న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో తల్లడిల్లిపోతోంది. అక్కడి ప్రజలు సవ్యంగా ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీని చుట్టుముట్టిన కలుషిత గాలి జనాన్ని అనారోగ్యం బారిన పడేలా చేస్తోంది.
నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత తీవ్ర స్థాయిలో ఉంది. ఇక్కడి ప్రజలు నాలుగు సిగరెట్లకు సమానమైన పొగను పీలుస్తున్నారని, ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నదని గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్) వైద్యులు చెబుతున్నారు. జిమ్స్ ఆస్పత్రికి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ వస్తున్న రోగుల సంఖ్య పెరిగిందన్నారు.
చెడు గాలి మరింతగా శరీరంలోనికి చొరబడకుండా ఉండేందుకు మాస్క్‌ని ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో ఊపిరితిత్తులకు హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు కలుషిత గాలికి తీవ్రంగా ప్రభావితమవుతున్నారన్నారు. చెడు గాలి కారణంగా గొంతు, శ్వాసకోశ సమస్యలు వచ్చిన వారు కొన్ని సూచనలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఉదయం దట్టంగా పొగమంచు ఉన్నప్పుడు వాకింగ్‌కు వెళ్లకపోవడమే ఉత్తమమని, ఉదయాన్నే గోరు వెచ్చటి నీరు తాగాలని సూచించారు. దుమ్ము, ధూళితో కూడిన ప్రదేశాలకు వెళ్లడాన్ని నివారించాలని, అలాగే నిర్మాణ పనులు చేపట్టకపోవడం మంచిదని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మరింత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Medical College Fire: చిన్నారుల మృతి హృదయవిదారకం: ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment