను ఫీల్ఖానాలో మహాలక్ష్మీ మార్కెటింగ్ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నాడు. సుగంధ ద్రవ్యాల వ్యాపారం పేరుతో స్మగుల్డ్ సిగరెట్లనూ అమ్ముతున్నాడు. దీనిపై ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సైలు పి.రమేష్, గోవింద్ స్వామి, జి.శ్రీనివాస్‌రెడ్డి, సి.వెంకటేష్ సదరు సంస్థపై దాడి చేశారు. సంతోష్‌ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి రూ.6 లక్షల విలువైన నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని షాహినాయత్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. ఆరోగ్యానికి చేటు..ఆదాయానికి గండి ఆరోగ్యానికి హానికరమైన, స్థానిక వ్యాపారులకు నష్టాన్ని తీసుకువచ్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవులో ఉండే సిగరెట్లలో ఒక్కో దానికి ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీ రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ డ్యూటీని ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠాలు భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయని టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు. సిటీలోని సంతోష్ లాంటి హోల్‌సేలర్లతో సంబంధాలు పెట్టుకున్న ఈ ముఠాలు వారి ద్వారా సిగరెట్లను మార్కెట్లోని తీసుకెళుతున్నారు. ఈ రకంగా అక్రమ రవాణా ద్వారా నగరంలోకి వస్తున్న సిగరెట్ల కారణంగా ‘పన్ను పోటు’తో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటు ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇండోనేషియా సహా మరికొన్ని దేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేదానిపై స్పష్టత లేదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్ హెల్త్ ఆఫీసర్లు పరీక్షించి సర్టిఫై చేస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకపోడంతో విపణిలోకి వెళ్లిపోతున్నాయని వివరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి హాని చేస్తాయిని హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు ఈ అక్రమ సిగరెట్లపై హెచ్చరిక బొమ్మలు కూడా ఉండవని, ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు. -
మీరెవరు విడదీసేందుకు?
చావీ మిట్టల్ చక్కటి ప్రశ్నే వేశారు. ‘‘బహిరంగ ప్రదేశాలలో సిగరెట్ తాగితే తప్పు కాదు కానీ, తల్లి తన బిడ్డకు పాలిస్తే తప్పు అవుతుందా?’’ అని! ‘‘స్తన్యమివ్వడం ప్రకృతిలోని అందమైన విషయం. తల్లికి, బిడ్డకు మధ్య ఉండే ఈ బంధం ఎవరూ విడదీయలేనిది. బిడ్డకు ఆకలైనప్పుడు చనుబాలు పట్టడానికి ఇంట్లో ఉన్నానా, వీధిలో ఉన్నానా అని చూసుకోదు తల్లి. కానీ సమాజం దీన్నొక అపరాధంగా చూస్తోంది. రోడ్ల మీద సిగరెట్ కాలుస్తూ, తాగి తూలుతూ చుట్టుపక్కల వాళ్లకు ఇబ్బంది కలిగిస్తే ఎవరికీ పట్టదు కానీ, ఒక తల్లి తన బిడ్డకు పాలు పడితే మాత్రం ఏదో బ్రహ్మాండం బద్దలైనట్లే మాట్లాడతారు’’ అని చావీ అంటున్నారు. టీవీ నటి అయిన చావీ ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చారు. -
‘ఫ్యాన్సీ’ గా అక్రమ సిగరెట్ల వ్యాపారం
సాక్షి, సిటీబ్యూరో: బేగంబజార్ పరిధిలోని ఫీల్ఖానాలో ఫ్యాన్సీ వస్తువుల వ్యాపారం చేస్తున్న మంగిలాల్ జైన్ దాని ముసుగులో అక్రమ సిగరెట్ల దందా మొదలెట్టారు. బంగ్లాదేశ్ నుంచి మూడు మెట్రో నగరాల మీదుగా సిటీకి వస్తున్న ఈ సరుకును విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడి చేశారు. మంగిలాల్‌ను పట్టుకోవడంతో పాటు రూ.2 లక్షల విలువైన అక్రమ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం తెలిపారు. గోషామహల్ ప్రాంతానికి చెందిన మంగిలాల్ ఫీల్ఖానాలో ప్రియ నావెల్టీస్ పేరుతో ఫ్యాన్సీ వస్తువులు, సౌందర్య సాధనాలు, సుగంధ ద్రవ్యాలు విక్రయించే వ్యాపారం చేస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం అక్రమ సిగరెట్ల దందా కూడా ఇదే కార్యాలయం నుంచి మొదలెట్టాడు. ఇండోనేషియాలో తయారైనట్లు అనుమానిస్తున్న ప్యారిస్, విన్, మోండ్ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు బంగ్లాదేశ్ మీదుగా దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. వీటిని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కోల్‌కతాలకు చెందిన కొందరు అక్రమ వ్యాపారాలు హోల్‌సేల్‌గా ఖరీదు చేసి హైదరాబాద్‌లోని ఏజెంట్లకు విక్రయిస్తున్నారు. రైలులో ఇక్కడకు చేరుకున్న ఈ బ్రాండ్లకు చెందిన సిగరెట్లను మంగిలాల్ తన దుకాణంలోనే నిల్వ చేస్తున్నాడు. ఒక్కో సిగరెట్ ప్యాకెట్‌ను రూ.6కు ఖరీదు చేస్తున్న ఇతగాడు వివిధ దుకాణదారులకు రూ.20 నుంచి రూ.25కు విక్రయిస్తున్నాడు. ఇది వినియోగదారుడికి చేరేసరికి రూ.30 నుంచి రూ.40కి చేరుతోంది. తక్కువ ధరకు వస్తున్నాయనే ఉద్దేశంతో అనేక మంది వీటిని కొని కాలుస్తూ బానిసలుగా మారుతున్నారు. ఈ దందా ద్వారా ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడుతోంది. ఆరోగ్యానికి హానికరమైన, స్థానికంగా ఉండే వ్యాపారులను నష్టాన్ని తీసుకువచ్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుల్లో ఉండే సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీనే రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. మంగిలాల్ వంటి వ్యాపారులు ఈ అక్రమ దందా చేయడం ద్వారా ఈ డ్యూటీతో పాటు జీఎస్టీ సైతం పరోక్షంగా భారీగా ఎగ్గోడుతున్నారు. ఇతడి దందాపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు టి.శ్రీధర్, కె.శ్రీనివాసులు తమ బృందాలతో దాడి చేసి పట్టుకున్నారు. ఇతడి నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
తాగిపారేసే సిగరెట్లను సేకరించి పునర్వినియోగం..
జూబ్లీహిల్స్: సిగరెట్ తాగేవారి ప్రాణాలకు ముప్పుతెస్తుంది. కేన్సర్ ప్రాణాంతక వ్యాధులను వెంటతెస్తుంది. దీంతోపాటే తాగిపారేసే సిగరెట్ పీకలు భూమిలోకి చేరి పర్యావరణానికి ఎసరుపెడుతున్నా యి. పీకల్లోని ప్రమాదకరమైన కాడియం, ఆర్సెనిక్ కెమికల్స్ భూమిలోకి చేరి భూమి ని, నీటిని కలుషితం చేస్తున్నాయి. సిగరెట్లు, సిగరెట్ పీకలను సమర్థవంతంగా పునర్వినియోగం చేయడం ద్వారా కొంతమేర పర్యావరణానికి మేలు చేయడానికి నగరానికి చెందిన ఔత్సాహిక స్టార్టప్ అజిస్టా కొత్త ప్రయత్నం చేస్తుంది. తాగిపారేసే సిగరెట్లను సేకరించి వాటిని పునర్ వినియోగం చేయడమే లక్ష్యంగా వినూత్నమైన పరిష్కారంతో ముందుకొచ్చింది. ఈమేరకు ‘క్విక్మింట్ ’ పేరుతో పబ్లిక్ యాష్‌ట్రే బాక్సులను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ప్రథమ ప్రయత్నంగా జూబ్లీహిల్స్‌లోని ఓ పాన్‌షాప్‌లో ఏర్పాటు చేసిన పబ్లిక్ యాష్ ట్రేను వర్థమాన నటీనటులు శ్రీజిత, వాసుదేవ్ ఆవిష్కరించారు. ఈ సందర్బం గా అజిస్టా ప్రతినిధి అభిషేక్ మాట్లాడుతూ.. స్వచ్ఛభారత్, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా నగరవ్యాప్తంగా దాదాపు 400 యాష్ ట్రేబిన్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. వారానికి ఒకసారి తమ సంస్థ ప్రతినిధులు యాష్ట్రేల నుంచి సిగరెట్ పీకలు సేకరించి పునర్వినియోగం కొరకు వినియోగిస్తామని తెలిపారు. -
సిగరెట్ కోసం ఘర్షణ
అడ్డగుట్ట: సిగరెట్ కోసం ఓ యువకుడు అర్థరాత్రి కిరాణా దుకాణానికి వెళ్లగా పాత బాకీ తీరిస్తేనే సిగరెట్ ఇస్తానని షాపు యజమాని చెప్పడంతో సదరు యువకుడు అతడితో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న తుకారాంగేట్‌కు చెందిన మరో యువకుడు తనకు సంబంధం లేకపోయినా జోక్యం చేసుకోవడమేగాక సిగరెట్ కోసం వచ్చిన యువకుడిపై చేయి చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గొడవపడుతున్న వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించిన సంఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంగళవారం రాత్రి స్థానిక ఇందిరా గాంధీ విగ్రహం సమీపంలోని కిరాణా దుకాణానికి వచ్చిన లాలాగూడకు చెందిన రాహుల్ బోస్లే అనే యువకుడు షాపు యజమాని ప్రకాష్‌ను సిగరెట్ అరువు అడిగాడు. అయితే ఇప్పటికే పాత బాకీ ఉన్నందున సిగరెట్ ఇచ్చేందుకు అతను నిరాకరించడంతో రాహుల్ షాపు యజమానితో గొడవ పడటంతో ఘర్షణకు దారి తీసింది. అదే సమయంలో స్నేహితులతో కలిసి అటుగా వెళుతున్న సాయితేజ గౌడ్ ఈ విషయంలో జోక్యం చేసుకోగా నరేష్ అనే యువకుడు సాయితేజను కొట్టాడు. దీంతో సాయితేజ నరేష్‌తో పాటు రాహుల్‌పై దాడి చేయడమేగాక అడ్డు వచ్చిన అతని తల్లితో కూడా గొడవ పడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తుకారాంగేట్ పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మిగతా వారి విషయమై ఆరా తీయగా సాయితేజ తన స్నేహితుల వివరాలు చెప్పకుండానే స్టేషన్లో నుంచి బయటికి వెళ్లబోతూ కింద పడటంతో గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా స్టేషన్లో ఎస్ఐ, కానిస్టేబుల్ తనపై దాడి చేశారని సాయితేజ గౌడ్ ఆరోపిస్తుండగా, అతడి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. -
సిగరెట్ తాగొద్దన్నందుకు కంట్లో పొడిచాడు
కర్ణాటక, కృష్ణరాజపురం: సిగరెట్ తాగొద్దన్నందుకు ఓ వ్యక్తి తన భార్య కంట్లో కత్తితో పొడిచిన ఘటన గురువారం రాత్రి బాణసవాడిలో చోటు చేసుకుంది. లింగరాజపురంలో నివసిస్తున్న ధర్మ అనే వ్యక్తి చాలా కాలంగా దురలవాట్లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో కొద్ది కాలం క్రితం ధర్మకు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో వైద్యపరీక్షలు చేసిన వైద్యులు ఇకపై సిగరెట్లు తాగొద్దంటూ సూచించారు. అయినా వినని ధర్మ సిగరెట్లు తాగేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా సిగరెట్ తాగుతుండగా గమనించిన భార్య గాయత్రి సిగరెట్ తాగొద్దంటూ సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన ధర్మ కత్తితో గాయత్రి కంట్లో పొడిచాడు. గాయత్రి కేకలు వేస్తూ బయటకు రావడంతో గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాణసవాడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
వందేళ్లలోపువారికి సిగరెట్ అమ్మడం నిషేధం!
హవాయి: సిగరెట్లతో క్యాన్సర్ వస్తుందనే విషయం తెలిసిందే. తాగేవారే కాదు.. చుట్టుపక్కల ఉన్నవారికి కూడా సిగరెట్ ముప్పు తప్పదు. అందుకే సిగరెట్ డబ్బాల మీద ‘క్యాన్సర్ కారకం’ అని రాస్తారు. కొన్నిదేశాల్లో అమ్మకాలపై నిషేధం కూడా ఉంది. మనదేశంలో 18 సంవత్సరాల లోపువారికి సిగరెట్లు అమ్మడంపై నిషేధం అమలులో ఉంది. అయితే అమెరికాలోని హవాయీ రాష్ట్రం మాత్రం ఈ నిషేధాన్ని కాస్త ఆసక్తికరంగా అమలుచేస్తోంది. గతంలో ఈ రాష్ట్రంలో 21 సంవత్సరాలలోపు వయసున్నవారికి సిగరెట్ల అమ్మకాన్ని నిషేధించగా.. తాజాగా దానిని వందేళ్లకు పెంచారు. అంటే ఏదో ఒకరిద్దరు తప్ప బతికున్నవారెవరూ సిగరెట్ కొనడానికి వీల్లేదన్నమాట. అయితే ఈ నిషేధాన్ని ఇప్పటికిప్పుడే అమలు చేయకుండా 2024 నాటికి అమలు చేయాలని నిర్ణయించింది. అంటే వచ్చే సంవత్సరం 30 ఏళ్లలోపువారికి, ఆ తర్వాత సంవత్సరం 40 ఏళ్ల లోపువారికి.. ఇలా 2024 వచ్చేసరికి 100 ఏళ్ల లోపువారికి నిషేధాన్ని అమలు చేస్తారు. ఈ మేరకు రూపొందించిన బిల్లును హవాయి కాంగ్రెస్ ఆమోదించింది. సిగరెట్ల ద్వారా వచ్చే పన్ను ఆదాయాన్ని అనుభవించే వ్యసనానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బానిస అయిందంటూ బిల్లులో చమత్కరించడం విశేషం. -
'పొగ’చూరుతున్న ఆరోగ్యం
సాక్షి సిటీబ్యూరో: నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో నడుస్తున్న పొగగొట్టాలు పెరిగిపోతున్నాయి. గుప్పుగుప్పు మంటూ ఒకరు.. రింగురింగులు వదులుతూ ఇంకొకరు ఎక్కడపడితే అక్కడ.. తమ ఇష్టం వచ్చినట్లు ఊదేస్తున్నారు. పక్కనున్నవారు ఎంత ఇబ్బందిపడ్డా.. వద్దని వారించినా పట్టించుకోకుండా పొగరాయుళ్లు తమ ప్రతాపం చూపుతున్నారు. ఎక్కడ చూసినా వారే.. బహిరంగ ప్రదేశాలు, బస్టాప్‌లు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు హోటళ్లు, సిని యా థియేటర్లతో పాటు టిఫిన్ సెంటర్లు, జ్యాస్షాప్లు, టీ స్టాల్స్ వద్ద ఎప్పుడు పడితే అప్పుడు పొగరాయుళ్లు నిర్భయంగా ధూమపానం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ ప్రకటనలు, అటు వైద్యుల హెచ్చరికలను వీరు పట్టించుకోవడంలేదు. వీరి అలవాటుతో తమ ఆరోగ్యంతో పాటు పక్కనున్న వారి ఆరోగ్యానికి చేటు చేస్తోంది. ధూమపానంతో ఇతరులకు తీవ్ర నష్టం జరుగుతోందని 2008లో కేంద్ర ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ధూమాపానం చేయడాన్ని నిషేధిస్తూ చట్టం చేసి కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ చట్టం ఎక్కడా అమలు చేయకపోవడం విచారకరం. జరిమానాల జాడేలేదు.. బహిరంగంగా ధూమపానం చేసేవారిపై జరిమానాలు విధించడంతో పాటు పదేపదే పట్టుబడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు అవసరమైన కార్యచరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నియంత్రణ లేకపోవడంతో పొగరాయుళ్లు రెచ్చిపోతున్నారు. మరోపక్క యువత కూడా ఇటువైపు ఆకర్షితులై పెడదోవ పడుతున్నారు. చట్టం అమల్లోకి వచ్చి పదేళ్లవుతు న్నా నగరంలో ఒక్క జరిమానా విధించకపోవడం గమనార్హం. ఇక ఆటోవాలాలు, బైకులపై తిరిగేవారు ఇష్టానుసారంగా పొగతాగుతున్నారు. ఆటో లో పాసింజర్లు ఉన్నా వారి విజ్ఞప్తిని పట్టించుకోకుండా పొగతాగే డ్రైవర్లు నగరంలో కోకొల్లలు. ప్రధాన రహదారుల్లో ద్విచక్ర వాహనాలను, కార్ల ను నడుపుతూ ఓ చేత్తో హాండిల్, మరో చేతిలో సిగరెట్ కాలుస్తూ ప్రయాణాలు చేస్తున్నారు. హోటల్స్, పార్కుల్లో కూడా.. నగరంలోని దాదాపు అన్ని హోటళ్ల వద్దా సిగరెట్ షాప్‌లు ఉన్నాయి. అక్కడే చాయ్ తాగి దమ్ము లాగుతున్నారు. పక్కనున్న వారికి ఇబ్బంది కలుగుతుందని వారిస్తే గొడవకు దిగుతున్నారు. ఇక పార్కుల్లో సైతం ధూమపానం చేస్తున్నారు. సందర్శకులకు ఇబ్బందికరంగా ఉందని చెప్పినా వెనక్కి తగ్గడం లేదు. బయట ‘పొగ తాగరాదు’ అన్న బోర్డులు దర్శనమిస్తున్నా వాటిని పొగరాయుళ్లు ఎవరూ లెక్కచేయడం లేదు. కఠిన చర్యలు తీసుకోవాలి... బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రధానంగా రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, డ్రైవింగ్ చేస్తూ, కార్యాలయా పరిసరాల్లో సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసేవారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే వారి ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని చెబుతున్నారు. -
నిన్న హన్సిక.. నేడు అమలాపాల్
సినిమా: ఎదుటి వారికి చెప్పడానికే నీతులు అన్నారో రచయిత. అది అక్షరాలా సత్యం. నిషిద్ధం కాకపోయినా, ఆరోగ్యానికి హానికరమైన మద్యం సేవించడం, పొగ తాగడం వంటి చర్యలు మంచి అలవాట్లు కాదని సెలబ్రిటీలు చెబుతుంటారు. ముఖ్యంగా సినీ తారలు అలా నటించి మరీ చూపిస్తుంటారు.అందుకు భారీ మొత్తంలో పారితోషికాలు పుచ్చుకుంటారు అది వేరే సంగతి. వారితో చెప్పిస్తే మంచి ఫలితం ఉంటుందనే అలా చెప్పిస్తుంటారు. అయితే అదే పారితోషికం కోసం కొందరు భామలు పొగ తాగడం, మద్యం సేవించడం లాంటి సన్నివేశాల్లో నటించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఇటీవల నటి హన్సిక మహా చిత్రంలో కాషాయ వస్త్రాలు ధరించి చేతిలో సిగరెట్ పట్టుకుని నోటి నుంచి పొగను సుడులు సుడులుగా వదులుతన్న దృశ్యంతో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలై వివాదానికి దారి తీసింది. ఆ పోస్టర్ విషయంలో హన్సికపై కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఆ వివాదం సమసిపోకముందే ఇప్పుడు నటి అమలాపాల్ మరో వివాదానికి తెర లేపింది. ఇలాంటి వివాదాలు, విమర్శలు ఆ కేరళా కుట్టికి కొత్తేమీ కాదు. ఇటీవలే లుంగీ ఎగ్గటి చేతిలో సారా సీసా పట్టుకుని అడవిలోని మందు బాబుల స్పాట్కెళ్లిన దృశ్యాన్ని అమలాపాల్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి నెటిజన్లకు మస్త్ పని చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఆమె అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేశారు. అయితే అమలాపాల్ ఆ ఫోజ్‌ను ఎంజాయ్ చేసిన వారూ చాలా మందే ఉన్నారనుకొండీ. తాజాగా ఆ అమ్మడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మొన్న మద్యం సీసాతో కనిపిస్తే, ఈ సారి దమ్మారో దమ్ అంటూ పొగ తాగుతున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. పైగా తాను కావాలని అలా సిగరెట్ తాగలేదని, ఒక హాలీవుడ్ అభిమాని కోరికను నెరవేర్చడానికి అలా చేశానని సమర్ధించుకుంటోంది. సర్కార్ చిత్ర విషయంలో విజయ్ను, మహా చిత్ర విషయంలో నటి హన్సికను విమర్శలతో ఉతికి ఆరేసిన రాజకీయ పా´ర్టీ నాయకులు, ఇతర సంఘాల ప్రతినిధులు ఇప్పుడు అమలాపాల్‌ను మాత్రం వదులుతారా? అయినా ఇలాంటి సంఘటనలతోనే ఉచిత ప్రచారం పొందాలనుకునే అమలాపాల్ వంటి తారలు విమర్శలను పట్టించుకుంటారా? -
ఈ–సిగరెట్లనూ వదలట్లేదు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తుంగలో తొక్కుతూ భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్ సిగరెట్లు నిల్వచేసి విక్రయానికి పాల్పడుతున్న వైనాన్ని మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఓ నిందితుడిని అరెస్టు చేసి రూ.7 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. పరారీలో ఉన్న దుకాణ యజమానితో సహా ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ఖైరతాబాద్ ప్రాంతానికి చెందిన కేకే నారాయణరెడ్డి వాప్ ఎసెన్షియల్స్ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇందులో బాలకృష్ణ, చెరుకూరి ఆదిత్య ఉద్యోగులుగా ఉన్నారు. నారాయణరెడ్డి భారీ స్థాయిలో ఈ–సిగరెట్లు, ద్రవరూపంలో ఉండే వివిధ రకాలైన పొగాకు ఫ్లేవర్లు సమీకరించి విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం వలపన్ని ఆదివారం దాడి చేసింది. బాలకృష్ణను అదుపులోకి తీసుకుని రూ.7 లక్షలు విలువైన ఈ–సిగరెట్లు తదితరాలు స్వాధీనం చేసుకుంది. కేసును సైఫాబాద్ పోలీసులకు అప్పగించి పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తోంది. ఈ–సిగరెట్లు సైతం ఆరోగ్యానికి తీవ్ర స్థాయిలో హాని చేస్తాయని పోలీసులు చెప్తున్నారు. -
ఆత్మగ్లాని
ముసలావిడా కూతురూ వరండాలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, దూరంగా రోడ్డుమీద మొదటిసారిగా షిప్ట్లెట్ కనిపించాడు.అతనికి పనీపాటా ఉన్నట్లు లేదు. ఊళ్లు తిరుగుతూ కాలక్షేపం చేస్తుంటాడు. దేశదిమ్మరి. ఎడమ చేతి కోటు చెయ్యి సగం వేలాడుతోంది! ఎప్పుడు తెగిపోయిందో? అతను ఇంటి ఆవరణలోకి వచ్చిందాకా ముసలావిడ కదల్లేదు. లావుగా, బొద్దుగా ఉన్న కూతురు సడెన్‌గా కొత్త మనిషినిచూసి ఆనందం పట్టలేక ఎగురుతూ... మాట్లాడలేని నోటితో అరిచింది.పనిముట్ల డబ్బా కిందపెట్టి, టోపీ తీసి పట్టుకుని, అభివాదం చేశాడు షిప్ట్లెట్. నల్లటి జుత్తు నిగనిగలాడుతోంది. యువకుడే కానీ లోపల ఏదో అసంతృప్తి. జీవితాన్ని అర్థం చేసుకున్నతనం.షిప్ట్లెట్ వెనక్కు తిరిగి అస్తమిస్తున్న సూర్యుడ్ని చూశాడు. ముసలావిడ యువకుడ్ని పరిశీలనగా చూసింది. ‘‘మేడం, ఇంతటి అద్భుతమైన సూర్యాస్తమయాన్ని చూడగలగటమే నా అదృష్టం. ఎన్ని కష్టాలొచ్చినా సరే ఇలాంటిచోటు వదిలి వెళ్లాలనిపించటం లేదు’’ అన్నాడు యువకుడు కింది మెట్టు మీద కూర్చుని. ‘‘దానికేం రోజు ఇలాగే చూస్తూ కూర్చో’’ అంది ముసలావిడ కుర్చీలో వెనక్కు వాలి. షిప్ట్లెట్ చూపులు పరిసరాల్ని నిశితంగా పరిశీలించాయి. ఓ మూలన బోరుబావి, అత్తి చెట్టు, నాలుగు కోళ్లు, షెడ్డులో కారు.‘‘డ్రైవ్ చేస్తారా?’’‘‘పదిహేనేళ్ల నుంచీ అదక్కడే ఉంది. నా భర్త మరణించాక దాన్ని ముట్టుకోలేదు.’’‘‘పాతతరం కార్లే వేరు. ఇప్పుడెక్కడ చూసినా టోపీ వేసే వ్యాపారమే. లోకం పాడైపోయింది.’’‘‘అవును. సరే కానీ, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు?’’‘‘నా పేరు టాం షిప్ట్లెట్’’ అంటూ గొణిగాడు.‘‘సంతోషం. నా పేరూ, నా కూతురి పేరూ ఒకటే. లూసీ నెల్. సరే.. ఏ ఊరు మీది?’’షిప్ట్లెట్ మాట్లాడలేదు. జేబులోంచి పొగాకూ, కాగితాలూ తీసి తాపీగా సిగరెట్ రోల్ చేశాడు. అగ్గిపుల్ల వెలిగించి మంట చివరకి వచ్చిందాకా ఆగి (కాలుతుందనే భయంతో ముసలావిడ కూతురు శబ్దాలూ సైగలూ చేసింది) వెలిగించాడు.‘‘ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మటానికి లేదు. నా పేరు షిప్ట్లెట్ అని ముందే చెప్పాను. నా ఊరు టార్వాటర్. కానీ నేనెవరో మీకు తెలియదు. మరో పేరూ, మరో ఊరూ కావచ్చు కదా’’‘‘నీ గురించి మాకేమీ తెలియదు’’ అంటూ విసుక్కుంది ముసలావిడ.‘‘ఈ లోకంలో అబద్ధాలాడేవాళ్లకు తక్కువేమీ లేదు. ఇవన్నీ ఎందుకు? నేను మనిషిని. మగాడ్ని. ఇంతకూ మనిషంటే ఎవరు?’‘‘సరే.. సరే.. ఆ డబ్బాలో ఏముంది?’’ అడిగింది ముసలావిడ. ‘‘పనిముట్లు. నేను వడ్రంగిని.’’‘‘ఓహో.. పని చేతవునన్నమాట. తిండిపెడతాను. ఉండటానికో చోటు చూపిస్తాను. జీతం మాత్రం ఇవ్వలేను. ముందరే చెప్పేస్తున్నా’’ అంది ముసలావిడ. ‘‘అమ్మా, మనిషన్నాక డబ్బే సర్వస్వం కాదు’’ అన్నాడు నెమ్మదిగా. ముసలావిడ మాట్లాడలేదు. కూతురు అతడ్నే దీక్షగా చూసింది.‘‘లోకంలో అందరికీ కావలసింది డబ్బే. అసలు మనిషంటే ఎవరు? డబ్బు కోసమే మనిషి పుట్టాడా ఏమిటి?’’ ఇన్నేళ్లొచ్చిన ఆవిడ కూడా అలాగే అనుకుంటుందా అనుకుంటూ ప్రశ్నించాడు. ఇలాగే మరెన్నో ప్రశ్నలు. ముసలావిడ దగ్గర సమాధానాలు లేవు.ఈ ఒంటి చెయ్యి మనిషి ఇంటీ మీద కప్పు సరిచెయ్యగలడా?యువకుడి వయసు ఇరవై ఎనిమిది. ఎన్నెన్నో ఉద్యోగాలు చేశాడు. దేశదేశాలు తిరిగొచ్చాడు. ‘‘పెళ్లైందా?’’చాలాసేపు నిశ్శబ్దం.‘‘తెల్లకాగితంలాంటి మనసున్న ఆడవాళ్లు కావాలి. అలాంటి అమాయకమైన ఆడపిల్లలు ఈ లోకంలో ఎక్కడున్నారండీ? తెలివిమీరిన నెరజాణలు నాకక్కర్లేదు.’’కూతురు ముందరికి వంగి మోకాళ్లమీద తల పెట్టుకుని కూర్చుంది. ఉన్నట్టుండి కింద పడి కాళ్లూ చేతులూ కొట్టుకుంది. షిప్ట్లెట్ ఆమెను లేపి, కూర్చీలో వెనక్కు వాల్చి కూర్చోబెట్టి.... ‘‘మీ అమ్మాయా?’’ అనడిగాడు ముసలావిడని.‘‘ఒక్కగానొక్క కూతురు. నా బంగారు కొండ. దాన్ని విడిచి ఒక్క క్షణమైనా ఉండలేను. అదెంత తెలివైందనుకున్నావ్? ఇంటిపనులన్నీ చెయ్యగలదు. ఇల్లూడుస్తుంది. భలే చలాకీ పిల్ల. దానెత్తు బంగారం ఇస్తానన్నా దాన్నెవరికీ ఇవ్వను.’’‘‘బాగా చెప్పారు. పెళ్లి పేరుతో అమ్మాయిని దూరం చేసుకోకండి.’’‘‘ఇక్కడ ఉండటానికి ఇష్టపడ్డవాడే దీన్ని చేసుకోవాలి.’’చీకట్లో మెరుస్తున్న కారు బంపర్ వైపు చూశాడు షిప్ట్లెట్. ‘‘ఇక్కడున్న అన్ని వస్తువులనూ రిపేర్ చెయ్యగలను. తుంటిచెయ్యివాడని తీసిపారెయ్యకండి. పనిలో నేనెవరికి తీసిపోను’ అంటూనే మరి కాస్సేపు ఆలోచించి అన్నాడు. ‘‘మనిషన్న తర్వాత నీతి ఉండాలి. జ్ఞానం ఉండాలి’’ అని. షిప్ట్లెట్ మాటలు వాళ్లని ఇంప్రెస్ చెయ్యలేదు. ‘‘పని చేస్తే తిండి పెడతాను. రాత్రికి కార్లో పడుకో’’ అంది ముసలావిడ.‘‘అదేం కష్టం! పూర్వకాలంలో సన్నాసులు శవపేటికల్లోనే రోజూ పడుకునేవారట’’ అన్నాడు షిప్ట్లెట్.‘‘ఆ కాలం వేరు’’ తెల్లారే కప్పు వెయ్యటం ప్రారంభించాడతను. ముసలావిడ కూతురు అతడ్నే చూస్తూ కూర్చుంది. వారం రోజుల్లో పని పూర్తయింది. విరిగిన మెట్లు సరిచేశాడు. చుట్టూ కంచె పూర్తి చేశాడు. పశువుల కొట్టం కట్టాడు. బ్రహ్మచెముడున్న లూసీనెల్కి ‘బర్డ్’ అనే మాట పలకడం నేర్పించాడు. ఆ పిల్ల రోజంతా చప్పట్లు కొడుతూ ‘బర్ర్ర్ర్ర్ట్’’ అంటూ అల్లరి చేసింది.దూరంనించి అన్నీ చూస్తూ తృప్తిగా నిట్టూర్చింది తల్లి. ‘అర్జెంట్‌గా అల్లుడు కావాలి. ఇక ఆలస్యం కాకూడదు’.కారు కిటికీలోంచి కాళ్లు బయటికి పెట్టి. వెనక సీట్లో పడుకున్నాడు షిప్ట్లెట్. వెంట బ్లేడూ, నీళ్ల గ్లాసూ, అద్దం ముక్కా తెచ్చుకున్నాడేమో... షేవ్ చేసుకుని నీటుగా తయారయ్యాడు. కోటును హాంగర్‌కు తగిలించి ఓ మూలన వేలాడదీశాడు.సాయంత్రాలు ఆడవాళ్లిద్దరూ వాలుకుర్చీలో ఊగినప్పుడు, మెట్లమీద కూర్చుని కబుర్లు చెప్పాడు. ఇల్లూ. చిన్న పొలం బాగుపడ్డాయి.‘‘ఒళ్లొంచి శ్రద్ధగా పనిచేస్తే ఏమైనా సాధించవచ్చు. సొంత ఇంటిలా చూసుకున్నాను. అందుకే ఇంత చేశాను’’ అన్నాడు. ‘మూలపడిన కారు బాగుచెయ్యాలి’ అనుకుంటూ బాయ్నెట్ తెరిచి చూశాడు. ‘‘కారంటే ఇలా ఉండాలి. ఇప్పటి కార్లా? ధరలెక్కువా, క్వాలిటీ తక్కువా! ఆ రోజుల్లో ఒక్క మనిషి మొత్తం కారు అసెంబుల్ చేసేవాడు. ఇప్పుడు ఒక్కొక్క బోల్టుని ఒక్కొక్కడు బిగిస్తాడు’’ అన్నాడు. ‘‘అవును’’ అంది ముసలావిడ.‘‘అసలు ఈ రోజుల్లో ఎవరికీ పనిమీద శ్రద్ధ లేదే! సొంత మనుషులనుకోవటం వల్లనే కదా, మాటలు రాని లూసీనెల్కు ఒక్క మాటైనా నేర్పించాను’’‘‘దానికింకేమైనా నేర్పించు’’ అంది ముసలావిడ.‘‘ఏం నేర్పించాలో చెప్పండి?’’‘‘ప్రియుడా..! అనమను’’ షిప్ట్లెట్కు ముసలావిడ మనసులోని మాట బాగానే అర్థమైంది. తెల్లారి అతను కారు రిపేర్ ప్రారంభించాడు. కొత్త ఫాన్ బెల్ట్ వేస్తే కారు నడుస్తుందన్నాడు. డబ్బులిస్తానంది ముసలావిడ.‘‘దానికి పెళ్లిచేసి పంపించే ఉద్దేశం ఎంత మాత్రం లేదు. కానీ యోగ్యుడైన కుర్రాడు వచ్చి ‘మీతోపాటే ఉంటాను’ అంటే ఆలోచించవచ్చు. ఉండటానికో మంచి ఇల్లు, ఓ అందాలరాశి కూడా దొరుకుతుంది. తెలివైనవాళ్లెవరూ ఇంత మంచి అవకాశాన్ని వదులుకోరు.’’ ‘‘ఆమె కెన్నేళ్లు?’’ ఆసక్తి లేనట్లుగా అడిగాడు షిప్ట్లెట్.‘‘ఆ.. ఎంతా? పదిహేనో పదహారో..’’ అంది ముసలావిడ. ముప్ఫై దాకా ఉంటాయా పిల్లకు. కానీ మాటలు రాని అమాయకత్వంతో ఆమెకి అంత వయసుందని అనిపించదు. ‘‘కారుకు పెయింట్ వెయ్యకపోతే తుప్పు పట్టి పాడవుతుంది’’ అన్నాడు షిప్ట్లెట్.‘‘చూద్దాంలే’’ అంది ముసలావిడ.మర్నాడు పక్క ఊరికెళ్లి స్పేర్ పార్ట్స్, పెట్రోలు తీసుకొచ్చాడు. మధ్యాహ్నం వరకూ షెడ్లోంచి రకరకాల శబ్దాలు వెలువడ్డాయి. కూతురికి మళ్లీ మూర్ఛ వచ్చిందేమోనని పరిగెత్తుకుని వచ్చింది ముసలావిడ. ఓ మూలన కూర్చుని ‘‘బర్ర్ర్ట్’’ అంటూ కాళ్లు నేల మీద కొడుతూ అరుస్తోంది పిల్ల. భయంకరమైన రోదతో కారు, షెడ్ దాటి బయటికొచ్చింది. ‘చచ్చిన మనిషిని బతికించినట్లు’గా డ్రైవర్ సీట్లోంచి వినయంగా చూశాడు షిప్ట్లెట్. ఆ రాత్రి ముసలావిడ వ్యవహారంమాట్లాడింది. ‘‘నీకు అమాయకురాలు కావాలి. నెరజాణలు వద్దు.’’‘‘అవును’’‘‘నీ మాటకు ఎదురు చెప్పని మనిషి, నోట్లో నాలుకలేని మనిషి కావాలి. ఆ పిల్ల ఇక్కడే నీ కళ్లముందే ఉంది.’’కాళ్లు ముడిచి, పాదాలను చేతులతో పట్టుకుని కూర్చీలో కూర్చుంది లూసీనెల్. ‘‘ఆమె నిన్ను ఇబ్బందిపెట్టని మనిషి. శనివారం ముగ్గురం కలిసి వెడదాం. పక్క ఊరిలో పెళ్లి చేసుకోండి.’’మెట్లమీద కూర్చున్న షిప్ట్లెట్ ‘‘పెళ్లి వీలుపడదండీ. డబ్బులేవీ?’’ అన్నాడు ఇబ్బందిగా.‘‘దేనికి?’’‘నేను అందరిలాంటివాడ్ని కాను. భార్యకున్న చిన్నచిన్న సరదాలు తీర్చాలంటే డబ్బు కావాలి. పెళ్లి తర్వాత ఏదైనా హోటలుకు తీసికెళ్లాలా? మంచి భోజనం పెట్టించాలా? ‘పెళ్లాన్ని పువ్వుల్లో పెట్టిచూసుకోవాలిరా’ అని చెప్పింది మా అమ్మ’’‘‘లూసీ నెల్కు హోటల్ అంటే ఏమిటో కూడా తెలియదు. ఇదిగో, నా మాట వినబ్బాయ్. పర్మినెంట్ ఇల్లు, మంచినీళ్ల బావి, నోట్లో వేలుపెడితే కొరకలేని అమాయకురాలు! ఇంకా డబ్బెందుకు? అసలే ఒక చెయ్యలేని అవిటివాడివి నువ్వు. నా అన్నవాళ్లంటూ లేని బికారివి. ఇంతకన్నా మంచి సంబంధం నీకీ జన్మకు దొరకదు.’’ఆమె మాటల పరుషత్వం అతడ్ని దిమ్మెరపరచి ఉండవచ్చు.తల తిరిగింది. మాట్లాడకుండా మరో సిగరెట్ రోల్ చేసుకుని వెలిగించాడు. ‘‘మేడం, మనిషిలో రెండు భాగాలుంటాయి’’ అన్నాడు కాసేపాగి నెమ్మదిగా.‘‘ఒకటి శరీరం. మరొకటి ఆత్మ. శరీరమంటే ఇల్లు లాంటిది. ఎక్కడికీ కదలదు. ఆత్మంటే కారులాంటిది. ఒక్క దగ్గరా నిలకడగా ఉండదు’’ అంటూ వివరించాడు షిప్ట్లెట్. ‘‘చూడబ్బాయ్, మా దొడ్లో ఉన్న బావి ఎప్పుడూ ఎండిపోదు. నా ఇల్లు చలికాలంలో కూడా వెచ్చగా ఉంటుంది. ఇంటిమీద అప్పులు లేవు. కావాలంటే కోర్లుకెళ్లి దస్తావేజులు పరీక్షించుకో. కారు చూశావుగా. బంగారం లాంటి కారు’’ అంటూ మరొక్క గాలం విసిరిందా ముసలామె. ‘‘ఈ శనివారం దానికి పెయింట్ వేయించుకో. పెయింట్ డబ్బులు నేనిస్తాలే’’చీకట్లో నవ్విన షిప్ట్లెట్ పెదాలు. పడగ విప్పిన పాముల్లా మెలికలు తిరిగాయి. కాసేపాగి ‘‘మనస్సాక్షిని నమ్ముకున్నవాడ్ని. నాకేది బాగనితోస్తే అది చేస్తాను. ఎంత ఖర్చయినా సరే, పెళ్లి తర్వాత నా భార్యకు రెండు మూడు ఊళ్లు చూపించి తిప్పుకొస్తాను’’ అన్నాడు.‘‘సరే. మీ ప్రయాణానికి పదిహేను డాలర్లిస్తాను. నేనివ్వగలిగిందంతే.’’‘‘పెట్రోలు ఖర్చుకూ, హోటల్ అద్దెకూ ఆ మాత్రం సరిపోతుంది. మరి తిండికి?’’‘‘చివరి మాట.. పదేహేడు డాలర్ల యాభైసెంట్లు. ఇంక నువ్వెంత పిండినా లాభం లేదు. కావాలంటే లంచ్ కట్టిస్తాను.’’‘పిండినా’ అనే మాట అతడ్ని బాధించింది. ముసల్దాని దగ్గర బాగానే డబ్బుండకపోదు. కానీ తను డబ్బు మనిషిని కాదని ప్రకటించాడే! ‘‘ఉన్న దాంతో సర్దుకుంటాలెండి’’ అంటూ లేచాడు.శనివారంనాడు. కారుకేసిన కొత్త పెయింట్ ఇంకా ఆరనైనా లేదు. ముగ్గురూ వెళ్లి గవర్నమెంటాఫీసులో పెళ్లయిందనిపించారు. షిప్ట్లెట్కేదో ఇబ్బందిగా, ఇరకాటంగా ఉంది. ఎవరో అవమానించినట్లుగా అన్నాడు ‘‘పెళ్లి జరగాల్సిన పద్ధతి ఇది కాదు. కాగితాలమీద సంతకాలు పెడితే పెళ్లైనట్లా? నాకైతే నచ్చలేదు’’‘‘చట్టప్రకారమే జరిగిందిలే’’ అంది ముసలావిడ కాస్త కఠినంగా.‘‘చట్టం కోసం నేనా? నా కోసం చట్టమా?’’ అన్నాడు షిప్ట్లెట్ కోపాన్ని అణచుకుంటూ.ఆకుపచ్చ – పసుపురంగు కార్లో కూర్చున్నారు ముగ్గురూ. ‘‘లూసీ నెల్ అందాల భరిణ. ఎంత ముద్దొస్తోందో’’ అంది ముసలావిడ. మురిపెంగా పాలనురగలాంటి డ్రెస్‌లో, చెర్రీపళ్ల డిజైన్ ఉన్న హ్యాట్ పెట్టుకుని ఉంది పెళ్లికూతురు.‘‘నువ్వు అదృష్టవంతుడివి’’ అంది ముసలావిడ. కారింటికి చేరగానే ముసలావిడ దిగింది. లంచ్ బాక్సు కూతురికందించింది. కారు కదిలింది. కిటికీలోంచి చూస్తూ ఉబికివస్తున్న కన్నీటిని తుడుచుకుంది ముసలావిడ. ‘ఇంత వరకూ దాన్ని విడిచి ఒక్కరోజూ ఉండలేదు’ అనుకుంటూ గొణుక్కుంది.‘‘త్వరగా వస్తాంగా. నీ కూతురు నీ దగ్గర తప్ప మరెక్కడా క్షేమంగా ఉండలేదు’’ అంటూ క్లచ్ నొక్కాడు షిప్ట్లెట్. వీడ్కోలు చెప్పింది ముసలావిడ.వాతావరణం ప్రశాంతంగా ఉంది. దూరంగా కొండలు. మబ్బులు లేని ఆకాశం నులివెచ్చగా ఉంది.షిప్ట్లెట్కు కోపం తగ్గింది. కారుమీద తనకెప్పటి నుండో కోరికగా ఉంది. స్పీడు పెంచాడు. రాత్రికల్లా మోబిల్(ఊరు) చేరుకోవాలి.ఆగి, అప్పుడప్పుడూ లూసీ నెల్ వైపు చూశాడు. డబ్బాలో ఉన్న లంచ్‌ని ఎప్పుడో తినేసింది ఆ పిల్ల. కారు తనదేనన్న ఉత్సాహంలో కూడా కాస్తంత నీరసంగా ఉంది. వందమైళ్లువచ్చారు. ‘ఆమెకు మళ్లీ ఆకలేస్తోందేమో’ అనుకుంటూ, దారిపక్కన చిన్న ఊర్లో ఒక హోటల్ వద్ద ఆపి భోజనం ఆర్డరిచ్చాడు. బడలిక వల్ల లూసీ నెల్కు నిద్ర ముంచుకువస్తోంది. భోజనం వచ్చేలోగా ఆమె టేబుల్ మీద తలపెట్టి నిద్రపోయింది.‘‘లేచాక తింటుందిలే. నేను బిల్ పేచేస్తాను’’ అన్నాడు షిప్ట్లెట్. సప్లయర్ కుర్రాడు వంగి ఆమె జుత్తు సరిచేస్తూ ‘‘ఎంత అందమైన పిల్లో’’ అన్నాడు.‘‘అవును. ఎవరో హిచ్‌హైకర్. లిప్ట్ అడిగితే ఇచ్చాను. నాకు ఆలస్యమవుతోంది అర్జెంట్‌గా టస్కా లూసా (ఊరు) వెళ్లాలి’’ అంటూ బయల్దేరాడు షిప్ట్లెట్. విరక్తిగా ఉంది. వేడి పెరిగింది. కనుచూపు మేరలో ఎక్కడా చెట్టూ చేమా లేవు. అంతటా విశాలమైన మైదానాలు. తుఫాను వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పిడుగులూ మెరుపులూ వడగళ్ల వర్షం వచ్చే సూచనలు. ఈలోగా తేమనంతా పీల్చేసుకుంటోంది గాలి.కారున్న మనిషికి బాధ్యతలు కూడా ఉంటాయని షిప్ట్లెట్ నమ్మకం. ఎవరైనా హిచ్‌హైకర్ కనిపిస్తే లిఫ్ట్ ఇవ్వాలి. రోడ్డుపక్కన సైనుబోర్డులు. ‘డ్రైవ్ కేర్ఫుల్లీ’.. ‘ది లైఫ్ యూ సేవ్.. మే బీ యువర్ ఓన్’రోడ్డు ఇరుకైంది. రెండు వైపులా దుబ్బులు. దారిలో రేకుల షెడ్డు, పెట్రోలు బంకు. ఎండ కళ్లకు కొడుతోంది. ఎరుపెక్కిన సూర్యబింబం. రోడ్డుపక్కనో కుర్రాడు కనిపించాడు. వేగం తగ్గించి వాడ్ని చూశాడు.కుడిచేతి బొటనవేలు చూపుతున్నా లిఫ్ట్ అడగటం లేదు కుర్రాడు! చెంత ఒక అట్టసూట్కేస్ ఉంది.కారాపి ‘‘లిఫ్ట్ కావాలా బ్రదర్?’’ అన్నాడు షిప్ట్లెట్.కుర్రాడు మాట్లాడకుండా డోర్ తెరిచి వచ్చి కూర్చున్నాడు. గొడవపడి ఇల్లు విడిచి వచ్చినట్టుగా ఉంది. లిఫ్ట్ ఇచ్చిన మనిషిని చూడటం ఇష్టం లేనట్టుంది. కారు విండోలోంచి మరెటో దృష్టి సారించాడు.‘‘బ్రదర్. ప్రపంచంలోకెల్లా మా అమ్మ బెస్ట్. మీ అమ్మ నెక్ట్స్ బెస్ట్’’ అన్నాడు షిప్ట్లెట్.వినిపించుకోనట్లుగా కుర్రాడు బైటిలోకాన్ని చూస్తున్నాడు.‘‘తొమ్మిది నెలలు మోసి కనిపెంచిన అమ్మ. ఊహ తెలియని మనకు మంచి చెడులు బోధించిన అమ్మ. ఈ లోకంలో ప్రేమ అనేది ఉందని మొదటిసారిగా మనకు తెలిసింది అమ్మ ద్వారా కాదూ! అమ్మ లేకపోతే అందరంఅనాథలమే కదూ..’’ అన్నాడు షిప్ట్లెట్.కుర్రాడు సీట్లో ఇబ్బందిగా కదిలాడు. చేత్తో కారు డోర్హాండిల్ పట్టుకున్నాడు.‘‘మా అమ్మ దేవత. స్వర్గంలో ఉన్న దేవదూత మా అమ్మగా వచ్చిందనుకుంటాను.’’కుర్రాడు కోపం పట్టలేక ‘‘గో టు హెల్. మా అమ్మ దెయ్యం. మీ అమ్మ రాక్షసి’’ అంటూ డోర్ తెరచుకుని, కదులుతున్న కార్లోంచి దూకాడు సూట్ కేస్‌తో సహా.ఈ పరిణామాన్ని ఊహించని షిప్ట్లెట్ మరో వంద అడుగుల తర్వాత కారాపాడు.సూర్యుడు మేఘాల చాటున దాక్కున్నాడు. కారు వెనకవైపున మరో మేఘం. ప్రపంచంలోని కల్మషమంతా తనను కబళించివేయబోతోంది. ఇంతమురికిని కడిగేయ్యటం ఎవరి తరం? ఆ పని దేవుడు చెయ్యాల్సిందే.పిడుగులు పడ్డాయి.రాళ్లవాన కురిసింది. కారు మోబిల్ వైపు పరుగుతీసింది. ఆంగ్ల మూలం : ఫ్లానెరీ ఓకానర్ అనువాదం: ముక్తవరం పార్థసారథి -
ప్రాణం తీసిన సిగరెట్ వివాదం
కర్ణాటక, కృష్ణరాజపురం : సిగరెట్ విషయమై తలెత్తిన వివాదం యువకుడి ప్రాణం తీసింది. నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంకాం చదువుతున్న కామాక్షిపాళ్యకు చెందిన వినయ్ ఆదివారం విజయనగర్ ఫుడ్‌స్ట్రీట్‌లో సిగరెట్ దుకాణానికి వెళ్లి సిగరెట్ తీసుకున్నాడు. అనంతరం డబ్బులు చెల్లించకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుండగా సిగరెట్ దుకాణం యజమాని మహదేవ్ (27) వినయ్‌ని అడ్డుకొని డబ్బులు అడిగారు. ఇదే విషయమై ఇరువురి మధ్య ఘర్షణ జరగడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో వినయ్ దుకాణం యజమాని మహదేవ్‌ను పొడిచాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా మార్గంమధ్యలో మహదేవ్ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న విజయనగర పోలీసులు నిందితుడు వినయ్‌ను అరెస్ట్ చేశారు. -
పొగాకు మానే క్విట్‌లైన్ ఇదిగో
సాక్షి,హైదరాబాద్: ధూమపానం, పొగాకు నమలడం వంటి దుర్వ్యసనాల నుంచి బయటపడాలనుకునే వ్యక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా కౌన్సెలింగ్ మార్గాన్ని ఎంచుకుంది. ఇందుకోసం పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ‘క్విట్‌లైన్ ఫోన్ నంబర్’ను ప్రచురించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి తయారవుతున్న అన్ని పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ‘1800–11–2356’అనే క్విట్‌లైన్ నంబర్‌ను ప్రచురిస్తున్నా రు. ఈమేరకు పొగాకు నియంత్రణ కోసం పని చేస్తోన్న వలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ధూమపానం, పొగాకు నమలడం వంటి వ్యసనాలను మా నుకోవాలనుకునే వాళ్లు ఈ నంబర్‌కి ఫోన్ చేస్తే వారికి తగిన సాయం అందుతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో 46 దేశాలు పొగాకు ఉత్పత్తులపై ఇటువంటి క్విట్‌లైన్ నంబర్లను ప్రచురిస్తుండగా, ఆసియాలో థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్ మాత్రమే ఈ చర్యకు పూనుకున్నాయి. ఇప్పుడు ఆ దేశాల సరసన భారత్ చేరనున్నట్లు సంస్థ తెలిపింది. ఏటా పది లక్షల మంది.. సిగరెట్లు, బీడీలు, చుట్టలు ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగంతో దేశంలో ఏటా దాదాపు 10 లక్షల మంది చనిపోతున్నారు. ఆ దురలవాటు నుంచి బయట పడాలన్నా చాలామంది మానుకోలేని పరిస్థితి. అన్ని పొగాకు ఉత్పత్తులపై ‘పొగాకు కేన్సర్ కారకం’, ‘పొగాకు వల్ల బాధాకరమైన మరణం సంభవిస్తుంది’వంటి హెచ్చరికలు వ్యాధుల ఫొటోలతో సహా ప్రచురిస్తున్నారు. ఈ ప్రకటనలు ప్యాకెట్లపై 85% స్థలాన్ని ఆక్రమిస్తాయి. రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టుల నిర్ణయంతో 2016 ఏప్రిల్ నుంచి ఫొటోలతో ఈ హెచ్చరికలను ప్రచురిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులపై అనారోగ్య సంబంధిత హెచ్చరికలను ప్రచురించడంలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు కెనడా కేన్సర్ సొసైటీ విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది. ఈ విషయంలో మొత్తం 205 దేశాల్లో మన దేశానికి మూడో స్థానం రావడం విశేషం. హెచ్చరికలతో మంచి ఫలితాలు.. పొగాకు ఉత్పత్తులపై ఫొటోలతో కూడిన హెచ్చరికలను ప్రచురించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జరిపిన ఒక సర్వే వెల్లడించింది. ఆ శాఖ ఇటీవల జరిపిన గ్లోబల్ అడల్ట్ టుబాకో సర్వేలో పొగాకు ఉత్పత్తులపై కనిపిస్తున్న ఆ హెచ్చరికలను చూశాక తమ అలవాటు మానుకోవాలని లేదా తగ్గించుకోవాలని సిగరెట్ తాగేవాళ్లలో 62%, బీడీ తాగేవాళ్లలో 54% మంది భావించారని ఆ సర్వే వెల్లడించింది. మొత్తంగా పొగాకు వాడకం ప్రమాదకరమని పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడ్డవాళ్లలో 96% మంది అంగీకరించారని ఆ సర్వే తెలిపింది. ధూమపానం చేసేవాళ్లలో 55% మంది, పొగాకు నేరుగా నమిలే వాళ్లలో 50% మంది తమ అలవాటును మానుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆ సర్వేలో వెల్లడయ్యింది. అందువల్ల ప్రస్తుతం పొగాకు వ్యసనాన్ని తగ్గించే చికిత్సా కేంద్రాలకు డిమాండ్ పెరుగుతున్నట్లు ఆ సర్వే పేర్కొంది. ‘పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై వ్యాధుల ఫొటోలతో సహా హెచ్చరికలు ప్రచురించడం చెప్పుకోదగ్గ ఫలితాన్నిచ్చింది. అనేక భాషలతో దేశంలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా పొగాకు దుష్ఫలితాలను అర్థమయ్యేట్లు చేయడంలో ఈ హెచ్చరికలు సఫలీకృతమయ్యాయి. అందువల్లే చాలామంది పొగాకు వాడకం ప్రమాదమన్న భావనకు రాగలిగారని’ వలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ అభిప్రాయపడింది. -
రోడ్డుపై సిగరెట్ తాగినందుకు జరిమానా
పంజగుట్ట: పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో పలుప్రాంతాల్లో రోడ్లపై సిగరెట్ తాగుతున్న, గుట్కాలు నములుతున్న, విక్రయిస్తున్న 22 మంది వ్యక్తులకు అధికారులు జరిమానా విధించారు. తెలంగాణ టోబాకో టెక్నికల్ ఆఫీసర్ ఎస్.నాగరాజు, మాస్ మీడియా ఆఫీసర్ జే.రాములు, డాక్టర్ అనూషాలతో పాటు కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ అఫైర్స్ డిప్యుటీ డైరెక్టర్ డాక్టర్ రాణా, టెక్నికల్ డైరెక్టర్ గోవింద్ త్రిపాఠి బుధవారం పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాన్‌షాప్‌లు, బార్లు, రోడ్లపై బహిరంగంగా సిగరెట్ తాగుతున్న వారిని గుర్తించి జరిమానా విధించారు. 22 కేసులు నమోదు చేయగా వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. పాఠశాలకు 100 గజాల దూరం వరకు పాన్‌షాప్ ఉండరాదని నిబంధనలు అతిక్రమిస్తే చర్య లు తప్పవన్నారు. బార్లలో ఆల్కహాల్ తాగేందు కు మాత్రమే అనుమతి ఉందని, సిగరెట్ నిషేధమన్నారు. పలు బార్లలో తనిఖీలు చేసి నో స్మోకింగ్ బోర్డులు లేకపోవడం, సిగరెట్ తాగినట్లు ఆనవా లు కనిపించడంతో బార్ నిర్వాహకులకు కూడా ఫైన్ వేశారు. తెలంగాణలో నికోలిన్ నిషేధం విధించినా పలు పాన్‌షాప్‌లలో పాన్‌మసాలా, నికోలిన్ వేర్వురుగా విక్రయిస్తున్నట్లు గుర్తించి వారికి జరిమానా విధించడమేగాక కేసులు నమోదు చేశామన్నారు. ఆరుగురు గుట్కా తినేవారిని గుర్తించగా అందులో ఐదుగురు వ్యక్తులకు క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించామన్నారు. ముగ్గురు మూడో స్టేజ్‌లో, ఇద్దరు రెండవ స్టేజ్‌లో ఉన్నట్లు తెలిపారు. వారికి కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. చైన్ స్మొకర్లు, గుట్కాలు తినేవారిని టొబాకో స్ట్రేష్టేషన్ సెంటర్లో చేర్చుకుని వాటిని మానుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
బ్లాక్మెయిల్
సంధ్యవేళ. ఆరున్నర దాటుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ముందు ధబ్బుమని శబ్దమైంది. అక్కడున్న కొందరు ఉలిక్కిపడ్డారు. మూడంతస్తుల ఆ బిల్డింగ్ పైనుండి ఎవరో కిందపడ్డారు. మెయిన్ గేటు దగ్గరవున్న కొందరు పారిశుద్ధ కార్మికులు పరిగెత్తుకొచ్చారు. మర్రిచెట్టు చప్టా మీద కూర్చుని సిగరెట్ తాగుతున్న కమిషనర్ డ్రైవర్ అసదుల్లా ఖాన్ సిగరెట్టు అవతల పారేసి హడావుడిగా వచ్చాడు.శ్రావణి శరీరం నేల మీద పడివుంది. కపాలం పగిలి మెదడు కనిపిస్తూ ఉంది. నెత్తుటి మడుగులో ఆమె శవం చూసేవారికి భయం కలిగిస్తోంది. ఆమె కమిషనర్ పర్సనల్ అసిస్టెంట్. డ్రైవర్ అసదుల్లా ఖాన్ కమిషనర్ చాంబర్లోకి పరిగెత్తాడు. కమిషనర్ శాంతి శరణ్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు.‘‘సార్! శ్రావణి బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది.’’ రొప్పుతూ చెప్పాడు డ్రైవర్. ‘‘వాట్..?’’ అదిరిపడుతూ అన్నాడు కమిషనర్. రిసీవర్ క్రెడిల్ చేసి హడావుడిగా వెళ్లాడు. శ్రావణి శవం చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. ఆఫీస్ స్టాఫ్ చాలామంది వెళ్లిపోయారు. కొద్దిమంది పెండింగ్ పని చేసుకుంటూసీట్లలో ఉన్న వాళ్లు వార్త విని పరిగెత్తుకొచ్చారు. కాసేపటికి అంబులెన్స్ వచ్చింది. ఆమె శరీరాన్ని ఎక్కించి పంపించారు. అప్పటికే ఆమెలో ప్రాణం లేదు. పద్ధతి ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర విషాదభరితమైన వాతావరణం నెలకొని ఉంది. ఆఫీస్ స్టాఫ్, స్వీపర్లు వగైరా వర్కర్లు హాస్పిటల్ ఆవరణలోని కారిడార్లలో, బైట చెట్ల కింద గుంపులుగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు.శ్రావణి తండ్రి రాఘవయ్య మున్సిపాల్టీ ఆఫీస్‌లో అటెండర్‌గా పనిచేస్తూ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. కారుణ్య నియామకం కింద శ్రావణికి ఉద్యోగం ఇచ్చారు. ఆమె గ్రాడ్యుయేట్. ఫ్యాషన్ టెక్నాలజీలో డిప్లొమా చేసింది. ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో జాబ్ చేసేది. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని అందులో మానేసింది.ఆమె ఉద్యోగంలో చేరి ఏడేళ్లయింది. కొంతకాలం జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసింది. కంప్యూటర్ కోర్సులు చేసి అందులో ప్రావీణ్యం సంపాదించింది. తర్వాత కమీషనర్‌కి పర్సనల్ అసిస్టెంట్ అయింది. చాలా మంచిదనీ, సహాయ గుణం కలదనీ పేరు తెచ్చుకుంది. ఆమె అర్ధంతరంగా ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోంది.శ్రావణి తల్లి నిర్మలమ్మ గోడు గోడున ఏడుస్తోంది. ఆమె దగ్గరి బంధువులు, ఇరుగుపొరుగు వారు ఓదారుస్తున్నారు. పోస్ట్‌మార్టమ్ తర్వాత ఆమె శవాన్ని అప్పగించారు. శ్రావణి అంత్యక్రియలు జరిగిపోయాయి.ఇన్స్పెక్టర్ చక్రపాణి, ఎస్సై రసూల్ మున్సిపాల్టీ ఆఫీసుకి చేరుకున్నారు. కమిషనర్ శాంతి శరణ్ చాంబర్కి వెళ్లారు. ఆయన చాలా విచారంగా కనిపించాడు. శ్రావణి రోజులో ఆఫీసు సమయం ఆయన దగ్గరే గడుస్తుంది. తనకు అత్యంత సన్నిహితంగా ఉండి ఆఫీసు పనుల్లో సహకరించే అమ్మాయి ఆమె. ‘‘సార్! శ్రావణి సూసైడ్ ఎందుకు చేసుకుని ఉంటుంది? మీరేమైనా చెప్పగలరా?’’ అడిగాడు ఇన్స్పెక్టర్ చక్రపాణి. ‘’నాకు అదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. నాకు తెలిసి ఆమెకు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ లేవు. ఆమె తండ్రి ఉన్నప్పుడు సంపాదించింది ఏం లేదు. అతను తాగుబోతు అని చెప్తారు. నాకు తెలీదు. నేను ఇక్కడికి వచ్చి మూడేళ్లే.’’ ‘‘ఐసీ!’’‘‘తండ్రి డెత్ బెనిఫిట్స్, కొంత బ్యాంక్లోన్తో ప్రశాంతినగర్‌లో ఒక ఫ్లాట్ తీసుకుంది. ఆమెకు తల్లి ఒక్కతే. ఇంకెవరూ లేరు. ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి? అఫ్కోర్స్ తల్లి ఆమెను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తూ ఉండొచ్చు.’’ అన్నాడు శాంతి శరణ్. ‘‘ఆమెకు ఇరవై ఏడేళ్లు వచ్చాయి. పెళ్లెందుకు చేసుకోలేదంటారు? లవ్ ఎఫైర్స్ ఏమైనా ఉండి ఉంటాయా? లవ్ ఫెయిల్యూర్ వల్ల సూసైడ్ చేసుకుని ఉంటుందా?’’‘‘మేబీ.. మేనాట్బీ. ఎందుకంటే ఆమె పర్సనల్ విషయాలు నాకు తెలీవు. మా మధ్య ఆఫీసు విషయాలే ఉంటాయి!’’ చెప్పాడు కమిషనర్. ఇన్స్పెక్టర్, ఎస్సై ఇద్దరూ చాంబర్ బైటకు వచ్చారు. ‘‘సార్! మఫ్టీలో మన కానిస్టేబుల్స్ నాగరాజు, యాదయ్య మున్సిపాల్టీ సిబ్బంది దగ్గర శ్రావణి విషయాలు సేకరించడానికి తిరుగుతున్నారు. గంటలో ఏమైనా క్లూ దొరుకుతుందేమో తెలుసుకుని వస్తాను.’’ అన్నాడు ఎస్సై రసూల్. చక్రపాణి తలూపాడు. తర్వాత పొర్టికోలోకి వచ్చిన పోలీస్ వ్యాన్ ఎక్కి వెళ్లిపోయాడు. రసూల్ మున్సిపాల్టీ ఆవరణలో ఉన్న మర్రిచెట్టు చప్టా దగ్గరికి బయల్దేరాడు. అక్కడ కొందరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వారిలో ఇద్దరు మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్. వారు ఏదో పనిమీద వచ్చిన వారిలా స్టాఫ్‌తో మాటలు కలిపారు. శ్రావణి నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు చక్రపాణి. నిర్మలమ్మను కలుసుకున్నాడు. ఇరవై ఏడేళ్ల అందమైన యువతి, జాబ్ చేస్తున్నది అర్ధంతరంగా ఆత్మహత్య చేసుకున్నదంటే ఏదో తీవ్రమైన, బలమైన కారణం ఉండి ఉంటుంది. ఆమె దగ్గర సూసైడ్ నోట్ వంటిది ఏమీ దొరకలేదు. ఆర్థిక ఇబ్బందులు లేవు. కుటుంబంలో గొడవలు లేవు. ఆమెకు జీవితం మీద విరక్తి చెందడానికి కారణాలేవీ కనబడలేదు. ఏదైనా లవ్ ఎఫైర్? అది ఫెయిలైందా? అదే తెలుసుకోవాలి. ప్రేమ భగ్నమైతే జీవితం మీద విరక్తి కలగడం, చావాలనిపించడం సహజం. ‘‘సార్! మా అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు అర్థం కావడం లేదు. నేను పెళ్లి చేసుకోమని పోరుతూనే ఉన్నాను. ‘అమ్మా! నేను చనిపోతే ఒంటరిదానివవుతావు. నేను బాగా ఉండగానే పెళ్లి చేసుకో’ అని సతాయిస్తున్నాను. ‘నువ్వెక్కడ పోతావు? నీకంటే నేనే ముందు పోతాను. నువ్వు నూరేళ్లు బతుకుతావు’ అనేది పిచ్చితల్లి.’’ అంటూ నిర్మలమ్మ కూతుర్ని తలుచుకుని ఏడ్చింది. ‘‘శ్రావణికి పెళ్లి ఇష్టం లేదని మీకేమైనా అనుమానం ఉందా?’’ ప్రశ్నించాడు చక్రపాణి. ‘‘పెళ్లికి ముందు బాగా సెటిలైపోవాలి. తొందరేంటి? పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడ్డావు అనేది.’’ చెప్పింది నిర్మలమ్మ.‘‘సొంత ఇల్లుంది. నెలనెలా జీతం వచ్చే మంచి జాబ్ ఉంది. సెటిలైనట్టేగా? ఇంకేంటి?’’‘‘కాదండీ! శ్రావణికి పెద్ద కోరికలున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొనాలి. తర్వాతే పెళ్లి అనేది.’’‘‘విల్లానా? గేటెడ్ కమ్యూనిటీలోనా? మినిమమ్ కోటి రూపాయలు కావాలిగదా!’’‘‘సార్! ఆ మాటే నేనూ అన్నాను. అమ్మా! ఈ ఫ్లాట్ అమ్మేద్దాం. నా దగ్గర కొంత డబ్బుంది. లోన్ తీసుకుందాం అనేది.’’‘‘ఏమీ అనుకోకండి. మీ అమ్మాయికి జీతంకాక పై సంపాదన ఏమైనా ఉండి ఉంటుందా?’’‘‘అనుకోవడానికి ఏముందండీ! అప్పుడప్పుడు డబ్బు తెస్తుండేది. మనం అడగనవసరం లేదమ్మా! నజరానాలు వాళ్లే ఇస్తారు అని నవ్వేదండీ.’’‘‘శ్రావణికి సంబంధించిన డైరీలు కానీ, డాక్యుమెంట్లు కానీ ఏమైనా ఉన్నాయా? ఉంటే ఇవ్వండి. ఆమె మరణానికి సంబంధించిన క్లూ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం.’’నిర్మలమ్మ ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఒకటి తెచ్చి ఇచ్చింది.‘‘సార్! ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు ఈ ఫోన్ ఇంట్లోనే ఉంచుతుంది. వేరే ఫోన్‌తో ఆఫీస్‌కి వెళ్తుంది. రెండు ఫోన్లు ఎందుకమ్మా? అంటే కావాల్లే అమ్మా అనేది.’’ చెప్పింది నిర్మలమ్మ. శ్రావణి ఇంట్లో వాడుకునే స్మార్ట్‌ఫోన్ తీసుకుని ఆఫీస్‌కి బయల్దేరాడు ఇన్స్పెక్టర్ చక్రపాణి. శ్రావణికి కాంట్రాక్టర్ భానుప్రకాశ్‌తో గాఢమైన స్నేహం ఉందనీ, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనీ, మున్సిపాల్టీ స్టాఫ్, వర్కర్లు అంతరంగ సంభాషణల్లో ఎస్సై రసూల్‌కి వెల్లడించారు. అప్పుడప్పుడు కమిషనర్ వెళ్లిపోయాక, శ్రావణి భాను ప్రకాశ్ కారులో వెళ్లడం చూశామని కొందరు చెప్పారు.భాను ప్రకాశ్ సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసి కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో పనిచేశాడు. అనుభవం గడించాక మున్సిపాల్టీలో కాంట్రాక్టర్‌గా స్థిరపడ్డాడు. శ్రావణితో సన్నిహిత సంబంధాలున్నాయని తెలుసుకున్నాక స్టేషన్‌కి పిలిపించారు. ‘‘చెప్పండి భానుప్రకాశ్! శ్రావణి ఆత్మహత్య ఎందుకు చేసుకుందంటారు? మీకు ఆమెతో క్లోజ్ రిలేషన్ ఉందని మాకు సమాచారం ఉంది.’’ అన్నాడు చక్రపాణి, తన ఎదురుగా కూర్చున్న భాను ప్రకాశ్‌తో. భాను ప్రకాశ్ చాలా నిబ్బరంగా కనిపించాడు. అతనిలో ఆందోళన, తడబాటు ఏమాత్రం లేవు. ‘‘సార్! ఆ విషయంలో నేనేమీ చెప్పలేను. నేను శ్రావణితో రిలేషన్లో ఉన్న మాట నిజమే. నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ. కానీ శ్రావణికి పెద్ద ఆశలుండేవి. ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొనాలనేది. ఆ తర్వాతే పెళ్లి చేసుకుందాం. ‘తొందరేంటి? పెళ్లికి ముందే లైఫ్ బాగుంటుంది. ఆ తర్వాత రొటీన్లో పడిపోతాం. పిల్లలు పుట్టాక లైఫ్‌లో థ్రిల్ ఏముంటుంది?’ అనేది.’’ చెప్పాడు భాను ప్రకాశ్. ‘‘అంతేనా? లేక మీ పెళ్లికి నిర్మలమ్మ ఏమైనా అభ్యంతరం పెడుతున్నదా?’’‘‘అటువంటి ప్రాబ్లమ్ వస్తే మేం సివిల్ మ్యారేజ్ చేస్కుందాం అనుకున్నాం. ఆమె తల్లి వల్ల ప్రాబ్లమ్ ఉన్నట్టు శ్రావణి ఎప్పుడూ అనలేదు సార్.’’ చెప్పాడు భాను ప్రకాశ్. చక్రపాణి అతనితో మాట్లాడుతుండగా ఎస్సై రసూల్ వచ్చి శ్రావణి స్మార్ట్‌ఫోన్ అందించి నిలబడ్డాడు. తనతో ఏదో చెప్పబోతున్నాడని చక్రపాణి గ్రహించాడు. శ్రావణి విషయంలో ఏదైనా క్లూ దొరికితే చెప్పమని భాను ప్రకాశ్‌ని పంపించివేశాడు చక్రపాణి. మర్నాడు కమిషనర్ శాంతి శరణ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘శాంతి శరణ్ గారూ! చెప్పండి శ్రావణిని ఎందుకు మేడమీద నుంచి తోసేసి హత్యచేశారు?’’ఏసీపీ అడిగిన ప్రశ్నకు అతనికి ముచ్చెమటలు పడుతున్నాయి. కాదనడానికి ఛాన్స్ లేదు. శ్రావణి స్మార్ట్‌ఫోన్‌లో రికార్డయిన దృశ్యాలు ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఇక నోరు విప్పక తప్పలేదు. ‘‘బ్లాక్మెయిల్ సార్..’’ అన్నాడు శాంతి శరణ్. ‘‘బ్లాక్‌మెయిలా?’’‘‘అవును సార్! శ్రావణి కనిపించేంత అమాయకురాలు కాదు. తన స్నేహితురాలంటూ సురేఖను పరిచయం చేసింది. ఆమె మోడలింగ్ చేసేది. మిస్ ఇండియా అవార్డ్ కొంచెంలో తప్పిపోయిందని చెప్పేది. సురేఖ చొరవగా నన్ను లొంగదీసుకుంది. ఆమె అందం నన్ను ఆకర్షించింది. శ్రావణికి డబ్బు ఆశ చాలా ఎక్కువ. నేను అప్పుడప్పుడూ బిల్డర్స్ దగ్గరా, కాంట్రాక్టర్ల దగ్గరా నజరానాలు ఇప్పించేవాడిని. ఆ చిన్న చిన్న మొత్తాలు ఆమెకు తృప్తి కలిగించేవి కావని పసిగట్టలేకపోయాను. ఒక పెద్ద వెంచర్లో నాకు భారీగా డబ్బు ముట్టింది. శ్రావణి అందులో సగం ఇమ్మని అడిగింది. ఇవ్వకపోతే సురేఖతో ఉన్న ఇంటిమేట్ సీన్స్ అన్నీ నా భార్యకు చూపిస్తానని బ్లాక్మెయిల్ చేసింది. ఆమెలో ధనదాహం నాకు కోపం తెప్పించింది. మాకు ఎప్పుడూ బిల్డర్స్‌తో డీలింగ్సే జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నేను బ్లాక్‌మెయిల్‌కి లొంగితే, అది అప్పటితో పోదు. ఇక తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకే ఆమెను వదిలించుకోవాలనుకున్నాను. ఆ రోజు డబ్బు ఇస్తాను రమ్మని టెర్రస్‌పైకి తీసుకెళ్లాను. చీకటి పడ్డాక టెర్రస్‌పైన బిల్డర్స్‌తో రహస్య సమావేశాలు మామూలే. పైన కుర్చీలు, టేబుల్ వంటివి వేసి ఉంటాయి. శ్రావణి నా ఆలోచన పసిగట్టలేకపోయింది. మాటలు చెబుతూ ఆమెను కిందకు నెట్టేసి నా చాంబర్కి వెళ్లిపోయాను. ఎవరూ చూడకపోవడం అదృష్టం అనుకున్నాను.’’ చెప్పాడు కమిషనర్ శాంతి శరణ్. - వాణీశ్రీ -
ప్రాణం తీసిన సిగరెట్ గొడవ
బనశంకరి: సిగరెట్ కోసం గొడపడిన ఘటనలో అన్నదమ్ములు హత్యకు గురైన ఉదంతం కేజీ.హళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... గోవిందపుర మెయిన్‌రోడ్డు వీరణ్ణగడ్డ నివాసి అమీన్ (32) టెంపో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి గోవిందపుర మెయిన్‌రోడ్డులోని మాలిక్ అలీ దుకాణంలో అమీన్ సిగరెట్ తీసుకుని డబ్బు ఇవ్వకుండా వెనుతిరిగాడు. ఈ సమయంలో దుకాణం యజమాని మాలిక్ అలీ సిగరెట్ డబ్బు ఇవ్వాలని అడగటంతో కోపోద్రిక్తుడైన అమీన్, మాలిక్‌అలీని ఇష్టానుసారం చితకబాదాడు. తక్షణం మాలిక్‌అలీ కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో బంధువులు కర్రలు, మరణాయుధాలతో ఘటనాస్ధలానికి చేరుకుని అమీన్‌పై ప్రతిదాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న అమీన్ సోదరుడు మతీన్ (30) ఘటనాస్ధలానికి చేరుకుని గొడవపడుతున్న వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేయగా ఇతడిపై కూడా మాలిక్ అలీ బంధువులు ఇష్టానుసారం దాడికి పాల్పడి ఉడాయించారు. గాయపడిన అమీన్, మతీన్‌లను అంబేడ్కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి పొద్దుపోయిన మతిన్ మృతిచెందాడు. నిమ్హాన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమీన్ కూడా మృతిచెందాడు. మృతుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసుల ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కేజీ హళ్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సిగరెట్ అడిగితే లేదన్నాడని..
సాక్షి, హైదరాబాద్: సిగరెట్ అడిగితే లేదని చెప్పినందుకు గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఇనుపరాడ్‌తో దాడిచేసిన సంఘటన నగరంలోని చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చిలకలగూడ హమాలీబస్తీకి చెందిన షేక్ హజీ వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. ఈనెల 3న రాత్రి స్థానిక క్రాస్‌రోడ్డు వద్ద ఉండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి సిగరెట్ అడిగారు. అతను లేదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవ పడ్డారు. అదే రోజు రాత్రి షేక్హజీ తన స్నేహితులతో కలిసి బైక్‌పై వెళుతుండగా పద్మారావునగర్ లక్ష్మీ అపార్ట్మెంట్ వద్ద కాపుకాసిన సదరు వ్యక్తులు అతనిపై ఇనుపరాడ్‌తో దాడి చేయడంతో షేక్హజీకి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బడాబాబులపై ‘జీఎస్టీ’ నజర్
సాక్షి, హైదరాబాద్: పన్ను ఎగవేతకు పాల్పడుతున్న బడాబాబులపై హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ దృష్టి సారించింది. గత మూడు, నాలుగేళ్లుగా పన్ను బకాయి పడ్డ వారికి నోటీసు లు జారీ చేసి వారి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తోంది. ఇప్పటివరకు దాదాపు రూ.47 కోట్ల మేర పన్ను బకాయిలు రాబట్టామని కమిషనరేట్ అధికారులు చెబుతున్నారు. అందు లో పెద్ద పెద్ద ఇన్ఫ్రా కంపెనీలున్నాయని, బడా నిర్మాతలు కూడా ఉన్నారని తెలిపారు. జీఎస్టీ పరిధిలో డీలర్‌గా రిజిస్టర్ అయి ఇప్పటివరకు పన్ను రిటర్నులు దాఖలు చేయని 23వేల మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల క్రితం ఈ నోటీసులు జారీ చేయగా, ఇప్పటికే 1,200 మంది రిటర్నులు దాఖలు చేశారని, ఒక్క బేగంబజార్ డివిజన్ నుంచే రూ.80 లక్షల పన్ను వసూలయిందని వారు చెప్పారు. ఈ నోటీసులందుకున్న వారిలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు చెందిన ఓ బంగారు దుకాణం కూడా ఉందని సమాచారం. జాతీయ స్థాయిలో మంచి పేరున్న జ్యుయెల్లరీ బ్రాండ్‌కు ఫ్రాంచైజీగా ఉన్న ఆ దుకా ణం పన్ను రిటర్నులు దాఖలు చేయకపోవడంతో నోటీసులిచ్చారు. రూ. కోటి వరకు పన్ను చెల్లించాలని గుర్తించి ఏవీ(2) నివేదిక ప్రకారం కేసు కూడా నమోదు చేశారు. సిగరెట్ల పన్ను ఎగవేత... తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ జీఎస్టీ కమిషరేట్ అధికారులు ఓ అంతర్రాష్ట్ర సిగరెట్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. పట్నా నుంచి హైదరాబాద్ మీదుగా కర్ణాటకకు పన్ను కట్టకుండా తరలిస్తున్న ఓ సిగరెట్ లోడ్‌ను బుధవారం పట్టుకున్నారు. మొత్తం రూ.24 లక్షల విలువ చేసే 3 లక్షల సిగరెట్లను పట్టుకున్నారు. గోల్డ్‌స్టెప్ టుబాకో ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్యారిస్ బ్రాండ్ మీద సిగరెట్లు తయారుచేసి ఒక్క రూపాయికే అమ్ముతున్నట్లు గుర్తించారు. పన్ను ఎగవేతను అరికట్టేందుకు ప్రత్యే క చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
వాటి స్మగ్లింగ్‌తో రూ 13 వేల కోట్లు మసి
సాక్షి, న్యూఢిల్లీ : స్మగ్లింగ్‌కు కాదేదీ అనర్హమంటూ అక్రమార్కులు చెలరేగుతున్నారు. సరుకేదైనా అక్రమంగా సరిహద్దులు దాటించేసి సొమ్ము చేసుకుంటున్నారు. సిగరెట్ స్మగ్లింగ్‌తో ఖజానాకు రూ 13,000 కోట్ల నష్టం వాటిల్లుతోందని అఖల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని సిగరెట్ పరిశ్రమలో అక్రమ వర్తకం వాటా 25 శాతం పైగా ఉంటుందని, అక్రమ సిగరెట్ వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందుతూ వేల కోట్ల ఆదాయానికి గండికొడుతోందని పేర్కొంది. అక్రమార్కులకు అడ్డుకట్ట వేసి పొగాకు సాగుచేస్తున్న రైతుల ప్రయోజనాలను పరిరక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిపిన దాడుల్లో స్మగుల్డ్ సిగరెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సీజ్ చేస్తున్నా దీనికి సంబంధించి సరైన డేటా ఉండటం లేదని పేర్కొంది.గత రెండేళ్లలో స్మగుల్డ్ సిగరెట్లను ఎంత మొత్తంలో స్వాధీనం చేసుకున్నారన్న తమ ప్రశ్నలకు అధికారులు ఇంతవరకూ సమాచారం అందించలేదని ఆందోళన వ్యక్తం చేసింది. పొగాకుపై పన్నులను ఇటీవల ప్రభుత్వం భారీగా పెంచడంతో దేశంలో సిగరెట్ల స్మగ్లింగ్ పెరిగిందని పేర్కొంది. అక్రమంగా దేశం దాటుతున్న సిగరెట్లపై ఫైపా ప్రధాని కార్యాలయంతో పాటు ఆరోగ్య మంత్రిత్వ శాఖకూ లేఖలు రాసింది. సిగరెట్ స్మగ్లింగ్‌ను నీరుగార్చేలా పన్ను వ్యవస్థ ఉండాలని సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. -
సిగరెట్ మానేస్తే.. 6 అదనపు సెలవులు..
ప్రతి కంపెనీలో సిగరెట్ తాగే వారు ఉంటారు.. తాగని వారూ ఉంటారు. కానీ మీరు పనిచేసే కంపెనీ ఎప్పుడైనా మీ సిగరెట్ అలవాటును మాన్పించేందుకు ప్రయత్నించిందా?? దాదాపుగా వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉండే ప్రతి కంపెనీ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోకపోవచ్చు. కానీ జపాన్‌లోని టోక్యోకు చెందిన ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యమని భావించింది. అందుకే ఎవరైతే పొగ తాగడం మానేస్తారో వారికి ఏడాదిలో ఆరు పని దినాలను అదనంగా సెలవులుగా మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కంపెనీ పేరు పియాలా.ఐఎన్‌సీ... కంపెనీ కేంద్ర కార్యాలయం బిల్డింగ్‌లోని 29వ ఫ్లోర్లో ఉంటుంది. అంత పైనుంచి ఉద్యోగులు బిల్డింగ్ బేస్మెంట్లోకి వచ్చి సిగరెట్ తాగి వెళ్లడం వలన సుమారు 15 నిమిషాల సమయం వ్యర్థమైపోతోంది. దీనివల్ల పనిలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని సిగరెట్ తాగని ఒక ఉద్యోగి పేపర్‌పై రాసి సలహాల పెట్టెలో వేశాడు. దీన్ని చదివిన కంపెనీ సీఈవో పొగతాగని వారి కోసం ఆరు అదనపు సెలవులను ఇస్తే బాగుంటుందని భావించాడు. అంతేకాకుండా ప్రాణాన్ని హరించే ఆ మహమ్మారి నుంచి ఉద్యోగులను కాపాడవచ్చని నిర్ణయించాడు. దీంతో వెంటనే ఈ ఆరు సెలవు దినాల కాన్సెప్ట్‌ను ప్రారంభించాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. 120 మంది ఉద్యోగుల్లో సుమారు 30 మంది ఆ కాన్సెప్ట్‌ను అందిపుచ్చుకుని ఇప్పటికే లబ్ధి పొందారు కూడా. కనీసం నలుగురినైనా సిగరెట్ అలవాటు నుంచి దూరం చేయాలని కంపెనీ ఉద్దేశాన్ని ప్రస్తుతం అక్కడి వారు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. -
సిగరెట్ తాగొద్దన్నాడని..చంపేశారు!
న్యూఢిల్లీ: ఇంట్లో సిగరెట్ తాగవద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి(22)ని అతని స్నేహితుడే కాల్చిచంపిన దారుణ ఘటన దేశరాజధానిలో చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని సుఖదేవ్ నగర్లో నివాసముంటున్న బ్రిజేశ్ కుమార్ ఈ నెల 9న తన స్నేహితుడు భోలాను పార్టీకి ఆహ్వానించాడు. అయితే తన తండ్రికి అలర్జీ ఉన్నందున ఇంట్లో సిగరెట్ కాల్చవద్దని కుమార్ సూచించాడు. దీంతో ఇరువురికి మాటామాట పెరగడంతో కుమార్ భోలాపై చేయిచేసుకున్నాడు. దీన్ని అవమానంగా భావించిన అతను..కుమార్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం విజయ్, అరుణ్ అనే ఇద్దరు స్నేహితుల సాయం తీసుకున్న భోలా.. కుమార్‌ను తర్వాతి రోజు పార్టీకి ఆహ్వానించాడు. అతని చేత పూటుగా మద్యం తాగించి, దూరంగా తీసుకెళ్లి తుపాకీతో కాల్చిచంపాడు. అనంతరం శవాన్ని దగ్గర్లోని కాలువలో పడేసి ముగ్గురు ఇళ్లకు వెళ్లిపోయారు. సోమవారం రోహిణీ సెక్టార్‌లోని కాలువలో దొరికిన ఓ శవాన్ని కుమార్‌గా నిర్ధారించిన పోలీసులు, పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. -
సిగరెట్ ఇవ్వలేదని కత్తితో పొడిచాడు
బొమ్మనహళ్లి: సిగరెట్ ఇవ్వలేదని ఓవ్యాపారిపై దుండగుడు కత్తితో పొడిచిన సంఘటన నగరంలోని ఉత్తరహళ్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడి ఆంజద్చాన్ ఇక్కడి విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంజద్ ఉత్తరహళ్లిలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న బార్ వద్ద అగరబత్తిల వ్యాపారం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో మద్యం మత్తులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ ఇవ్వాలని అంజాద్‌ను కోరాడు. లేదని చెప్పడంతో కత్తితో అంజద్‌ను పొడిచి పారిపోయాడు. క్షతగాత్రుడిని ఓ వ్యక్తి కారులో విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సిగరెట్ ఇవ్వలేదని కత్తితో పొడిచాడు
బొమ్మనహళ్లి: సిగరెట్ ఇవ్వలేదని ఓవ్యాపారిపై దుండగుడు కత్తితో పొడిచిన సంఘటన నగరంలోని ఉత్తరహళ్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడి ఆంజద్చాన్ ఇక్కడి విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంజద్ ఉత్తరహళ్లిలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న బార్ వద్ద అగరబత్తిల వ్యాపారం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో మద్యం మత్తులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ ఇవ్వాలని అంజాద్‌ను కోరాడు. లేదని చెప్పడంతో కత్తితో అంజద్‌ను పొడిచి పారిపోయాడు. క్షతగాత్రుడిని ఓ వ్యక్తి కారులో విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పొగరాయుళ్లకు చెక్: నో మోర్ లూజ్ సిగరెట్స్
బెంగళూరు: బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసే పొగరాయుళ్లకు చెక్‌పెడుతూ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సిగరెట్లతో పాటు వివిధ రకాల పొగాకు ఉత్పత్తులను విడిగా విక్రయించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ధూమపానాన్ని నిషేధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సెక్రటరీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం లూజ్ సిగరెట్లు, బీడీలు ఇతర చూయింగ్ పొగాకు ఉత్పత్తుల విక్రయం ఇకమీదట నేరంగా పరిగణిస్తారు. 2003 కోప్టా చట్టంలోని సెక్షన్లు 7, 8 ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపింది. తాజా ఆదేశాల ప్రకారం... సిగరెట్లను పెట్టెగానే విక్రయాలి. విడిగా అమ్మడం కుదరదు. విడిగా విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ శాలిని రాజేష్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధంతో ధూమపానం తగ్గినప్పటికీ లూజ్ సిగరెట్లు, బీడీలు, ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. ఈ నిషేధం పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని మరింత తగ్గిస్తుందని తాము భావిస్తున్నాన్నారు. సెప్టెంబరు 11 న ఈ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బుధవారంనుంచి ఈ నిషేధాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఈ ఆదేశాల పటిష్ట అమలుకోసం ఒక ప్రభుత్వం యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోందని యాంటీ టొబాకో సెల్‌లోని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. -
సిగరెట్ పీకతో రోడ్లు..!
సిగరెట్ అలవాటు బాగా ఉన్నవాళ్లు రోజుకెన్ని ప్యాకెట్లు లాగిస్తారో చెప్పడం కష్టమే. లేదూ... లైట్‌గా తాగుతాం అనే వాళ్లు మాత్రం రోజుకు రెండు నుంచి మూడు వరకైనా తాగక మానరు కదా. వీరిలాంటి వారి సంఖ్య రాష్ట్రం, దేశం, ప్రపంచం ఇలా మొత్తంగా చూసుకుంటే... బాగానే ఉంటుంది. రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరి తాగే వాళ్లు సిగరెట్‌ను పూర్తిగా తాగుతారా అంటే.. సగం సిగరెట్, ఇటు ఫిల్టర్ ముక్కలను రోడ్లపైనే పడేస్తుంటారు. దానివల్ల ఇటు వాతావరణంలో వేడి పెరగడమే కాకుండా చెత్త కూడా కుప్పలు కుప్పలుగా పేరుకు పోతోంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? సిగరెట్ తాగేవాళ్లు తమ అలవాటును మానుకోవడమేనా? అది పూర్తిగా జరిగే పనిలా లేదు. అందుకేనేమో... ఆస్ట్రేలియాలోని రాయల్ మెల్బోర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు దీనికి పరిష్కారాన్ని కనుగొన్నారు. ఎలా అంటారా? గుట్టలు గుట్టలుగా పేరుకు పోతున్న సిగరెట్ పీకలను రోడ్ల తయారీలో ఉపయోగించొచ్చనేది వారి ఆలోచన. వాటిని కాంక్రీట్‌తో కలిపి రోడ్లు వేస్తే.. ఇటు వాతావరణంలో పెరిగే వేడిని తగ్గించొచ్చు. అలాగే వాటి ద్వారా విడుదలయ్యే రసాయనాలను అరికట్టొచ్చు. ఈ పద్ధతిని అన్ని దేశాల్లోనూ వినియోగిస్తే ఎంతో మేలు కదా..! -
గుప్పుమనాలంటే.. జేబుకు చిల్లే!
న్యూఢిల్లీ: సిగరెట్లపై విధించే సెస్‌ను పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో పొగరాయుళ్ల జేబులు గుల్లకానున్నాయి. ఇప్పటికే జీఎస్టీ శ్లాబులో 28 శాతం పన్ను సిగరెట్లపై ఉండగా.. మరో 5 శాతం సెస్‌ను పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. దీంతో ప్రతి వెయ్యి సిగరెట్లకు అదనంగా రూ.485/- నుంచి రూ.792/-ల పన్ను భారం పెరగనుంది. సిగరెట్లపై అదనంగా సెస్ విధించడం ద్వారా కేంద్రానికి రూ.5 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది. -
విసిరి పారేశారు
లాస్ట్ పఫ్ ‘నో టొబాకో డే’ సందర్భంగా సిగరెట్లో నికోటిన్ ఉంటుంది. సిగరెట్ తాగడంలో స్టయిల్ ఉంటుంది. నికోటిన్ ఇచ్చే కిక్ కన్నా, స్టెయిల్ ఇచ్చే కిక్కే యూత్‌ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది! బడ్డీ కొట్టుకు వెళ్లి, సిగరెట్ కొనుక్కుని, నోట్లో పెట్టుకుని, వెలిగించి, గుండె నిండా దమ్ము పీల్చనవసరం లేదు. అక్కడ స్క్రీన్ మీద ఫేవరెట్ హీరో దమ్ము కొడుతున్నా చాలు, ఇక్కడ సీట్లో ఫాన్స్‌కి కిక్ ఎక్కుతుంది. హీరో వరకు ఎందుకు? విలన్ ఉఫ్‌మని పొగను వదులుతున్నా... ఆ వదలడంలో కుర్రాళ్లకు హీరోయిజమే కనిపిస్తుంది. ఇక స్మోకింగ్ అలవాటవడం ఎంతసేపు చెప్పండి? అసలు నిజమైన హీరోలు ఎవరో తెలుసా? సిగరెట్ మానేసినవాళ్లు. అలాంటి రియల్ హీరోలు కొందరు స్క్రీన్‌పైన కూడా ఉన్నారు. నేడు ‘నో–టొబాకో–డే’ కాబట్టి... ఒకరిద్దరు నో–స్మోకింగ్ హీరోల నుంచి ‘మానే దమ్ము’ను స్ఫూర్తిగా పొందడం టైమ్లీగా ఉంటుంది. ఇంతకీ ఎవరా రియల్ హీరోలు? సల్మాన్ ఖాన్ సార్‌కి 2013లో నెర్వ్ ట్రీట్మెంట్ జరిగింది. ప్రాబ్లం ఏంటీ అని డాక్టర్లని అడిగితే... ‘స్మోకింగ్’ కూడా ఒక కారణం అని చెప్పారు. వార్నింగ్ బెల్ మోగింది! తక్షణమే సిగరెట్‌కి బై చెప్పేశాడు. గ్రేట్! హృతిక్ రోషన్ సిగరెట్ మానేయడానికి హృతిక్ చాలా కష్టపడ్డాడు. ఓసారి అనుకోకుండా ‘ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్’ అనే పుస్తకం చదివాడు. ఆ పుస్తకం రాసింది అలెన్కార్ అనే చైన్‌స్మోకర్. పుస్తకం చివరి పేజీ చదివిన రోజే తన చివరి సిగరెట్ కాల్చాడు. నైస్! ఆమిర్ ఖాన్ ఆమిర్ అప్పుడప్పుడు స్మోక్ చేసేవాడు. ‘అది కూడా ఎందుకు పప్పా’ అని పిల్లలు జునాయిడ్, ఇరా అడిగేసరికి.. సిగరెట్ మానాలని ట్రై చేశాడు. ఫైనల్‌గా 2011లో చిన్న కొడుకు అజాద్ పుట్టాక ధూమపానం నుంచి విముక్తుడయ్యాడు. ఆసమ్! సైఫ్ అలీ ఖాన్ సైఫ్‌కి 2009లో హార్ట్ ఎటాక్ వచ్చింది. ‘స్మోకింగ్ మానేస్తే మీ గుండెకు మంచిది’ అని డాక్టర్లు చెప్పారు. చెప్పింది విన్నాడు. ‘సిగరెట్ మానండోయ్ బాబూ..’ అని కొన్నాళ్లు ప్రజాహితార్థం ప్రచారం కూడా చేశాడు. వావ్! వివేక్ ఒబెరాయ్ ఒకప్పుడు ధారాళంగా పొగ తాగిన ఒబేరాయ్కు.. ముంబైలోని ఒక ఆసుపత్రిలో క్యాన్సర్ పేషెంట్లతో గడిపాక జ్ఞానోదయం అయిందట. అప్పట్నుంచీ తాను తాగడు, సెట్లో ఎవర్నీ తాగనివ్వడు. వండర్ఫుల్! అజయ్ దేవగణ్ ‘నా మాట నేనే వినను..’ అన్న అజయ్ చివరికి తన బాడీ మాట వినవలసి వచ్చింది. బాడీ తో పాటు భార్య కాజోల్ కూడా ‘మానేద్దురూ’ అని బతిమాలింది. ఆమె మాట విని సిగరెట్‌ని క్విట్ చేసేశాడు అజయ్. వైజ్! అర్జున్ రాంపాల్ ఆమిర్ ఖాన్ లానే ఈయన కూడా పిల్లల కోసమే సిగరెట్లు మానేశాడు. అర్జున్ భార్య మెహర్‌కు కూడా సిగరెట్ తాగే అలవాటు ఉండేది. ఆమె మానేయడంతో, ఆమె ఇన్స్పిరేషన్తో ఈయనా మానేశాడు. లవ్లీ! రణ్‌బీర్ కపూర్ డైరెక్టర్ అనురాగ్ బసుతో బెట్ కట్టి మరీ సిగరెట్ హ్యాబిట్కు టాటా బై బై చెప్పేశాడు రణబీర్. అంతేకాదు, ఎవరికైనా తను సిగరెట్ తాగుతూ కనిపిస్తే తనని చంపేయవచ్చట. తనని కాల్చేయవచ్చట. తనని అబద్దాల కోరు అనేయవచ్చట. సో స్వీట్! -
ఈ–సిగరెట్‌తో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ!
సిగరెట్ మానాలనే ఉద్దేశంతో కొందరు ఈ–సిగరెట్ వాడుతుంటారు. కానీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనే విషయం ఇప్పటికే పలు అధ్యయనాల్లో తెలిసింది. అంతేకాదు... దాని నుంచి వచ్చే రసాయన ఆవిర్ల వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయని తాజా అధ్యయనాల్లో తేలింది. ఎలుకలపై నిర్వహించిన ఈ పరీక్షలో సాధారణ పొగాకుతో ఎన్ని అనర్థాలు వస్తాయో... ఈ–సిగరెట్‌తో సైతం అన్ని అనర్థాలే ఉంటాయని తేలడంతో పాటు ఈ–సిగరెట్లో వెలవడే రసాయనాలు మెదడులోని రక్తనాళాల్లో అడ్డంకులు కలిగిస్తాయని తేలింది. టెక్సాక్–టెక్ యూనివర్సిటీలోని నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం తేటతెల్లమైంది. వారి పరిశోధనల్లో తేలిన అంశాలను హ్యూస్టన్‌లో నిర్వహించిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్స్ ఇంటర్నేషనల్ స్ట్రోక్ కాన్ఫరెన్స్‌లో ఇటీవలే పరిశోధకులు వెల్లడించారు. -
చిల్లర అడిగితే చితకబాదారు.. ఆపై దారుణం!
-
చిల్లర అడిగితే చితకబాదారు.. ఆపై దారుణం!
హైదరాబాద్: హయత్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కేవలం నాలుగు రూపాయల చిల్లర విషయమై ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. హయత్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి... వర్డ్ అండ్ డీడ్ స్కూలు సమీపంలోని పాన్‌షాపులో రాజేష్ అనే వ్యక్తి సిగరెట్ కొన్నాడు. సిగరెట్ కోసం కొంత డబ్బు ఇవ్వగా షాపతను వినియోగదారుడు రాజేష్‌కు నాలుగు రూపాయలు తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో షాపు ఓనర్‌తో రాజేష్‌కు వివాదం తలెత్తింది. షాపు యాజమని, అతని స్నేహితులు కలిసి రాజేష్‌పై దాడిచేసి అతడిని విపరీతంగా కొట్టారు. దెబ్బలు తాళలేక రాజేష్ రోడ్డుమీదకు పరుగుతీశాడు. రోడ్డు దాటే ప్రయత్నం చేయగా వేగంగా వచ్చిన ఓ లారీ అతడిని ఢీకొట్టింది. దీంతో రాజేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సీసీఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకుని, ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
సిగరెట్లు..సెల్ ఫోన్ల ధరలు ఇక భగ భగ
ముంబై: 2016-17 ఆర్థిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్ సభ లో ప్రవేశపెట్టారు. డీమానిటైజేషన్, అయిదు రాష్ట్రాల ఎన్నికలు నేపథ్యంలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ యూనియన్ బడ్జెట్ లో అనేక మెరుపులు, వరాలు కురిపించారు ఆర్ధికమంత్రి. గ్రామీణ యువత, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వెనుకబడిన వర్గాలపై అనేక వరాలు గుప్పించారు. అయితే సిగరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని 6 శాతం పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో సెల్ ఫోన్లు,సిగరెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ముఖ్యంగా దలాల్ స్ట్రీట్ అంచనాలకనుగుణంగానే సిగరెట్లపై పన్ను మోత మోగింది. అటు కనీసం 10 శాతం పెంపును అంచనావేసిన ట్రేడర్లు దీంతో సిగరెట్ తయారీ కంపెనీల కౌంటర్లలో మదుపర్లు దృష్టిసారించారు. అలాగే సెల్ ఫోన్ కూడా కస్టమ్స్ లెవీ కారణంగా 1శాతం ధరలు పెరగనున్నాయి. సెల్ ఫోన్ విడిభాగాల పై విధించిన పన్నుకారణంగా ఈ ధరలు పెరగనున్నాయి. పెరిగిన పన్ను వివరాలు వెయ్యి సిగరెట్లపై పన్ను రూ.215 నుంచి 311కు పెంపు పాన్ మసాలాపై 6నుంచి 9 శాతం దిగుమతి చేసుకున్న అల్యూమినియంపై 30 శాతం పన్ను సెల్ ఫోన్లలో వాడే సర్క్యూట్ బోర్డ్ (పీసీబీ) లపై 2 శాతం మరోవైపు తాజా బడ్జెట్లో వ్యవసాయ రంగం 4.1 శాతం వృద్ధిని సాధించగలదని వేసిన అంచనాతో ఎఫ్ఎంసీజీ రంగం బాగా పుంజుకోనుంది. గ్రామీణాభివృద్ధి, పేదలకు కనీస ఆదాయ కల్పన, నీటిపారుదల సౌకర్యాలకు ప్రాధాన్యం వంటి అంశాలు కూడా ఇందుకు తోడ్పడతాయని నిపుణులు పేర్కొన్నారు. (సంబంధిత వార్తలు..) గృహ రంగానికి గుడ్‌న్యూస్ పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు! బడ్జెట్లో పది ప్రాధాన్యతాంశాలు ఇవే.. ఐఆర్సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు ఆదాయపన్ను రేట్లు ఇలా.. తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ మన విద్యా సంస్థలకు అంతంతమాత్రమే! మోతెక్కనున్న కార్ల ధరలు బడ్జెట్ లో రైల్వే హైలెట్స్... -
సిగరెట్ కాల్చొద్దన్నందుకు వృద్ధురాలి హత్య
హైదరాబాద్: ఇంటి ముందు సిగరెట్ కాల్చొద్దన్నందుకు ఓ యువకుడు వృద్ధురాలిని హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ ఓయూ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలను ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ రవీందర్ వెల్లడిం చారు. శుక్రవారం ఉదయం బోడుప్పల్‌కు చెందిన సాయిప్రసాద్(27) రవీంద్రనగర్ కాలనీ(సీతాఫల్‌మండీ సమీపం)లోని తన స్నేహితుల ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో అతడు ఇంటి ముందు కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు. ఇంట్లో ఉన్న వృద్ధురాలు ఇందిరాదేవి(82) వచ్చి సిగరెట్ కాల్చొద్దని సాయిప్రసాద్‌ను హెచ్చరించింది. అయినా సిగరెట్ తాగుతుండడంతో నీళ్లు తీసుకువచ్చి అతనిపై పోసింది. కొద్దిసేపటి తర్వాత ఎవరూ లేని సమయం లో వృద్ధురాలి ఇంట్లోకి సాయిప్రసాద్ చొరబడి తలదిండును ముఖానికి అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం బీరువాలోని రూ.21 వేలు, టీవీ, సెల్‌ఫోన్ తీసుకొని ఉడాయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని ఇఫ్లూ జంక్షన్ వద్ద ఆదివారం అరెస్ట్ చేశారు. -
ఒక్క సిగరెట్ కూడా ప్రమాదకరమే!
చాలా మంది సిగరెట్ మానేసే ప్రక్రియలో రోజుకు ఒక్కటే తాగుతుంటామని, అలా క్రమంగా తగ్గిస్తామని అనుకుంటుంటారు. అయితే రోజుకు ఒక్క సిగరెట్ మాత్రమే కాదు... సగం సిగరెట్ అయినా అది ప్రమాదకరమే అంటున్నారు యూఎస్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన నిపుణులు. ఆ సంస్థలోని క్యాన్సర్ ఎపిడెమియాలజీ అండ్ జెనెటిక్స్ విభాగానికి చెందిన మాకీ ఇన్యోయ్ చోయ్ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ... ‘‘రెండు... ఒకటి... అనే లెక్కలతో ఏమాత్రం ప్రయోజనం లేదు. సిగరెట్ అంటూ ముట్టించాక... అది సగమైనా సరే ప్రమాదకరమే’’ అంటున్నారు. ఆమె ఆధ్వర్యంలో 59 నుంచి 82 ఏళ్ల వయసులో ఉన్న దాదాపు మూడు లక్షల మందిపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాల గురించి ఆమె మాట్లాడుతూ ‘‘కొంతమంది తమ అలవాటు మానలేక సిగరెట్ వెలిగించి, సగం సిగరెట్ అంటూ ఒకటి రెండు పఫ్స్ తీసుకుంటారు. అయితే అస్సలు సిగరెట్ తాగని వాళ్లతో పోల్చినప్పుడు ఇలా ఒకటి, రెండు ఫప్స్ తీసుకునే 64 శాతం మందికి పొగాకుతో కలిగే ముప్పులన్నీ వస్తుంటాయని హెచ్చరిస్తున్నారామె. ఇలా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే రిస్కు సాధారణ ప్రజల్లో కంటే 12 రెట్లు ఎక్కువని వివరించారు. అలాగే పొగాకు అలవాటు లేని సాధారణ వ్యక్తితో పోలిస్తే సిగరెట్ తాగేవాళ్లలో ఎంఫసిమా వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే రిస్క్ సైతం రెండున్రర రెట్లు ఎక్కువని చెబుతున్నారు. స్మోకింగ్‌ను క్రమంగా తగ్గించడం కంటే అకస్మాత్తుగా ఆపేయడం ఏ వయసులో వారికైనా సురక్షితమే అంటున్నారు ఆమెతోపాటు అధ్యయనంలో పాల్గొన్న వైద్య నిపుణులు. -
ఆన్సర్స్ రాసేటప్పుడు కళ్ళకు మసకలు!
నా వయస్సు 28 ఏళ్లు. నేను ప్రస్తుతం కొన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నాను. నాకు దృష్టిలోపం ఉంది. అద్దాలు వాడుతున్నాను. కొన్నిసార్లు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే సమయంలొ ఆన్సర్ షీట్లో ఆన్సర్స్ రాసేప్పుడు కళ్లు మసక అవుతున్నాయి. దానివల్ల అతి కష్టమ్మీద పరీక్ష రాయాల్సి వస్తోంది. డాక్టర్‌ను కలిస్తే మందులూ, చుక్కల మందూ ఇచ్చారు. అయినా ఫలితం లేదు. దయచేసి ఈ సమస్య నుంచి బయటపడే మార్గం చెప్పండి. – రఘురామ్, ఖమ్మం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు కంట్లో ఇమేజ్ ‘అకామడేటివ్ ఫెయిల్యూర్’ సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. కెమెరాలో బొమ్మ క్లియర్ అయ్యేందుకు ఫోకస్ అడ్జెస్ట్ చేసిన ప్రక్రియే కంట్లోనూ జరుగుతుంది. ఎదుటి వస్తువును చూసే ప్రక్రియలో ఈ అడ్జెస్ట్మెంట్ కంట్లో ఆటోమేటిగ్గా జరుగుతుంది. దీన్నే అకామడేషన్ అంటారు. అది సరిగా జరగనప్పుడు దాన్ని అకామడేటివ్ ఫెయిల్యూర్ అంటారు. కొందరిలో సహజంగా కంటి కండరాలు బలహీనంగా ఉండి అకామడేటివ్ ఫెయిల్యూర్ జరగవచ్చు. మరికొందరిలో టెన్షన్ పడుతున్నప్పుడు సైకో సొమాటిక్ కారణాల వల్ల ఈ అకామడేటివ్ ఫెయిల్యూర్ జరుగుతుంది. పైగా మీరు ఎగ్జామ్ సమయంలోనే ఈ సమస్య వస్తుందంటున్నారు కాబట్టి చాలావరకు అది ఎగ్జామ్ టెన్షన్ వల్లనే కావచ్చు. లేదంటే చదువుతున్న ప్రతిసారీ ఈ సమస్య రావాలి కదా. మీరు అద్దాలు వాడుతున్నానని అన్నారు. అవి సరైన పవర్‌తో (అండర్ కరక్షన్తో, ఓవర్ కరెక్షన్తో) ఉన్నాయా లేదా అన్న విషయాన్ని ఓసారి కంటి వైద్య నిపుణుడిని కలిసి పరీక్ష చేయించుకోండి. మీ వయస్సుకు రక్తపోటు, చక్కెర వ్యాధి ఉండకపోవచ్చు. అయినా ఓసారి పరీక్ష చేయించుకుని అవి లేవని నిర్ధారించుకోవడం మంచిది. థైరాయిడ్ వ్యాధి, అనీమియా (రక్తహీనత) కూడా ఉన్నాయేమో పరీక్షించుకోండి. డ్రై ఐ, ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్లను కూడా చెక్ చేయించుకోవాలి. పైవన్నీ నార్మల్‌గా ఉంటే మీకు ఎగ్జామ్ టెన్షన్ వల్లనే ఈ సమస్య వస్తోందని నిర్ధారణ చేయవచ్చు. నా వయస్సు 44 ఏళ్లు. సిగరెట్లు తాగుతాను. ఓసారి సిగరెట్ వెలిగిస్తుంటే లైటర్‌లో మంట కాస్తంత పైవరకూ వచ్చి, కంటికి సెగ తగిలిందనిపించింది. అలా జరిగినందువల్ల నా కంటికి ఏదైనా హాని జరిగే అవకాశం ఉందా? సిగరెట్ స్మోకింగ్ వల్ల కంటికి ఏదైనా ప్రమాదమా?– సుకుమార్, నల్లగొండ కార్నియా పైపొరను ఎపిథీలియమ్ అంటారు. మాటిమాటికీ పొగ, సెగ తగలడం వల్ల ఈ ఎపిథీలియమ్ దెబ్బతినడానికి అవకాశం ఉంది. ఒకవేళ అది దెబ్బతింటే కంట్లోంచి నీరు కారడం, ఎరుపెక్కడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా ఎక్కువగా పొగతాగేవాళ్ల (క్రానిక్ స్మోకర్స్)లో నికోటిన్ విష పదార్థం ప్రభావంవల్ల ‘టుబాకో ఆంబ్లోపియా’ అనే సమస్య వస్తుంది. ఆంబ్లోపియా వచ్చిన వాళ్లలో కంటి నరం (ఆప్టిక్ నర్వ్) దెబ్బతిని స్పష్టమైన బొమ్మ (క్లియర్ ఇమేజ్) కనిపించకుండా కేవలం ఓ స్కెచ్లాగానో, ఫోటోగ్రాఫ్ నెగెటివ్ లాగానో (ఘోస్ట్ ఇమేజ్) కనిపిస్తుంది. దీని వల్ల వచ్చే ఇంకొక సమస్య కళ్లు పొడిబారడం... అంటే డ్రై ఐ అన్నమాట. మీరు వెంటనే సిగరెట్ మానేయండి. ఆంబ్లోపియా వచ్చినవాళ్లు వెంటనే సిగరెట్ పూర్తిగా మానేసి, వాళ్లకు విటమిన్ సప్లిమెంట్స్ (ప్రత్యేకంగా బి1, బి2, బి12, బి6) ఇస్తే పరిస్థితి మళ్ళీ సాధారణంగా మారేందుకు అవకాశం ఉంది. తరచూ... యూరినరీ ఇన్ఫెక్షన్లు నా వయసు 34 ఏళ్లు. తరచుగా జ్వరం. మూత్రవిసర్జన సమయంలో విపరీతమైన మంట కూడా ఉంటోంది. ఇలా తరచూ జ్వరం, మూత్రంలో మంట వస్తున్నాయి. ఇలా మాటిమాటికీ జ్వరం రాకుండా ఉండేందుకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? – సుమాలిక, దోసపహాడ్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్’తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా మీకు మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తున్న కారణం ఏమిటన్నది తెలుసుకోవాలి. మీకు షుగర్ ఉంటే కూడా ఇలా మాటిమాటికీ యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఒకసారి మీరు షుగర్ టెస్ట్ చేయించుకోండి. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లుగానీ, మూత్రనాళాల్లో వాపుగానీ ఉన్నాయేమో చూడాలి. మీకు డాక్టర్ ఇచ్చిన యాంటీబయాటిక్ పూర్తి కోర్సు వాడకుండా ఉన్నా కూడా మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్స్ తిరగబెట్టవచ్చు. మీకు ఏ కారణం లేకుండా ఇన్ఫెక్షన్ వస్తుంటే కనీసం మూడు నెలల పాటు యాంటీబయాటిక్స్ వాడాలి. రోజూ నీళ్లు ఎక్కువగా (అంటే రెండు నుంచి మూడు లీటర్లు) తాగాలి. మూత్రం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోకుండా, వెంటనే మూత్రవిసర్జనకు వెళ్లాలి. మా బాబు వయసు ఎనిమిదేళ్లు. ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ముఖం, కాళ్లు వాపు వచ్చాయి. యూరిన్‌లో ప్రోటీన్స్ పోయాయనీ, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్పి చికిత్స చేశారు. నెలరోజులు మందులు వాడిన తర్వాత యూరిన్‌లో ప్రోటీన్ పోవడం తగ్గింది. మందులు ఆపేశాము. మళ్లీ 15 రోజుల తర్వాత యూరిన్‌లో మళ్లీ ప్రోటీన్లు పోవడం ప్రారంభమైంది. మళ్లీ మందులు వాడితే ప్రోటీన్లు పోవడం తగ్గింది. ఇలా మందులు వాడినప్పుడల్లా తగ్గి, ఆపేయగానే మూత్రంలో మళ్లీ ప్రోటీన్లు పోతున్నాయి. అయితే ఎక్కువకాలం మందులు వాడితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందా అని ఆందోళనగా ఉంది. వాటివల్ల ఏవైనా సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలూ ఉన్నాయా? దయచేసి వివరించండి. – యూసఫ్, ఖమ్మం నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్నప్పుడు మొదటిసారి పూర్తిగా మూడు నెలల పాటు డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. కొంతమంది పిల్లల్లో మందులు మానేయగానే మళ్లీ ప్రోటీన్ పోవడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పిల్లల్లో తక్కువ మోతాదులో మందులను ఆర్నెల్ల నుంచి తొమ్మిది నెలల పాటు వాడాల్సి ఉంటుంది. కొంతమందిలో సైడ్ఎఫెక్ట్స్ కనిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు వేరే మందులు వాడాల్సి ఉంటుంది. చాలామంది పిల్లల్లో ఈ వ్యాధి 12–14 సంవత్సరాల వయసప్పుడు పూర్తిగా నయమవుతుంది. కిడ్నీలు దెబ్బతినే అవకాశం చాలా తక్కువ. మీరు ఆందోళన పడకుండా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడండి. -
ఈ సిగరెట్ సురక్షితమేమీ కాదు!
పల్మునాలజీ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. విపరీతంగా సిగరెట్లు తాగుతాను. ఎంత ప్రయత్నించినా చైన్స్మోకింగ్ మానడం సాధ్యం కావడం లేదు. స్నేహితులు ఈ-సిగరెట్‌ను ప్రయత్నించమని చెబుతున్నారు. ఈ-సిగరెట్ (ఎలక్ట్రానిక్ సిగరెట్) ఉపయోగించడం ద్వారా సిగరెట్ మానేయవచ్చా? ఇది మంచిదేనా? - నవీన్‌కుమార్, మహబూబ్‌నగర్ ఈ-సిగరెట్‌లోనూ దాదాపు సాధారణ సిగరెట్లో ఉండే ప్రమాదకరమైన రసాయనాలే ఉంటాయి. మామూలు సిగరెట్లు, ఈ-సిగరెట్లు... ఈ రెండింటిలోనూ నికోటిన్ కామన్‌గానే ఉంటుంది. ఇది తనకు బానిస అయ్యేలా చేసుకుంటుంది. మందుల సేఫ్టీ విషయంలో ప్రామాణికమైన అమెరికా అత్యున్నత సంస్థ ఎఫ్‌డీఏ విశ్లేషణల ప్రకారం... ఈ-సిగరెట్‌లోనూ గుర్తించగల స్థాయిలో క్యాన్సర్ కారకాలూ, విషపూరిత రసాయనాలూ ఉన్నాయి. ఈ-సిగరెట్లో కాటరిడ్జ్లో డీ-ఇథైల్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం, నైట్రోజమైన్స్ అనే క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. పైగా ఎన్నో రకాల కాలుష్యాలు ఈ-సిగరెట్ ద్వారా శరీరంలోకి వెళ్తుంటాయి. దీని పొగను కూడా మామూలు సిగరెట్లలాగే గొంతు, ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక మంట, ఇన్ఫెక్షన్లను (క్రానిక్ ఇన్ఫ్లమేషన్ను) కలిగిస్తుంది. ఇలా పొగ పీల్చడం దీర్ఘకాలం పాటు కొనసాగితే అది ఈ-సిగరెట్ పొగ అయినా సరే... కొన్నాళ్ల తర్వాత బ్రాంకైటిస్, ఎంఫసిమా, గుండెజబ్బుల వంటి వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి ఈ-సిగరెట్ మామూలు సిగరెట్ కంటే చాలా సురక్షితమేమీ కాదు. దీర్ఘకాలంలో మామూలు సిగరెట్‌తో వచ్చే దాదాపు అన్ని రకాల దుష్పరిణామాలూ ఈ-సిగరెట్‌తోనూ వస్తాయి. ఈ-సిగరెట్‌లోనూ ఉండేది నికోటినే కాబట్టి దానికి బానిసై మళ్లీ మీరు ఈ-సిగరెట్‌కు అలవాటు పడతారు. మీరు సిగరెట్ వదిలేయదలిస్తే... ఒక్కసారిగా వదిలేయడం మేలు. సిగరెట్ మానేయగానే కాస్త చిరాకు, కోపం, నిస్పృహ, అస్థిమితంగా ఉండటం వంటి కొన్ని తాత్కాలిక లక్షణాలు కనిపించినా, దీర్ఘకాలంలో సిగరెట్ మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ. డా॥రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ గుండెదడ తగ్గాలంటే..? నా వయసు 40 ఏళ్లు. ఈమధ్య నాకు గుండె దడగా ఉంటోంది. అడపాదడపా ఈ గుండెదడ వస్తోంది. దీనివల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందా? వాటి సాధారణ కారణాలు తెలపండి. సలహాలు ఇవ్వండి. - సుబ్రహ్మణ్యం, బోధన్ సాధారణ పరిస్థితుల్లో అయితే గుండె తాలూకు స్పందనలను మనం గ్రహించలేము. ఒకవేళ అలా గ్రహించే స్థితి ఏర్పడితే దాన్ని గుండె దడ అంటారు. గుండె దడ అనేది ఒక వ్యాధి కాదు. ఒక లక్షణం. గుండెదడ తాత్కాలికంగా కనిపించినా, దానంతట అదే సద్దుమణుగుతుంది. అయితే ఇదే పరిస్థితి నిరంతర లక్షణంగా మారితే దానికి ప్రాధాన్యం ఇవ్వాలి లేకపోతే చాలా మందిలో గుండెకు సంబంధించిన ప్రతి అంశం ఆందోళన పుట్టిస్తుంది. సాధారణమైన జలుబులు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, టీ, కాఫీ, మద్యం తాగడం వంటి అంశాలు కూడా గుండెదడను కలిగించగలవనే విషయం తెలిక చాలామంది విపరీతమైన ఆందోళనకు, అలజడికి గురవుతారు. సాధారణంగా ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు గుండెదడ వస్తుంది లేదా గుండెకు సంబంధించిన వ్యాధులలో కూడా ఈ స్థితి కనిపిస్తుంది. గుండెదడను వైద్యశాస్త్రపరంగా విశ్లేషించేటప్పుడు సాధారణ రక్తపరీక్ష మొదలు ఈసీజీ వరకు కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. సూచనలు : గుండెదడగా ఉన్నప్పుడు మరీ వేడిగా ఉండే పదార్థాలను తినకూడదు. చేదు, కారం రుచులను తగ్గించుకోవాలి. ఎక్కువగా తినడం, తిన్నది జీర్ణం కాకముందే తినడం మంచిది కాదు. మలమూత్ర విసర్జనలను ఆపుకోకూడదు. కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్ లాంటి ఉత్ప్రేరక పదార్థాలు వాడటం తగ్గించాలి. టీ కంటే కాఫీ మరింత ప్రమాదకరం. పొగతాగే అలవాటు మానేయండి. పక్కనుండే స్నేహితులు పొగతాగుతున్నా వారించండి. మానసికంగా నిలకడగా, నిశ్చింతగా ఉండాలి. బిగ్గరగా మాట్లాడకూడదు, మాట్లాడితే గుండెదడ పెరుగుతుంది. మృదుభాషణ సర్వదా హితకరం. నూనెలు, కొవ్వు పదార్థాలు వాడకాన్ని తగ్గించాలి. మరీ దడ ఎక్కువగా ఉన్నపుపడు ఐస్‌ను నల్లగ్గొట్టి ఒక బ్యాగ్‌లో వేసి, ఛాతీపై పెట్టుకుంటే గుండెదడ సద్దుమణుగుతుంది. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. కాలు నేలకు ఆనడం లేదు... మడమనొప్పి తగ్గేదెలా? ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 46 ఏళ్లు. గత నాలుగు నెలల నుంచి మడమనొప్పితో బాధపడుతున్నాను. బీపీ, షుగరు లేవు. డాక్టరుగారి సూచన మేరకు నరాల శక్తి కోసం మందులు వాడుతున్నాను. పెద్దగా ఫలితం కనబడలేదు. ఆయుర్వేదంలో పరిష్కారం ఉంటే తెలియజేయండి. - జి. కామేశ్వరి, విజయనగరం మీ సమస్యను ఆయుర్వేద పరిభాషలో ‘పార్షి శూల’ అంటారు. ఇది వాత ప్రధానమైన వ్యాధి. శరీరంలోని ‘కొసనరాలు’ (పెద్ద నరాల చివరి శాఖలు) బలహీనమై వాపునకు గురవుతాయి. అందువల్ల మీరు మడమను అదిమిపెట్టి నడవలేరు. రాత్రి పడుకొని ఉదయం లేచేటప్పుడు పాదాన్ని నేలపై మోపాలంటే భరించలేనంత నొప్పిగా ఉంటుంది. దీనికి ప్రధానంగా విటమిన్-బి కాంప్లెక్సు తగినంత తీసుకోవడం అవసరం. ముడిబియ్యంతో వండిన అన్నం తినండి. గంజిని వార్చి పారేయవద్దు. తాజాఫలాలు, డ్రైఫ్రూట్స్ ప్రతిరోజూ తినండి. పప్పులు, మొలకలు, మాంస రసం (మటన్‌సూప్) కూడా తినవచ్చు. మీ వయసు రీత్యా మీకు తగినంత కాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషక విలువలున్న ఖనిజలవణాలు లభించాలంటే పైన చెప్పిన ఆహారం క్రమం తప్పకుండా తీసుకుంటూ మూడు నెలలు తినండి. బయటి తినుబండారాలు, మరిగించిన నూనెతో చేసిన ఆహారపదార్థాలు తినవద్దు. చికిత్స : 1. క్షీరబల క్యాప్సూల్స్ : ఉదయం 1, రాత్రి - 1 (ఆహారానికి ముందు) 2. మహాయోగరాజ గుగ్గులు (మాత్రలు) : ఉదయం 1, రాత్రి- 1 (తిన్న తర్వాత) 3. శిలాజిత్ ( స్వర్ణయుక్త) : రోజూ ఒకటి 4. మహారస్నాదికాఢ (కషాయం) : నాలుగు చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి రోజూ మూడు పూటలా తాగాలి. 5. పిండతైల : దీనిని మడమపై మృదువుగా మర్దన (మసాజ్) చేసి వేడినీటి ఆవిరితో కాపడం పెట్టాలి. (ఉదయం, సాయంత్రం) గృహవైద్యం : ఉమ్మెత్త ఆకుని శుభ్రంగా కడిగి, లోపలివైపు ఆముదంగానీ నువ్వుల నూనెగానీ పూసి, కొంచెం వేడి చేసి, దాన్ని మడమవై పెట్టి కట్టుకట్టుకోండి. ఈ విధంగా ఏడురాత్రులు చెయ్యండి. నొప్పి తగ్గిపోతుంది. మా బాబు వయసు ఐదు నెలలు. మల మార్గం దగ్గరున్న చర్మం ఒరుసుకుపోయింది. తాకితే ఏడుస్తున్నాడు మంచి ఆయుర్వేద ఔషధం చెప్పగలరు. - సుజాత, ఖమ్మం సాధారణంగా శిశువులు మలవిసర్జన చేసిన తర్వాత, తల్లులు శుభ్రం చేస్తుంటారు కదా. ఎక్కువగా ఒత్తడం, ఎక్కువ సార్లు కడగడం వల్ల, చేతి ఒత్తిడి వల్ల... అక్కడ ఒరుసుకుపోయి, ఎర్రగా అవుతుంది. దీనికి గుదంకుట్ట అని ఆయుర్వేదం వర్ణించింది. దీన్ని ఇంగ్లిష్‌లో న్యాప్కిన్ డర్మటైటిస్ అంటారు. చికిత్స : పరిశుభ్రం చేసినప్పుడల్లా మృదువుగా చేయాలి. మహామరిచాది తైలాన్ని శుభ్రమైన దూదితో మెల్లగా ఆ ప్రాంతంపై పూయాలి (రోజూ రెండు మూడు సార్లు పూయవచ్చు). వారం రోజులలో తగ్గిపోతుంది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
ఒత్తిడి తగ్గించకపోగా ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతుంది!
నా వయసు 48 ఏళ్లు. రోజూ చాలా ఒత్తిడికి గురవుతుంటాను. చదువుకునే రోజుల్లో సరదాగా సిగరెట్ కాల్చడం అలవాటైంది. ఇప్పుడు రోజూ ఒత్తిడి తగ్గించుకోడానికి సిగరెట్లు కాలుస్తుంటాను. ఇటీవల నాకు తీవ్రమైన ఆయాసం, దగ్గు వస్తోంది. దాంతోపాటు సరిగా నిద్రపట్టడం లేదు. మామూలు సమస్యే కదా తగ్గిపోతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు రోజూ దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తోంది. మందులు వాడుతున్నా రోజురోజుకూ పెరుగుతోంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - మోహన్, ఆదిలాబాద్ సిగరెట్ కాల్చడం ఒత్తిడిని తగ్గించకపోగా అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలగజేస్తుంది. మొదట్లో సరదాగా ప్రారంభమయ్యే అలవాటు... ఆ తర్వాత వదులుకోలేని వ్యసనంగా మారి మీ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. మీరు రోజుకు మూడు పాకెట్ల వరకు సిగరెట్లు కాలుస్తుంటారని చెప్పారు. అంత ఎక్కువ సంఖ్యలో సిగరెట్లు కాల్చడం మీ ఆరోగ్యంపై చాలా తీవ్రమైన దుష్ర్పభావం చూపుతుంది. ఊపిరితిత్తులు పాడైపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. పొగతాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు పూడుకుపోయి గుండె సంబంధిత సమస్యలు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ), నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు... చర్మసంబంధిత వ్యాధులు కూడా రావచ్చు. కాబట్టి మీరు వెంటనే సిగరెట్లు కాల్చడం మానేయండి. వైద్యులను సంప్రదించి వారు సూచించిన పరీక్షలు చేయించుకోండి. పొగతాగడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సిగరెట్ ఒత్తిడిని తగ్గిస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే. మీరు ఎంత త్వరగా పొతతాగడం మానేస్తే... అది మీ ఆరోగ్యానికి అంత మేలు. గుండెపోటు వస్తే గుర్తించడమెలా? నా వయస్సు 58 సంవత్సరాలు. గత 8 సంవత్సరాలుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను. ఒకవేళ నిద్రలో ఆయాసం గాని, గుండెపోటు గాని వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తెలుపగలరు. - భాను ప్రసాద్, కర్నూలు గుండెపోటును తొలిదశలోనే గుర్తిస్తే ప్రథమ చికిత్సతో ప్రాణాలు కాపాడుకోవచ్చు. గుండెపోటు లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. ఛాతి నొప్పి లేదా ఛాతి మంటలన్నీ కచ్చితంగా గుండెపోటుకు సంబంధించినవి కాకపోవచ్చు. ఈసీజీ పరీక్ష చేయించుకోవడం వల్ల చాలారకాల గుండె సమస్యలకు మూలం తెలుస్తుంది. కాళ్లవాపు, ఆయాసం, కళ్లు తిరిగి పడిపోవడం, బరువులు ఎత్తుతున్నప్పుడు గుండె దడ రావడం గుండెజబ్బుకు సంబంధించిన లక్షణాలుగా భావించవచ్చు. నిద్రలో మీకు ఆయాసం వస్తే గుండె జబ్బు అని నిర్ధారించుకోవద్దు అలాంటి అపోహలతో ఆందోళన పడొద్దు. చాలామంది స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం, ఆస్తమా కారణంగా నాలుగు మెట్లెక్కినా ఆయాసపడతారు. మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులు కాబట్టి గుండెపోటు వస్తే ఆయాసం ఉంటుందే తప్ప నొప్పి ఉండదు. ఇది గుండెనొప్పే కానీ, కాస్త భిన్నమైనది. గుండెకు రక్తసరఫరా తగ్గడం, గుండె కవాటాల్లో జబ్బు కారణంగా ఆయాసం వస్తుంది. అందుకే శ్వాస సమస్యలన్నీ గుండెనొప్పికి సంబంధించినవి కావు. వ్యాధి నిర్ధారణకు ఆయాసంతోపాటు ఇతర అంశాలు కూడా పరిశీలించాలి. గుండెకు సంబంధించిన సమస్య కనిపించగానే మనం సత్వరం చేయాల్సినవి... తొలి గంట అమూల్యం కాబట్టి కుటుంబ సభ్యులు అతి త్వరగా రోగిని ఆస్పత్రికి తరలించాలి. వెంటనే ఈసీజీ తీయించాలి. డిస్ప్రిన్ కాని సార్బిట్రేట్ మాత్రలను వెంటనే నీటిలో కలిపి తాగించాలి. కూర్చోబెట్టి గాని, పడుకోబెట్టి గాని ద్రావణాన్ని తాగించాలి. దీనితో వెంటనే నొప్పి తగ్గిపోతుంది. డిస్ప్రిన్ మాత్ర స్ప్రెప్టోకైనేస్ ఇంజక్షన్‌కు సమానంగా పనిచేస్తుంది. అందుకే దీనివల్ల రోగికి ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది. ఎల్లప్పుడు డిస్ప్రిన్ గాని సార్బిట్రేట్ మాత్రలను గాని దగ్గర ఉంచుకోవడం శ్రేయస్కరం. -
ఎలుక చంపింది..సిగరెట్ కాపాడింది..!
చిలకలగూడ : చిలకలగూడ పాత పోలీస్‌స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి పురాతన భవనం కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా ఈ ఘటనలో ఎలుకల మందు పెట్టబోయి ఒకరు ప్రాణాలు కోల్పోగా, సిగరెట్ కోసం వెళ్లి మరొకరు ప్రాణాలు కాపాడుకున్నారు. వివరాల్లోకి వెళితే..కూలిపోయిన భవనంలో కొనసాగుతున్న అక్బర్ చికెన్ షాపులో భవానీనగర్‌కు చెందిన మహ్మద్‌వాజిద్ (29) చిలకలగూడకు చెందిన రెహమాన్ పని చేసేవారు. సోమవారం రాత్రి ఇద్దరు కలిసి షాపును శుభ్రం చేశారు. యజమాని అదేశాల మేరకు వాజిద్ ఎలుకల మందు పెట్టేందుకు లోపలకు వెళ్లగా,అక్బర్ దుకాణం ఎదుట నిల్చున్నాడు. రహమాన్ సిగరెట్ కోసం బయటకు వెళ్లాడు. అదే సమయంలో భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న అక్బర్, వాజిద్ మృతిచెందగా, సిగరెట్ కోసం వెళ్లిన రెహమాన్ ప్రాణాలతో భయటపడ్డాడు. కాగా అంతకు కొన్ని నిమిషాల ముందే అదే రహదారిలో పలహారంబండి ఊరేగింపు వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. -
సిగరెట్ కావాలని వచ్చి గొలుసు చోరీ
కిరాణా దుకాణం యజమానురాలి నుంచి చైన్ లాక్కెళ్లిన దుండగులు ఇబ్రహీంపట్నం: సిగరేట్ కావాలంటూ బైక్‌పై కిరాణా దుకాణానికి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు షాపు యజమానురాలి మెడలో ఉన్న ఐదు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించుపోయారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ జగదీశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సాహెబ్‌గూడకు చెందిన వట్నాల పుష్పలత(35) స్థానికంగా ఓ కిరాణా దుకాణం నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా, మధ్యాహ్నం ఇంటిగంట సమయంలో ఇద్దరు యువకులు పల్సర్ బైక్‌పై ఆమె దుకాణం వద్దకు వచ్చారు. సిగరెట్ కావాలని అడిగారు. దీంతో పుష్పలత సిగరెట్ ఇచ్చేంతలోపు ఆమె మెడలో ఉన్న 5 తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యారు. ఆదివారం ఇబ్రహీంపట్నం సమీపంలో, తాజాగా సోమవారం సాహెబ్‌గూడలో చైన్‌స్నాచింగ్‌లు జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
కాల్చకురా... కాలేవు...
మే 31న వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా... పొగతాగని వాడు దున్నపోతై పుడతాడో లేదో ఎలాంటి గ్యారంటీ లేదు గానీ, పొగతాగే వాడు మాత్రం ‘ధూమ్రపోతై’ గిట్టడం ఖాయం. ఈ సంగతి పొగరాయుళ్లకు కూడా బాగానే తెలుసు. అయినా ఎడాపెడా పొగచుట్టలు తగలేస్తూనే ఉంటారు. సిగరెట్, చుట్ట, బీడీ, హుక్కా... ఏదైతేనేం నిదానంగా ప్రాణాలు తీయడానికి. అందుకే ‘కాల్చకురా... కాలేవు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ కూడా మొత్తుకుంటూనే ఉన్నాయి. పొగ తాగే పాడు అలవాటును మానుకోవాలంటూ దశాబ్దాలుగా మొరపెట్టుకుంటూనే ఉన్నాయి. పొగ తాగడం వల్ల కలిగే అనర్థాల గురించి నిరక్షరాస్యులకు సైతం అర్థమయ్యేలా వివరిస్తూ, మారుమూల ప్రాంతాలకు సైతం చేరే రీతిలో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఇదీ నేపథ్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ దేశాల ప్రభుత్వాలు సాగిస్తున్న విస్తృత ప్రచారం వల్ల కొంతవరకు సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో పొగరాయుళ్ల శాతం గడచిన మూడు దశాబ్దాల్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. శాతం లెక్కల్లో తగ్గుదల కనిపిస్తున్నా, జనాభా పెరుగుదల కారణంగా పొగరాయుళ్ల సంఖ్యాబలం పెరిగిందని అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ చెబుతున్న తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పొగరాయుళ్ల జనాభా 113 కోట్లకు పైనే ఉంది. వారిలో దాదాపు 95 కోట్ల మంది పురుషులే కాగా, సుమారు 18 కోట్ల మంది మహిళలు ఉండటం ఆందోళన కలిగించే అంశం. పొగాకు వ్యతిరేక ప్రచారం ఫలితంగా అగ్రరాజ్యాల్లో పొగరాయుళ్ల సంఖ్య బాగానే తగ్గుముఖం పట్టినా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను, వెనుకబడిన దేశాల్లోను ఈ సంఖ్య ఇంకా ఆందోళనకరమైన స్థాయిలోనే ఉంది. ముప్పయ్యేళ్ల కిందట అమెరికా జనాభాలో 42 శాతం మంది యథేచ్ఛగా పొగపీల్చేవారు. డబ్ల్యూహెచ్ఓ ప్రచార ఫలితంగా ఇప్పుడు ఆ సంఖ్య 20.8 శాతానికి తగ్గింది. ఇదే వ్యవధిలో భారత్‌లో పొగతాగే వారి సంఖ్య 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గింది. ఇది కొంతవరకు ఆశాజనకమైన పరిణామమే అయినా, పొగతాగే వారి సంఖ్య మరింతగా తగ్గితే తప్ప ప్రపంచం ఆరోగ్యకరంగా మారదని డబ్ల్యూహెచ్ఓ భావిస్తోంది. అందుకే పొగతాగడం మాత్రమే కాదు, ఇతర రూపాల్లోనూ పొగాకు వినియోగాన్ని పూర్తిగా రూపుమాపాలనే సంకల్పంతో 1988 సంవత్సరంలో మే 31వ తేదీని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా ప్రకటించింది. పొగాకు వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలనే సంకల్పంతో డబ్ల్యూహెచ్ఓ 1998 నుంచి ‘టొబాకో ఫ్రీ ఇనీషియేటివ్’ను చేపట్టింది. ‘పొగ’సెగపై అవీ... ఇవీ... 40 వేల కోట్ల డాలర్లు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే వస్తువులు సిగరెట్లే. ఏటా దాదాపు లక్ష కోట్ల సిగరెట్లు అమ్ముడుపోతున్నట్లు అంతర్జాతీయ సంస్థల అంచనా. వీటి విలువ సుమారు 40 వేల కోట్ల డాలర్లు (రూ. 2.70 లక్షల కోట్లు). 70% సిగరెట్ల అమ్మకాల్లో అమెరికాదే గుత్తాధిపత్యం అని చెప్పుకోవచ్చు. ప్రపంచ సిగరెట్ల మార్కెట్లో దాదాపు 70 శాతం అమెరికాకు చెందిన మూడు బ్రాండ్లదే. 43 రకాల రసాయనాలు సిగరెట్ పొగలో నికోటిన్‌తో పాటు ఆర్సెనిక్, ఫార్మల్డీహైడ్, హైడ్రోజన్ సైనైడ్, అమోనియా, సీసం, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి 43 రకాల ప్రమాదకర రసాయనాలు ఉంటాయి. 15 ఏళ్లు పొగతాగని వారితో పోలిస్తే పొగతాగే వారు దాదాపు పదిహేనేళ్ల ఆయుర్దాయాన్ని కోల్పోతారు. 10 సెకన్లు సిగరెట్ పొగ పీల్చిన పది సెకన్లలోనే అందులోని నికోటిన్ మెదడుకు చేరుతుంది. 20% సిగరెట్లలో దాదాపు 20 శాతం చక్కెర ఉంటుంది. అందుకే ఇవి మధుమేహం ఉన్నవారికి మరింత ముప్పు కలిగిస్తాయి. 113దేశాలు 74% మరణాలు భారత్‌లోనే పొగాకు నమిలినా ముప్పే. అయితే, దీని వల్ల ఆ ముప్పు అలవాటు ఉన్నవాళ్లకు మాత్రమే పరిమితం. పొగాకును జర్దా, ఖైనీ, గుట్ఖా, ఖారామసాలా వంటి నానారకాల రూపాల్లో నమిలే అలవాటు చాలా దేశాల్లో ఉంది. ముఖ్యంగా భారత ఉపఖండ ప్రాంతంలో ఈ అలవాటు మరీ ఎక్కువ. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం 113 దేశాల్లో పొగాకు నమిలే అలవాటు ఉంది. ఈ అలవాటు వల్ల తలెత్తే వ్యాధులతో ఏటా దాదాపు 2.50 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాల్లో 74 శాతం కేవలం భారత్‌లోనే సంభవిస్తుండటం గమనార్హం. సమాజంపై ప్రభావం * పొగతాగే అలవాటు సమాజంపై చూపే ప్రభావం కూడా తక్కువేమీ కాదు. * పొగతాగే పెద్దలను చూసి పిల్లలు ఈ అలవాటును నేర్చుకుంటారు. పొగతాగే వారిలో దాదాపు 60 శాతం మంది పద్దెనిమిదేళ్ల లోపు వయసులోనే ‘పొగ’కు అలవాటుపడుతున్నారు. * ఇక ఆహార పంటలు పండించాల్సిన నేలలో పొగాకు సాగు చేయడం వల్ల వ్యవసాయరంగానికి ఏటా వాటిల్లుతున్న నష్టం లెక్కలకు అందనిది. * పొగతాగే అలవాటు ఉన్నవారు అల్పాదాయ వర్గాలకు చెందిన వారైతే, వారు తమ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని ఈ అలవాటు కోసమే ఖర్చు చేస్తూ ఆర్థికంగా కుదేలవుతున్నారు. * హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు పెద్ద నగరాల్లో విచ్చలవిడిగా నడిచే హుక్కాసెంటర్లకు టీనేజర్లు బానిసలవుతున్నారు. వీరు చాలా చోట్ల అక్రమంగా నడిచే హుక్కా సెంటర్లపై జరిగే పోలీసు దాడుల్లో పట్టుబడుతున్న టీనేజర్లు తల్లిదండ్రులకు తలనొప్పిగా పరిణమిస్తున్నారు. * సిగరెట్లు, బీడీలు, చుట్టలు వంటి వాటి నుంచి వెలువడే పొగ వల్ల పర్యావరణం దెబ్బతిని, వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ‘పొగ’బడితే... ప్రాణాంతకమే ‘పొగ’ నిర్మూలన కోసం ఎందరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పొగతాగే అలవాటు కారణంగా ఏటా దాదాపు 60 లక్షల మంది మరణిస్తున్నారు. వారిలో సుమారు 10 లక్షల మంది భారతీయులు ఉంటుండటం ఆందోళన కలిగించే అంశం. నేరుగా పొగతాగకపోయినా, ఇంటా బయటా ఇతరులు వదిలే పొగ పీల్చడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మరో 6 లక్షల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంతేకాదు, పొగరాయుళ్ల బాధ్యతారాహిత్యం కారణంగా గర్భస్థ శిశువులకు సైతం హాని కలుగుతోంది. ‘పొగ’ ప్రభావానికి గురై పుట్టిన పిల్లలు రకరకాల శారీరక, మానసిక రుగ్మతలకు లోనవుతున్నారు. కొన్ని వెనుకబడిన దేశాల్లో పొగాకు తోటల్లో పనుల కోసం పిల్లలను వినియోగిస్తున్నారు. పచ్చి పొగాకును ఎక్కువసేపు చేతులతో పట్టుకోవాల్సి రావడంతో అన్నెంపున్నెం ఎరుగని పిల్లలు ‘గ్రీన్ టొబాకో సిక్నెస్’కు గురవుతున్నారు. దీని ఫలితంగా ఊపిరితిత్తులు, జీర్ణాశయం, గుండె, నాడీవ్యవస్థ, చర్మం దెబ్బతిని బలహీనంగా మారుతున్నారు. వైద్య చికిత్స అందని పరిస్థితుల్లో కొందరు చిన్న వయసులోనే కన్నుమూస్తున్నారు. పొగ మానుకోవాలంటే..? పొగరాయుళ్లలో దాదాపు సగం మందికి ఆ అలవాటును మానేయాలనే ఉంటుంది. అయితే, పొగాకులోని నికోటిన్ ప్రభావానికి బానిసలుగా మారడం వల్ల అంత తేలికగా అలవాటును వదులుకోలేరు. ‘పొగ’ను వదులుకోవడం కష్టం కావచ్చేమో గానీ, అసాధ్యం మాత్రం కాదని నిపుణులు చెబుతున్నారు. చిత్తశుద్ధితో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పూర్తిగా ఈ అలవాటు నుంచి బయటపడవచ్చని అంటున్నారు. వారు చెబుతున్న జాగ్రత్తలు ఇవీ... * సిగరెట్‌ను మానేయడానికి మిమ్మల్ని బాగా ప్రభావితం చేయగల బలమైన కారణాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు పరోక్ష పొగ నుంచి మీ కుటుంబ సభ్యులను రక్షించడం, మరింత యవ్వనంగా కనిపించడం, క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవడం వంటి కారణాలు. * మీ మెదడు నికోటిన్ ప్రభావానికి బాగా అలవాటు పడే ఉంటుంది. దాని నుంచి ఎలాగైనా బయటపడాలని బలంగా తీర్మానించుకోండి. అందుకు మానసికంగా సంసిద్ధులవండి. * పొగతాగడం మానేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు చెప్పి, ఈ విషయంలో వారి సహాయ సహకారాలను కోరండి. * మానేయడం వల్ల తలనొప్పి, భావోద్వేగాల్లో మార్పులు వంటి ఇబ్బందులు తలెత్తినా కంగారు పడకండి. పదేపదే సిగరెట్ కోసం నాలుక పీకుతున్నా దాని నుంచి మనసు మళ్లించే ప్రయత్నాలు చేయండి. అప్పటికీ సాధ్యం కాకుంటే, మానసిక వైద్యులను సంప్రదించండి. * ‘పొగ’ నుంచి మనసు మళ్లించుకోవడానికి మీకు ఇష్టమైన వ్యాపకాన్ని ఏర్పరచుకోండి. ఉదాహరణకు సంగీతం, పుస్తక పఠనం, వ్యాయామం, ట్రెక్కింగ్ వంటివి ప్రయత్నించండి. * ‘పొగ’ నుంచి మనసు మళ్లించే మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సలహాపై వాటిని క్రమం తప్పకుండా వాడి, ఈ అలవాటు నుంచి విజయవంతంగా బయటపడండి. * పొగతాగే అలవాటును మానేసే ప్రయత్నంలో ఒకటికి రెండుసార్లు విఫలమైనా మరేమీ బాధపడకండి. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉండండి. తప్పకుండా మీ ప్రయత్నం ఫలిస్తుంది. ‘పొగ’ మానేసిన సెలిబ్రిటీలు పొగతాగడం వల్ల తలెత్తే అనర్థాలపై డబ్ల్యూహెచ్ఓ, ప్రభుత్వాలు సాగిస్తున్న ప్రచారానికి పలువురు సెలిబ్రిటీలు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఒకప్పుడు గుప్పుగప్పుమంటూ సిగరెట్లను తెగ తగలేసిన పలువురు సెలిబ్రిటీలు విజయవంతంగా ఈ అలవాటు నుంచి బయటపడ్డారు. అలా ‘పొగ’ మానేసిన సెలిబ్రిటీలలో కొందరు... సల్మాన్ ఖాన్: ఇదివరకు విరివిగానే సిగరెట్లు తాగేవాడు. కొన్నేళ్ల కిందట నరాల సమస్య మొదలవడంతో ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాడు. వైద్యుల సూచన మేరకు శక్తివంచన లేకుండా ప్రయత్నించి, ఈ అలవాటును మానేశాడు. మహేష్‌బాబు: కొన్నేళ్ల కిందటి వరకు చైన్స్మోకర్గా ఉండేవాడు. భార్య నమ్రత కానుకగా ఇచ్చిన పుస్తకం ‘ద ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్’ చదివిన తర్వాత సిగరెట్ అలవాటును పూర్తిగా మానేశాడు. తన సినిమాల్లో ‘పొగ’ దృశ్యాలు లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆమిర్ ఖాన్: ఇదివరకు దమ్ముకొడుతూ బహిరంగంగానే కనిపించేవాడు. సిగరెట్లు తాగొద్దంటూ పిల్లలు జునియాద్, ఇరా పోరు పెట్టడంతో చాలావరకు సిగరెట్లను బాగా తగ్గించుకున్నాడు. ఐదేళ్ల కిందట చిన్న కొడుకు ఆజాద్ పుట్టిన తర్వాత అలవాటును పూర్తిగా మానేశాడు. సైఫ్ అలీఖాన్: ఒకప్పుడు విచ్చలవిడిగా సిగరెట్లు కాల్చేవాడు. ఐదేళ్ల కిందట గుండెలో అవరోధం ఏర్పడి గుండెపోటు వచ్చినంత పనైంది. వైద్యులు హెచ్చరించడంతో అలవాటుకు దూరమయ్యాడు. ఇప్పుడు పొగాకు వ్యతిరేక ప్రచారంలో క్రియాశీలంగా పాల్గొంటున్నాడు. ఆర్థిక రంగానికి ‘పొగ’ పొగాకు వాడకం వల్ల ఆర్థిక రంగంపై కూడా పెనుభారం పడుతోంది. పొగాకు వల్ల తలెత్తే వ్యాధులకు గురైన వారి ఆరోగ్య సేవల కోసం ప్రభుత్వాలు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. మరోవైపు పొగతాగే అలవాటు ఉన్నవారి కారణంగా విలువైన పనిగంటలు వృథా కావడంతో ఉత్పాదకత తగ్గిపోతోంది. * పొగాకు వాడకం వల్ల వాటిల్లే అన్ని రకాల ఖర్చులనూ, నష్టాలను కలుపుకొంటే ప్రపంచ ఆర్థికరంగంపై ఏటా 50 వేల కోట్ల డాలర్ల (రూ.33.69 లక్షల కోట్లు) భారం పడుతోంది. * ఇందులో పొగాకు వాడకం వల్ల తలెత్తే వ్యాధుల చికిత్స కోసం ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చే చాలా ఎక్కువ. ఇది కాకుండా పొగాకు వాడకం వల్ల సంభవిస్తున్న అకాల మరణాల కారణంగా చాలా దేశాలు విలువైన మానవ వనరులను అర్ధంతరంగానే కోల్పోతున్నాయి. * ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవించే అగ్నిప్రమాదాల్లో దాదాపు 10 శాతం ప్రమాదాలకు సిగరెట్లు, బీడీలు వంటి పొగచుట్టలే కారణం. ఈ ప్రమాదాల వల్ల సంభవిస్తున్న నష్టం 2700 కోట్ల డాలర్లు (రూ.1.81 లక్షల కోట్లు) ఉంటుందని ప్రపంచబ్యాంకు అంచనా. - పన్యాల జగన్నాథదాసు పొగ మానేస్తే... లాభాలు నెల తర్వాత: చర్మం కాంతిమంతంగా మారుతుంది. 3 నెలల తర్వాత: ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది ఏడాది తర్వాత: రోజుకు ఒక ప్యాకెట్ చొప్పున వాడే వారికైతే రూ.36,500 మిగులుతాయి. గుండెజబ్బులు వచ్చే అవకాశాలు సగానికి సగం తగ్గిపోతాయి 5-15 ఏళ్ల తర్వాత: పక్షవాతం ముప్పు చాలావరకు తగ్గిపోతుంది. పూర్తిగా పొగతాగని వారితో సమానంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పొగ తాగితే నష్టాలు పొగ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు అర్ధంతరంగానే ఆయువు తీరిపోయేలా చేస్తాయని తెలిసిందే. పొగ తాగడం వల్ల తక్షణ ఆనందం కలిగినా, కాలం గడుస్తున్న కొద్దీ ఈ అలవాటు వల్ల చాలా అనర్థాలు తప్పవు. పొగ తాగడం వల్ల కలిగే అనర్థాలు ఇవీ... 8 గంటల తర్వాత: రక్తంలోని కార్బన్ మోనాక్సైడ్ బయటకు పోతుంది వారం రోజుల తర్వాత: నోటికి రుచులు, ముక్కుకు వాసనలు మరింత మెరుగ్గా తెలుస్తాయి. శరీరంలో పేరుకుపోయిన నికోటిన్ చాలా వరకు బయటకు పోతుంది -
త్వరలో ఐటీసీ సిగరెట్ల ఉత్పత్తి పునఃప్రారంభం!
న్యూఢిల్లీ: సిగరెట్ల ఉత్పత్తిని త్వరలో పునఃప్రారంభిస్తున్నట్లు ఐటీసీ ప్రకటించింది. పొగతాగడం హానికరమని సూచిస్తూ... సిగరెట్ కవర్‌పై 85 శాతం మేర ‘హెచ్చరిక చిత్రం’ ముద్రించాలన్న కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ... టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (టీఐఐ) నేతృత్వంలోని పలు కంపెనీలు ఏప్రిల్ 1 నుంచీ తమ ఉత్పత్తులను నిలిపివేశాయి. టీఐఐలో ఐటీసీసహా గాడ్ఫ్రే ఫిలిప్స్, వీఎస్టీ వంటివి సభ్యత్వ సంస్థలుగా ఉన్నాయి. అసలు ఈ నిబంధనల్లో స్పష్టతలేదని కూడా ఆయా కంపెనీలు పేర్కొన్నాయి. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఐటీసీ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తమకు అనుకూలంగా రూలింగ్ ఇచ్చినందువల్ల త్వరలో ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్లు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)కి సమర్పించిన ఒక ఫైలిం గ్లో తెలిపింది. కంపెనీకి ఐదు ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. అయితే ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమయ్యేదీ స్పష్టమైన తేదీని తెలపలేదు. కోర్టు ఉత్తర్వుల పూర్తి వివరాలు తెలియరాలేదు. -
సిగరెట్టు తాగొద్దన్నందుకు..
మామను హత్య చేసిన అల్లుడు బెంగళూరు (బనశంకరి) : ఇంటిలో సిగిరెట్ తాగొద్దని చెప్పిన పాపానికి మామను అల్లుడు హత్య చేసిన సంఘటన యశవంతపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. బీకే.నగర 17 వక్రాస్లో నివాసముంటున్న నాగరాజ్ (65) టైలర్ . ఇతడి కుమార్తెను సత్యనారాయణకు ఇచ్చి ఏడేళ్ల క్రితం వివాహం చేశాడు. దంపతులిద్దరు మామ నాగరాజ్ ఇంటిలోనే ఉంటున్నారు. అనారోగ్యంతో ఉన్న సత్యనారాయణ ఇంటి వద్దనే ఉంటున్నారు. భార్య గార్మెంట్స్‌లో పనిచేస్తోంది. ఆదివారం రాత్రి సత్యనారాయణ ఇంటిలో సిగిరెట్ తాగుతుండగా గమనించిన మామ నాగరాజ్ సిగిరెట్ తాగొద్దని అల్లుడికి హితవు పలికారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఇదే విషయమై సోమవారం సత్యనారాయణ భార్యతో గొడవ పడింది. అనంతరం భార్య విధులకు వెళ్లగా కుమార్తె కూడా పాఠశాలకు వెళ్లింది. దీంతో మరోసారి మామ, అల్లుడు ఘర్షణపడ్డారు. తీవ్ర ఆగ్రహానికి గురైన సత్యనారాయణ చాకుతో మామ నటరాజ్‌పై దాడి చేశాడు. విషయం గమనించి స్థానికులు నాగరాజును హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. పోలీసులు నిందితుడని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
అమెరికా ఆడాళ్ల తరువాత మనోళ్లే!
ఢిల్లీ: దేశంలో గత సంవత్సరంతో పోల్చితే సిగరెట్ల వినియోగం బాగానే తగ్గింది. అయితే మహిళా స్మోకర్ల సంఖ్య మాత్రం తెగ పెరిగిపోయింది. భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ పార్లమెంట్లో తెలిపిన తాజా గణాంకాల్లో సిగరెట్ల వినియోగం, ఉత్పత్తి వివరాలను వెల్లడించింది. 2013-14 సంవత్సరంలో భారత్‌లో ఊదేసిన సిగరెట్ల సంఖ్య 10,180 కోట్లుగా ఉంది. అయితే 2014-15 సంవత్సరానికి ఈ సంఖ్య 9,320 కోట్లకు తగ్గడం కొంతవరకు ఊరట కలిగించే అంశం. డిమాండ్ తగ్గడంతో సిగరెట్ల తయారీ కూడా తగ్గినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. 2013-14 సంవత్సరంలో ఇండియాలో 11,010 కోట్ల సిగరెట్లు ఉత్పత్తి కాగా, 2014-15 సంవత్సరానికి ఉత్పత్తి 10,530 కోట్లకు తగ్గింది. అయితే.. సిగరెట్లను కాల్చే ఆడాళ్ల సంఖ్య మాత్రం మన దేశంలో బాగా పెరిగింది. గ్లోబల్ టొబాకో స్టడీ తెలిపిన వివరాల ప్రకారం అమెరికా తర్వాత అత్యధికంగా సిగరెట్లు తాగుతున్న ఆడాళ్లు మనోళ్లే కావడం విశేషం.1980 నాటికి భారత్‌లో సిగరెట్లు తాగుతున్న మహిళల సంఖ్య 53 లక్షల మంది ఉండగా, 2012 నాటికి వీరి సంఖ్య 1.25 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ఈ పెరుగుదల ఆందోళనకరమని యాంటీ టొబాకో యాక్టివిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. -
సిగరెట్ ఇవ్వలేదని అన్నని చంపేశాడు
న్యూఢిల్లీ: అన్నదమ్ముల మధ్య చోటుచేసుకున్న స్వల్ప వివాదంలో అన్న దారుణహత్యకు గురికావడం ఢిల్లీలో కలకలం రేపింది. కంటికి రెప్పలా పెంచుకుంటున్న బిడ్డల్లో ఒకరు శాశ్వతంగా దూరంకావడం, మరొకరు నేరస్తుడిగా మిగలడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. సిగరెట్ ఇవ్వలేదన్న కోపంతో క్షణికావేశంలో అన్నపై దాడి చేశాడో బాలుడు. తప్పు తెలుసుకొనేలోపే ఘోరం జరిగిపోయింది. సిగరెట్ తాగుతున్న అన్న(18) ను చూసిన తమ్ముడు (16).. తనకూ ఒకటి ఇమ్మని అడిగాడు. దీనికి అన్న నిరాకరించాడు. ఆగ్రహానికి గురైన తమ్ముడు ఈ విషయాన్ని అందరికీ చెబుతానని బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో పక్కనే ఉన్న ఫ్రయింగ్ ప్యాన్ తీసుకొని అన్నపై దాడిచేసి తలపై తీవ్రంగా కొట్టాడు. రక్తమోడుతున్న అతడిని అలాగే వదిలేసి పారిపోయాడు. సాయంత్రం ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉన్న పెద్దకొడుకు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. అయితే కుమారుడు పడి ఉన్న తీరు చూసి, దొంగతనం జరిగిందనే అనుమానంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. అయితే చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి సారీ చెబుదామని చిన్నకొడుకు ఇంటికి చేరాడు. అప్పటికే అన్న తిరిగిరాని లోకాలకు తరలిపోయాడని తెలిసి బావురుమన్నాడు. జరిగిన నేరాన్ని పోలీసుల ముందు అంగీకరించాడు. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని జువెనైల్ హోంకు తరలించారు. -
సినిమాకి వెళ్తేనే చెడిపోతానా?!
నేను, ఒకబ్బాయి ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నాం. కానీ అతనికి సిగరెట్ తాగే అలవాటుందని ఈ మధ్యే తెలిసింది. నాకు స్మోక్ చేసేవాళ్లంటే అసహ్యం. అందుకే అతనికి ‘నో’ చెప్పాను. కానీ అతను మేమిద్దరం కలిసి దిగిన ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నన్ను నేను రక్షించు కోవడానికి మార్గం చూపించండి. - ఓ సోదరి, వీరవాసరం మీరిద్దరూ దిగిన ఫొటోలు ఎలాం టివి? బ్లాక్మెయిల్ చేసే భంగిమలతో ఫొటోలు దిగేవరకూ తనకి సిగరెట్ తాగే అలవాటు ఉందన్న విషయం మీకు తెలియకుండా మేనేజ్ చేసినందుకు అతణ్ని అభినందించాలి. అయితే అతడు ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో మీరు వివరించలేదు. సాధారణంగా ఇలాంటి పనులు చేసేవాళ్లు ముఖంపై యాసిడ్ పోస్తామనో, దారి కాచి కత్తులతో పొడుస్తామనో భయపెడతారు. మీలాంటి అమ్మాయిలు భయపడుతూంటారు. కానీ మీరు ఎదురు తిరిగితే... మీరెంత భయ పడుతున్నారో అవతలివాళ్లూ అంతే భయ పడతారు. కాబట్టి వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. ఆ ధైర్యం లేకపోతే మీ ఇంట్లోని పెద్దవాళ్లతో ఉన్నదున్నట్టు చెప్పండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని రక్షించే ప్రయత్నం చేస్తారు. మీరిప్పుడు అన్నీ దాచి మరొకరిని పెళ్లి చేసుకుంటే, ఆ తర్వాత ఇలాంటి విషయాలు బయటకు పొక్కితే... మీరు మీ జీవితాన్నే కోల్పో వలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వెంటనే ఇంట్లో వాళ్లకి చెప్పండి. మీ పెద్ద వాళ్లకి విషయం తెలిసిందని గ్రహిస్తే, మీ మాజీ స్నేహితుడు భయపడతాడు. మళ్లీ చెప్తున్నాను... మనం భయపడినంతవరకే బ్లాక్ మెయిలర్స్ భయపెడతారు. అయితే మీరు ఎదురు తిరగడం వల్ల మిమ్మల్నొది లేసి బలహీన వ్యక్తిత్వం ఉన్న మరోవ్యక్తిని లోబర్చుకోడానికి ప్రయత్నించొచ్చు. కాబట్టి ధైర్యం చేసి పోలీసు రిపోర్ట్ ఇస్తే మీలాంటి చాలా మంది అమ్మాయిల్ని రక్షించినవారవుతారు. నేను పీజీ చేస్తున్నాను. చదువులో ఎప్పుడూ ఫస్టే. కానీ ఈ మధ్య మనసు వేరే విషయాల మీదకు పోతోంది. నా ఫ్రెండ్స్ అంతా వారాంతాల్లో సినిమాలకి, షికార్లకి వెళ్తుంటారు. నాకది ఎప్పుడూ అలవాటు లేదు. వీకెండ్స్ నా ఫ్యామిలీతోనే గడుపుతాను. కానీ ఈ మధ్య నాక్కూడా ఫ్రెండ్స్‌తో వెళ్లాలనిపిస్తోంది. ఆ విషయం అమ్మతో చెబితే ఎప్పుడూ లేనిది ఇదేం అలవాటు అంటోంది. నాన్నయితే- అలాంటివన్నీ చేస్తే చదువు అటకెక్కుతుంది అని సీరియస్ అవుతున్నారు. సరదాగా సినిమాకి వెళ్తేనే నేను చెడిపోతానా సర్? - సాగర్, రాజమండ్రి పీజీ చేస్తున్న మీరు... స్నేహితులతో కలిసి ఆదివారం సినిమాకి వెళ్లడంలో తప్పేమీ లేదు. మీ అమ్మగారు భావించినట్టు అదేమీ దుర్మార్గమైన అలవాటు కాదు. జీవితం కొంచెం విస్తృతమవ్వాలంటే ఇలాంటి ఆకర్షణలు కొద్దిగానైనా ఉండాలి. అయితే ఇవే ఆలోచనలు మిమ్మల్ని సదా వెంటాడుతూ ఉంటే మాత్రం, అది మీ చదువు మీద నెగిటివ్ ప్రభావం చూపుతుంది. అలా జరుగుతుంటే కనుక ఈ కొత్త అలవాట్లు చేసుకోవద్దు. మీరిప్పటికే పీజీ చేస్తున్నారు. ఒకట్రెండు సంవత్సరాల్లో చదువు పూర్తయిపోతుంది. ఆ తర్వాత స్నేహితులతో ఎలా గడిపినా భవిష్యత్తుకి అడ్డు రాదు. అయినా వారాంత సినిమాలు కూడా మానేసి మీరు పీజీ వరకూ ఫస్ట్ క్లాస్‌లో పాసవుతూ వచ్చారు అంటే మీ మనస్తత్వం కొద్దిగా అర్థమవుతోంది. కాబట్టి చదువు ఆఖరి దశలో కొత్త ప్రయోగాలు చేయకండి. ఒకవేళ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలను అని నమ్మకం ఉంటే, అప్పుడు మీకు నచ్చినట్టుగా స్నేహితులతో తిరగండి. నాకు ఈ మధ్యనే పెళ్లయ్యింది. నా భార్యతో నాకే సమస్యా లేదు. కానీ మా అత్తమామలు మాత్రం ప్రతి దానిలోనూ కల్పించు కుంటున్నారు. నేనేం మాట్లాడినా అందులో తప్పులు వెతుకుతారు. నా ఉద్దేశం మంచిదేనా కాదా అని పరీక్షిస్తూ ఉంటారు. ప్రతిదాన్నీ అపార్థమే చేసుకుంటారు. పైగా వాళ్ల అభిప్రాయాల్ని నా భార్యమీద రుద్దే ప్రయత్నం చేస్తుంటారు. నేను నా మాట తీరుతో నా ఆఫీసులో వాళ్లని, బయటివాళ్లని అందరినీ ఆకట్టుకున్నాను. కానీ మా అత్తమామల ఉద్దేశంలో నాకసలు మాట్లాడమే రాదు. వాళ్లిలా కామెంట్లు చేయడం వల్ల నా కాన్ఫిడెన్స్ పోతోంది. నన్నేం చేయమంటారు? - రవికుమార్, విజయనగరం మీ జీవితంలో మీ అత్తమామల చొరబాటు అంతగా ఎందుకు ఉంటోంది? మీరు ఇల్లరికం ఉంటున్నారా? సాధారణంగా కూతురి మీద తల్లి తన అభిప్రాయాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. దానివల్ల అల్లుళ్ల కంప్లయింట్లు ఈ విధంగానే ఉంటాయి. మీ ఉత్తరాన్ని బట్టి మీ వ్యక్తిత్వంలోనే కొద్దిగా లోపం ఉన్నట్లు అనిపిస్తోంది. ముందు మీరు ఇండివిడ్యువాలిటీని పెంచుకోండి. ముఖ్యంగా ‘అవతలివాళ్ల కామెంట్ల వల్ల మీ మీద మీకు నమ్మకం తగ్గిపోవడం’ అంత మంచి పరిణామం కాదు. కాబట్టి మీ అత్తమామల పట్ల మీ ఫిర్యాదులన్నిటి గురించీ మీ భార్యతో విపులంగా మాట్లాడండి. ఆమెను తన తల్లితో మాట్లాడమని చెప్పండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
సిగరెట్లు తీసుకురాలేదని....
-
సిగరెట్లు తీసుకురాలేదని....
పట్నంబజారు (గుంటూరు): చెప్పిన మాట వినలేదని బీటెక్ విద్యార్థులు పదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఘటన గుంటూరు నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయంపై బాధితులు సోమవారం అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి ఫిర్యాదు చేశారు. బాధితుడు మహ్మద్ అబ్దుల్ ముషారఫ్ తండ్రి తఖీ తెలిపిన వివరాల మేరకు.. శ్యామలానగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ముషారఫ్ బాలకుటీర్‌లో పదో తరగతి చదువుతున్నాడు. సమీప ప్రాంతాల్లో ఉండే బీటెక్, ఇంటర్మీడియట్ విద్యార్థులు శ్యామలానగర్ 8వలైను వద్ద నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో కూర్చుని అటుగా వెళ్లే విద్యార్థులను పిలిచి అల్లరి చేస్తుంటారు. కొద్ది రోజుల కిందట ముషారఫ్ సాయంత్రం ట్యూషన్‌కు వెళ్తున్న సమయంలో అక్కడ కూర్చున్న విద్యార్థులు అతడిని పిలిచి సిగరెట్లు తీసుకు రమ్మని చెప్పగా ట్యూషన్‌కు సమయం అవుతోందని ముషారఫ్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీనిపై ఆగ్రహించిన బీటెక్ విద్యార్థులు ఈ నెల 13న ముషారఫ్ స్నేహితుడు పృధ్వీన్ ద్వారా ఇంట్లో ఉన్న ముషారఫ్‌ను బయటకు తీసుకొచ్చారు. తాము చెబితే వినవా అంటూ ఉదయ్, శివ, వినయ్ అనే యువకులు ఇష్టానుసారంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. అనంతరం వారే ముషారఫ్‌ను పట్టాభిపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి అక్కడి సిబ్బందితో నగరంలో ఉన్న బాధితుడి నివాసానికి ఫోన్ చేయించారు. విషయం తెలుసుకున్న ముషారఫ్ పెద్దనాన్న అక్కడకు చేరుకుని హైదరాబాద్‌లో ఉన్న తండ్రి తఖీకి సమాచారమందించాడు. కంటికి తీవ్ర గాయమై లోపలి పొరలు పూర్తిగా దెబ్బ తినటంతో ఆపరేషన్ చేశారని బాధితులు తెలిపారు. -
ఈ-సిగరెట్ అంతే డేంజర్..!
మా పాపకి నాలుగేళ్లు. తరచు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతోంది. ఆయుర్వేద మందుల్ని తెలియజేయగలరు. - పూర్ణిమ, హైదరాబాద్ ఆడవాళ్లలో జననాంగ ప్రాంతంలోనే మూత్రం బయటకు వచ్చే మార్గం ఉంటుంది. పైగా చిన్నపిల్లలో ఈ సమస్య ఎక్కువ. అక్కడ పరిశుభ్రత లోపిస్తే, ఈ వికారం కలుగుతుంది. దీనిని ఆయుర్వేదంలో ‘మూత్రదాహం లేదా మూత్రనాళపాకం’ అంటారు. ఈ వ్యాధిలో మూత్రం మాటిమాటికీ రావడం, స్వల్పంగా రావడం, మంట మొదలైన లక్షణాలుంటాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గేవరకూ ఆహారంలో పులుపు, కారం తక్కువగా తినాలి. నీళ్లు. బార్లీ నీళ్లు, ఇతర ద్రవపదార్థాలు ఎక్కువగా తాగాలి. ఔషధం: చంద్రప్రభావటి మాత్రలు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి; చందనాసవ లేదా అరవిందాసవ ద్రావకం రెండు చెంచాల మందుకి రెండు చెంచాల నీళ్లు కలిపి మూడుపూటలా తాగించాలి. గమనిక: ఈ సమస్య తగ్గిపోయిన తర్వాత, అదే మందుల్ని సగం మోతాదులో ఒక నెలపాటు వాడితే మూత్రాశయానికి వ్యాధి క్షమత్వ శక్తి పెంపొందుతుంది. ఆయుర్వేదం రీత్యా ‘తేనె’ ప్రాశస్త్యాన్ని వివరించండి. - రేణుక ఉపాధ్యాయుల, బెంగళూరు ఆయుర్వేదంలో తేనె గురించి చాలా సుదీర్ఘంగా వివరించారు. ఇవి కొన్ని ముఖ్యాంశాలు మాత్రమే. మకరందాన్ని అందించే పుష్పాన్ని బట్టి, దాన్ని సేకరించే తేనెటీగలలో గల రకాన్ని బట్టి గూడా తేనె గుణ ధర్మాలు మారుతుంటాయి. సంస్కృతంలో తేనెను ‘మధు’ లేక ‘క్షౌద్రం’ అంటారు. స్వచ్ఛమైన తేనెలో మధుర కషాయ రసాలు (తీపి, వగరు) మిళితమై ఉంటాయి. దీన్ని సేవించిన కొద్ది నిమిషాలకే నీరసం తగ్గిపోతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుతుంది. అందుకే నవజాత శిశువులకు కొద్దిగా తేనెను, ఆవునెయ్యితో కలిపి ఇస్తారు. గురు, రూక్ష, కషాయ గుణాలుండటం వల్ల తేనెను చాలా స్వల్ప ప్రమాణంలోనే సేవించాలి. కంటికి మంచిది. శరీరంలోని కొవ్వుని కరిగిస్తుంది. కఫాన్ని హరిస్తుంది. వాంతులు, నీళ్ల విరేచనాలు, దగ్గు, ఆయాసాలను నయం చేస్తుంది. దప్పిక, తేపులు తగ్గుతాయి. రక్తస్రావాన్ని అరికడుతుంది. విషహరం. గాయాలు తగ్గడానికీ, ఇన్ఫెక్షన్లు తగ్గటానికి తేనెను కడుపులోకి సేవించడమే కాకుండా, బయట పూతగా కూడా వాడవచ్చు. గమనిక: తేనెను అధికమాత్రలో సేవిస్తే అజీర్ణం కల్గించి, ప్రమాదాలకు దారితీస్తుంది. తేనెను వేడిచేయకూడదు. మధుమేహ రోగులకు ‘తీపి’ పదార్థాలు తినడంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరమో, అవి తేనెకూ వర్తిస్తాయి. తేనె సేకరించిన తర్వాత ఒక సంవత్సరం పిమ్మట వాడటం అత్యుత్తమమని శాస్త్రోక్తం. నా వయసు 45 ఏళ్లు. విపరీతంగా సిగరెట్లు తాగుతాను. ఎంత ప్రయత్నించినా చైన్స్మోకింగ్ మానడం సాధ్యం కావడం లేదు. స్నేహితులు ఈ-సిగరెట్‌ను ప్రయత్నించమని చెబుతున్నారు. ఈ-సిగరెట్ (ఎలక్ట్రానిక్ సిగరెట్) ఉపయోగించడం ద్వారా సిగరెట్ మానేయవచ్చా? ఇది సురక్షితమేనా? - దేవరాజు, హైదరాబాద్ ఎలక్ట్రానిక్ సిగరెట్లు (ఈ-సిగరెట్స్) అన్నీ ఒకేలా పని చేస్తాయి. అందులో ఒక బ్యాటరీ ఉంటుంది. దాని కాట్రిడ్జ్ (మందు నింపే బోలు ప్రదేశం)లో నికోటిన్ ఉంటుంది. మామూలు సిగరెట్‌కూ, ఈ-సిగరెట్‌కూ తేడా ఒక్కటే. ఈ-సిగరెట్లో పొగాకు ఉండదు. అంతే. అయితే కేవలం పొగాకు మాత్రమే గాక... సాధారణ సిగరెట్లో ప్రమాదకరమైన రసాయనాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండి, అవన్నీ ఆరోగ్యానికి చేటు చేస్తాయని నిరూపితమైంది. అదే పరిణామంలో కాకపోయినా ఈ-సిగరెట్‌లోనూ దాదాపు సాధారణ సిగరెట్లో ఉండే ప్రమాదకరమైన రసాయనాల్లో కొన్నైనా ఉంటాయి. నికోటిన్ అనే పదార్థం మామూలు సిగరెట్లు, ఈ-సిగరెట్లు... ఈ రెండింటిలోనూ ఉంటుంది. తనకు బానిస అయ్యేలా చేసుకోవడానికి నికోటిన్ ప్రతీతి. మందుల భద్రత విషయంలో ప్రామాణికమైన అమెరికాలోని అత్యున్నత సంస్థ ఎఫ్‌డీఏ విశ్లేషణల ప్రకారం... ఈ-సిగరెట్‌లోనూ గుర్తించగల స్థాయిలో క్యాన్సర్ కారకాలూ, విషపూరిత రసాయనాలూ ఉన్నాయి. ఈ-సిగరెట్లో కాట్రిడ్జ్‌లో డీ-ఇథైల్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం, నైట్రోజమైన్స్ అనే క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. పైగా ఎన్నో రకాల కాలుష్యాలు సైతం ఈ-సిగరెట్ ద్వారా శరీరంలోకి వెళ్తుంటాయి. ఈ పొగను లోపలికి పీల్చినప్పుడు అది మామూలు సిగరెట్లలాగే గొంతు, ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక మంట, ఇన్ఫెక్షన్లను (క్రానిక్ ఇన్ఫ్లమేషన్ను) కలిగిస్తుంది. ఇలా పొగ పీల్చడం దీర్ఘకాలం పాటు కొనసాగితే అది ఈ-సిగరెట్ పొగ అయినా సరే... కొన్నాళ్ల తర్వాత బ్రాంకైటిస్, ఎంఫసిమా, గుండెజబ్బుల వంటి వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి ఈ-సిగరెట్ మామూలు సిగరెట్ కంటే చాలా సురక్షితమైనదేమీ కాదు. పైగా ఏ సిగరెట్ అయినప్పటికీ అందులోని పొగ వల్ల సిరలు, ధమనులు చాలా ఎక్కువగా ధ్వంసమవుతాయి. ఈ పరిణామమే ఆ తర్వాత గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇక ఈ-సిగరెట్‌లోని పొగలో మామూలు సిగరెట్లో పోలిస్తే రసాయనాల సంఖ్య కొంచెం తగ్గితే తగ్గుతుండవచ్చు. అంతమాత్రాన అది మామూలు సిగరెట్ కంటే సురక్షితం అని కచ్చితంగా చెప్పడానికి ఆస్కారం లేదు. దీర్ఘకాలంలో మామూలు సిగరెట్‌తో వచ్చే దాదాపు అన్ని రకాల దుష్పరిణామాలూ ఈ-సిగరెట్‌తోనూ వస్తాయి. ఈ-సిగరెట్‌లోనూ ఉండేది నికోటినే కాబట్టి దానికి బానిసై మళ్లీ మీరు ఈ-సిగరెట్‌కు అలవాటు పడతారు. మీరు సిగరెట్ వదిలేయదలిస్తే... ఒక్కసారిగా వదిలేయడం. మానేయగానే కాస్త చిరాకు, కోపం, నిస్పృహ, అస్థిమితంగా ఉండటం వంటి కొన్ని తాత్కాలిక లక్షణాలు కనిపించినా, దీర్ఘకాలంలో సిగరెట్ మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ. మా పాప వయసు ఏడేళ్లు. కాస్త వర్షం వచ్చే వాతావరణం ఉంటే చాలు జలుబు ఎక్కువగా వస్తుంది. ఇలాంటి వాతావరణంలో రాత్రుళ్లు ఊపిరి సరిగ్గా ఆడటం లేదని చెబుతూ ఇబ్బంది పడుతోంది. మా పాప సమస్యకు సరైన పరిష్కారం సూచించండి. - శ్రీరేఖ, మార్కాపురం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు ఉన్న కండిషన్‌ను రైనైటిస్‌గా చెప్పవచ్చు. రైనైటిస్ అనేది ముక్కు లోపలి పొర (నేసల్ మ్యూకోజా) ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, కొద్దిమందిలో ముక్కు లోపల దురద, విపరీతమైన తుమ్ములు వంటి ఇతర లక్షణాలు కూడా రైనైటిస్లో కనిపిస్తాయి. ఇటీవల ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొద్దిమందిలో ఇది సైనసైటిస్, ఆస్తమాతో పాటు కనిపించవచ్చు. కొంతమందిలో ఎప్పుడూ (పెరిన్నియల్గా) కనిపించే ఈ సమస్య మరికొందరిలో అప్పుడప్పుడు (సీజనల్) గా కనిపిస్తుంటుంది. ఇది అలర్జీ వల్లనే కాకుండా ఇన్ఫెక్షన్స్కు సంబంధం లేని ఇతర సమస్యలు (నాన్ఇన్ఫెక్షియస్ కారణాల వల్ల కూడా) రావచ్చు. అలర్జెన్స్ వల్లనే కాకుండా చల్లటి గాలి, ఎక్సర్సైజ్, వాతావరణంలో మార్పులు, కాలుష్యాలు, ఉద్వేగాలకు లోనుకావడం (ఎమోషనల్ డిస్టర్బెన్సెస్) వల్ల కూడా ఇది వస్తుంది. కొన్ని సందర్భాల్లో హార్మోన్ల సమతౌల్యతలో లోపాల వల్ల కూడా రావచ్చు. ఇక మీ పాప విషయంలో మీరు చెప్పిన అంశాలను బట్టి చూస్తుంటే ఇది ఇడియోపథిక్ అలర్జిక్ రైనైటిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సమస్యలో చాలాసార్లు కారణం తెలుసుకోవడం కష్టం అయినప్పటికీ- కంప్లీట్ హీమోగ్రామ్, ఇమ్యునోగ్లోబ్లులిన్ (ఐజీఈ) లెవెల్స్, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అలర్జెన్స్ పరీక్ష వల్ల కూడా కొంతవరకు కారణాలు తెలుసుకోవచ్చు. దీనికి చికిత్సగా ముక్కులో వేయాల్సిన చుక్కల మందు (సెలైన్ నేసల్ డ్రాప్స్), యాంటీహిస్టమైన్ గ్రూపు మందులు వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే నేసల్ స్టెరాయిడ్స్‌తో చాలావరకు ఉపశమనం ఉంటుంది. ఇక సమస్యను నివారించడం కోసం రైనైటిస్‌ను ప్రేరేపించే ఇతర అంశాలు అంటే... ఫేస్‌పౌడర్, పెయింట్ వంటి ఘాటైన వాసనలు ఉండే పదార్థాలు, పెంపుడు జంతువుల ఒంటి మీద వెంట్రుకలు, దుమ్మూ ధూళి, కాలుష్యాల వంటి వాటికి పాపను దూరంగా ఉంచాలి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. -
ఈ-సిగరెట్లూ అంత సురక్షితం కావు!
కొత్త పరిశోధన చాలామంది తమ పొగతాగే అలవాటును వదులుకునేందుకు ఈ-సిగరెట్ అని పిలిచే ఎలక్ట్రానిక్ సిగరెట్‌ను ఆశ్రయిస్తుంటారు. వాస్తవానికి సిగరెట్లో ఉండే దాదాపు 500 రసాయనాలలో 50కు పైగా క్యాన్సర్ కారకాలు (కార్సినోజెనిక్) కాబట్టి దానికి బదులుగా ఈ-సిగరెట్‌ను తాగితే అందులో సిగరెట్ తాగిన అనుభూతి కలుగుతుంది, కానీ హానికరమైన రసాయనాలు ఉండవనే భావనతో చాలామంది ఈ-సిగరెట్లను ఆశ్రయిస్తుంటారు. అయితే తాజా పరిశోధన ఫలితాలతో తేలిన విషయం ఇంకా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. వాస్తవమైన సిగరెట్లో ఉండే ఫార్మాల్డిహైడ్ అనే హానికరమైన రసాయనం కంటే ఈ-సిగరెట్లో ఇది 15 రెట్లు ఎక్కువని ఒక అధ్యయనంలో తేలింది. ఫార్మాల్డిహైడ్ అనే రసాయనం కూడా కార్సినోజెనికే... అంటే క్యాన్సర్ కారకమే. కాబట్టి సిగరెట్ మానేయాలని అనుకున్నవారు ప్రత్యామ్నాయంగా ఈ-సిగరెట్‌ను ఆశ్రయించడం కంటే పూర్తిగా మానేయడమే మంచిదని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ విషయాలను ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో నమోదయ్యాయి. -
పొగచూరకు... మసిబారకు!!
సిగరెట్ల వల్ల నష్టాలు ఎన్ని రెట్లు అన్నది చెప్పడానికి ఎన్ని సెట్ల ఇంటర్నెట్లు అయినా సరిపోవు.పొగచెట్ల వల్ల ఎన్ని వ్యాధులు కట్లు విప్పుకుంటాయో నమోదు చేయడానికి కంప్యూటర్ బైట్లూ చాలవు.వ్యసనం వదిలిపోకుండా ఉండటానికి పొగాకులోని నికోటిన్ మెదడుపై చేసే మాయలను రాయడానికి ఎన్ని పెన్నులైనా సరిపోవు.అయినా... ఓసారి పొగాకు ఆరోగ్యానికి పెట్టే చికాకును చూస్తే ఎవరైనా దాన్ని వదిలేయాల్సిందే.మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా పొగాకు హెల్త్‌కు కల్పించే చిరాకును తెలుసుకొని, దాన్ని వదిలించుకుంటారనే ఆశతో, ఆశయంతో ఈ కథనం. పొగాకును ఏ రూపంలో తీసుకున్నా అది చేటు. సిగరెట్టు ఆరోగ్యంపై వేటు. చుట్ట చుట్టలు చుట్టుకొని ఉన్న విషం నిండిన పాముల చుట్ట. రోగాల పుట్ట. గుట్కాతో ప్రాణాలు గుటుక్కు. నశ్యం వదిలేయడం అవశ్యం. పొగాకు చేసే చెరుపు గురించి, ఆ వ్యాధులు పుట్టించే వెరపు గురించి అవగాహన ఉన్న ఎవరైనా చెప్పే మాటలివి. ఈ సందర్భంగా పొగాకు హెల్త్‌ను దగా చేసే ఆకు ఎలాగైందో చూద్దాం. ఊపిరితిత్తులకు : పొగ పీల్చగానే నేరుగా అది ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ముక్కు మొదటి అంతస్తు అనుకుంటే గాలిమార్పిడి జరిగే ‘ఆల్వియోలై’ అనే గాలి గది 28వ అంతస్తు. అక్కడ గాలి మార్పిడి... అంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ శరీరానికి అంది, మలినమైన కార్బన్‌డై ఆక్సైడ్ మార్పిడి ‘ఆల్వియోలై’ అనే గాలిగదిలో జరుగుతుంది. కానీ పొగలో ఉండే కార్బన్‌మోనాక్సైడ్, సైనైడ్ వంటి విషపదార్థాల వల్ల ఆ గాలిగది స్వరూపమే మారిపోతుంది. వాస్తవానికి అక్కడ హిమోగ్లోబిన్ అనే వాహకం మీద ఆక్సిజన్ చేరి శరీరంలోని అన్ని కణాలకూ అందాలి. కానీ పొగాకులోని విషపదార్థాల్లో ఉండే కార్బన్‌మోనాక్సైడ్... హీమోగ్లోబిన్‌తో గాఢమైన బంధాన్ని ఏర్పరచుకుంటుంది. దాంతో రక్తంలోని హీమోగ్లోబిన్‌కు ఆక్సిజన్‌ను మోసుకుపోయే సామర్థ్యం తగ్గుతుంది. ఇది ఎలాంటి బంధమంటే చెడు స్నేహాల వల్ల మంచి స్నేహితుడు దూరమయ్యే పరిస్థితి లాంటిది. దీంతో శరీరంలోని అన్ని కణాలూ కార్బన్‌మోనాక్సైడ్‌తో విషపూరితమవుతాయి. ఫలితంగా ఎంఫసిమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ) లాంటి ప్రమాదకరమైన వ్యాధులూ వస్తాయి. ఫలితంగా కొద్దిదూరం కూడా నడవలేని పరిస్థితి. కదిల్తే నీరసం, నడిస్తే ఆయాసం. ఎడతెరిపి లేకుండా వచ్చే విపరీతమైన దగ్గు. పొగాకులో ఉండే ‘ఆక్రోలిన్’ అనే అత్యంత విషపదార్థం సీఓపీడీని కలిగించడమే కాదు... క్యాన్సర్‌కూ కారణమవుతుంది. అంతేకాదు... సిగరెట్ పొగలో ఉండే పాలీసైక్లిక్ అరోమ్యాటిక్ హైడ్రోకార్బన్స్, బెంజోపైరీన్, నైట్రోజమైన్ ఇవన్నీ క్యాన్సర్‌ను కలిగించేవే. ఇక క్యాన్సర్ కారక గుణాలతో పాటూ రేడియో యాక్టివ్ గుణాలున్న సీసం (లెడ్-210), పొలోనియం లాంటివీ పొగలో ఉండి జీవితాన్ని పొగచూరిపోయేలా చేస్తాయి. తల నుంచి కాలిగోటి వరకు పొగాకు వల్ల జరిగే నష్టాలను స్పర్శిస్తూ పోదాం... తల : సిగరెట్‌ను నోట్లో పెట్టుకుని కాల్చే సమయంలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందొక్కటే. సిగరెట్ మండే చివరను అగ్నిపర్వతపు మండే భాగం (బర్నింగ్ ఎండ్), దాని చివరన వెలువడే నుసి అగ్నిపర్వతపు బూడిద అనుకుంటే... ఆ సిగరెట్ వెలువరించే ‘లావా’... బయటివైపునకు కాకుండా శరీరం లోపలి వైపునకు ప్రవహిస్తుందని గుర్తుంచుకోండి. అలా సిగరెట్ వల్ల నోట్లోకి వచ్చే లావా రాళ్లనూ కరిగించుకున్నట్లుగా మన చెంపల లోపలి పొరను దెబ్బతీస్తుంది. మెత్తనైన చిగుర్లను కరిగించివేస్తుంది. అందుకే చిగుర్లు కరిగిపోతాయి కాబట్టి పళ్లు ఎక్కువగా బయటపడతాయి. ఇలా చిగుర్లు కరగడాన్ని ‘జింజివల్ రిసెషన్’అంటారు. పళ్లరంగు మారిపోతుంది. నోటిలోపలి మృదువైన పొరలు దెబ్బతిని పుండ్లలా (మ్యూకోజల్ లీజన్స్) మారడమే కాదు, ఆ ప్రాంతంలో క్యాన్సర్లూ వస్తాయి. ఇలా వచ్చేముందర సిగరెట్ పొగ తాలూకు ప్రభావంతో నోటిలోపల తెల్లని మచ్చలు ఏర్పడతాయి. వాటినే ‘ల్యూకోప్లేకియా’ అంటారు. ఈ ల్యూకోప్లేకియా మచ్చలు క్యాన్సర్ ఆవిర్భావానికి తొలి రూపాలు. చిగుర్లపై మచ్చలు రావడం (స్మోకర్స్ మెలనోసిస్), పళ్లు పసుపుపచ్చగా మారడం జరుగుతుంది. నాలుక నల్లగా మారే ‘బ్లాక్ హెయిరీ టంగ్’ అనే కండిషన్‌కు దారితీయవచ్చు. వేడిలావాలా విషాలు నోట్లోకి ప్రవహించడం వల్ల నోట్లోని లాలాజలం ఆవిరైపోతుంది. అది తగ్గడంతో నోట్లో విషక్రిములూ, దుర్వాసనా... ఒకటేమిటి అన్నీ అనర్థాలే. నోరు, నాలుక, అంగిలి, ట్రాకియా, ఈసోఫేగస్... ఇలా నోటి పొరుగున ఉన్న ప్రతి భాగమూ క్యాన్సర్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. గొంతు : నోటి తర్వాత గొంతు భాగానికి వస్తే... గొంతులో ఉండే ప్రతి అవయవమూ మళ్లీ పొగ బారిన పడి క్యాన్సర్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. గొంతులో ఉండే స్వరపేటిక, థైరాయిడ్, గొంతునుంచి ఊపిరితిత్తులోకి వెళ్లే బ్రాంకియా... ఇలా ప్రతి భాగమూ దెబ్బతిని పై అవయవాలన్నింటికీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. గుండె : సిగరెట్ పొగ మన గుండెకు చేసే చెరుపూ అంతా ఇంతా కాదు. సిగరెట్ ముట్టించిన మరుక్షణం గుండె వేగం అదుపు తప్పి పెరిగిపోతుంది. పదినిమిషాల పాటు అదేపనిగా సిగరెట్ తాగితే గుండె వేగం 30 శాతానికి పైగా పెరుగుతుంది. అంటే అవసరానికి మించి గుండె కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. అంటే గుండె లయ తప్పి కొట్టుకోవడం వల్ల జరిగే అనర్థాలన్నీ సిగరెట్ వల్ల కలుగుతాయి. గుండె, రక్తప్రవాహవ్యవస్థ (హార్ట్ అండ్ కార్డియోవ్యాస్క్యులార్ సిస్టమ్)కు జరిగే నష్టాలను చూస్తే... సిగరెట్ పొగ వల్ల రక్తం చిక్కబడుతుంది (విస్కాసిటీ పెరుగుతుంది). దాంతో రక్తప్రవాహం సాఫీగా జరగక రక్తనాళాల మధ్యన రక్తపు గడ్డలు ఏర్పడి గుండెకు రక్తం అందకపోవచ్చు. ఏ భాగానికి రక్తం అందకపోయినా... ఆక్సిజన్, పోషకాలు అందక ఆ భాగం చచ్చుబడిపోతుందన్న విషయం తెలిసిందే. ఇదే పరిణామం గుండెకు రక్తసరఫరా చేసే కరొనరీ ఆర్టరీలో జరిగితే గుండెపోటు వచ్చి ప్రాణానికే ముప్పు వాటిల్లవచ్చు. ఇక ఇదే రకమైన ప్రమాదం మెదడుకూ ఉంది. మన శరీరాన్ని నియంత్రించే కీలకమైన భాగం మెదడే. దానికి ఆక్సిజన్ అందజేసే కెరోటిడ్ రక్తనాళాల్లో గానీ, లేదా ఇతర రక్తనాళాల్లోగాని రక్తం చిక్కబడి అక్కడ అది చిక్కుబడితే... మెదడుకు రక్తప్రవాహం అందక పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. ఒకసారి పక్షవాతం వస్తే ఇక ఆ రోగి జీవితాంతం ఎవరిపైనైనా ఆధారపడుతూ దుర్భర జీవితాన్ని గడపాల్సిందే. అందుకే అలాంటి దుస్థితి రానివ్వకుండా జాగ్రత్త పడాలి. అంతేకాదు... సిగరెట్ పొగ వల్ల మెదడుకు అందే రక్తం తగ్గడం వల్ల ఏదైనా విషయాలను అవగాహన చేసుకునే (కాగ్నిటివ్) శక్తిసామర్థ్యాలు 50 శాతానికి పైగా తగ్గుతాయి. దీర్ఘకాలంలో అవి ప్రపంచంలోని అన్ని విషయాలనూ మరచిపోయేలా చేసే అల్జైమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి వాటికి దారితీస్తాయి. పురుషులకు ప్రమాదాలివే : సిగరెట్‌ను స్టైల్‌గా ముట్టించి పొగ వదలడాన్ని పురుషత్వానికి చిహ్నంగా కొన్ని ప్రకటనలలో చూపిస్తారు. కానీ సిగరెట్ పురుషత్వాన్ని కబళిస్తుంది. సిగరెట్ పొగ వల్ల రక్తం చిక్కబడిపోతుందన్న విషయం తెలిసిందే కదా. ఇదే పరిణామం పురుషాంగానికి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాల్లో (ఆర్టరీలలో) జరగడం వల్ల అంగస్తంభన సమస్యలు (ఎరక్టైల్ డిస్ఫంక్షన్) వస్తాయి. అంతేకాదు... వీళ్లలో శుక్రకణాల సంఖ్య (స్పెర్మ్‌కౌంట్) గణనీయంగా పడిపోతుంది. ఫలితంగా తాము గర్వపడే విషయంలోనే గర్బభంగం జరిగే పరిస్థితి సిగరెట్ తెచ్చిపెడుతుంది. బ్లాడర్క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్... ఈ తరహా క్యాన్సర్లన్నింటికీ పొగతాగడం ఒక ప్రధాన కారణం. కాళ్లు : తల నుంచి మొదలుపెట్టిన ప్రస్థానాన్ని ఇప్పుడు కాళ్ల చివరకు చేర్చుదాం. కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ‘పెరిఫెరల్ వాస్క్యులార్ డిసీజ్’ అనే వ్యాధి వస్తుంది. దీన్నే బర్జర్స్ డిసీజ్ అని కూడా అంటారు. దీనివల్ల పాదాల చివరకు రక్తం అందకపోవడం అనే పరిణామం ఏర్పడితే పాదం కుళ్లిపోయి, పాదాలతో పాటు కాళ్లను తొలగించాల్సిన పరిస్థితి తెచ్చే దుర్మార్గమైన అలవాటు ఈ పొగతాగడం. ఇలా పొగతాగడం అన్న అలవాటు తల మొదలుకొని కాళ్ల చివరల వరకూ ఉండే ప్రతి అవయవాన్నీ... లోపల ఉండే అన్ని అవయవాలను అంటే... కాలేయం, ప్యాంక్రియాస్, చిన్నపేగులు, పెద్దపేగులు, కోలోరెక్టల్... ఇలా నోటి నుంచి మొదలుకొని జీర్ణవ్యవస్థలోని చివరి భాగం వరకూ ఏ అవయవానికైనా క్యాన్సర్ కలిగించే గుణం పొగాకుకు ఉంది. మహిళలకూ ఎంతో కీడు : ఇక మహిళల విషయంలోనూ సిగరెట్ పొగ అంతే కీడు చేస్తుంది. ఒక కుటుంబంలో పురుషులు తాగే సిగరెట్ పొగ కేవలం వారిని మాత్రమే కాదు... వారి జీవిత భాగస్వామినీ అంతే తీవ్రంగా దెబ్బతీస్తుంది. పురుషులు తాగే సిగరెట్ తాలూకు కాలేచివరి నుంచి వచ్చే పొగ, పీల్చాక ఊపిరితిత్తుల్లోంచి వచ్చే పొగ... ఈ రెండూ కలిసి రెట్టింపు నష్టాలను కుటుంబ సభ్యులకూ కలగజేస్తాయి. సిగరెట్ పొగ వల్ల మహిళల్లో ఓవరీస్ దెబ్బతింటాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పాదనపై సిగరెట్ పొగ దుష్ర్పభావం చూపడం వల్ల అండం ఉత్పాదన తగ్గిపోతోంది. ఎంబ్రియో ట్రాన్స్పోర్ట్ కూడా దెబ్బతింటుంది. మహిలల్లో పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది. అంతేకాదు. ఒకవేళ కృత్రిమంగా ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా పునరుత్పత్తి చేద్దామనుకున్నా దానికి అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. పైగా అబార్షన్లు పెరగడం, ఒకవేళ పిండం ఎదిగినా చివర్లో మృతశిశువులు జన్మించడం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. డాక్టర్ సిహెచ్. మోహనవంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ -
కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తి రిమాండ్
హైదరాబాద్: సిగరెట్ కోసం జరిగిన గొడవగా నగరంలో కలకలం రేపిన కత్తిదాడిలో నిందితున్న పోలీసులు అరెస్ట్ చేశారు. కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిని ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఈ నెల 12వ తేదీనా గౌలిపురాలోని మాతా మద్యం దుకాణంలో సిట్టింగ్ గదిలో మద్యం సేవిస్తున్న సమయంలో సుల్తాన్షాహి ప్రాంతానికి చెందిన పవన్ (40) ఎదురుగా మద్యం సేవిస్తున్న తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన యువకుడిని సిగరేట్ అడిగాడు. ఆ యువకుడు ఇవ్వకపోడంతో ఆగ్రహానికి గురైన పవన్ ఎదురుగా ఉన్న మటన్ దుకాణంలోని కత్తి తీసుకొచ్చి యువకుడిపై దాడికి దిగాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఛత్రినాక పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. -
కత్తిపోట్లకు దారితీసిన సిగరెట్ లొల్లి
హైదరాబాద్: వైన్స్ సిట్టింగ్ రూమ్‌లో సిగరేట్ విషయమై ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు మరో యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కాగా.. నిందితుడు వైన్స్ ఎదురుగా ఉన్న మటన్ షాప్‌కు వెళ్లి కత్తి తీసుకొచ్చి దాడి చేయడం గమనార్హం. ఇన్స్పెక్టర్ ఎన్.లక్ష్మీనారాయణ కథనం ప్రకారం....తలాబ్‌కట్టా ప్రాంతానికి చెందిన అబ్దుల్ నవీద్ (28), తన స్నేహితుడు షరీఫ్‌తో కలిసి మంగళవారం సాయంత్రం గౌలిపురా మార్కెట్ ప్రాంతంలోని మాత వైన్స్‌లో మద్యం తాగేందుకు వచ్చాడు. అదే సమయంలో సుల్తాన్షాహి ప్రాంతానికి చెందిన కొందరు యువకులు మద్యం తాగడానికి అదే వైన్స్‌కు వచ్చారు. అంతా కలిసి సిట్టింగ్ రూమ్‌లో మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు నవీద్‌ను సిగరేట్ అడిగాడు. సిగరేట్ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే చిత్తుగా తాగి ఉన్న ఆ యువకుడు ఆగ్రహంతో వైన్స్ ఎదురుగా ఉన్న మటన్ షాపు వద్దకు పరుగెత్తికెళ్లాడు. మటన్ వ్యాపారి వద్ద ఉన్న కత్తిని లాక్కొచ్చి నవీద్‌పై దాడి చేశాడు. మెడ భాగంలో పొడిచేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో నవీద్ అడ్డుకోవడంతో ఎడమ చేతిపై పొడిచాడు. బాధితుడు, నిందితుడు పెనుగులాడుకుంటూ బయటికి వచ్చారు. బయట ఉన్న జనాన్ని చూసి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇది గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఊపిరిని పీల్చేసే పొగ!
సూయిసైడల్ సిగరెట్ సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారిలో ఆత్మహత్య చేసుకోవాలనే వాంఛ (సూయిసైడల్ టెండెన్సీస్) విపరీతంగా పెరిగిపోతాయని పేర్కొంటున్నారు అమెరికాకు చెందిన పరిశోధకులు. యూఎస్‌లో ఆత్మహత్యల తీరుతెన్నులపై పరిశోధన చేస్తున్న కొందరు నిపుణుల అధ్యయనాల మేరకు సిగరెట్ అలవాటును తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల తర్వాత పొగతాగే అలవాటు గణనీయంగా తగ్గిందనీ, దాంతో ఆత్మహత్యల శాతం కూడా 15 శాతం తగ్గిందని వారు వివరించారు. అయితే దీనికి ఆత్మహత్యలకూ సిగరెట్ అలవాటుకూ ఎలా ముడిపెడతారన్న ప్రశ్నలకు వాళ్లు సమాధానం ఇస్తూ... పొగతాగే అలవాటును తగ్గించడానికి విధాన చర్యలు తీసుకోకుండా, సిగరెట్లపై టాక్సులు తగ్గించిన కొన్నిరాష్ట్రాలలో ఆత్మహత్యల శాతం 6 శాతం పెరిగిన దృష్టాంతాలను వారు ఉటంకిస్తూ... డ్రగ్స్ అలవాటు ఉన్నవారిలో ఆత్మహత్య చేసుకోవాలనే వాంఛ పెరిగినట్లే... నికోటిన్‌కు బానిసలైన వారిలోనూ యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెరుగుతాయనీ, డిప్రెషన్ ఉన్నవారికి ఆత్మహత్యావాంఛ ఒక లక్షణమని ఈ పరిశోధకులు ‘నికోటిక్ అండ్ టొబాకో రీసెర్చ్’ అనే జర్నల్‌లో పేర్కొన్నారు. -
సిగరెట్టు పీక వలన అగ్నిప్రమాదం
కర్నూలు : తాగిన సిగరెట్టు పీక నిర్లక్ష్యంగా పడవేయడంతో నిప్పంటుకుని రెండు గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా కర్నూలు రూరల్ మండలంలోని ఉల్చాల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.30 వేల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. -
పొగను పొమ్మంటున్నారు...
సినిమా చూద్దామని థియేటర్‌కు వెళ్తే.. ‘ఈ నగరానికి ఏమైంది..’ అంటూ ప్రకటనలు, సిగరెట్ డబ్బా కొంటే.. దానిపై పొగచూరిన ఊపిరితిత్తులు.. మొత్తానికి ధూమపానం అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి చర్యలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) ప్రకారం.. ధూమపానాన్ని మనవాళ్లు కాస్త దూరంగా ఉంచుతున్నారని తేలింది. పాన్, గుట్కా, బీడీ వంటి పొగాకు ఉత్పత్తులతో పోలిస్తే.. సిగరెట్ల విషయంలో ప్రజలు కాస్త సీరియస్‌గా ఆలోచించడం మొదలైందని సర్వే సారాంశం. గ్రామీణ భారతం, పట్టణ భారతం వారీగా చేసిన సర్వే ఫలితాలు సిగరెట్ సమస్యకు ప్రజలు చెక్ పెడుతున్నారని తెలిపాయి. యావత్ భారతంలో పొగాకు ఉత్పత్తుల కోసం వెచ్చించే మొత్తం పెరిగింది. ఇదే సమయంలో పెరుగుదల నిష్పత్తి కొంత తగ్గడం గుడ్డిలో మెల్ల. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్వో) డాటా ప్రకారం 2004-05 గ్రామీణ భారతం నెల వారీగా పొగాకు ఉత్పత్తులపై రూ.15.09 ఖర్చు చేస్తే.. అదే సమయంలో పట్టణ భారతం రూ.16.84 పొగాకుపై తగిలేసింది. ఇక 2009-10కి వచ్చే సరికి ఈ ఖర్చు గ్రామీణ భారతంలో రూ.20.41 ఉంటే, పట్టణ భారతంలో రూ.21.43గా నమోదైంది. అయితే గతంతో పోలిస్తే సిగరెట్లపై ఖర్చు చేసే మొత్తం నిష్పత్తి కొంత తగ్గిందని తెలిసింది. ఈ లెక్కన పొగచూరిన బతుకులు తమకొద్దనే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం.. ఆహ్వానించదగ్గ పరిణామం. -
పారేసిన సిగరెట్.. ఇంటిని కాల్చేసింది...
మార్కాపురం : సిగరెట్ తాగిన ఓ వ్యక్తి దానిని ఆర్పేయకుండా నిర్లక్ష్యంగా పక్కన పడేయటంతో మంటలు వ్యాపించి ఇంటికి అంటుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే... ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన పెదచెంచయ్య ఇంట్లో కూర్చుని సిగరెట్ తాగాడు. అనంతరం దానిని ఆర్పి పడేయకుండా నిర్లక్ష్యంగా పక్కనే ఉన్న చెత్తలో పడేశాడు. అది రాజుకుని ఇంటికి అంటుకుంది. కుటుంబ సభ్యులు గమనించి అప్రమత్తమయ్యేలోగా మంటలు వ్యాపించాయి. ఇంటితోపాటు సామాను కూడా తగలబడింది. కాగా ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈ కాలమ్ మీదే : చర్చా వేదిక
‘ఈ కాలమ్ మీదే’ చర్చావేదికకు మాకు అందిన అభిప్రాయాల్లో నుంచి ఇక్కడ మూడింటిని ప్రచురిస్తున్నాం. ఈ మూడిట్లో ఏ అంశంపై అయినా మీరు చర్చలో పాల్గొనవచ్చు. మీ విలువైన అభిప్రాయాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. తెలుగులో మాట్లాడటం తప్పా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంగ్లిష్ వాతావరణమే కనిపిస్తోంది. ఇద్దరు తమిళులు కలిస్తే తమిళం మాట్లాడతారని, ఇద్దరు కన్నడిగులు కలిస్తే కన్నడంలో మాట్లాడతారని... ఇద్దరు తెలుగు వాళ్లు కలిస్తే మాత్రం... కచ్చితంగా ఇంగ్లిష్‌లో మాత్రమే మాట్లాడుకుంటారనే మాట హాస్యం కోసం అన్నది కాదని, నిజమేనని నిత్యజీవిత సంఘటనలను చూస్తే అర్థమవుతుంది. ‘ఇంగ్లిష్ రాకపోతే జీవనం లేదు. ఇంగ్లిష్ లేకపోతే జీవితం లేదు’ అని తల్లిదండ్రులు ఆలోచించడం వల్లే తెలుగు లేని ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పిల్లలు ఇంగ్లిష్‌లో మాట్లాడడం నేరమైపోయింది. మరోవైపు పిల్లలు ఇంట్లో ఇంగ్లిష్‌లో మాట్లాడుకోవడాన్ని తల్లిదండ్రులు గర్వంగా భావిస్తున్నారు. ఏ రాష్ట్రాల్లో లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇంగ్లిష్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కనిపిస్తుంది. ఇది సమంజసమేనా? ఏం చేస్తే తెలుగు రాష్ట్రాల్లో తెలుగుకి పూర్వవైభవం వస్తుంది? - నల్లపాటి సురేంద్ర, కొత్తగాజువాక ఇక మన సినిమాల్లో కొత్తదనం కనిపించదా? ఒకప్పుడు నేను విపరీతంగా సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు మాత్రం సంవత్సరానికి ఒక్క సినిమా చూడడం కూడా కష్టమైపోయింది. దీనికి కారణం అన్ని సినిమాలు ఒకేలా ఉండడమే. మన తెలుగులో గతంలో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. వాటి గురించి గొప్పగా పదే పదే చెప్పుకోవడం తప్ప కొత్త సినిమాలను చూడలేమా? ఒకవేళ అడపాదడపా మంచి చిత్రాలు వచ్చినా... అవి రీమేక్‌లే తప్ప మనదంటూ దాంట్లో ఏమీ ఉండదు. రీమేక్‌లు చేసే బదులు తెలుగులోనే అలాంటి చిత్రాలు చేయవచ్చుకదా! కొద్దిమంది దర్శకులు ఇంటర్వ్యూలలో... ‘‘ప్రయోగాలు చేయడం అనేది రిస్క్‌తో కూడిన వ్యవహారం. ఒక్క సినిమా పోయిందంటే... వందలాది కుటుంబాలు వీధిన పడతాయి’’ అని తరచు చెబుతుంటారు. ‘రిస్క్’ అనుకున్నప్పుడు సినిమాలు తీయడం ఎందుకు? వ్యాపారం చేసుకుంటే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు కదా! ఎంత కాదనుకున్నా సినిమా అనేది కళాత్మక ప్రక్రియ. దీంట్లో లాభనష్టాలు బేరీజు వేసుకోవడం తగదు. ఒక్కసారి మన పాత తెలుగు క్లాసిక్‌లను తీసుకుంటే... కళాత్మక విలువలు తప్ప... మనం తరచు చెప్పుకునే ‘కమర్శియల్ హిట్’ ఫార్ములా కనిపించదు. ‘హిట్ ఫార్ములా’ అంటే ఒక్కడే హీరో వందమందిని ఒంటి చేత్తో కొట్టడమే అనుకుంటే... భారీలొకేషన్లు, విదేశాల్లో పాటలే- అనుకుంటే ఇప్పుడొస్తున్న అన్ని సినిమాలు హిట్ కావాలి కదా! మరి అలా ఎందుకు జరగడం లేదు? అసలు మనం ఉత్తమచిత్రాలు తీయలేమా? తీయాలనుకునేవాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ప్రేక్షకుల అభిరుచిలో కొత్తదనం ఉండడం లేదా?... ఇలాంటి విషయాలపై చర్చిస్తే బాగుంటుంది. - కొమ్ము రఘువీర్ యాదవ్, వరంగల్ ...అయినా కాలుస్తూనే ఉన్నారు! చట్టం అనేది ఆచరణలోకి వచ్చినప్పుడే విలువ ఉంటుంది. అలా కాకపోతే ఎన్ని చట్టాలు చేసుకొని ఏంలాభం? బహిరంగంగా ధూమపానం చేయడం తప్పు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది తెలిసి కూడా చాలామంది బహిరంగంగానే సిగరెట్ కాలుస్తున్నారు. ఒకసారి నేను బస్‌స్టాప్‌లో నిల్చొని బస్సు కోసం ఎదురుచూస్తున్నాను. నా పక్కన నిల్చొన్న వ్యక్తి తన జేబులో నుంచి సిగరెట్ తీసి తాగడం మొదలుపెట్టాడు. ‘‘అలా దూరంగా వెళ్లి కాల్చండి. ఇబ్బందిగా ఉంది’’ అన్నాను అతడితో. ‘‘ఇబ్బందిగా ఉంటే నువ్వే దూరంగా వెళ్లు. నా సిగరెట్ పూర్తయిన తరువాత వచ్చి నిల్చో’’ అన్నాడు దురుసుగా. ఇలా మా మధ్య మాటా మాటా పెరిగి వాదులాడుకోవడం ప్రారంభించాము. ఇంత జరుగుతున్నా... చుట్టుపక్కల ఉన్నవాళ్లలో ఒక్కరు కూడా ‘‘ఏమయ్యా... తప్పు చేయడమే కాకుండా... అతి తెలివి ప్రదర్శిస్తున్నావా?’’ అని అతన్ని మందలించే ప్రయత్నం చేయలేదు. ఇంతకీ తప్పు ఎవరిది? తప్పు అని తెలిసినా... సిగరెట్ తాగిన ఆ పెద్ద మనిషిదా? తప్పు చేస్తున్నాడని తెలిసినా ఉదాసీనంగా ఉన్న ప్రయాణికులదా? - డి.ప్రభావతి, చిత్తూరు పాఠకులకు ఆహ్వానం ‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 . ఇ-మెయిల్: sakshireaders@gmail.com -
ధనుష్ చిత్ర పోస్టర్లపై వ్యతిరేకత
తమిళసినిమా: నటుడు ధనుష్ నటించిన తాజా చిత్రం వేలై ఇల్లా పట్టాదారి వివాదాల్లో చిక్కుకుంది. ధనుష్ నిర్మించి, నటించిన ఈ చిత్రం విజయబాటలో పయనిస్తోంది. అయితే ఈ చిత్ర ప్రచారంలో భాగంగా సిగరెట్లు తాగే ఫొటోలతో పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా వెలిశాయి. దీనిని తమిళనాడు పొగాకు నియంత్రణ ప్రజా సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సంఘం నిర్వాహకులు ఈ వ్యవహారంపై ఆరోగ్యశాఖకు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీనిపై పొగాకు నియంత్రణ ప్రజా సంఘం నాయకుడు సిరిల్ అలెగ్జాండర్ మాట్లాడుతూ వేలై ఇల్లా పట్టాదారి చిత్రానికి సెన్సార్ బోర్డు యు సర్టిఫికెట్ నిచ్చిందన్నారు. ఈ చిత్రంలో పొగతాగే సన్నివేశాలు చాలా ఉన్నాయని, పైగా ధనుష్ సిగరెట్ తాగే ఫొటోలను పోస్టర్లుగా ముద్రించి ప్రచారం చేస్తున్నారని ఇది పొగాకు నియంత్రణ చట్ట వ్యతిరేకత చర్య అవుతుందని పేర్కొన్నారు. ధనుష్ పాపులర్ నటుడని ఆయనే ఆరోగ్యానికి సంబంధించిన పొగాకు నియంత్రణ చట్టాన్ని అతిక్రమించారని ఆరోపించారు. కాబట్టి ధనుష్ సిగరెట్లు తాగే పోస్టర్లను ప్రభుత్వం వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. -
సిగరెట్‌కోసం హత్య
న్యూఢిల్లీ: సిగరెట్ ఇవ్వలేదనే కోపంతో ఓ యువకుడిని కాల్చి చంపారనే ఆరోపణలపై ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఘటన జూలై 1న, సియానీ గేట్ ప్రాంతంలో జరిగింది. సిగరెట్ ఇచ్చేందుకు నిర్మల్ నిరాకరించడంతో ప్రదీప్‌కుమార్, రాహుల్‌లు అతణ్ని నాటు తుపాకీతో కాల్చి చంపారు. నిందితులిద్దరూ మాదకద్రవ్యాలకు బానిసలయ్యారని దర్యాప్తులో తేలింది. నిర్మల్‌ను కాల్చి ఘటనా స్థలం నుంచి ఇద్దరూ పారిపోయారు. దీనిని గమనించిన స్థానికులు నిర్మల్‌ను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. కాగా అప్పటికే నిర్మల్ మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లభించిన ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు. దీంతో సోమవారం ఇద్దరు పట్టుబడ్డారు. వారి నుంచి నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. -
సరదా సరదా సిగరెట్టూ విలువ 4,00,00,000
అగరొత్తులు ఎన్ని ఉన్నా సిగరెట్టుకు సాటి రావన్నాడు మహాకవి. అందుకే వాటికంత ‘పొగ’రు. యువతరాన్ని సిగరెట్లకు బానిసలు చేసుకునేలా పొగాకు కంపెనీలు కొత్త కొత్త ఎత్తులు ఎప్పటికప్పుడు వేస్తూనే ఉన్నాయి.యువతరానికి నిశ్శబ్దంగా ‘పొగ’పెట్టేందుకు అవి సిగరెట్లలో మేళవిస్తున్న ‘నవ’రసాలివి.. బీ కేర్‌ఫుల్ ! సరదా సరదా సిగరెట్టూ.. అంటూ దమ్ముకొట్టే వాళ్లు నగరంలో దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. కంపు కొట్టు ఈ సిగరెట్టు, దీన్ని కాల్చకండంటూ ఇంట్లో వాళ్లు వేసిన ఒట్టును.. గట్టున పెట్టి పొగలో తేలుతున్నారు. ఊపిరితిత్తులను పిప్పి చేస్తూ రోజుకు ఏడు ల క్షల సిగరె ట్ పెట్టెలను ఊది అవతల పారేస్తున్నారు. వీటి విలువ అక్షరాలా రూ.4 కోట్లు. మహానగరంలో పొగరాయుళ్లు సగటున సిగరెట్లపై నెలకు రూ.900 నుంచి రూ.14 వందల వరకు బూడిదపాలు చేస్తున్నారు. ఇంట్లో పోషకాహారానికి ఖర్చు చేసే దాని కన్నా మిన్నగా.. సిగరెట్లకు వెచ్చించి ప్రాణాంతక వ్యాధుల కౌగిట్లోకి చేరుతున్నారు. సిగరెట్లు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులకు బానిసగా మారి.. ఆరోగ్యానికి హానికరమైన నికోటిన్ లాంటి నాలుగు వేల రకాల విషతుల్యాలను శరీరంలోకి ఆహ్వానిస్తున్నారు. సిగరెట్ల కంపెనీలు యేటా వేల కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తున్నాయి. మానవ వనరులను మసకబారుస్తున్న పొగాకు ఉత్పత్తులు.., ఆదాయం రూపంలో ప్రభుత్వ ఖజానాకు రూ. 300 కోట్లు సమకూరుస్తున్నాయి. పొగరాయుళ్ల బ్రాండ్ కింగ్ గోల్డ్ఫ్లాగ్ 36 శాతం 18- 35 ఏళ్ల వయసు గలవారు చిన్న గోల్డ్ఫ్లాగ్ 24 శాతం 35-45 ఏళ్ల వయసు గలవారు లైట్ గోల్డ్ఫ్ల్లాగ్ 20 శాతం 18-45 ఏళ్ల వయసు గలవారు బ్రిస్టల్, ఫోర్‌స్కేర్, చార్మినార్, ఇతరత్రా 20 శాతం : 45-80 వయసు గలవారు బ్రాంకో డైలేటర్లు: ఊపిరితిత్తులను వ్యాకోచింపజేసే రసాయనాలివి. వీటి ప్రభావంతో ఊపిరితిత్తుల్లోకి మరింత పొగ చేరుతుంది. నికోటిన్ మోతాదు: కొత్తగా సిగరెట్లు ఊదడం ప్రారంభించే వారు శీఘ్రంగానే దానికి బానిసలయ్యేందుకు తగిన పరిమాణంలో నికోటిన్ ఉండేలా పొగాకు కంపెనీలు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాయి. నికోటిన్‌కు ఒకసారి అలవాటు పడితే, వదులుకోవడం దుస్సాధ్యం. వెంటిలేటెడ్ ఫిల్టర్లు: పొగతాగేవారు మరింత గట్టిగా దమ్ము లాగాల్సి వచ్చేలా వెంటిలేటెడ్ ఫిల్టర్ల తయారీ. ఫలితంగా ఊపిరితిత్తుల్లోకి మరింత గాఢంగా పొగ చేరుతుంది. మెంథాల్: చల్లదనాన్ని ఇచ్చే మెంథాల్ కారణంగా గొంతులో స్పర్శ తగ్గుతుంది. ఫలితంగా పొగ ప్రవేశించినప్పుడు ఇబ్బంది ఉండదు. సుగర్స్, ఎసెటాల్డీహైడ్ : చక్కెర పదార్థాలను కలపడం వల్ల పొగపీల్చడం తేలికగా ఉండటమే కాకుండా, ఎసెటాల్డీహైడ్ అనే పదార్థం ఏర్పడేలా చేస్తాయి. ఫలితంగా పొగరాయుళ్లు నికోటిన్‌కు త్వరగా బానిసలవుతారు. ఫ్లేవరింగ్స్: చాక్లెట్ మాస్క్, లిక్కొరైస్ వంటి పరిమళాలను జోడించడం వల్ల సిగరెట్లకు అదనపు ఆకర్షణ. వాటి ప్రభావంతో కొత్తగా సిగరెట్లు ప్రారంభించే వారు త్వరగానే వ్యసనానికి బానిసలవుతారు. టొబాకో స్పెసిఫిక్ నైట్రోసమైన్స్: అమెరికన్ తరహా సిగరెట్లలో బ్లెండెడ్ టొబాకో వాడతారు. సాధారణ పొగాకు కంటే ఇందులో మరింత ఎక్కువగా కేన్సర్ కారక పదార్థాలు ఉంటాయి. అమోనియా సమ్మేళనాలు: సిగరెట్లలోని అమోనియా సమ్మేళనాల వల్ల పొగాకులో ఉండే నికోటిన్ మరింత వేగంగా మెదడును చేరుకుంటుంది. లెమాలినిక్ యాసిడ్ : ఆర్గానిక్ యాసిడ్ లవణాలను చేర్చడం వల్ల నికోటిన్ కరుకుదనం, పొగలోని ఘాటు తగ్గుతాయి. - హమీద్‌ఖాన్ -
కాలుతున్న సిగి‘రేట్లు’
కొవ్వూరు : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి లేఖ సిగిరెట్ వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. సిగిరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. కారణం దొరకిందని భావించిన వ్యాపారులు సిగరెట్ల బ్లాక్ మార్కెట్ విక్రయాలకు తెర లేపారు. కేంద్ర బడ్జెట్ వచ్చే నెల ముందు నుంచి సిగిరెట్లను బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయించటం ప్రతి ఏటా పరిపాటిగా మారింది. ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టకపోవటంతో వారికి అందుకు అవకాశం చిక్కలేదు. ఇప్పుడు కేంద్ర మంత్రి లేఖ వారికి మంచి అవకాశం కల్పించింది. జిల్లాలో 10 రోజుల నుంచి హోల్‌సేల్ వ్యాపారులు సిగరెట్లకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. చిల్లర వర్తకులకు అవసరమైన మేరకు సిగరెట్లు లభించకపోవడం, దొరికినా అధిక ధరలకు కొనాల్సి రావటంతో ఎమ్మార్పీ కంటే సుమారు 20 శాతం వరకు ధర పెంచి విక్రయిస్తున్నారు. ధరలు ఇలా.. గోల్డ్ ఫ్లాక్ కింగ్స్ 10 పెట్టెలు రూ.770 ఉండగా ప్రస్తుతం రూ.870 విక్రయిస్తున్నారు. ఒక పెట్టి ఎమ్మార్పీ 85 రూపాయలే. రిటైలర్లకు ప్యాకెట్‌కు ఇవ్వాల్సిన రూ.8 మార్జిన్‌కు తోడు మరో రూ.2 రెండు రూపాయలు అదనంగా వేసి మరీ హోల్‌సేల్ వ్యాపారులు దోచుకుంటున్నారు. దీంతో కిళ్లీ షాపులు, చిల్లర వర్తకులు పెట్టెను రూ.90 నుంచి రూ.100 వరకు వీలును బట్టి విక్రయిస్తున్నారు. గోల్డ్ ఫ్లాక్ ఫిల్టర్ 50 పెట్టెల కార్టన్ ధర 10 రోజుల క్రితం వరకు రూ.2,700. దీనిని రూ.2,950 వరకు విక్రయిస్తున్నారు. ఒక పెట్టె ఎమ్మార్పీ రూ.59 ఉండగా రిటైల్ వర్తకులు రూ.65 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు. బర్కిలీ ఫిల్టర్ 50 పెట్టెల కార్టన్ గతంలో రూ.1,580 ఉండగా ప్రస్తుతం రూ.1,700 అమ్ముతున్నారు. ఒక్కో పెట్టె ఎమ్మార్పీ రూ.35 ఉండగా రిటైల్‌గా రూ.40 చొప్పున విక్రయిస్తున్నారు. విల్స్ ఫ్లాక్ సిగరెట్లు 50 పెట్టెల కార్టన్‌ను హోల్‌సేల్ వ్యాపారులు రూ.2,450 చొప్పున అమ్ముతున్నారు. ఎమ్మార్పీ రూ.50 ఉన్న ఈ సిగిరెట్ పెట్టెను చిల్లర వర్తకులు రూ.55 వరకు విక్రయిస్తున్నారు. పది రోజుల క్రితం వరకు పొగరాయుళ్లకు ఇవే సిగరెట్లు ఎమ్మార్పీ ధరలకే లభ్యమయ్యేవి. గత ఏడాది కాలంలో సిగరెట్ ధరలు మూడుసార్లు పెరిగాయి. బ్లాక్ మార్కెట్‌పై నియంత్రణ ఏదీ జిల్లాలో కొందరు హోల్‌సేల్ డీలర్లు సిగరెట్లను భారీగా నిల్వచేసి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, వాణిజ్య పన్నుల శాఖ, రెవెన్యూ అధికారులు దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కొన్ని శాఖల అధికారులు, సిబ్బందికి హోల్‌సేల్ వర్తకుల నుంచి మామూళ్లు అందుతుండటమే ఈ ఉదాసీనతకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆ కుక్కపిల్లకు సిగరెట్ తాగడం భలే సరదా!
బీజింగ్: పొగ తాగకుంటే వచ్చే జన్మలో గాడిదగా పుడుతానని భయపడిందో ఏమో.. చైనాలోని ఓ పెంపుడు కుక్కకు పొగ తాగడం ఓ వ్యసనంగా మారింది. చైనాలో రెండేళ్ల వయస్సులో ఉన్న ఓ కుక్క తన యజమాని నుంచి పొగతాగడం అలవాటు చేసుకుంది. ధూమపానానికి బానిసైన ఆ కుక్క పిల్ల నిద్రకు ఉపక్రమించే ముందు ఎంచక్కా ఓ దమ్ము కొట్టి సేదతీరుతుందట. గత సంవత్సర కాలంగా తన పెంపుడు కుక్క మీయా దమ్ము కొడుతోందని యజమాని వెల్లడించారు. ఐతే తన పెంపుడు కుక్క ఏ బ్రాండ్ పడితే అది తాగదని.. కేవలం యూక్సీ బ్రాండ్ సిగరెట్లను మాత్రమే తాగుతుందన్నారు. తన పెంపుడు కుక్క ఆరోగ్యంపై బెంగ పెట్టుకున్న యజమాని త్వరలోనే మీయా పొగమానేలా చేస్తానని యజమాని లూ అంటున్నాడు. Follow @sakshinews -
ఆకాశంలో సిగ‘రేట్లు’
బ్లాక్ మార్కెట్లో ప్రత్యక్షం ధరలు పెరుగుతాయనే కారణం కృత్రిమ కొరత సృష్టిస్తున్న మార్కెట్ శక్తులు గుడివాడ : కాదేదీ బ్లాక్ మార్కెట్‌కు అతీతమని మార్కెట్ శక్తులు నిరూపిస్తున్నాయి. వచ్చే నెలలో సిగరెట్ ధరలు పెరుగుతాయనే సంకేతాలందడంతో బ్లాక్‌మార్కెట్ తలుపులు బార్లా తెరుచుకున్నాయి. పెరగనున్న పోగాకు ఉత్పత్తుల ధరలను బూచీగా చూపి మార్కెట్ శక్తులు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇప్పటికే సిగరెట్ ధరలు అడ్డగోలుగా పెంచి వినియోగదారులను దోచుకు తింటున్నారు. కొత్త ఎంఆర్పీ ధరతో ఉత్పత్తులు రాకముందే పాత ఎంఆర్పీ ధర ఉన్న వాటిని బ్లాక్ చేసి ఒక్కో సిగరెట్ ప్యాకెట్‌కు రూ.10నుంచి 15వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో విని యోగదారుని జేబుకు చిల్లు పడుతుంది. ప్రతి బ్రాండ్‌పై ఎంఆర్పీ కన్నా 25నుంచి 35 శాతానికి పైగా అధిక ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అదేమని అడిగితే పొగాకు ఉత్పత్తులపై టాక్సును పెంచుతున్నందున ధరలు పెరగనున్నాయని అందుకే సరుకు దొర కడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. మ ద్యం తరువాత అత్యధిక గిరాకీ ఉన్న పోగాకు ఉత్పత్తుల ద్వారా మార్కెట్ శక్తులు రూ.కోట్లు గడిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. కృత్రిమ కొరత ... సిగరెట్లుపై పెరగనున్న ధరలను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కంపెనీ నుంచి ఎటువంటి కొరత లేదని తెలుస్తుంది. పెంచిన టాక్సులు ఇంకా అమల్లోకి రాని కారణంగా కొత్త ఎంఆర్పీతో సిగరెట్ ఉత్పత్తులు బయటకు రాలేదు. పాత ధరతోనే సరుకు వస్తుండగా పెద్దపెద్ద హోల్‌సేల్ మార్కెట్ శక్తులు ముందుగానే సరుకును కొనేసి బ్లాక్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సిగరెట్ల సరఫరా సాధారణంగానే ఉన్నా పెద్దపెద్ద డిస్ట్రి బ్యూటర్లు, హోల్‌సేల్ వ్యాపారులు వీటిని బ్లాక్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు సరఫరా చేసినా హోల్ సేలర్లు సరుకును బ్లాక్ చేసి అధిక ధరకు అమ్ముతున్నారు. రిటైల్ ధరకాదు.. ఎంఆర్పీ అయితేనే... ఇప్పటి వరకు చిన్నచిన్న చిల్లర దుకాణాల వారికి హోల్‌సేల్ డీలర్లు రిటైల్ ధరకు అమ్ముతారు. ధరలు పెరుగుతాయని సంకేతాలు రావడంతో వారం రోజులుగా ఎంఆర్పీ ధరకే చిన్న దుకాణాల వారికి అమ్ముతున్నారు. ఇదే అదునుగా భావించిన చిన్న చిన్న బడ్డీ కోట్లు వారు ఒక్కో సిగరెట్‌కు ఒక రూపాయి అదనంగా వసూలు చేస్తున్నారు. అంటే పది సిగరెట్లు ఉండే పెట్టికి రూ.10 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. పొగాకు ఉత్పత్తుల ధరలు అడ్డగోలుగా వసూలు చేస్తున్నా నియంత్రించాల్సిన తూనికలు కొలతలు శాఖ నిద్రపోతుందని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. -
సిగరెట్‌పై రూ. 3.50 వడ్డన!
* బీడీ పరిశ్రమకు రాయితీలన్నీ కట్ * బడ్జెట్ పై ఆరోగ్యమంత్రి సూచనలు న్యూఢిల్లీ: పొగాకు వినియోగంతో ఆరోగ్యపరంగా, సామాజికపరంగా కలిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని, ఒక్కో సిగరెట్‌పై పన్నును మూడున్నర రూపొయల చొప్పన పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సూచించారు. సిగరెట్ల వినియోగాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకోవాలంటూ ఆయన గురువారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. వచ్చే నెల్లో సాధారణ బడ్జెట్ రాబోతున్న నేపథ్యంలో ఆయన ఈ లేఖరాశారు. ధూమపానాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా, బీడీ పరిశ్రమకు ఇచ్చే పన్ను మినహాయింపునకు కూడా స్వస్తి చెప్పాలన్నారు. దూమపానం ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన దష్ర్పభావం చూపుతోందని, ప్రతియేటా కోటిన్నరమంది పేదలుగా మారుతున్నారని హర్షవర్దన్ తెలిపారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో ఒక్కో సిగరెట్‌పై మూడున్నర రూపాయల చొప్పున పన్ను పెంచాలని సూచించారు. ఈ ప్రతిపాదనలను అమలుచేస్తే 30లక్షలమందిపైగా ధూమపానం మానేస్తారని, భారీగా పెంచే పన్నుతో ఖజానాకు రూ.3,800కోట్ల ఆదాయం వస్తుందన్నారు. పన్ను రాయితీలు బీడీ పరిశ్రమ విస్తృతికి ఉపయోగపడ్డాయే తప్ప, బీడీ కార్మికుల పరిస్థితి మాత్రం క్షీణించిందని చెప్పారు. -
అప్పడుగానీ మానలేక పోయాను!
కనువిప్పు ఎన్టీయార్ హీరోగా నటించిన ‘సాహసవంతుడు’ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ‘‘సిగరెట్ కాలుస్తున్నావా?’’ అని హీరో అడుగుతాడు. ‘‘కాదు...సిగరెట్టే నన్ను కాలుస్తోంది’’ అని అవతలి నుంచి జవాబు. ఒక దశలో నా పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఫ్రెండ్స్ దగ్గర ‘సరదాగా’ నేర్చుకున్న సిగరెటు...ఆ తరువాత ‘సీరియస్‌గా’ నన్ను కాల్చే ప్రయత్నం చేసింది. మొదట్లో రోజుకు ఒక సిగరెట్ మాత్రమే తాగేవాడిని. ఆ తరువాత మూడు....ఆ తరువాత ఆరు...ఇలా పెరుగుతూ పోయింది. ఒకసారి సిగరెట్టు తాగుతూ నాన్నకు దొరికి పోయాను. ‘‘మన ఇంట్లో ఇప్పటి వరకు ఎవరికీ పొగతాగే అలవాటు లేదు. ఎక్కడ నేర్చుకున్నావు ఈ అలవాటు?’’ అని నాన్న బాగా తిట్టారు. ‘‘ఇకపై తాగను నాన్నా’’ అని తప్పించుకున్నాను. నాన్నకు తెలియకుండా దొంగచాటుగా తాగేవాడిని. పరీక్షల టైమ్‌లో టెన్షన్ పడి సిగరెట్లు విపరీతంగా తాగేవాడిని. ఒకరోజు రాత్రి విపరీతమై దగ్గు. మరుసటి రోజు హాస్పిటల్లో చూపించారు నాన్న. నేను విపరీతంగా సిగరెట్లు తాగుతున్నాననే విషయాన్ని డాక్టర్ గారు గ్రహించారు. కౌన్సెలింగ్ మొదలు పెట్టారు. పొగ తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడి చిన్న వయసులోనే చనిపోయిన కొందరు యువకుల గురించి చెప్పారు. ‘‘నిన్ను సిగరెట్లు మానిపించడానికి ఇదంతా చెప్పడం లేదు. వాస్తవాలు చెప్పాను. ఆ తరువాత నీ ఇష్టం’’ అన్నారు డాక్టర్‌గారు. అప్పటి నుంచి తెల్లటి సిగరెట్‌ను చూస్తే నల్లటి యమపాశాన్ని చూసినట్లుగా ఉండేది. ఎప్పుడూ పొరపాటున కూడా సిగరెట్ ముట్టలేదు. - డి.అర్జున్, తాడేపల్లిగూడెం -
‘పొగ’ చూరిపోకండి... మసిబారిపోకండి
ఈ నెల 31‘యాంటీ టొబాకో డే’ ఒక ఫ్యాషన్‌గా మొదలయ్యే పొగతాగడం అన్న అలవాటు తల వెంట్రుకల దగ్గర్నుంచి మొదలై శరీరంలోని అన్ని భాగాలనూ దెబ్బతీస్తుంది. అన్ని పనులనూ అతి చులాగ్గా, అతి చురుగ్గా చేసే కార్యసాధకులు పొగతాగుతారనే తరహా ప్రకటనలతో యువత దీనిపట్ల ఆకర్షితమవుతుంటుంది. అంతే... పొగతాగడం వల్ల వాళ్లు చురుగ్గా నిర్వహించగలిగే చాలా చిన్న చిన్న పనులు కూడా ఒక దశ తర్వాత అతి కష్టంగా మారతాయంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు ఊపిరి తీయడం కూడా అంతులేని భారంగా పరిణమించేంతగా పొగాకు దెబ్బతీస్తుంది. శరీరంలో తలవెంట్రుకల మొదలు కాలిగోటి వరకు ఉండే భాగాలతో పాటు అంతర్గతంగా ఉండే అనేక కీలక శరీర వ్యవస్థలు ఎలా దెబ్బతింటాయన్న అంశంపై అవగాహన కలిగించేదే ఈ ప్రత్యేక కథనం. పొగ... అనేక హానికర రసాయనాల మిశ్రమం పొగ వదులుతుండటం మనకు చాలా స్టైల్‌గా కనిపించవచ్చేమోగానీ... అందులోని రసాయనాలు ఎంత హానికరమో వర్ణించడానికి మాటలు చాలవు. ఒక సిగరెట్ పొగలో 7,000కు పైగా హానికర రసాయనాలు ఉంటాయి. వాటితో పాటు క్రోమియం, ఆర్సెనిక్, లెడ్, క్యాడ్మియం వంటి ప్రమాదకరమైన లోహాలూ ఉంటాయి. అంటే మనం నేరుగా లోహాలను శరీరంలోకి స్వీకరిస్తున్నామంటే ఎంత ప్రమాదమో ఆలోచించుకోవచ్చు. ఇలాంటి వాటినా మనం స్వీకరించేది! సిగరెట్ పొగ వదలడం చాలా ఫ్యాషనబుల్‌గా కనిపించవచ్చు. కానీ ఆ పొగలో ఏముంటాయో, అవి ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుంటే మళ్లీ సిగరెట్ ముట్టాలంటేనే అసహ్యం అనిపిస్తుంది. ఉదాహరణకు... ఫార్మాల్డిహైడ్: సిగరెట్ పొగలో ఉండే ఫార్మాల్డిహైడ్ అన్న రసాయనాన్ని మృతదేహాలను సంరక్షించేందుకు వాడతారు. అనేక జువాలజీ ల్యాబ్‌లలో విద్యార్థులకు చూపించడానికి అనేక జీవుల మృతదేహాలను గాజుకుప్పెల్లో భద్రపరిచే విషయం తెలిసిందే. ఈ ఫార్మాల్డిహైడ్ ద్రావణంలోనే వాటిని ఉంచుతారు. బెంజీన్: మనం రోజూ వాడే పెట్రోలు, గ్యాస్‌లలో ఉండే వ్యర్థ పదార్థం ఇది. మనం ఆఘ్రాణించడానికి విముఖత చూపే విచిత్రమైన వాసనను వెలువరుస్తూ ఉంటుందిది. పొలోనియమ్: ఇది రేడియోధార్మిక పదార్థం. రేడియోధార్మికత వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అన్న విషయం తెలిసిందే. వినైల్ క్లోరైడ్: ఈ రసాయనాన్ని ప్లాస్టిక్ పైపులు, ప్లాస్టిక్ ఉపకరణాలు తయారు చేయడానికి వాడతారు. అంటే ఒకరకంగా చెప్పాలంటే సిగరెట్ తాగడం అంటే ఈ ప్లాస్టిక్‌ను శరీరంలోకి ఆహ్వానించడం లాంటిదే. అనేక వ్యాధులకూ కారణమే! పొగతాగడం కేవలం క్యాన్సర్లను మాత్రమే గాక... అనేక వ్యాధులనూ ప్రేరేపిస్తుంది. గుండెపోటు, రక్తపోటు, పక్షవాతంతో పాటు మధుమేహం వచ్చేలా చేస్తుందీ అలవాటు. మామూలు వారితో పోలిస్తే పొగతాగే అలవాటు ఉన్నవారిలో డయాబెటిస్ వచ్చేందుకు 30 - 40 శాతం వరకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఇక పొగతాగడం మన పూర్తి వ్యాధి నిరోధకశక్తిని దెబ్బతీసి మరిన్ని వ్యాధులకు కారణం కావచ్చు. అనేక క్యాన్సర్లకు కారణం ఈ పొగ... సిగరెట్ తాగే వారికి వచ్చే ప్రధాన వ్యాధి క్యాన్సర్. అది ఎన్ని రూపాల్లో వస్తుందో ఊహించడమూ కష్టమే. సాధారణంగా పొగ దుష్ర్పభావాల వల్ల నోటి క్యాన్సర్లు, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లను అందరూ ఊహిస్తారు. కానీ నిజానికి ఈ కింది క్యాన్సర్లన్నింటికీ పొగతాగే అలవాటే ప్రధాన కారణం. అవి... మూత్రాశయ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ (ప్రధానంగా ఆక్యూట్ మైలాయిడ్ ల్యుకేమియా) పెద్దపేగు క్యాన్సర్ మలద్వార క్యాన్సర్ ఈసోఫ్యాగియల్ క్యాన్సర్ మూత్రపిండాల క్యాన్సర్ యురేటర్ క్యాన్సర్ లారింజ్ క్యాన్సర్ కాలేయ క్యాన్సర్ ఓరోఫ్యారింజియల్ క్యాన్సర్స్ (గొంతు, నాలుక, అంగిలి, టాన్సిల్స్... అన్ని రకాల క్యాన్సర్లను కలగలిపి ఇలా పిలుస్తారు) పొట్టలో ఏ భాగానికైనా క్యాన్సర్ రావచ్చు (స్టమక్ క్యాన్సర్) ట్రాకియా, బ్రాంకస్, లంగ్ క్యాన్సర్స్. పొగతాగే తండ్రుల వల్ల పుట్టబోయే పిల్లల్లో క్యాన్సర్! బ్రాడ్‌ఫోర్ట్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం తల్లిదండ్రుల్లో పొగతాగే అలవాటు ఉంటే పిల్లలకు క్యాన్సర్లు... అందునా ప్రధానంగా ల్యుకేమియా వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. దీనికి కారణాన్ని కూడా పరిశోధకులు చెబుతున్నారు. తమ జన్యువులను పిల్లలకు అందించే వీర్యకణాల్లోని డీఎన్ఏ... పొగ వల్ల దెబ్బతింటుంది. దాంతో లోపభూయిష్టమైన డీఎన్ఏ వల్ల పిల్లల్లో క్యాన్సర్ అవకాశాలు ఎక్కువ. అయితే ఈ రిస్క్‌ను తప్పించుకునేందుకు ఒక ఉపాయం కూడా ఉంది. దంపతులు గర్భధారణకు ప్లాన్ చేసుకున్న సమయం కంటే... కనీసం మూడు నెలల ముందే పొగతాగే అలవాటు మానేస్తే ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న డాక్టర్ డయానా యాండర్సన్. ఒక వీర్యకణం ఉద్భవించాక అది పూర్తిస్థాయిలో పరిణతి చెందేందుకు కనీసం మూడు నెలల సమయం అవసరం. అందుకే కనీసం మూణ్ణెల్ల పాటు పొగతాగే అలవాటుకు దూరంగా ఉంటే డీఎన్ఏ దెబ్బతిన్న వీర్యకణాల స్థానంలో ఆరోగ్యకణాలు వస్తాయి కాబట్టి పిల్లల్లో క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయంటున్నారామె. తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికైనా పొగతాగకుండా ఉండాలని ఈ అధ్యయనం చెబుతోంది. మరింత ప్రమాదం ప్యాసివ్ స్మోకింగ్... కొందరు నేరుగా సిగరెట్ తాగకపోయినా... పొగతాగే వాళ్ల సాన్నిహిత్యంలో ఉంటుంటారు. ఫలితంగా పొగతాగడం వల్ల కలిగే దుష్ర్పభావాలన్నీ వీళ్లపైనా ఉంటాయి. పైగా సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్గా పిలిచే ఈ ప్రక్రియ వల్ల ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ. ఈ ప్యాసివ్ స్మోకింగ్‌కు ప్రధానంగా ఇంట్లోని అమాయకమైన పిల్లలు ఎక్కువగా గురవుతుంటారు. ఫలితంగా సిగరెట్ వల్ల పెద్దలకు వచ్చేందుకు అవకాశాలున్న వ్యాధులన్నీ పిల్లలకు సైతం వాళ్ల ప్రమేయం లేకుండానే రావచ్చు. తల్లిదండ్రుల ధూమపానంతో పిల్లల్లో కలిగే దుష్పరిణామాలు అకస్మాత్తుగా ఆస్తమా కనిపించడం శ్వాసకోశవ్యాధులు చెవి ఇన్ఫెక్షన్లు అకస్మాత్తుగా పిల్లలు మృతిచెందడం (దీన్నే సడన్ ఇన్‌ఫ్యాంట్ డెత్ సిండ్రోమ్ -సిడ్స్ అంటారు). పొగతాగే అలవాటున్న తల్లిదండ్రుల పిల్లలకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 25% నుంచి 30% అదనంగా ఉంటాయి. మహిళలూ... తస్మాత్ జాగ్రత్త! పురుషులతో పోలిస్తే మహిళల్లో పొగతాగే అలవాటు బాగా తక్కువే. అయితే సిటీల్లోని నాగరక సమాజంలో కొందరు స్త్రీలతో పాటు, ఉత్తరాంధ్రకు సంబంధించిన కొన్ని జిల్లాల్లో అడ్డపొగాకు పేర పొగతాగే అలవాటు మహిళల్లోనూ ఉంది. ఇక గర్భవతి అయిన మహిళకు పొగతాగే అలవాటు ఉంటే దాని దుష్పరిణామాలు మరీ మరీ ఎక్కువ. గర్భవతులైన మహిళల్లో పొగతాగడం వల్ల కనిపించే దుష్ర్పభావాల్లో కొన్ని... నెలలు నిండటానికి ముందే ప్రసూతి (ప్రీ-టర్మ్ డెలివరీ) మృతశిశువు జన్మించడం (స్టిల్ బర్త్) పుట్టిన శిశువు బరువు బాగా తక్కువగా ఉండటం పుట్టిన శిశువు అకస్మాత్తుగా చనిపోవడం (దీన్నే సిడ్స్ లేదా క్రిబ్ డెత్ అంటారు) ముత్యాల గర్భం (దీన్నే ఎక్టోపిక్ పెగ్నెన్సీ అంటారు) పుట్టిన పిల్లల్లో గ్రహణం మొర్రి కనిపించడం (క్లెఫ్ట్ ప్యాలెట్). ఇక మహిళలకు పొగతాగే అలవాటు ఉంటే వారి ఎముకల సాంద్రత వేగంగా తగ్గిపోయి పెళుసుబారి, తేలిగ్గా విరిగిపోతాయి. సిగరెట్ మానేస్తే...తక్షణం కలిగే ప్రయోజనాలు మీరు చాలాకాలం మీ కుటుంబంతో, మీ మిత్రులతో సురక్షితంగా, ఆరోగ్యంగా జీవిస్తారు. మీ పిల్లల పుట్టిన రోజులను చాలా చూస్తారు. మీరు జబ్బుపడే రోజులు తగ్గుతాయి. మీరు మందులకూ, చికిత్సలకూ పెట్టే ఖర్చూ చాలా వరకు తగ్గుతుంది. మీరు మరింత శక్తిమంతంగా ఉంటారు. మీరు తేలిగ్గా శ్వాసిస్తారు. అన్ని రకాల రుచులూ, వాసనలూ గ్రహిస్తారు. మీ రిటైర్మెంట్ తర్వాతి జీవితం చాలా హాయిగా ఉంటుంది. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి వెంట్రుకలనూ రాల్చేసే పొగ పొగతాగడం వల్ల వయసు పైబడటం అన్నది చాలా సాధారణ ప్రక్రియ అనీ, దాంతో చర్మం ప్రభావితమవుతుందన్నది తెలిసిందే. ఇదే ప్రభావం తలపైన ఉండే చర్మానికీ వర్తిస్తుంది. దాంతో ఆ భాగంలోని చర్మానికి వయసు త్వరగా మీద పడటంతో తలవెంట్రుకలు రాలిపోవడం చాలా సాధారణం. దీంతో పాటు తల వెంట్రుకలను పట్టి ఉంచే హెయిర్ ఫాలికిల్ తాలూకు డీఎన్ఏ బలహీనమవుతుంది. దాంతోపాటు హెయిర్ ఫాలికిల్ నుంచి వెంట్రుకకు రక్తసరఫరా దెబ్బతినడం కూడా వెంట్రుకను పూర్తిగా పెరగనివ్వకుండా చేసి, మధ్యలోనే తెగిపోయేలా చేస్తుంది. అందుకే పొగతాగేవారి వెంట్రుకలు పెళుసుగా మారి తమ పెరుగుదల చక్రం (సైకిల్) పూర్తి చేయకుండానే చిట్లిపోతాయి. దాంతో పొగతాగేవారి వెంట్రుకలు పలచబారిపోతాయి. కొందరిలో బట్టతల వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పొగచూరిపోయే కళ్లు పొగతాగేవారి కంట్లో ఉండే పారదర్శకమైన లెన్స్ త్వరగా తన పారదర్శకతను కోల్పోతుంది. దాంతో వారికి ‘క్యాటరాక్ట్’ చాలా త్వరగా వచ్చేస్తుంది. మామూలుగానూ క్యాటరాక్ట్ వచ్చే అవకాశాలున్నా... పొగతాగడం వల్ల అవి రెట్టింపవుతాయి. ఈ అలవాటు కారణంగా ‘మాక్యులార్ డీజనరేషన్’ అనే వ్యాధి వచ్చి రెటీనాపై బ్లైండ్స్పాట్స్ ఏర్పడతాయి. మామూలుగానూ వయసు పెరగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. కానీ పొగతాగే అలవాటు వల్ల వయసు త్వరగా పైబడటం అనే పరిణామం జరిగి అది ఈ ‘మాక్యులార్ డీజనరేషన్’కు దారితీస్తుంది. పొగతాగే అలవాటు ఉండి డయాబెటిస్తో బాధపడుతున్నవారిలో డయాబెటిక్ రెటినోపతికి కారణమై అది అంధత్వానికి దారితీసే అవకాశాలు మరింత ఎక్కువ. చెవులు... పొగలు పొగతాగే అలవాటు లేనివారితో పోలిస్తే పొగ తాగే వారిలో వినికిడి సమస్యలు వచ్చే అవకాశాలు 75 శాతం ఎక్కువ. సిగరెట్లో ఉండే ఫార్మాల్డిహైడ్, ఆర్సెనిక్, వినైల్ క్లోరైడ్, అమోనియాలతో పాటు నికోటిన్నూ కలుపుకుని ‘ఒటో టాక్సిక్’ పదార్థాలుగా పేర్కొంటారు. అంటే అవి వినికిడి శక్తిని లోపింపజేస్తాయన్నమాట. దీంతోపాటు పొగతాగే అలవాటు వల్ల శరీరాన్ని సమతౌల్యంతో (బ్యాలెన్స్డ్) గా ఉంచే మధ్యచెవిలోని యంత్రాంగం దెబ్బతిని, ఒళ్లు నిలకడగా ఉండే శక్తి కొరవడవచ్చు. అంతేకాదు. చెవిలో గుయ్ అంటూ శబ్దం వచ్చే టినైటిస్ అనే జబ్బు కూడా రావచ్చు. పొగలొదిలే ముక్కు... వాసన శక్తి తగ్గు సిగరెట్ పొగలను ధారాళంగా వదులుతుండే వారు నోట్లోంచే గాక... ముక్కుల్లోంచి వాటిని వదిలేస్తుంటారు. దాంతో ముక్కులో ఉండే అతి సునిశితమైన వాసనను గ్రహించే యంత్రాంగం దెబ్బతింటుంది. అంతేకాదు... ముక్కులోపలి పొరలను రక్షిస్తూ ఉండే పొరలు తీవ్రంగా నష్టపోవడంతో పాటు ముక్కులోంచి తలలో ఉండే గాలి గదులైన సైనస్‌లు కూడా దెబ్బతింటాయి. ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియాను నిరోధించే శక్తి కూడా ముక్కు కోల్పోతుంది. క్రానిక్ సైనుసైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. నోరు... నష్టపోయే తీరే వేరు పొగతాగడం అనే ప్రక్రియ నేరుగా నోటి ద్వారానే జరుగుతుంది కాబట్టి అన్ని అవయవాల కంటే నష్టం జరిగే అవకాశాలు నోటికే ఎక్కువ. పైగా నోటిలో సున్నితమైన మ్యూకస్ పొరలు ఉంటాయి. వీటిలో నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలూ ఎక్కువే. పైగా వేర్వేరు జిల్లాల్లో ఉంటే రకరకాల పొగాకు వినియోగ అలవాట్ల (అంటే అడ్డపొగ తాగడం, బీడీలు కాల్చడం, గుట్కా తినడం వంటివాటి) వల్ల మన రాష్ట్రంలో నోటి క్యాన్సర్ కేసులు చాలా ఎక్కువ. నోటికి జరిగే నష్టాలు చాలా ఉన్నా వాటిలో ప్రధానమైనవి... నోటిలో ‘ల్యూకోప్లాకియా’ అనే పుండ్ల వంటివి ఏర్పడి, అవి క్యాన్సర్‌గా రూపొందవచ్చు. నోటి దుర్వాసన (హ్యాలిటోసిస్)కు అవకాశాలు చాలా ఎక్కువ. నోటిలో ఉండే పంటి చిగుళ్ళు, పలువరస ప్రభావితమై పళ్లు, చిగుళ్ళ వ్యాధులు (పెరియో డాంటల్ డిసీజెస్) రావచ్చు. చిగుళ్ళపై మచ్చలు రావడం (స్మోకర్స్ మెలనోసిస్), పళ్లు పసుపుపచ్చగా మారడం వంటి ప్రమాదాలు చాలా ఎక్కువ. నాలుకపై ఉండే అతి చిన్న చిన్న బుడిపెలపై బ్యాక్టీరియా, ఈస్ట్, నోటిలోని వ్యర్థాలు చిక్కుకుపోవడంతో నాలుక నల్లగా మారే ‘బ్లాక్ హెయిరీ టంగ్’ అనే కండిషన్‌కు దారితీయవచ్చు. నోటిలో ఉండే పైభాగమైన అంగిలి తన మృదుత్వాన్ని కోల్పోయి, పాలిపోయినట్లుగా తెల్లగా మారిపోయే ‘స్మోకర్స్ ప్యాలెట్’ అనే కండిషన్‌కు అవకాశాలు చాలా ఉంటాయి. నోటిలో ఉండే లాలాజల గ్రంథుల పనితీరు, ప్రభావం దెబ్బతిని కేవలం నోరు మాత్రమే గాక... అది మొత్తం జీర్ణవ్యవస్థపైనా దుష్ర్పభావం చూపవచ్చు. గొంతులో వాయురూప గరళం... పొగ నోటి ద్వారా పీల్చే సిగరెట్ పొగ మొదట ప్రవేశించేది గొంతులోకే కావడంతో నోటికి ఎంతగా నష్టం చేకూరుతుందో, గొంతుకూ అంతగానే నష్టం జరుగుతుంది. పొగపీల్చగానే అందులోని ఫార్మాల్డిహైడ్, ఆక్రోలీన్ అనే రసాయనాలు గొంతును మండిస్తాయి. స్వరం కూడా మారిపోయి దీర్ఘకాలంలో బొంగురుగానూ, చాలా లోగొంతుకతోనూ మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. గొంతులోని లారింజ్స్ దెబ్బతిని లారింజైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధికి దారితీయవచ్చు. ఇక గొంతులో గడ్డలకూ, గొంతు క్యాన్సర్‌కు అవకాశాలు చాలా చాలా ఎక్కువ. మెదడుపై పొగ ప్రభావం సిగరెట్ పొగ మెదడుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. పొగతాగిన కొద్దిసేపటికే కొద్దిపాటి మత్తు కలగడంతో ఆ అలవాటు ఉన్నవారు దాని ప్రభావాన్ని గ్రహించగలరు. ఈ కిక్ తాపత్రయంతో పొగకు అలవాటు పడ్డవారిలో మెదడుపై అది చూపే అనేక రకాల దుష్ర్పభావాలను తెలుసుకుంటే పొగ తాగాలంటేనే భయం వేస్తుంది. అంత దారుణంగా ఉంటాయా ప్రభావాలు. ఉదాహరణకు పొగతాగేవారిలో రక్తనాళాలు సన్నబారే ప్రమాదం ఉన్నందున, అది మెదడు రక్తనాళాల్లో జరిగితే పక్షవాతం వచ్చి కదలలేక, కాళ్లూ చేతులు ఆడక - జీవితాంతం మరొకరిపై ఆధారపడుతూ జీవించాల్సి రావచ్చు. 65 ఏళ్లు దాటాక చాలామందిలో వచ్చే పక్షవాతానికి పొగతాగే అలవాటే ప్రధాన కారణం. ఇక ఒకసారి సిగరెట్‌లోని నికోటిన్‌కు మెదడు బానిస అయితే ఎలాగోలా సిగరెట్ తాగేందుకు వెంపర్లాడేలా అనేక మాయలు చేస్తుంది మెదడు. దీన్నే ‘క్రేవింగ్ ఎఫెక్ట్’ అంటారు. అందుకే సిగరెట్‌కు బానిస కాకుండా దాన్ని వదిలేయడం మేలు. శరీరంలోని ఏ భాగాన్ని నియంత్రించే రక్తనాళాలు మెదడులో సన్నబడ్డాయో, ఆ అవయవం పనితీరు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. గుండె, రక్తప్రసరణ వ్యవస్థపైనా... ప్రభావం గుండెపోటునూ, రక్తప్రసరణ వ్యవస్థను పొగతాగే అలవాటు అత్యంత తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ అలవాటు అనేక రకాల గుండెజబ్బులకు (కార్డియో వాస్క్యులర్ డిసీజెస్‌కు) కారణమవుతుంది. పొగవల్ల గుండెపై పడే దుష్ర్పభావాలలో కొన్ని... గుండెపోటు (హార్ట్స్ట్రోక్), గుండెకు సంబంధించిన రక్తనాళాల వ్యాధులు రావచ్చు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు సన్నబడితే గుండె శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంతేకాదు... ఇలా ఈ రక్తనాళాలు సన్నబారడం వల్ల రక్తం మరింత వేగంగా ప్రవహిస్తుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. ఇక రక్తపోటు అన్నది నిశ్శబ్దంగా, పైకి ఏమాత్రం కనిపించకుండా శరీరంలోని అనేక కీలక అవయవాలను దెబ్బతీసి, మరణానికి కారణమవుతుందన్న విషయం తెలిసిందే. అందువల్లనే దాన్ని సెలైంట్ కిల్లర్‌గా అభివర్ణిస్తారు. అంతే పొగ తాగే అలవాటు రక్తపోటుకూ కారణమవుతుందన్నమాట. పొగ తాగే అలవాటు వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉన్నాయి. వీటినే బ్లడ్క్లాట్స్గా అభివర్ణిస్తారు. ఈ రక్తపు క్లాట్స్ శరీరంలోని ఏయే భాగాల్లోని రక్తనాళాల్లో కనిపిస్తే, ఆయా భాగాలు శాశ్వతంగా చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఈ క్లాట్స్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఏర్పడితే గుండె కండరానికి తగిన ఆక్సిజన్ అందకపోవచ్చు. ఫలితంగా గుండె కండరం శాశ్వతంగా చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది. ఈ రక్తపు గడ్డలు కాళ్లకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో ఏర్పడితే కాళ్లూ చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తులను దెబ్బతీసి... ఊపిరి తీసేయవచ్చు నోరు, గొంతు తర్వాత పొగ నేరుగా ప్రవేశించేది ఊపిరితిత్తుల్లోనికే. దాంతో పొగ ఊపిరితిత్తుల్లోని ట్రాకియా, ల్యారింజ్స్తో పాటు గాలిని లోపలికీ, బయటకూ తీసుకెళ్లే ఎయిర్వేస్, ఊపిరితిత్తుల్లో ఉండే గాలిగదులు (ఎయిర్ స్యాక్స్)... వీటన్నింటినీ దెబ్బతీస్తుంది. పొగ ఫలితంగా ఊపిరితిత్తులు దెబ్బతిని ఈ అలవాటు ఉన్నవారిలో సీఓపీడీ, బ్రాంకైటిస్ అనే వ్యాధులకు దారితీయవచ్చు. అప్పటికీ ఈ అలవాటు మానకపోతే క్రమంగా ఊపిరితిత్తుల సామర్థ్యం దెబ్బతిని ఒక్క అడుగు వేసినా ఆయాసపడే దశకు చేరుకుంటారు. అంతేకాదు సిగరెట్ అలవాటు వల్ల ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడం చాలా ఎక్కువ. ఇక ఆస్తమా ఉన్నవారికి ఉండే ధూమపానం అలవాటు వాళ్ల పరిస్థితిని మరింత తీవ్రతరం చేసి, జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది. మూత్రపిండాలకు దెబ్బే! పొగతాగడం వల్ల రక్తనాళాలు సన్నబారిపోతాయన్న విషయం తెలిసిందే. పైగా అలా సన్నబారిపోవడంతో అక్కడ రక్తపోటు విపరీతంగా పెరుగుతుందన్న విషయం కూడా తెలిసిందే. మూత్రపిండాల్లో రక్తాన్ని శుద్ధి చేసే రక్తనాళాలు అతి సన్నగా ఉంటాయి. ఫలితంగా మూత్రపిండాల్లోని అతి సన్నటి రక్తనాళాలు చిట్లిపోయి, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. పురుషుల్లో లోపించే సెక్స్ సామర్థ్యం సిగరెట్ తాగే అలవాటుతో రక్తనాళాలు సన్నబడడమనే పరిణామం ఒకవేళ పురుషాంగంలో జరిగితే అక్కడికి తగినంత రక్తం చేరే అవకాశాలు లేక అంగస్తంభన సమస్యలు వస్తాయి. అంతేకాదు... పొగతాగే అలవాటు వల్ల వీర్యకణాల కదలికలు, వీర్యం నాణ్యత తగ్గిపోతాయి. దాంతో పిల్లలుపుట్టే అవకాశాలూ గణనీయంగా తగ్గుతాయి. ప్రోస్టేట్ గ్రంథిపై ప్రతికూల ప్రభావం పొగతాగడం ప్రోస్టేట్ క్యాన్సర్‌కు పెద్ద రిస్క్ ఫాక్టర్. ఓ వ్యక్తి తాగిన సిగరెట్లు ఎన్ని అనే కొలతకు ఒక ప్రవూణం ఉంది. ఆ కొలత పేరే ‘ప్యాక్ ఇయుర్’. ఒక వ్యక్తి రోజుకో ప్యాకెట్ చొప్పున ఏడాది పాటు తాగిన సిగరెట్లను ఒక ‘ప్యాక్ ఇయుర్’ అంటారు. అంటే... ఉదాహరణకు ఓ వ్యక్తి రోజుకు రెండు పెట్టెలు తాగుతాడనుకుందాం. అప్పుడు ఆర్నెల్ల వ్యవధిలో తాగే సిగరెట్లే ఓ ‘ప్యాక్ ఇయుర్’ అవుతాయున్నవూట. ఇలా ఓ వ్యక్తి తాలూకు ప్యాక్ ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ ప్రోస్టేట్పై దాని ప్రభావం తాలూకు దుష్పరిణామాలు అంతకంతకూ రెట్టింపవుతూ, అదే నిష్పత్తిలో పెరుగుతూ పోతాయన్న మాట! స్మోకింగ్‌ను పూర్తిగా మానేయడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్‌ను గణనీయం తగ్గించుకోవచ్చు. ‘పొగ’చూరి... పెళుసుబారిపోయే ఎముకలు ఎముకలు పటిష్ఠంగా ఉండాలంటే అందులో క్యాల్షియం ఎక్కువగా చేరుతుండాలి. ఈ పని రక్తప్రసరణ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. కానీ పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఎముకలకు అందాల్సిన పోషకాలు తగ్గుతూ పోతాయి. దాంతో ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఫలితంగా అవి పెళుసుబారిపోయి తేలిగ్గా విరిగిపోతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ప్రధాన కారణం పొగతాగే అలవాటే. చర్మానికి పొగబెట్టే సిగరెట్ పొగతాగడం వల్ల చర్మం ముడుతలు తీవ్రతరమవుతాయి. పొగలోని హానికర రసాయనాలూ, శరీరంలో జరిగే జీవక్రియల నుంచి వెలువడే హానికర పదార్థాలను బయటికి తొలగించే యంత్రాంగం బలహీనంగా మారడంతో చర్మం తన వయసు కంటే ముందుగానే వృద్ధాప్యానికి లోనవుతుంది. దాంతో పొగతాగేవారు తమ వాస్తవ వయసు కంటే పెద్దవారిగా కనబడటం చాలా సాధారణం. పాదాలకూ రిస్కే! పొగతాగే అలవాటు ఉన్నవారిలో రక్తనాళాలు సన్నబడతాయి కాబట్టి పాదాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు సన్నబడితే ఒక్కోసారి పాదం కుళ్లిపోవడానికి (గ్యాంగ్రీన్‌కు) దారితీస్తుంది. డయాబెటిస్ సమస్య ఉన్నవారికి పొగతాగే అలవాటు ఉంటే ఈ ముప్పు మరీ ఎక్కువ. దీన్ని పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ అని అంటారు. ఒకవేళ సమస్య కేవలం పొగతాగేవారిలో కేవలం ఆ అలవాటు కారణంగానే రావచ్చు. అలాంటి సమస్యను బర్జర్స్ డిసీజ్ అంటారు. పాదాలను రక్షించుకుని చివరివరకూ మీ పాదాలపై మీరు నిలబడాలంటే తక్షణం పొగతాగే అలవాటును వదులుకోవాల్సిందే. మీకు సిగరెట్ అలవాటు ఉంటే పైన చెప్పిన కారణాలన్నింటి వల్ల దాన్ని తక్షణం మానేయండి. ఒకవేళ ఆ అలవాటే ఇప్పటి దాకా లేకపోతే ఎప్పుడూ దాన్ని ముట్టుకోకండి. -
సిగ‘రేట్’ ఇష్టానుసారం
సిగ‘రేట్’ ఇష్టానుసారం పత్తికొండ అర్బన్, : మండలంలోని హోల్‌సేల్, రిటైల్ సిగరెట్ వ్యాపారులు ధూమపాన ప్రియులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. సిగరెట్లకు కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇష్టానుసారంగా ధరలను పెంచి విక్రయాలు చేపడుతున్నారు. వాటికి రసీదులు కూడా ఇవ్వకుండా జీరో బిజినెస్ చేస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే బడ్జెట్ వచ్చే వరకు ధరల నియంత్రణ సాధ్యం కాదని పేర్కొంటున్నారు. మండల పరిధిలోని దాదాపు 600 దుకాణాలకు పట్టణంలోని పది హోల్‌సేల్ షాపుల నుంచి సిగరెట్లు, బీడీలు తదితర వస్తువులు సరఫరా అవుతున్నాయి. ఆయా దుకాణాల్లో రోజూ వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు వ్యాపారాలు సాగుతాయి. గోల్డ్ఫ్లాక్ ప్యాక్ ఎంఆర్పీ రూ.59 ఉండగా హోల్‌సేల్‌లో రూ.55కే ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఆ ప్యాక్‌ను రూ.60కి విక్రయిస్తున్నారు. పెద్దగోల్డ్ ఫ్లాక్ ప్యాక్ ఎంఆర్పీ రూ.75 ఉండగా హోల్‌సేల్‌లో రూ.70కి అమ్మాలి. కానీ రూ.78 నుంచి 80కి అమ్ముతున్నారు. బ్రిస్టల్, సిజర్, విల్స్ఫ్లాక్ ప్యాక్‌లు రూ.40కి విక్రయించాల్సి ఉండగా అధనంగా రూ.5 వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు చిల్లర వ్యాపారులు స్మాల్ గోల్డ్ఫ్లాక్ సిగరెట్ రూ.6, పెద్దగోల్డ్ రూ.8 వరకు విక్రయిస్తూ వచ్చారు. అయితే కత్రిమ కొరత సృష్టించిన వ్యాపారులు కుమ్మక్కై స్మాల్ గోల్డ్‌ప్లాక్ రూ.7, పెద్దగోల్డ్ఫ్లాక్ సిగరెట్ రూ.9కి విక్రయిస్తున్నారు. ఈ ధరల గురించి బయట చెబితే సరుకు ఇవ్వబోమని హోల్‌సేల్ వ్యాపారులు చిరువ్యాపారులను బెదిరిస్తున్నారు. పొగతాగితే ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా పట్టించుకోని దూమపాణ ప్రియులు ఈ ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. -
ఇవీ వాసన చూస్తాయ్!
న్యూయార్క్: ఘుమఘుమలాడే కాఫీ సువాసనలు జలుబు కారణంగా ముక్కును చేరలేకున్నాయా..? ఏం ఫర్లేదు. ఊరిపితిత్తుల సాయం తీసుకోండి. ఆశ్చర్యపోతున్నారా..! ఊపిరితిత్త్తుల్లోని ఒక రకం కణాలకు ముక్కువలే కాఫీ, సిగరెట్ వాసనలను పసిగట్టే శక్తి ఉందని తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే, ముక్కులోని వాసన గ్రాహకాలకు.. ఊపిరితిత్తుల్లోని గ్రాహకాలకు మధ్య తేడా ఉందట. ముక్కులో వాసన గ్రాహకాలు నాడీకణాల పొరల్లో ఉంటే.. ఊపిరితిత్తుల్లో మాత్రం శ్వాస మార్గంలో ఉంటాయి. వీటినే పల్మనరీ న్యూరోఎండోక్రైన్ కణాలంటారు. ఇవి మెదడుకు నాడీ సంకేతాలను పంపడానికి బదులుగా ఆ వాసనను గ్రహించేందుకు వీలు కల్పిస్తాయి. దీంతో సమీపంలో ఎవరైనా సిగరెట్ ఊది పారేస్తుంటే.. వెంటనే పల్మనరీ ఎండోక్రైన్ కణాలు హార్మోన్లను విడుదల చేస్తాయి. దాంతో శ్వాసమార్గం మూసుకున్నట్లు అవుతుందని వాషింగ్టన్ యూనివర్సిలోని జీవశాస్త్రం ప్రొఫెసర్ యెహుదా బెన్ షహర్ తెలిపారు. -
ఆలుమగల మధ్య సిగరెట్ చిచ్చు!
ఆయువును హరించే సిగరెట్ ఆలుమగల మధ్య కలతలు రేపుతోంది. మనిషిని మృతువుకు చేరువ చేసే సిగరెట్ పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది. సౌదీ అరేబియాలో ఓ జంటను సిగరెట్ విడదీసింది. తన భార్య బ్యాగులో సిగరెట్ ఉందన్న ఒకే ఒక్క కారణంతో ఓ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. దక్షిణ సౌదీ నగరం జిజాన్కు చెందిన ఓ వ్యక్తి పెళ్లైన మూడు నెలలకే భార్య నుంచి విడాకులు కోరారు. తన భార్య బ్యాగులో సిగరెట్ కనుగొన్న వెంటనే అతడు విడాకులకు వెళ్లాడు. ఆ సిగరెట్‌కు తనకు సంబంధం లేదని, తానకు సిగరెట్ కాల్చే అలవాటు లేదని నచ్చజెప్పినా సదరు భర్త వినిపించుకోలేదు. ఇరువర్గాల బంధువులు అతడికి నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు భార్యతో తెగతెంపులు చేసుకున్నాడు. సౌదీ అరేబియాలో దాదాపు 6 లక్షల మంది సిగరెట్లు తాగుతున్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పొగతాగున్న వారిలో ఇది పదోవంతు. మొత్తం 60 లక్షల మంది పొగతాగుతున్నట్టు అంచనా.