న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో కాలుష్య స్థాయి ఒకరోజు పెరుగుతూ, మరోరోజు తగ్గుతూ వస్తోంది. ఈరోజు (గురువారం) ఉదయం మరోసారి ఢిల్లీలో కాలుష్య స్థాయి 300కి చేరుకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా తక్కువ కేటగిరీలో ఉంది. ఇండియా గేట్ వద్ద భారీగా పొగమంచు కమ్ముకుంది. కాళింది కుంజ్‌లోని యమునా నదిలో విషపు నురుగు తేలియాడుతోంది.
వాయు కాలుష్యం కారణంగా కంటి నొప్పులు, గొంతు సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు బాధితులు చెబుతున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కురుస్తున్న పొగమంచు.. ప్రజలపై సూర్యుని వేడి పడకుండా చేస్తోంది. ఫలితంగా శరీరంలోని ఎముకలు బలహీనంగా మారుతున్నాయి. ఎయిమ్స్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సూర్యకాంతి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు శరీరంలో 90 శాతం విటమిన్ డి3 ఉత్పత్తికి మూలకారణంగా నిలుస్తున్నాయి. భారీగా కురుస్తున్న పొగమంచు శీతాకాలంలో సూర్యరశ్మి నేరుగా భూమిని చేరుకోకుండా అడ్డుకుంటోంది.
ఎయిమ్స్ నిపుణులు ఢిల్లీ, గురుగ్రామ్‌లలో పలువురిపై నిర్వహించిన అధ్యయనంలో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఢిల్లీలో పొగమంచు కారణంగా ప్రజలపై సూర్యరశ్మి తక్కువగా పడిందని, దీంతో చాలామంది విటమిన్ డి లోపానికి గురైనట్లు అధ్యయనంలో తేలింది. ఢిల్లీలో అంతకంతకూ కాలుష్య స్థాయి పెరుగుతోంది. పొగమంచు సమస్య తీవ్రతరమయ్యింది. ఈరోజు రాజధానిలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశాలున్నాయని చెబుతూ వాతావారణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇది కూడా చదవండి; నేటి పార్లమెంట్‌లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు
Comments
Please login to add a commentAdd a comment